హిట్లర్
- Pamarthi Vira Venkata Sathyanarayana
- May 25
- 7 min read
#Thirumalasri, #తిరుమలశ్రీ, #Hitler, #హిట్లర్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

Hitler - New Telugu Story Written By Thirumalasri
Published In manatelugukathalu.com On 25/05/2025
హిట్లర్ - తెలుగు కథ
రచన: తిరుమలశ్రీ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మీసాలనాయుడికి డెబ్బయ్యేళ్ళుంటాయి. పాతికేళ్ళ యువకుడిలా చలాకీగా ఉంటాడు. ఎక్స్-సర్వీస్ మేన్. సన్నగా, పొడవుగా ఉంటాడు. బిరుసైన పెద్దపెద్ద కోరమీసాలు. పేరునుబట్టి మీసాలు పెంచాడో, మీసాలను బట్టి ఆ పేరు వచ్చిందో తెలియదుగానీ… ఒకప్పటి శాండల్ వుడ్ డెకాయిట్ వీరప్పన్ తిరిగివచ్చాడేమోనని, చూసినవాళ్ళు జడుసుకున్నా ఆశ్చర్యపోనవసరంలేదు.
ఒంటిపైన వెలసిపోయిన మిలిటరీ యూనిఫామ్, చేతిలో ఓ పాత గన్– అతని ట్రేడ్ మార్క్స్. జీవితమంతా తనకు తోడు-నీడగా ఉన్న ఆ రెండిటినీ వదలలేనని అడక్కుండానే చెబుతుంటాడు.
మీసాలనాయుణ్ణి అహర్నిశలూ అంటిపెట్టుకుని ఉంటుంది ఓ ముసలి ఆల్సేషియన్. ఇంచుమించు పన్నెండేళ్ళుంటాయి. దానికి నాయుడు పెట్టుకున్న ముద్దుపేరు– హిట్లర్.
మిలిటరీ లైఫ్ లో అలవాటైన డ్రింకింగ్ హ్యాబిట్ నాయుణ్ణి రిటైర్మెంట్ తరువాత కూడా అంటిపెట్టుకుని వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యమల్లా, ఆ సెషన్స్ లో హిట్లర్ అతనికి కంపెనీ ఇవ్వడమే!
హిట్లర్ తోడు రాగా, రోజూ ఉదయం మోణింగ్ వాక్ కీ, సాయంత్రం పార్క్ కీ వెళ్ళడం నాయుడికి అలవాటు. మొదట్లో నాయుడి మీసాలను, యూనిఫామ్ నీ, చేతిలో గన్ నీ, పక్కనున్న శునకాన్నీ చూసి పిల్లలు, పెద్దలూ జడుసుకున్నా… క్రమంగా అతను చెప్పే మిలిటరీ విశేషాలు, అనుభవాలూ ఆసక్తి కలిగించడంతో అతనికి అభిమానులు అయిపోయారంతా.
అలాగే, హిట్లరూ– ఓ పెద్ద హిట్! యజమానిలాగే ముసలిదైనా హుషారుగా తిరిగేది, పరుగులు పెట్టేది. తోక ఆడించుతూ పిల్లలనూ, పెద్దలనూ పలుకరించేది. దాని తల నిమురుతూ ప్యాట్ చేసేవారంతా. బిస్కెట్లు వేసేవారు. అక్కడికి వచ్చే ఇతర శునకాలు దాని ఆకారం చూసి భయపడినా, హిట్లర్ వాటితో స్నేహం చేసుకుని, ఆప్యాయంగా వాటి శరీరాలను నాకేది. దాంతో భయం పోయి, అనతికాలంలోనే దానికి ఫ్యాన్స్ అయిపోయాయి అవి. మనుషులంతా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటుంటే, కుక్కలన్నీ హిట్లర్ తో కలసి క్యాచింగ్ గేమ్ ఆడేవి.
మీసాలనాయుడిది లేట్ మ్యారేజ్. భార్య ఆండాళ్ళు అరవపిల్లయినా తెలుగు బాగా మాట్లాడుతుంది. వయసులో పదేళ్ళ వ్యత్యాసం ఉంది ఇద్దరికీను. ఆర్మీలో తన కొలీగూ, మిత్రుడూనైన ఆర్ముగం యొక్క చెల్లెలు ఆమె.
ఆండాళ్ళు ఆకారం చిన్నదేకాని, నోరు పెద్దది. చిన్నప్పుడే ‘వాయాడి’ అని ‘బిరుదు’ తెచ్చుకుంది. అరవంలో ‘వాయాడి’ అంటే ‘వాగుడుకాయ, గయ్యాళి’ అని అర్థం. అంతకంటే ఎక్కువే ఆమె. భర్తమీద ప్రేమాభిమానాలు మెండుగానే ఉన్నా, కోపంకూడా ముక్కుమీద ఉంటుంది. పెద్దగొంతుక చేసుకుని అరుస్తుంది. ఆమె నోరు విప్పితే నాయుడికే కాదు, హిట్లర్ కి కూడా హడలే!
నాయుడు గొప్ప రసికుడు. ఆ వయసులోకూడా శృంగారంపట్ల అతని కుతి పోలేదు. అయితే, అరవయ్యోపడిలో పడగానే మగడికి ‘లవ్ కర్ఫ్యూ’ పెట్టేసింది ఆండాళ్ళు. అతను బ్రతిమాలినా బామాలినా లొంగదు, వంగదు. నాయుడికి రాత్రయితే మందు, మగువ- రెండూ కావాలి. కాని, ఆండాళ్లు ఎప్పుడోకాని ఒంటిమీద చేయి వేయనివ్వదు.
‘పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళకు పిల్లలూ ఉన్నారు. అయినా ముసలిగుర్రానికి ఇంకా కుతి చావలేదు’ అని విసుక్కుంటుంది.
దాంతో నాయుడికి ఉక్రోషం వచ్చేస్తుంది. ‘ముసలిగుర్రాన్నంటూ ఎద్దేవా చేయకు. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలేకానీ, కాశ్మీరానికి వెళ్ళి పాతికమంది చొరబాటుదారులను ఒంటిచేత్తో మట్టి కరపించిరానూ?’ అంటూ మీసం మెలేస్తాడు.
‘చాల్లే, సంబడం! నీలాగే నీ గన్నూ ముసలిదయిపోయింది. రోజూ దాన్ని క్లీన్ చేయడంతప్ప, రిటైరయ్యాక అది ఏనాడైనా తూటాలకు నోచుకుందా, పేలిందా! ఇప్పుడది పిట్టల్ని కొట్టాడానికికూడా పనిచేయదు’- అతన్ని రెచ్చగొట్టడం ఆమెకు సరదా.
దాంతో మరింత ఉడుక్కుంటాడు అతను. ‘నువ్వు ఎల్వోసీ క్రాస్ చేసేసావు. అయినా అర్థాంగివి కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను’ అంటాడు, ఆమె నోటికి ఎదురుచెప్పి తట్టుకోవడం కష్టమని. పకపక నవ్వుతుందామె.
ఆ రోజు ఎప్పటిలాగే మాణింగ్ వాక్ కి బయలుదేరాడు మీసాలనాయుడు. అలవాటు ప్రకారం హిట్లర్ కూడా తయారయింది. అయితే, “నువ్వెక్కడికి తయారయ్యావ్? ఈ రోజు నువ్వు హౌస్ అరెస్ట్!” అని అరచింది ఆండాళ్ళు. దాంతో తోక ముడిచేసి, యజమానివంక జాలిగా చూస్తూ ‘కుయ్ఁ’ మంటూ గదిలో ఓ మూలకు పోయి పడుకుంది అది.
గతరాత్రి ఎక్కణ్ణుంచి వచ్చిందో, బావురుపిల్లి ఒకటి ఇంట్లోకి వచ్చి వంటింటిలో చొరబడి పాలన్నీ త్రాగేసింది. ఆ సమయంలో హిట్లర్ టెర్రేస్ మీద యజమానితోపాటు డ్రింక్ సెషన్లో ఉన్నాడు. దాని అలక్ష్యం వల్లనే పాడుపిల్లి ఇంట్లో చొరబడిందని ఆండాళ్ళు హిట్లర్ మీద పెట్లుప్పులా చిటపటలాడింది. ఫలితంగా ఇరవయ్ నాలుగు గంటలసేపు అది గుమ్మం దాటడానికి వీల్లేదని ఆదేశించింది.
“మనుషుల్లాగే జంతువులకూ కొన్ని హక్కులు ఉంటాయి. హిట్లర్ గాడి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను హరించడం రాజ్యాంగం ఒప్పుకోదు” అంటూ అభ్యంతరం లేవదీయబోయాడు నాయుడు.
“దాన్ని గుమ్మం కదలొద్దన్నాను. కాని, దాన్ని వెనకేసుకొచ్చావంటే నిన్ను ఇంట్లోకే రానివ్వను!” అని ఆండాళ్ళు అరవడంతో, గప్ చిప్ అయిపోయాడు అతను… అదీ బ్యాక్ గ్రౌండ్.
చేసేదిలేక ఆ రోజు ఒంటరిగానే మాణింగ్ వాక్ కి బయలుదేరాడు నాయుడు. కొంతదూరం వెళ్ళేసరికి ఎవరో స్త్రీ అరుస్తూ ఓ వ్యక్తితో తీవ్రంగా పెనగులాడుతోంది. వాడు ఆమె మెళ్ళోని బంగారుగొలుసును త్రెంపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ దృశ్యం కంటపడగానే గబగబా అక్కడికి వెళ్ళాడు నాయుడు కేకలు పెడుతూ.
ఆ స్త్రీకి యాభయ్యేళ్ళుంటాయి. కించిత్తు స్థూలకాయం. పొట్టిగా ఉంది… దుండగుడి వయసు పాతికేళ్ళకు మించదు. నిత్యమూ వచ్చే మాణింగ్ వాకర్స్ లో ఒకతె ఆమె. నాయుణ్ణి చూడడంతో ధైర్యం వచ్చింది. “అన్నయ్యగారూ! ఈ దొంగవెధవ నామెళ్ళోని గొలుసును తెంపుకుపోవడానికి చూస్తున్నాడు. కాపాడండి…” అనరచింది.
దుండగుడు నాయుడివైపు ఓ లుక్ వేసి, ముసలాడేకదా అనేమో, అతని ఉనికిని లెక్కచేయనట్టు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు, మరింత ఉధృతంగా.
నాయుడికి ఒళ్ళు మండిపోయింది. గన్ ని వాడికి గురిపెట్టి, “ఖబడ్దార్! కదిలితే కాల్చేస్తాను” అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. అప్పుడుకానీ ముసలాయన చేతిలోని గన్ ని గమనించని దుండగుడు భయంతో ఆమెను వదిలేసి చేతులు పైకెత్తాడు.
గొలుసును జాకెట్ లోకి దోపుకుని చెంగు కప్పేసుకుంది ఆమె. “వీధిలో అంతమంది ఉండగా నా గొలుసే కావలసి వచ్చిందట్రా సచ్చినోడా!” అంటూ దుండగుడిపైన తిట్లవర్షం కురిపించింది.
“కూల్, చెల్లెమ్మా! వీడి సంగతి నేను చూసుకుంటాను కదా! ఈ మీసాలనాయుడి పరగణాలోకి చెయిన్ స్నాచర్స్ కి ఎంట్రీ లేదన్న విషయం వీడు ఎరుగడు! మరోసారి వీడిలాంటి వాడెవడూ ఈ ప్రాంతాలలో అడుగు పెట్టకుండా, వీణ్ణి షూట్ చేసి పారేస్తాను!” అన్నాడు నాయుడు.
“ఆ పని చేయండి, పీడా విరగడయిపోతుంది, ” కసిగా వాడివంక చూస్తూ మెటికలు విరిచిందామె..
దుండగుడు అదిరిపడ్డాడు. “ప్లీజ్, సార్! మీ డ్రెస్ చూసి పగటివేషగాడనుకున్నాను. మిలిటరీ మేన్ అనుకోలేదు. నన్నిప్పుడు వదిలేసారంటే తిరిగిచూడకుండా పారిపోతాను. మళ్ళీ ఎప్పుడూ ఈ చాయలకు రాను” అంటూ చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు.
“చూసావా, వదిలేస్తే ఈ చాయలకు రానంటున్నావే తప్ప, చెయిన్ స్నాచింగ్స్ మానేస్తాననడంలేదు. నిన్ను తప్పక షూట్ చేయాల్సిందే!” గన్ ని వాడి గుండెకు గ్రుచ్చాడు నాయుడు.
అంతలో ఇతర వాకర్స్ అక్కడికి రావడంతో జరిగిందంతా వారికి కాశీమజిలీ కథలా చెప్పనారంభించింది ఆ మహిళ. అదనుచూసి నాయుడి చేతిలోని తుపాకీని లాగేసుకుని అందరికీ గురిపెట్టాడు దుండగుడు. “ఎవరూ కదలొద్దు. కదిలితే కాల్చేస్తాను” బెదిరించాడు. “ఆ ముసలమ్మ మెళ్ళోని గొలుసే కాదు, మీ అందరి దగ్గరా ఉన్న బంగారమంతా తీసి నాచేతిలో పెట్టండి”.
నాయుడు పకపక నవ్వాడు. “అది తూటాలులేని తుపాకీరా, తుంటరి వెధవా! కాల్చిచూడు” అన్నాడు దుండగుడితో.
వాడు తెల్లబోయి, “ఇందులో గుళ్ళు లేవా!?” అంటూ తుపాకిని అటుఇటు ఊపి చూసాడు. తరువాత దాన్ని నాయుడి పైకి విసిరేసి, జేబులోంచి కత్తి తీసాడు.
“హెచ్చరికలో చిన్న సవరణ! కాల్చేయడం కాదు, కత్తితో కసకస పొడిచేస్తాను. మర్యాదగా మీమీ నగలన్నీ తీసి మూటకట్టి ఇవ్వండి” అంటూ కత్తి ఝుళిపించాడు.
నాయుడు మళ్ళీ ఫకాలున నవ్వాడు. “గన్ లో గుళ్ళు లేవన్నాను కాని, దాని చేవ చచ్చిందన్నానట్రా దొంగ రాస్కెల్!” అంటూ గన్ తో వాడి చేతిమీద కొట్టాడు.
కత్తి ఎగిరి పడిపోయింది. చేయి పట్టుకుని గిలగిలలాడిపోయాడు వాడు.
“ఇప్పుడు నేను చెబుతున్నాను, విను… నీ మెళ్ళో ఉన్న ఆ మందపాటి గొలుసు, వ్రేళ్ళ ఉంగరాలూ తీసివ్వు. అవి కొన్నవో, కొట్టేసినవో నాకు అనవసరం. నీ దుస్సాహసానికి నేను విధించే కోర్ట్ మార్షల్ ఇదే!” అన్నాడు నాయుడు గంభీరంగా. అతనివంక మెచ్చుకోలుగా చూసారంతా.
“ఇది అన్యాయం! పట్టపగలే దోపిడి. నేను ఒప్పుకోను” గింజుకున్నాడు వాడు. అంతటితో ఆగకుండా, “పోలీస్! పోలీస్!!’ అని అరచాడు.
అప్పుడే అటువైపుగా బైక్ మీద వెళుతున్న పోలీసులు ఇద్దరు వాడి అరుపులు ఆలకించి అక్కడకు వచ్చారు. వారిని చూసి ఖంగుతిన్నాడు వాడు.
“కుర్రాడివి, కేసెందుకులే… కాసేపు ఏడిపించి వదిలేద్దామనుకున్నాను. నువ్వే పోలీసుల్ని పిలుచుకుని నీ తద్దినం నువ్వే పెట్టుకున్నావు” అంటూ నవ్వాడు నాయుడు.
విషయం తెలుసుకున్న పోలీసులు దుండగుణ్ణి తమదైన శైలిలో తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ కి లాక్కుపోయారు…ఆ డ్రామా జరిగినప్పుడు హిట్లర్ పక్కను లేకపోవడం పెద్ద వెలితిగా అనిపించింది నాయుడికి…..
ఓ రోజు సాయంత్రం ఎప్పటిలాగే హిట్లర్ ని తీసుకుని పార్క్ కి బయలుదేరాడు మీసాలనాయుడు. రోజూ అతనివెంట బుద్ధిగా నడచే హిట్లర్ ఆరోజు ఎందుకో కొంచెం అసహనంగా ఉంది. దాని వాలకంలో తేడా కనిపిస్తోంది. యజమాని చేతిలోని బెల్ట్ ను విడిపించుకోవాలని తెగ గింజుకుంటోంది. ఆపబోతే అతనిమీద గుర్రుమంటోంది. దానివంక అనుమానంగా వీక్షించసాగాడు నాయుడు.
పార్కులో ప్రవేశించగానే నాయుడు ఏమరుపాటుగా ఉండడం చూసి బెల్ట్ ని విడిపించుకుని పరుగెత్తింది హిట్లర్. కనిపించిన ఆడకుక్కల వద్దకు వెళ్ళి వాటి చుట్టూ తిరుగుతూ మూతి, ముఖము, ఒళ్ళంతా ఆబగా నాకేయసాగింది. ఎప్పుడూ స్నేహపూరితంగా మెలగే హిట్లర్ ఆ రోజు చిత్రంగా అగ్రెసివ్ గా ప్రవర్తించడంతో కుక్కలన్నీ కంగారుపడి తప్పించుకోవడానికి ప్రయత్నించాయి. హీట్లర్ మొరుగుతూ వాటిని తరిమిపట్టుకుని మరీ ఇబ్బందిపెట్టసాగింది. అవి తిరగబడితే వాటిని కరిచేస్తోంది. అవాక్కయి చూసాడు నాయుడు.
ఆ పెట్స్ యొక్క యజమానులు తెల్లబోతూ హిట్లర్ ని తోలడానికి ప్రయత్నించారు. వారి పైన తిరగబడింది హిట్లర్. కొందరిని కరిచింది కూడాను. దాంతో భయకంపితులయ్యారంతా. పరుగులు పెట్టారు.
నాయుడు నిర్ఘాంతపోయాడు. తన మదిలో ఏమూలో ములుకులా పొడుస్తూన్న అనుమానం నిజం అవుతోందన్న ఆందోళన రేగింది అతనిలో. “హిట్లర్!...హిట్లర్!...ఆగు! రా, ఇక్కడికి…” అంటూ కోపంగా అరచాడు.
హిట్లర్ యజమాని పిలుపును పట్టించుకోలేదు. నిర్భయంగా తన ‘ఎజెండా’ ని కొనసాగించింది. నాయుడి కోపం నసాళానికి అంటింది. గబగబా వెళ్ళి, ఓ ఆడ పామెరేనియన్ పైకి లంఘిస్తూన్న హిట్లర్ ని విడిపించబోయాడు. అది అంతకంటె కోపంగా యజమాని పిక్క పట్టుకుంది. అతికష్టంమీద దాని పట్టును విడిపించుకున్నాడు నాయుడు.
ఆ దృశ్యాన్ని గాంచి నిశ్చేష్ఠులయ్యారంతా. హిట్లర్ కి పిచ్చి పట్టిందన్న నిర్ణయానికి వచ్చేసారు. వెంటనే ఎక్కడికో ఫోన్లు వెళ్ళాయి.
కాసేపట్లో నలుగురు మునిసిపల్ వర్కర్స్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. పట్టుకోబోతే వాళ్ళను కరవబోయింది హిట్లర్. “సందేహం లేదు. దీనికి పిచ్చి పట్టింది” అన్నారు వాళ్ళు.
అదరిపడ్డాడు నాయుడు. “లేదు, లేదు. దానికేమీ కాలేదు. నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి” అంటూ వారిని ఆపబోయాడు. వాళ్ళు వినిపించుకోలేదు. అరగంటసేపు అవస్థపడి, హిట్లర్ ని ట్రాప్ చేసారు.
నాయుడు వారిని బతిమాలాడు., హిట్లర్ కి పిచ్చెక్కలేదనీ, కాస్త సుస్తీచేసిందనీ, డాక్టర్ దగ్గరకు తీసుకువెళుతుంటే తప్పించుకుందనీ నమ్మబలికాడు. వారి చేతులు తడిపాడు. దాంతో దాన్ని వెంటనే డాక్టర్ కి చూపించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు.
సమీపంలోనే వెటెరినరీ క్లినిక్ ఉంది. డాక్టర్ కుక్కేశ్వర్రావు దానికి హోల్ అండ్ సోల్ ఇంఛార్జ్. అతని అసలు పేరు కుక్కుటేశ్వర్రావు అయినా, కుక్కల వైద్యంలో స్పెషలిస్టని అంతా అతన్ని కుక్కేశ్వర్రావని పిలుస్తారు!
హిట్లర్ వెంటే, దానిచేత కరపించుకున్న పెట్సూ, వాటి యజమానులూ ఆ క్లినిక్ కి క్యూ కట్టారు. హిట్లర్ కి పిచ్చెక్కిందని నిర్ధారణ ఐతే, తమ కుక్కలకు తమకు విరుగుడును తీసుకోవలసియుంటుంది మరి!
కొన్నిజతల కళ్ళు ఆత్రుతతో వీక్షిస్తూంటే… నాయుడి మీసాలు టెన్షన్ తో నిక్కబొడుచుకుంటే… మూతికి చిక్కం ఉండడంతో ‘గుర్…గుర్…’మంటున్న హిట్లర్ ని తాపీగా పరీక్షించాడు కుక్కేశ్వర్రావు. తరువాత పెదవి విరవబోయి కొరుక్కుని, ‘అబ్బాఁ!’ అన్నాడు. ఆ మంటలో, “ఐ తింక్…మీ హిట్లర్ ని ఆ హిట్లర్ దగ్గరకు పంపకతప్పదు” అన్నాడు హాట్ గా.
నాయుడు ఉలికిపడి, “నో! దీనికి పిచ్చిపట్టలేదు! కాస్త హైపర్ యాక్టివ్ అయిందంతే…” అనరచాడు.
“అయినా సరే, వియ్ బెటర్ పుట్ హిమ్ టు స్లీప్” అన్నాడు కుక్కేశ్వర్రావు పెదవి గీరుకుంటూ.
దాంతో అందరి గుండెలూ గుభేలుమన్నాయి. “మా పెట్స్ సంగతో?” అనరచారు ఒకేసారిగా.
“వాటికి ఓ ఇంజెక్షన్ చాలు” అన్నాడు డాక్టర్.
“మరి మా సంగతో?” హిట్లర్ చేత కరపించుకున్నవారు అడిగారు కంగారుగా.
“మీకు చెప్పుదెబ్బలు! ఐ మీన్, కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటారు కదా!” అన్నాడు నవ్వుతూ.
అప్పటికి ఆ షాక్ నుండి తేరుకున్న మీసాలనాయుడు డాక్టర్ జబ్బ పట్టుకుని జబర్దస్త్ గా పక్కగదిలోకి లాక్కుపోయాడు, అంతా గ్రుడ్లప్పగించి చూస్తుంటే.
పదినిముషాల తరువాత గదిలోంచి బైటకు వచ్చారు ఇద్దరూ. ఏం జరిగిందో ఏమో, నాయుడు ముసిముసిగా నవ్వుకుంటుంటే కుక్కేశ్వర్రావు పడిపడి నవ్వసాగాడు. అతని వరస చూస్తే అందరికీ అనుమానం వచ్చింది– ‘కొంపదీసి హిట్లర్ కరచిన నాయుడు, డాక్టర్ ని కరవలేదుకదా!’ అని.
“హిట్లర్ కి పట్టింది పిచ్చికాదు, మదపిచ్చి!” అంటూ కుక్కేశ్వర్రావు చెప్పిన సంగతులు ఆలకించి ఘొళ్ళున నవ్వారంతా. నాయుడు సిగ్గుగా తల వంచుకున్నాడు.
గాయపడ్డ పెట్స్ కి కట్టు కట్టి, మనుషులకు ప్రథమచికిత్స చేసాడు కుక్కేశ్వర్రావు ఉబికి వస్తూన్న నవ్వును ఆపుకోవడానికి అవస్తపడుతూనే.
ఇంతకూ జరిగిందేమిటంటే– దగ్గరకు చేరబోయినపుడల్లా ఆండాళ్ళు తనను ముసలిగుర్రం అని ఎద్దేవాచేయడంతో, ఏదో అనుమానం రేగింది నాయుడిలో. అందుకే ‘వయాగ్రా’ ని ట్రై చేయాలి అనుకున్నాడు. ఆ రోజు ఆ టాబ్లెట్స్ తెచ్చుకుని గదిలో క్రింద గూటిలో పెట్టాడు. వాటిని చూసిన హిట్లర్ బిస్కెట్లనుకుని నాయుడి కళ్ళముందే గుటుక్కుమనిపించేసింది... అదీ సంగతి!
నెలలు గడచినా ఆ ఎపిసోడ్ ని తలచుకుని తలచుకుని పడిపడి నవ్వుకుంటూవుంటారంతా.
తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."
Comentários