ఇల్లాలి కోరికలు
- Mohana Krishna Tata
- 3 days ago
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #IllaliKorikalu, #ఇల్లాలికోరికలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Illali Korikalu - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 28/06/2025
ఇల్లాలి కోరికలు - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఒరేయ్ రమేష్! నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను..?" అన్నాడు రాము.
"ఏమిటో ఇంత సడన్ గా..?"
"ఏ పని చెయ్యాలన్నా చదువు, అర్హత ఉండాలి. బాగా చదువుకున్నా, ఇక్కడ పెద్ద ఉద్యోగాలు రావట్లేదు, అక్కడ ఆ బాధే లేదు"
"నిజమే..నువ్వు కూడా ఎన్ని సంవత్సరాలని ఇలా చిన్న ఉద్యోగం చేస్తావు చెప్పు..ఒక రాయి వెయ్యడమూ మంచిదే..ఇది నీకు వచ్చిన ఆలోచనేనా?"
"ఇది మా ఆవిడ ఇచ్చిన సలహా..నీకు తెలుసుగా మా ఆవిడ ఏది చెబితే అది చేస్తాను".
"అవును తెలుసు"
"ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఏం ప్రయోజనం చెప్పు..? ఈఎంఐలు, అప్పులు తప్పితే ఏముంది?" అన్నాడు రాము.
"నిజమే..! మా ఆవిడ అడిగే వారానికి నాలుగు పట్టుచీరలు కూడా కొనలేకపోతున్నాను..ఎందుకు ఈ బతుకు" అని బాధపడ్డాడు రమేష్.
"బాధపడకు..నీకూ మంచి టైం వస్తుంది లే"
"రమేష్! ఎమ్మెల్యే అయితే, చాలా ఫ్రీ అంట కదా..మా ఆవిడ చెప్పింది"
"అవును.."
"అవడానికి చాలా కష్టపడాలి..డబ్బు ఉండాలి..పేరు ఉండాలి"
"మా ఆవిడకు మా కాలనీలో తెగ పేరు ఉందిలే..! అందరూ వడ్డీ రాధ అంటారు. డబ్బులు వడ్డీలకు తిప్పుతుందిగా.. బాగా కష్టపడుతుంది. డబ్బులు కూడా ఆమాత్రం ఉంటాయి. పైగా, నోరు కూడా పెద్దదే..మైక్ అవసరం లేకుండానే స్పీచ్ ఇవ్వగలదు"
"అవుననుకో..కానీ రాజకీయాలలో నెగ్గుకు రావాలంటే, నీకు బాగా మాట్లాడం రావాలి కదా..లేకపోతే ఎలా? "
"ఒరేయ్..! రేపు ఆదివారం మా ఇంటికి రా..మా ఆవిడతో మాట్లడుదుగాని..నీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి" అన్నాడు రాము.
ఆదివారం, అందరూ రాము ఇంట్లో కలిసారు...
"అన్నయ్యగారు..! బాగున్నారా?"
"చూడరా..చెల్లాయికి నేనంటే ఎంత ప్రేమో.." మురిసిపోయాడు రమేష్.
"నువ్వంటే కాదేమో..నువ్వు చెయ్యబోయే సహాయానికి ముందుగా బిస్కెట్ వేస్తోంది.." అన్నాడు రాము.
"అలాంటిదేమీ లేదు..ఊరుకోరా రాము"
"అన్నయ్యగారు..! కాఫీ తీసుకోండి.. మీకు మంచి ఐడియాస్ వస్తాయి. మా ఆయన ఎమ్మెల్యే అవ్వాలి..నా కోరికలు తీరాలి"
"ఈసారి కమ్మని కాఫీ తో.. కాస్ట్లీ క్రీమ్ బిస్కెట్ వేసింది మా ఆవిడ..పని అయిపోయినట్టే ఇక "
"ఏమండీ..! మీరు ఉండండి!".
"ఉంటానులే..నువ్వు చెప్పు".
"అన్నయ్యగారు! మా ఆయన పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు. మీరే సహాయం చెయ్యాలి..అసలే మా ఆయనికి నోట్లో నాలుకలేదు..నేనే ఆయన బదులు నా నాలుకతో మాట్లాడుతుంటాను. నోట్లో వేలు పెడితే, కొరకలేరు మా ఆయన..పాపం".
"నిజమే..తెలుస్తూనే ఉంది. నువ్వే పాలిటిక్స్ లోకి వెళ్ళొచ్చుగా మీ ఆయన బదులు?" అడిగాడు రమేష్.
"నేను పాలిటిక్స్ లో బిజీ అయిపోతే, నాకు షాపింగ్ చెయ్యడానికి టైం ఎక్కడ ఉంటుంది? గంటకొక చీర మార్చుకోడానికి అసలే టైం ఉండదు..ప్రపంచంలో ఉన్న చీరలన్నీ కట్టాలనేదే నా చిన్ని కోరిక. మా ఆయనకు నేను వెనుక ఉండి సపోర్ట్ ఇస్తాను".
"మంచితనానికి, అమాయకత్వానికి కాంబినేషన్ రాము. మీ ఆయనని గెలిపించడానికి నీ ప్లాన్స్ ఏమిటో..?"
"రాజకీయాలలోకి ఎంట్రీ కోసం తప్పులు చెయ్యనిది ఎవరు చెప్పండి? తక్కువ తప్పులు చేసేవారిని ప్రజలు నమ్ముతారు! పైగా ఈ మధ్య, ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇస్తారేమో అని నమ్మకం.. ఐదు సంవత్సరాలు సరిపోదా సంపాదించడానికి..? అసలే ఆయన నాకు కావాల్సిన చీరలు, నగలు కొనలేకపోతున్నారు. ఇల్లాలి కనీస కోరికలైన చీరలు, నగలు, షాపింగ్ కోరికలు కోసం నేను ఇలా చెయ్యడం తప్పా? పేరు, హోదా కావాలనుకోవడం తప్పా అన్నయ్యగారు?"
"నిజమే..తప్పేమిలేదు. ఇల్లాలి కోరికలు తీర్చాలంటే...ఇలా పాలిటిక్స్ లోకి దిగాలి, లేకపోతే ఏ బ్యాంకు కో, ఏటీఎంకో కన్నాలు వేసుకోవాలి..ఈ ఉద్యోగాలు ఎక్కడ సరిపోతాయి?"
"మీరు మరీ అన్నయ్యగారు..! పెళ్ళాం కోసం ఆ మాత్రం కొనకపోతే ఎలా అండి? మీ మగాళ్ళకి పెళ్ళాం అందంగా ఉండాలిగా మరి!"
"పెళ్ళాం అందం కోసమే భర్తలందరి పాట్లు. మాకేమో రెండు జతలు ఉన్నా చాలు..ఇంకా చెప్పాలంటే ఒకే ప్యాంటు నెల రోజులు వేసుకుంటాం. అందుకే చూడు..చీరల షాప్స్ ఎక్కువ ఉంటాయి, మగాళ్ళ బట్టల షాపులకన్నా" అన్నాడు రమేష్.
"ఏమో..! మేము బట్టలు కొనడం చేత, ఎంత మందికో ఉపాధి దొరుకుతుంది మరి" అని మురిసిపోయింది రాధ.
"ఇది నిజమే.."
"నాకూ రోజు వంట చెయ్యాలంటే కూడా కష్టంగా ఉంది. ఆయన ఎమ్మెల్యే ఐతే, హ్యాపీగా పనివారిని పెట్టుకోవచ్చు..నేను ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవొచ్చు..ఎక్కడ చూసినా బట్టల షాపులే కదా"
"నీ ఇష్టం..! అయినా మీ ఆయన గెలుస్తాడని నీకు అంత నమ్మకం ఏమిటో?"
"గెలవడానికి ప్రాబ్లం లేదు. ఈ కాలనీలో నేను డబ్బులు వడ్డీలకు తిప్పుతాను. వడ్డీ మాఫీ చేస్తే, ఓట్లన్నీ మనకే. బీరువాలో మూలుగుతున్న నా చీరల్ని, ఓటుకొకటి పంచేస్తాను. తర్వాత ఎలాగో కొత్తవి, మంచివి కొంటాను కదా..! ఫ్రీ కేబుల్ టీవీ.. ఆడవారు సీరియల్స్ చూడడానికి..ఇవి చాలు ఆడవారి ఓట్లు పడడానికి. ఇక మగవారికి ఓటుకొక పెద్ద బాటిల్ ఇస్తే సరి.. "
"ఇండిపెండెంట్ గా మా ఆయన గెలిచిన తర్వాత.. ఎలాగో పెద్ద పార్టీలోకి మంచి ఆఫర్ వస్తుంది. ఎవరు ఎక్కువ ఇస్తే, ఆ పార్టీ లోకే. వెంటనే, ఒక వంద పట్టు చీరలు, నగలు, ఒక పెద్ద విల్లా, వీకెండ్స్ కోసం ఒక ఫామ్ హౌస్ కొనేస్తాను. ఫైవ్ గోల్డెన్ ఇయర్స్ లో జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. తర్వాత సొంతంగా చీరలు, నగల షాపులు పెట్టుకుంటే ఈ జీవితానికి ఇంకేంటి కావాలి?"
"నీ కోరికలు తీరాలంటే, మీ ఆయన ఎమ్మెల్యే అవాల్సిందే..అవాల్సిందే చెల్లి"
"మా ఆయనకి బాగా మాట్లాడం నేర్పిస్తే చాలు..మిగిలింది నేను చూసుకుంటాను"
"అది నా వల్ల కాదు. నాకు తెలిసిన ఒక కోచింగ్ సెంటర్ ఉంది..అక్కడ మీ ఆయనలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు"
"నిజామా..! అలాంటివి కూడా ఉన్నాయా..?" ఆశ్చర్యంగా అడిగింది రాధ.
"ఎందుకు లేవు..అవసరాలని బట్టి అన్నింటికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.."
మర్నాడు అందరూ కోచింగ్ సెంటర్ కు వెళ్లారు..
"మీ ఆయనగారు చూస్తే, బొత్తిగా అమాయకంగా ఉన్నారే..ఈయనకి ఒక స్పెషల్ ప్యాకేజీ ట్రైనింగ్ ఉంది. ఏ టూ జెడ్ అన్నీ నేర్పించేస్తాము.." అన్నాడు కోచింగ్ హెడ్
"ఏం నేర్పిస్తారు..?"
"ధైర్యంగా, గట్టిగా ఎలా మాట్లాడాలి, బూతులు ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తాము.."
"బూతులా..? అవసరమా..?" అడిగింది రాధ.
"అయ్యో ఎంత మాట..! అవి రాకపోతే, పంచ్ డైలాగ్స్ ఎలా వేస్తారు చెప్పండి..! కానీ ఒకో బూతుకి వేరే ఛార్జ్ ఉంటుంది. డిబేట్ లో, సభలో మాట్లాడడానికి సెపరేట్ ట్రైనింగ్ ఇస్తాము. కావాల్సిన అన్నీ ఇక్కడ నేర్పిస్తాము"
ఆ మాటలు వినగానే..కళ్ళముందు చీరలు, నగల వర్షం కురుస్తున్న ఫీలింగ్ కలిగింది రాధకు.
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments