top of page

పరామర్శ

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #పరామర్శ, #Paramarsa


Paramarsa - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 25/05/2025 

పరామర్శతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


సుబ్బారావుకు ఆక్సిడెంట్ అయ్యిందని తెలిసి పరామర్శించడానికి పక్కింటి పాపారావు వచ్చాడు.


"ఏమయ్యా సుబ్బారావు! ఆక్సిడెంట్ ఎలా జరిగింది?" అని అడిగాడు పరమర్శ చేస్తూ


"బైక్ లో నేను స్లోగానే వెళుతున్నా. పెద్ద ఆడి కారు ఒకటి వచ్చి నా బైక్ ను ఢీ కొట్టి, వేగంగా వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు నేను ఎగిరి పక్కన ఉన్న గడ్డి కుప్పలో పడ్డాను" అని చెప్పుకొచ్చాడు సుబ్బారావు. 


"అవునా పాపం! బాగానే బతికి బట్టకట్టావు! మా చుట్టాల్లో ఒకబ్బాయికి ఇలాగే బైక్ పైన వెళుతుంటే కారే డ్యాష్ కొట్టింది. అలా కొట్టగానే అక్కడికక్కడే పోయాడు పాపం! అక్కడ గడ్డి నీకోసమే పెట్టినట్టున్నారు. ఇంతకీ దెబ్బలు ఏమైనా తగిలాయా లేదా? అడిగాడు పాపారావు.


"కొద్ది దెబ్బలతో బయట పడ్డాను!"


"బాగానే తప్పించుకున్నావు! అదేంటి కాలుకి బ్యాండేజీ ఉంది! దెబ్బలు తగల్లేదంటావు! అలా సింపుల్ గా తీసుకుంటే చాలా కష్టం! ఆ మధ్య మా ఫ్రెండ్ వాళ్ల తాలూకా అమ్మాయి ఇలాగే దెబ్బ తగిలితే తగ్గిపోతుందిలే అని తేలిగ్గా తీసుకుంది. తర్వాత చాలా కష్టం అయ్యింది. మరణం వరకూ వెళ్లి వచ్చింది" అంటూ కళ్ళు చికిలించి చూసాడు.


"క్రింద పడ్డప్పుడు కాలికి ఏదో రాయి గుచ్చుకున్నట్టుంది. చాలా నొప్పిగా ఉంది. మిగతా చోట్ల చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అంతే! డాక్టర్ మందులతో తగ్గిపోతుందని చెప్పాడు" అన్నాడు సుబ్బారావు.


"డాక్టర్లు అలాగే అంటారు చిన్నది అయినా పెద్ద దానితో కొట్టమని సామెత! మొన్నోసారి మా వేలు విడిచిన మేనత్త కొడుక్కి ఇలాగే వేలుకు దెబ్బ తగిలితే, చిన్నదే తగ్గిపోతుంది అని డాక్టర్ అన్నాడని ఊరుకున్నాడు.


అది కాస్తా పెరిగి ప్రాణాల మీదికి వచ్చింది! కొద్ధిలో పోయేవాడే పైకి! ఏదో అదృష్టం వల్ల బతికి బయట పడ్డాడు" అన్నాడు పాపారావు పెద్దగా ఉపన్యాసం ఇస్తూ.


సుబ్బారావుకు టెన్షన్ పెరిగింది. నిజంగానే దెబ్బలు తగిలిన ప్రదేశాల్లో పెయిన్ పెరిగిపోసాగింది. 


ఇదంతా లోపల్నుంచి గమనించిన సుబ్బారావు భార్య సుందరి, ఆ శాల్తీ నుంచి భర్తను రక్షించుకోవాలని వాళ్ళు ఉన్నచోటికి వెళ్ళింది.


"అన్నయ్య గారూ! మీ ఆవిడ అరుపు ఏదో వినిపించింది. ఏమైందో వెళ్లి చూడండి! క్రింద పడి కాలు విరగొట్టుకున్నారేమో! అవసరం అయితే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి. మీరు వెళ్లి చూసి, చెప్పండి. అంబులెన్స్ ను పిలుద్దాం!" అంది.


 "నిజమా!" అతని ముఖంలో ఆందోళన కనిపించింది.


"సరేనమ్మా నేను వెళ్తాను! జాగ్రత్త సుబ్బారావు!" అని వాళ్ళింటి వైపుకు పరుగులు తీసాడు.

 ఇలా ప్రతి చిన్న విషయానికి పరామర్శించడం కోసమని వచ్చి, తమ మాటల ద్వారా ఉన్న రోగం పెరిగేటట్టు చేయగల మనుషులు, గొడవలు పెరిగేలా చేసేవారు చాలామంది వుంటుంటారు.


అలాంటివారి మాటలకు అస్సలు విలువ ఇవ్వక్కర్లేదు! ఒక చెవి నుంచి విని మరో చెవితో ఇలా విని అలా వదిలేయాలి లేదంటే రోగం పెరిగి ప్రాణాల పైకి వస్తుంది నిజంగానే. 


అంతేకాదు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడతారు కొందరు తమ మాటలతో. వాళ్ళెంతో శ్రేయోభిలాషులమని చెబుతూ అన్ని విషయాల్లో సలహాలిస్తూ మాట్లాడుతారు. వారి స్వభావం తెలుసుకోలేకపోతే ఇక అంతే!


మీకు ఇలాంటివాళ్ళు ఎప్పుడైనా తారస పడ్డారా? కామెంట్స్ లో చెప్పండి.


సుధావిశ్వం


-సుధావిశ్వం





Comments


bottom of page