top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 12


'Jeevana Chadarangam - Episode 12' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 07/03/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 


పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 


ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 


బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. 


మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. 


రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి. పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి. 


సిరికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది మైత్రి. మైత్రిని ఒక హోటల్లో చూసిన స్నేహితురాలు రమ్య, ఆ విషయం సిరితో చెబుతుంది. 

మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ. 


ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 12 చదవండి. 


“పదండే, క్లాసుకి టైమవుతోంది!” గ్రౌండులోంచి వేగంగా నడుస్తూ అంది సిరి. పక్కనే ఉన్న రమ్య తన చేతుల్లోని పుస్తకాన్నిస్తూ, “థాంక్సే సిరీ, నీపుణ్యమా అని రాత్రంతా రాసుకున్నాను” అంది. 


నేలలోకి తలను దించుకుని నిదానంగా నడుస్తున్న మైత్రి రమ్యను చూసి మొహం తిప్పుకుంటూ తప్పించుకున్నట్టుగా ప్రవర్తించింది. అప్పటికే వారం నుండి రమ్యను తప్పించుకుని తిరగడం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. అందులోనూ సిరి ఉన్న సమయంలో వాళ్ళతో అసలు సంభాషించడమే మానేసింది. అసలు ఇక మీద వేళ్ళని చూడవలసిన పనేలేదు. పట్టుమని నాలుగు రోజులు కూడా ఇంకకాలేజీకి వెళ్ళేది లేదు. అందువల్ల నేనెందుకు భయపడాలి అనుకుంది. ఈ ఇబ్బందులన్నీ ఇంకా కొన్నిరోజులే అని మనసులోనే సంబరపడింది. నేను మరి కొన్ని రోజుల్లో ఉద్యోగస్తురాల్ని అవ్వడం, ఆ తరువాత బావతో నా పెళ్ళి. వీళ్ళందరితో పనేలేదు అనుకుంది. 

*******


విదేశీ ప్రయాణానికి బయలుదేరబోతున్న రాఘవ, వెళ్లే ముందు మైత్రికి ఫోన్ చేసాడు.  ఆఫీస్ ఆర్డర్ వచ్చి, అనుకున్న ప్రకారం మైత్రి ఆ ఉద్యోగంలో చేరిందని విన్న రాఘవ, “చూడు మైత్రి, మీ అమ్మ వ్యవహారం నాకేమి నచ్చలేదు. నా ముద్దులగుమ్మని పనిలో పెడుతుందా. అసలు ఇలా పదిహేను ఇరవై వేలకి ఎవడికిందో పని చెయ్యవలసిన ఖర్మ నీకేమీ లేదు. నువ్వు మన కంపనీ డైరక్టరువి. సరే ఇప్పటికి ఇలా కానివ్వు, ఎలాగా నేను రెండు నెలల తరువాతే వస్తాను. అందాకా నీ ఇష్టం. నేను వచ్చాక మాత్రం వెంటనే మన పెళ్ళి, ఆ తరువాత నువ్వు ఉద్యోగం మానెయ్యాలి సుమా” అని ఆర్డర్ చేసినంతపని చేసాడు. “సరేలే బావ, అవన్నీ మనం అప్పుడు చూసుకుందాము. ఇప్పుడు నాకు ఎలాగూచదువు మీద మక్కువ లేదు, ఈ ఫైనల్ ఇయర్ ఎలా గట్టెక్కుతానా అనుకునేలోపు ఈ అవకాశం వచ్చింది. అందుకు సరే అన్నాను. నువ్వు ఎంచక్కా పెళ్ళిచేసుకుని నన్ను తీసులెక్కిపోతే ఇంక ఇవన్నీ నాకెందుకులే. ఇది నువ్వొచ్చేంత వరకే” అంది. 

****

విదేశీ యాత్ర ముగిసి వచ్చిన రాఘవ ముందుగా మైత్రి పని చేస్తున్న చోటికి వచ్చాడు. అనుకున్న దానికంటే రెండు వారాలు ముందుగానే వచ్చేయడం మైత్రికి పరమానందం కలిగించింది. 


“ఇక నువ్వు ఉద్యోగం మానెయ్యి మైత్రి. మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాము. ఎందుకంటే అందరికి చెప్పి చేసుకునే అవకాశం లేదు. మీవాళ్ళకీ మా వాళ్ళకీ పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోందిట. మొన్న చిన్నమావయ్య వాళ్ళఇంట్లో జరిగిన ఫంక్షనులో ఎదో మాటా-మాటా అనుకుని చిలికిచిలికి గాలివానైనంత పని అయ్యిందిట.  మనం పెళ్లి చేసేసుకుని వెళ్లి కాళ్ళ మీద పడితే వాళ్ళే ఒప్పుకుంటారు” అన్నాడు. 


పెద్దవాళ్ళ గొడవల గురించి కాకపోయినా ఇప్పుడు పెళ్లి అవసరమన్నట్టు, వెంటనే ఒప్పేసుకుంది మైత్రి. అలా మైత్రి ఊఁ అనడమే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది రాఘవకు.  పెళ్ళిపేరిట బంగారు కలలుకనే పరిస్థితిలో కానీ, అవన్నీ నెరవేర్చుకోవాలనే ఆశతో కానీలేదు మైత్రి. ఒప్పుకోవడమైతే చేసింది కానీ ఆ మోహంలో ఉత్సాహం కానీ నడవడిక ఉల్లాసము కానీ అసలు కనబడలేదు రాఘవకు. పెళ్ళి అయిందని అనిపించాల్సిన స్థితిఅని అతనికి తెలియదు. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మనాన్నలకు చెప్పి వాళ్ళ అనుమతితో, ఆశీస్సులుతో చేసుకునే అవకాశం లేదు. 


గుడ్డిలో మెల్ల ఏమిటంటే, రాఘవ తనంతటతానే వచ్చి పెళ్ళి వెంటనే చేసుకుందామన్నాడు. అసలు అలా అనకుండా వాయిదా వేసినా, మొహం చాటేసినా మాత్రం చేసేదేముంది అనుకుంది. ఏ నుయ్యోగొయ్యో చూసుకోవడం తప్ప అంతకంటే మార్గం లేకపోయేది. అందుకని ఇప్పిటికి ఇది అదృష్టంగానే భావించాలి అనుకుని తృప్తి పడింది. తల్లిదండ్రుల పుణ్యమే అలా కాపాడిందేమోనని గ్రహించగలిగే పక్వము లేకపోయినా, అదృష్టాన్నైనా దైవానుగ్రహంగా మనసులోనైనా అంగీకరించగలిగింది. “బావ, దేవుడు మనయందున్నాడు” అంటూ వాటేసుకుని ఏడ్చేసింది. 


“ఏమైంది మైత్రి, ఇందాకటినుంచీ చూస్తున్నాను, నువ్వు పరధ్యానంగానే ఉన్నావు. అనుకున్న దానికంటే నేను ముందుగా రావడం చూసి ఎగిరి గెంతేస్తావనుకుని ఎంతో ఉత్సాహంగా వచ్చాను. నువ్వేమో, ఇలా నిరాశగా అనిపిస్తున్నావు. నేను వచ్చేశానుగా డార్లింగ్, ఇంకా విరహమే?” సరసంగా అన్నాడు. 


“బావా, నాకు నెల తప్పింది. మొన్ననే నాకు తెలిసి, ఆ నాటినుంచి బెంగతో ఉన్నాను” అంటూ అతనికి మరింత దగ్గరగా ఒదిగింది. 


“ఓకే డియర్, ఆ భగవంతుడు మనకన్నీ తొందరగానే ప్రసాదించేస్తున్నాడు. నేను అనుకున్నదానికంటే ముందుగా వచ్చేసాను, ఇప్పుడు ఈ గుడ్ న్యూస్నాతో పంచుకుని నీ బెంగను నాకిచ్చేసి నువ్వు హాయిగా ఉండు. ఇది మనిద్దరి మధ్యనే ఉండిపోతుంది. మన పెళ్ళైపోతోందిగా!” అన్నాడు. 


బరువెక్కిపోయిన మనసు ఇప్పుడు చాలా తేలికపడింది మైత్రికి. వివాహబంధంతో ముడి పడకుండా తొందరపడితే ఎంతటి ముప్పు వస్తుందో రెండు వారాల మనోవ్యధ అనుభవించిన తనకు తెలిసింది. అమ్మ కాఠిన్యంలో ఒక సూచన దాగివుంటుంది కొద్దికొద్దిగా గ్రహిస్తోంది. 

*******


శుక్రవారం కాకపోయినా రోజూ లాగా బద్ధకంగా కాకుండా ఆవేళ కాస్త వేగంగా లేచి తలంటి నీళ్లుపోసుకుని ఒక చక్కటి చీర కట్టుకుని మైత్రి ముస్తాబవడం చూసిన రాధకు ఆశ్చర్యం కంటే ఆనందమే ఎక్కువ కలిగింది. మైత్రిఎప్పుడూ అలా కళకళలాడుతూ కడిగిన ముత్యంలా ఉంటే తనకెంతో ఇష్టం. ఆమె అలా ఉండడంకోసమే కదా వారిరువురూ కష్టపడుతున్నారు. అందుకని దానికే అనిపించి కుందనపుబొమ్మలా తయారైనప్పుడు ముచ్చటపడటమే తప్ప విశేషమేంటి, ఎందుకూ అని ఎప్పుడూ అడగదు రాధ. 


ఆఫీసుకని బయలుదేరి వెళ్ళిన మైత్రి, మరి ఇంటికి రాలేదు. సాయంకాలానికల్లా ఊరూవాడా విషయం పొక్కిపోయింది. 


ఒక్క రాధ దంపతులకు మాత్రము ఈ విషయం తెలియలేదు. చంద్రం అన్నయ్య మద్రాసు నుంచి ఫోన్ చేస్తే తప్ప తెలియనిది వీరికే, మిగిలిన శ్రేయోభిలాషులందరికీ తెలుసునన్న విషయం విన్న రాధకు రక్తం ఉడికిపోయింది. 


తల్లితండ్రుల గుమ్మం తొక్కమని నిశ్చయించుకున్న కొత్తదంపతులు, బెంగళూరు పయనమయ్యారు. ఆ వార్త తెలిసిన చుట్టాలందరూ వారిని చూడడానికీ వెళ్లారు. అంటే వారందరికీ ఈ వ్యూహం గురించి కొద్దోగొప్పో తెలుసునన్నమాట. 


“గౌరి కూడానా? కన్నబిడ్డ భవిష్యత్తు ఇలా అవుతుంటే వాళ్ళతో చేతులుకలిపి ఇలా చేస్తుందా?అంటే, అందరూ కలిసికట్టుగానే ఈ ఘోరం జరుగుతుంటే చూస్తూ ఉన్నారన్నమాట. వారికి నేను గుర్తు రాలేదా? ఇదంతా అన్యాయమని, ఇలా జరగడం తప్పని అనిపించలేదా? ఐనామనింటిపిల్లను ఇలా లేవతీసుకుని వెళ్లి పెళ్లిచేసుకోవలసిన అగత్యం ఏమి వచ్చిందని ఎవ్వరూ అడగనైనా అడగరా?” ఆవేదన పడింది రాధ. 


అంతే, అర్థమైంది. దాయాదులు అందరూ ఎవరికి వారన్నమాట. బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అంటే ఇదే కాబోలు. ఆ ఇంటి రక్తమంతా ఒకటన్నమాట. వేలువిడిచిన చుట్టరికంతో నేను దూరమన్నమాట. ఈ సమస్యను ఇక మీద ఎలా ఎదుర్కోవాలో ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకుంది రాధ. 


“సురేష్ అన్నయ్యా వాళ్ళూ రిసెప్షన్ అంటూ భోజనాలకి పిలిస్తే తగుదునమ్మా అని వెళతారా? అంటే జీవితంలో ఏదైనా ఎదురుదెబ్బతగిలితే, పెనుతుపాను కమ్ముకుంటే, ఎవరి ఎదురీత వారే ఈదాలన్నమాట. ఎవరి కష్టాన్ని వారే భరించాలి. అన్యాయం జరుగుతోందని తెలిసినా ఎవ్వరూ కనీసం నోరెత్తి కూడా అడగని లోకంలో మనముంటున్నామా!” బాధ పడింది రాధ. 


“ఆ చిన్నారి సిరిచందనే నయం. తెలిసినంతవరకూ చెప్పింది, ఆత్మార్థంగా ఆక్రోశపడింది. తన వయసుకు మించి, పెడసరంగా మాట్లాడుతున్నా సరే మైత్రిని మందలించింది. ప్రయోజనం కనబడకున్నా తనవంతు కృషిగా హెచ్చరించడానికి ప్రయత్నించింది” అనుకుంది. 


మొట్టమొదటి సారి గౌరి మీద కోపం వచ్చింది. “ఎంతైనా, వళ్ళంతా ఒకటే రక్తం, నేనే కదా పరాయి దాన్ని. సొంత అన్నయ్య సురేష్ కాబట్టి వాడి కొడుకు ఎలాంటి పని చేసినా, తన కన్నబిడ్డనే ఇలా లేవతీసుకుని వెళ్లినా గౌరికి పరవాలేదన్నమాట. ఇక్కడ ఈ వ్యూహంలో నేను ఒక్కద్దాన్నే పరాయినయ్యానా? నా స్వంత బిడ్డగా నేను పెంచానే తప్పమైత్రికూడా వాళ్ళ రక్తమేకదా!! మేనమామ, బావ. రక్త సంబంధంలేని దాన్ని నేనొకత్తినే అని చక్కగా రుజువైంది. బ్లడ్ ఐస్ తికెర్ దన్ వాటర్  అంటారు. అది అక్షరాలా నిజం” మనస్సాక్షి వెక్కిరిస్తూ వేస్తున్న ప్రశ్నలకు విలవిలలాడిపోతోంది. తల బద్దలైపోతోంది రాధకి. 


“ఈ వ్యూహంలో ఒక్క మేనరికపు ప్రీతి మాత్రమే ఉందంటే నేను నమ్మను. సురేష్ అన్నయ్య ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం. మైత్రి ద్వారా ఇంటి విషయాలన్నీ రాబట్టి, ఆస్తుల వివరాలన్నీ తెలుసుకుని వేసిన పన్నాగమే అయ్యి ఉంటుంది. ఐతే, మనం అసలు నోరు మెదపకుండా ఉండడమే ఇప్పటికి మనకు మంచిది” అనుకుంది. 

****


“జరిగినదానికి విచారించడంకంటే జరగవలసింది చూడాలి అనుకుని మనసు గట్టి చేసుకుంది. వాళ్ళందరూ ఒక రక్తమనీ, నేను పరాయిదాన్నని వాళ్ళనుకున్నా సరే. మైత్రి నా బిడ్డే, నాకు కావల్సినది దాని శ్రేయస్సే. ప్రస్తుతానికి మిగిలిన విషయాలన్నీ వదిలిపెట్టి, దాని ఉద్యోగమైనా కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను”అని మనసులో గట్టిగ తీర్మానించుకుంది. ఉదయం భర్తా అదే అన్నాడు. అంతే, మరుక్షణం నుంచీ ప్రయత్నం మొదలుపెట్టింది. తనకు ఆపద్బాంధవుడైన రామకృష్ణగారిని కలవడానికి వెళ్ళింది. 


విషయాలన్నీ విని సంభ్రమపడ్డారు రామకృష్ణగారు. 


“సరే, జరగనున్నది చూద్దాము. ఈరోజు శుక్రవారం. ఈనాటితో కాజువల్ లీవు ముగుస్తుంది. మనకింకా రెండు రోజుల గడువు చేతిలో ఉంది. సోమవారం నాడు మైత్రి విధిగా తన బ్రాంచికి పనికి వస్తే తన ఉద్యోగం దక్కుతుంది. మనము వెంటనే వెళ్లి మైత్రికి యీ విషయం చెపుదాము. ఆమెతో మాట్లాడే అవకాశము ఉందా?” అని అడిగారు. 


గౌరికి ఫోన్ చేసి, “మైత్రిని వెంటనే నాకు ఫోన్ చెయ్యమని చెప్పు. పెళ్లి విషయం మాత్రం నేను ఏమీ మాట్లాడను. మరో ముఖ్యమైన విషయంకోసం చేస్తున్నాను. ఈ ఒక్కవార్తా దానికి చేర్చి పుణ్యంకట్టుకో. దాని ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను”ముక్తసరిగా మాట్లాడి ఫోను పెట్టేసిందిరాధ. 


ఒక అరగంటలో మైత్రి ఫోను వచ్చింది, అక్కడే రామకృష్ణ గారు, ప్రసాదు, రాధ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ వున్నారు. 


"హలో మైత్రీ!” వణుకుతున్న స్వరంతో అంది రాధ. 


హలో అమ్మా. తప్పు చేశానన్న భావం ఏ కోశానా లేకుండా, ఎదో సాధించానన్న గర్వం ఆ స్వరంలో స్పష్టంగా కనిపించింది. 


పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ, “చూడు మైత్రి ఇప్పుడు నేను నీతో ఎలాంటి వాదన ప్రతివాదనలలోకీ దిగడానికి ఫోను చెయ్యలేదు. నువ్వు చాలా పెద్దదానివైపోయావని నాకు అర్ధమయ్యింది. నీ నిర్ణయాలు నువ్వు తీసుకోగల సమర్ధురాలివనీ అర్ధమైయ్యింది. నీ స్వవిషయాలు మాకు తెలియవలసిన అవసరం లేదని నువ్వు అనుకున్నాకా నేను మాట్లాడడానికి ఏమీ లేదు. నేను ఇప్పుడు ఫోన్ చేసిన కారణం ఒక్కటే. ప్రొబేషన్లో ఉన్న నీకు క్యాజువల్ లీవులు ముగిసిపోయాయి. ఎల్లుండి సోమవారానికల్లా ఇక్కడకు చేరి, యధావిధిగా డ్యూటీకి వెళితేనే ఉద్యోగం నిలుస్తుంది. ఇంకో మూడు నెలల ప్రొబేషన్ పూర్తి చేస్తే కన్ఫర్మేషన్ చేస్తారు. ఆ తరువాత పెర్మనెంట్ అవుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ నీ ఉద్యోగం మాత్రం విడువ వద్దు. అదొక్కటే నీ నుంచి మేము కోరేది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒక్క ఆత్మవిశ్వాసమే మనిషిని కాపాడుతుండి. ఆ ఆత్మవిశ్వాసాన్ని నీ ఉద్యోగం మాత్రమే నీకు ఇస్తుంది. ఈ ఒక్క ప్రమాణం నాకు చెయ్యి. ఎన్నటికీ ఉద్యోగం విడిచి పెట్టను అని నాకు మాట ఇవ్వు” అంటూ దీనంగా అర్ధిస్తున్న రాధను చూసి బాధపడ్డారు రామకృష్ణగారు. 


“లేదమ్మా మేము బెంగళూరులో ఉన్నాము. రాఘవ బిజినెస్ చాలా బాగా సాగుతోంది. అందువల్ల నాకు ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదన్నాడు. నేను ఇంక ఆ ఉద్యోగానికి వెళ్ళను”, తల్లి చెప్పిన మాటను ఇట్టే కొట్టిపారేస్తూ అంది మైత్రి. 


“నేను చెప్పేది వినమ్మా, ఉద్యోగమన్నది కేవలం డబ్బు సంపాదించడం కోసం కాదు. ఆత్మ తృప్తిని ఇస్తుంది, మనో ధైర్యాన్ని ఇస్తుంది. కొన్నాళ్ల తరువాత కావాలంటే నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రొబేషన్ పూర్తి అయ్యేవరకు మానకుండా వస్తే పెర్మనెంట్ అవుతుంది. అందువలన వెంటనే సోమవారం విధిగా డ్యూటీకి వేళ్ళు. ఇది నా అభ్యర్ధనఅని అనుకునైనా చెయ్యలేవా?” మళ్ళీ ప్రాధేయ పడినంత పని చేసింది. 


సరేనమ్మా, ఓకే అని పొడిగా అంటూలైను కట్ చేయబోతున్న మైత్రి సమాధానానికి సంతృప్తి చెందని రాధ, “ఉండు రామకృష్ణ సర్ మాట్లాడతారు, ఒక్క నిముషం, ఫోన్ ఇస్తున్నాను” అంది. 


“చూడమ్మా మైత్రి! ముందుగా వివాహమైన శుభ సందర్భంలో నీకు నా ఆశీస్సులు. ఇక పొతే, నువ్వు చిన్న పిల్లవు, మీ అమ్మ చెప్పిన మాటలు నీకు ఇప్పటికి అర్ధంకావు. పైగా ఇప్పటి పరిస్థితిలో నీకు అవిరుచించవు. చేదుగా కూడా అనిపిస్తాయి. మీ మనస్పర్థలకు అతీతమైన పరాయివాడినినేను. నేను చెప్పదలచుకున్నదేంటంటే, నువ్వు గ్రాడ్యూవేషన్ కూడా పూర్తి చెయ్యలేదు. రేపు నీకు ఎక్కడ ఎలాంటి ఉద్యోగమూ దొరకడం కష్టం. నీకు అవసరముండకపోవచ్చు కానీ చేతిలో ఉన్నదాని వదులుకోవడం అవివేకం. ముందు పర్మనెంటు అయ్యేదాకా వస్తే ఆతరువాత నువ్వుసెలవు పెట్టుకుని నీ ఇల్లు చక్కబెట్టుకోవచ్చు, ఇంక్కా తప్పని సరి ఐతే అప్పుడే మానవచ్చు. అందాక నీకు కాలక్షేపంగా ఉండడమే కాక, కొత్త జీవితంలో నువ్వు స్థిరపడేవరకూ అది నీకు కొండంత మనోధైర్యాన్నిస్తుంది. నేను మీ మేనేజరుతో మాట్లాడేను. సోమవారం నుంచి వస్తావని చెప్పాను. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి” అన్నారు రామకృష్ణ గారు. 

 

హమ్మయ్య అనుకుంది రాధ. ఎంతో సమయస్ఫూర్తిగా, భావోద్వేగాలకు తావివ్వకుండా, విషయాన్ని ఎంత చక్కగా చెప్పారో అని అనుకుంది. కూతురు చేసినపనికి గొంతు పొడారిపోయినా, అంతటి దుఃఖంలోనూ ఇప్పుడు కాస్త ఊరటగానే అనిపించింది. 


తక్షణమే బయలుదేరి వస్తుందనే అనుకుందాము. ఇంక మనం చెసేదికూడా ఇంతకంటే ఏమిలేదు. ఇంక బాధపడకుండా స్థిమితపడండి అని చెప్పి రామకృష్ణగారు నిష్క్రమించారు. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================


వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.

31 views0 comments

Comments


bottom of page