top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 11


'Jeevana Chadarangam - Episode 11' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 02/03/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 


పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 


ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 

బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. 


మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. 


రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి. రాధకు పితృ సమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న తన అక్కయ్యను తనతోనే ఉంచుకుంటుంది రాధ. 


పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి. 


సిరికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది మైత్రి.

మైత్రిని ఒక హోటల్లో చూసిన స్నేహితురాలు రమ్య, ఆ విషయం సిరితో చెబుతుంది.

ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 11 చదవండి. 


ఎప్పటిలాగానే బావను చాటుమాటుగా కలుసుకోవడానికి పార్కుకు వెళ్ళింది మైత్రి. అక్కడ రాఘవ ఆమెకోసం ఆత్రంగా వేచి ఉన్నాడు. వ్యాపారం పేరు చెప్పి ప్రేమాయణం సాగిస్తున్నాడో, ప్రేమ పేరు చెప్పి వ్యాపారం కొనసాగిస్తున్నాడో కానీ, మైత్రికి మాత్రం బావ అడపాదడపా హైదరాబాదుకు రావడం చాలా ఉత్సాహాన్నిస్తోంది. మొత్తానికి ప్రేమ పేరుచెప్పుకుని చదువుకి స్వస్తి చెప్తున్నా, రంగుల కలల్లో తేలిపోతూ బావ కోసం ఎదురుచూపులూ,విందులూ, విహారాలూ ఎక్కువే అయ్యాయి. మిగిలిన రోజులన్నీ స్నేహితుల మధ్య కాలేజీలో సైతం నిరుత్సాహంగా ఉన్నా, రాఘవ వచ్చిన కొద్దిరోజులు మాత్రం చాలా ఆనందంగా గడిపేస్తుంది మైత్రి.


చుట్టపు చూపుగా కూడా రాధత్తయ్య ఇంటికి వెళ్ళడు రాఘవ. రాధత్తయ్యకు తమ కుటుంబ ధోరణి నచ్చదని అతనికి స్పష్టంగా తెలుసు. అదీకాక, తమ నక్కవినయాలు, అబద్దాలు మాటల్ని ఇట్టే పసికట్టేస్తుందనే భయం కూడా లేకపోలేదు. 


యావత్ కుటుంబమూ ప్రయత్నించి, వ్యాపారపార్టీ పేరిట చుట్టాలందరితో సహారాధ కుటుంబాన్నీ పిలవడంలోని అంతరార్ధమే, రాధ, ప్రసాదు మనసుల్లో కొంతచోటు సంపాదించడం. అలాగైనా, ఆమెకు వాళ్ళ పై సదభిప్రాయం ఏర్పడితే, ఆనవాయితీగా పిల్లను అడగవచ్చన్నదే వారి ఉద్దేశ్యం. ఐతే, ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. రాధ ఎప్పటికిమల్లే పార్టీలో అప్పటికి కావలసిన పలరింపులకే పరిమితమై వారితో ముభావంగా గడిపిందేకానీ వారి వైభవం చూసి ఉబ్బితబ్బిబ్బైపోలేదు. అట్టి పరిస్థితుల్లో రాధ ఇంటిళ్ళింటికెళ్ళి అబాసుపాలైతే మైత్రి కూడా దక్కదన్నభయం మరోపక్క వేధించడంతో ఆపాటి జాగ్రత్త తీసుకుంటాడు రాఘవ.


స్వంత అత్తయ్య గౌరి ఇంటికి వెళ్లడం, అక్కడే బస చేయడం జరుగుతూ ఉండేది. అన్నయ్యల ద్వారా మైత్రికి తన రాకనూ, కలవడం మొదలైన కబుర్లన్నీ తెలియడం జరుగుతూ ఉంటుంది. కొద్ది నెలలుగా జరగుతున్నా ఇంట్లో మాత్రం ఇది తెలియకుండా జాగ్రత్త పడడం, అమ్మతో అబద్ధం ఆడడం అలవాటైపోయింది మైత్రికి.చదువు మానేసింది, అబద్దాలు మొదలుపెట్టింది, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వెనుకాడకుండా తయారయ్యింది. ప్రేమ ఎన్ని పనులనైనా చేయిస్తుంది.


ఎప్పుడూ ఖరీదైన దుస్తులనే ధరించడం, స్టైలుగా తయారవ్వడంరాఘవకి అలవాటు. ఆ హంగులతోనే మైత్రి మనసుని దోచేశాడు. అందులో మోసం చెయ్యాలన్న ఉద్దేశ్యం లేకపోయినా, అది నిశ్చలమైన ప్రేమ మాత్రంకాదు. ఇంటిల్లపాదీ కలసిచేసిన వ్యూహాత్మక ప్రణాళిక. అదిమైత్రికి అర్ధమవ్వలేదు.


“పార్కుల్లో తిరగడాలు, గంటల తరబడి కూర్చుని కబుర్లు చెప్పుకోడాలూ, ఇలా రోజులు గడిచిపోతున్నాయి”మైత్రి చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దాడుతూ అన్నాడు రాఘవ.


పువ్వు విరిసినట్టు పులకించిపోయింది మైత్రి.అంతలోనే అతడి స్వరంలో మార్పు వచ్చింది.


భృకుటి ముడుస్తూ, “నువ్వు చేసిన పని నాకేమి నచ్చలేదు మైత్రి. ఒక నెల నేను కనిపించకపోయేసరికి ఎన్ని పెద్ద-పెద్ద మార్పులొచ్చేసాయో? నా మనసులోని భావాలన్నీ ఇప్పుడు నేను నీకు చెప్పేస్తాను. నిన్ను నా ఇంటి మహారాణిని చేయాలని అకున్నాను. అందుకే ఫారిన్ ట్రిప్పు వెళ్లి వచ్చాను. తీరా వచ్చి చూసేసరికి నువ్వుహీనమైన ప్యూను ఉద్యోగంలో చేరడం గురించి విన్నాను. నా మనసు బాధతో విలవిలాడింది. కోపంతో దహించుకుపోయింది. విన్న వెంటనే నాకెంత బాధ కలిగిందో తెలుసా? అయినా అంత గారాబంగా పెంచిన మీ అమ్మ అసలెందుకు ఈ పని చేసింది?మన జీవితం గురించి నేనెన్ని కలలు కన్నానో తెలుసా? మీ అమ్మ మనస్తత్వం తెలుసును కాబట్టే ఇంతా ధైర్యం చెయ్యట్లేదు కానీ లేకపోతే మా అమ్మా-నాన్నలతో మీ ఇంటికి వచ్చి పిల్లనివ్వమని అడిగేవాళ్ళము. నువ్వుంటే మా వాళ్ళకి అంత ఇష్టం. నువ్వు వాళ్ళ రక్తానివి కదా?. ఆ రక్తసంబంధం లాగకుండాఉంటుందా?


మన మందుల ఎగుమతులవ్యాపారానికి నువ్వే రాణివి అవుతావు.నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కూర్చోపెట్టాలని నేనుఅకుంటుంటే నువ్వేంటోయీచిన్నపనిలో చేరావు? అసలు ఇలాంటి పని చెయ్య వలసిన ఖర్మ నీకేముంది? ఇలాంటి తప్పుడు సలహా అసలు ఇచ్చినది ఎవరు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు. నాతో జీవితం పంచుకోవాలనుకుంటున్న నువ్వు ఇలాంటి నిర్ణయానికి ఎలా ఒప్పుకున్నావు? మీ అమ్మ బలవంతమా? మీ అమ్మ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచించదు . దానికి గడచిన రోజులే ఉదాహరణ. తన ఉద్యోగం నాటినుండి మా ఇంట్లో ఉండమని మా నాన్న అడిగినా ఒప్పుకోలేదుట. 


మా నాన్న అంటే మీ అమ్మకి మొదటినుంచి ఇష్టం ఉండేది కాదు. అన్నయ్య అన్న గౌరవం కూడా లేకుండా, ఆనాడు హైదరాబాదులో తను ఉద్యోగంలో చేరడానికి వచ్చినప్పుడు మా కుటుంబం అక్కడేఉన్నా మీ అమ్మ వెళ్లి వాళ్ళ పిన్నిగారింట్లో ఉంది. ఆ విషయంలో మా నాన్న ఎప్పుడూ బాధ పడుతూ ఉంటారు. మా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం, దానికి చిన్ననాటి నుంచి అన్నీ కష్టాలే. తల్లి పోయి, కష్టాల్లో బతికారు. ఈ అత్తెసరు బతుకుల ఉద్యోగాలెందుకూ, దాన్ని హాయిగా ఉండనివ్వండీ అని బాబాయ్యతో చాలా సార్లు చెప్పాను. ఐనా మా బాబయ్య వినలేదంటూ మా నాన్న బాధ పడని రోజులేదు తెలుసా మైత్రీ. అన్నయ్య అని అనుకోకుండా మీ అమ్మ మా నాన్నను ద్వేషించిందే కానీ మా నాన్నకు ఎప్పుడూ చెల్లెలి మీద ప్రేమే. ఆయనకు నీ కన్నతల్లైన స్వంత తోబుట్టువు గౌరి ఎంతో, బాబయ్య కూతురైన రాధత్తయ్యా అంతే. మన కుటుంబాలు కలవాలంటే, మనమొకటవ్వాలి మైత్రి. నేను నిన్ను పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటుంటే కళ్ళారా చూస్తేఅప్పుడు మీ అమ్మకు మా కుటుంబం గురించినఅసలు నిజం అర్ధమవుతుంది. రుజువయ్యిందంటే నమ్ముతుంది. కూతురు సంతోషంగా ఉందని సంబర పడుతుంది. ఏమంటావు?” అన్నాడు రాఘవ. 


సూర్యకాంతి కిరణాలకు హిమము కరిగిపోయినట్టు రాఘవ అన్న ఆ మాటలకు మంచల్లే కరిగిపోయింది మైత్రి. ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదు. ప్రేమలో మునిగిపోయిన ఆ కళ్ళకు ఆ క్షణంలో ఆ కుటుంబమంతా ఆకాశమంత ఎత్తుగా కనిపించారు. రెండు చేతులు పెనవేసుకుని మాటలు సాగిపోగా, ఏదో తెలియని తియ్యని అనుభూతితో కన్నె వయసు ఉరుకులు వేసింది. మైత్రి అణువణువులోనూరక్తం వేగంగా ప్రసరించింది. కలల ప్రపంచంలో ఆ అందాల జీవితం తనకోఒక బంగారు చిత్రంగా కనబడ సాగింది. ఊహల్లో తేలిపోతోంది.


“ఎప్పుడూ కష్టపడుతూనే పైకి రావాలని ఉంటుంది అమ్మకి. అది తన ఆలోచన.అందరమూ అలాగే ఉండవలసిన అవసరం లేదు. అన్నేసి కష్టాలుపడకుండానే సంతోషం, సంపదలుపొందగలిగే దారులున్నాయని తాను తెలుసుకోదు ఎవరైనా చెప్పినా వినదు”మనసులో అనుకుంది మైత్రి. అమ్మ మీద కూడా కోపం వచ్చేంతగా ఆ ప్రేమ మత్తులో పడిపోయింది.


“నాకు నీమీదున్నంత ప్రేమ నీకూ నాపైనుందని నా మనసుకు తెలుసు. నన్ను కావాలనుకుంటున్నావా? నా మనసుకు సంబంధించినంతవరకు ఎప్పుడైతే నేను నిన్ను చూసానో అప్పుడే నువ్వు నా దానివైయ్యావు. నా మనసంతా నిండిపోయావు. నిన్ను నా గుండెల్లో దాచుకోవడం కోసం, నీ మనసు నొప్పించకుండా వుండడం కోసం, ఆ నమ్మకము నీకు సంపూర్ణంగా కల్పించాలనే నేను ఇంత వివరంగా మునుపెన్నడూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పు మైత్రీ, నా మీద నీకా నమ్మకముందా? నన్ను నమ్ముతున్నావా? నాదానివి కావాలని నీ మనసూ అంతే బలంగా కోరుకుంటోందా? 


ఐతే నేను చెప్పింది జాగ్రత్తగా విను మైత్రి. మనం ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకుందాము. అదొక్కటే మనకిప్పుడున్న మార్గము. పెద్దల వేర్పాట్ల కోసం మన ప్రేమను బలి చెయ్యాలా? పెళ్లి అయిపోయి మనము హాయిగా ఉన్నామని తెలిసాక ఎవ్వరూ ఏమీ అనరు. అందరూ సంతోషిస్తారు. కోపం నమ్మకంగా మారుతుంది. ఆవేశం ఆప్యాయత అవుతుంది. మీ అమ్మ-నాన్నలతో చెప్పి వారు ఒప్పుకోవడం కోసం వేచి ఉంటే మనము ఎన్నటికీ ఒకటవ్వలేము. ఆమెకి మేమంటేనే ద్వేషం. ఇక నేను కావాలో ఒద్దో నీ చేతుల్లోనే ఉంది.నువ్వు వద్దనుకుంటే నాకు చావు తప్ప వేరేమార్గము లేదు” అంటూ కళ్ళను తుడుచుకుంటూ, మరో భావోద్వేగ బ్లాక్మెయిల్ బాణం విసిరాడు రాఘవ. 


పెళ్లి విషయంలో వెంటనే అప్పటికప్పుడు ఏమీ చెప్పలేక పోయినా“అలా అనకు బావ, నువ్వు లేకపోతే నేను అసలు బతకలేను”అంటూ రెండు చేతులను ఆతని చుట్టూ పెనవేసుకుపోగా,అతనిగుండెలమీదకి ఒరిగి ఆ గుండెల్లోకి మొహందాచేస్తూ కన్నీళ్లు కారుస్తూ అంది మైత్రి. ఆ పై అతని భుజం మీద తల వాల్చి,“నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాముబావా. నన్ను ఏం చేయమంటావు” అంది.


ఆ మాట అతనికి చాలు. ఆమె మనసును ఇప్పుడు పూర్తిగా చదివాడు. అది పూర్తిగా ఆతనికి బందీ అయ్యిందని గ్రహించాడు.ఇక తనని ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలిసిన రాఘవ, ఇక పెళ్లిమాట అప్పటికి కట్టిపెట్టి మాట మార్చాడు.


“మైత్రీ, నాకు నిన్న రాత్రంతా నిద్దర పట్టలేదుతెలుసా?ఇలా నీతో పార్కుల్లోనూ, రోడ్లమీదా మాట్లాడుతుంటే నాకు మనస్కరించట్లేదు. నువ్వు, నా మనసంతా నిండిపోయున్నావు. నీతో సంతోషాలన్నీపంచుకుని ముద్దూ, మురిపాలతో ఆందంగా ఉండాలన్నదే నాకు జీవితంలో ఉన్న కోరిక. అయితే నన్ను పూర్తిగా నమ్ముతావోలేదోనన్న భయం మరోవైపు నన్నెప్పటికప్పుడు దహించేస్తోంది. నాతోటి వస్తావా మైత్రీ?” దీనంగాఅడిగాడు రాఘవ. 


“అదేంటి బావ అలా అడుగుతున్నావు? నా జీవితం నీ జీవితంతో ఎప్పుడో ముడిపడిపోయింది. ఇకపై నేను జీవించేదైనా మరణించేదైనా నీతోనే. మనిషినైతే ఇక్కడుంటున్నానే కానీ మనసంతా నీ చుట్టూనే తిరుగుతోంది. చదువు మీద కూడా అసలు ధ్యాస పెట్టలేకపోతున్నాను. నీకు దూరంగా ఉంటూ నేను మాత్రం సంతోషంగా ఉన్నాననుకుంటున్నావా?” బేలగా అంది మైత్రి.


“నువ్వు నన్ను నమ్ముతున్నావా మైత్రి? అది చాలు నాకు.నేను చెపుతున్నది నీకు నమ్మశక్యంగా ఉందంటే అదే నాకు పరమానందం? నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానన్న నమ్మకం నీకుందా లేదా? అలా నీ నమ్మకాన్ని గెలుచుకోలేకపోయానంటే నేను బ్రతికి ఉండడం ఇంక అనవసరమని రోజూ అనుకుంటాను మైత్రీ” భావుకతతో అన్న రాఘవ మాటలకు ధారపాతమైయ్యాయి మైత్రి కళ్ళు.


“ఐతే రేపంతా నువ్వు నాతోటి గడపాలి. నేను నీకు మన వ్యాపార విషయాలన్నీ చెపుతాను. నీకోసం నేనేం తెచ్చానో తెలుసా? ఇప్పుడుకాదు రేపు నువ్వే చూద్దువుగాని. నేను వ్యాపార విషయమైరేపు ఉదయాన్నే ఒక డీల్ మాట్లాడుకున్నాక పదిన్నర నుంచీ మళ్లీ రాత్రి ఊరికి బయలుదేరే వరకు ఫ్రీగానే ఉంటాను. ఈ ఊళ్ళో ఉన్నరోజంతా నీతో గడపాలని ఉంది. వస్తావుకదూ?ఇదివరకొకసారి వచ్చావే, అదే బసేరాలో ఉంటాను. ఎంచక్కా బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. మళ్ళీ మరో రెండు మూడు నెలలవరకు నేను హైదరాబాద్ రాలేను. నాకు లండన్, పారిస్ లో పనులున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అక్కడ మన డీలర్లతో పనులు ముగించుకుని రావాలి.నిన్ను వదిలి రెండునెలల పైన ఎలా ఉండాలో అర్ధంకాక తమ్ముడిని పంపించమని నాన్నతో చెపుతున్నాను. కానీ వాడికి ఇంకో పనుంది. నేనైతేనే ఫారిన్ లో చక్కగా డీల్ చేయగలనని ఆయన అంటున్నారు. ఒక రోజు నీతో గడిపి ఆ తీపి జ్ఞాపకాలను తీసుకుని వెళ్లాలని ఉంది. నాకాభాగ్యం కల్పిస్తావా మైత్రి?”ఆర్తిగా అన్నాడు రాఘవ.


“వస్తాను బావ, నువ్వెక్కడికి రమ్మన్నా నేను రావడానికి ఆలోచించను. ఈ జీవితమే నీది అనుకున్నాకా ఆలోచనెందుకు. కానీ నాకెందుకో కొంచం భయంగా ఉంది. ఆఫీసులో చేరడానికి అప్పోయింట్మెంట్ ఆర్డర్ రావడానికి మరో వారం పడుతుంది. ఈ లోపు కాలేజీకి వెళుతున్నాను. కాలేజీ మానేసి రోజంతా అంటే, అమ్మకి తెలిస్తే చంపేస్తుంది” అంటూ భయం నటించింది.


“ఏమి తెలియదు, అన్నీ నేను చూసుకుంటాను. ఎలాగూ మానేసే కాలేజీనే కదా! అమ్మ ఇప్పుడు అది అంతగా పట్టించుకోదులే” హామీ ఇచ్చాడు రాఘవ. ఆరోజు అకస్మాత్తుగా స్నేహితురాలు కనిపిస్తే మైత్రి సంభాళించిన విషయం జ్ఞాపకం చేసుకుని తనంత కాకపోయినా, పరిస్థితిని సంభాళించడం తెలుసు మన మైత్రికి అని లోలోనే అనుకుని సంబరపడ్డాడు రాఘవ.

****


“మన ఈ ప్రేమ ప్రపంచంలోకి విచ్చేసిన నా కలల రాణికి స్వాగతం!!” అంటూ మంచం మీద వాలాడు రాఘవ. మొహమాటంగా సోఫాలో కూర్చుంది మైత్రి. ఏంటి డియర్, నువ్వున్నది నీకు కాబోయే మగనితో! నీ కలల రాకుమారుడి దగ్గరకొచ్చి, సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతావనుకుంటే అలా డల్ గా వున్నావేంటి? ఈ కౌగిలి వెచ్చదనం నీలోని భయాలన్నీ పోగొట్టేస్తుంది. హాయిగా ఉంటుంది” మైత్రిని తన రెండుచేతులతో చుట్టేసి గుండెలకు హత్తుకుని ఆమె ముఖాన్ని ఎత్తి, తన రెండు చేతులనూ తన చేతుల్లేకి తీసుకుని ముద్దాడాడు. 


"నాకు భయంగా ఉంది బావా! ఈరోజు కాలేజీకి రాలేదని తెలిసి, అమ్మ ఆరా తీస్తే కనుక అమ్మకి అంతా తెలిసిపోతుంది. అసలే ఆరోజు రమ్య ఇక్కడే ఇదే హోటల్లో చూసింది. సిరికి తప్పకుండా ఈ పాటికి చెప్పే ఉంటుంది. ఏమి గొడవ జరుగుతుందో ఏమిటో?" అంది భయంగా. 


“చెప్పేదైతే ఈ పాటికే తెలిసుండేది. ఐనా చెపితే చెప్పనివ్వు, ఇకమీద నేనున్నాను నీకు. నిన్ను ఎవరేమన్నా నేను ఊరుకునేది లేదు. నువ్వు నా సర్వస్వానివి, నిన్ను ఒక్కమాట ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను” అంటూండగానే అతడి కళ్ళలో గిర్రున తిరిగిన కన్నీటిని చూసి, "ఛ..ఛ.., ఆలా బాధ పడకు బావ, నాగురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, అంటూ అతడిని హత్తుకుంది. అంతే, గట్టిగా గుండెలకు అదిమి పట్టుకుని, మైత్రిని భుజాల మీద నుంచి మెడంతా ముద్దులతో నింపేసాడు. మైత్రి అతడి కౌగిలిలో మైమరచి పోయింది. ఆమె పెదవులను తన పెదవులతో బంధించేసాడు. 


ప్రపంచమంతా అలాగే ఆగిపోతే బావుండుననిపించింది మైత్రికి. బావా, నన్ను వెంటనే పెళ్లి చేసేసుకో. నేను నిన్ను వదిలి ఉండలేను, తన పెదవుల్లోని అమృతాన్ని అతనికి అందిస్తున్న మైత్రిగారాలుపోతూ అంది. 


ఇదిగో, ఈ ఫారిన్ ట్రిప్ అవుతూనే మనము రిజిస్టర్ పెళ్లి చేసేసుకుని నేరుగా మీ ఇంటికి వెళ్లి కాళ్ళ మీదపడదాము. ఆశీర్వదిస్తారు. నేను నీకు బావను, ఆ మాత్రం హక్కు నాకుంది. మన కుటుంబాలు ఎన్నటికీ కలిసుంటే నాకదే చాలు. మన విషయంలో ఎవరేమనుకున్నా ఏమైనామీ అసలు అమ్మా, మా మేనత్తా తప్పక సంతోషిస్తుంది. మీ అమ్మకు కోపం వచ్చినా మనం అంచలంచలుగా ఎదగడం చూసి అన్ని మర్చిపోతుంది. మైత్రీ నిన్ను వదిలి నాకు వెళ్ళాలని లేదు, కౌగిట్లో ఉన్న ఆమెను మరింత తన బిగిన బంధిస్తూ అన్నాడు.


భయం తగ్గి మామూలవ్వడమే కాకుండా రాఘవ మాటలతో మంత్రముగ్ధురాలై పోయింది మైత్రి. 


“మైత్రి, నాకో బహుమతి ఇస్తావా?”అడిగాడు రాఘవ. 


“ఏంటి బావ?”


“ఏమిలేదు, నా ఈ మూడు నెలల ఫారిన్ ప్రయాణం విజయవంతముగా సాగాలంటే నువ్వు నా వెంట ఉన్నట్టు నా మనసుకు అనిపించాలి. అందుకు, అందుకు..” అంటూ ఆమె వోణీని తొలగించాడు. 


“బావ!పెళ్లి కాకుండానే? ఇవన్నీ తప్పు బావ”మొహమాటంగా అంటూనే అతని గుండెల్లో మొహం దాచేసింది. 


“చూడు, నీకూ కావాలనే ఉంది. రేపు పెళ్లి చేసుకోబోయేవాళ్ళము, ఒకటవ్వబోయేవాళ్ళము, ఈరోజు మనకింతటి అవకాశం దేవుడిచ్చాడు, తప్పేముంది? నాదానివైన నిన్ను ఈ మాత్రం కోరకూడదా?” అన్నాడు. 

అంతే, రాఘవను అల్లుకుపోయింది మైత్రి. రెండు శరీరాలు ఒక్కటయ్యాయి. మైత్రి బుగ్గలు కెంపులమొగ్గలయ్యాయి. రాఘవ ప్రేమ సముద్రంలో మునిగి తేలిపోతోంది.

మొదటి అనుభవంలోని మాధుర్యాన్ని మనసు నిండా నింపుకుని ఇంటికి బయలుదేరింది. 


“తొందరగా వచేస్తావు కదా బావ?”ఇంటికి తీసుకెళ్లి వీధి చివర దింపుతున్న రాఘవ ముఖం చూసిబెంగగా అడిగింది. 


“పని అవ్వడమే తణువు రెక్కలు కట్టుకుని నీ వడిలోవలాలని నాకు మాత్రం లేదూ? అసలు మన భవిష్యత్తు కోసం కాకపోతే, ఈ ప్రయాణం మీద నాకస్సలు ఆసక్తే లేదు. నా దేవతను అందాలమెడలో కాలు కందకుండా చూసుకోవాలంటే నేను ఎంతో సంపాదించాలి. అందుకోసం ఈ ప్రయాణం అవసరం” అన్నాడు. 


మబ్బుల్లో తేలిపోతున్నట్టనిపించింది మైత్రికి. “నువ్వు కలలుకంటూ హాయిగా ఉండు, నేను త్వరలో వచ్చేస్తాను” హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================


వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.

37 views0 comments

Comments


bottom of page