top of page

క్రమశిక్షణ లో శిక్ష

#KramasikshanaloSiksha, #క్రమశిక్షణలోశిక్ష, #సైనికకథ, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kramasikshanalo siksha - New Telugu Story Wtten By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 20/05/2025

క్రమశిక్షణ లో శిక్ష - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


మిలిటరీ రిటైర్డ్ కల్నల్ రంగనాథ్ గారి బంగళా అది. ఆయన ఆర్మీ నుంచి రిటైర్ అయినా అదే క్రమశిక్షణ పాటిస్తారు. చైనా, పాకిస్థాన్ తో భారత్‌కు జరిగిన యుద్ధాల్లో పాల్గొని అనేక సాహస మెడల్స్ పొందారు. భారీ ఎత్తైన శరీరం, గుబురు మీసాలతో ఠీవిగా కనబడతారు.


కర్నల్ గారి బంగళాలో పని చేసే నౌకర్లు, కారు డ్రైవరు, సెక్యూరిటీ నేపాలీ గూర్ఖా బహదూర్ — అందరూ ఆయన క్రమశిక్షణకు భయపడుతూ విధులు నిర్వర్తిస్తున్నా, ఆయన ఉదారగుణాన్ని మెచ్చుకుంటారు. పండగలు, పుట్టినరోజులు, దేశ జాతీయ పర్వదినాలప్పుడు స్టాఫ్ అందరికీ నగదు బహుమతులు, మిఠాయిలూ, నూతన వస్త్రాలు పంచిపెడతారు. ఎవరైనా విధినిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం సహించరు.


కల్నల్ మిలిటరీ సర్వీస్ చేసి రిటైరైనా ఆధ్యాత్మిక సనాతన సంప్రదాయాల్ని పాటిస్తూంటారు. వాస్తు, జ్యోతిష్య విషయాలకు ప్రాధాన్యమిస్తారు. పర్యావరణం, పరిసరాల శుభ్రత కోరుకుంటారు. బంగళాలో రకరకాల పూలమొక్కలు, ఫలవృక్షాలు పెంచి, పక్షుల కోసం గూళ్లు, తినడానికి తిండి గింజలు వేయిస్తారు. అందువల్ల రకరకాల పక్షుల కిరకిలారావాలతో బంగళా పరిసరాలు సందడిగా కనబడతాయి.


ఆయన దినచర్య ప్రకారం తెల్లవారుజామున లేచి, కాలకృత్యాల అనంతరం యోగ, ధ్యానం తర్వాత తెల్లని టీ షర్టు, తెల్లని ఫ్యాంటు ఇన్షర్టు చేసి, వైట్ సాక్సు, స్పోర్ట్స్ షూ తో చేతిలో స్టిక్ పట్టుకుని, ఆల్సేషియన్ డాగ్ జిమ్మీ వెంట రాగా మోర్నింగ్ వాక్ మొదలెడతారు.


దారిలో రోడ్డు మీద ఎక్కడైనా చెత్తా చెదారం కనబడితే మున్సిపల్ వర్కర్ల చేత శుభ్రం చేయిస్తారు. గేరేజిలో తన కారును తనే నీటి గొట్టంతో కడుగుతారు. మన పని మనం చేసుకోడానికి సిగ్గు పడకూడదంటారు. నీటిని వ్యర్థం చెయ్యకుండా పొదుపుగా వాడుకోవాలని, వాననీటి కోసం భూమిలో కుంటలు తవ్వించి ఆ నీటిని గార్డెన్ కి ఉపయోగిస్తూంటారు. రంగనాథ్ గారి ఏకైక పుత్రుడు పైలట్ ఆఫీసర్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్సులో విధులు నిర్వర్తిస్తున్నాడు.


ఒకరోజు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి కల్నల్ గారికి మాజీ సైనిక అధికారుల సమ్మేళనానికి డిల్లీకి రావలసిందిగా సమాచారం వచ్చింది. మర్నాడు ఉదయం డిల్లీ ఫ్లైటుకి టికెట్ బుక్కయింది.

అనుకున్న ప్రకారం మర్నాడు ఉదయం గేరేజి నుంచి డ్రైవర్ కారు తీసుకుని రాగా, కల్నల్ గారు వెనక సీట్లో కూర్చొని, ఆరోజు ఇంగ్లీషు పేపరు చూస్తున్నారు. కారు మైన్ గేటు దగ్గరకు రాగానే నైట్ వాచ్ మేన్ గూర్ఖా నరబహదూర్ నిలబడి సెల్యూట్ చేసి, కారు డ్రైవర్ని ఆపమని చేత్తో సంకేతం చేసాడు. కారు గేటు వద్ద ఆగిపోయింది. కారు అద్దాలు కిందకు దించి, "ఏమిటి విషయం?" అని కల్నల్ గారు అడిగారు.


"సాబ్, ఈరోజు మీ విమాన ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి. మీరు ప్రయాణం చేయబోయే విమానం ప్రమాదానికి గురవుతుంది," అని హిందీలో చెప్పాడు. అసలే సనాతన సంప్రదాయాల పట్ల నమ్మకమున్న కల్నల్ గారు, అశుభ సూచకమని తలచి, "కారును వెనక్కి తిప్పండి," అని డ్రైవర్‌కు చెప్పి, కారు దిగి హాల్లో సోఫాలో కూర్చున్నారు. 


ప్రయాణం మానుకుని వెనక్కి తిరిగి వచ్చి హాల్లో కూర్చున్న కల్నల్ గారిని ఆశ్చర్యంగా చూస్తున్న భార్యకు జరిగిన విషయం చెప్పారు.


ఇంతలో టీవీలో వార్తలు చూస్తున్న కల్నల్ గారికి 'బ్రేకింగ్ న్యూస్' అని — "హైదరాబాదు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు డిల్లీ బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ గ్రౌండ్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే సాంకేతిక లోపం వల్ల క్రాషై, అందులోని ప్రయాణికులందరూ చనిపోయి ఉంటారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి," అంటూ వార్తలు సాగుతున్నాయి.


టీవీలో వచ్చిన విషాద వార్త విని కల్నల్ గారు నిర్ఘాంతపోయారు. వెంటనే నౌకర్ని పిలిచి, మైన్ గేటు దగ్గర ఉండమని చెప్పి, నైట్ వాచ్ మేన్ గూర్ఖా నరబహదూర్ ని పిలిపించి — "నీకు ఈ ఉదయం ఫ్లైట్ క్రాష్ అవుతుందని ఎలా తెలిసింది?" అని నిలదీశారు.


కల్నల్ గారి క్రమశిక్షణ గురించి తెలిసిన బహదుర్ భయపడుతూ — "తను నేపాలీ లామా దేవత ఉపాసకుడినని, ఆ దేవత అనుగ్రహంవల్ల తనకు దగ్గరలో జరగబోయే దుర్ఘటనలు కలలో కనిపిస్తాయని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుందనీ, గతంలో వచ్చిన కొన్ని కలలు నిజమయ్యాయని చెబుతూ — ఈరోజు మీరు డిల్లీకి వెళ్లే ఫ్లైట్‌కు ప్రమాదం జరుగుతుందని నిద్రలో పీడకల వచ్చింది. అందుకే మిమ్మల్ని ప్రయాణం మానుకోమన్నాను," అంటూ రాత్రి నిద్రలో వచ్చిన కల వృత్తాంతం హిందీలో వివరించి చెప్పాడు.


కల్నల్ గారు ఒకవైపు — "పెద్ద ప్రాణాపాయం నుంచి బయటపడ్డాన"ని ఆనందపడుతూనే — "దీనిబట్టి నువ్వు నైట్ డ్యూటీలో పడుకున్నావని తెలుస్తోంది. నైట్ డ్యూటీ అంటే చాలా ఎలర్ట్‌గా ఉండాలి. దేశ సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద నైట్ డ్యూటీ చేసే సెంట్రీ మీద, అక్కడ బంకర్లలో సేదతీరుతున్న సైనికుల ప్రాణాలు రక్షింపబడతాయి. నైట్ డ్యూటీలో ఏమాత్రం అలసత్వం కనబరిచినా, శత్రు సైనికుల వల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశముంది. 


నువ్వు నన్ను విమాన ప్రమాదం నుంచి రక్షించావు. కానీ రాత్రి డ్యూటీ సమయంలో నిద్రపోయి విధుల్లో అలక్ష్యం చేసావు. కనుక నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. నీకు బహుమతిగా కొంత డబ్బు ఇస్తున్నాను. ఏ తప్పు జరిగినా సహిస్తాను కానీ విధుల్లో నిర్లక్ష్యం, దొంగతనం మాత్రం సహించను," అని తన మిలిటరీ క్రమశిక్షణ అమలు పరిచారు కల్నల్ రంగనాథ్.


"క్షమించండి సార్! మొదటి తప్పుగా మన్నించండి. ఇటుపైన నా డ్యూటీలో సావధానంగా ఉంటాను," అని వేడుకున్నాడు నరబహదూర్.


కల్నల్ గారి శ్రీమతి కూడా "మొదటి తప్పుగా క్షమించండి" అని కోరగా, మనసు మెత్తబడి — "ఇటుపైన డ్యూటీలో ఏ పొరపాటు జరిగినా ఊరుకునేది లేదని" హెచ్చరించి, శిక్షను వెనక్కి తీసుకున్నారు మాజీ కల్నల్ రంగనాథ్ గారు.


 సమాప్తం


 ***


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page