'Jeevana Chadarangam - Episode 14' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 18/03/2024
'జీవన చదరంగం - ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది.
పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది.
ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది.
వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి.
బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు.
మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది.
రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి. పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి.
మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ.
మైత్రి నెల తప్పుతుంది. ఇంటినుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది.
మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధ పడుతుంది సిరి.
ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 14 చదవండి.
ఆనందంగా సాగిపోతున్న వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది మైత్రి. ప్రేమగా చూసుకునే అత్తమామలు. ఆప్యాయంగా ఒదినా అంటూ పలకరించే ఆడపడుచు. ఎంతో అద్భుతంగా ఆనంద భరితంగా అనిపిస్తోంది. నన్ను కదా ఇంతటి అదృష్టం ఆవహించింది మురిసి పులకించిపోతోంది.
రెండున్నర నెలల వైవాహిక జీవితం, అప్పటికే తనకి నాలుగోనెల దాటేసింది. సమయానికి వివాహం జరగడంతో అది ఎవ్వరు పెద్ద పట్టించుకోలేదు. సాఫీగా ఆనందంగా సాగిపోతున్న జీవితంలో.....
“కొంత పైకం సద్దుబాటు చెయ్యవలసిన పరిస్థితుల్లో మన డీలర్సుని అడగడానికి వెళ్ళాను. ఒకవారం తరువాత కాని సద్దుబాటవ్వదన్నారు. మన డబ్బంతా వ్యాపారంలో చిక్కడింది. నాకు ఇప్పుడు అర్జెంటుగా రెండులక్షలు కావాలి. మన వ్యాపారానికి సంబంధించి ఖర్చులు. వ్యాపారంలో లావాదేవీల విషయమై క్లైంటు మనపై కేసు వేసారు. లాయరుగారు ముందస్తు జామీను తీసుకోవడం మంచిదన్నారు. కొన్నిఅనుకోని అవాంతరాల వల్ల ఇవాళే పైకం అవసరమవుతోంది. నువ్వేమైనా సహాయపడగలవా?” అమాయకంగా అడిగాడు రాఘవ.
“అదేంటి బావా, జామీనేంటి? అంటే ఏంటిసిపేటరీ బెయిలా? అమ్మో, విషయం అంత తీవ్రమా?” కంగారుగా అడిగింది మైత్రి.
“ఇవన్నీ వ్యాపారంలో మామూలే మైత్రీ. నువ్వు కంగారు పడకు. ఇప్పుడు నీకు చెప్పిన కారణం, నీ సహాయంకోసం” అన్నాడు రాఘవ.
“నేనా? నేనేంచేయగలను బావా?” బేలగా అంది మైత్రి.
“నీ వస్తువులు ఇస్తే, ఇప్పుడు మనకి గండం గట్టెక్కుతుంది. మళ్ళీ ఒక పదిరోజుల్లో నీకు తిరిగి ఇచ్చేస్తాను మైత్రీ” అభ్యర్ధనగా అన్నాడు రాఘవ.
రాఘవ చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్ధమవ్వలేదు మైత్రికి. వ్యాపారంలో డబ్బుచిక్కులు ఉండడం సహజమే. అది అర్ధంచేసుకోగలము. కానీ ఈ జామీను ఏమిటో అనుకుంది. సంకోచంగా చూస్తున్న మైత్రితో అనునయంగా...
“అదేమైత్రీ, ఈ మధ్య ఆ నోట్లు, స్టాంపు పేపర్ల కేసు వినికిడిలో ఉంది కదా! నువ్వూ న్యూస్ లో వింటున్నావుగా!దానికి ముందస్తూ బెయిల్ తీసి పెట్టుకుందామన్నారు మన లాయరుగారు. అందుకు కాస్త ఖర్చు అవుతుంది” తడబడుతూ అన్నాడు రాఘవ.
“దానికి మీకు ఏమిటి సంబంధం?” అంది.
“మనకి నూరు శాతం షేర్లతో స్వంతమైనది మందుల వ్యాపారమైతే ఆ పేపరుమిల్లులో మనకి యాభైశాతం భాగస్వామ్యముంది. మనకు అధిక లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం అదేనని నీకు ఇదివరలోనే చెప్పాను కదా! చూడబోతే మనదేనైన వ్యాపారాన్ని మించిపోతాయేమో దీని లాభాలు” అతి తేలికగా అన్నాడు.
మొట్టమొదటిసారిమైత్రి గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. ఇన్నాళ్ళకి ఇప్పుడు అతడి మాటను సందేహాత్మకంగా చూసింది.
“బావా! మనకి అలాంటి వ్యాపారాలు వద్దు. మనం ప్రభుత్వానికీ, సమాజానికీ ఐనవాళ్ళందరికీ ఆమోదకరమైన పనే చేద్దాము. నేనూ నువ్వూ ఇద్దరమూ ఉద్యోగాలు చేసుకుంటే ఏంతో చక్కగా బతకొచ్చు. అనుమానం రేకెత్తించే పనులు మనకెందుకు. తలెత్తుకుని తిరిగేలా ఉండాలి మన వృత్తి. ఇలాంటి వ్యాపారాలు వద్దు బావ” తనకు తెలిసినంతలో చెప్పింది.
“ఓసి పిచ్చి మొద్దూ, ఎవడి చేతికిందో పని చేస్తే ఎంతొస్తుంది. మహా ఐతే కొన్ని వేలు. మనము ఇప్పుడే లక్షల్లో ఉన్నాము. అతి కొద్దికాలంలో కోట్లను చూస్తాము. అదీ కాక, ఇదేమీ అన్యాయమైనది కాదు. ఆ మిల్లులో చట్టవిరుద్ధమైన పేపరు కూడా తయారీలో ఉందని పోలీసులు అనుమానంతో కూపీ లాగుతున్నారు. వ్యాపారమన్నాక ఇలాంటి చిన్నచిన్న అవాతరాలు ఇబ్బందులు తప్పవు. మా నాన్న, బాబయ్యా గత పదిహేనేళ్ళగా యీ వ్యాపారం చేస్తున్నారు” నచ్చచెప్పాడు.
తన వెంట తెచ్చుకున్న బంగారమంతా తీసి ఇచ్చింది.
“ఒక్క వన్ వీక్ లో మనకి కలెక్షన్స్ రాగానే నీకు మళ్ళి ఇచ్చేస్తానే?” ప్రేమగా అన్నాడు.
“దానిదేముంది బావ, మనమిద్దరమూ ఒకటిగా బతకడానికి వచ్చాక నీదీనాదీ అని ఏముంది. అవసరానికి మనకు ఉపయోగపడడానికే గా అది” అంది.
*****
“అక్కా, రాజా అన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారట" ఎంతో ఆదుర్దాగా అంది గౌరి.
ఇంట్లోంచి పిల్ల చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినప్పుడు కానీ ఆ తరువాత కానీ కన్నతల్లిగా చేయని ఫోను ఇప్పుడు చేసేసరికి ఆశ్చర్యం కంటే అసహ్యమే ఎక్కువ కలిగింది రాధకు.
మనుషుల కుటిలత్వానికి కిరాతకమైన ప్రవర్తనని కళ్ళాలా చూసి, అట్టివారి నుండి తిరస్కారాన్ని ఎదుర్కొని, కఠినంగా తయారైన గుండె, ఇప్పుడు రాధది.
“గౌరికి నేడు ఉన్న ఆరాటం ఆనాడు మైత్రిని ఇంటిల్లిపాదీ కలిసి పన్నాగంపన్ని లేవతీసుకుని వెళ్ళినప్పుడు లేదే? పెంచింది నేనేనైనా మైత్రి తను కన్న కూతురే కదా! ఆనాడు వాళ్ళు చేసినది తప్పని కూడా తెలిసి కళ్ళుమూసుపోయిన విషయం ఇప్పుడు మరచిందా? లేకపోతే ఎప్పుడు ఎలా మాట్లాడినా వెర్రిబాగుల్ది అదే మాట్లాడుతుందని నన్ను గురించి తాను వేసిన అంఛనా నా? కన్నకూతురి తప్పుకూడా కనబడనంత కళ్ళు మూసుకుపోయాయి. అది ప్రయోజనకరమైతే పరవాలేదు. బంగారపు సూదితో కన్నలు పొడుచుగున్నట్టుండకూడదు కదా ఎంతటి మాయా ప్రపంచమిది!” అనుకుంది రాధ.
ఓహో, ఇప్పుడు కష్టం వచ్చినది తన తోడబుట్టినవాడైన రాజాకి కదా! అందుకు గుండెల్లో కెలికేస్తున్నట్టుందేమో. రక్త సంబంధం అంత లాగుతుందన్నమాట. కంగారుగా చెపుతున్న గౌరి మాట విని కొంచంకూడా చలించలేదు రాధ. చేసిన పాపాలు పండి ఇప్పుడు బదులు చెప్పాల్సిన రోజు వచ్చిందన్నమాట అని మనసులోనే అనుకుంది.
“ఆనాడు వీళ్ళంతా కలిసి విందులకు కూడా వెళ్ళారే!పెళ్ళే కదా చేసుకున్నాడు. ఇప్పుడేమంత కొంప మునిగిపోయింది అన్నంత తేలిగ్గా చూసారే! ఆడపిల్ల తల్లిగా తను పడుతున్న బాధను కూడా లెక్కచేయక, జరుగుతున్నది తప్పు అని నిలదీయక, అందరూ అవతల తరపున చేరి. తప్పుచేస్తున్న పిల్లని ఉసికొల్పారే!ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుండగా చూస్తూ ఉండడమే కాకుండా, అగ్నికి ఆజ్యము పోసినట్టు వ్యవహరించారే! ఆరోజు నేనంటూ ఒకదాన్ని ఆ పిల్ల జీవితంలో ఉన్నానని ఎవ్వరూ అనుకోలేదే. మనసులోనే అనుకుంటూ,
“ఓహో, అలాగా? ఏమి జరిగిందో? పోలీసులదాకా వచ్చిందంటే, ఏమిచేసి ఉంటారేంటి? ఏది ఏమైనా ఇప్పుడు మనమేమి చేయగలము గౌరి?” నిర్లిప్తిగా అంది.
గౌరి వల్ల కొద్దిపాటి సహాయం దొరుకుతుందేమో అని తాపత్రయంతో రామకృష్ణ లాంటి పెద్దమనుషి ద్వారా ఫోనులో కూడా మాట్లాడించి ఉద్యోగ విలువ తెలియచేయాలను ఆరాటపడినప్పుడు తిరస్కారమే ఎదురైయ్యింది. అలాంటి గౌరికి రాధ స్పందన చెంపచెళ్ళుమన్నట్టయ్యింది. ప్రతి మనిషికీ మనస్సాక్షంటూ ఒకటుంటుంది. వారి నైజాన్ని అది ఎత్తిచూపుతునే ఉంటుంది.
చురక తగిలిన గౌరి ముభావంగా మారిన స్వరంతో “సరే అక్కా”ఫోన్ పెట్టేసింది.
*****
మైత్రి మావగారు రాజాను పోలీసులు అరెస్ట్ చెయ్యగా చిందరవందరగా తయారైయ్యింది ఆ కుటుంబం. ఇంటిని సైతం సీజు చెయ్యగా చెట్టుకొకరూ పుట్టకొకరూ అన్నట్టైయ్యిందా సంసారం. పెళ్లీడుకొచ్చిన కూతురితో సహా హైద్రాబాదులోని అన్నగారింటికి చేరింది రాజా భార్య సంధ్య. గాలిమేడలు కడుతున్న భర్తతో సమానంగా తానుకూడా ఆడింది ఆటగా పడిందిపాటగా చేసింది. పిల్లల్ని ఆర్భాటాలతో, అబద్దపు గొప్పలతో, తప్పుడు ప్రతిష్టతో, భేషజాలతో పెంచి బాధ్యతా రాహిత్యులుగా తయారుచేసారు రాజాసంధ్యలు. ఈడొచ్చిన పిల్లను ఇంట్లోపెట్టుకుని మరదల్ని లేవతీసుకుని వచ్చిన కొడుకుని ప్రోత్సహించారు. ఈ రోజు ఇంటిల్లిపాదీ వీధిన పడ్డారు.
నెలలు నిండుతున్న మైత్రికి మనసంతా బరువుగా ఉంది. పరాయి ఇళ్ళల్లో ఉంటూ కనీసం సీమంతపు సంబరాలైనా లేకుండా ఉంది. మనసు బాధలో ఉండగా బిడ్డ ఎదుగుదల మాత్రం ఏం బాగుంటుంది. అంతంత మాత్రంగానే ఉంది మైత్రి పరిస్థితి.
“గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. దాన్ని ఇంట్లోకి తెచ్చాడు, ఇలా ఇల్లు తల్లకిందులైయ్యింది” అత్తగారన్న పుల్లవిరుపు మాటలు చెవిన పడనే పడ్డాయి.
“నలభై తులాల బంగారం ఇచ్చాను. అది ఎవ్వరికీ కనబడలేదు. ఇప్పుడు నాకీ అభాండం మిగిలింది. అన్నీ అలోచించి ఎన్నో మంచిమాటలు చెప్పిన అమ్మ నాకు చేదైంది. కనీస మర్యాదైనా లేకుండా ప్రవర్తించాను. నా మనసులో ఉన్నది చెప్పను కూడా చెప్పకుండా వారి మనసు క్షోభ పెట్టాను, నాకు మంచి ఎలా జరుగుతుంది!” దిండులో తలదాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది.
“నేడు నాకంటూ ఓ సంపాదనుంటే ఇలా ఉండేది కాదు నా పరిస్థితి! నాకిలాంటి పరిస్థితి ఒక్కనాటికీ ఉండకూడదనేగా అమ్మ తాపత్రయపడింది” అనుకుంది.
“జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను. సరిదిద్దుకోలేని తప్పు చేసాను. ఇంకా భూమి మీదకు రాని నా బిడ్డ పరిస్థితేమిటో ఇంత అగాధంలోకి నా జీవితాన్ని నేను తోసేసుకున్నాను” విలవిలలాడింది.
“మైత్రీ..... ఎక్కడున్నావే?” పెద్దగా కేక వినిపించింది. మారిన రాఘవ స్వరం, తడబడుతున్న అడుగులు, గుప్పున వచ్చిన వాసన.
“దూరదృష్టితో అమ్మ చెప్పిన మాటలు వినలేదు. పెద్దవాళ్ల మాటలు చద్ది మూటలు అని ఊరికే అనలేదు. నాకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాను. అమ్మ గుడ్డిప్రేమను చులకన చేసాను.
అందుకే అంటారు, ఎప్పుడూ నీ మంచిచెడులను మరొకరి దృష్టితో చూడాలని. అప్పుడే మన తప్పులు మనకు తెలిసే అవకాశం ఉంది. చేతులుకాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే” జీవితం చేజారిపోయింది అనుకుంది రాఘవ వాలకం చూసి.
*****
సోషల్-వర్కులో భాగంగా ‘ఎడ్యుకేటింగ్ ది కిడ్స్ ఇన్ స్లమ్స్’ పేరిటసిటీ మధ్యనే ఉన్న మురికి వాడను ఎంచుకుని అక్కడి పిల్లలకు చదువు చెప్పడము వంటి వాలంటరీ సర్వీస్ కార్యక్రమాలు చెపట్టిన ఈ బ్యాచు వారు కాలేజీకేమంచి పేరు తెచ్చిపెట్టారు.
సిరిచందన, అందులోకూడా భిన్నమైన అంశాన్ని ఎన్నుకుని, కౌమారదశ బాలికలకు వ్యక్తిగత రక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రతఅన్న అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అవగాహనకలిగేందుకు శిక్షణనిచ్చింది. అలా చేపట్టిన కార్యక్రమం ద్వారాఆ దశలో బాలికలు ఎదుర్కుంటున్న సమస్యలను గూర్చి చర్చించింది. ఆ దశలో ఎదుర్కొంటున్న సమస్యలు, అసలు వాటి గురించి మాట్లాడడమే నిషిద్దామనుకున్న సమాజంలో, వాటిని మాట్లాడుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి, వారి సమస్యలను పైకి చెప్పుకోవడానికి అవకాశం కల్పించింది. కౌమార దశ లోని యువతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మాట్లాడుతూ వాటికి సమాధానాలను కూడా సూచిస్తూ, NGO సహాయంతో వస్తు రూపేణా కొంత మద్దతు ఇస్తూ ఆ మురికి వాడలోని అమ్మాయిలకు సహాయపడింది. లైంగిక వేధింపులసమస్యలను ఎదుర్కునే విధానాలను తెలియచెప్పింది. బహిష్టులు సమయాల్లో కనీస సదుపాయాలు, మరుగుదొడ్డి సౌకర్యాలు వంటి కనీససౌకర్యాలను కల్పించడం చేత వారి ఇబ్బందులను కొంతవరకు మట్టుపెట్ట గలిగితే, అది తాను సాధించగలిగే విజయమని నమ్మింది. NGO సహాయ సహకారాలతో వారికిమెన్ట్సువల్-కప్పుల ప్రయోజనం గురించి తెలియచెప్పడమే గాక వాటిని ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తూ, వారి శరీర శుభ్రతకు తోడ్పడంతో పాటు వాడల పరిశుభ్రతను పెంపొందించడానికి ప్రయోజనమయ్యింది. తుదకు అది పర్యావరణ పరి-రక్షణకు దోహదం చేసింది. సిరిచెందన చేపట్టిన ఆకార్యక్రమం సాధించిన విజయాన్ని అభినందిస్తూ స్థానిక అధికారులు, ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ సన్మానించడానికి నిశ్చయించారు.
అసలు మాట్లాడడానికే నిషిద్దమనుకునే కొన్ని విషయాలపై కూలంకషంగా అలోచించి, అత్యవసర వర్గాలకు వాటి పట్ల అవగాహన కల్పిస్తే, దాని వల్ల వారికి ఎంతో ప్రయోజనం ఉండడమే కాక అది సామాజిక శ్రేయస్సుకి కూడా దోహదపడుతుందని సభలోని పెద్దలు కొనియాడారు. కాలేజీ వార్షికోత్సవ పండుగలో సిరి సాధించిన ఘనతకు ప్రత్యేక సత్కారాన్ని ఏర్పాటు చేసారు. కాలేజీనుంచి విజయవంతంగా బయటకు వెళ్లబోయే సిరిచందన మరిన్ని సామాజిక శ్రేయస్సు కార్యక్రమాల ద్వారా ఎంతో సాధిస్తుందని ఆశిస్తున్నానని ప్రిన్సిపాల్గారు ఆశాభావం వ్యక్తం చేసారు.
సిరిచందన, జీవిత పయనంలో ఇది తొలి విజయమయ్యింది. అంతే ఆమె పయనం అక్కడినుండి వెనక్కి తిరిగి చూసుకోలేనంత సుజావుగా సాగిపోయింది. తాతగారితో చిన్ననాడు గడిపిన రోజులు, పొందిన ప్రేరణ స్ఫూర్చినిచ్చాయి. నిమ్నవర్గాల వారికి విద్యనందించి, స్వతంత్ర సంగ్రామంలో తన వొంతు కృషి చేసినఆయన కధల ద్వారా స్పూర్తిని పొంది ఆ త్రోవలోనే పయనిస్తూ ఆయనకి తగ్గ మనవరాలనిపించుకుంది.
కరతాళధ్వనుల అభినందనలతో సిరిచందన విజయాన్ని తిలకిస్తున్న అనేక మందిలో మొదటివరుసలో కూర్చున ఆమె తల్లిదండ్రులతోపాటు మేనత్త రాధ కూడా ఉంది. ఆనందభాష్పలు ధారలుకాగా మేనకోడలిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. సరిగ్గా అలా మైత్రిని చూసుకోవాలని రాధ పడింది. కానీ, ఆ అదృష్టానికి నోచుకోనందుకు రాధ బాధపడలేదు. ఈర్ష్య అసలు పడలేదు. పెద్దన్నయ్య కూతురు సిరి ఇంతటి ఘనత సాధించినందుకు మనసారా సంతోషించింది.
జీవితంపై సిరికున్న అవగాహననీ, స్పష్టతనీ, ముందుచూపునీ చూసి ఆనందపడింది. జీవితంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న తపన కలిగి ఉండడమే తను అదరిలా కాకుండా ప్రత్యేకమని చూపుతుంది. ఎదో తిన్నాము బతికాము అన్నట్టు కాకుండా, ఒక గమ్యం, లక్ష్యం, సామజిక స్పృహ వుంటే తప్పక మున్ముందు మరింత గొప్పపేరు తెచుకోవడం తథ్యమనుకుంది. తనకృషే సిరికి విజయాలను తెచ్చి పెట్టందని తను నమ్మినదాన్ని మరొకసారి ధృవీకరించుకుంటూ ఇవే లక్షణాలను వీడకుండా కొనసాగితే సిరి మరిన్నీ విజయాలను సాధిస్తుందని ఆశించింది రాధ.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.
Comentarios