top of page

ఉద్యోగస్తురాలు

#JeediguntaSrinivasaRao, #Udyogasthuralu, #ఉద్యోగస్తురాలు, #JeediguntaSrinivasaRao, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Udyogasthuralu - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 24/05/2025

ఉద్యోగస్తురాలు - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"నోర్ముయ్, మన ఇంటా వంటా లేదు. ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం! మీ అమ్మ ఉద్యోగం చేస్తోందా? మీ బామ్మ ఉద్యోగం చేస్తోందా?" అంటూ కొడుకు మోహన్ మీద అరిచాడు ప్రకాశం.


"అమ్మ మీ చేతిలో బంధీ, బామ్మ ఉద్యోగం చేయకపోవడానికి చదువుకోలేదు కాబట్టి, మీరు చేసే ఉద్యోగంతో వచ్చే జీతంతో ఇల్లు గడవడం, మా స్కూల్ ఫీజులు కట్టడం వగైరాలతోనే సరిపోతోంది. ఎప్పుడైనా మీ జీతంతో మీకోసం కొత్త చొక్కా కుట్టించుకున్నారా? నా జీవితం మీద నాకు ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారం ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరి సంపాదనతో అన్నయ్యలకి సమానంగా ఉండచ్చు," అన్నాడు ధైర్యంగా తండ్రి ముందు నిలబడి మోహన్.


"నీ బొంద ప్లాన్! అంత ప్లాన్ ఉంటే డిగ్రీతో ఎందుకు ఆపేసావు? మీ అన్నని చదివించినట్టుగా నిన్ను కూడా ఇంజనీరింగ్ చదివించే వాడిని," అన్నాడు కుర్చీలోనుంచి లేచిన ప్రకాశం.


"ముందు అన్న చదువుకి చేసిన అప్పు ఎలా తీర్చాలో ఆలోచించండి. నన్ను కూడా చదివించితే ఉద్యోగం వచ్చిన తరువాత మీరు చెప్పిన, చూసిన అమ్మాయిని చేసుకుని వేరు కాపురం పెడితే అప్పు ఎవరు తీర్చుతారు?" అన్నాడు మోహన్.


"ఇదిగో చూడు నీ చిన్న కొడుకు కలెక్టర్ ఉద్యోగం చేసి అమ్మాయిని చేసుకుని మన అప్పులు తీరుస్తాడుట! వింటున్నావా? ప్రతి దానికి వాడిని వెనకేసుకుని వచ్చి ఇప్పుడు తండ్రికే జాగ్రత్తలు చెబుతున్నాడు," అన్నాడు భార్య కుమారి తో.


"వాడితో గొడవ ఎందుకండి, ముందు ఆ ఉద్యోగం చేసే అమ్మాయి రావాలి కదా. ఎప్పుడో దీపావళికి, ఇప్పుడే ఒళ్ళు కాల్చుకున్నట్టు ఉదయమే మొదలుపెట్టారు," అంది కుమారి.


"నువ్వు అలాగే వాడిని వెనకేసుకుని రా. నేను మాత్రం ఉద్యోగం చేసే అమ్మాయిని కోడలుగా ఒప్పుకోను," అన్నాడు ప్రకాశం.


"మీ తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు. తన కూతురు రత్నంని కోడలుగా చేసుకోమని. పిల్ల బాగానే ఉంటుంది. కలుపుకుంటే వృద్ధాప్యంలో మనల్ని చూసుకుంటుంది. ఉద్యోగానికి వెళ్లి పిల్లకి నువ్వు వండిపెట్టాలి," అన్నాడు.


"మామయ్య కూతురు కూడా నాలాగే వెలుముద్ర. దాన్ని చేసుకుంటే ఇద్దరం కలిసి మాదాకోళం ఎత్తుకోవాలి. మీరు నన్ను ఇంట్లో నుంచి పంపిస్తానన్నా నా నిర్ణయం మారదు. నాన్న అనుకుంటున్నాడు ఇంట్లో ఉండే కోడలు ఏదో వండిపెడుతుంది అని. నేను ఇప్పుడే చెబుతున్నా. మీరు రిటైర్ అయిన తరువాత నాదగ్గర ఉండాల్సిందే తప్పా అన్నయ్యల దగ్గర ఒక్క క్షణం ఉండలేరు. ఎందుకంటే మేము ఇద్దరం ఉద్యోగానికి వెళ్ళిపోతే వంటగది కి అమ్మే మహారాణి. నువ్వు ఇల్లంతా వాకింగ్ చేసినా ఎవ్వరూ అడ్డు ఉండరు. ఎటువంటి ఆంక్షలు ఉండవు," అన్నాడు మోహన్.


"వాడనేది నిజమే అనిపిస్తోంది. కొద్దిగా ఆలోచించండి," అంది భార్య కుమారి.


బెంగళూరులోని ఒక పెద్ద స్టీల్ ఫ్యాక్టరీలో మోహన్ స్నేహితుడు అతనికి ఉద్యోగం ఇప్పించాడు.

“చూసావా మనవాడి చదువుకి, రాష్ట్రాలు మార్చి వచ్చినా గానీ ఉద్యోగం రాలేదు. నీకు కన్నడ రాదు, ఇది ప్రవేట్ కంపెనీ, నీ ప్రవర్తన నచ్చకపోతే ఒక రోజులో ఉద్యోగం తీసేస్తారు. యిక్కడే ఏదైనా పిండి రుబ్బే షాప్ పెట్టుకో,” అన్నాడు ప్రకాశం తండ్రి గర్వంగా.


కానీ తండ్రి మాట పట్టించుకోకుండా మోహన్ బెంగళూరుకు వెళ్లి, "లక్ష్మి స్టీల్ ఫ్యాక్టరీ"లో చేరాడు. అదృష్టం బాగుండటం వల్ల మోహన్‌కు టెండర్లు తయారు చేసి పంపే విభాగంలో ఉద్యోగం దక్కింది.

ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్‌కి ఎప్పటి నుంచో తెలుగు నేర్చుకోవాలనే కోరిక ఉండటం వల్ల మోహన్‌ని తరచూ తన దగ్గరికి పిలిపించుకునేవాడు.


అక్కడే పని చేస్తున్న రామన్ అనే మేనేజర్‌కి మోహన్ గుణం నచ్చింది. ఒక రోజు క్యాంటీన్‌కి తీసుకెళ్లి, “మా బంధువుల్లో కన్నడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఉంది. గవర్నమెంట్ స్కూల్‌లో మంచి ఉద్యోగం చేస్తోంది. వెనుక ఆస్తి ఏమీలేదు. తల్లి ఏడాది క్రితం చనిపోయింది. ఇప్పుడు నేం, నా భార్యే ఆమె తల్లిదండ్రులు. నాకు కట్నాలు ఇవ్వలేను. పెళ్లి మాత్రం మంచి వాడితో చేయాలనుకుంటున్నా. నిన్ను చూసిన తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. నీకు ఆ అమ్మాయి నచ్చుతుందా?” అని అడిగాడు.


“సార్, మా నాన్నకి ఉద్యోగం చేసే అమ్మాయిలంటే కోపం. పైగా కన్నడ అమ్మాయి అంటున్నారు. అయినా నేను పనిచేస్తున్న చోటే కర్ణాటక, తెలుగు సంబంధాలు అని చూస్తే ఎవరు మాట్లాడరు. గవర్నమెంట్ జాబ్ అంటారు, కానీ ఆమె నన్ను అంగీకరిస్తుందా?” అని చెప్పాడు మోహన్ కొంచెం సంకోచంగా.


“నీకేం మోహన్, ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌కి నువ్వు ఇష్టమైనవాడివి. ఆయన ఓ నిర్ణయం తీసుకుంటే నిన్ను డైరెక్టర్ చేయగలడు. అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. గవర్నమెంట్ ఉద్యోగమంటూ పెద్దగా జీతం ఉండదు కూడా,” అన్నాడు రామన్.


తర్వాత మళ్లీ, “సారీ, చెప్పడం మరిచిపోయాను. ఆమె పేరు సంగీత. నీవు ఒక ఫోటో పంపించు. నేను ఆమెకు చూపిస్తాను. ఓకే అయితే నీకు ఆమె ఫోటో పంపిస్తాను. తరువాత నీ నాన్నగారిని ఒప్పించగలను,” అన్నాడు.


సాయంత్రం రామన్ గారు సంగీతకి మోహన్ ఫోటో చూపించి, అతని ఉద్యోగం వివరాలు చెప్పారు.

“నీకు నచ్చితే మిగిలిన బాధ్యత నాది,” అన్నారు.


సంగీత నవ్వుతూ, “నా తల్లి చనిపోయిన తర్వాత మీరు నన్ను కూతురిగా చూసుకున్నారు. నన్ను ఇంత ప్రేమగా కాపాడుతున్న మీరు చెప్పే నిర్ణయమే నాకు శిరోధార్యం. అబ్బాయి నచ్చాడు. ఉద్యోగం అంటే—మీరే అదే స్టీల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు కదా! మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి నాకు కూడా నమ్మకం ఉంది,” అంది.


“అయితే అతని నంబర్ ఇక్కడ. నీవు అతనికి ఫోటో పంపించు,” అన్నాడు రామన్.


“నేను పంపించడం మర్యాద కాదనిపిస్తోంది అంకుల్. రేపు మీరు ఆఫీస్‌కి వెళ్లినప్పుడు నా ఫోటో అతనికి ఇవ్వండి,” అంది సంగీత తలవంచుతూ.


“అమ్మాయి, ఈ నీ వినయమే నిన్ను జీవితంలో ఎత్తుకు తీసుకెళ్తుంది,” అన్నాడు రామన్.


"ఇదిగో పెద్దాడికి ఫోన్ చేసి చెప్పా… ‘వచ్చే నెల నా రిటైర్మెంట్, ఇక్కడ పనులు పూర్తి చేసుకుని నీ దగ్గరికి వస్తాను’ అన్నాను. అప్పుడు వాడేమన్నాడో తెలుసా? 'నేడు నేను సింగిల్ బెడ్‌రూం హౌస్‌లో ఉంటున్నాను. మీరు మా దగ్గరకి రాకండి. మీరున్న చోటే ఉండండి. ప్రతినెల ఖర్చులకు డబ్బులు పంపిస్తాం' అన్నాడు. అక్కడ మనిద్దరం ఉండగలిగే ఇల్లు చాలా అద్దె అంట" అన్నాడు ప్రకాశం.

"రెండవ వాడిని అడిగిచూడండి. వాడికి నేనంటే ప్రాణం" అని అన్నది కుమారి. 


"నీ మొహం! వాళ్ళిద్దరూ వాళ్ళ భార్యలతో సంప్రదించి ఇలా మాట్లాడారు. మన వెధవలకు అంత తెలివితేటలెక్కడివి? నీ కోడళ్ళు చెప్పిన హితబోధే అంతంత!" అంటూ చిరాకుపడ్డాడు మధు.


"మీరే కదా అన్నది – ఉద్యోగం చేసే ఆడపిల్లలు మన మాట వినరని. మరి వీళ్లిద్దరూ ఇంటర్మీడియట్ లో ఆపేశారు కదా చదువు. అలాంటివాళ్లకి ఇంత తెలివి ఎక్కడిది? మొగాళ్ళని అదుపులో పెట్టుకోవడానికే!" అని అన్నది కుమారి. 


"ఇదిగో నేను డిగ్రీ చేశాను. అయినా మిమ్మల్ని ఇప్పటికీ వశం చేసుకోలేక, ప్రతిరోజూ తిట్లు తింటున్నాను!"


"సరే గానీ, ఇప్పుడు మన గొడవ ఎందుకు? మోహన్ నీకు ఏమైనా ఫోన్ చేశాడా?" అన్నాడు మధు.


"ఫోన్ చేయలేదు. కానీ ప్రతినెలా నా ఖాతాలో మూడు వేల రూపాయలు వస్తున్నాయి. మొదట మీరే పంపిస్తున్నారేమో అనుకున్నా. ఈ వయసులో జాలితో నాకు డబ్బులు ఇస్తున్నారేమో అనిపించింది. తర్వాత తెలిసింది – మోహన్ పంపుతున్నాడని."


"వాడికెంత జీతం వస్తుందో, అందులో మనకి పంపడమేంటో! చెప్పు – వద్దు అని!" అన్నాడు ప్రకాశం. "అయినా… మన పెద్ద వెధవలకంటే మోహనే మంచివాడు" అని అణిగి అన్నాడు.

ఈ మాట విన్న కుమారి కోరికనుద్దేశించి:


యిదే సమయం అనుకున్న కుమారి, "చూడండి, పాపం మోహన్ అడిగింది ఏమిటి.. ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుంటే తను పెద్ద ఉద్యోగం చెయ్యలేకపోయినా రేపు వదినగారల ముందు లోకువగా ఉండక్కరలేదు అని. వాడిని నానా తిట్లు తిట్టి బెదిరించారు. తల్లిదండ్రులం మనం కాకపొతే పిల్లల కోరికలు ఎవ్వరు తీరుస్తారు, ఒకసారి ఫోన్ చేసి ఉద్యోగం చేసే అమ్మాయి సంబంధం వస్తే అలాగే చేసుకుందువు అని చెప్పండి, సంతోషిస్తాడు" అంది. 


"సరే, చూద్దాం. రేపు శనివారం. బెంగళూరు వెళ్లి వాడిని చూసి వస్తాను. ఎలా ఉన్నాడో చూసేద్దాం" అన్నాడు ప్రకాశం.


ప్రకాశం కొడుక్కి తెలియకుండా బెంగళూరు రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. అక్కడినుంచి క్యాబ్ తీసుకుని ‘లక్ష్మీ స్టీల్ ఫ్యాక్టరీ’కి వెళ్లాడు. సెక్యూరిటీలకు మోహన్ పేరు చెప్పి, తాను అతని తండ్రిని అని చెప్పి, అతని దగ్గరకు తీసుకెళ్లమన్నాడు. సెక్యూరిటీ గార్డు సల్యూట్ కొట్టి, "సార్, మోహన్ గారు ఫ్యాక్టరీలో ఉండరు. ఆయన ఆఫీసులో ఉంటారు. ఇదిగో ఆ అడ్రస్," అని చెప్పాడు.


ఆ అడ్రస్ చూస్తే రైల్వే స్టేషన్‌కి దగ్గరలోనే ఉంది. మళ్లీ క్యాబ్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. అరగంటలో ఆఫీసు ముందుకు వచ్చి క్యాబ్ డ్రైవర్‌ను డబ్బులు ఇచ్చి పంపించాడు. లిఫ్ట్‌లో నాలుగో అంతస్తుకు వెళ్లి, రిసెప్షన్‌ వద్ద మోహన్ గురించి అడిగాడు.


అక్కడ ఉన్న యువతి ఇంగ్లీష్‌లో స్పందిస్తూ: "మోహన్ గారు ఎండీ గారితో కలిసి బయటకు వెళ్లారు. అరగంటలో వస్తారు. మీరు ఆయన గదిలో కూర్చోండి," అని అటెండర్‌తో పంపించింది.

ఆ గది పెద్దది కాకపోయినా మంచి స్టాండర్డ్‌లో ఉంది. టేబుల్ మీద కంప్యూటర్, పక్కనే లాప్‌టాప్. నాలుగు కుర్చీలు అతిధుల కోసం. ఒక కుర్చీలో కూర్చున్న ప్రకాశం గదిలో చల్లదనాన్ని ఆస్వాదించాడు. "ఇది మా వాడి గదేనా? లేకపోతే ఎవరో ఆఫీసర్‌ది?" అని అనుమానంగా అనిపించింది.


తర్వాత మేనేజర్ రామన్ హడావుడిగా వచ్చి ప్రకాశాన్ని పలకరించి పరిచయం చేసుకున్నాడు. మెల్లగా పెళ్లి విషయాన్ని చెప్పాడు. "మీ అబ్బాయి మొదట వేదనతో ఉద్యోగం చేసే అమ్మాయిలను వద్దన్నారు. రెండోది – ఆమె కన్నడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిందట…" అని చెప్పాడు రామన్.


ప్రకాశం ముఖాన్ని చూస్తూ: "రెండవది పెద్ద విషయం కాదు. మీరు తమిళ్ వారు అయినా మీ బిడ్డ కోసం ఎంత కష్టపడుతున్నారో నేను చూశాను. నేను కూడా టీచర్‌గానే ఉద్యోగం చేసి, ఇప్పుడే రిటైర్‌ అయ్యాను. ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ టీచరే అన్నారు కదా. మీరు అనుమతిస్తే ఆమెను ఒకసారి చూడాలని ఉంది," అన్నాడు ప్రకాశం.


"మీ మోహన్ కూడా ఇంకా అమ్మాయిని చూడలేదు. మోహన్ రాగానే మనం స్కూల్‌కి వెళ్దాం, అమ్మాయిని కలిసి మాట్లాడుదాం" అన్నాడు రామన్ గారు.


ఎండీ గారితో లోపలికి వచ్చిన మోహన్‌కి, తన తండ్రి తన గదిలో ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు. వెంటనే గదిలోకి వెళ్లాడు. అప్పటికే రామన్‌గారితో మాట్లాడుతూ ఉన్న తండ్రి దగ్గరికి వచ్చి, "నాన్నగారు, ఇంటి దగ్గర అందరూ కులాసానేనా?" అని అడిగాడు.


"నీ అమ్మ బాగానే ఉంది. నాకు నిన్ను చూడాలనిపించి వచ్చాను. అలా నీ కుర్చీలో కూర్చో, మా మోహన్‌ని చూసుకోవాలి కదా!" అన్నాడు ప్రకాశం.


"మీరు మాట్లాడుకోండి, కొద్దిసేపట్లో బయలుదేరుదాం" అంటూ బయటకు వెళ్లిపోయాడు రామన్ గారు.


తర్వాత ప్రకాశం మాట్లాడుతూ, "నీ మేనేజర్ గారు అన్నీ చెప్పారు. నీ వదినలు, అన్నయ్యల ప్రవర్తన చూసాక నీ కోరిక నీకు మంచిదే అనిపించింది. మనం వెళ్దాం, అమ్మాయిని చూసి మాట్లాడదాం. ఈ విషయం చెబితే నీ అమ్మ డాన్స్ చేస్తుంది!" అని చెప్పాడు.


తర్వాత ఎండీ గారిని కలసి, "సార్, మోహన్‌కి ఓ సంబంధం చూస్తున్నాం. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. నేను తండ్రిగా నిలబడి ఈ పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాను" అన్నాడు ప్రకాశం.


ఎండీ గారు ఆనందంతో, "ఇంత మంచి పని చేయడం మీ అదృష్టం. మీ జీతంతో ఇది కష్టమే. నాకు ఆడపిల్లలు లేరు. కన్యాదానం చేసే అవకాశం నాకు ఇవ్వండి. మోహన్ పెళ్లి మామూలుగా జరగకూడదు. అన్ని ఖర్చులు నా ఖాతా నుంచే" అన్నారు.


"ధన్యవాదాలు సార్, మీరు ఇంత దయ చూపుతున్నందుకు" అన్నాడు రామన్.


తర్వాత ప్రకాశం, కాబోయే కోడలు సంగీతతో మాట్లాడాడు. "కర్ణాటకలో పిల్లలకి ఎలా చదువు చెబుతారు? నీకు తెలుగు రాయడం, చదవడం వచ్చా?" లాంటి ప్రశ్నలు అడిగాడు.


మోహన్ విడిగా సంగీతతో తన జీతం, చదువు, కుటుంబం గురించి చెప్పాడు. "మన పెళ్లి అయితే నా జీతంతో ఇల్లు నడుపుతాం. నీ జీతాన్ని సేవింగ్స్‌గా ఉంచుదాం" అన్నాడు. తనతో ఏ దాపరికం లేకుండా మాట్లాడిన మోహన్ ముద్ర వేసాడు సంగీత మనసులో.


పెళ్లి ఏర్పాట్లన్నీ రామన్ గారు చూసుకున్నారు. కన్యాదానం సమయానికి వచ్చిన ఎండీ గారు, సంగీతను మోహన్ చేతిలో పెట్టి, "ఇదిగో మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఒక నెల వరకు ఆఫీసులో ఐదు గంటల తర్వాత కనిపించకూడదు. ఆ తర్వాత నేను ఎలక్ట్రానిక్ సిటీలో కట్టబోయే రెండో ఫ్యాక్టరీకి నిన్ను ఇంచార్జ్‌గా పెడతాను" అని ఆశీర్వదించి వెళ్లిపోయారు.


ఆఫీసు వారు మంజూరు చేసిన పెద్ద క్వార్టర్స్‌లో తల్లిదండ్రులు, సంగీతతో కలిసి గృహప్రవేశం చేశాడు మోహన్. ఒక వారం రోజుల పాటు బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు, తమ ఊరికి బయలుదేరారు.


పెళ్లికి వచ్చిన అన్నయ్యలు, "తమ్ముడి పరిస్థితి బాగుంది. ప్రతినెల నాన్నగారికి డబ్బు పంపించుదాం. బాధ్యత ముగ్గురం పంచుకుందాం" అని అన్నపుడు ప్రకాశం మాత్రం, "నా పెన్షన్‌తో మేము బతుకుతాం. మీ సహాయం అవసరం లేదు" అని పెద్దకొడుకుకు తేల్చి చెప్పాడు.


దాచుకున్న డబ్బులు, పెన్షన్‌తో పాటు పదిమందికి ట్యూషన్ చెప్పడంతో వచ్చే ఆదాయంతో ప్రకాశం, కుమారి హాయిగా జీవనం గడుపుతున్నారు. ఒకే ఒక్క బాధ – పిల్లలు దగ్గర లేరు అన్నదే.

ఒకరోజు ఉదయం ఇంటి ముందు కూరగాయలు కొనుకుంటున్న ప్రకాశం, ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి దిగిన కోడలు సంగీతను చూసి ఆనందంతో భార్యను పిలిచి, "సంగీతను లోపలికి తీసుకెళ్ళు" అన్నాడు.


లోపలికి వచ్చి, "అమ్మా, నీ ఆయన రాలేదా?" అని అడిగాడు.


"లేదు మామయ్యగారు, కొత్త ఫ్యాక్టరీ బాధ్యత ఇచ్చారు. సెలవు దొరకడం లేదు. నువ్వు వెళ్ళి అమ్మానాన్నలను తీసుకురా అన్నారు. వాళ్లు విడిగా ఎందుకు ఉండాలి అంటున్నారు. మీ ఇద్దరినీ తీసుకెళ్లడానికి నేను వచ్చాను. నాకు పెద్దదిక్కుగా నువ్వే ఉన్నావు" అంది సంగీత.


"అమ్మా, లక్షలు సంపాదిస్తున్న నీ బావగార్లకు మమ్మల్ని పోషించడం భారంగా ఉంది. నీకు మేము భారంగా మారతామా?" అన్నాడు ప్రకాశం.


"చిన్న ఉద్యోగం చేస్తున్నా… పిల్లలను వదిలేయడం కష్టం మామయ్య గారు. 'మనవాళ్లు' అన్న అభిమానం ముఖ్యం. నేను వారం రోజులు ఉంటాను. అవసరమైనవి తీసుకెళదాం. మీకు బెంగళూరు బోరైతే పదిరోజులు ఊరిలో ఉండి మళ్ళీ వెళ్ళొచ్చు" అన్నది సంగీత.


కొత్త కోడలు మాటలు విని మురిసిపోయింది కుమారి. "నువ్వు మోహన్‌ని అంత ప్రేమగా పిలుస్తుంటే, ఎలా తిరస్కరిస్తాం? మాకు బోర్ కొట్టకుండా మనవడిని ఇచ్చేస్తే సరిపోతుంది!" అన్నాడు ప్రకాశం. మామగారి మాటలకి సిగ్గుతో నవ్వింది సంగీత.


ఈరోజుల్లో చల్లని నీళ్లకు వేడినీళ్ల సాయం అవసరం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ, పిల్లలను ప్లే స్కూల్‌కు వదిలిన తర్వాత, అత్తమామల వద్ద పెంచితే – రేపు ఆ పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు.


మొదటి టీవీ, ఇల్లు, కారు – అన్నీ మోహన్ కొనుగోలు చేశాడు. తల్లిదండ్రులను వదిలేసిన అన్నగార్లు అద్దె ఇంట్లో ఉంటూ, పిల్లలు చదువుకోవడంలేదని బాధపడుతున్నారు.


మాతృదేవోభవ | పితృదేవోభవ

శుభం





 శుభం 

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
















Comments


bottom of page