top of page
Original.png

గీతార్థము

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #గీతార్థము, #నాదేశము

గాయత్రి గారి కవితలు పార్ట్ 44

Geetharthamu - Gayathri Gari Kavithalu Part 44 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 05/11/2025

గీతార్థము - గాయత్రి గారి కవితలు పార్ట్ 44 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


గీతార్థము

(ఇష్టపది)

***********************


ఫలితంబుకై నీవు పాకులాడకు పార్థ!

విలువైన విషయాలు వినుము నింపాదిగా!


సత్వగుణ సంపదను సాధించు విజయుడా!

తత్త్వార్థమే నీకు దారిచూపించుగా!


దేహంబు నిలువదే!తిరుగునీ కాలమున!

మోహమను మసటులో మునిగిపోకు కిరీటి!


చిరుగు వస్త్రంబు వలె జీర్ణమౌ దేహమును 

మురిసి పెంచకు నీవు ముక్తికై తపియించు!


నేను నేనను మాట నిజముకాదు సఖుడా!

కాని పనులను చేయు కష్టంబు నీకేల?


జపతపారాధనము శాంతినిడు ఫల్గుణా!

కపటంబు విడనాడ కలుగు సౌభాగ్యములు.


 దైవమును జేరగా దర్శించు నాత్మలో!

జీవనంబు సాగు సఖ! చింతతొలగింపగా!


పార్థ!నీ ప్రశ్నలకు బదులు తెల్పితినోయి!

వ్యర్థముగ శోచించి బాధపడ వలదోయి!//


************************************
















నా దేశము

(ఇష్టపది.)

************************************

భరతదేశమనగా వసుధకే పూజగది.

ధరణికే నేర్పించు ధర్మశాస్త్రపు నియతి.


కళల కాణాచియై కాలమందున నిలిచి

విలువైన వేదాలు విశ్వానికే తెలుపు.


ఘనమైన శిల్పాలు కమనీయ చిత్రములు

మునుపెన్నడో వెలసె పుణ్యమౌ క్షేత్రాలు.


భవ్యమౌ యాధ్యాత్మ భావనల ముంచెత్తి

దివ్యత్వమున సాగు తీర్థంబులిట కలవు.


బహు భాషలను పలుకు ప్రజలకే నిలయమిది.

సహనంబుతో నడచు సాధువుల స్థానమిది.


ఐకమత్యంబుతో నలరారు జాతియిది.

ప్రాకటముగా వెలుగు ప్రాగ్దిశాదేశమిది.


వీర సైనిక ధైర్య విన్యాసములు గాంచి

పారిపోవును వైర పాషండతతి బెదరి.


నీతినియమాలతో నెమ్మదిని చరియించు

జాతిపౌరుల తోడ సౌఖ్యముల వర్థిల్లి,


వివిధ రంగాలలో విజ్ఞాన మందించు

యువత మన సంపదగ నున్నతిని సాధింప,


భారతీయ మహిళల ప్రాజ్ఞతను గమనించి

నీరాజనము చేసి నిల్చు పలుదేశములు.


చాటి చెప్పుచు సీమ సార్వభౌమత్వమును

దీటుగా నిల్చునీ దేశంబు కీర్తితో.


మాతృభూమికి మ్రొక్కి మమతతో మెల్గుచూ

జాతికై తపియించ జయము కల్గును మనకు.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page