top of page

కర్మ సిద్ధాంతం - అంతరార్థం

#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #karmasiddhanthamAntharartham, #కర్మసిద్ధాంతంఅంతరార్థం, #TeluguArticleOnKarmaSiddhantham

karma Siddhantham Antharartham - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 25/05/2025

కర్మ సిద్ధాంతం - అంతరార్థం - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


"న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్" ఎవరైనా ఎప్పుడైనా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరనేది గీతా బోధన. ప్రకృతిలో ప్రతి జీవి కర్మలను చేస్తూ ఉంటాయి. సూర్యుడు ప్రకాశించడం, గ్రహాలు పరిభ్రమించడం అనే కర్మలను అనునిత్యం కొనసాగుతూనే ఉంటాయి. పశుపక్ష్యాదులు, జంతువులు క్రిమికీటకాలు కూడా ఆహార సంపాదనకి, సంతతి పెంచుకోవడానికి, స్వీయ రక్షణకు కర్మలు చేస్తూనే ఉంటాయి. కర్మ అంటే పని చేయడం. మంచి కర్మలు మంచి ఫలితాలను, చెడు కర్మలు చెడు ఫలితాలను కలిగిస్తాయి. బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, నా ఖర్మ ! అంటాం. ఈ ఖర్మ ఏంటి, ఆ కర్మకు ఈ ఖర్మకు సంబంధం ఏంటి ? ఖర్మ అంటే దుఃఖం, బాధ లేదా ప్రతికూల ఫలితం. ఇది కర్మ సిద్ధాంతం ద్వారా ఏర్పడుతుంది. కర్మ మరియు ఖర్మ ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. కర్మ అంటే మనం చేసే చర్య, ఖర్మ అంటే ఆ చర్య యొక్క ప్రతిఫలం. మనం మంచి కర్మలు చేస్తే, మనకు మంచి ఖర్మ ఉంటుంది. మనం చెడు కర్మలు చేస్తే చెడు ఖర్మ ఉంటుంది. అసలు ఈ కర్మలన్నీ చేయడం దేనికోసం ? తన సుఖం కోసం, తన సంతోషం కోసం, తన కుటుంబం కోసమేనా ? 


ప్రకృతిలో ఉన్న 84 లక్షల రకాల జీవరాశులులో 83 లక్షల 99 వేల 999 జీవరాసులకు మోక్షాన్ని పొందే అధికారం లేదు. ఒక్క మానవజన్మకు మాత్రమే మోక్షాన్ని పొందే అధికారం, అవకాశం ఉంది. చివరికి దేవతలకి కూడా మోక్షాన్ని పొందే అధికారం లేదు. అందుకే ఆది శంకరాచార్యులవారు "జంతునామ్ నరజన్మ దుర్లభం" అని అన్నారు. దుర్లభమైన ఇంత గొప్ప అవకాశాన్ని కలిగి ఉండి కూడా మనిషి తాను పొందిన జన్మను సార్థకం చేసుకోలేకపోతున్నాడు. మోక్షం కలగడం అంటే భగవంతుని పొందడమే. ఆయన దివ్య ధామానికి చేరడమే. భగవద్గీతలో కృష్ణుడు, ఉపనిషత్తులు, వేదాలు ఇదే విషయాన్ని వివరిస్తున్నాయి. మనం గత జన్మలో చేసుకున్న కర్మలు ఈ జన్మలో చేస్తున్న కర్మలు మన గతులను నిర్ధారిస్తాయి. గత జన్మ సంగతి మనమెరుగకపోయినా, కనీసం ఈ జన్మలోనైనా పుణ్య కర్మలను ఆచరిస్తూ అనగా ఎవరినీ బాధ పెట్టకుండా వీలైనంతలో ఇతరులకు సాయం చేస్తూ, భగవంతుని యందు భక్తిని కలిగి ఉండి, పుణ్య కార్యాలను చేసి దేహాన్ని విడిచిపెట్టి నట్లయితే ఆ జీవుడు దేవలోకానికి వెళ్లే ఉత్తమ గతులను పొందగలడు. మనిషి రోజువారీ చేసుకునే కర్మలతోపాటు మరి కొన్ని అదనపు కర్మలను కూడా చేస్తూ ఉంటాడు. వాటిలో పుణ్య కర్మలు ఉంటాయి, పాప కర్మలు ఉంటాయి. ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలుగా అని మూడు రకాలుగా చెప్పబడే కర్మల ఫలితాలు, ప్రభావాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. 


1) ఆగామికర్మలు:

రోజువారీగా మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మలనే చెప్పుకోవచ్చు. వాటిలో కొన్నింటికి వెంటనే ఫలితం కనబడుతుంది. కొన్ని కొంతకాలం తర్వాత, మరికొన్ని రాబోయే జన్మలలో ఫలితాలన్నిస్తాయి. కొన్ని కర్మలు మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం. అది ఒక కర్మ. భోజనం చేసిన వెంటనే మన ఆకలి తీరుతుంది ఆ కర్మకు ఫలితం దక్కిపోతుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు. ఉదాహరణకు దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం. అవన్నీ వెంటనే ఫలితాన్నిచ్చేవి కావు. కొన్నాళ్ళకు దాని ఫలితం వెలువడచ్చు. కొన్ని సందర్భాలలో అప్పటి కప్పుడే ఫలితాన్నివ్వలేక, అవి కూడబెట్టబడి ఉంటాయి. అంటే అటువంటి కర్మలు పక్వానికి వచ్చేవరకు అలా పోగయ్యి ఉంటాయి. ఈ జన్మలో మనం చేసే కర్మలన్నీ అగామికర్మలే. 


2) సంచిత కర్మలు: మనము పూర్వ జన్మలలో చేసిన (పుణ్యకర్మలు గాని పాపకర్మలు గాని) ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే, అలా పోగయ్యి ఉన్న కర్మలన్నీ సంచిత మవుతాయి. అంటే అవి ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు జీవుడితో పాటు వెళ్తాయి. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడి వెన్నంటి ఉంటాయి. ఆ విధంగా జీవుడు శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంతో సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. దీనికి కారణం 'సంచిత కర్మలు'.


3) ప్రారబ్ధ కర్మలు:

సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి వాటికి తగ్గ ఫలితాలను ఇస్తాయి. ఒక దుర్మార్గుడికి శిక్ష పడినప్పుడు అతని పాపం ఇప్పుడు పండిందని, ఒక మంచి జరిగినప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ అదృష్టం కలిగిందని అనుకుంటూ ఉంటాము. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. అంటే పుణ్య కర్మలు పక్వానికి వచ్చినట్లయితే, జీవుడు సుఖ సంతోషాలను అనుభవిస్తాడు. పాపకర్మలు పక్వానికి వచ్చినట్లయితే నరకయాతన అనుభవిస్తాడు. ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని పొందిన వెంటనే ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు. ఆ విధంగా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్నీ అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది. అయితే ఈ కర్మ ఫలాలను అనుభవించి వదిలించుకునే క్రమంలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపకుండా అదే జీవుడు అజ్ఞానంతో మరికొన్ని పొరపాట్లను కొత్త కర్మల ద్వారా చేసుకొని మళ్లీ పోగేసుకుంటాడు. అందుకే పునరపి జననం పునరపి మరణం అంటూ మళ్ళీ మళ్ళీ జన్మలు, శరీరాలు వస్తున్నాయి. 


కర్మ ఫలాలు : 

మళ్లీ దేహాన్ని ధరించడం అంటే కేవలం మనిషి దేహమనే కాదు. పశుపక్ష్యాదులు, కీటకాలు, జంతువులు ఏ దేహాన్ని అయినా ధరించవచ్చు. ఏ పాపకర్మలు అయితే అనుభవించాలో దానికి తగిన దేహాన్నే పొందుతాడు జీవుడు. ఆయా జంతువుల దేహంతో ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు. కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే ఉండదు. అత్యంత సంపన్నులుగా జన్మించి సర్వ సుఖాలను అనుభవించటానికి, మరియు గుడి బయట అడుక్కునే బిచ్చగాళ్ళ దీన స్థితికి కారణం వారి వారి ప్రారబ్ధమే. 'అతను ఏం పాపం చేసాడో ఇలా అనుభవిస్తున్నాడు' అదేవిధంగా 'ఏ జన్మలో చేసుకున్న నోము ఫలమో నాకీ అదృష్టం' అని అంటారు కదా. ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించేవరకూ జీవుడు మరల మరల జన్మిస్తూనే ఉంటాడు. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో (ఆరవ అధ్యాయం) 41 మరియు 42 శ్లోకాల్లో కృష్ణ భగవానుడు కర్మ ఫలాలను బట్టి ఎవరు ఎలాంటి జన్మ పొందగలరో బోధించడం జరిగింది. పుణ్య ఫలాల ద్వారా కలిసివచ్చిన సంపదలతో సత్కార్యాలు చేసినా, పాపకార్యములు చేసినా మళ్లీ అవి ఆగామి కర్మలుగా మారుతాయి. ఈ ఆగామి కర్మలు పక్వానికి వస్తే వాటిని అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. పక్వానికి రాని ఆగామికర్మలు సంచిత కర్మలుగా మారి మూటగట్టబడి ఉంటాయి. ఇదే కర్మ సిద్ధాంతం. 


కృష్ణ పరమాత్మ వర్గీకరణ:

కర్మలను అంటే పనులను శ్రీ కృష్ణుడు కర్మ, వికర్మ మరియు అకర్మ అని మూడు రకాలుగా వర్గీకరించారు. 

1) కర్మ: ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్దికి దోహదపడే విధంగా ఉండే వేద విహితమైన మంగళప్రదమైన పనులు. 

2) వికర్మ: శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకరమైన పనులు. ఇవి హాని కారకమైనవి మరియు ఆత్మను అధఃపతనానికి అణిచేసేవి. 

3) అకర్మ: ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మను బంధించవు. 

ఎన్ని పనుల్లో నిమగ్నమైన ఉన్నా, కర్మ యోగులు ద్వంద్వాలకు అతీతంగా జయాపజయాలతో సంబంధం లేకుండా, సుఖ-దుఃఖాలను ఒకేలా పరిగణిస్తూ అకర్మ స్థితిలో ఉంటారు. ఆ విధంగా ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించగలరో వారే మానవులలో నిజమైన బుద్ధిశాలురు అని పరమాత్మ ఉపదేశ సారాంశం. 


సాక్షీభూతాలు : 

ఈ సందర్భంగా మనలో ఒక ప్రశ్న ఉదయించే అవకాశం ఉంది. మనిషి చేసిన కర్మలు ఎక్కడ, ఎలా నిల్వ చేయబడతాయి ? సంచిత కర్మలన్నీ చిత్రముగా గుప్తముగా నిక్షిప్తమై ఉంటాయి. అందుకే యముడి దగ్గర చిట్టా రాసే ఉద్యోగికి గరుడపురాణంలో వేదవ్యాసుడు చిత్రగుప్తుడు అని పేరు పెట్టాడు. మనిషి చేసే పాపపుణ్యాలను ఎవరు చూడొచ్చారులే అని కొందరు తేలిగ్గా తీసుకోవచ్చు. అందుకు సాక్షిగా భగవంతుడు 16 రహస్య నేత్రాలను అమర్చాడు. అవి 5 పంచభూతాలు, 4 వేదాలు, సూర్యుడు, చంద్రుడు సూర్యోదయం, సూర్యాస్తమయం, పగలు, రాత్రి మరియు ఆత్మ. ఈ 16 మనిషి చేసే పాపపుణ్యాలను నిత్యం గమనిస్తూనే ఉంటాయి. మనిషి పంచభూతాలు నుండి వేదాల నుండి సూర్య చంద్రుల నుండి అన్నింటి నుండి తప్పించుకోగలిగినా, తన ఆత్మ నుండి మాత్రం తప్పించుకోవడం అసంభవం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ! 


ధన్యవాదాలు, లోకా సమస్తా సుఖినోభవన్తు ! 

ఆర్ సి కుమార్, సామాజికవేత్త


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page