top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 10'Jeevana Chadarangam - Episode 10' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 25/02/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 


పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 


ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 


బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. 


మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. 


రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి. రాధకు పితృ సమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న తన అక్కయ్యను తనతోనే ఉంచుకుంటుంది రాధ. 


పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి. 

సిరికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది మైత్రి. 


ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 10 చదవండి. 


హైదరాబాదుకు బెంగళూరు నుంచి సురేష్ కుటుంబంలోని వారి రాకపోకలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. హైదరాబాద్ లోని ఒక పెద్ద వ్యాపారవేత్తతో లావాదేవీలు, వ్యాపార విస్తరణ అంటూ పెద్ద పెద్ద కధలు చెప్పేవారు. వారు ఏమి మాట్లాడిన అందులో ఎదో ఒక తప్పుడు మాట ఉండడం, అబద్దాల పుటలు దాగుండడం ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతుంది రాధ. సురేష్ అన్నయ్య వాళ్ళ ధోరణి అసలు నచ్చదు రాధకు. గౌరి మాత్రం అన్నయ్య పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తూ సిరిసంపదల్లో తుల తూగుతున్నాడని సంబరిపడిపోయేది. 


వారి వ్యాపార విస్తరణలో భాగంగా హైద్రాబాదులో ఏర్పాటు చేసిన పార్టీకి వ్యాపారానికి సంబంధించిన వారినే కాకుండా ఈ సారి ప్రత్యేకంగా అన్నదమ్ములనూ అక్క-చెల్లెళ్ళనూ అందరినీ ఆహ్వానించారు రాజా దంపతులు. ఆ సందర్భంగా మరోసారి అక్కడి వారంతా కలుసుకున్నారు. 


ఎన్నో హంగులూ, మరెన్నో గొప్పలు, తాగుళ్ళు తందనాలతో, ఫైవ్ స్టార్ హోటల్లో పార్టి ఏర్పాటు చేసారు. పెద్దన్నయ్య ఎప్పుడూ వుండడమే తప్ప హంగామాలు చెయ్యడు. 


అన్నలు ఎదిగిన స్థాయిని చూసి ఆనందంతో చిందులు వేసింది గౌరి. ఆ విందులూ వినోదాలనూ చూసి కళ్ళు చెదిరి పోయాయి. మహదానంద పడిపోయింది. 


రాధకు మాత్రం ఇటువంటి ఆర్భాటాలు ఎక్కువగా నచ్చవు కనుక పిలిచిన మర్యాదకు వెళ్ళి నిలబడింది. 


ప్రత్యేకంగా బెంగళూరునుంచి వచ్చి, అకారణంగా ఇంత ఆర్భాటంగా అందరిని చేరతీసి విందులు చెయ్యడం వెనుక ఏదో ఉద్దేశ్యం వుండే వుండాలే అనుకుంది రాధ. వ్యాపార విషయాల్లో చుట్టాలను కలుపుకోవడం మునుపెన్నడూ ఎరుగరు. ఏదో నిరూపించడానికే ఈ ప్రయత్నం కాబోలు అనిపించింది. అయితే, ఆమెకు అప్పటికి అందులోని అంతరార్ధం అంతగా అర్ధం కాలేదు. మిగిలినవారిని తనవైపుకు తిప్పుకోవడం సులభమే కానీ, రాధను ఆకట్టుకునే ప్రయత్నమే ఇది అని ఆమె గ్రహించలేకపోయింది. 

******


మైత్రి నడవడికలో వచ్చిన మార్పులేవీ ఎవ్వరితోనూ చర్చించడం మానేసింది సిరి. తన చదువు తన గొడవ తాను చూసుకుంటోంది. ఇదే కోరుకున్న మైత్రి, అదే అవకాశంగా తీసుకుని, కాలేజీ ఎగ్గొట్టి బయట తిరగడం మొదలు పెట్టింది. అసలే అత్తెసరు మార్కులు వస్తున్నా, చదువుకి పంగనామాలు పెట్టి ఎక్కడికి వెళుతోందీ ఏమి చేస్తోందీ ఇంట్లో అమ్మకు చెప్పకుండా, ఆమెకు తెలియకుండా తిరిగడం అలవాటైపోయింది. చదువుకి ఇంచుమించు పూర్తిగా స్వస్తి చెప్పినంత పనే చేసింది. 


“సిరి, నిన్న క్లాసులో జరిగినవాటి నోట్స్ ఇవ్వవ్వా. ఈ పెళ్ళిళ్ళుకాదు కానీ, కాలేజీ మానినందుకు ఆ తరువాత మనం పడేపాట్లు ఎవ్వరికీ అర్ధంకావు. నిన్నటి నీ నోట్సు నీ దగ్గరే వుంది కదా? ఇంతలో మైత్రికి ఇచ్చెయ్యలేదుగా? ముందుగా నాకే ఇవ్వవే, లేటైతే మళ్ళీ నాకు తడిపి మోపుడవుతాయి. గబగబా రాసుకుని ఇచ్చేస్తానులే. మైత్రి కూడా రాయలేదని తెలుసుకానీ, నేను రాసుకుని దానికి ఇస్తానులే. ”అంటూ హడావిడి పడిపోతూ అంది రమ్య. అదేంటే, అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్న సిరి అడిగే లోపే, "మీ మైత్రిని నేను నిన్న ఆ హోటలులో చూశానే. మా మావయ్యకూతురు పెళ్లికదా, బయట వూళ్ళనుంచి వచ్చిన వాళ్ళకి బసేరా హోటల్ లో బస ఏర్పాటు చేసాము. అందరమూ కళ్యాణమండపానికి వెళుతూ, వాళ్ళను తీసుకు వెళ్ళడానికి అక్కడికి వెళ్ళాము లేవే, అక్కడ కనిపించింది. నోట్సు మాత్రం నేను రాసుకున్నాకనే ఇస్తాను" అంటూ వాగుడుగాయ రమ్య పుస్తకం తీసుకుంటూ సహజంగా చెప్పేసింది. 


రమ్య మాటలు విన్న సిరికి ఒక్కసారి గుండెల్లో రాయి పడ్డట్టైంది. ఐతే, ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో తానుంది. ఇదివరలోనే మైత్రి, ఇంచుమించు వార్నింగ్ ఇచ్చినంతపని చేసి, తన విషయాల్లో కలగచేసుకోవద్దని ఖచ్చితంగా చెప్పేసింది. అంత జరిగాక మళ్ళీ ఏమొహం పెట్టుకుని దాంతో మాట్లాడతాను, అడుగుతాను అని మనసులోనే అనుకుని స్తబ్దిలా మాట్లాడకుండా ఉండిపోయింది. 


ఐతే, తెలిసీ తెలియక ఏదైనా చిక్కుల్లో పడుతుందో ఏమిటోనని ఎంతో ఆందోళన పడింది. రాధ అత్తయ్యకి చెపితే ఆమె ఎలా తీసుకుంటుందో? ఎలా రియాక్టవుతుందో. అసలే మైత్రి అంటే ఎనలేని ప్రేమ, విపరీతమైన గారం. ముందు అసలు నా మాటను నిజం అని కూడా నమ్ముతుందో లేదో. నమ్మి మైత్రిని నిలదీస్తే, దాని తాకిడికి నేను తట్టుకోగలనా? మైత్రి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే? అసలు విషయమేంటో తెలియకుండా ఏమని చెప్పను? ఒక్క రమ్య మాటను తీసుకుని నేను అంత ధైర్యం చేయలేను అనుకుంది. అసలే మైత్రి అన్న మాటలకి ఇప్పటివరకు నా మనసు తేరుకోలేదు, ఇప్పుడు ఏదైనా అత్తయ్య కూడా అనేసిందంటే నేను అసలు భరించలేను నాకు ఎంతో కష్టమవుతుంది. ఇట్టి పరిస్థితిలో నేను చేసేది ఏమి లేదు. నోరు మూసుకుని ఉండడం తప్ప అని అనుకుంది. 


తనకు పెద్ద చదువు లేనందువల్ల సిరి ఇద్దరి అత్తయ్యల్లాగా మంచి ఉద్యోగంలో లేననీ, రేపు తన బిడ్డ అలా అవ్వకూడదనీ ఎంతో కష్ట పడి మైత్రికి అన్ని రకాల ప్రైవేటు క్లాసులూ పెట్టించింది రాధ. దాన్ని బాగా చదివించి దాని కాళ్ళ మీద అది నిలబడేలా చెయ్యాలి, ఒక మంచి ఉద్యోగంలో చూడాలి అని ఎంతో ఆశ పడింది. ఇన్నాళ్లూ ఇది సరిగ్గా చదవడం లేదు సరికదా, ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు కూడా చేస్తోంది. పాపం రాధ అత్తయ్య ఎంత బాధ పడుతుందో? అని అనుకుంది. ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానే అని బాధ పడింది సిరి. 


తనలాగా బంట్రోతు ఉద్యోగం కాకుండా కనీసం ఒక సూపరువైజరు స్ధాయి ఉద్యోగంలో ఉండాలి అని ఆమె కోరుకోవడంలో తప్పేముంది. కోరుకోవడం మాత్రమే కాకుండా అందుకు కావలసిన కృషి కూడా చేయకపోలేదు. నాకే ఇవన్నీతెలుస్తుంటే, ఆ మైత్రికి తెలియక్కర్లేదా? అని ఆక్రోశ పడింది. తెలిసే ఇలా ఎందుకు చేస్తోంది. కష్టపడి చదివిస్తున్న తల్లితండ్రుల కళ్ళు కప్పి ఎవరిని కలవడానికి హోటల్ కి వెళ్తోందో? అసలు అలాంటి చోట్లకు తనను ఎవరు తీసుకువెళుతున్నారో? ఈ ఊళ్ళో నాకు తెలిసినంత వరకూ అలాంటి స్నేహితులు తనకెవ్వరూలేరే? ఎన్నెన్నో సమాధానాలు లేని ప్రశ్నలతో సతమతమవుతోంది సిరి. 


తనదైన బాణిలో మైత్రి మనస్తత్వాన్ని, ఇప్పుడు తను పాల్పడుతున్న కార్యకలాపాలను పరిశోధిస్తూ విశ్లేషించడానికి ప్రయత్నించింది సిరి. ఎలాంటి ఆరా తీయకుండా, విషయంలో ఎలాంటి అధరాలు లేకుండా రాధా అత్తయ్యకు ఎలా చెప్పగలను అనుకుంది. మైత్రిని అలా వదిలెయ్యడానికీ మనసొప్పడంలేదు. ఎదో చెయ్యాలి. ఇంకా అరా తియ్యాలి అని మనసులోనే తీర్మానించుకుంది. 


వెంటనే రమ్య దగ్గరకు వెళ్లి, "చూడు రమ్య, నేను అడిగే విషయం నాకు సూటిగా నిజం చెప్పాలి. నన్ను నోట్స్ అడిగినప్పుడు నువ్వు మైత్రిని హోటల్లో చూశానన్నావు. ఈ విషయం గురించి మరెక్కడా నోరు మెదప కూడదు" అని ముందుమాటగా చెప్పి, "అసలు మైత్రిని నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో చూసావు? ఇంతకు ముందు ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడైనా చూసావా? మన కాలేజీకి ఎప్పుడైనా వచ్చాడా? ఎలా ఉంటాడు? అన్ని వివరాలతో నాకు విపులంగా చెప్పు. దాని శ్రేయస్సు కోరి అడుగుతున్నాను, ప్లీజ్. " అని దీనంగా అర్థిస్తూఅడిగింది సిరి. 

*******


“మా మైత్రి ఈ ఏడాది ఈ డిగ్రీ గట్టెక్కుతుందన్న నమ్మకం నాకు లేదు సర్, ఏం చెయ్యాలో పాల్పడడం లేదు. ఇంకో రెండేళ్ళల్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామనుకోండి. ఐతే సమస్యకు అది సమాధానం కాదు కదా!! మీకు తెలియనిదేముంది, చిన్నప్పటినుంచి నాకున్న కోరికల్లా, నా బిడ్డలు మంచి చదువులు చదువుకుని స్వయంకృషితో పైకి రావాలన్నదే. చదువుకుని స్వతంత్రురాలిగా తన సంపాదనతో తాను బతకాలి, ఆ తరువాతే పెళ్లి అనుకున్నాను. ఐతే ఈ చిన్న కోరిక కూడా నాకు తీరేటట్టు లేదు. మైత్రి నా మాట దక్కించేటట్టు కనిపించట్లేదు. ఇంచుమించు ఈ చివరి మజిలీకి వచ్చాక మరి బెట్టు చేస్తోంది అనిపిస్తోంది. అసలు చదవడమే ఇష్టంలేనట్టుగా ఉంటోంది. 


నేను బోలెడు పోగుచేసాను, 60-70 తులాలు బంగారం పెట్టి వైభవంగా పెళ్ళిచేస్తానుకోండి. అయితే యీ రోజుల్లో చదుదవకున్న అబ్బాయిలు పెట్టుపోతలు కాకుండా అమ్మాయికీ చదువుండాలనేగా అనుకుంటున్నారు. అది న్యాయమైన కోరికే కుడాను. అయితే కట్నాలూ, ఆస్తులూ అంతస్తులూ కొలమానాలుగా చూసే రోజులు ఇంకా పూర్తిగానూ పోలేదు కనుక ఇంత ఇస్తే కొంచం మంచి సంబంధం వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఎలాగో అలాగ చేసేయవచ్చును. 


నా బాధ అది కాదు. మా అక్కయ్య జీవితం ఒక ఉదాహరణ. అలాగే అనేకానేక జీవితాలలోని వాస్తవాలను చూసిన తరువాత నాకుడబ్బు మీద, ఆస్థులమీదా కంటే స్వయం కృషిమీదనే నమ్మకం రోజురోజుకీ ఎక్కువౌతోంది. రెక్కలుంటే ఎంతైనా ఎగరవచ్చు. అసలు స్వయంకృషితో తినే ప్రతీ మెతుకులోనూ గల ఆనందాన్ని నా కూతురు కూడా పొదాలన్నదే నా కోరిక. దానికి అది అర్ధమవ్వడంలేదు. 

నేటి తరం ఆడపిల్లలు చదువుకున్న వారు, ఎంతో ప్రపంచ జ్ఞానమున్నవారు. అందువల్ల ఆత్మాభిమానాన్ని పరిరక్షించుకోవడానికి ఆడపిల్లలకు ఉద్యోగమన్నది అవసరమని నేను గట్టిగా నమ్ముతున్నాను. 


మీ రోజుల్లో ఉద్యోగాలు ఒక ఆర్ధిక అవసరం కోసమైతే, మా రోజులకొచ్చాక ఉద్యోగం ఒక కుటుంబాన్ని మరింత సౌకర్యవంతమైన జీవనశైలితో నడుపుకోవడానికి ఉపయోగకరమయ్యింది. ఐతే రేపెలా వుంటుందో తెలియని యీ రోజుల్లో మాత్రం స్త్రీకి ఉద్యోగమన్నది ఆర్థిక అవసరానికీ, సౌకర్యానికీ మించి ఆత్మ-గౌరవాన్ని పరిరక్షించుకోవడానికి అని మాత్రం బల్ల గుద్ది చెప్పవచ్చును. 


భార్యా-భర్తా ఇద్దరూ సంపాదించుకుంటూ వాళ్ళ కష్టార్జితంతో దినదిన అభివృద్ధి చెందాలన్నదే నా ఆశ. నాకుమల్లేనే డిగ్రీ కూడా అవ్వకపోతే ఈరోజుల్లో ఏ ఉద్యోగం దొరుకుతుంది? ఏంటో సర్, మైత్రి విషయంలో మాత్రం నేను గెలవలేక పోయాను. ఎంతపోరాడినా, దానికి చదువు అంటట్లేదు. " ఎప్పుడూ నేనున్నానంటూ తన చిన్నతనం నుంచీ తండ్రిలా నిలబడి తన జీవితాన్ని తీర్చిదిద్దిన రామకృష్ణగారితో మనసులోని మాట చెప్పుకుని వాపోయింది రాధ. 


నిరుత్సాహపడుతున్న రాధను చూసి రామకృష్ణగారు, "ప్రతి జీవితానికి ఒక మలుపు ఆ భగవంతుడు రాసిపెట్టే ఉంటాడు. మన మైత్రికి కూడా ఎదో మంచి మునుముందు జరుగుతుంది. నీ ఆవేదన నాకు అర్ధమవ్వకపోలేదు, కానీ అన్నీ మనము అనుకున్నట్టు జరిగితే ఇంక అది జీవితమెలా అవుతుంది? ఏదో దారి దొరకక పోదు. మైత్రిది చిన్నతనం. ఇంకా భావి జీవితం పట్ల ఆలోచనో, ఆలోచించ గలిగే పరిపక్వతో రాలేదు. అది వచ్చేదాకా మనం చెప్పినవి అర్ధమవ్వవు, కొంచం అయినట్టనిపించినా రుచించవు. నువ్వేమీ కంగారు పడకు. " అంటూ ఓదార్పు గా చెప్పారు. 


ఇంతలోనే ఎదో విషయం జ్ఞాపకం వచ్చినట్టుగా, చూడు రాధా, మన కొత్త బ్రాంచి లో ఒక ప్యూను పోస్ట్ ఖాళీగా వుంది. మునపట నాకింద పని చేసినవాడే ఇప్పుడు ఆ బ్రాంచి మేనేజర్. మన మైత్రికిడిగ్రీ అవ్వలేదు కాబట్టి, ఇప్పుడు కుంటి నడకన నడుస్తున్నందు వలన మనము సర్వీస్ కమిషన్ పరీక్ష రాయించలేము. ఐతే, నువ్వు మరోలా భావించకపోతే నాదొక ప్రస్తావన. ఇప్పుడు యీ ప్యూను పోస్టుకి ఇలా లోపలికి దూరితే, ఉతరోత్తరగా ప్రొమోషను పరీక్షలకు రాసుకుని పైకి రావచ్చు. 


కానీ లోపలికి ప్రవేశించడానికి ఇదొక్కటే మార్గం. నీ కలలూ ఆశలూ నాకు తెలుసు, అందుకనే సంకోచంగా చెపుతున్నాను. ఇలా ఐతే మళ్ళీ కుంటి నడకే అవుతుందనుకో, కానీ అసలు ఆరంభమంటూ చిన్న వయసులోనే జరిగే అవకాశమూ ఓ రకంగా మంచిదేగా. ఆరోజుల్లోని వానాకాలపు చదువుల వల్ల డిపార్టుమెంటు పరీక్షలకు కూర్చుని సాధించడమం నీ వల్ల అవ్వలేదు కానీ, ఈ రోజుల్లో కాన్వెంట్ చదువులు చదివిన మైత్రికి అది పెద్ద కష్టమవ్వదు. 


నాకు తోచినది చెప్పాను. ఇదినీకు, ప్రసాదుకు సుముఖంగా అనిపించి ఎటువంటి అభ్యంతరం లేకపోతే నేను ఆ మేనేజరుతో మాట్లాడ గలను. నిదానంగా ఆలోచించి చెప్పు. ఈ రోజుల్లో షోకుల వల్ల కుర్రకారుకు ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆసక్తి వుండట్లేదు. సాఫ్టవేరు కంపెనీల మీదున్న మక్కువఇక్కడ నికర ఉద్యోగాలైనా వాటిమీద లేదు. తొందర పడకుండా అన్ని కోణాల్లోంచీ ఆలోచించుకోండి. 


ఇందులో మైత్రికి ఎంత వరకూ ఆమోదంగా వుంటుందో చూడాలి. ఇలా చెప్పగానే అలా వినడానికి మీ రోజుల్లా కాదు, ఈ కాలం పిల్లలు వేరు. ఇలాంటివి నచ్చవు. మరొకరిపై ఆధారపడి బడకకూడదు అన్నదాని కంటే, పైపై మెరుగులకే ప్రాముఖ్యత ఇస్తారు. మీ ఇద్దరి కంటే ముందు ఆ అమ్మాయి ఉద్దేశ్యం కనుక్కో. నువ్వు ఇంతలా బాధ పడుతున్నావు, దాని జీవితంపై ఆలోచిస్తున్నావు, అనుకుంటున్నావు కాబట్టి ఈ ప్రతిపాదన చెప్పను. ” అన్నారు రామకృష్ణగారు. 


వెదక పోయిన తీగ కాలికి తగిలినట్టయ్యింది. చదువు అంటని పరిస్థితిలో, ఇది మైత్రి జీవితాన్ని సరిగ్గా నిలబెట్టడానికి వచ్చిన ఒక సువర్ణావకాశంగా అనిపించింది రాధకు. “అదేంటి సర్, ఇంత సంకోచంగా చెపుతున్నారు?మీరు చనువుగా చెప్పడమే కాదు, ఆదేశించ తగ్గవారు కూడా. మా జీవితాలు ఇలా వున్నాయంటే అది మీ చలవే కాదా? మీనోటి వెంట వచ్చిన మాటలు నాకు వేదవాక్కుతో సమానం. అది మీకూ తెలుసు. మీదగ్గరకి వచ్చి ఎలాంటి బాధనో, సమస్యనో చెప్పుకున్న తరువాత, దానికి ఒక చక్కటి పరిష్కారం దొరుకక పోవడమంటూ వుండదు. అది నా ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు కూడా ఈ ప్రస్తావనను అలాగే భావిస్తున్నాను. ” చిరు నవ్వుతో ఎప్పటికప్పుడు తనను వెన్నంటి వుండి కాపాడుతూనే వున్న దైవస్వరూపులైన ఆయన్ని మరోసారి మనసులో నమస్కరించుకుంది. 


ఎలాంటి విషయాన్నైనా నేర్పుగా మెప్పించి ఒప్పించేటట్టు మాట్లాడగలిగే చాకచక్యం వున్న రాధ చెప్పిన తరువాత పని జరగక పోవడమనేది వుండదు. అది రాధకు వెన్నతో పెట్టిన విద్య. ఇంటికి వెళ్ళగానే ప్రసాదుకు చెప్పింది. 


ఎప్పటిలాగాయిట్టే ఒప్పించేయడం యీ విషయంలో జరగలేదు. మైత్రి మీద అతని ప్రేమ ఒప్పుకోనివ్వలేదు. అయితే రామకృష్ణగారి ప్రతిపాదన, ఎంతగాలో ఆలోచించే రాధ అగీకారం. న్యాయమూ లేకపోలేదు. ఒప్పుకోక తప్పలేదు. గట్టిగా ఏ విషయాన్నీ అతడు కాదనడు కనుక ఆమెకు అతని వైపునుంచి ఎలాంటి బలమైన తిరస్కారమూ రానందువల్ల బెంగ లేదు. ఐతే మైత్రి విషయంలోనూ అలాగే అనుకోవడం అవివేకమని రాధకు బాగా తెలుసును. 


అందువల్ల తాను చెప్పే దాకా ఆ విషయం ఎవ్వరితోనూ అనకూడదు అని ప్రమాణం చేయించుకుంది. ఇందులో ఎదో పెద్ద వ్యూహముందన్నమాట. ఎదో కథగా, కల్పనగా చెపుతుంది కాబోలు. ఎలాగైతేనేం చెప్పి ఒప్పించగలిగితే మంచిదే అనుకున్నాడు. సరేనన్నట్టు అయోమయంగా తలూపాడు ప్రసాదు. 


వంటింట్లో వంట చేసుకుంటూ, “మన గౌరి రెండో కొడుకుచిల్లరమల్లరగా తిరుగుతున్నాడు. వాడు డిగ్రీ కూడా పూర్తి చేసే లక్షణాలు కనబడట్లేదు అని మొన్నసురేష్ అన్నయ్య వాళ్ళింటి పార్టీలో కలిసినప్పుడు చెప్పి బాధపడింది. బొత్తిగా మాట వినట్లేదుట. ప్రతి దానికి ఎదురు సమాధానం చెప్పడాలు, విరుచుకుపడడాలు చేస్తున్నాడట. చదువులు లేక, పని లేక ఎదిగిన పిల్లల్ని పోషించడం ఎంత కష్టం. వాడికి ఏదైన వ్యాపకం ఉంటేకానీ అణిగేటట్టు లేడు అనుకుంది. 


అంతంత వ్యాపారాల్లో అన్నయ్యలున్నా, వాళ్ళు స్టయిలుగా ఉండడంతో వాళ్ళతో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడగడానికో, డిగ్రీ కూడా పూర్తి చెయ్యలేదు అనడానికో దానికి చిన్నతనంగా వుంది కాబోలు. వాళ్ళ కీర్తిని చూసి సంబరపడింది గాని, వారిని అడిగే ధైర్యం చెయ్యలేదు పాపం. మా ఆఫీస్ బ్రాంచిలో ఒక ప్యూను పదవి ఖాళీ ఉందని తెలిసింది. ఎవరినైనా అర్థించి ఆ ఉద్యోగం వాడికి ఇప్పిస్తే బాగుండునేమో అనిపిస్తోంది?” అంది రాథ భర్త ప్రసాదుతో. మళ్ళీ యీ మలుపేవిఁటో అర్ధంకాలేదు ప్రసాదుకి. 


తల్లి మాట తన చెవిన పడుతూనే, చదువు పూర్తిచేస్తే కానీ పెళ్లి ప్రసక్తి ఎత్తదు అమ్మ. అసలు డిగ్రీ గట్టు ఎక్కేటట్టు లేదు. అందువల్ల ఉద్యోగమంటూ ఒకటుంటే అది డిగ్రీని మరిపించడానికీ, పెళ్ళికి నాంది పలకడానికిఒక మార్గం వేసినట్టవుతుంది. ఈ అవకాశం మనమే ఎందుకు ఉపయోగించుకోకూడదో అనుకుంది మైత్రి. 


తనకంటూ ఒక సంపాదన ఉంటే ఇంక పెళ్లే తరువాయి మెట్టు అవుతుందేమో. చదువుమీద శ్రద్ధలేని ఆమెకి ఇది కొంచం ఆసక్తిగానూ, ఆకర్షణీయంగాను అనిపించింది. చదువు మీద తాను పెడుతున్న శ్రద్ధతో డిగ్రీ అయ్యే అవకాశం ఎంత మాత్రమూ లేదని తనకు మాత్రమే ఖచ్చితంగా తెలిసిన మైత్రికి, చేతిలో కనీసం పనైనా ఉంటే మంచిదని ఆ క్షణానికితోచింది. 


“అమ్మా, అలాంటి అవకాశం ఏదైనావుంటే అది అన్నయ్యకి ఎందుకు, నాకే ఎందుకు ఇప్పించకూడదూ?” అందిమైత్రి. 


జీవితము పై అవగాహన, ఆలోచనలు, కార్యదీక్ష, ఏదైనా సాధిచాలనే పట్టుదల ఆమెకు ఎంత వరకూ వున్నాయో తెలుసుకో దలచింది రాధ. అవి ఆమెనోటి ద్వారానే చెప్పించాలన్న సంకల్పంతో, "నువ్వు చదువుతున్నావుకదే, వాడు ఏడాది పై చెలుకు నుంచీ కాలేజీ కూడా మానేసి కూర్చున్నాడు. బాబయ్య సంపాదనా అంతంతమాత్రం. ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి ఎంత కష్టపడైనా చేస్తారు కానీ, ఊరికే కూర్చుని తింటుంటే ఎంత వరకూ చేయగలరు, ఎంత మందిని ఆయన మాత్రం పోషిచగలడు. అందుకు అలా అనుకున్నాను. నువ్వు డిగ్రీ పూర్తి చేసేకా బ్యాంకులో క్లర్క్లు, PO పరీక్షలు రాయచ్చుగా?” అంది రాధ. 


“లేదమ్మా, నాకు చదువు పెద్దగా రావట్లేదు. డిగ్రీ అయ్యాక కూడా ఆ కాంపెటీటివ్ పరీక్షలలో నెగ్గుకు రాగలనన్న నమ్మకం నాకు లేదు. దానికి చాలా డెడికేషను కావాలి. అదీ కాక నాకు డిగ్రీలో మంచి పెర్సంటేజు కూడా లేదు. కొన్ని ఉద్యోగాలకు అవి కూడా చూస్తున్నారు. ఆ మేరకు నాకు అన్ని విధాల అవకాశాలు తక్కువే. ఇప్పుడు ఇదొక మంచి అవకాశం అనిపిస్తోంది. ముందు చేరిపోతే, డిగ్రీ ప్రైవేటుగా కట్టుకుని పాసవుతాను. చిన్నదైనా నికరంగా ఉద్యోగముంటుందిగా. నువ్వెప్పుడూ అన్నట్టుగా కనీసం నేను నా కాళ్ళమీద నిలబడాలంటే ఇలాంటి అవకాశం ఉపయోగించుకోవడమే మంచిది. ఆ ప్రయత్నమేదో నాకోసమే చేసి నాకే ఇప్పించమ్మా” అంది. 

చదువు విషయంలో తన కోరిక తీరకపోయినా, షోకులు గొప్పలకు పోకుండా, దీనికి ఏ కళ్ళనో, ఈ ఆలోచన తట్టి, ఇలాంటి బుద్ధి పుట్టినందుకు సంతోషించింది రాధ. దీనికి ఉద్యోగ యోగం లేదంటూ ఎవడో జ్యోస్యుడు చెప్పాడే కానీ వుంది సుమీ అని అంతలోనే సంబర పడింది. 


ఐతే, మైత్రికి మాత్రం, నా బలవంతమేమీ లేదు. వెయ్యి సార్లు ఆలోచించుకో అని చెప్పి మరీ ఆమె ఒప్పుకున్న తరువాతనే, రామకృష్ణగారితో మాట్లాడింది. ఉద్యోగంలో వేయించింది. 


అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అందరూ ఆడిపోసుకున్నారు. గౌరి కూడా కొంచం నొచ్చుకుంది. ఇంత సంపాదిస్తున్నా, ఇంతటి ఆస్తులూ బంగారాలూ కూడబెట్టినా, కూతురిని చిన్న వయసులోనే ఇలా చిన్న పనిలో పెట్టించాల్సిన అవసరమేమిటో అని చెవులు కొరుక్కున్నారు. ఐతే, ఆమెతో ముఖాముఖీ మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ చాలలేదు. ఆమె మాట దురుసుతనానికి భయపడి ఎవ్వరు నోరు విప్పలేదు. 


అయినా, అన్ని విధాలా ఆలోచించిన తరువాతనే ఒక నిర్ణయం తీసుకుంటుంది కనుక, రాధ పట్టు పట్టిందంటే అది వదిలే ప్రసక్తే ఉండదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు, యీ విషయంలో మైత్రి మాట కూడా కలిసివచ్చింది. చదువు అబ్బకపోయినా మరో రకంగా దాన్ని వృద్ధిలోకి తేవాలనుకున్న తన సంకల్పము తీరుతోంది.. 

మైత్రి శ్రేయస్సే ఎన్నటికీ ఆమె అభిలాష. అందుకు యీ ఉద్యోగంతో అంకురార్పణ చేసింది. ప్రస్తుతానికి చదువుకి స్వస్తి చెప్పినా, ఉద్యోగంలో పదోన్నతి వస్తుందంటే ఏనాటికైనా తనంతటతానే డిగ్రీ పూర్తి చేస్తుందన్న నమ్మకంతో ఇప్పటికి సంతృప్తి పడింది. పెళ్లి మీదకి మనసు మళ్ళిన మైత్రికి మాత్రం, ఇది త్వరగా పెళ్ళికి దారితీసే మార్గంగా అనిపించింది. 


సిరి సూచనప్రాయంగా ఇచ్చిన సందేశాలేవీ మైత్రి ఆకళింపు చేసుకోలేదు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================


వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.

43 views1 comment

1 Comment@user-mo4ye7vd9z

• 9 hours ago

Yento loth ga alochinchi raasevu, mytri jeevitam, aa vayas alantidi. Chala baavundi kameswari. Okkoka episode chaduvu unte, interesting ga untondi,

REPLY0 replies


Like
bottom of page