గమ్యం చూపిన నిర్ణయం
- Kotthapalli Udayababu

- Jun 12
- 9 min read

Gamyam Chupina Nirnayam - Telugu Emotional Story | Kotthapalli Udayababu
గమ్యం చూపిన నిర్ణయం - తెలుగు భావోద్వేగ కథ | కొత్తపల్లి ఉదయబాబు
Published in manatelugukathalu.com on 12/06/2026
"మామగారిని హాల్లోకి పరిమితం చేసిన కోడలు… చివరికి అతనికి గది ఇచ్చింది."
ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు. నేటి సమాజంలో వృద్ధ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న మౌన వేదనకు అద్దం పట్టే కథ. ప్రేమ, బాధ్యత, గౌరవం, ఆత్మపరిశీలన కలిసిన ఈ కథలో ఒక స్నేహితుడు తీసుకున్న నిర్ణయం ఎలా ఒక కుటుంబానికి కొత్త గమ్యం చూపిందో హృదయాన్ని కదిలించే విధంగా రచయిత ఆవిష్కరించారు.
కోడలు మంజూషతో మాట్లాడటానికి కింద ఫ్లాట్ లోని జగదాంబ వచ్చింది. కోడలు చూసిన ఆ చూపుకి అర్థం తెలిసిన నేను, నెమ్మదిగా హాల్లో కూర్చున్న నా స్థానంలోంచి లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ వీధి తలుపు తీసుకుని కారిడార్‌లోకి వచ్చాను.
పిల్లవాడు తప్పు చేస్తే బెంచీ మీద నిలబెట్టిన రోజులు, నేను ఈ శిక్ష అనుభవించినప్పుడల్లా గుర్తుకు వస్తాయి. కానీ అది వాడి జీవితం బాగుపడాలని వేసిన శిక్ష.
నాకు కోడలు వేసేది, వాళ్ళ సంభాషణలకు నేను అంతరాయం కాకూడదని ఇంటికి ఎవరొచ్చినా వేసే శిక్ష. నాకు ఇది కొత్తేమీ కాదు.
నా భార్య ఉమ పోయాక కొడుకు దగ్గరకు వచ్చిన వారం రోజుల నుంచి మొదలైంది. ఉమ పోయిన 14వ రోజున అబ్బాయి నన్ను తన ఇంటికి తీసుకువచ్చాడు.
రెండు గదులు, భోజనాల హాలు, విశాలమైన పెద్ద హాలు ఉన్న అపార్ట్‌మెంట్. కొడుకు కోడలుకు ఒక గది, పిల్లలకు రెండో గది. పెద్ద హాలు ఎల్ ఆకారంలో ఉండటంతో హాలు పక్కకు వచ్చే భాగంలో ఒక సింగిల్ కాట్ మంచం, పక్కనే టీపాయ్, అక్కడ గోడకు ఉన్న అలమారులో నా దైనందిన బట్టలు, కాళ్ళకు బీరువాకు మధ్యలో ఉన్న జాగాలో ఒక గోద్రేజ్ బీరువా ఉంచారు.
నేను బయటకి కనపడకుండా అడ్డంగా ఒక పరదా!
నన్ను దాటి వెళ్ళాక భోజనాలు చేసే బల్ల. దాని చుట్టూ నాలుగు కుర్చీలు, దాన్ని ఆనుకుని ఉన్న కిచెన్ పక్కన అంట్లు తోముకునే బాల్కనీ. రెండో గది వీధి గుమ్మానికి ఎదురుగా ఉంది. ఆ గది దాటాక బట్టలు ఆరేసుకునే బాల్కనీ. ఇదీ నా కొడుకు తన కష్టార్జితంతో కొనుక్కున్న ఇల్లు.
కింద సెల్లార్‌లోకి వచ్చాను. అటూ ఇటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం మొదలుపెట్టాను. మిగతా అపార్ట్‌మెంట్ వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ వెళ్తూ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోతుంటారు.
ఇది నేను ఇక్కడకు వచ్చిన ఆరు నెలలుగా జరుగుతున్నా నా కొడుకుకు మాత్రం తెలీదు. నేను చెప్పలేదు. నా కోడలు చెప్పదు. ఇంతకన్నా విశేషం ఏమిటంటే మా ఫ్లోర్‌లో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. మా ఫ్లాట్ తప్ప మిగతా పంతొమ్మిది ఫ్లాట్స్ వాళ్ళు ఎవరెవరో నాకు తెలీదు.
వాళ్ళందరికీ నేను మా అబ్బాయి తండ్రిని అని తెలుసు. కానీ ఒక్కరు కూడా, ఆఖరికి వాచ్‌మన్ కూడా నేను అలా సెల్లార్‌లో గంటలకొద్దీ గడుపుతానని మా అబ్బాయికి చెప్పలేదు.
ఏమిటో మనిషి జీవితం. పుట్టిన వెంటనే పసికందును అపురూప వజ్రం దొరికినట్టు చూస్తారు. వాడికి అంతఃపురం లాంటి గది, పటిష్టమైన రక్షణ, అనుక్షణపు పర్యవేక్షణ అన్నీ ఉంటాయి బాల్యం గడిచేవరకు. వాడు యవ్వనంలోకి ప్రవేశించాక వాడికో ప్రత్యకమైన గది ఏర్పాటు అవుతుంది. అటు తర్వాత మంచి చదువు చదివి తన చదువు, అభిరుచికి తగ్గట్టు మంచి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో స్థిరపడ్డాక మంచి సంబంధం చూసి తల్లిదండ్రులు పెళ్ళి చేస్తారు.
ఒక బిడ్డకు తండ్రి అయ్యాక వాడూ ఒక ఇంటికి యజమాని అవుతాడు. ఆ ఇంట్లో అన్ని గదులకూ యజమాని వాడే. వాడి యవ్వన కాలానికి వాడే రారాజై పిల్లల చదువులు, పెళ్ళిళ్ళ బాధ్యతలు నెరవేర్చి వార్ధక్యపు పడిలో పడతాడు. అప్పుడు వాడి స్థానం గదిలోంచి తనలా హాలులోకి మారుతుంది. హాలు జీవితం గడిచాక ప్రాణం పోయిననాడు ఇంటి బయటకి, అక్కడ నుంచి కాటికి…
ఈ ప్రపంచంలో ఏ మనిషికి అయినా ఇదే ప్రయాణం. ఈ ప్రయాణమంతా జీవితం సవ్యంగా జరిగేవాడికి.
అలా జరగని వాడి జీవితం ఎక్కడోచోట అర్ధాంతరంగా ఆగిపోతుంది.
ఈ ప్రపంచంలో మగాడు పోయాక ఆడది తనకు తానుగా సర్దుకుని బ్రతకగలదు. పుట్టినప్పటి నుంచి ఆమె పరాన్నజీవి కావడం, ప్రతీ చిన్న విషయానికి మగవాడి మీద ఆధారపడి బ్రతకడం, అందుకు అతనికి తనకు చేతనైనంత సేవచేస్తూ జీవితం గడపడం వల్ల కావచ్చు. అతని జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆఖరిక్షణం వరకు తన చుట్టూ ఉన్నవారికి సేవచేసి చేసి చివరకు తనువూ చాలిస్తుంది.
అదే మగవాడు భార్య పోయిన ఆ క్షణం నుంచీ జీవచ్ఛవమే. ఆదరించే వాళ్ళుంటే జీవితం సాదాసీదాగా గడుస్తుంది, నడుస్తుంది. లేకపోతే కనీసం భర్త పోయిన ఆడదానిలా కూడా కాకుండా, హీనాతిహీనంగా దిక్కులేని చావు చావడమే. అందుకే కాబోలు దేవుడు దంపతుల్లో మగవాడికి ఎక్కువ వయసు, స్త్రీకి తక్కువ వయసు ఉండేలా పెద్దలు నిర్ణయించారు. సహజంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ముందు పోతారనే తార్కిక ఆలోచన కాబోలు.
కానీ ఈ రోజుల్లో కొన్ని విరుద్ధంగా జరుగుతున్నాయి. భార్య పోయిన మగవాడే కాకుండా భర్త పోయిన స్త్రీ కూడా చరమాంకంలో తోడు కోసం ద్వితీయ వివాహం చేసుకుంటోంది. విడాకులు పొందిన గృహిణి గానీ, పురుషుడు గాని ‘సహజీవనం’ పేరుతో ఒకరికొకరు ఇష్టం ఉన్నంత కాలం కలిసిమెలసి ఉంటున్నారు. భేదాభిప్రాయాలొస్తే విడిపోతున్నారు.
వృద్ధులైన తల్లిదండ్రులు రక్తమాంసాలు, డబ్బు ధారపోసి తమ పిల్లలని కష్టపడి చదివించుకుని, ఉద్యోగాల పేరుతో విదేశాలకు వలస వెళ్ళిపోతే తమకు తాము చాకిరీ చేసుకోలేక ప్రెస్టీజ్ కోసం తామే స్వయంగా వృద్ధాశ్రమాలలో చేరి మనుమల భవిష్యత్తు కోసం వాళ్ళు పంపిస్తున్న డబ్బుని భూములుగా, పొలాలుగా అమర్చిపెడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు అందించిన జీవితాన్ని దొరకబుచ్చుకుని రెక్కలొచ్చాక తలో దారీ వెళ్ళిపోయిన పిల్లలు వదిలేసినవారు అనాథాశ్రమాలలో కాలక్షేపం చేస్తున్నారు.
ఇంకా ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో రకాల తల్లిదండ్రులు మనకు దర్శనమిస్తారు.
వాళ్ళందరితో పోలిస్తే తానూ చాలా చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. కొడుకు నిజమైన ప్రేమతో బాగానే చూస్తాడు. కోడలు తర్ఫీదు వల్ల ఆమె ఎదురుగా నటించినా, మనుమలు ఆమె లేనప్పుడు తాతయ్యా అంటూ ఆప్యాయంగా దగ్గరకొస్తారు. కథలు, చిన్ననాటి కబుర్లూ చెప్పించుకుంటారు.
అలాగే అల్లుడు ఇంటికి వెళ్ళినా కూడా మనవరాలు, కూతురు బాగా చూస్తారు. అయితే అల్లుడు అదేదో సినిమా ‘మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏం పెడతారు’ టైపు. అప్పనంగా ఇంట్లోకి వంద రూపాయలు కలిసొచ్చే పళ్ళు పట్టుకెళ్ళినా చింపిరిచేట అయిపోతాడు. హడావుడిలో ఏమన్నా పట్టుకువెళ్ళడం కుదరకపోతే సగం కాలి ఆరిన చిచ్చుబుడ్డిలా అయిపోతాడు.
తనతో 33 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయి, తనను అన్ని విధాలుగా అర్థంచేసుకుని, చన్నీళ్ళకు వేన్నీళ్ళు తోడుగా తనకు తోచిన విధంగా కష్టపడి, పిల్లలు పెద్దయ్యాక తనకన్నా ఎక్కువగా వారి క్షేమం కోసం, సంక్షేమం కోసం కష్టపడి, లేనిపోని అనారోగ్యం తెచ్చుకుని అర్ధాంతరంగా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పితో బాధపడి సకాలంలో గుర్తించక చేసిన ఆలస్యంతో, తనను ఒంటరివాడిని చేసి ప్రాణాలు కోల్పోయింది ఉమ.
అప్పటినుంచి ఒక్కగానొక్క కొడుకు కోరిక మేరకు వాడి దగ్గరే ఉంటున్నాడు తను. తనను తండ్రిగా ఎంత గౌరవిస్తాడో అంతకంటే ఎక్కువగా భార్యకు దాసోహమతడు. ఆ నిజం తెలుసుకున్న మంజూష అనుక్షణం భర్త ఎదురుగా తనకు అపారమైన గౌరవమిస్తూ, వాడు ఆఫీసుకు వెళ్ళిపోయాక తన ప్రణాళికను యథాతథంగా అమలు పరుస్తుంది.
పిల్లలు చటుక్కున నోరు మెదపబోయినా ఆమె చూసే ఒక్క చూపుకి తాబేలుల్లా ముడుచుకుపోతారు. తాను చూస్తూ కాలక్షేపం చేయడం తప్ప నోరు మెదపడు. మెదిపితే రోజు వెళ్ళదు.
‘’ఏమిట్రా? అంత దీర్ఘాలోచన. నేను వచ్చి అయిదు నిమిషాలైంది తెలుసా!’’ అన్న మాటలు విని తలతిప్పాను.
రాజశేఖరం వచ్చి ఎంతసేపైందో మరి. స్థిరంగా చేతులు కట్టుకుని సెల్లార్ సిమెంట్ పోల్‌కు ఆనుకుని తదేకంగా నావైపు చూస్తున్నాడు. వాడు నా బ్రతుకులో ఒక చిరు ఆశాదీపం. నా దగ్గర ఉన్నంతసేపు మనోధైర్యం టానిక్ నా గొంతులో కాదు, గుండెల్లో పోసే దేవతామూర్తి.
‘’రా… రా… ఎలా ఉన్నావ్? మూడు రోజులయ్యింది నిన్ను చూసి. మూడు యుగాలైనట్టుగా ఉంది రా. ఇంట్లో బోర్ గా ఉందిరా. కాస్త గాలి పీల్చుకుందామని’’ అన్నాను.
‘’ఒరేయ్! ఒకే అబద్ధం ఎక్కువ కాలం నిలబడదురా. ఈ వయసులో నిలబడి పచార్లు చేసింది చాలు గానీ… లోపలికి పద’’ అన్నాడు రాజశేఖరం.
‘’కోడలితో మాట్లాడటానికి ఎవరో వచ్చారురా. ఆవిడ వెళ్ళాక వెళ్దాం’’ అన్నాను.
‘’నీ మొహం! నా బొందాను. ఆవిడ ఏదో ఖాళీ సంచి పుచ్చుకుని నువ్వు నిలబడి నిద్రపోతున్నప్పుడే బయటకి వెళ్ళింది. పద పద’’ అన్నాడు. ఇద్దరం లిఫ్ట్‌లో మా మూడవ ఫ్లోరుకు వచ్చాము.
వాడికి ఇద్దరు ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేసాడు. ఒక అమ్మాయి విశాఖపట్నం, ఒక అమ్మాయి బెంగళూరు. ఎవరి బిజీ వాళ్ళది. వీళ్ళిద్దరూ ఒంటరిగా విడిగా ఉంటున్నారు.
వాడూ, నేనూ ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకూ సహాధ్యాయులం. డిగ్రీ తరువాత నేను ఉపాధ్యాయ శిక్షణ పొంది టీచర్ అయ్యాను. పరిస్థితుల వల్ల వాడు ఒక కొట్లో గుమాస్తాగా చేరి గొర్రె బెత్తెడు జీతం చాలక ఎల్.ఐ.సి. ఏజెంట్‌గా అవతారమెత్తాడు. అప్పటినుంచి తిరిగి చూసుకోకుండా లక్షలు సంపాదించాడు. అయితేనేం?
పలకరించే దిక్కులేక అల్లాడుతున్నాడు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా నాతో బాతాఖానీకి వచ్చేస్తుంటాడు.
నాకోసం ఎవరొచ్చినా హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడానికి నా కోడలు పర్మిషన్ ఇచ్చింది.
మేము సోఫాలో పక్కపక్కనే చతికిలబడగానే కోడలు మంచినీళ్ళు పట్టుకువచ్చి ఇచ్చి,
‘’బాగున్నారా బాబాయ్ గారూ! మూడు రోజులనుంచి కనిపించలేదు’’ అని అడిగింది.
‘’ఆవిడకి కొంచం నడుం పట్టేసిందమ్మా. తనకి నేను, నాకు తానూ సేవలు చేసుకోవాలిగా. అందుకే కుదరలేదు. నీ చేత్తో పెట్టిన టీ తాగితే పోతున్న ప్రాణం తిరిగి వస్తుందమ్మా. నీకు అభ్యంతరం లేకపోతే... అన్నట్టు మీ ఇద్దరితో ఒక మాట చెప్పుకోవాలని ఉందమ్మా. నువ్వు కూడా రా, చెబుతాను’’ అన్నాడు వాడు.
‘’నాతోనా? అయ్యో ఎంతమాట. అయిదు నిమిషాల్లో టీతో వస్తాను బాబాయ్ గారు’’ అని టీవీ కట్టేసి కిచన్ లోకి వెళ్ళింది.
మంజూష అయిదు నిమిషాల్లో టీ కప్పులున్న ట్రేతో వచ్చి మా ఎదురుగా కూర్చుంది.
రాజశేఖరం టీ కప్పు తీసుకుని తన లాల్చీ జేబులోంచి రెండు స్టాంప్ పేపర్స్ తీసి చెరోటి మాకు ఇచ్చాడు.
‘’ఏమిట్రా ఇవి?’’ అన్నాను.
‘’ముందు టీ తాగి అప్పుడు స్థిమితంగా చదువు’’ అన్నాడు వాడు. అప్పటికే కోడలు దాన్ని చదవసాగింది.
ఎంత వేడిగా ఉన్నా అవతలి వాడు రెండు గుటకలు వేసేసరికే నేను టీ తాగడం అయిపోతుంది. అలా నోరు కాలిపోయేలా తాగడం నా అలవాటు. తాగి నేనూ చదవడం మొదలుపెట్టాను.
అది చదువుతూనే నా కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగిపోయాయి.
గద్గద స్వరంతో,
“ఏమిట్రా ఈ పిచ్చి పని రాజూ?’’ అన్నాను.
కోడలైతే సర్పద్రష్టలా నోట మాట లేకుండా అలానే ఉండిపోయింది.
రాజశేఖరం విరక్తిగా నవ్వి,
“ఏముందిరా? అయినవాళ్ళు ఉండి ఆదరణకు నోచుకోని వాళ్ళు చేసే పనేరా. దేవుడు కనిపిస్తే నిలదీయాలని ఉందిరా. బాధ్యతలు తీరిపోయిన మనిషి తన అవసరం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అని నిర్ణయించుకుని, ‘నాకు మరణం ప్రసాదించు దేవా!
అని మనస్పూర్తిగా కోరుకున్నప్పుడు ఆ మనిషికి తక్షణమే ప్రాణం పోయే స్వచ్ఛంద మరణం ప్రసాదించే వరం ఇయ్యవయ్యా!’ అని కసిదీరా కడిగెయ్యాలని ఉందిరా.
ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానురా. నా అదృష్టం ఏమిటంటే ఈ లోకంలో ఇంకా భర్త అడుగుజాడల్లో నడుస్తున్న భార్యలు ఉన్నారురా. అందుకే తను కూడా ఆనందంగా ఒప్పుకుంది.’’
ఎంత వద్దనుకున్నా రాజశేఖరం కంఠం వణికింది.
నేను దుఃఖాన్ని ఆపుకోలేక,
‘’ఒరేయ్ రాజూ! ఎంతపని చేశావురా!” పైకి మాట అనలేకపోతున్నా గానీ నా మనసు మూగగా రోదిస్తోంది. వాడు నన్ను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. నన్ను మనస్ఫూర్తిగా ఎంతో కాలం తర్వాత హాయిగా ఏడవనిచ్చాడు. నాకు దుఃఖోపశమనం అయ్యాక నా కళ్ళు తుడిచాడు.
‘’మన తల్లితండ్రులు ఎంతో అదృష్టవంతులురా! మనలాంటి వాళ్ళ చేతుల్లో దేవుడిచ్చిన దేహాలకి కొడుకులుగా తలకొరివి పెట్టించుకుని దేవుడిలో ఐక్యమైపోయారు. పిల్లల్ని కనకపోతే పున్నామ నరకం పొందుతామంటారు. పరంలో ఏమో గానీ ఇహంలో అన్ని నరకాలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం కదరా!
కొడుకులుంటే తల్లితండ్రుల్ని చూడరు. కొడుకుల్లో ఒకడు చూసినా మిగతావాళ్ళు ఆ బాధ్యత మనకు తప్పింది కదా అనుకుని హాయిగా తప్పించుకుంటారు. ఈ పిచ్చి తల్లితండ్రులూ ఆ చూసే కొడుకునే నమ్ముకుని బతుకుతారు. బ్రహ్మదేవుడిలా మాత్రం పిల్లల మీద సమానమైన ప్రేమ, ఆస్తుల్లో సమానవాటాలు పిల్లలందరికీ ఇచ్చేస్తారు. కూతుళ్ళు చూడాలనుకున్నా ఆ ఇంటి కోడళ్ళు కాబట్టి వాళ్ళకి స్వాతంత్ర్యం ఉండదు. ఉన్నా సంసారాలతో వాళ్ళకి క్షణం తీరిక ఉండదు. మన గురించి ఆలోచించే అవకాశం ఉండదు.
నేను నా కూతుళ్ళని ఇద్దరినీ అడిగాను. వాళ్ళకు తల్లితండ్రులున్నారు కాబట్టి తమ మొగుళ్ళు రేపు మాకు తలకొరివి పెట్టడానికి దినకార్యాలు చేయడానికి పనికి రారట. ఖాళీ ఉంటే ఎప్పుడైనా దినకార్యం పెట్టాలనిపించినప్పుడు పెడతారట. లేకపోతే లేదట. అందుకే రా! అందుకేరా ఈ నిర్ణయం.’’ ఈసారి రాజశేఖరం నా భుజం మీద తలవాల్చి భోరుమన్నాడు.
ఎప్పటి నుండి బాధపడుతోందో కోడలు, కొంగుతో కళ్ళు తుడుచుకుని ఎర్రబడిన ముక్కు అదురుతుండగా,
’’తప్పు బాబాయ్ గారు. మీరు అలా బాధపడకూడదు. ప్లీజ్ బాధపడకండి. మీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు.మీ తరమే ఇలా ఉంటే ఇక మా తరం ఎలా వెళుతుంది? అన్న ఆలోచన నాకు ఇప్పుడే మొదలైంది. మీ ఈ కష్టాన్ని నేను.... నేను ఊహించలేకపోతున్నాను. మావయ్య గారూ! ముందు మీరే నన్ను క్షమించాలి‘’ అని మా ఇద్దరి కాళ్ళకు నమస్కరించి, స్త్రీ సహజ దుఃఖంతో కొంగులో ముఖం దాచుకుని లోపలకు పరుగెత్తింది మంజూష.
‘కన్నవాళ్ళు చనిపోయినా ఆనాటి పరిస్థితుల ప్రకారం రాగలమో లేదో తెలియదు కాబట్టి మీ మీ పార్థివ శరీరాలను మీరు మరణించిన అరగంట లోపుగా వైద్య విద్యార్థుల ప్రయోగాత్మక చదువు నిమిత్తం ఉపయోగపడేలా మెడికల్ కాలేజీకి దానం ఇచ్చుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని’ తెలియజేస్తూ రాజశేఖరం గారి కుమార్తెలు ఇద్దరూ స్వచ్ఛందగా అంగీకరిస్తూ రాసి ఇవ్వగా రిజిస్ట్రేషన్ చేసిన స్టాంప్ కాగితాలు, ఒకరినొకరం ఓదార్చుకుంటున్న మమ్మల్ని చూసి జాలిగా ఫాను గాలికి రెపరెపలాడుతూ వెక్కిరిస్తున్నాయి.
**********
అలా ఎంతసేపు ఉండిపోయామో తెలీదు. మంజూష వచ్చి -
‘‘మావయ్యా! మీరు అలా ఆంజనేయ స్వామి గుడి వరకు వెళ్లి రండి. ఈలోగా నేను మీ పక్క బట్టలు మార్చేస్తాను’’ అనడంతో చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుని ఇద్దరం గుడికి బయలుదేరాము.
‘’బాబాయ్ గారూ! ఈ కాగితాలు నా దగ్గర ఉంచుతాను. ఆయన వచ్చాక చూపించి రేపు ఇస్తాను మీకు. ఇదిగో, ఈ చల్లని మజ్జిగ తాగి వెళ్ళండి’’ అని చల్లని మజ్జిగ అందించింది.
అది తాగి ఇద్దరమూ గుడికి బయలుదేరాము.
ఎవరో తెలిసున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో చాలాసేపు ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకోవడంతో మా మనస్సులో బాధ తగ్గింది. రాత్రి ఫలహారం సమయం కావడంతో వాడిని అటు సాగనంపి ఇంటికి వచ్చేశాను నేను.
నేను లోపల అడుగుపెట్టగానే మనవరాలు చేయి పట్టుకుని బాత్రూమ్ లోకి తీసుకువెళ్ళింది. నేను కాళ్ళు కడుక్కున్నాక నా చేయి పుచ్చుకుని హాల్లోకి తీసుకువచ్చింది. నా మనుమడు నా టవలుతో కాళ్ళు తుడిచి దాన్ని పట్టుకువెళ్లి బాల్కనీలో ఆరేసి వచ్చాడు.
‘’ఈవేల్టి నుంచి మేమిద్దరం నీకు వాకింగ్ స్టిక్స్ అట తాతయ్యా! అమ్మ చెప్పింది’’ అన్నాడు నవ్వుతూ.
‘’ఇక నుంచి రోజూ మీరు ఇలా చెయ్యాలి తెలిసిందా? బయటకు వెళ్ళేటప్పుడు తాతయ్య గారికి ఏమన్నా కావాలేమో అడిగి తెచ్చి ఇచ్చాకనే మీ పనులు చూసుకోవాలి సరేనా! ఇప్పుడు వెళ్లి చదువుకోండి’’ అన్న మంజూష మాటలు విని నాలో ఏదో ఆనందం మొదలైంది.
‘’సరే మమ్మీ! ఏమైనా అవసరం అయితే పిలు తాతయ్యా!’’ అని చెప్పి వెళ్ళబోతున్న పిల్లలిద్దరి బుగ్గలు ప్రేమతో నిమిరి ముద్దాడాను.
కోడలు ఫలహారం డైనింగ్ బల్ల మీద పెట్టింది. నాకు ఫలహారం పెట్టేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయే మంజూష నా ఎదురుగా నిలబడే ఉంది. ఫలహారం చేసి చేతులు కడుక్కుని అలవాటుగా నా పడక వైపు వెళ్ళబోయాను.
‘’ఇక నుంచి పిల్లల గది మీకే స్వంతం మావయ్యా! పిల్లలు హాల్లో చదువుకుంటారు, మాతో పడుకుంటారు. రేపు మా తనువులు వెళ్ళే విధానం కూడా చూసుకోవాలని నాకు ఇప్పుడే అర్థం అయింది మావయ్యా! మీ పట్ల నా తప్పుడు ప్రవర్తనకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఇంతకన్నా ఏమీ మాట్లాడలేను మావయ్యా’’ అంది గద్గదంగా.
‘’మీరు చల్లగా ఉండాలి తల్లీ! చల్లగా ఉండాలి.’’ చెమరుస్తున్న కళ్ళతో పిల్లల గది వైపు, కాదు... కాదు. నా ప్రపంచంలోకి మళ్ళీ అడుగుపెట్టాను. గోడ మీద ఫోటోలో ఉమ నాకేసి మెరిసే కళ్ళతో చూస్తూ నవ్వుతోంది.
సమాప్తం.
***
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
చివరగా నా అభిప్రాయం :
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్




@prasadchallapalli2952
•29 minutes ago
🙏🏻 Kadha Chala Bauindi. Naku Chala Baga Nachindi. Yevaru Rasaro
@ananthanirmala3499
•3 hours ago
Good message