top of page
Original.png

గీత

 #MKKumar, #ఎంకెకుమార్, #గీత, #Geetha, #TeluguHeartTouchingStories

Geetha - New Telugu Story Written By - M K Kumar

Published in manatelugukathalu.com on 27/01/2026

గీత - తెలుగు కథ

రచన: ఎం. కె. కుమార్


హైదరాబాద్‌ మహానగరం ఆ సాయంత్రం ఒక రంగులలహరిలా ఉంది. వీకెండ్ కావడంతో ఆ ప్రముఖ షాపింగ్ మాల్‌లోకి జనం ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. 


ఎస్కలేటర్ల మీద పైకి వెళ్లేవాళ్ళు, కిందకి దిగేవాళ్ళు, చేతిలో రంగురంగుల సంచులతో నవ్వులు చిందించే జంటలు.. అంతా ఒక పండగ వాతావరణం.


ఆ సందడి మధ్యలో, మూడో అంతస్తులోని ఒక కార్నర్లో, ముఖానికి మాస్క్, తల మీద క్యాప్ పెట్టుకుని చాలా సాధారణంగా కనిపిస్తోంది శ్రావ్య. 


ఆమె వేసుకున్నది సింపుల్ జీన్స్, ఒక వదులైన కాటన్ టీ-షర్ట్. వెండితెర మీద కోట్ల మందిని ఉర్రూతలూగించే స్టార్ హీరోయిన్ ఆమె అని ఆ క్షణంలో ఎవరూ ఊహించలేరు. 


షూటింగ్ల హడావిడి, లైట్ల జిగేలు, మేకప్ పొరల బరువు నుండి కాసేపు తప్పించుకుని, తన చిన్ననాటి స్నేహితురాలితో కాఫీ తాగుతూ మనసు విప్పి మాట్లాడుకోవాలని వచ్చింది.


కానీ, విధి మరోలా తలచింది.


కాఫీ షాప్ నుండి బయటకు వస్తుండగా, ఎవరో కుర్రాడు గట్టిగా అరిచాడు.


 "అరేయ్.. అది శ్రావ్యరా!"


ఆ ఒక్క పిలుపు.. ఆ మాల్‌లోని గాలిని మార్చేసింది. నిశ్శబ్దంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగినట్లు జనం ఆమె వైపు దూసుకొచ్చారు. 


అప్పటిదాకా అక్కడ ఉన్నది మనుషులు. కానీ ఆ క్షణంలో వాళ్ళు శ్రావ్యకు మనుషుల్లా కనిపించలేదు. ఆకలితో ఉన్న వేట కుక్కల్లా అనిపించారు.


"మేడమ్ ఒక్క సెల్ఫీ.."


"మావా.. పక్కకి జరగరా.. నేను దిగుతా.."


"శ్రావ్యా.. ఇటు చూడు.."


ఫ్లాష్ లైట్ల వెలుగులు ఆమె కళ్ళను మిరుమిట్లు గొలిపేలా మెరుస్తున్నాయి. ఆమె తన స్నేహితురాలి చేయి గట్టిగా పట్టుకుంది. భయం ఆమె వెన్నులో చలిపుట్టించింది.


"ప్లీజ్.. దారి ఇవ్వండి.. వెళ్లాలి.." శ్రావ్య గొంతులో వణుకు. ఆమె ఎంత బతిమిలాడినా ఆ గుంపులో వినిపించుకునే నాథుడు లేడు.


అది కేవలం అభిమానం కాదు. అందులో ఒక వికృతమైన ఆనందం ఉంది. ఒక స్టార్ హీరోయిన్ తమ మధ్య చిక్కుకుపోయిందన్న పైశాచిక ఆనందం. తోపులాట మొదలైంది. 


ఆ తొక్కిసలాటలో చాలామంది చేతులు తమ పరిధిని దాటాయి.


ఒక చేయి ఆమె భుజం మీద పడింది. శ్రావ్య ఉలిక్కిపడింది. మరో చేయి ఆమె నడుమును తాకింది. 


ఇంకొకరు ఆమె టీ-షర్ట్ వెనుక భాగాన్ని లాగారు. 


"వదలండి.." 


అని ఆమె అరవాలని చూసింది, కానీ గొంతు పెగలలేదు. ఊపిరి ఆడటం లేదు. చుట్టూ ఉన్న మగవాళ్ళ చెమట వాసన, వాళ్ళ నోటి నుండి వస్తున్న వెకిలి నవ్వులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.


ఆమెకు ఆ క్షణంలో తాను ఒక మనిషిలా అనిపించలేదు. సంతలో పెట్టిన వస్తువులా అనిపించింది. 


ఎవరైనా వచ్చి తనను తాకవచ్చు, గిల్లి చూడవచ్చు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంది.


దూరంగా ఇద్దరు పోలీసులు నిలబడి ఉన్నారు. అంతా గమనిస్తున్నారు. ఆ మగాళ్ల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వాళ్లు కదలలేదు. 


చేతిలో లాఠీలు ఉన్నా, వాటిని నేలకేసి కొట్టలేదు. 


"హీరోయిన్ కదా.. పబ్లిక్ లోకి వస్తే ఇలాగే ఉంటుంది" అన్నట్టు ఒక నిర్లక్ష్యపు చూపు చూస్తూ నిలబడ్డారు.


ఆ నరకం ఒక పది నిమిషాల పాటు సాగింది. చివరకు మాల్ సెక్యూరిటీ, ఆమె పర్సనల్ స్టాఫ్ అతి కష్టం మీద ఆ గుంపును చీల్చుకుని ఆమెను బేస్‌మెంట్ లోని కారు వైపు లాక్కెళ్ళారు.


కారు డోర్ వేయగానే, బయటి శబ్దాలు ఆగిపోయాయి. కానీ శ్రావ్య మనసులో అలజడి ఆగలేదు. ఆమె సీట్లో ముడుచుకుపోయి కూర్చుంది. 


ఆమె శరీరం వణికిపోతోంది. కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. తన భుజం మీద, నడుము మీద ఆ మగాళ్ళ చేతులు ఇంకా పాకుతున్నట్టే అనిపిస్తోంది. 


అసహ్యంతో తన చేతులతో తన చర్మాన్ని గట్టిగా రుద్దుకుంది. ఎంత రుద్దినా ఆ మరకలు పోనట్టు, ఆ స్పర్శ తాలూకు జుగుప్స తన ఆత్మను తొలిచేస్తున్నట్టు ఆమె విలవిలలాడిపోయింది.


ఇంటికి చేరిన శ్రావ్య నేరుగా బాత్రూమ్‌లోకి వెళ్లి షవర్ కింద నిలబడింది. నీళ్లు ఆమె కన్నీళ్లతో కలిసి ప్రవహిస్తున్నాయి. 


గంట గడిచినా ఆమె బయటకు రాలేదు. ఆ నీళ్లు తన శరీరాన్ని శుభ్రం చేయగలవేమో కానీ, మనసు మీద పడిన గాయాలను మాన్పలేవని ఆమెకు 

తెలియదు.


రాత్రి అయ్యింది. లివింగ్ రూమ్‌లో టీవీ ఆన్ చేసి ఉంది. అన్ని న్యూస్ ఛానెళ్లలోనూ ఒకటే బ్రేకింగ్ న్యూస్.


"హైదరాబాద్ మాల్‌లో హీరోయిన్ శ్రావ్యపై ఆకతాయిల వీరంగం!"


హెడ్డింగ్ చూడగానే శ్రావ్య గుండె ఆగిపోయినంత పనైంది. కానీ అంతకన్నా దారుణం ఆ తర్వాత మొదలైన డిబేట్. ఒక ప్రముఖ ఛానెల్‌లో నలుగురు మగవాళ్ళు, ఒక మహిళా యాంకర్ కూర్చుని 


"తీర్పు" ఇస్తున్నారు.


ఒక విశ్లేషకుడు మైక్ అందుకున్నాడు.


 "అసలు తప్పు ఎవరిది? అంత రద్దీగా ఉండే మాల్‌కి, అంత పొట్టి బట్టలు వేసుకుని ఒక హీరోయిన్ వెళ్లడం ఎంతవరకు కరెక్ట్? మన సంస్కృతిని మర్చిపోతే ఇలాగే జరుగుతుంది."


శ్రావ్య ఆ మాట విని షాక్ తిన్నది. తను వేసుకున్నది జీన్స్, టీ-షర్ట్. అది పొట్టి బట్టలా?


మరొకరు అందుకున్నారు.


 "అవునండి.. సెలబ్రిటీలు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ లాంటి వాళ్ళు. జనంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో పోలీసులను తప్పుబట్టలేం. అభిమానం తట్టుకోలేక జనం ఎగబడ్డారు అంతే."


అభిమానమా? అది అభిమానమా? తన నడుమును గిల్లితే, తన బట్టలు లాగితే అది అభిమానమా? శ్రావ్యకు పిచ్చెక్కినట్టు అనిపించింది. 


సోఫాలో కూర్చుని ఆ మాటలు వింటుంటే, ఆ మాల్‌లో జరిగిన దాడి కన్నా, ఈ మాటల దాడి ఆమెను మరింత క్రూరంగా హింసిస్తోంది.


"తప్పు నాదేనా?" శ్రావ్య కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి.


 "నేను బయటికి వెళ్లడమే తప్పా? నా శరీరం మీద నాకే హక్కు లేదా?"


ఆమె పక్కనే సోఫాలో కూర్చుని, ఒక పుస్తకం చదువుతున్న ఆమె నాయనమ్మ 'సులోచన' గారు నిదానంగా రిమోట్ తీసుకుని టీవీ కట్టేశారు. ఆ గదిలో నిశ్శబ్దం ఆవహించింది.


సులోచన గారు సామాన్య మహిళ కాదు. యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 


70 ఏళ్ల వయసులోనూ ఆమె కళ్ళలో ఒక తీక్షణత, గొంతులో ఒక గాంభీర్యం ఉంటాయి.


శ్రావ్య చిన్నపిల్లలా బామ్మ ఒడిలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. 


"బామ్మా.. విన్నావా వాళ్ళు ఏమంటున్నారో? నా బట్టలదే తప్పు అంట. నేను మర్యాదగా లేనంట. అందుకే వాళ్ళు అలా చేశారంట. నిజమేనా బామ్మా?"


సులోచన గారు శ్రావ్య తల నిమురుతూ, చాలాసేపు మౌనంగా ఉన్నారు. ఆ మౌనంలో బాధ ఉంది, కానీ అంతకంటే ఎక్కువ కోపం ఉంది.


"పిచ్చిదానా.." సులోచన గారి గొంతు గంభీరంగా పలికింది. 


"కన్నీళ్లు తుడుచుకో శ్రావ్యా. ఈ గొడవ నీ బట్టల గురించి కాదు. అసలు నీ గురించి కూడా కాదు. ఇది వాళ్ల 'చూపు' గురించి. తరతరాలుగా ఈ దేశపు మగవాళ్ళు స్త్రీల మీద చెలాయిస్తున్న ఆధిపత్యం గురించి."


శ్రావ్య తల పైకెత్తి, అర్థం కానట్టు చూసింది. "అంటే?"


"శ్రావ్యా.. నీకు చరిత్ర తెలియాలి. నీ మీద జరిగింది ఒక ఆకస్మిక దాడి కాదు. దీని వెనుక వందల ఏళ్ల పితృస్వామ్య చరిత్ర దాగుంది," అంటూ సులోచన గారు ఆమె కళ్ళలోకి సూటిగా చూశారు.


"ఒకప్పుడు ఈ దేశంలో స్త్రీలను రెండు రకాలుగా విభజించారు. ఒకరు 'కుటుంబ స్త్రీలు' - అంటే ఇంటి గడప దాటని వాళ్ళు, భర్త చాటున, పిల్లలతో, వంటగదిలో బతికేవాళ్ళు. వీరిని సమాజం 'మర్యాదస్తులు'గా, పతివ్రతలుగా నెత్తిమీద పెట్టుకుంది.


రెండవ రకం స్త్రీలు ఉన్నారు.. వాళ్ళు కళావంతులు, దేవదాసీలు, భోగం వాళ్ళు, తవాయిఫ్‌లు. వీళ్ళు సామాన్యులు కాదు శ్రావ్యా. నృత్యం, సంగీతం, సాహిత్యం వీరి సొత్తు. వీళ్ళు ఎవరికీ భార్యలు కాదు, ఎవరికీ బానిసలు కాదు. 


రాజుల్ని, జమీందార్లని తమ కళతో మెప్పించి, ప్రతిఫలంగా భూములు, ఆస్తులు సంపాదించి, మగవాడి నీడ లేకుండా స్వతంత్రంగా బతికేవాళ్ళు."


శ్రావ్య ఆశ్చర్యంగా వింటోంది. తన బామ్మ ఏదో పురాణాల కథ చెప్తున్నట్టు లేదు, తన జీవితానికి లింక్ ఉన్న నిజాన్ని వెలికితీస్తున్నట్టు ఉంది.


"కానీ.." సులోచన గారు కొనసాగించారు. 


"బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చాక, వారి విక్టోరియన్ నీతులు మన నెత్తి మీద రుద్దారు. ఒక ఆడది, మగవాడి అండ లేకుండా, స్వతంత్రంగా, ఆస్తిపాస్తులతో బతకడం ఆ తెల్లవాడికి, వాడికి వంత పాడిన మన మగవాడికి నచ్చలేదు. అందుకే ఆ కళాకారిణుల మీద 'అమర్యాదస్తులు' అని, 'వేశ్యలు' అని ముద్ర వేశారు. 19వ శతాబ్దంలో చట్టాలు తెచ్చి వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు. వాళ్ళను సమాజం నుండి వెలేశారు."


సులోచన గారి గొంతులో ఆవేదన కట్టలు తెంచుకుంది.


 "అక్కడితో ఆగలేదు శ్రావ్యా. వీరేశలింగం లాంటి సంస్కర్తలు కూడా దేవదాసీ వ్యవస్థలోని దురాచారాలను వ్యతిరేకించే క్రమంలో, ఆ స్త్రీల స్వతంత్రతను, కళను కూడా తక్కువ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ కళావంతుల దగ్గర ఉన్న నృత్యాన్ని, సంగీతాన్ని ఈ 'మర్యాదస్తులైన' అగ్రవర్ణాల మగవాళ్ళు దొంగిలించారు. 


అందులోని శృంగారాన్ని తీసేసి, దానికి 'భక్తి' రంగు పూసి, దాన్ని 'భరతనాట్యం'గా మార్చి తమ ఇళ్లలోని ఆడపిల్లలకు నేర్పించారు. కానీ అసలైన ఆ కళాకారిణులను మాత్రం రోడ్డు మీద పడేశారు. బతకడానికి వేరే దారి లేక వాళ్ళు రికార్డింగ్ డాన్సులు చేసేవాళ్ళుగా, సెక్స్ వర్కర్లుగా మారిపోయారు."


శ్రావ్య గుండె బరువుగా మారింది. 


"బామ్మా.. ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావ్?"


"ఎందుకంటే శ్రావ్యా.. ఆనాడు గీసిన ఆ గీత ఇంకా చెరిగిపోలేదు కాబట్టి!" సులోచన గారు ఆవేశంగా అన్నారు.


"కుటుంబంలో ఉండే స్త్రీ 'పవిత్రురాలు'. ఆమెను ఎవరూ తాకకూడదు. కానీ బయట కళను 

ప్రదర్శించే స్త్రీ, అంటే నీలాంటి నటి.. వాళ్ళ దృష్టిలో 

'అపవిత్రురాలు'. ఆమె శరీరం అందరిదీ అనే భావన మగవాళ్ల రక్తంలోకి ఎక్కించారు. సినిమాలు వచ్చాక ఈ ద్వంద్వ నీతి ఇంకా పెరిగింది. తెర మీద మీరు గ్లామరస్‌గా కనిపించాలి. వాళ్ళ కళ్ళకు విందు చేయాలి. కానీ బయట మాత్రం మీరు సావిత్రిలా, సీతలా ముసుగు వేసుకుని తిరగాలి."


సులోచన గారు శ్రావ్య చేతిని గట్టిగా పట్టుకున్నారు.


"ఎప్పుడైతే ఒక ఆడది కుటుంబం అనే గొడుగు లేకుండా, మగ తోడు లేకుండా బయట స్వతంత్రంగా తిరుగుతుందో.. అప్పుడు మన మగ సమాజం ఆమెను 'పబ్లిక్ ప్రాపర్టీ' (అందరికీ చెందిన వస్తువు)గా చూస్తుంది. 'ఈమె సినిమా యాక్టర్ కదా, ఈమెకు సిగ్గు ఎందుకు? ఈమెను ఎవరైనా తాకవచ్చు' అనే ఆ జుగుప్సాకరమైన ఆలోచనే నిన్న ఆ మాల్‌లో నీ మీద దాడి చేసింది. వాళ్ళు చూసింది శ్రావ్య అనే అమ్మాయిని కాదు.. వాళ్ళకు అందుబాటులో ఉన్న ఒక వస్తువుని."


"అక్కడున్న పోలీసులు ఎందుకు స్పందించలేదో తెలుసా? వాళ్ళు కూడా ఇదే సమాజంలో భాగం కాబట్టి. 'సినిమా వాళ్లకు ఇవన్నీ మామూలే కదా, వాళ్ళు ఇలాంటి బట్టలే వేసుకుంటారు కదా' అనే నిర్లక్ష్యం వాళ్లది. హోలీ పండుగ నాడు జరిగే అల్లర్లయినా, బెంగళూరులో జరిగే వేధింపులయినా.. మూలం ఒక్కటే. 'బయట తిరిగే ఆడది మా సొత్తు' అనే అహంకారం."


ఆ రాత్రి శ్రావ్యకు నిద్ర రాలేదు. బామ్మ చెప్పిన చరిత్ర ఆమె కళ్ళ ముందు కదలాడింది. 


తను కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక చారిత్రక అన్యాయానికి కొనసాగింపు అని అర్థమైంది.


బెంగళూరు నాగరత్నమ్మ వంటి వీరనారులు ఆనాడు బ్రిటిష్ చట్టాలను ఎదిరించారని బామ్మ చెప్పింది. 


ముద్దు పళని రాసిన 'రాధికా సాంత్వనం' అనే శృంగార కావ్యాన్ని మగవాళ్ళు అడ్డుకుంటే, దాన్ని తిరగరాసిన మహిళల గురించి చెప్పింది. జయప్రభ గారు "పైటను తగలేద్దాం" అని మగచూపును నిలదీసిన వైనం గురించి చెప్పింది.


శ్రావ్య మంచం మీద నుంచి లేచి అద్దం ముందు నిలబడింది. తన ప్రతిబింబాన్ని చూసుకుంది. 


ఇప్పటిదాకా తనను తాను నిందించుకుంది. "నేను ఎందుకు వెళ్లాను? నేనెందుకు ఆ డ్రెస్ వేసుకున్నాను?" అని మదనపడింది.


కానీ ఇప్పుడు ఆమె కళ్ళలో పశ్చాత్తాపం లేదు. ఒక రకమైన అగ్ని రాజుకుంది.


"నేను ఎందుకు భయపడాలి? ఎందుకు దాక్కోవాలి?" అని శ్రావ్య గట్టిగా ప్రశ్నించుకుంది.


టీవీలో ఆ నలుగురు మగవాళ్ళు తన బట్టల గురించి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. అది కేవలం బట్టల గురించి కాదు, నియంత్రణ గురించి. 


"నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే కట్టుకోవాలి, మేము గీసిన గీతలోనే నువ్వు బతకాలి" అని శాసించే పితృస్వామ్య అహంకారం అది.


ఆర్థిక స్వేచ్ఛ, పేరు, ప్రతిష్టలు ఉన్న తనలాంటి స్త్రీలనే వాళ్ళు ఇలా నియంత్రించాలని చూస్తుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?


శ్రావ్య ఫోన్ తీసింది. పీఆర్ టీమ్‌కి మెసేజ్ పెట్టింది. 


"రేపు ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్. అందరినీ పిలవండి."


మరుసటి రోజు ఉదయం. ప్రెస్ క్లబ్ హాల్ కిక్కిరిసిపోయింది. శ్రావ్య ఏం మాట్లాడుతుందో, ఎవరిని నిందిస్తుందో అని మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


శ్రావ్య వేదిక మీదకు వచ్చింది. ఆమె వెనుక ఎలాంటి రాజకీయ నాయకులు లేరు, బౌన్సర్లు లేరు. కేవలం ఒక పక్క కుర్చీలో ఆమె బామ్మ సులోచన గారు కూర్చున్నారు. 


శ్రావ్య చాలా హుందాగా, ఒక కాటన్ చీర కట్టుకుని వచ్చింది. ఆమె కళ్ళలో నిన్నటి భయం లేదు. ఒక రకమైన తెగువ, స్పష్టత ఉన్నాయి.


మైక్ అందుకుంది. కెమెరాల ఫ్లాష్ లైట్లు ఒక్కసారిగా మెరిశాయి. ఆ వెలుగులు ఆమెకు నిన్నటి మాల్ ఘటనను గుర్తు చేశాయి. 


ఒక్క క్షణం గుండె వేగం పెరిగింది. కానీ బామ్మ వైపు చూసింది. సులోచన గారు కళ్ళతోనే ధైర్యం చెప్పారు.


శ్రావ్య గొంతు సవరించుకుని మాట్లాడటం మొదలుపెట్టింది.


"నమస్కారం. నిన్న మాల్‌లో జరిగిన సంఘటన గురించి మీరందరూ మాట్లాడుతున్నారు. న్యూస్ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో చాలామంది నా బట్టల గురించి విశ్లేషణలు చేశారు. పొట్టి బట్టలు వేసుకుంటే ఇలాగే జరుగుతుందని తీర్పులు ఇచ్చారు. వారికి నేను చెప్పేది ఒక్కటే.."


శ్రావ్య ఒక్క క్షణం ఆగి, సూటిగా కెమెరాలోకి చూసింది. ఆమె గొంతు గంభీరంగా మారింది.


"ఈ గొడవ నా దుస్తుల గురించి కాదు. ఇది మీ చూపు గురించి."


హాల్‌ మొత్తం నిశ్శబ్దం ఆవహించింది.


"నేను తెర మీద ఏం వేసుకున్నా, ఏ పాత్ర పోషించినా.. అది నా వృత్తి. ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌లో కోట్ వేసుకున్నట్టే, నేను పాత్రకు తగ్గ బట్టలు వేసుకుంటాను. అంతమాత్రాన నా నిజజీవితంలో నా శరీరం మీద మీకు హక్కు రాదు. స్క్రీన్ మీద నన్ను చూసి చప్పట్లు కొట్టే చేతులే, బయట నన్ను అభ్యంతరకరంగా తాకడానికి వస్తే.. అది అభిమానం కాదు. అది మీ సంస్కార హీనత. నన్ను 'పబ్లిక్ ప్రాపర్టీ'గా చూసే మీ కళ్ళలో లోపం ఉంది."


ఆమె గొంతులో ఆవేశం పెరిగింది.


"స్వతంత్రంగా, సంపాదిస్తూ, తన కాళ్ళ మీద తాను నిలబడే ఆడదంటే ఈ సమాజానికి ఎందుకంత భయం? మేం మీ ఆధీనంలో లేము కాబట్టి, మమ్మల్ని 'అమర్యాదస్తులు' అని ముద్ర వేసి, వేధించి, మళ్ళీ మీ దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఇది 19వ శతాబ్దం కాదు. బ్రిటిష్ కాలం కాదు. మేం దేవదాసీలం కాదు, మీరు జమీందార్లు కాదు. నా శరీరం నాది. నా ఆత్మగౌరవం నాది."


పోలీసుల వైపు పరోక్షంగా చురకలు వేస్తూ..


"అక్కడ పోలీసులు ఉన్నారు. నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా ఎందుకు కేసు పెట్టలేదు? అనుమతి లేకుండా ఒక స్త్రీని తాకడం నేరం అని వాళ్లకు తెలియదా? లేక 'హీరోయిన్లే కదా, పర్లేదులే' అనే చులకన భావమా? ఇదేనా స్త్రీలకు మీరు ఇచ్చే రక్షణ?"


చివరగా, తోటి మహిళలను ఉద్దేశించి ఆమె చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.


"నన్ను, నా తోటి నటీమణులను, బయట ఉద్యోగాలు చేసుకునే ప్రతి మహిళను నేను కోరేది ఒక్కటే.. మనల్ని మనం 'పోలీసింగ్' చేసుకోవడం ఆపేద్దాం. 'ఇలా వెళ్తే ఏమనుకుంటారో, ఇది వేసుకుంటే ఏమంటారో' అనే భయం వద్దు. తప్పు మన బట్టల్లో లేదు, వాళ్ళ బుర్రల్లో ఉంది. మన కళ, మన స్వేచ్ఛ మన హక్కు. మగవాళ్ళు గీసిన 'మర్యాద' గీతల్లో బందీలం కావాల్సిన అవసరం మనకు లేదు. ఇకపై నా మీద చేయి వేస్తే.. అది అభిమానం అనుకోను, దాడిగానే భావిస్తాను. చట్టపరంగా వెళ్తాను. నా గొంతును నొక్కలేరు, నా నడకను ఆపలేరు."


శ్రావ్య ప్రెస్ మీట్ ఒక సంచలనం సృష్టించింది. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి.


#ItIsAboutTheGaze (ఇది చూపుకు సంబంధించిన విషయం) అనే హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ఎందరో మహిళలు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు శ్రావ్యకు మద్దతుగా నిలిచారు.


ఆకతాయిల మీద చర్యలు తీసుకోమని పోలీసులపై ఒత్తిడి పెరిగింది. టీవీల్లో నీతులు చెప్పిన మగ విశ్లేషకుల నోళ్లు మూతపడ్డాయి.


ఆ సాయంత్రం, శ్రావ్య, సులోచన గారు ఇంటి బాల్కనీలో కూర్చుని టీ తాగుతున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, కానీ శ్రావ్య ముఖంలో మాత్రం కొత్త వెలుగు ఉంది.


"బామ్మా.. ఇవాళ నేను మాట్లాడింది నేనేనా అని నాకే ఆశ్చర్యంగా ఉంది," అంది శ్రావ్య చిన్న నవ్వుతో.


 "నిజం చెప్పాలంటే కాళ్లు వణికాయి బామ్మా."


సులోచన గారు గర్వంగా శ్రావ్య చేతిని పట్టుకున్నారు.


 "నువ్వు మాట్లాడింది కేవలం నీ కోసం కాదు శ్రావ్యా.. తరతరాలుగా అవమానాలకు గురైన ఆ కళాకారిణులందరి తరపున మాట్లాడావు. వాళ్ళు గీసిన బానిసత్వపు గీతను ఇవాళ నువ్వు చెరిపేశావు."


శ్రావ్య ఆకాశం వైపు చూసింది. అక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి. అవి ఆమెకు ఇప్పుడు అలంకారాల్లా లేవు, ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే అగ్ని కణాల్లా కనిపించాయి. 


ఆమెకు అర్థమైంది.. పోరాటం ఇంకా ముగియలేదు. కానీ కనీసం గొంతు విప్పగలిగానన్న తృప్తి ఆమెలో ఒక కొత్త శక్తిని నింపింది.


ఆడది బొమ్మ కాదు, అమ్మ మాత్రమే కాదు.. ఒక 'వ్యక్తి' అని ఈ లోకానికి చాటిచెప్పే దిశగా.. శ్రావ్య ప్రయాణం అప్పుడే మొదలైంది.

సమాప్తం


ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page