top of page
Original.png

గ్రాండ్ పార్టీ

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #GrandParty, #పార్టీ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

ree

Grand Party - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 10/10/2025

గ్రాండ్ పార్టీ - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"రా చెల్లి.. ! చాలా రోజులకి వచ్చావే.. మా అబ్బాయి పెళ్ళికి ఎందుకు రాలేదే" అడిగింది జానకి.

 

"ఏం చేస్తాం అక్కా.. ! మా ఆయనకి మూడ్ వచ్చినప్పుడే అన్నీ చేయించుకోవాలి.. లేకపోతె మళ్ళీ ఆఫర్ ఇవ్వరు" అంది జయ.

 

"ఏమిటో ఆ ఆఫర్?"


"ఏముంటాయి.. మీ అబ్బాయి పెళ్ళిరోజుకు ముందురోజు మా ఆయనకి నాకు చీరలు, నగలు కొనడానికి మూడ్ వచ్చింది. అప్పుడు 'నో' అంటే కష్టమని, షాపింగ్ మొదలుపెట్టాను. అప్పుడు మొదలుపెట్టిన షాపింగ్ నిన్న ముగిసింది. అందుకే పెళ్ళికి రాలేదు.. ఇప్పుడు వెంటనే వచ్చానుగా"


"ఏవి నువ్వు కొన్నవి.. ?"


"ఇదిగో.. కట్టుకున్న చీర, నగలు ఇవే.. ఇంట్లో ఇంకా ఉన్నాయి. నువ్వు గ్రాండ్ పార్టీ ఏమైనా ఇస్తే, అన్నీ పెట్టుకుని సందడి చేస్తాను"


"చాలా బాగున్నాయి.. ! షాపింగ్ వల్ల లేట్ అవడం కామన్.. ఏం చేస్తాం? అందుకే నిన్ను క్షమించేసాను. వేరే కారణమైతే, వూరుకునేదానిని కాదు. పోనీలే ఇప్పుడైనా వచ్చావు"

"నీ గురించి నాకు తెలియదా అక్కా! ఎందుకు అంత దిగులుగా ఉన్నావు?.. నీ ముఖంలో మునుపు కళే లేదు.. పట్టుచీర కట్టలేదు, నగ పెట్టలేదు.. ఏమైంది?"


"ఏం లేదే.. "


"పెళ్ళి విశేషాలు చెబుతావని నేనొస్తే.. "


"చెబుతాను.. నువ్వు కాకపోతే నాకు సలహా ఎవరిస్తారు చెప్పు. అబ్బాయి పెళ్ళి వెంటనే చేయాల్సి వచ్చింది. ఆ ఫ్యాన్ కేసి చూడు, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాము" అంది జానకి 


*******

సీన్ లో జానకి, తన కొడుకు.. 


"అమ్మా.. ! నేను ఒక అమ్మాయిని ప్రేమించాను"


"అమ్మాయి ఎవరో?"


"ఆమె తనుజ.. నాకు బాగా నచ్చింది.. మేము పెళ్ళి చేసుకుంటాం"


"అమ్మాయి ఎలాంటిదో తెలియకుండా ఎలా పెళ్ళి చేసేది?"


"ఆ అమ్మాయి మనకు వద్దురా.. నిన్ను అమాయకుడను చేసింది. ఆమెకు ఇంతకుముందు అవేవో బ్రేక్ అప్స్ ఉన్నాయంట"


"ఇప్పుడు ఆ అమ్మాయి మారిపోయింది.. ఆ అమ్మాయితో పెళ్ళి చేయకపోతే, నేను చచ్చిపోతాను"


"ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేస్తే, నిన్ను చంపినా చంపేస్తుంది.. ఎన్ని సీరియల్స్ లో చూడలేదు నేను. పైగా నువ్వు నోట్లో నాలుక లేనట్టుగా ఉంటావు"


"నేను నీ మాట వినేదే లేదు.. "


"మీ నాన్నే ఉంటె నీకు సర్ది చెప్పేవారు.. ఏం చేస్తాం? ఆయన నన్ను వదిలి ఎక్కడికో పోయారు.. ఇప్పుడు నువ్వూ వెళ్ళిపోతే, నేను తట్టుకోలేను. సరేలే.. పెళ్ళి చేస్తాను"


పెళ్ళి బాగా జరిగింది.. 


"అమ్మాయి తనుజా! మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో.. ఏం చెయ్యకు"


"అలా అంటారేమిటి అత్తయ్యా.. నేనేం చేస్తాను.. కొరుక్కు తింటానా?"


"అమ్మా.. ! తనుజ హనీమూన్ కోసమని టికెట్స్ బుక్ చేసింది.. మేం వెళ్తున్నాం.. ఆశీర్వదించు"


"హనీమూన్ కోసం అంత దూరమా? "


"అవసరం అత్తయ్యగారు.. నాకు అక్కడ చాలా పనుంది"


'ప్రాణాలతో తిరిగి రా నాయనా.. !' అని కొడుకుని మనసులోనే ఆశీర్వదించింది జానకి 


*******


"అయితే అబ్బాయి ఊరు వెళ్ళాడనా ఈ దిగులుకు కారణము.. ?" అడిగింది జయ.

 

"అవునే.. అలా జాలీగా ట్రిప్ కోసం ఒక పది రోజులు వెళ్ళాడు.. కొత్త పెళ్ళాంతో"


"అయితే సంతోషంగా ఉండొచ్చు కదా"


"వెళ్ళినవాడు అక్కడ ఎలా ఉన్నాడో.. క్షేమంగా ఉన్నాడో లేదో అనే నా భయమంతా"


"అవునేలే.. రోజులు అసలే బాగోలేవు.. యుద్దానికి వెళ్ళినా తిరిగి వస్తారు గానీ, ఇలా ట్రిప్ కి వెళ్ళిన వారు తెలియట్లేదు. పైగా నువ్వు ఎప్పుడూ ఆ దిక్కుమాలిన సీరియల్స్, క్రైమ్ న్యూస్ చూస్తావు కదా.. నీకు ఇంకా దిగిలు ఎక్కువే మరి" అంది జయ.

 

"వాడికి అసలే నోట్లో నాలుక లేదు.. ఎలా ఉంటాడో అక్కడ"

 

"ఒక గన్ ఇచ్చి పంపించాల్సింది.. నీకూ ధైర్యంగా ఉండేది"


"సీరియల్స్ లో అయితే, వాళ్ళకు గన్ ఆటోమేటిక్ గా ఉంటుంది.. సొరుగు ఓపెన్ చేస్తే చాలు, గన్ ఉంటుంది. ఇక్కడ గన్ అమ్మేవారు ఎవరు నాకు తెలియదు. లేకపోతేనా.. ఒక పెద్దది ఇచ్చేవాడిని.. 'కోడలే శత్రువు' సీరియల్ లో తల్లి కొడుకుకి ఇచ్చినట్టుగా"


"ఇప్పుడు చేసేది ఏముంది చెప్పు.. వెయిట్ చెయ్యడమే. ఆ దేవుని పూజించు అంతే.. వీలైతే మొక్కుకో"


"నిజమే.. 'రోజుకో మొక్కు' సీరియల్ లోలాగా మొక్కుకుంటే సరి" అంది జానకి. 


మర్నాడు కొడుకు దగ్గర నుంచి ఫోన్.. 


"అమ్మా.. ! తనుజ నా మీద చాలా కోపంగా ఉందే.. నాకు భయమేస్తోంది" అంటూ కొడుకు ఫోన్.

 

"ఏమైంది?"

"ఏమో.. తెలియదు. ఇక్కడ కొండపైన సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఇద్దరమూ ఇక్కడే ఉన్నాము" అంటుండగా ఫోన్ సిగ్నల్ కట్ అయింది.


జానకికి ఇక నిద్ర పట్టలేదు. ఊరిలో కనిపించిన ప్రతి గుడికి వెళ్లి మొక్కేసుకుంది. కొడుకు క్షేమంగా తిరిగి వస్తే, కోడలికి వడ్డాణం కొనిస్తానని, లేకపోతె కోడలినే బలిస్తానని మొక్కేసుకుంది. 


నాలుగు రోజులు పోయాకా.. ఇంటి కాలింగ్ బెల్ మోగింది. 


"అత్తయ్యా.. ! నేను వచ్చేసాను"


"మా అబ్బాయి మీద కోపంగా ఉన్నావంట.. ఎందుకు? అబ్బాయి ఏడి? ఏం చేసావ్?"


"అదా.. ఐస్ క్రీం కొనమంటే కొనలేదు.. అందుకే.. "


"ఇంతకీ వాడెక్కడ?"


"మీ అబ్బాయి పని అయిపోయాకా.. "


"ఏంటి పోయాకా.. ? ఏం చేసావ్?"


అప్పటికే అలసిపోయిన తనుజ.. వినిపించుకోకుండా, సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్లి పడుకుంది. 


జానకికి మనసులో ఏవో అనుమానాలు. వడ్డాణం కొనాలా.. లేకపోతే పదునైనా ఒక పెద్ద కత్తి కొనాలా తనకి అర్ధం కావట్లేదు. రాత్రంతా అటూ ఇటూ తిరుగుతూ అదే ఆలోచన. 


మొత్తానికి మర్నాడు అబ్బాయి వచ్చేసాడు. 


"వచ్చావా నాయనా.. !" అంటూ ఆనందభాష్పాలతో అడిగింది జానకి.

 

"ఎందుకు అంత టెన్షన్ అమ్మా నీకు"


"ఎందుకంటావేమిటి ? మొన్న క్రైమ్ న్యూస్ లో.. ఎదురింటి పంకజం కొడుకు, పక్కింటి నీలిమ కొడుకు.. పెళ్ళాలతో హనీమూన్ కెళ్ళి, ఇంతవరకు తిరిగి రాలేదు. ఇంకా ఇద్దరి కోసం పోలిసులు వెతుకుతూనే ఉన్నారు.. అందుకే"


"మీ కోడలు చాలా మంచిదే అమ్మా.. ! నువ్వు సీరియల్స్, క్రైమ్ న్యూస్ చూడడం తగ్గిస్తే మంచిది"


"అబ్బాయి క్షేమంగా వచ్చాడు.. పార్టీ కావాలి" అని చెవులో అంది జయ.


'సరే' అనట్టుగా చిన్నగా నవ్వింది జానకి. 


************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments


bottom of page