top of page

ఇల్లు

#MBhanu, #Mభాను, #Illu, #ఇల్లు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Illu - New Telugu Story Written By M. Bhanu

Published In manatelugukathalu.com On 15/05/2025

ఇల్లు - తెలుగు కథ

రచన: M. భాను


“నేను చచ్చిపోయిన తర్వాత మాత్రమే ఇల్లు కట్టుకోండి” కరాకండిగా చెప్పింది సావిత్రి. 


ఆ మాటలకు నిస్సహాయంగా చూశాడు చిట్టిబాబు తన భార్య వంక. 


సావిత్రి ఇంకా ఇలా అంటోంది, “నేను కష్టపడి ఆస్తినంతా భద్రంగా ఉంచాను, నా చిన్న కొడుకు ఇల్లు కట్టాడు. నేను ఇందులోనే ఉంటాను”. 


ఆ మాటలకు చిట్టిబాబు కోపంగా తల్లి వంక తిరిగి “వాడు కట్టడం ఏమిటి? నువ్వు సంపాదించిన డబ్బులతోనే కదా నీ పేరు మీద లోన్ పెట్టి కట్టాడు.. నాన్నగారు సంపాదించిన ఆస్తి ఈ స్థలం. ఇప్పుడు నాన్నగారు లేరు, తమ్ముడు లేడు. ఈ స్థలం నా పేరు మీద రాశావు. ఇల్లు కూడా నా పేరు మీదే ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలు కూడా ఎదిగి వచ్చారు. వాళ్లకి పెళ్లిళ్లు చేయాలంటే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఇల్లు చూస్తారు. 


ఈ ఇల్లు చూసావా ఎప్పుడు మీద పడిపోతుందో తెలియదు.. ఇలాంటి ఇల్లు చూసిన తర్వాత పిల్లలకి ఎవరైనా పిల్లని ఇస్తారా? నువ్వే ఆలోచించమ్మా. పెద్ద దానివి, పోనీ నేను నిన్ను బయటకు తరిమేస్తానని ఏమన్నా భయంగా ఉందా? పాడైపోయిన ఇల్లు తీసి కొత్త ఇల్లు కడుతానంటున్నాను అంతే కదా! 


ఈ రెండు గదులు ఇంటిలో ఎంతమంది ఉంటారు చెప్పు? ఒక ఆరు నెలలు కళ్ళు మూసుకుంటే ఇల్లు అయిపోతుంది. అప్పుడు నీకు ఒక గది కూడా ఉంటుంది”. 


“నువ్వు ఎన్నైనా చెప్పురా. నాకు ఇల్లు తీయడానికి మనసు ఒప్పడం లేదు. చస్తే ఇందులోనే చస్తాను”.

 

ఆ మాటలకి సావిత్రి కోడలికి ఒళ్ళు మండింది, “అదేంటి అత్తయ్యా అంత మూర్ఖత్వంగా మాట్లాడుతారు. ఈయన మీ కొడుకే కదా! మీ చిన్న కొడుకు ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అత్తారింటి దగ్గర ఇల్లు కట్టుకున్నాడు. అర్ధాంతరంగా చనిపోయాడు. చనిపోయే ఆరు నెలలు ముందే కదా ఆస్తి పంపకాలు చేసుకున్నాం. అప్పటికే అన్ని అమ్మేసుకున్నాడు, తాకట్టులో పెట్టాడు. 


మా పేరు మీద ఉన్న ఈ ఒక్క ఇంటి నైనా మమ్మల్ని వాడుకోనివ్వండి. మేము సుఖపడాలని మీకు లేదా! ఇన్నాళ్లు మీరు, మీ చిన్న కొడుకు కలిపి అన్ని మీ ఇష్టప్రకారమే చేసుకున్నారు. మీ చిన్న కోడలు మిమ్మల్ని రావద్దని చెప్పేసింది. ఎప్పటికైనా చూసేవాళ్ళు మేమే కదా, అలా అని కూడా కాదు. పెద్దకొడుకుగా ఈయన బాధ్యత కూడా మిమ్మల్ని చూడవలసింది. 


మీరు ఈ రెండు రోజులు ఆలోచించుకొని మాకు కచ్చితంగా ఏ వివరం చెప్పండి. ఇప్పటివరకు మీ పెద్ద కొడుకుని మోసం చేసింది చాలు. మీరు మీ చిన్నబ్బాయి కలిసి మాకు చెప్పకుండా అన్ని ఆస్తులు అమ్మేసుకొని మావయ్య గారి పేరు మీద ఉండగా ఈయన సంతకం కావాల్సి వచ్చి ఇదైనా చెప్పారు. లేకపోతే ఇది కూడా మాకు ఇచ్చేవారు కాదు. 


మీ పెద్దబ్బాయి కి ఎంత ప్రభుత్వ ఉద్యోగం అయినా చాలీచాలని జీతం ఇద్దరు పిల్లలతో మేము అక్కడ ఎలా గడిపామో ఏనాడైనా అడిగారా !? ఎవరైనా వచ్చి చూశారా మమ్మల్ని?


ఇన్నాళ్లు ఈయన కూడా ఏదో తమ్ముడు చూసుకుంటున్నాడు.. అమ్మ కూడా అక్కడే ఉంది.. అని ఏ విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మీ అబ్బాయి కూడా రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఇక్కడ గడపాలని వస్తే మీరు ఎందుకండి ఇలాగా?


మీరు అవునన్నా కాదన్న ఇల్లు కూలగొడతాం. వేరే ఇల్లు కడతాం. మా పిల్లలు పెళ్లిళ్లు అవ్వాలి. అది ముఖ్యం మాకు. మాది పోయే వయసు” అని సుజాత గట్టిగా అత్తగారితో మాట్లాడేసరికి ఆవిడ మొహం చిన్న బుచ్చుకుని పక్కింటికి వెళ్లిపోయింది. 


చిట్టిబాబు తన భార్యతో “ఎందుకు అంత కఠినంగా మాట్లాడావు? మా అమ్మ బాధపడుతోంది చూడు” అన్నాడు. 


“అవునా ఆవిడ ఇప్పుడు బాధపడుతూ ఉందని మనం మెత్తగా ఊరుకుంటే రేపు జీవితాంతం మనం మన పిల్లలు బాధపడాలి. మీ మెతకతనమే ఇంతవరకు తీసుకువచ్చింది” అని విసురు గా లోపలికి పోయింది సుజాత. 


దాంతో ఏమి చేయాలో తోచలేదు చిట్టిబాబుకి బుర్ర పట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రి అందరూ ముభావంగానే భోజనాలు చేసి పడుకున్నారు.. 


ఆ మర్నాడు ఉదయం సావిత్రి, చిట్టిబాబుని సుజాతను పిలిచి “సరే మీ ఇష్టం వచ్చినట్టే కానీ ఇవ్వండి." అంది. ఆ మాటలకు భార్యాభర్తలు ఇద్దరు మొహాలు వెలిగిపోయాయి. 


ఇంకా సావిత్రి ఇలా అంది "ఏదో నీ తమ్ముడు చిన్నవాడు ఉద్యోగం లేదు కదా అని ఆస్తులు అన్ని వాడి పేరు మీదే రాసి చాలా పెద్ద తప్పు చేశాను. వాడది అలుసుగా తీసుకొని రాత్రి పగలు తాగి అప్పులు చేసి భార్యా పిల్లల్ని సుఖపెట్టకుండా, ఆరోగ్యం పాడు చేసుకుని వాడి మానాన వాడు సుఖంగా పోయాడు. ఇప్పటికే చాలా అన్యాయం చేశాను, మీ ఇష్టం వచ్చినట్టే చేయండి."

 

 ఆ మాటలకు వెంటనే సుజాత "ఫోన్ చేసి సిద్ధాంతిని పిలిపిస్తాను" అంది. 


 దానికి అత్తగారు సావిత్రి "ఏమి అక్కర్లేదు. రాత్రి నేను పక్కింటి నుంచి ఫోన్ చేశాను. ఆయన మధ్యాహ్నం వస్తాను అన్నారు. అప్పుడు మాట్లాడి ముహూర్తం పెట్టుకోండి ఇల్లు పడకొట్టడానికి, శంకుస్థాపనకి."

 

దానికి సుజాత ఆనందంతో అత్తగారి చేతులు పట్టుకుని "మా మంచి అత్తయ్య" అంటూ లోపలికి వెళ్ళిపోయింది.


చిట్టిబాబు "థాంక్స్ అమ్మా" అన్నాడు,


"మనలో మనకి థాంక్స్ ఏమిట్రా, అన్ని నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి, శుభం" అంది. 


 ఆ మాటలకి నవ్వుకుంటూ ఒక్క రాత్రిలోనే మా అమ్మ మనసు ఎలా మారిపోయిందో అనుకున్నాడు చిట్టిబాబు. 


సావిత్రి, ‘రాత్రి పక్కింటికి వెళ్లడం మంచిదయింది ఆ నిర్మలమ్మ చెప్పిన మాటలకు నాకు కళ్ళు తెరుచుకున్నాయి, లేకుంటే పాడు పడిపోయిన ఇల్లు, చనిపోయిన కొడుకు కోసం ఎన్నాళ్ళని బాధపడుతూ ఉన్న వాళ్ళని బాధ పెడతాను. ఇప్పుడు వీళ్లను ఇల్లు కట్టుకోనివ్వలేదని నన్ను వదిలేసి పోతే నా పరిస్థితి? జీవిత చరమాంకం వీడి దగ్గరే ఉండాలి నేను.’ అనుకుంది. 


కాలమాన పరిస్థితులన్నీ చెప్పిన నిర్మలమ్మకి థాంక్స్ చెప్పుకుంటూ కళ్ళు మూసుకుంది సావిత్రి. 


M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.

ధన్యవాదములు 🙏



bottom of page