top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 8



'Jeevana Chadarangam - Episode 8' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 15/02/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 


పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 


ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 


బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. 


మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. 


రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి. రాధకు పితృ సమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న తన అక్కయ్యను తనతోనే ఉంచుకుంటానంటుంది రాధ.


ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 8 చదవండి. 


అది రాధ-ప్రసాదుల పెళ్ళై మూడు సంవత్సరాలు దాటిన సమయం. 


తమ భావి జీవితానికి చక్కని బాట వేయాలని రంగుల కలలు కనడమే కాకుండా సర్వదా శ్రమిస్తూ ఒక్కో అడుగు పురోగతివైపుగ నడవాలని రాధ ఆశ. ప్రసాదూ దానికి పరిపూర్ణంగా సహకరించడం ఆనందంగా ఉండేది. తమకు పుట్టబోయే బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలనీ, సంస్కారవంతంగా పెంచాలనీ కలలు కనేది రాధ. తమ కుటుంబంలో మున్ముంది ఎవ్వరూ అక్కయ్యలాగ స్వావలంబన రహిత జీవితం పొందకూడదు. అలాగే, తనలా చదువులేకుండా ఉండా కూడదు. భావితరాలు తమలా మిగిలిపోకుండా జాగ్రత్తపడాలని మనసులో దృఢంగా సంకల్పించుకుంది. తనదీ భర్తదీ చిన్న ఉద్యోగాలేనైనా, పైసాపైసా కూడపెడుతూ, సంసారాన్ని చాలా తీరుగా సాగిస్తున్నారు. 


ఒదినగారు చాలా గయ్యాళిగా మాట్లాడినా ఆమెతో ఎంతో గౌరవంగా వ్యవహరించేవాడు ప్రసాదు. ఇద్దరి కోడళ్లనీ చూస్తూ, రాధను ఎన్నుకుని నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని ఆనంద పడుతూ ఉండేవారు రఘురామయ్య. రాధతోపాటు తమ ఇంట్లో అడుగుపెట్టిన రాజ్యాన్నీ తమ బిడ్డగా చూసుకునే వాడు. ఆమెను కన్నబిడ్డగా భావించేవాడు. అతి పిన్న వయసులో మెట్టినింట అడుగుపెట్టి, అనేక కష్టాలు పడి, సుఖమంటే ఏంటో ఎరుగని రాజ్యానికి అయన ప్రేమ ఎంతో సాంత్వనగా అనిపించింది. 


రాజ్యం జీవితంమంతే మలుపులే. చదువు అసలు అభ్బలేదు. ప్రాపంచ జ్ఞానం శూన్యం. ఆదరణ కావలసిన సమయంలో తండ్రి చనిపోవడంచేత చిన్న పిల్లైన చెల్లెలు, మరిది నీడను చేరింది. అది అదృష్టమే. కానీ అంతకన్నా గొప్పవరం, తండ్రి ఆదరణ, ప్రేమ కరువైన సమయంలో ఇక్కడ ప్రసాదు తండ్రిగారి వల్ల ఆ ప్రేమ పొందడం. మావగారిని కన్నతండ్రిగా చూసుకుంటూ సేవలు చేస్తూ అతి కొద్దికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది రాధ. మా కోడలు రత్నం అంటూ మురిపెంగా అందరికీ చెప్పుకునే వారు రఘురామయ్యగారు.


పక్క వాటాలో ఉంటున్నా బావగారి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది రాధ. వారితో ఎంతో స్నేహంగా మెసలడంతో పిన్నీ, పిన్నీ అంటూ తన చూట్టూ తిరుగుతారు. పెస్నిలనీ, పెన్ననీ, స్కూలుకి కావలసిన వస్తువులన్నీ అడుగుతున్న వారికి రోజూ ఆఫీసు నుంచి వస్తూ ఏదో ఒకటి తేవడం, మా పిన్నిచ్చిందంటూ వాళ్ళు ఆనందంగా చెప్పుకుంటుంటే సంతోషపడడం ఆ ఇంట నిత్యం జరిగే విషయమే.



ఆదర్శవంతమైన కుటుంబంగాపేరు తెచ్చుకుని సంతోషంగా రోజులు సాగిపోతుండగా కనుదృష్టి తగిలినట్టు ఆ ఇంట ఒక పెద్ద చిక్కు వచ్చి పండింది. ఒక సంసారంలో ఏ ఒక్కరు బాధ్యతారహితంగా ప్రవర్తించినా, ఆ ప్రభావం అందరి పైనా పడుతుంది. బాధ్యతగా నడచుకునేవారిపైనే ఆ ప్రభావం మోయలేనంత భారంగా మారడం జరుగుతుంది. మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి ఇళ్లు ఎన్నో చూస్తూనే ఉన్నాము. ఉమ్మడి కుటుంబాలు నేడు లేకపోడానికి ప్రముఖ కారణం ఇదే అని కూడా చెప్పొచ్చు. ఉమ్మడు కుటుంబ వ్యవస్థ దాదాపు కనుమరుగైపోతోంది. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. 


పొయ్యలు వేరైనా మనసులు వేర్పడకుండా సాగిపోతోంది. ఒకే కుటుంబంగా అంతవరకూ చెలామణీ అవ్వడమే తనకు భగవంతుడిచ్చిన వరమని సంతృప్తి పడేవారు రఘురామయ్యగారు. ఆస్తి మాత్రం ఇంకా వారి అజమాయిషీలోనే ఉండేది. ఇప్పుడు ఆస్తులు కూడా పంచి ఇవ్వవలసిన పరిస్థితి వచ్చినందుకు ముందుగా కాస్త బాధ పడ్డా, అందరి శ్రేయస్సుకోరి ఆ పంపకాలు చేయదలచాడు ఆ పెద్ద మనిషి. జీవితంలో ఎన్నో పెనుగాలులూ, ఉప్పెనల తాకిడి చూసిన ఆయనకు, ఇది పెద్ద బాధాకరమైన విషయమే అవ్వలేదు. కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందన్నట్టు ఆస్తి అంతటినీ కరిగించేయగల సమర్ధుడు పెద్దకొడుకు. ఆస్తి అంతా ఛిన్నా-భిన్నమవ్వకుండా ఉండడానికి పంపకాలొక్కటే మార్గమని ఆయనకు అర్ధమైయ్యింది రఘురామయ్యగారికి.


పేచీకోసమే వెతుక్కునే పెద్దకొడుకూ కోడలి అవివేకము కారణంగా, మావత్వం గల ప్రసాదు రాధలు ఇబ్బంది పడకూడదనే తాపత్రయ పడ్డారు. ఇంటిని రెండు భాగాలు చేసారు. ఆడపిల్లకు ఎటువంటి అన్యాయమూ జరగకుండా రిటైర్మెంటు నాడు తనకు వచ్చిన సెటిల్మెంటు రొక్ఖములోంచి సగం అమ్మాయికి ఇచ్చేసారు. తన చివరి రోజు వరకు తనను గుండెల్లో పెట్టుకుని రాధ, ప్రసాదులు చూసుకుంటారనే అపారమైన నమ్మకము మాత్రము ఆయనకుంది.



చీటికీ మాటికీ పేచీలు పెడుతున్నా బావగారికి తోడికోడలికి ఎప్పుడూ చేదోడు గానే ఉండేది రాధ. ఉద్యోగం చేస్తున్న నేరానికి, ఏ అవసరానికైనా ఎప్పుడు డబ్బు సద్దవలసిన పరిస్థితి వచ్చినా కాదనేది కాదు. ఐనవాళ్ళై ఉండి ఇంటి మీదకి అప్పుల వాళ్ళు వస్తే సాయం చేయకుండా ఉండడం ఆమెకు తెలియని గుణం. పరులకు చేస్తున్నట్టుగా కాకుండా ఆనందంగానే చేసేది. మీ ఇంటికొస్తే ఏమిస్తావు, మా ఇంటికొస్తే ఏమి తెస్తావు అన్న గుణం తోటికోడలిది. ఎంత పెట్టినా చాలదు. పెద్దమ్మాయి పెద్దమనిషైతే ఆమెకు బంగారపు జుముకీలు చేయించడం, స్కూలు ఫీజులకు అవసరానికి కట్టడంలాంటివి ఎన్ని చేసినా మెప్పు మాత్రం రాలేదు ఆ పక్కనుంచి. రాధ ఆశించేదీ కాదు. తనకు తోచినది చేయడమే తప్ప ప్రత్యుపకారం ఆశించో, పొగడ్తలకు పొంగిపోయో ఏపనీ చేసేది కాదు. నా సంసారం, నావాళ్ళు అనుకునేది కనుకే అలా చేసేది. ఐదేళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. 


అంత సంతోషంలోనూ, ఒక కొరత మాత్రం అందరి మనసుల్లోనూ మెదులుతూనే ఉండేది. వారికి సంతానం కలుగలేదనేదే అందరి బాధ. 


అంగట్లో అన్నీఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్టు, బాధ్యతగా నడచుకునే గుణం, అణకువ, పెద్దల యందు నమ్రత, పిన్నల యందు ప్రేమ అన్నీ ఉన్నా, తన కడుపు పండే భాగ్యం మాత్రం ఇంకా కలుగనందుకు బాధ పడుతూనే ఉండేది. ఎక్కని గుడి మెట్టు లేదు, మొక్కని వేల్పు లేదు. ఐనా ఇంకా ఏ దేవుడూ కరుణించలేదు. ఏక్కిదిగే గుడిమెట్లు ఒక యత్నమైతే, ఫెర్టిలిటీ డాక్టర్ల సలహాలు, ట్రీటుమెంట్లూ మరొకటి. ఇల్లు ఒళ్ళు గుల్లైయ్యే పరిస్థితి.


‘మాతృత్వములోనె ఉంది ఆడజన్మ సార్ధకం, 

అమ్మా అనిపించుకొనుటె స్త్రీ మూర్తికి గౌరవం’ 


రేడియోలో వస్తున్న పాటచెవిన పడగానే, రాధ గుండెబరువెక్కి కన్నీటిరూపంలో దుఖంమంతా బయటకొచ్చింది. భావోద్వేగాలకు ఎవ్వరమూ అతీతులము కాదని ఆ క్షణం మరో మారు నిరూపణయ్యింది. ఎంత హుందాగా కనిపించినా, ధైర్యానికి మారుపేరనిపించినా, ఆమెకూడా ఒక స్త్రీనే అని, ఆ స్త్రీ సహజగుణమేన కొన్ని కోరికలు ఆమెలోనూ ఉన్నాయని వేరే చెప్పాలా? జీవితం మరోసారి దిక్కుతోచని స్థితిలో పడేసింది. రాధ జీవితంలో ఈ సంఘర్షణలకు అంతేలేదా?


“ఏవండీ, నా జీవితం ఎందుకో ఎప్పుడూ సంఘర్షణ మయంగా ఉంటుంది. ఏ పనీ నాకు సాఫీగా జరుగదు. ఏం చేయాలన్నా పోరాటమే అవుతుంది. నన్ను కట్టుకున్నందుకు మీకూ తప్పట్లేదు” కన్నీరు ధారాపాతమవ్వగా అంది రాధ.


“రాధా! నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నీ మనోధైర్యమే నీకు అలంకారమనుకున్నాను. ఇప్పడదంతా ఏమైంది? నాకు నువ్వు నీకు నేను ఉన్నాము. మనకింకెవరు లేకపోయినా నాకు ఎలాంటి బాధా లేదు. పిల్లలు అన్నది జీవితంలో ఒక భాగమేకానీ జీవితమే కాదు. ఒక స్త్రీగా మాతృత్వపు మాధుర్యం కోరుకోవడంలో తప్పులేదు. కానీ, ఇలా న్యూనతాభావంలోకి కూరుకుపోవడం మాత్రం నేను ఎన్నటికీ ఒప్పుకోను. నీ వల్ల నాజీవితానికి ఏదో కొరత వచ్చిందనుకోవడం నేను సహించలేను. నేనెన్నడూ నిన్ను అలా భావించలేదు రాథా!” ఆమెను తన గుండెలకు హత్తుకుంటూ అన్నాడు ప్రసాదు.


“చూడు రాధా! నువ్వు నమ్మిన దైవం నీకు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ నమ్మకాన్ని ఎన్నడూ వీడకు. నా మటుకు నాకు ఈ విషయంలో ఎలాంటి కోరికలూ అభిప్రాయాలూ లేవు. నీవు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నీకు తోడుగా ఉండి దాన్ని ఆనందంగా ఆహ్వానిస్తానని మాత్రం నీకు చెపుతున్నాను, ఇంక ఈ విషయమై నీ కళ్ళల్లో నేనెప్పుడూ కన్నీరు చూడకూడదు. సరేనా!” అనునయంగా అన్నాడు.

***


పురుళ్ల ఆసుపత్రి కిటకిటలాడుతోంది. అసలే నీసరంగా ఉన్న గౌరి పురిటి నెప్పులతో తల్లడిల్లుతోంది. అది నాల్గవ కాన్పు కావడంతో ఆమె చాలా బలహీనంగా ఉంది. అందరూ హైదరాబాదులోనే ఉండడంతో ఎప్పటికప్పుడు ఒకళ్ళకొకళ్ళ అవసరాలకు సహాయపడుతూనే ఉంటారు. 


గౌరి రాధ అదే వీధిలో కాపురముంటున్నారు. క్రితం వేసని సెలవల్లో ఇద్దరి పిల్లలను ఆ దగ్గర స్కూల్లో వేసి రాధ ఉంటున్న కాలనీకే వచ్చారు గౌరి సుధీర్లు. అప్పటినుండి రాధ వారికి చేదోడవాదోడుగా ఉంటోంది కూడా.


అది శ్రావణమాసం కావడంతో వర్షాలు పడుతున్నాయి. పురుళ్ళ ఆసుపత్రంతా చితచితగా ఉంది. తెల్లవారితే శుక్రవారం. రాత్రంతా నొప్పులు పడింది గౌరి. పొద్దున్నే సుఖ ప్రసవమయ్యి ఆడపిల్ల పుట్టింది. మహాలక్ష్మి పుట్టిందని ఆనంద సంబరాలు చేసుకోలేదు. మోయలేని కొమ్మకు మరో కాయ అన్నట్టు, ముగ్గురు పిల్లలు ఉన్న గౌరికి వద్దనుకుంటున్న సమయంలో కలిగిన సంతానం. అందులోనూ ఆడపిల్ల.


పురిటి పథ్యం దగ్గరనుంచి, ఆసుపత్రికి వెళ్లి రావడానికి సాయం చేయడం వరకూ అన్నీ తన నెత్తినవేసుకుని చూసుకుంది రాధ. అంతా చాలా నిరసంగా పుట్చినా నెల ఒళ్లుచేసి ఎంతో ముద్దొస్తోంది ఆ పసిపాప. 


“నా తలరాత ఇలా ఉందేంటక్కా? గోరుచుట్టు మీద రోకలి పోటై పోతోంది బతుకు” వలవలా ఏడ్చేసింది గౌరి. 

రోజూ ఆఫీసు నుండి ఇంటికి వెళుతూ గౌరింటికి వెళ్ళి కాసేపు ఉండి ఛంటి పాపను చూసి రావడం అలవాటైయ్యింది రాధకు. నెల్లాళ్ళనుండీ ఒక్కరోజు కూడా పాపాయి చూడకుండా ఉండలేదు.


“ఈ రోజు టీకా వేయించుకు రావాలిగా, వెళ్ళావా? బాలింతరాలివి, ఈ ఏడుపేంటి చెప్పు.” బుజ్జగింపుగా అంది రాధ.


“పాపకు టీకా వేసే ముందు డాక్టరు ఏదో పరీక్ష చేయాలి అన్నారు. సరే అనుకున్నాను. ఆ తరువాత స్కాను అన్నారు. అన్నీ అయ్యాకా చెప్పారు. పాపాయికి ఒకటే మూత్రపిండం ఉందిట. అందు వల్ల ఇప్పుడు వెంటనే ఇబ్బంది లేకపోయినా ఉతరోత్తర ఇబ్బందులుండే అవకాశాలున్నాయి అన్నారు. అసలు ఈ పిల్లే మాకు భారమనుకుంటే, ఇప్పుడిదొకటి” దుఖాన్ని దిగమింగుకుంటూ అంది గౌరి. 


శారీరికంగా మానసికంగా కృంగిపోయున్న గౌరి ఆ క్షణం అంతకంటే ధైర్యం కూడగట్టుకోలేకపోయింది. ‘ఇప్పటికే ముగ్గురు పిల్లలతో సతమతమవుతున్నానన్న బాధలో అనేస్తోంది కానీ తల్లికి పిల్ల భారమా’ ఆమె బాధను అర్థంచేసుకున్న రాధ పాపాయిని ఒడిలోకి తీసుకుంటూ, అన్నీసద్దుకుంటాయి. నువ్వు బాధ పడకు అనడం తప్ప మరేమీ చేయలేకపోయింది. బిడ్డ కోసం తహతహలాడుతున్న రాధకు మనసు పిండేసినట్టయ్యింది. 


గౌరి ఇంకా అలాగే ఉండడం చూసిన రాథ, “ఇంతటి పరిస్థితి వచ్చింది కనుక నోరు తెరిచి అడుగుతున్నాను. మరోలా భావించవద్దు. ఈ పాపాయి నీకంత బరువైతే నాకివ్వు నేను పెంచుకుంటాను. నా బిడ్డగా!” గౌరి రెండుచేతులూ పట్టుకుని అర్ధిస్తున్నట్టుగా అంది.


అప్పటి గౌరి మానసిక పరిస్థితి వల్లనో లేక నిజంగానే బిడ్డ బరువనిపించో, నవమాసాలు మోసి కన్న తల్లై కూడా అతి సులువుగా సరే అనేసింది. తన చేతుల్లో ఉన్న ఆ పాపాయిని గుండెలకు హత్తుకుంది రాధ. ఒళ్ళంతా పులకరించిపోయింది. అణువణువూ పులకించి పోయింది. ఎన్నెన్ని జెన్మల బంధమో! ఇకనుంచి ఈ పాప నాపాప, నా పాప” పరవశంతో ముద్దులు కురిపించింది.


‘గౌరీ, నేను వైద్యం చేయిస్తానే. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. నువ్వీ పాపకు తల్లివి. ఎప్పటికీ అంతే’ మనసులోనే అనుకుంది. 

******


“నువ్వు తన ఒడిలోకి చేరే వరకు గడచిపోయిన జీవితంలో రాధత్తయ్య ఎంత సంఘర్షణ పడిందో చూసావా మైత్రీ? అప్పుడే అయిపోయిందనుకున్నావా! లేదు” చెప్పింది సిరి చందన.


మొట్టమొదటిసారిగా మైత్రి కళ్ళు చమర్చాయి. అక్కడ పుట్టి ఇక్కడ పెరిగాన్నన విషయం మైత్రికి తెలుసుకానీ, తన పుట్టుక ఇద్దరి జీవితాల సఘర్షణతో ఆరంభమైందని సిరి చెప్పగా ఇప్పుడే తెలిసింది.


“ఈ పద్దెనిమిదేళ్ళల్లో ఇంకెన్ని జరిగాయో? నా ఈ చిన్ని జీవితం వెనుక మరెంత కథుందో!” అంతుచిక్కని ఆలోచనలు మైత్రిని చుట్టేసాయి.

*****


ఇద్దరు అమ్మల జీవితాల సంఘర్షణతో ప్రారంభమైన తన జీవితాన్నీ ఎంతో సాఫీగా సాగిపోవడానికి అమ్మానాన్నలు పడిన శ్రమను గ్రహించసాగింది మైత్రి. సిరిచందన నాటిన వివేకచింతన విత్తనం మొలకెత్తడం ప్రారంభించింది. అది చూసి సిరికి ఎంతో సంతోషం కలిగింది. మైత్రి వాస్తవాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సుగమం చేసుకుందుకు సరైనదారి ఎన్నుకుని దాన్ని సాధించడానికి తగిన కృషి చేస్తుందని ఆశించింది సిరి.


“మైత్రీ, నీ బాలసారె ఎంతో గొప్పగా చేసిందిట మైత్రి అత్తయ్య తెలుసునా? నీకు ఈ పేరు పెట్టడానికి ఎంతగానో ఆలోచించిందిట. గౌరి అత్తయ్య సమ్మతాన్ని ప్రతి విషయంలో అడుగుతూ రెండు కుటుంబాలు నీ రాకతో కలిసిమెలిసి ఉండాలని నీకు మైత్రి అని పేరు పెట్టారుట” వివరంగా చెపుతున్న సిరిని చూసి మైత్రికి మొదటిసారి అబ్బా బోరు కొట్టిస్తున్నావే అని అనాలనిపించలేదు.


‘ప్రతి మనిషీ ముందుగా ప్రేమించుకునేది తననే. తనకు సంబంధించిన ఏ విషయమైనా, ఎప్పటిదైనా ప్రతి వ్యక్తినీ ఆకర్షిస్తుంది, ఆనందపరుస్తుంది’ మానసిక పరిశోధనలో మరో విషయాన్ని రూఢీచేసుకుంది మైత్రి.


సరే ఇంకా చెపుతాను విను, నీ చిన్ననాటి కబుర్లు, అంటూ చెప్పింది సిరి.


పసికందు నుదుటిని ముద్దాడిన రాధ, ప్రసాదు చేతికందించింది. దశబ్దంపాటు ఎదురుచూడగా వారింటి విరిసిన పువ్వుని చూసుకుని మురిసిపోయారు ఆ దంపతులు. జీవితాలు సార్థకమైనట్టు అనిపించింది వారికి. మంచి ముహూర్తాన మూడో నెలలో బాలసారె పండుగ వైభవంగా జరిపించారు. 


“ఇద్దరమ్మలు ముద్దుల బిడ్డ, మన మైత్రికి గుర్తు మన పాపాయి, అంచేత మైత్రి దీని పేరు” అంది రాధ. మైత్రి ని కంటికి రెప్పలాకాపాడుకుంటూపెంచసాగారు. వెన్నుముదిరాకా మైత్రి వైద్యం గురించి చూద్దామని చెప్పగా ఆలు నెలలు ఆగారు. బాదం పప్పు అరగతీలు పాలు పట్టేది రాధ. చిన్నచిన్నగా ఒక్కో పోషణ పదార్థం పెంచుతూ అతి జాగ్రత్తగా పెంచుతోంది రాధ. నగరంలోకల్లా గొప్ప డాక్టరైన మణి గారి అపాయింట్మెంటు తీసుకున్నారు. పరీక్షలన్నీ చేయించారు. రిసల్టులను పరిశీలించిన డా.మణి మైత్రికున్న సమస్యను గురించి విపులంగా వివరించారు. పాపకు శస్త్ర చికిత్స అవసరం లేదని చెప్పగానే రాధ ప్రసాదుల గుండె బరువు తేలిగపడింది.


ఊపిరితిత్తుల బలహీనత వల్ల ఆస్మా వ్యాధితో బాధపడుతున్న మైత్రిని పథ్యంతోనూ సంరక్షణతోనూ కాపాడుకోవచ్చును. వెన్నుముదిరేకొద్దీ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెప్పారు. 


ఒకటే మూత్రపిండం ఉన్న కారణంగా ప్రతి ఆరునెలలకూ పరీశ్క్షలు చేయించాలి. ఆ వ్యవధిలో చిన్నపాటి ఇబ్బంది వచ్చినా వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలి అని వివరించారు. ఆ మాట విని, ముక్కోటి దేవతలకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.


దినదిన ప్రవర్ధమానమై ఆ చిన్నారి వేసిన మొదటి అడుగుకు అరచేయిపెట్టింది రాధ. అరిసెలపై అడుగులు వేయించి ఊరంతా పంచిపెట్టింది. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళందరినీ పిలిచి వేడుకగా పుట్టినరోజు సంబరాలు చేసింది. వైభోగంగా పెరుగుతున్న మైత్రిని చూసి మురిసింది గౌరి. రాధ పంచప్రాణాలూ మైత్రి మీదనే పెట్టుకోవడం చూసి మనసులోనే ఆనందపడేది. వద్దనుకుని కనిన ఆ బిడ్డ ఇప్పుడు సిరిసంపదల్లో పెరుగుతున్నందుకు ఆ దంపతులకు సంతోషంగా ఉండేది.


ఒక్క నాటికీ నేను దాన్ని ఇంత వైభవంగా పెంచగలిగేదాన్ని కాదనుకుంది గౌరి. దాని నొసటన అదృష్ట రాత వ్రాసి ఉండబట్టే కాకతాళీయంగా నేను పెంచలేనన్న మాటలుఆనాడు అన్నానేమో! మైత్రి అదృష్టమే అలాంటి సంభాషణకు దారితీసిందేమో. ఇవన్నీ దైవలీలలు. నలుగురితో పెరగడంవల్ల ప్రేమ కూడా నాలుగోవంతే పొందేది. ఇప్పుడు అంతా దానికే అన్నీ దానివే అని పెరుగుతోంది. తమ స్తోమతకంటే అపూర్వమైన సంపదలిచ్చి, అన్ని సౌకర్యాలనూ సమకూర్చి పెంచడమే కాకుండా,తల్లిదండ్రుల అమితమైన ప్రేమను పొందుతున్న మైత్రిని చూసి గౌరి దంపతులిరువురూ సంబరపడిపోయారు. 


మొదటి పుట్టిన రోజు పండుగ పూర్తి కాగానే మైత్రిన దత్త పుత్రికగా స్వీకరిస్తున్నట్టు చట్టపరంగా చేయవలసిన రాత కోతలు పూర్తి చేయాలనుకుంది రాధ. ఆ ప్రస్తావన గౌరి దగ్గర తీసుకుని రాగా, లిఖితపూర్వకంగా దత్తపుత్రికగా స్వీకరించడానికి మనస్పూర్తిగా ఒప్పుకుంది. తమకు సంబంధించిన అన్ని పత్రాలలోనూతమ బిడ్డగా మైత్రి పేరు చేర్చబడాలన్న విషయాన్ని తెలియజేసిన పిమ్మటనే కన్నవారైనగౌరి దంపతులుదత్తత ఇస్తున్నట్టుగా పేర్కొని రాతకోతలతో అన్నీ క్షుణ్ణంగాఖాయం చేసుకున్నారు. రాధ ప్రసాదులు వారివారి ఆఫీసుల్లో కూడా మైత్రిని తమ బిడ్డగా డిక్లరేషన్ ఇచ్చి నమోదు చేసుకున్నారు. పత్రం ద్వారాచట్టరీత్యా ఆమె వీరి బిడ్డ. 


మైత్రి విషయంలో ఏది చేసినా పది సార్లు ఆలోచించి అన్నీ ఉత్తమమైనవే ఇవ్వాలన్నది రాధ ఆశ.అలా రెండేళ్ళు గడిచి పోయింది. పణుకులా మాట్లాడుతున్న మైత్రికి అక్షరాభ్యాసం చేసారు. అక్షరాభ్యాసంలో సువర్ణ ఆభరణాలను చేతికందుకున్న మైత్రిని చూసి మురిసింది గౌరి. 


హైదరాబాదు మహానగరం లోకల్లా గొప్ప విద్యాలయము అనిపించుకునే జాన్సన్-లయోలా స్కూలులో చేర్పించడానికి ప్రయత్నాలు మొదలెట్టింది రాధ. అప్లికేషన్లు ఎప్పుడెప్పుడిస్తారా అని ఎంతో ఆసక్తిగా వేచి ఉండి, ఇచ్చే రోజున తెల్లవారు ఝామునే వెళ్లి, క్యూలో నిలబడి అప్లికేషన్ ఫారం తీసుకుని వచ్చి పూర్తి చేసి, సీటు దొరకాలని వెయ్యి దేవుళ్ళకి మొక్కింది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు, పడిన కష్టానికి ఫలితంగా మొత్తానికి సీటును సంపాదించింది. ఆనాటి ఆమె ఆనందానికి అవధులు లేవు. మంచి రోజు చూసుకుని ఫీజు కట్టింది. పెద్దబడుల్లో గొప్ప చదువులు చదువుకోని నేను నా బిడ్డను పెద్ద చదువులు చదివించాలని సంకల్పించుకుంది. తనవంతు బాధ్యతగా మైత్రిని స్కూలు-వానులోనో ఆటోలోనో పంపకుండా స్వయంగా స్కూల్ కి దింపి తీసుకు వస్తూ ఉండేవాడు ప్రసాదు. ఏ విషయంలోనూ ఎటువంటి లోటూజరగకుండా ఆదర్శవంతమైన తల్లితండ్రులుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.

48 views1 comment
bottom of page