'Galam' New Telugu Story
Written By Namani Sujana Devi
'గాలం' తెలుగు కథ
రచన: నామని సుజనాదేవి
కత్తి తగిలి బొటబొటా వచ్చింది రక్తం.
“అయ్యో హనీ! ఎంత రక్తం? లేత తమలపాకుల్లా ఉన్న నీ ఈ చేతులతో ఎందుకు ఇంత కష్ట పడుతున్నావ్? ఒక్క ఆర్డర్ వేస్తె ఈ నీ దాసుడు అన్ని సేవలూ చేసుకోడూ? ఆ వేలు ఇలా ఇవ్వు” రక్తాన్ని నీళ్ళల్లో కడిగి ఆ వేలు అతని నోట్లో పెట్టుకున్నాడు.
“అయ్యో! అయ్యయ్యో ! ఏం చేస్తున్నారు మీరు?”
“దేవి గారి దెబ్బ తిన్న వేలుకి మంత్రం వేస్తున్నా!”
“అబ్బా! మీరు, మీ మోటు సరసం” అతని నోట్లో ఉన్న తన వేలు వెచ్చటి ఆవిర్లు తెప్పిస్తుంటే, సిగ్గుల మొగ్గవుతూ అంది.
అంతే!
“లావణ్యా! నిన్నే.. ఏ లోకంలో ఉన్నావు?” గట్టిగా అరిచిన భర్త అరుపుకు ఊహాలోకం నుండి బయటకు వచ్చింది లావణ్య.
“కనీసం చేయి కోసుకోకుండా కూరగాయలు తరగడం కూడా రాదు. రక్తం రాకుండా నీళ్ళయినా తాగు. ఒక్క కూరతో ఇంతే ప్రాప్తం అనుకుని, టిఫిన్ బాక్స్ ఎలాగో నేను సర్డుకుంటాలే!” గట్టిగా అరుస్తూ బాక్స్ సర్ధుకుని వెళ్ళాడు.
ఎంత అందమైన కల. భర్త నిజంగా పెళ్ళికి ముందు ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత అంత ప్రేమగానే ఉండేవాడు. కాని ఇప్పుడే ఇలా తయారయ్యాడు. ఒక్కసారి ప్రేమగా మాట్లాడింది లేదు.
“హలో! ఎవరండీ ఇంట్లో?” ఇంటి ముందు వినవచ్చిన పిలుపుకు, దోపిన చింగులు అలా ఉండగానే చేతిలోని గరిటె తో వంట గది నుండి అలాగే ముందు గదిలోకొచ్చింది లావణ్య.
ఎదురుగా తెల్లగా పొడవుగా నేవీ బ్లూ షర్ట్ ను గోధుమ రంగు పాయింట్ లోకి టక్ చేసి, సన్నని మీసం కట్టుతో మగసిరి ఉట్టి పడేలా సినీ హీరోలను తలదన్నే అందంతో గుమ్మం ముందు నిలబడి ఉన్నాడతను. ఎడమ చేతితో చింగులను కిందికి అంటూ “ఎవరు కావాలండీ?” అంది గౌరవంగా ముందు కొచ్చిన ముంగురులను ఎడమ చేత్తో వెనక్కి నెట్టేస్తూ.
“నమస్తే నండీ! నేను అద్దెకు ఎదురింట్లోకి ఇప్పుడే వచ్చాను. ఇక్కడెవరూ తెలీదు. కొన్ని మంచి నీళ్ళు ఉంటె ఇస్తారా.. తర్వాత నా ఏర్పాట్లేవో నేను చేసుకుంటాను.. ” అన్నాడు చేతిలోని బాటిల్ చూపుతూ.
“నమస్తే! అయ్యో దానికేం భాగ్యం? ఆ బాటిల్ ఏం సరిపోతుంది గాని, ఇదిగోండి ఈ చిన్న బిందె నిండా తీసుకోండి” అంటూ ఇంట్లోని చిన్న బిందెను అందించింది. బిందె తీసుకునేప్పుడు అతని వేళ్ళు ఆమె వేళ్ళను సుతారంగా తాకాయి. ఆమె గుండె జల్లుమంది. చటుక్కున వెనక్కు తీసుకుంది.
“థాంక్స్ అండీ.. ఏమైనా అవసరమైతే మళ్ళీ వస్తాను.. ఏమీ అనుకోరుగా.. అన్నట్లు ఇంట్లో.. ?”
“మా వారు, నేను, మా బాబు ఉంటాం. ఆయన ఉదయం వెళితే రాత్రికే వచ్చేది. బాబు స్కూల్ కెళతాడు. ఇంటి పక్క ఇల్లు ఆ మాత్రం సాయం చేసుకోమూ.. ఏ అవసరమున్నా నిర్మొహమాటంగా అడగండి.. ”
“ఆ.. మిమ్మల్ని చూస్తే కాలేజీ అమ్మాయిలా ఉన్నారు. మీకు బాబు అంటే ఎవరూ నమ్మరు.. ”
మొహమాటంగా సిగ్గుగా నవ్వింది లావణ్య. అతనెల్లి పోయాడు. అతనెళ్ళిపోయినా అతనన్న మాట మాత్రం, ఆమె గుండెల్లో అలజడి రేపుతూనే ఉంది. ఇది కేవలం అతనొక్కడన్నది మాత్రమే కాదు. బంధువర్గంలో, స్నేహితుల్లో అలా చాలా మందే అన్నారు. నిజంగా కూడా తన అందం అలాంటిదే! కానీ అదేంటో భర్త మాత్రం ఒక్కసారి తన అందం గురించి కామెంట్ చేయడు. పైగా తన అందం ముందు చాలా మామూలుగా చామన ఛాయతో ఉండే అతను దిగదుడుపే. తన పెళ్ళప్పుడు కొంతమంది, ’కాకి ముక్కుకు దొండపండు’ అని చెవులు కూడా కొరుక్కున్నారు. దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. సెల్ మోగడంతో ఈ లోకంలో కొచ్చింది. తన ప్రాణ స్నేహితురాలు! శ్రావణి!
“హాయ్ నే శ్రావణి! ఎలా ఉన్నావే?” అంది హుషారుగా.
“బాగానే ఉన్నానే! మా ఆయన కంపనీ యజమాని వాళ్ళు, కంపనీ మూసేయడంతో, ఏదో చిన్న కంపనీలో హైదరాబాద్ లో పని చూసుకున్నారు. అందుకే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం. నేను కూడా అక్కడ ఏదైనా కంపనీలో ఏదో జాబ్ చూసుకోవచ్చు. ఏమిటో, మన లాంటి పేద కుటుంబాల బాధలు ఎప్పటికి తీరతాయో ఏమో? ఈసారి పండక్కి అమ్మా వాళ్ళింటికి వస్తావా? పండక్కి మాధవి కూడా వస్తానంది. అక్కడ అందరం కలుద్దాం. నిన్ను చూడక, మనం కల్సుకోక కూడా చాలా రోజులయ్యింది కదా! ఎన్నో మాట్లాడుకోవాలి. ఎప్పటిలా నా సోదే చెబుతున్నాగాని, మీ ఆయనేమంటున్నాడు? గదే అటెండర్ గా ఉన్నాడా? ఏమైనా ఎదుగుదల ఉందా?”
“హా! మన జీవితాల్లో ఏం ఎదుగుదల ఉంటుంది గాని, అలాగే ఉన్నాడు. నే ఇంకా ఏదైనా కోర్స్ చేయాలా? లేక డిగ్రీకి కట్టాలా అని ఆలోచిస్తున్నా! నువ్వు మంచిగా డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి చేసుకున్నావ్! మా వాళ్ళు నన్ను మాన్పించి పెళ్లి చేస్తిరి. గొర్రె తోక బెత్తెడు అన్నట్లు చూసుకుంటూ చూసుకుంటూ ఖర్చు పెట్టాలి. కనీసం మన పర్సనల్ అయినా, ఆయన ముందు చేయి చాపాల్సిందే! నిజానికి ఆయన చాలా మంచోడు. ఏదీ కాదనడు. కాని వచ్చిన జీతం లో అద్దె, బాబు స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, చిట్టీ డబ్బులు అన్నీ చూస్తూ చూస్తూ ఏమడగను? ఆయన కంటూ ఏమీ మిగలదు. అమ్మా వాళ్ళు కూడా ఏమీ ఉన్నవాళ్ళు కాదాయె!” గలగలా మాట్లాడుతుంది శ్రావణి.
“జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లు, మనిద్దరం మాట్లాడుకుంటే ఇంతకన్నా ఇంకేంవస్తాయి? సరేనే ఉంటాను. బాలెన్స్ అయిపోతుంది. ఆయనొచ్చే వేళయింది. ఇంకా వంట చేయలేదు. బై బై” అంటూ పెట్టేసింది. అయితే ఆమెకు అప్పుడు తెలియదు. శ్రావణితో మాట్లాడిన ఈ మాటలు తను పదే పదే గుర్తు చేసుకునే రోజు త్వరలోనే వస్తుందని.
***
తెల్లవారి మళ్ళీ బిందె ఇవ్వడానికి వచ్చాడు ఎదురింటతను.
“థాంక్స్ అండీ.. మీరు దాని నిండా నీళ్ళు ఇచ్చినా, నేను నిండు గా ఇవ్వలేకపోతున్నా అంటూ, బిందెలో కొన్ని దానిమ్మ కాయలు వేసి పట్టుకొచ్చాడు.
“అయ్యయ్యో! అవెందుకండీ?” అని లావణ్య అంటుంటే,
“మరేమీ అనుకోకుండా తీసుకోండి. ఏదైనా అలా ఊరికే ఇవ్వకూడదట. అయినా బ్రహ్మచారిని. ఇంతకు మించి మరేం ఇవ్వగలను చెప్పండి? చూడండి మాలాంటి వాళ్ళు వస్తే, ఇలా గుమ్మం బయటే నిలబెడతారు గాని, లోనికి కూడా రమ్మనరు మీలాంటివారు” అన్నాడు.
“అయ్యయ్యో! అదేమీ లేదండీ.. నాకు తోచి చావదు.. రండి రండి.. ఇలా కుర్చీలో కూర్చోండి. అదేంటీ ఆ చేతికి ఆ కట్టేంటీ?”
“ఏదో జోక్ గా అన్నాను లెండీ! ఈ కట్టూ.. ఏం చెప్పమంటారు? వంటకోసం బ్రహ్మచారి పడిన పాట్లకు ఫలితం.. ”
“అయ్యయ్యో! ఈ బాధకు బదులు, త్వరగా వివాహం చేసుకోకూడదూ?”
“(నవ్వుతూ)ఎందుకు కూడదూ? మీలాంటి వారు దొరకొద్దండీ? సారీ! మరేమీ అనుకోకండి. నా నోటికి నిజాలు తన్నుకుని వస్తాయి”
కిలకిల నవ్వింది లావణ్య. కింద అటూ ఇటూ చూస్తున్న అతనితో, ”ఏమండీ! ఏమైనా కింద పడిందా?” అంది.
“మరే! మీరు నవ్వారుగా! ముత్యాలు రాలాయేమోనని చూస్తున్నా!”
మళ్ళీ నవ్వింది. “మీరు భలే సరదాగా మాట్లాడతారండీ!”అంటూ.
“వస్తానండీ! వేలు తెగిన దానితో ఇవ్వాల్టికి వంట ఎలా చేసుకోవాలో, ఏం చేస్తాం? ఎలాగో తంటాలు పడాలి. ”
“ఏం వండుకుంటారు? ఏ హోటల్ లోనో తినకూడదూ!”
“అబ్బే! హోటల్ ఫుడ్డు పడదండీ!”
“అయ్యో అలాగా? ఇదిగోండి కూర, గిన్నెలో వేసి ఇస్తాను. రైస్ కుక్కర్ పెట్టుకోండి”
“అబ్బా! మీకెందు కండీ శ్రమ! మీకు బాగా ఋణపడిపోతున్నాను. ఎలా తీర్చుకోవాలో మీ ఋణం?”
“అంత పెద్ద మాటలెందుకు లెండీ! ఇదిగోండి మరేం అనకుండా తీసుకెళ్ళండి” అన్నాడు బిందె ముందుకు జరుపుతూ.
“థాంక్సండి. వచ్చి మీకు పని పెట్టాను” అంటూ లావణ్య ఇచ్చిన గిన్నె తీసుకుని వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి భర్తక్కూడా ఇలా ఎదురింటిలో దిగినతను సరదాగా మాట్లాడుతున్నాడు, ఇంకా పెళ్లి కాలేదట అంటూ చెప్పింది. అలా ఆ తెల్లవారి ఆ గిన్నె నిండా జీడిపప్పులు వేసి ఇవ్వడానికి వచ్చాడు.
“ఎందుకండీ?” అన్న ఆమెతో, “ఏ పారిజాతంబులివ్వగలనో నేస్తమా? జగతిపై తారాడు చెంచాలా చంద్రికా.. విరిమల్లియలు తప్ప గరిక పూవులు తప్ప.. ” అంటూ పాట పాడి, “నాకు మీరలా అనగానే, ఆ పాట గుర్తొచ్చిందండీ “ అన్నాడు.
అతని మాటలకు ఆమె మనస్సు వివశమవుతుంది. అప్పుడే హద్దులు దాటినట్లు మాట్లాడతాడు. మళ్ళీ అప్పుడే ‘మరేం అనుకోకండీ’ అంటూ సారీ చెబుతాడు. కాలేజీలో బ్యూటీ గా పేరు తెచ్చుకున్న తను, భర్త నోటి వెంట మాత్రం ఒక్కసారి తన అందం గురించిన కామెంట్ కు నోచుకోలేదు.
నెమ్మది, నెమ్మదిగా ఆ సమయం అయ్యేసరికి ఆమె కళ్ళు, అతని కోసం ఎదురుచూసేవి. అతని వాక్చాతుర్యానికి ఆమె ఫిదా అయ్యేది.
‘చలం సాహిత్యం అంటే నాకిష్టం అండీ! మీకూ ఆ అభిరుచి ఉన్నట్లు అన్పించింది ‘ అంటూ పుస్తకాలు ఇచ్చేవాడు. అలా మొదలైన వారి స్నేహం హద్దులు దాటి ఒకరు లేకుండా ఒకరు ఉండలేని స్థాయికి వచ్చింది. అంత ఇంట్లో ఎవ్వరు లేకపోయినా కనీసం తాకడానికి కూడా ప్రయత్నించని అతనంటే ఆమెకు వల్లమాలిన అభిమానం ఏర్పడింది.
ఆమె చుట్టూ పోర్షన్లు కూడా లేని, ఒంటిగా కట్టిన ఇల్లు కావడంతో, వారి స్నేహానికి అడ్డు లేకుండా పోయింది.
ఆమె మనస్సు మాత్రం తనను పూవులా చూసుకునే భర్త, అభం శుభం ఎరుగని కొడుకు, అవ్యాజానురాగం పంచే అతని నడుమ మానసిక క్షోభకి గురవుతుంది. తనదేమైనా ఆకర్షణా? తనేం కౌమారపు వయస్సు కాదే! అతనేమైనా భోగలాలసుడా? కనీసం తనను తాకడానికి కూడా ఎన్నడూ ప్రయత్నించలేదే.. దీనికి పరిష్కారం?
గింజుకుంటున్న ఆమెకు ఆరోజు అతను పరిష్కారం చూపించాడు.
“లావణ్యా! సినీ తారలను మించిన నీ లావణ్యం, అడవిగాచిన వెన్నెలలా కేవలం ఒక ఇంటికి పరిమితమవుతుందని నా బాధ! నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు మాడల్ రంగంలో కొచ్చినా నీకు పిచ్చి పిచ్చిగా అభిమానులు ఉంటారు. ఎక్కడికెళ్ళినా ఎవ్వరైనా గుర్తుపడతారు. నీకు దాసోహం అంటారు. నాకు లక్షల్లో జీతం వస్తుంది. నీకు అది ఇష్టం లేకపోతే, నీకు కనురెప్పలా నేను కాపలా ఉండి చూసుకుంటా! అసలు నీకు పెళ్లి కాకముందు నేను పరిచయం అయినా బావుండేది. నీకంటూ చరిత్రలో ఒక పుట ఉండేలా చేసేవాడిని. నువ్వు ఒకరి భార్యవు. అలాంటి నిన్ను నేను కనీసం తాకనైనా తాకను. నువ్వు స్వంతంగా నా దానివైనప్పుడే నిన్ను నా హృదయ దేవతను చేసుకుంటాను. అప్పటివరకు ఒక దేవతలా ఆరాధిస్తాను. నీ సుకుమారమైన చేతులు ఇలా బట్టలు పిండి, వంటలు చేసి, అంట్లు తోమి కష్టపడడం నేను భరించలేను. మరో నాలుగు రోజుల్లో అంటే సరిగ్గా 25 తేదీ రాత్రి ఒంటి గంటకు రైల్లో మనిద్దరికీ టికెట్లు బుక్ చేసాను. మనం వెళ్ళిపోదాం. నువ్వు దూరంగా ఉంటే చూస్తూ నేను బతకలేను లావణ్యా! బతకలేను. వస్తాను” అంటూ వెళ్ళిపోయాడు.
ఆమె గుండె భయం భయం గా కొట్టుకుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతుంది.
తెల్లవారి ఆమెకు శ్రావణి చనిపోయిందని మాధవి దగ్గర నుండి, అమ్మావాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. చిన్నప్పటి నుండి ఇద్దరివీ పక్క పక్క ఇండ్లె కావడంతో ఇద్దరూ ప్రాణ స్నేహితులు. అంతా అయోమయంగా అనిపించింది. విషయాలు అడిగితె, అర్జంట్ గా కడసారి చూడడానికి ఆమె పుట్టింటికి రమ్మంది, అంత్యక్రియలు అక్కడే జరుగుతున్నాయని. హడావుడిగా పెట్టేసింది. భర్తకు చెప్పింది. పుట్టింటికే కాబట్టి మూడు గంటల ప్రయాణం. భర్త వచ్చి బస్సెక్కించాడు.
***
వెళ్ళే సరికే స్మశానానికి తీసుకెళ్ళారు. తమ్ముడి బండి పై వెళ్లి దారిలో అందుకుంది. శ్రావణి భర్త ఎక్కడా కనబడలేదు. ఏదైనా ఆక్సిడెంట్ అయ్యిందా? తమ్ముడు ముభావంగా దేనికీ సమాధానం చెప్పలేదు. ఎవ్వరిలో ఏడుపు లేదు. ఏదో మమ అన్నట్లు ఉన్నారు. పాడె కిందకు దించినప్పుడు చూసింది. అసలు ఎంతో అందంగా కాలేజీ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న శ్రావణీ, ఈమెనా అన్నట్లు, లోతుకు పీక్కుపోయిన చెంపలు, నల్లగా అయిన చర్మం. భయంకరంగా ఉంది. మాధవి ఏడుస్తున్న లావణ్యను పక్కకు లాక్కెళ్ళింది. భర్త ఏమైనా బాధపెట్టాడా? అతను చాలా మంచిగా చూసుకుంటాడు అని చెప్పింది కదా! అదే అడిగింది.
“అయ్యో! ఏ లోకంలో ఉన్నావే? హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక, ఏదో కంపనీలో, మన శ్రావణి కూడా జాబ్ లో చేరింది. అక్కడ ఎర్రగా బుర్రగా ఉన్నవాడెవడో, దీనెనకాల పడి ఏం మాయ చేసాడో? ఏం మంత్రమేసాడో? నెల రోజుల్లోనే వాడితో వెళ్ళిపోయిందట. విషయం అల్లుడి ద్వారా తెల్సిన శ్రావణి నాన్న, నా కూతురు ఎప్పుడో చనిపోయిందని గుండు కొట్టించుకున్నాడట. అలా వెళ్ళిన శ్రావణి ఇదో ఇలా ఆత్మహత్య చేసుకుంటే, దాని సెల్ లో ఉన్న ఫోన్ నంబర్లలో అమ్మానాన్న అని ఉన్న నెంబర్ చూసి వీళ్ళకు ఫోన్ చేసారట. వీళ్ళ నాన్న వెళ్ళనంటే, అమ్మ అలా కన్నవాళ్ళం మనం కూడా వదిలేస్తే ఎలా? కర్మ కాండ చేద్దాం అంటూ ఒప్పించిందట!” అని చెప్పి, వెంటనే వెళ్ళాలి కొడుకు ఎదురుచూస్తున్నాడని వెళ్ళిపోయింది. షాక్ తిన్నది లావణ్య. అన్యమనస్కంగా అమ్మా వాళ్ళింటికి వచ్చి, తలంటు స్నానం చేసింది. భర్త ఫోన్ చేస్తే తలనొప్పని, త్వరగా కొడుకుతో మాట్లాడి పెట్టేసింది. అమ్మ, నాన్న, తమ్ముడు అంతా, ‘శ్రావణి ని అంతా ఇలా తిడుతున్నారని చెబుతూ’ వారూ, ‘బంగారం లాంటి మొగుణ్ణి వదిలేసి బలిసి పోయి, బలయిపోయింది. వాడుకుని వదిలేసి ఉంటడు. మొహం చెల్లక ఈ పని చేసి ఉంటది’ అని తిడుతున్నారు.
భరించలేకపోయింది. ఈ లోగా తనకు పోస్ట్ లో వచ్చిందని ఉత్తరం అందించాడు తమ్ముడు. కేవలం తన పేరు అడ్రస్ ఉంది. ఫ్రం అడ్రస్ లేదు. అయినా చిర పరిచయం అయిన ఆ వ్రాత ఆమె మర్చిపోలేదు. అది శ్రావణిది.
ఆత్రంగా అది తీసుకుని రూమ్ లో కెళ్ళి వణుకుతున్న చేతులతో విప్పింది. అంటే, చనిపోయే ముందు ఈ ప్రాణ స్నేహితురాలిని గుర్తుంచుకుంది అన్నమాట. ఎలా మర్చిపోతుంది?
మూడు నెలల ముందు తనతో ఎంతో ఆనందంగా కలుద్దాం, అని చెప్పిన శ్రావణి శ్రావణ మేఘంలా కరిగి ఇప్పుడు లేదంటేనే జీర్ణించుకోలేక పోతుంది. అలాంటిది, తనకు బ్రతికుండగా రాసిన ఉత్తరం తన గురించి ఇలా ఆలోచిస్తున్నప్పుడు వచ్చిందంటే? ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీసాయి.
నా బంగారం లావణ్యా! నా బంగారం!
నువ్వు ఈ ఉత్తరం అందుకునే సమయానికి నేను ఈ లోకంలో ఉండనేమో? బహుశా నా శవాన్ని కూడా ఏదో అనాధ శవంలా దహనం చేస్తారేమో? నువ్వు కూడా అందరిలా నేను తప్పు చేసాననుకుంటున్నావా? నేను తప్పు చేయలేదే! కాని మోసపోయాను.
ఇప్పటి వరకు అందరూ నా గురించి రక రకాలుగా అనుకుంటూ ఉంటారు. అసలు విషయం నీకు చెబుతాను. హైదరాబాద్ రాగానే మరీ ఆయన ఒక్కరి జీతంతో, అంత పెద్ద నగరంలో బతకడం కష్టం అని ఇద్దరం అనుకుని, నేనూ ఒక ఆఫీస్ లో చిన్న జాబ్ లో చేరా.
అక్కడ పరిచయం అయ్యాడు సుమంత్! చక్కటి అందగాడు. సినీ హీరో లను తలదన్నేట్లు ఉంటాడు. చాలా సార్లు నాతో మాట్లాడి క్లోజ్ గా ఉండడానికి ప్రయత్నించాడు. అయితే నేను అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు ఆఫీస్ లో జరిగిన పార్టీలో, ‘ మిమ్మల్ని ఒక దేవతలా ఆరాధిస్తాను. అపార్థం చేసుకోకండి. మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇంత చిన్న జాబ్ లో ఇంత చిన్న జీతంతో మీరు పని చేస్తుంటే బాధనిపిస్తుంది. ఇప్పుడంటే మీకు పిల్లల్లేరు. రేపు పిల్లలయితే వాళ్ళ కోసం మీరు లీవ్ పెట్టినా మీ జాబ్ పోతుంది. అప్పుడు ఇంకా ఆర్థికావసరాలు పెరుగుతాయి. మీరిప్పుడు కాస్త ఎక్కువ సంపాదిస్తేనే అప్పుడు మంచిగా ఉండడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నా! మా కజిన్, అంటే సిస్టర్, పెద్ద కంపనీకి ప్రొప్రయిటర్! నేను మీకు వీలయినప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేస్తా. మంచి పోస్ట్ ఇస్తుంది. మీకు నచ్చితే ఉండండి. లేకపోతే వెళ్లిపోవచ్చు’ అన్నాడు.
‘మరి మీరెందుకు చేరలేదు’ అన్నాను. ‘ అందులో నా పార్టనర్ షిప్ ఉంది. ఇక్కడ రిజైన్ చేసాను. మరో నాలుగు రోజుల్లో వెళుతున్నాను. ఈ లోగా నీలాంటి సిన్సియర్, టాలెంట్ ఉన్న వర్కర్ కూడా ఉండాలనిపించి చెప్పాను. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. అప్పుడు సద్వినియోగపరుచుకున్నవారే అదృష్టవంతులవుతారు’ అని వెళ్ళిపోయాడు. ఆ తెల్లవారి, ‘కింద కార్లో మా సిస్టర్ వచ్చింది. కంపనీకే వెళుతుంది.. చూసి వస్తారా.. ’ అంటూ తొందర పెట్టాడు. అప్పటికే ఆఫీస్ అయిపోవడంతో మాట్లాడదామని వెళ్లాను. చాలా చక్కగా డిగ్నిఫైడ్ గా ఉంది, నన్ను సాదరంగా ఆహ్వానించి, ‘మా తమ్ముడు చెప్పాడు మంచి వర్కర్ అని, ఆఫీస్ చూపిస్తా! నచ్చితే చేరండి. వస్తారా నాన్నా’ అంది. ఆమె ఆప్యాయతకి పొంగిపోయి, సరే చూసి వద్దామనుకుని కూర్చున్నా, ఆయనకు విషయం ఫోన్ చేసి చెబుదామనుకున్నా, ’ మాటలు మాట్లాడుతూ అలసిపోయినట్లున్నావమ్మా ‘ అంటూ కార్ లోని జ్యూస్ బాటిల్ తను తీసుకుని నాకు, ముందు కూర్చున్న ఇద్దరికీ ఇచ్చింది. నిజంగానే అలసటగా ఉంది. తాగాను. అంతే నాకంతవరకే గుర్తుంది. తెలివి వచ్చేసరికి బెడ్ పై ఉన్నాను. ఒంటి పైన బట్టల్లేవు. బెడ్ షీట్ ఉంది. ఒళ్ళంతా నొప్పులు. ఏం జరిగిందో నా కర్థం అయ్యింది. అయోమయంగా ఏం జరిగిందో ఊహించేసరికి నేను మోసగించబడ్డానని తెల్సింది.
వాడు, ఆమె చాలా ఘోరంగా ప్రవర్తించారు. నాపై నలుగురు చేసిన అత్యాచారాన్ని వీడియో తీసింది చూపించారు. ఆఫీస్ లో, నా భర్తకు నేను లేచిపోయానని చెప్పారట. ఆయన పరువు తక్కువని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదట. అందంగా ఉన్నాను, కనుక నాలుగు లక్షలకు వ్యభిచార కూపానికి అమ్మేసారు. వాళ్ళు పెట్టె బాధలకు నరకం చవి చూసాను. ఎప్పటికీ నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసే ఆయన గుర్తొచ్చేవారు. మీరంతా గుర్తొచ్చేవారు.
ఒకసారి ఎలాగో వీలుచేసుకుని ఆయనకు ఫోన్ చేస్తే, ‘నీకు నేనేం తక్కువ చేసాను? మీ నాన్న నువ్వు చచ్చావని ఎప్పుడో గుండు కొట్టించుకున్నాడు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు’ అని పెట్టేసాడు. వాళ్ళు ఏమరుపాటుగా ఉన్నప్పుడు తప్పించుకున్నాను. కాని ఏ మొహం పెట్టుకుని రావాలి? కాని చేయని నేరానికి శిక్ష అనుభవించాను. నాలా ఎవ్వరూ కావొద్దంటే ఆడపిల్లలంతా ఇంకా చాలా అలర్ట్ గా ఉండాలి. పొగడ్తలకు మోసపోకూడదు. అమాయకంగా ఉండకూడదు. నాకిప్పుడు వారిపై పోరాడే శక్తి లేదు. కాని నేనేం తప్పు చేయలేదని ఆయనకు, మా తల్లితండ్రులకు తెలియజేస్తే చాలు. వారికే ఉత్తరం రాసినా చదవకుండా చింపే స్తారు. అందుకే నీకు రాసాను. దయచేసి ఈ సహాయం చేస్తావు కదూ!
సెలవ్!
నీ శ్రావణి. ’ ఉత్తరం పూర్తయ్యేసరికి లావణ్య కళ్ళు రెండూ గంగా యమునలయ్యాయి.
ఈ ఉత్తరం రాకపోతే తానూ ఎంత పెద్ద ఊబిలో కూరుకుపోయేదో అర్థమయ్యింది. తన భర్తతో, మొన్నెవరో, ‘ ఇలా ఎదురింటి అతను ఎప్పటికీ మీ ఇంటికి వస్తున్నారు జాగ్రత్త ‘, అని చెబితే, ’ ఈ లోకం కి ఏం పని లేదు. ఆడ మగ కనబడితే ఏదో అంటూనే ఉంటారు’ అన్నాడు తనతో.
నిజంగా ఎంత మంచివాడు. నిజంగా దేవుడు. ఛీ.. తనెంత నీచంగా ఆలోచించింది.. ఇంకా నయం, చిన్న వయస్సులో పాతికేళ్ళే నిండని తను ఏదో ప్రలోభంలో పడక ముందే, దేవుడు ఇలా తన కళ్ళు తెరిపించాడు. అయినా అతను చాలా మంచివాడు. ఇలాంటి మోసగాడు కాదు. కాని శ్రావణికి ఇలా చేసిన వాడిని వదిలివేయోద్దు. ఇలాంటి ఎంత మందిని బలి తీసుకుంటాడో. భర్తతో తమ్ముడితో కల్సి, ఉత్తరం చూపించి శ్రావణి నాన్న వాళ్ళతో, శ్రావణి భర్తతో మాట్లాడి కేస్ బుక్ చేయించాలి.
విషయం తమ్ముడితో, అమ్మావాళ్ళతో చర్చించింది. భర్తతో ఫోన్ లో మాట్లాడి చెప్పింది. ఆ రాత్రే విపరీతమైన జ్వరం అందుకుంది లావణ్యకు. విషయం తెలియగానే ఆఘమేఘాలపై వచ్చేసాడు లావణ్య భర్త సిద్ధార్థ.
“అయ్యో! ఎందుకు ఇలా శ్రమపడి ఆఫీసుకు లీవ్ పెట్టి వచ్చారు. రెండు రోజుల్లో తగ్గేది. నేనే వచ్చేదాన్ని కదా!”అంది లావణ్య.
“అదేంటో గాని, మీరుంటే అంతగా పట్టించుకోము గాని, మీరు లేని ఇల్లు మాత్రం నిజంగానే దేవత లేని కోవెలే! అస్సలు ఇంట్లో ఉండబుద్ది కావడం లేదు. పైగా నీకు జ్వరం అని మీ తమ్ముడు చెప్పగానే ఉండాలనిపించలేదు. నువ్వు నా బంగారం” అన్నాడు సిద్ధార్థ ఆమె తల నిమురుతూ.
“మీదంతా పై పై నటనేలే! కూరగాయలు కోస్తూ పొరపాటున వేలు కోసుకుంటే, ‘అయ్యో మరి ఒక్క చేత్తో ఎలా చేసుకుంటుంది? అనిగానీ, పనులన్నీ ఎలా జరుగుతాయి అనిగానీ, రక్తం వస్తుంది, పాపం ఫస్ట్ ఎయిడ్ చేద్దామని గానీ ఉండదు గానీ, బంగారం, ఇత్తడి, వెండి అంటూ కపట ప్రేమ మాత్రం ఒలకబోస్తారు. ” బుంగమూతి పెట్టింది లావణ్య.
“పిచ్చిదానా! పెళ్ళికాగానే భార్య పూర్తిగా తన స్వంతం అనుకునే భర్త, కుటుంబ భాద్యతల భారం తో ఇంతకు ముందులా ప్రేమ చూపించక పోవచ్చు. కాని వాళ్ళు దానిని ప్రేమలేని తనం అనుకుంటే ఎలా? ఎంత చికాకులో ఉన్నా నువ్వన్నట్లు, అప్పుడో ఇప్పుడో తనే సర్వస్వం అయిన ఆమెకు సమయం కేటాయించాలి. నిజమే! ఆ రోజు ఆఫీస్ కి ఆలస్యం అయిన హడావుడిలో ఉన్నాను. ఆడిట్ మొదలవుతుంది అన్న టెన్షన్ లో ఉన్నాను. అందుకే ఆ రోజు రాత్రి సారీ చెప్పా కదా! ” అన్నాడు.
***
తెల్లవారి ఇంటి ముందు ఆటో దిగేసరికి ఎదురింటి ముందు పోలీసులు. విషయం ప్రక్కవారిని అడిగితే, పేపర్ చూపించారు.
పేపర్లో, ’అందమైన అమ్మాయిలకు వల విసిరి, ఆకర్షించి, వ్యభిచార రొంపిలోకి దింపుతున్న మృగాడు’ అన్న శీర్షిక తో అతని ఫోటో వేసేసరికి షాక్ తింది. త్రుటిలో తప్పిన ప్రమాదాన్ని తల్చుకుంటే వొళ్ళు జలదరించింది.
“ఆడవాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పటికి యాభైకి పైగా ఆడవారిని అమ్మేసాడట. అందులో పెళ్ళయిన వారు కూడా ఉన్నారట” ఎవరో అంటున్నారు.
అప్పుడు గట్టిగా నిర్ణయించుకుంది, అమాయకమైన ఆడవాళ్ళకు ఇలాంటి వాటి కోసం కౌన్సిల్లింగ్ సెంటర్ పెట్టడానికి వీలయిన కోర్స్ చేయాలని. అమాయకత్వం ముసుగులో బలవుతున్న ఆడవారిని రక్షించాలని! ఆమె సంకల్పాన్ని ఆశీర్వదిస్తున్నట్లు గుడిలోని జేగంటలు మంగళకరంగా మ్రోగాయి.
*************************
నామని సుజనాదేవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
తెలంగాణా లో రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి పరిచయం క్లుప్తంగా.
పూర్తి పేరు : నామని సుజనాదేవి
విద్యార్హతలు : B.Sc.,B.Ed.,M.A.(English),LL.B.,PGDCA., FIII(Fellow of Insurance Institute of India) M.Sc.(Psychology),M.A.(Telugu) English&Telugu Type Writing lower.
వృత్తి :భారతీయ జీవితబీమా సంస్థలో పరిపాలనాధికారి
ప్రవృత్తి : కధలు,కవితలు వ్రాయడం,చెస్,క్యారమ్స్,టిటి ,అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడటం,వ్యాసరచన,వక్తృత్వం లాంటి అన్నిపోటీల్లోపాల్గొనటం మూడు కధా సంపుటాలు రెండు కవితా సంపుటాలు వెలువరించడం. ‘మనో స్పందన’ కధా సంపుటికి రాష్ట్ర స్థాయి తృతీయ పురస్కారం రావడం.
1.భారత మహిళా శిరోమణి అవార్డ్ ౩. సంపూర్ణ మహిళా అవార్డ్ 4 . అలిశెట్టి ప్రభాకర్ స్మారక కవితా పురస్కారం 5. శ్రీ శ్రీ సాహితీ పురస్కారం 6. గ్లోబల్ పీస్ (ప్రపంచ శాంతి) అవార్డ్ 7. ఉగాది పురస్కారం , రుద్రమదేవి మహిళా పురస్కారం 8. శ్రీ అయితా చంద్రయ్య సంప్రదాయ కధా పురస్కారం 9. బెస్ట్ సిటిజెన్ అవార్డ్ 10. ‘విశ్వ శాంతి సేవా పురస్కారం ‘ 11. శాతవాహన విశ్వ విద్యాలయ కధా పురస్కారము 12. సోమరాదాక్రిష్ణ స్మారక వ్యాస పురస్కారం 13. ‘గురజాడ సాహిత్య పురస్కారం ‘ 14. సైదా సాహెబ్ స్మారక మినీ కవిత లో ప్రధమ బహుమతి 15. ఆంద్ర ప్రదేశ్ మాసపత్రిక హాస్య కధల పోటీలో ప్రధమ బహుమతి 16. రెండు సార్లు నెలవంక నెమలీక కధా పురస్కారం 17. ప్రతిలిపి ద్వారా ‘కధా కిరీటి ‘, ‘ కవి సుధ ‘ బిరుదులు, సహస్ర కవిమిత్ర బిరుదు 18. ‘సాహితీ రత్న’ అవార్డ్ 19. కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్ సాహితీ అవార్డ్ 20. ఇప్పటివరకు దాదాపు 70 వరకు ఆర్టికల్స్ వరంగల్ ఆకాశవాణి లో ,6 విశాఖ ఆకాశవాణి లో,3 హైదరాబాద్ ఆకాశవాణి లో ప్రసారం చేయబడినాయి. 21. 225 కధలు,175 కవితలు,25 ఆర్టికల్స్ ఈనాడు,తెలుగువెలుగు ,విపుల ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి,కధాకేళి, ముంబైవన్,ఉషోదయ వెలుగు ,వైఖానసప్రభ మొదలగు పత్రికల్లో ప్రతిలిపి, మై టేల్స్, కహానియా, తెలుగు వన్, వసుధ ,మామ్స్ ప్రేస్సో వంటి వెబ్ మాగజీన్ లలో ప్రచురించబడ్డాయి. 22. LIC డివిజన్ లెవల్ చెస్ లో 10 సార్లు, అధ్లేటిక్స్ 3 సార్లు,టి.టి.లో 5 సార్లు ప్రధమ స్థానం పొంది జోనల్ లెవెల్ లో పార్టీసీపేట్ చేయడం. 23. రాష్ట్రస్థాయి జాతీయ వెటరన్ అధ్లేటిక్ మీట్లలో 2000 నుండి 2003 వరకు దాదాపు 15 నుండి 20 వరకు గోల్డ్,సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పొందడం. జోనల్ లెవల్ అధ్లేటిక్ మీట్లో 400మీటర్ల పరుగుపందెంలోబ్రాంజ్ మెడల్ 24. 11 వ్యాసాలకు, దాదాపు 27 కధలకు , 12 కవితలకు కొన్ని ఆర్టికల్స్ కు బహుమతులు పొందడం. 25. దూరదర్శన్ హైదరాబాద్ , వరంగల్ సప్తగిరి చానల్స్ ద్వారా ఇంటర్వ్యులు, మనమాట- మన పాట కార్యక్రమం, ఉగాది కవిసమ్మేలనాలలో పాల్గొనడం 26. మహాత్మా జ్యోతీరావ్ ఫూలే సాహిత్య అవార్డ్ 27. క్రియేటివ్ ప్లానెట్ జాతీయ కవితా పురస్కారం 28. .శ్రీరామదాసి సాహిత్యపురస్కారం , ఎడపల్లి, నిజామాబాద్ 29. 405 కధలు వచ్చిన ప్రతిష్టాత్మక నవ్య ఉగాది పోటీలో ‘అనుబంధం’ కధ కు బహుమతి 30.అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ అమెరికా వారు జూన్ 2019 లో నిర్వహించిన కధల పోటీలో ‘తేడా’ కధకు బహుమతి రావడం. 31. గో తెలుగు వెబ్ సైట్ వారు వారు నిర్వహించిన పోటీ లో ‘ప్రేమ నేర్పిన పాఠం ‘ కి జూన్ 2019 లో బహుమతి 32. కెనడా డే 2019లో నిర్వహించిన పోటీలో ‘వాగార్దావివ సంత్రుప్తౌ’ కధ కు బహుమతి 33. తెలుగు కళా సమితి అమెరికా వారు నిర్వహించిన కధల కవితల పోటీలో , ‘చేయనితప్పు’ కధకు, ‘అలుపెరుగని పోరాటం’ కవితకు ప్రధమ బహుమతులు. 34. నిడదల నీహారికా ఫౌండేషన్ నిర్వహించిన పోటీలో 2020 ‘కుజ దోషం’ సంక్రాంతి కదల పోటీలో 20౦౦ నగదు బహుమతి. 35. ప్రతిష్ట్మాత్మక ఈనాడు కధావిజయం పోటీలో వెయ్యి కధల్లో నాకధ ప్రచురణకు సెలక్ట్ కావడం. 36. పుప్పాల ఫౌండేషన్ కధా పురస్కారం ‘వ్యత్యాసం' కధకు 18-1-20లో 37.హాస్యానందం చక్కరకేలీ పోటీలో ‘ఆనందం –ఆరోగ్య రహస్యం’ కధకు 5-1-20 లో బహుమతి ప్రధానం. 38. అంపశయ్య నవీన్ గారి ప్రధమ నవలల పోటీలో నా నవల ‘ఐ లవ్ మై ఇండియా’ కు పదివేల బహుమతి 24-12-19న స్వీకరించడం. 39. ‘తెలుగు పునర్వైభవం ‘ అంశం పై సాహితీ కిరణం నిర్వహించిన కవితల పోటీలో నా కవితకు ఫిబ్రవరి 2020లో బహుమతి రావడం. 40. ‘పొడుస్తున్న పొద్దు’ కధకు మామ్స్ ప్రేస్సో వెబ్ సైట్ లో ఏప్రిల్ 2020లో బహుమతి రావడం 41. రెండు తెలుగు రాష్టాల వారికి పెట్టిన పోటీలో నా కధా సంపుటి ‘స్పందించే హృదయం’ కు ‘సుందరాచారి స్మారక పురస్కారం’ 42. మామ్స్ ప్రేస్సో లో ‘ఇంటింటి రామాయణం’ బ్లాగ్ కి బహుమతి 43. తెలుగు సాహితీ వనం నిర్వహించిన పోటీలో నా కధ ‘తేడా’ కి జూన్ 20 లో బహుమతి 114. ప్రియమైన కధకుల గ్రూప్ లో ‘అనుబంధం’ కధకి జూలై 20 లో తృతీయ బహుమతి
コメント