top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 9'Jeevana Chadarangam - Episode 9' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 20/02/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 


పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 


ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 


బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. 


మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. 


రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి. రాధకు పితృ సమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న తన అక్కయ్యను తనతోనే ఉంచుకుంటుంది రాధ.


పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి.


ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 9 చదవండి. 


“ఏవండీ రాధగారు, మీరు అర్జెంటుగా స్కూల్ కు రావాలి. మోషన్సు అవుతున్నాయి. వచ్చి తీసుకెళ్ళాలి..” 


ఆ మాటకి రాధ గుండెలు జారినంతపనైయ్యింది.


“అయ్యో, ఏమైంది? కంగారు లేదు కదా?” కంగారుగా అడిగింది.


ఆటో ఎక్కి కూర్చున్న రాధ, ఆ వూళ్ళో వున్న గుళ్ళల్లోని దేవుళ్లందరికీ మొక్కులు పెట్టుకుంది. నా బిడ్డను రక్షించు తలనీలాలు ఇచ్చుకుంటానని వెంకన్నబాబుకి, అప్పాలు నైవేద్యం పెడతానని ఆంజనేయ స్వామికి, ఒకటేంటి.....


మరో మొక్కు పెట్టుకునే లోపు స్కూల్ గేట్ దగ్గర ఆపాడు ఆటోవాడు మిగిలిన చిల్లర కూడా తీసుకోకుండా, కాసేపు ఆగితే మళ్లీ ఇప్పుడే వస్తాను అంటూనే, సమాధానం కోసం కూడా ఆగకుండా స్కూల్లోకి ఒక్క పరుగు తీసింది.


స్టాఫ్ రూమ్ వద్దకు పరుగు తీయగా, పక్కనే వున్న చిల్డ్రన్స్ రెస్ట్ రూమ్ దగ్గరకు పంపారు. 


అక్కడ వున్న మైత్రిని చూసి గుండె పిండేస్తినట్టయ్యింది రాధకు. స్కూల్ లోని ఆయా, తనకున్న యూనిఫామ్ ఓవర్ కోర్ట్ ని మైత్రికి తొడిగి పక్కనేకూర్చోపెట్టుకుంది. 


మైత్రికి వాష్ చేసి, తడి గౌను లంచ్ బాస్కెట్ లో పెట్టి రాధ రాగానే ఆమెకు అప్పచెప్పింది ఆ సపోర్టింగ్ స్టాఫ్ 


తాను మొక్కుకున్న దేవుళ్లందరినీ ఆ యువతిలో చూసింది రాధ. ఇలాంటి పనికి ఆర్ధిక పరిస్థితి వల వచ్చి ఉంటుంది. పట్టుమని ఇరవైయేళ్ళైనా లేవు, కానీ ఇలా సేవ చేయడమంటే మాటలు కాదు మనసులోనే అనుకుని అనేక విధాల ఆ అమ్మాయికి కృతఙ్ఞతలు చెప్పుకుని, రెండుచేతులూ జోడించి, సమయానికి నువ్వు చేసిన సేవకు డబ్బు రూపంగా చెల్లిస్తున్నాను అని అనుకోకుండా నా సంతోషానికి ఈ టైములో నేను ఇవ్వ గలిగినదిగా భావించి తీసుకో అమ్మా, అంటూ ఆప్యాయత నిండిన స్వరంతో చెప్పి ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి, మైత్రిని తన చేత్తో పట్టుకుని మరో చేత్తో తనను చీర కొంగుతో కప్పి ఆటో దాకా తీసుకు వెళ్లి, ఆటోలో ఇంటికి తీసుకు వెళ్ళింది.


ఈ సంఘటన ద్వారా మనుషుల విలువను మరొక్క సారి తెలుసుకున్న రాధ, ప్రేమానురాగాల కొరత మైత్రికి ఎప్పుడూ రానివ్వ కూడదు, అదే నేను దానికి ఇచ్చే మొదటి ఆస్థి అని గట్టిగా తీర్మానించుకుంది. 


ఎన్ని లక్షలు కూడ బెట్టినా ఒక్కో సమయానికి మనకు సాటి మనిషి వల్లనే మనుగడ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నో విధాలుగా జీవితంలో అనేక రకాల అనుభవాలను చవి చూసినా ఈ సంఘటన వలన మరొక సారి జీవితపు మరో కోణం తెలిసింది. ఇదో వైకుంఠపాళి అనీ, చదరంగమని మసో సారి నిర్ధారణ అయ్యింది. 


”ఇంత చిన్న విషయానికి ఇంత ఆలోచన అవసరమా??” ప్రశ్నించుకుంది. అవసరమే, అంతరాత్మ బదులిచ్చింది. జీవితంలో ఎప్పటికప్పుడు మరో వ్యక్తి మీద తన జీవనం ఆధారపడ వలసిన అవసరం వస్తూనే ఉంది. అంచేత మనుషులు, ఆ బంధాలూ, వాటి విలువ రాధకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు.


*****


ప్రతి పైసా కూడబెట్టి మైత్రికి ఏటేటా పుట్టిన రోజుకు బంగారు నగలు కొనడం, తను అమర్చ దలచకున్నవి అన్నీ ఒక్కొక్కటిగా అమర్చడం చేస్తున్న రాధను చూసిన మరోసారి కూతురు సిరిసంపదల్లో పెరుగుతున్నందుకు సంబరపడింది గౌరి. తన నిస్సహాయతను చూసుకుని ఏడవడం కంటే, రాధ చేతుల్లో తన బిడ్డ చక్కగా పెరుగుతోందన్న సంతోషమే ఎక్కువగా పొందేది. అది ఆమె సంస్కారం.


రాధ మాత్రం ప్రతీ పరిస్ధితినీ దైవం ఏర్పరచిందిగానే భావించింది. తండ్రి నీడ లేక, భర్త దూరమై తన పంచన చేరిన అక్క నేడు తన బిడ్డకు అండగా వుంటోంది.ఎలాంటి స్వార్ధమూ లేకుండా కేవలం ప్రేమతో చేరదీసితనతోనే ఉంచుకున్నందుకుఆమె ఈనాడు తన బిడ్డకు తోడ-నీడై ఉంటున్నందుకు దైవానికి కోటి దండాలు పెట్టింది. పొద్దున్నే పనులన్నీ చకచకా తెముల్చేసుకుని, దేవుడికి దీపం పెట్టేసుకుని, వాకిట్లో ముగ్గు వేసేసి, అరోగంటలోకల్లా అన్ని పనులూ పూర్తి చేయడం ఆమె అలవాటు. అలా అలవాటైన చురుకుతనం అందరిలో ఉండాలనుకోవడం బలహీనతగా మారింది. తనలాగే ఇంట్లో అందరూ క్రమశిక్షణతో ఉంటూ అన్ని పనులూ టైం ప్రకారం చేసుకోవాలని, ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలని ఆశిచడంతో అక్కడే అభిప్రాయ భేదాలూ ఆరంభించాయి. 


సహజంగానే చురుకుతనం లేకపోవడం, అమ్మ గదమాయించడం నచ్చేది కాదు మైత్రికి. ఇంట్లో అక్కయ్య పని తీరు కూడా అంతగా నచ్చక పనులన్నీ చురుగ్గా చేసుకునేది రాధ.


ఎట్టి పరిస్థితుల్లో మైత్రి మాత్రం క్రమశిక్షణగా పెరగాలన్న తాపత్రయంతో గట్టిగా ప్రయత్నం చేయడమేకాక కోపంతో చిందులువేసేది. క్రమశిక్షణ పేరిట ఎప్పుడూ మండి పడుతున్నట్టుండే రాధ మాటలు పెడచెవిన పెట్టడం మైత్రికి నెమ్మదిగా అలావాటైయ్యింది. 


సహజంగానే నిదానంమైన స్వభావం కలిగి ఉండడం, తనపని తాను సక్రమంగా చేసుకుపోవడం అలవాటైన ప్రసాదుకు కొత్తగా అజమాయిషీ చేయడం చేత కాలేదు. అలా మరొకరున్నా సహించేవాడు కాదు. 


అక్కకి ఆంక్షలు నచ్చక, మైత్రికి అసలు క్రమశిక్షణే నచ్చక ఇంట్లో రణముగా ఉండేది. కష్టపడడం, పనులు చేసుకోవడం అలవాటవ్వక అమ్మ మాటలు కటువుగా అనిపించే మైత్రికి. 


తాతగారి ప్రేమ, నాన్న గారం, పెద్దమ్మ అభిమానం ముందు అమ్మ కటువు మాటలు విషంగా అనిపించేవి.


తన వైఖరిని ఎవ్వరూ లెక్కచేయకుండా ఉండే సరికి రాధకు కోపం చిర్రెత్తుకు రావడం, ఆ ఇల్లు ఒక్కోసారి రణరంగంగా తయారవ్వడం నిత్య కృత్యమయ్యింది. పట్టుదల గల రాధ మాత్రం తన ప్రయత్నాన్ని వీడక చేస్తూనే ఉంది. 


 చిన్నపిల్ల దాన్ని ఎందుకు ఆలా వేధిస్తావు అంటూ ప్రసాదు అన్నా, పట్టించుకోకుండా మైత్రిని వంచే ప్రయత్నమే చేసేది. 


తన పని వల్ల ప్రయోజనం ఉంటుందని నమ్మిన రాధ తన ప్రయత్నం ఎన్నడూ మానలేదు.

*****

మైత్రి విషయంలో రాధ అలా అతి జాగ్రత్త తీసుకోవడానికో, అతిగా క్రమ శిక్షణ లో పెట్టడానికో కారణం లేకపోలేదు. 

మేన మామల గుణాలు, తాతల నాటి రక్తంలోంచి ప్రవహించే పోలికలూ తను అల్లారు ముద్దుగా పెంచుకునే కూతురిని పెడత్రోవన పెట్టకుండా చూసుకోవాలన్న మున్జాగ్రత్త అది. 

******


కాలేజీ లో కలుసుకున్న మైత్రితో, “ఈరోజు ప్రిపరషన్, ఈ వీక్-ఎండ్ లో సెమినార్ వుంది. మనం ప్రిపేర్ అవ్వడానికి చాల కొద్దీ టైమే ఉంది. రెండో పీరియడ్ అయ్యాక కాన్ఫరెన్స్ హాల్ కు వచ్చేస్తే అక్కడ మేడం అందరికీ సబ్జక్ట్ టాపిక్స్ ఇస్తానని అన్నారు. 


“ఈ ఒక్క రోజులో టీమ్ గా ఉంటి సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాలి. రేపటి నుండి ప్రిపరేషన్, ప్రాక్టీసు కూడా చేయాలి. ఇద్దరమూ ప్రెసెంటేషనుకి భాగాలు గా చేసుకుని చదువుకోవాలి” అంటూ ఏకధాటిగా చెప్పేసింది సిరి.


“నేను సెమినారుకూ రాను, ఎక్కడికీ రాను” ఖరాఖండీగా చెప్పేసింది మైత్రి.


అసలే అర్భం, ఆపై గర్భం అన్నట్టు, ఎప్పుడూ అంతంత మాత్రంగా అత్తెసరు మార్కులతో చదివే మైత్రి, ఊరు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచీ అదీ లేకుండా పోయింది. చదువు పట్ల బొత్తిగా నిర్లక్ష్యంగా తయారవ్వడం సిరి గమనిస్తూనే ఉంది. 


కాలేజీకి అందంగా అలంకరించుకుని వెళ్లడం ఇష్టమైన మైత్రి దానిపైన కూడా ఆసక్తి చూపకపోవడమూ ఒక కొత్త విశేషమే. మంచి మంచి డ్రేస్స్లులన్నీ రోజుకొకటి చప్పున వేసుకునే మైత్రి, ఇప్పుడు ఏదో వేసుకుంటే చాలునన్నట్టు ఏవో డ్రెస్ వేసుకుని వస్తోంది. అలంకారంమీద కూడా ధ్యాస తగ్గింది. ఎప్పుడు పరధ్యానంగా ఉంటూ ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటోంది. 


“మైత్రీ, ఏంటే నీ పరధ్యానం? ఈ లోకంలో ఉన్నావా లేదా? ఇలా ఉంటే ఇదిగో నేను అత్తయ్యకు చెప్పేస్తానుగా!” గారంగా మందలించింది సిరి.


బాగా చదువుతుందని సిరి అంటే కొంచం నచ్చనితనం సహజంగానే ఉండడం, దానికి తోడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుతో తనకే తెలియకుండా మానసికంగా సిరికి కొంచంకొంచంగా దూరమవ్వసాగింది. సిరికి పొగరు అన్నట్టు తన మనసులో తానే ఒక ముద్ర వేసుకుంది. 


అవతలి వ్యక్తి స్థాయికి మనం చేరుకోలేకపోతే, వారిని కిందకు లాగెయ్యడం సులభమైన పని, ఆలా చేయడం మానవ నైజం. సిరి విషయంలో మైత్రి కూడా అలాగే చేసింది. తాను ఎదగలేని స్థితిలో సిరి ఉంటే, ఆమెను దూషించుకుంటూ సంతృప్తి పడడం అలవాటు చేసుకుంది. 


అందుచేత అక్కరతో చిన్నగా మందలించిన సిరిని ఇప్పుడు అవమానించడానికికి కూడా వెనుకాడని స్థితికి చేరుకుంది మైత్రి. సిరి చురుకైన మాటల వల్ల ఈ విషయం అమ్మకు కూడా తెలిసే ప్రమాదం ఉందని అనుకుంది. 

అదీకాక తన ప్రేమను పసికట్టే తెలివి సిరికి మాత్రమే ఉంది కనుక ముందు దానిని తను దూరం పెట్టేస్తే, ఆ ప్రమాదం తప్పుతుంది అని ప్లాను వేసింది.


ఇదే వంక అదే వంకన, ఎలాగైనా సిరిని కాస్త దూరం పెట్టాలన్నట్టు, " సిరీ, నువ్వేమీ నా మీద మా అమ్మకు నేరాలు చెప్పక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. నీ చదువు నువ్వు చూసుకో. నా జోలికి రాకుండా ఉంటే సరి” అంటూ పెడసరంగా పుల్లవిరుపు మాటలతో గుచ్చింది.


కొత్తగా మాట్లాడుతున్న మైత్రిని చూసి నొచ్చుకుంది సిరి. ఎంతటి శాంత స్వభావమున్నా, చక్కటి మాట తీరున్నా, నొప్పించని తీరున్నా సిరిది కూడా చిన్న వయసే. సున్నిత మనస్కురాలు కూడా. 


మనసు విరిగినపుడు దూరంగా జరిగిపోతుందే కానీ మాట మాట్లడదు. మైత్రి విషయంలో కూడా అదే చేసింది. 


 ఇన్నాళ్లు, అత్తయ్య మీద అపారమైన గౌరవముండడంతోనో, మైత్రి మీద గల ప్రేమతోనో ఆమె అడపా-దడపా మొహం తిప్పుకున్నా పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ప్రతి మనిషికి ఆత్మాభిమానమనేది ఒకటుంటుంది. అది దెబ్బ తిన్నప్పుడు, అవతలి వారికి బుద్ధి చెప్పడం కంటే దూరం జరిగిపోవడాన్నే ఎంచుకుంటుంది. నోరు పారేసుకోకుండా సిరి దూరంగా జరిగిపోయే మార్గాన్నెంచుకుంది. మైత్రితో చనువుగా ఉండడమో, చనువుతో ఏదైనా చెప్పడమో చెయ్యకూడదని గట్టిగా నిశ్చయించుకుంది.


ఇలా మైత్రి ఉండడం ఇదివరలో ఎరుగదు కనుక కాస్త వింతగానూ అనిపించింది. ఏదో కారణంగానే అలా చేస్తోందని మాత్రం తెలుసుకుంది. ఐతే, ఇవన్నీ తప్పవనుకుని తనకుతాను సర్ది చెప్పుకుంది.


హమ్మయ్యదీని బెడద వదిలింది, ఇక మీద నా జోలికి రాదు అని సంబరపడింది మైత్రి. ఇక ఆడింది ఆటగా పాడిందిపాటగా చేయవచ్చుననుకుది. ఇంటి వరకూ తన విషయం వెళ్ళదని మురిసిపోయింది. 


మైత్రి సంబరానికి వెనుక గల కారణం సిరితో సహా ఎవ్వరికీ తెలియదు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.

40 views0 comments

Comments


bottom of page