top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 13'Jeevana Chadarangam - Episode 13' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 13/03/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 

పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 

ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 

బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. 


మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. 


రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి. పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి. 


మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ. 

మైత్రి నెల తప్పుతుంది. ఇంటినుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది.


ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 13 చదవండి. 


ఆఫీసుకు వచ్చిన రాధకు ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చింది. ఎప్పుడోకాని ఫోన్ చెయ్యని చంద్రం అన్నయ్య మద్రాసు నుంచి చెయ్యడమే ఆశ్చర్యమంటే, అదీ ఆఫీసుకు ఫోను చెయ్యడం మరీ ఆశ్చర్యం అనుకుంది రాధ. అలాంటి ఫోను రావడమే కాస్త కంగారు పెట్టేసింది రాధని. 


“మైత్రి, రాఘవల పెళ్ళైయ్యిందిట కదా! మా అన్నయ్యలు రాజా, సూర్యం ద్వారా తెలిసింది రాధమ్మా. మా అన్నయ్యలు అని అంటున్నానంటేనే నీకర్థమైపోయి ఉంటుంది, నేను నిన్ను అర్థం చేసుకున్నానని. వారు నిన్ను వేరుచేసారని ఈ పాటికే నువ్వు అనుకుంటూ ఉంటావని నాకు తెలుసమ్మా! మనసు ఆగక నీకు ఫోన్ చేసాను చెల్లమ్మా!” జీరబోయింది చంద్రం స్వరం. 


గొంతు లోంచి మాట పెకలలేదు. కొద్దిగా సవర తీసుకుని రెండు నిముషాల నిశ్శబ్దం తరువాత మళ్ళీ అన్నాడు. 

“నువ్వున్న పరిస్థితి నాకు తెలుసునమ్మా. మనసు గట్టిచేసుకుని నువ్వూ బావగారూ ముందు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సమస్యలన్నీఅవే సద్దుకుంటాయి. మళ్ళీ మాట్లాడతాను, జాగ్రత్తమ్మా” అనునయంగా అని పెట్టేసాడు. ప్రొబేషన్ లో ఉన్నమైత్రి కనీసం లీవ్ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండానేడు పనిలోకి రావడం మానేసింది. ఎటువంటి ఇన్ఫర్మేషనూ ఇవ్వలేదు సరికదా, తన బావ రాఘవతో వెళ్ళిపోయి వివాహం చేసేసుకుందనిమరోసారి నిర్ధారిస్తూ పిడుగులాంటి ఆ వార్త బ్రాంచి ద్వారా రావడం, అక్కడి నుంచి రాధకు చేరడంతో రాధకు కాళ్ళూచేతులూ ఆడలేదు. అసలు ఇదంతా ఎలాజరిగింది. మనకు వాళ్ళ కుటుంబంతో రాకపోకలే లేవు కదా! అలాంటిది, మైత్రికి వాడితో స్నేహం ఎలాకుదిరింది? ఇలాంటి ఆలోచనలున్నట్టు ఎన్నడూ మచ్చుక్కైనా అనలేదే. ఇంత జరిగే వరకూ నాకు దీని గురించే తెలియలేదే. ఈయనకు కూడా ఏమీ తెలియదే? ఇన్నాళ్లూ కాలేజీ ఇల్లు తప్ప ఎక్కడికీ వెళ్ళి ఎరుగదే. ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వేసుకుంటూ ఒంటి స్థంభంలా నిలబడింది. 


కాలేజీ అన్న మాట తట్టగానే రాధకు మొదలు జ్ఞాపకం వచ్చిన పేరు సిరిచందన. “సిరి లాంటి మంచి చురుకైన తెలివైన పిల్ల స్నేహంలో ఉండి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుందా? ఇందులో ఎదో తిరకాసుంది. ఒకవేళ దానికి తెలియకుండా వాళ్ళు కిడ్నాప్ చెయ్యలేదుకదా? మా రాజా అన్నయ్యను నమ్మడానికి లేదు. తన మాటను నెగ్గించుకోవడానికివాడు ఎంతకైనా తెగిస్తాడు. వాడు చేస్తున్న వ్యాపారంలో ముఖ్యమైనది, దొంగనోట్లు అచ్చు వెయ్యడానికి కాగితాలు సరఫరా చేయడం. ఆ కాగితాల ఫాక్టరీ వారితో లావాదేవీలు ఉన్నట్టు మొన్నామధ్య అందరమూ పిఠాపురంలో కలిసినప్పుడు విన్నజ్ఞాపకం. అప్పటికి రాఘవ చదువుకుంటున్నాడు. కొద్దికాలంలోనేవాడు కూడా చదువు మానేసి ఇలాంటి పనుల్లోనే ఉన్నట్టు విన్నాము. అహంకారం, షోకులకి ఏమి తక్కువ లేదు వాళ్ళకి. పండుగకు వెళ్లినప్పుడు చూసినా పెద్దగా గ్రహించలేకపోయాను” ఆక్రోశపడింది రాధ. 


ఎన్నెన్నో ఆలోచనలు కలపెట్టగా ఏం చేయాలో పాల్పోక భర్తకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది రాధ. 


ఎప్పటిలాగానే అమాయకంగా ఉండే ప్రసాదు, రాధ మాటను అక్షరాలా పాటిస్తూ వెంటనే ఇంటికి వచ్చేసాడు. 


ఆఫీసులో పర్మిషను తీసుకుని తనూ ఆటోలో ఇంటికి బయలుదేరింది. ఆటోలో ప్రయాణమైందే కానీ, అంతకంటే వేగంగా సాగిపోతున్నాయి రాధ ఆలోచనలు. “మద్రాసులో ఉన్న చంద్రం అన్నయ్యకు కూడా తెలిసిన వార్త, ఊళ్ళోఉన్న నాకు తెలియలేదేమిటీ? గౌరికి తప్పక తెలిసుండాలే? ఎలాంటి చలనమూ లేకుండా ఎలా ఉంది?అదే ఇంట పుట్టిన చంద్రం అన్నయ్య వరకూ వార్త చేరినపుడు, గౌరికి తెలికుండా ఉండే అవకాశమే లేదు. తెలిసినప్పుడు దానికి ఏమీ అనిపించలేదా? దానికి తప్పకుండా తెలిసే ఉంటుంది. నేనే ఇక్కడ పరాయి దాన్నైయ్యానన్నమాట. ఇప్పుడు వాళ్ళ కుటుంబం నేను వేర్వేరన్నమాట. 


ఎవరి వ్యవహారమూ పసికట్టలేనంత గుడ్డిగా నేనెందుకు ఉండిపోయాను?” తనను తాను ప్రశ్నించుకుంది. ప్రశ్నలెన్నిఉన్నా సమాధానం మాత్రం ఒక్కదానికీ దొరకలేదు. 


రాధా ప్రసాదు కలిసి పెద్దన్నయ్య ఇంటికి వెళ్లారు. 


“సిరీ, విషయం తెలిసిందా?” అడిగిందే కానీ ఏడుపు ఆగలేదు రాధకి. అత్తయ్య మీద ఎంతో గౌరవం ఉన్న సిరి కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. “సిరి, నువ్వు ఎంతో పొందిక గల పిల్లవు, చక్కగా చదువుకుంటావు, అలాంటిది నీతో ఉంటూ కూడా ఇది ఇలా ఎలా చేసిందమ్మా?” అని అడిగింది. “కాలేజీలో నీకేమైనా తెలుసునా? అక్కడికి రాఘవ వస్తూ పోతూ ఉంటాడా? అసలు వాళ్లకు అంత చనువు ఎప్పుడు ఏర్పడింది? నీకేమైనా తెలుసా, తెలిసినంతవరకూ చెప్పమ్మా” అంటూ అర్ధించింది. 


తను పెంచిన కూతురి గురించి మేనకోడలిని అలా అడగడంతోనే సగం చచ్చిపోయింది రాధ. ఐనా తప్పలేదు. ఆత్మాభిమానాన్ని మూటకట్టి పక్కన పెట్టి సిగ్గుపడుతూ అడగడం చాలా అవమానకరంగా అనిపించింది. కాకపోతే, ఒక్క సుగుణమేమంటే అడుగుతున్నది సంస్కార వంతురాలైన సిరిని. అదొక్కటే మనసుకు కాస్త ఊరట. 


“అత్తయ్యా, ఆఫీసులో చేరక ముందునుంచే మైత్రి కాలేజీకి సరిగ్గా రావడం మానేసింది. ఇంచుమించు మన సంక్రాతి ట్రిప్ తరువాత నుంచి దానిలో చాలా మార్పు చూసాను. ఎప్పుడూ పరధ్యానంగా ఉండడం. అసలు చదువులో శ్రద్ధ పెట్టకపోవడము. ప్రాజెక్టు, సెమినార్స్ అంటూ నేను ప్రిపేర్ అవుతున్నా, దేనికి రాననడం!. నేను చాలా చెప్పానత్తయ్యా, ‘ఈ ఒక్క సంవత్సరం కష్టపడి చదువు, డిగ్రీ ఉండడం చాలా ముఖ్యం, నేను నీకు అన్ని రాసి పెడతాను’ అంటూ బతిమాలాను. జస్ట్ మనం టైంటేబిల్ వేసుకుని అది పాటిస్తే చాలని ఎన్నివిధాలుగా చెప్పానో. రాఘవ అన్నయ్యతో బయటకు వెళ్లడాలూ రావడాలూ, కాలేజీ ఎగ్గొట్టడాలు చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పడానికి ప్రయత్నించాను” అంది సిరి. 


మరైతే నీ మాటవినలేదా అన్నట్టుగా ఆత్రంగా చూసింది రాధ. 


“సిరీ, నా గురించిమా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నా భవిష్యత్తు గురించి నాకు తెలుసు. నీ సలహాలు నాకు అక్కర్లేదు. అలాగే, నా విషయాల్లో తలదూరిస్తే బాగుండదు’ అంటూ ఒకరోజు నాతో చాలా కటువుగా మాట్లాడింది. అది చెప్పిన దాన్ని బట్టి రాఘవ అన్నయ్య మీ ఇంటికి వస్తూ ఉంటాడు కాబోలు అని అనుకున్నానత్తయ్యా. దాని మాటలకి నాకు కష్టంగా అనిపించింది. అప్పటినుంచి దాని విషయంలో నేనేమీ మాట్లాడట్లేదు. నన్ను చూస్తేనే కోపంగా వెళ్లిపోవడం మొదలెట్టింది. నాకు చాలా బాధ వేసింది” తల దించుకుని ఇష్టంలేని నేరాలు చెపుతున్నట్టుగా చెప్పింది సిరి. 


“నేను నీతో చెప్పాలని కూడా అనుకున్నాను అత్తయ్యా. కానీ ఎలాంటి అధారాలు నా దగ్గర లేవు. ఎప్పుడూ నేరుగా నేను రాఘవ అన్నయ్యతో దాన్ని చూడలేదు. అలాంటప్పుడు అది నిందమోపడమే అవుతుంది కదా! అందుకు నాకు మనస్కరించలేదు. కానీ ఇంత దూరం వస్తుందని నేనూ అనుకోలేదు” దోషి సంజాయిషీ చెప్పుకున్నట్టు చెప్పింది సిరిచందన. 


“పిచ్చిపిల్లా, నువ్వెందుకురా బాధ పడతావు. నీలాటి స్నేహితురాలుండి కూడా అది ఇలా చేస్తోందంటే అది దాని దౌర్భాగ్యం” ఆప్రాయంగా అంటున్నా మైత్రిపైన ఆక్రోశాన్ని ఆపుకోలేకపోయింది రాధ. “అత్తయ్యా. ఇంకో విషయం.... ” అంటూ సంశయంగా నసుగుతుంటే, చెప్పమ్మా అంది రాధ. 


అదీ, అదీ అని సిరి నీళ్ళు నమలగా.... 


“ఇంతటి పెనుతుపానునేఎదురునిలిచి ఉన్నాను. ఇంతకు మించి మరేదైనా తట్టుకోగలను, చెప్పమ్మా!” దుఖాన్ని మింగుకుంటూ అంది. 


“మొన్నామధ్య మా క్లాసులో రమ్య అనేఅమ్మాయి వాళ్ళ మావయ్య కూతురిపెళ్లి జరిగింది. పొరుగూళ్లనుంచి వచ్చిన చుట్టాలకోసం వాళ్ళు బసేరా హోటల్లో వసతి ఏర్పాట్లు చేసారు. ఆరోజు, వాళ్ళు అక్కడికి వెళ్లి ఆ హోటల్లో వాళ్ళను కార్లలో తీసుకు కళ్యాణమండపానికి వెళ్ళడానికి వెళ్లారు. అప్పుడు, మైత్రిని అక్కడ చూసిందిట రమ్య. పెళ్లి హడావిడి వలన తానూ అంతగా పట్టించుకోలేదు, కాబట్టి కాలెజీలో ఎవ్వరికీ ఇది ఒక పెద్ద విషయంగా తెలియలేదు. అంతవరకు క్షేమం” స్వల్ప విరామం ఇచ్చింది సిరి. 


“ఐతే, మరునాడు నన్ను నోట్స్ అడగడానికి నా దగ్గరకొచ్చింది రమ్య. రమ్య కాకతాళీయంగా ‘నువ్వు నోట్స్ మైత్రికి ఇచ్చావా నీ దగ్గర ఉందా?నిన్న మైత్రిని హోటలులో చూసాను. ఇచ్చుంటే గోవింద ఈ రోజు నేను రాసుకుందుకు ఉండదు’అంది. 


ఆ మాట విన్నాన్నమాటే కానీ ఆ సంభాషణని మరింత పొడిగించకుండా నోట్స్ ఇచ్చేసాను. తరువాత నెమ్మదిగా అడిగాను. మైత్రి మీ చుట్టాలబ్బాయితో వచ్చింది. బహుశా మగపెళ్ళివారు తరఫున ఆ అబ్బాయికి స్నేహం ఉందేమో అనుకున్నాను అని తేలికగా తేల్చేసింది. 


రమ్య చెప్పిన ఆనవాళ్లనుబట్టి అతను రాఘవే అని ఊహించగలిగాను. రమ్య అలా కాకతాళీయంగా మరెక్కడా అననివ్వకుండా మా వాళ్ళే లేవే అనేసి, విషయాన్ని ఏమీ లేనట్టుగా తోసేసి జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు, ఇవన్నీ చూస్తుంటే, మీకు ఆ సంఘటన గురించి చెప్పడం మంచిదేమో అనిపించి చెపుతున్నాను. తప్పుగా అనుకోకండత్తయ్య” కన్నీటితో చెపుతున్న సిరిని వడిలోకి తీసుకుని రాధ, నువ్వెందుకు రా బాధపడతావు, నీలాంటి వ్యక్తి స్నేహాన్ని కూడా లెక్క చేయకుండా జీవితాన్ని నాశనం చేసుకున్నందుకు అది ఏడవాలి. 


“ఇది నాకు కాస్త ముందుగా తెలిసుంటే బాగుండేదేమో. ఏదైనా జాగ్రత్త పడగలిగే వారమేమో. ఐనా నా పిచ్చికానీఇంత పకడ్బందీగా అది నిన్ను నోరు విప్పనివ్వకుండా ఉంటే నువ్వు మాత్రం ఏమిచేస్తావులే. వదినవని కూడా చూడకుండా అది నీతో అంత కఠోరంగా మాట్లాడితే నువ్వు మాత్రం ఎలామాట్లాడ గలవు. వినాశ కాలే విపరీత బుద్ధీ అని, దానికి జీవితం ఇలా సర్వనాశనం చేసుకోవాలని రాసిపెట్టి ఉంది” అంటూ విలవిలలాడిందిరాధ. 

*********************“ఇప్పుడు నాకు అంతా తేటతెల్లనైంది. ఇది మోసమో, కుట్రో లేక వెన్నుపోటో అనుకున్నాను. నా బిడ్డేదో చిన్నపిల్ల, అమాయకురాలు, ఏమీ తెలియదు అనుకోవడం నాది పొరపాటు. అది చాలా కట్టుదిట్టంగా చేసిన పని ఇది. దాని ఆటలు సాగడానికీ, అవి మనకి తెలియకుండా ఉండడానికీ ఎన్నాళ్ళ ముందునుంచో సిరిని ఒక గిరిగీసి అందులో నిర్బంధించిఉంచడానికి పన్నాగం పన్నింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు, మనకి శత్రువులు బయట కాదండీ ఇంట్లోనే ఉంది” భర్త ఒడిలో తలదాచుకుని బావురుమంది. 


“జరగవలసింది చూద్దాము రాధ, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు”. తనకీ బాధ ఉన్నా రాధ తట్టుకోలేదని దిగమింగుకుంటూ అదే నిదానంతో అన్నాడు ప్రసాదు. “క్రమశిక్షణ అంటూ ఆంక్షలు పెడతానని నేనైతే నచ్చదనుకోండి. నేనంటే దానికి పడదనుకోండి. మీరు తెగ గారం చేస్తారే!అడిగినవన్నీ కొంటారే!ఏమి మాట్లాడినా సహిస్తారే!ప్రాణంప్రదంగా చూసుకుంటారే! అలాంటిది మీ కళ్ళు కూడా కప్పాలని ఎలా అనిపించిందో? ఒక్క మాటైనా అని ఎరుగని నాన్నకి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లగలిగేంత పెద్దదైపోయిందా మన మైత్రి? దాని మనసులో ఇంత కాఠిన్యము ఎలా వచ్చిందండీ? అసలు దాని మనసులో ఉన్నది కూడా మనకి చెప్పకపోతే మనం ఒప్పుకుంటామో లేదో ఎలా తెలుస్తుంది? ఇంతపని చేసేముందు మనకి చెప్పాలని కానీ అడగాలని కానీ అనిపించలేదా? అసలు మనతో మాట్లాడితే కదా మన మనస్సులో ఏముందో దానికి తెలిసేది? మనం కాదంటే ఒక నిర్ణయం తీసుకున్నా దానిలో కొంత వరకూ అర్ధం ఉంది. అంటే, మనం కర్కోటకంగానే ఉంటాము అని నిశ్చయించేసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకుందన్నమాట!” ఎంత వాపోయినా ప్రయోజనం లేదని తెలిసినా, తనను తాను ఆపుకోలేక మనసులోని బాధను ప్రసాదుతో ఇలా వెళ్ళగక్కింది రాధ. 


“ఎవరిని కట్టుకున్నా పరవాలేదు. ఇంత పని చేసినా సరే, గుడ్డిలో మెల్లలా, కనీసం ఉద్యోగం నిలబెట్టుకున్నా నాకు అంతే చాలనుకునేదాన్ని. పెంచిన వాళ్ళని మనని కాదనుకున్నా సరిపెట్టుకుంటాను, దాని రెక్కలను మాత్రం కాదనుకోకూడదని ఆరాట పడ్డాను. తన రెక్కలను తప్పమరెవ్వరినీ నమ్మిఅర్థించే పరిస్థితిలో ఎప్పుడూ ఉండకూడదని ఆశపడ్డాను. ఇవాళ ఆఫీసుకే రాలేదన్నారు. పొద్దున్న ఇంట్లోంచి వెళ్ళిన పిల్ల ఆఫీసుకి వెళ్ళకపోవడమేమిటి? ఇది నాకు ఇప్పటి వరకూ తెలయకపోవడమేమిటి?” పదే పదే తల్చుకుంది. మళ్ళీ కర్తవ్యం గుర్తొచ్చింది. 


“కనీసం రేపైనా రమ్మనాలి. ప్రొబేషన్ ఇంకా అవ్వలేదు కనుక, కాషువల్ సెలవులు మాత్రమే ఉంటాయి. ఎర్న్డు లీవు ఉండదు. బుద్ధి సక్రమంగా పనిచేసి కనీసం ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటే ఇంతటి అపసవ్యంలోనూ కొంచం సవ్యంగా జరిగిందని ఈ జన్మకు సరిపెట్టు కుంటాను. 

దాన్ని పెంచినందుకు కనీసం ఈ కోరికైనా తీరితే అదే చాలు. తన స్వశక్తిని తప్ప మరి దేన్నీ నమ్ముకుని బతకకూడదు అన్నది మాత్రమే నా ఉద్దేశ్యం. పడుతున్న ఆరాటమంతా అందుకోసమే” అనుకుంది రాధ. 

కానీ ఆ ఆశకూడా తీరబోయేది లేదని రాధకు అప్పటికి తెలియలేదు. తాపత్రయంతో ఆరాటమూ తప్పలేదు. 


అప్పటికి అత్తయ్యతో చెప్పడానికి ఇంకా సంకోచించింది సిరి. ఐనా తప్పదని మనసు చిక్కపరుచుకుని అంది. 


“అత్తయ్యా చివరిగా ఇంకో మాట. నాతో రమ్య అన్న మాట. ఆరోజు బసేరా హోటేల్లోని రూమ్ నెంబరు 13లోకి మైత్రి వెళ్ళడం చూశానే. అతను నాకు తెలియదు. మన కాలేజీవాడు కాదు. మా మావయ్య కూతురి పెళ్ళి వుందీ, కాలేజీకి సెలవు పెడుతున్నానని చెప్పానుగా. మేము మండపానికి వెళుతూ, అక్కడున్న చుట్టాలను పికప్ చేసుకుందుకు వెళ్ళాము. అప్పుడు ఒక స్టైలైన కుర్రాడితో మైత్రి కనిపించింది. హాయ్ మైత్రీ అంటూ పలకరించాను. ఒక్కసారి ఉలిక్కి పడినట్టయ్యి, నేను చూసేసానని కాస్త కంగారు పడ్డా, అంతలోనే తమాయించుకుని, “హాయ్, నువ్వేంటి ఇక్కడా?” అంది మైత్రి. మా మావయ్యకూతురి పెళ్లి. ఇక్కడ పెళ్ళివారు ఉన్నారు, ఇంటిదగ్గరనుంచి కార్లు తీసుకుని వచ్చాము. వాళ్ళు తయారవుతున్నారు. తీసుకుని మండపానికి వెళ్ళాలి అంటూ చెప్పేసానే కానీ అదెందుకొచ్చిందో అడగనే లేదే” విషయాన్ని అప్పుడే గ్రహిస్తున్న రమ్య అయోమయంగా అంది. 

“ఒకే ఓకే, నేనూ మా చుట్టాలని కలవడానికి వచ్చాను లేవే” అని క్లుప్తంగా ముగించేసి, బాయ్ అంటూ వెళ్ళిపోయిందే మైత్రి. మీ చుట్టాలెవ్వరూ రాలేదా? మరింత గందరగోళంగా అనిపించగా ప్రశ్నర్ధకంగా అంది రమ్య. పెదవులకు బలవంతపు చిరునవ్వే బదులుగా పులుముకుని, రమ్యకు సమాధానమైనా చెప్పకుండా, దిగ్భ్రాంతిగా నిలబడిపోయి ఎన్నో ఆలోచనల్లో మునిగిపోయింది సిరి. 


తన పరిశోధనా శైలితో ఇంచుమించు విషయాన్ని పసిగట్టేసింది సిరి. 


“స్టైలుగా ఉన్నవాడు అని రమ్య అనగానే నా బుద్ధికి మొదలు తట్టింది రాఘవే. తప్పక అన్నయ్యే అయ్యి ఉంటాడు. విషయాన్ని ఇంత దూరం తీసుకొస్తాడా? ఐనవాళ్ళందరూ ఉన్న ఊర్లోకి వచ్చి ఎంత ధైర్యంగా హోటలుకి తీసుకెళుతున్నాడంటే, ఇంకా ఎన్ని ప్లాన్లున్నాయో. ఎంత దూరం వెళతాడో అనుకున్నాను. ఐతే ఎవరితో ఎలా చెప్పాలి. ఎక్కడ మొదలెట్టాలి. మైత్రి వెళ్లిన ఆ వ్యక్తిఎవరో నా మనసుకు తట్టిందే కానీ నిజం తేలియదే? రుజువు లేదే? ఇలాంటి విషయాలు పూర్తిగా తెలిసేవరకు ఏమి మాట్లాడినా నింద మోపిన పాపాన పడతాను. అందువలన నిదానంగానే అలోచించి చేయాలి. అని అనుకున్నానత్తయ్యా” భోరుమని ఏడ్చేసింది. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================


వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.

34 views0 comments

Comments


bottom of page