top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 15



'Jeevana Chadarangam - Episode 15' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 23/03/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 

పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 

ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 

బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. 


మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. 


రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి. పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి. 


మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ. 

మైత్రి నెల తప్పుతుంది. ఇంటినుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది.

మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధ పడుతుంది సిరి.

డబ్బు అవసరమని మైత్రి నగలు తీసుకుంటాడు రాఘవ.

అతని తండ్రి రాజాను పోలీసులు అరెస్ట్ చేస్తారు.



ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 15 చదవండి. 


సిటీ-కేర్ ఆసుపత్రిలో కౌన్సిలింగ్ క్లాస్సేస్ తీసుకుంటున్న సిరిచందనని చూసి ప్రాణం లేచొచ్చినట్టైంది మైత్రికి. 


“ఎలావున్నావు సిరి?” ఆప్యాయంగా అడిగింది మైత్రి. పక్కనే నిలబడున్న రాఘవన్నయ్యా చిరునవ్వుతో పలకరించాడు. 


“ఎలావున్నారు? మీరు ఇక్కడా?” అంటూ ప్రశ్నర్ధకంగా అడిగింది సిరి. 


“ఇప్పుడు ఎడో నెల. పురుడు ఇక్కడే అనుకుంటున్నాము. అందుకే ఇక్కడ లేడీ డాక్టర్కి చూపించడానికి వచ్చాము” వివరించాడు రాఘవ. 


“రాఘవ వాళ్ళ మేనమామ ఇంట్లో దిగాము. ఇంక ఈ ఊళ్ళోనే ఉండాల్సిన పరిస్థితి. నీరసంగా ఉన్నందున ప్రయాణాలు వద్దనింది డాక్టరు. వాళ్ళ మేనమామ ఇంట్లో మాత్రం ఎన్నాళ్ళుంటాము! ఏ మొహం పెట్టుకుని అమ్మ ఇంటికి వెళ్లాలో అర్ధంకావట్లేదు” అంటూ మనసులోని బాధని కక్కేసింది మైత్రి. 


“ఛ, అవేమి మాటలు మైత్రి. అత్తయ్య మనసు నీకు తెలియదా? ఎటువంటి ఆలోచనలు లేకుండా సంకోచం విడిచి వెంటనే మీ ఇంటికి వెళ్ళండి. నువ్వు వచ్చావంటే అత్తయ్య ఎంత సంతోషిస్తుందో నీకు నేను చెప్పాలా?” ఓదార్పుగా అంటున్న సిరి మాటలు కొండంత బలంగా అనిపించాయి మైత్రికి. 


భర్త రాఘవకు సంపాదన లేదు. అతనితో సహా ఏడోనెలలో డాక్టరుకి చూపించుకునే మిషతో వచ్చి పుట్టింటికే చేరడం కొద్దిగా చిన్నతనంగా అనిపించింది మైత్రికి. ఆమె అందుకే అమ్మ ఇంటికి వెళ్ళడానికి జంకింది. ఐతే ఆ క్షణాన బ్రతుకు వెళ్ళబుచ్చడానికే అంతకంటే మార్గంలేదు. అంచేత అది తప్పలేదు. 


పెళ్ళై మొదటిసారి పుట్టింటికి వచ్చింది మైత్రి. తలదించుకుని ఉన్నారు ఇరువురూ. ఎలాంటి అచ్చట, ముచ్చట చూడని రాధ కూతుర్ని అలాంటి పరిస్థితిలో చూడలేకపోయింది. ప్రాణప్రదంగా పెంచుకున్న బిడ్డ, అందునా వట్టి మనిషికూడా కాదు. పరుషంగా ఎటువంటి మాటలు అనకుండా అక్కున చేర్చుకుంది. ఇన్నాళ్ళకు వారి వద్దకు వచ్చినందుకే సంతోషించారు రాధ ప్రసాదు దంపతులు. 


మైత్రిని కంటికిరెప్పలా చూసుకుంటూ, వారంవారం డాక్టరుకి చూపిస్తోంది. ఆసుపత్రిలో పురుడు పోయడానికి కావలసిన ఏర్పాట్లన్నిటి గురించి వివరంగా తలుసుకుంది రాధ. ప్రత్యక్షంగా రాఘవను చూడగా, రాజా కుటుంబంపై తనకున్న అపనమ్మకం మరింత బలపడసాగింది. ఐతే, ఇప్పుడున్న సున్నితమైన పరిస్ధితుల దృష్ట్యా ఏ విషయముపై మాట్లాడడం మంచిది కాదని ఊరుకుంది. పూర్తిగా చూసినిర్ధారించుకోకుండా నిందమోపడం పొరపాటవ్వడమే కాకుండా బంధుత్వాలు శాస్వతంగా దూరమయ్యే ప్రమాదముంది కనుక, అతడి నడవడికను కొన్నాళ్ల పాటు గమనించాలని నిశ్చయించుకుని ఇంట్లో పెట్టుకుని వారికి పరిచర్యలన్ని చేసారు రాధ ప్రసాదులు. 


“చూడు బాబు, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు మీ ఊళ్ళో మీకు సంపాదన లేదు. ఇల్లు కూడా ఎప్పటికి చేతికందుతుందో తెలియదు. వ్యాపారాలన్నీ మూతపడి పోయాయంటున్నావు. కనుక, ఇలా ఉమ్మడి వ్యాపారాన్ని నమ్ముకుని నీకంటూ తాడూ బొంగరం లేకుండా ఉంటే మంచిది కాదు. మనిషిగా మనం ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాము, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నామ అన్నది కాదు ముఖ్యం, ఎవ్వరి మీదా ఆధార పడకుండా మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. 

ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. మీసహజీవనం ఇప్పుడే మొదలయ్యింది. కనుక, ఇద్దరూ కష్టపడి మీ కష్టార్జితంతో బతకాలి. అందుకు కావలసిన సహాయసహకారాలందించడానికి మేమెప్పుడూ సిద్ధమే. నేటి నుంచి జీవితాన్ని పునఃప్రారంభించండి. మీ పెళ్ళిపుస్తకాన్ని తెరిచి నేటునుండి తొలి కాగితంగా మొదలుపెట్టి చక్కగా వ్రాసుకోండి. మీకు మేము అండగా ఉంటాము” అని ఎంతో ప్రోత్సాహకరంగా చెప్పారు రాధ ప్రసాదులు. 


“చూడు రాఘవ, మీ బిజినెస్ విషయాలు చక్కబడేవరకు నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే మంచిది. ముందు మీ భోజనం మీరు ఆర్జించుకోవాలి, ఆ తరువాత అన్నీ చిక్కబడ్డాక మళ్ళీ వ్యాపారం పుంజుకుంటే అక్కడికే వెళ్ళవచ్చు” మరో అడుగు వేసి సున్నితంగా సలహా ఇచ్చింది. 



“మా వూళ్ళో నాకు ఉద్యోగం దొరకడం కష్టం అత్తయ్యా. దానికి కారణం, అంత పెద్ద సిటీలోవ్యాపారపరంగా మేమెన్నేళ్ళగానో స్ధిరపడినట్టు అందరికీ తెలుసును. ఒక వ్యాపారస్తుడిగా చెలామణీ ఐన నాకు ఇప్పుడు అదే స్థలంలో ఉద్యోగం ఇవ్వడానికి సంకోచిస్తారు. నాన్నతోపాటు నేను కూడా అక్కడ ఇంచుమించు ఆరేడేళ్ళుగా అందరికీ సుపరిచితుడనే. నాకున్న అనుభవానికిఅక్కడ ఆఫీసుల్లో ఉద్యోగం కష్టం. 


ఇక్కడ హైదరాబాదులో నాకొక డాక్టరుగారు తెలుసు. అయన ఆసుపత్రిలో ఓవరాల్ మేనేజ్మెంటుకి, అకౌంట్స్ అవీ చూసుకోవడానికీ మంచి వ్యక్తికావాలన్నారు. ఎవరినో చూపించే బదులు నేనే వస్తానంటే నాకుఉద్యోగం ఇస్తానన్నారు. ఐతే నేను నిలదొక్కుకునే వరకు, అంటే రమారమీ ఒక ఆరునెలల పాటు మాకు నీడ కావాలి. అది మీరు ఇస్తే చాలు” వినయంగా పరిస్థితిని చెప్పాడు రాఘవ. 


“అంతకన్నా ఏముంది. మీరు కొంత స్థిరపడ్డాక వేరుగా ఉండవచ్చు. అందాక, ఎలాగా మైత్రి పురుడూ అవి వున్నాయి కనుక, నువ్వు కూడా ఇక్కడే వుండి కొత్త పనికి అంకురార్పణ చేసుకో” తమ సహకారం ఉంటుందని సంతృప్తికరంగా భరోసా ఇచ్చారు రాధ ప్రసాదులు. 

******

చెప్పా పెట్టకుండా పిల్లను తీసుకెళ్లి అలా వంచనతో పెళ్ళిచేసుకున్నందుకు రాఘవపై పీకలదాకా కోపంఉన్నా, దెబ్బతిని ఉన్నవారిని మరింత నొప్పించే సంస్కారం కాదుకనుక, ఆదరించారు. తప్పు చేసిన ప్రతి మనిషికీ తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలి. తప్పును ఎత్తిచూపడమో, అనుక్షణం దెప్పడమే కంటే ఆ తప్పును సవరించుకునే అవకాశం వచ్చి సద్వినియోగ పరచుకునేవాడికి చేదోడుగా ఉండడం కనీస ధర్మం అని నిశ్చయించుకున్న రాధ ప్రసాదులు, తమ ఇంట్లోనే నీడను ఇచ్చారు. 


ఐతే, మైత్రితో మాత్రం ఖచ్చితంగా చెప్పేసింది రాధ. 


“చూడు మైత్రి, ఎన్ని కష్టనష్టాలు వచ్చినా వాటిని సాహసంగా ఎదుర్కుని మీరెంచుకున్న మీ జీవితాన్నిగెలిచిసాధించాలి. లేచిపోయి పెళ్ళి చేసుకున్నప్పుడున్న అదే ఆత్మ విశ్వాసమూ శ్రద్ధా బ్రతుకును తీర్చిదిద్దుకోవడంలోనూ ఉండాలి. సమాజంలో నిలదొక్కుకుని ఎవ్వరిమీదా ఆధారపడకుండా స్వావలంబనతో బ్రతికి చూపించడంలోనూ ఉండాలి. మీకు మేము మోరల్ సపోర్ట్ ఇవ్వగలమే కానీ ఆర్ధికంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేము. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న మీకు, ఒకరికోసం ఒకరన్నట్టు ఎలా బతకాలో, బ్రతుకులో ఎలా గెలవలోకూడా తెలియాలి, నేర్చుకోవాలి” నిక్కచ్చి అంది రాధ. 


రాధకున్న అదే రోషాన్ని పుణికి పుచ్చుకున్న మైత్రి అమ్మ చెప్పినవన్నీ మనసులోకి లోతుగానే తీసుకుంది. ఆసుపత్రిలో ఉద్యోగానికి వెళుతున్నాడు భర్త. రెండు మూడు నెలలు సంపాదించగానే వేరే కాపురం పెట్టుకుని వెళ్లిపోవాలని అప్పుడే మనసులో తీర్మానించుకుంది. 


“బావా, త్వరలో మనం ఇంకో ఇల్లు తీసుకుని వెళ్లిపోదాము. మనంతట మనము బతుకుదాము” భర్తతోఅదును చిక్కినప్పుడల్లా అంటూనే వుంది మైత్రి. ఈ లోగా కాన్పు జరిగి, అటుపై కొన్నాళ్ళు గడవనిద్దాములే అనుకున్నారు. 


ఒకనెల జీతం తీసుకున్నవెంటనే ఆసుపత్రి ఉద్యోగం మానేసాడు రాఘవ. ఏమిటీ అని అడిగితే, “ఆఫీస్ పని అని ముందు పిలిచినవారు ఇప్పుడు షిఫ్తుల మేరకు పనిచేయాలంటున్నారు”అని చిరాకుగా అన్నాడు. 


“పిలిస్తే వెళ్ళాలి. ఎవ్వరూ ఊరికే జీతం ఇవ్వరుగా?”పెడసరంగా అనింది రాధ. 


వాళ్ళింట్లో ఉంటున్న నెల్లాళ్ళల్లోనే అతడి వైఖరిని గమనించిన రాధకు అతడు అట్టే నిజాయితీపరుడిగా అనిపించలేదు. అంతా ప్రశాంతంగా కనబడినా, మైత్రి చెప్పకపోయినా, అతడు అప్పుడప్పుడూ తాగి వస్తున్న సంగతీ పసిగట్టేసింది రాధ. 


అంతే మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. రాత్రంతా ఆలోచించింది. కొంత అలుసు ఇచ్చినా, జీవితంలో వీళ్ళు మళ్ళీ నిలబడే ప్రయత్నం చెయ్యరు. మైత్రి బద్దకస్తురాలు. రాఘవ భేషిజాలతో బతకాలనుకునేవాడు. తప్పు త్రోవలోనైనా సరే సులభంగా డబ్బు సంపాదించాలనే తత్త్వం అతనిది. ఇలాంటి మానసికతను మార్చాలి. ఒక్క కూతురే కదా అమ్మనాన్నల సంపాదనంతా దానికేకదా అని అనుకున్నాడో, ఇంక అన్ని రకాలుగా భ్రష్టు పట్టే అవకాశం వుంది. అందుకుని ఇప్పుడే చాలా గట్టిగా ఉండాలి. పిల్ల మనసు కష్టపడుతుందని బలహీనంగా కనిపిస్తే, గుడిని గుళ్లోలింగాన్ని కూడా మింగేసే రకాలు. అప్రమత్తంగా ఉంటూ వాళ్ళని కష్టపెట్టైనా సరే సక్రమ మార్గంలో పెట్టాలని అనుకుంది. 


తెల్లారిన తరువాత, "రాఘవ, మాఎరుకలోనున్న ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఒక డ్రైవర్ ఉద్యోగం ఖాళీగా వుందని చెప్పారు. నువ్వు బాగా డ్రైవింగ్ చేస్తావని విన్నాను. ఆ పనికి వెళ్లడంవల్ల ముందస్తు నీకు నెల తిరిగేసరికి కష్టపడినదానికి ఫలితంగా రొక్కం చేతిలో పడుతుంది. గడుపుకోడానికి ముందు అది సరిపోతుంది. 


అది కాకుండా నేను ఇంకాస్త దూరం ఆలోచిస్తున్నాను. వ్యాపారం మీద అవగాహన వున్నవాడివి కనుక, కొన్నాళ్ళు ట్రావెల్సులో మెళకువలు అవీ ఆ ఆఫీసులో గమనించి నేర్చుకుంటే, ఆ తపువాయిబ్యాంకు లోను తీసుకుని నీకంటూ ఒక బండి కొని, అదే ట్రావెల్సుకు లీజ్ ఇవ్వచ్చు. కొన్నాళ్లకి నీదంటూ ఒక ట్రావెల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఇది మొదటి అడుగు అవుతుంది” బడిలో విద్యార్థికి చెపుతున్నట్టుగా ఎంతో విపులంగా విడమరచి చెప్పింది రాధ. 


“లోను పెట్టి బండి కొనుక్కోండంటున్నారే తప్ప, మేము సద్దుతాము ఒక బండి కొనుక్కోమని అనలేకపోయారు చూడు” అని భార్యతో రాఘవ అంటున్న మాట ప్రసాదు చెవిన పడనే పడింది. 


“పోనీ మనమే కొనిస్తేనేమి. ఎప్పటికైనా వాళ్ళకి చేరాల్సినదేకదా?” భార్యతో అన్నాడు ప్రసాదు. 


“లేదండి, నాకు మాత్రం వాళ్ళు పైకి రావాలని లేదూ? ఐతే, ఒక్క మూడు నెలలైనా అతడి స్థిరాన్ని చూడాలి. భార్య పిల్లల కోసం ఎలాగైనా కష్టపడాలి అన్న మార్పు చూడడం కోసమే నేను ఆ మాట అనట్లేదు. ఈ పనిలో నిజాయితీగా నిలతొక్కుకుంటే, మనమే ఆ పని తప్పక చేద్దాము” 


“మీకు ఇంకో విషయం తెలియదు. పెళ్ళైన ఒకే నెలలో మైత్రి బంగారాన్ని తీసుకునే పరిస్థితి వచ్చిందంటే, వీళ్ళు చెప్పిన గొప్పలు, చేసిన వ్యాపారాలు అన్ని డొల్లలే అని అర్ధమవుతోంది. మాటల్లో పెట్టి అడిగితే, ‘అవసరమొచ్చి తీసుకున్నారమ్మా, ఒక్క పది రోజుల్లో కలెక్షన్ వస్తుందన్నారు. ఇంతలో ఇదంతా జరిగింది’ సద్ది చెప్పింది మైత్రి. అందుకని మనం కాస్త కఠినంగానే ఉండాలి” అని ఆమె చెప్పినదాంట్లో పరమార్ధం అర్ధంచేసుకుని పూర్తిగా ఏకీభవించాడు ప్రసాదు. 

******


“ఉద్యోగం మానవద్దని కాళ్ళా-వేళ్ళా పడ్డాను, విన్నారా? కన్ను మిన్ను కానకుండా మిడిసిపడ్డారు. చూడు మైత్రి, ఇదే జీవిత పాఠం. అవతలి వ్యక్తి చెపుతున్న దాంట్లో ఏదైనా విషయముందా అని తెలుసుకోవడానికి కూడా ఒక ఓపెన్ మైండ్ కావాలి. ముందు అసలు మాట వినగలిగే సహనం ఉండాలి. ఆ తరువాత దాన్ని బాగా ఆలోచించాలి. రామకృష్ణగారంతటి పెద్దమనిషి అంతగా విడమరచి చెపితే కూడా, ఒక్క మాటలో తీసిపారేసారు. ఇప్పుడు దెప్పుతున్నానుకోకు, ఆ వుద్యోగం విలువ తెలుసుకోలేక పోయావు. నీ పెళ్లి నాకిష్టము లేదనుకున్నవే తప్ప, నీ శ్రేయస్సుకోరి వుద్యోగం చెయ్యమన్నానని తెలుసుకోలేక పోయావు. నువ్వు పెళ్ళి చేసుకున్న రోజు కంటే ఉద్యోగాన్ని కాలదన్నిన రోజు నన్ను అమితంగా బాధ పెట్టినరోజు. 


ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనమేమిటి. సరే జరిగిందేదో జరిగింది. కష్టమొచ్చినప్పుడే మరింత ధైర్యంగా ఉండాలి. అన్నీ సద్దుకుంటాయిలే, బాధను కూడా ధైర్యంగా చేసి చెప్పింది రాధ. 


ఓ రాత్రివేళ నొప్పులు రాగ, మైత్రిని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు. నీరసంగా ఉండడంతో, బీపీ పెరగడంతో సిజేరియన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం చూసిన రాధ వెంటనే వెంకన్నబాబుకి మొక్కు తీర్చుకుంది. ఆస్తమా సమస్య ఉండడం, మూత్రపిండాల సమస్య ఉండడంతో, మైత్రి ఆరోగ్య విషయంలో రాధ చాలా భయపడిపోతుంది. ఆ ఒక్క విషయంలో ఆమె ధైర్యం పూర్తిగా ఓడిపోతుంది. మనుమడిని చూసుకుని మురిసిపోయారు రాధా ప్రసాదులు. 

****


“అత్తయ్యా, మైత్రి శారీరకంగాచాలా బలహీనంగా వుండడమే కాదు, మానసికంగా అంతకంటే ఎక్కువగా కుంగిపోయి వుంది. దానికి బాహ్య సహాయం కావాలి. ఎదో బాధ దాన్ని పీడిస్తోంది. ఆ బాధతో కృంగిపోయి లోలోపలే దహించుకుపోతోంది. ఇప్పుడు మానసిక చికిత్స చేస్తేకాని ఎన్నిమందులు ఇచ్చినా శారీరికంగా దానికి మెరుగవ్వదు. నేను రోజూ వచ్చి దానికి కౌన్సిలింగ్ ఇస్తూ వుంటాను. మీకు కూడా కొన్ని మెళకువలు చెపుతాను, అందరూ అవి పాటిస్తూ చూసుకుంటే త్వరలో మైత్రికి మెరుగవ్వడానికి అవకాశముంది. లేకపోతే, న్యూనతాభావం, అపరాధ భావనతోదహించుకుపోతూ ఆత్మహత్య వరకూ కూడా పాల్పడే అవకాశాలున్నాయి. 


ఇది నిన్ను భయపెట్టడానికి చెప్పట్లేదు. దాని మానసిక పరిస్ధితి తెలిస్తే అందుకు అనుగుణంగా నడచుకోవడానికి ఆస్కారముంటుందని చెపుతుతన్నాను. జీవితంలో అనేక సవాళ్ళను ఎదుర్కొని నిలబడ్డ దానివి నువ్వు. 


బెంబేలెత్తిపోకుండా దృఢంగా నిలబడి ఎదుర్కుంటావన్న ధైర్యంతోనే నీకు పరిస్థితి ఉన్నదున్నటుగా చెప్పాను. జీవితం ఎన్నో ప్రశ్నల ముందు నిన్ను నిలబెట్టింది. అన్నిటికీ సమాధానాలు నువ్వు వెతికావు. ఇప్పుడూ అంతే. ఏమీ బెంగపెట్టుకోకు అత్తయ్యా, నేను చూసుకుంటాను మైత్రిని” ధైర్యం చెపుతున్న సిరి ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ముద్దాడుతూ కృతజ్ఞతగా చూసింది రాధ. 


తాను ఎంచుకున్న వృత్తిపట్ల అంకిత భావం, పెద్దల పట్ల గౌరవ భావం, కష్టంలో ఉన్న తోటి స్నేహితురాలి మీద అభిమానం, మొత్తానికి ఈ వయసులో సిరిచందనకు గల పరిపక్వతను చూసి ముచ్చటపడింది రాధ. ఎన్నుకున్న వృత్తికి తగ్గట్టు ప్రవృత్తిని మార్చుకుందా లేక తన ప్రవృత్తికి తగ్గట్టు వృత్తిని ఎంచుకుందా అన్నట్టు, ఓర్పునేర్పు సమపాళ్ళుగా రంగరించుకున్న మాట తీరు ఆమెది. చెదరని చిరునవ్వే సంపద. సిరి వెయ్యేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మనసులోనే దీవించింది రాధ. 



రోజు మైత్రితో సరదాగా కబుర్లు చెపుతూ, కొద్దికొద్దిగాతన నమ్మకాన్ని గెలుచుకుంటే కానీ, ఆమె మనసులోని బాధను వ్యక్త పరచదు. బాధ బయట పెడితే గానీ ఏకోవలో ఎలాంటి సహాయము చేయగలదో తెలియరాదు. ఎంతో సహనంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తనని నొప్పస్తూ పిండేస్తున్న విషయాలను మెల్లిగా తెలుసుకుంటే కానీ, వాటికీ పరిష్కారాన్ని కానీ, దానికి మానసిక ధైర్యాన్ని కానీ ఇవ్వలేమనుకుంది. మానసిక చికిత్సలో నిపుణురాలైన సిరి మైత్రి కేసుని ఒక సవాలుగా తీసుకుంది. 



ఇది మామూలు కేసు కాదు. తన చిన్ననాటి స్నేహితురాలూ, బంధువూ ఐన మైత్రి కేసు. అంతే కాకుండా, తాను ఎంతగానో ప్రేమించి గౌరవించే రాధ అత్తయ్యకు ప్రాణప్రదమైన కేసు. తెలిసో తెలియకో, మైత్రి వేసిన తప్పటడుగులను గురించి సమయానికి ఇంట్లో చెప్పలేకపోయినందుకు జరిగిన ఉపద్రవాన్ని ఆపలేకపోవడంలో తనకూ కొంత భాగం ఉందని భావిస్తోంది. 


అది సరిదిద్దుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని, మైత్రిని మళ్ళీ సగర్వంగా నిలబడేటట్టు చేయడమే ఈ సమస్యకు చక్కని పరిష్కార మవుతుందని నమ్మిన సిరి తనవంతు ప్రయత్నం మొదలు పెట్టింది. కృషితో నాస్తి దుర్భిక్షమనే సిద్ధాంతాన్ని ఎప్పుడూ మనస్పూర్తిగా నమ్మే సిరి, తన కృషిని ప్రారంభించింది. 


మైత్రితో మాట్లాడగా మాట్లడగా ఒక్కొక్క విషయము తెలియ వచ్చాయి సిరిచందనకు. సానుకూల సమయాల్లో వెయ్యేనుగుల బలమున్న మనిషి అనేకానేక ప్రలోభాలకు లోనైనపుడు ఎంతటి బలహీనుడవుతాడోకదా అనిపించింది. 



“అమ్మనాన్నలను బాధపెట్టి, చేయరాని పనులు చేసి, తెగిన గాలిపటంగా దారీతెన్నూ తెలియక ఎక్కడో రాలడానికి రెపరెపలాడుతూ వున్నాను. దిద్దుకోలేని తప్పులు చేసి అనేక చిక్కుముళ్లు జీవితానికి వేసుకుని అందులో ఇరుక్కుపోయాను. నువ్వెంత చెపుతున్నా, నీ మాటలు పెడచెవిన పెట్టి పొగరుమోతుతనంగా, ప్రేమమైకంలో గుడ్డిదాన్నై బావ చెప్పినవన్నీ నమ్మాను. అంతటి అనుభవమున్న అమ్మ ఎందుకు వాళ్ళ గురించి అలా అనుకుంటుందోనని కొంచం కూడా ఆలోచించలేక పోయాను. 


ఒక్కసారి అలా ఆలోచించే వివేకం నాకున్నా పరిస్థితి వేరేలా ఉండేది. అహంకారంతో విర్రవీగాను. అవివేకంతో గ్రహించలేకపోయాను” చేసిన తప్పుకు తనను తాను నిందించుకుంది మైత్రి. ఆత్మన్యూనతా భావం మైత్రిలో పెరిగిపోయింది. 



“పెళ్ళై పట్టుమని నెల్లాళ్ళయినా దాటకుండానే వాళ్ళ అసలు రంగులు బయట పడడం మొదలయ్యింది. జరిగిందంతా వ్యూహాత్మకంగా ఒక ప్రణాలిక వేసి అమలుచేసారని కొద్దికొద్దిగా గ్రహించసాగాను. ఒక్కగాని ఒక్క కూతురిని, అమ్మనాన్న సంపాదనతో వాళ్ళు కూడబెట్టిన ఆస్తుల జాబితా అంతా పిన్ని, అదే నా కన్నతల్లి ద్వారా తెలుసుకున్నారు వాళ్ళు. పెళ్లి చేసుకుంటే ఎలాగో అలా, ఆస్థి అంతటికీ హక్కుదారులవుతారనీ అనుకున్నారు. 


బావ ప్రేమాయణ నాటకానికి అదే ప్రారంభం. మనమంతా సంక్రాంతికి కలుసుకోక ముందునుంచే వాళ్ళకి ఆస్తుల గురించి చూచాయగా తెలుసు. అక్కడ బావ నాతో మాట్లాడే నెపంతో మరిన్ని విషయాలు తెలుసుకున్నాడు. బంగారాలు వగైరాల గురించి నేను వాగేశాను. అప్పటికి నాకు తెలివితక్కువతనంగా మాట్లాడడమే తప్ప, వారి మాటల వెనుక ఇంతటి కుట్రదాగుందని తెలియలేదు” బాధనంతా వెళ్ళగక్కింది మైత్రి. 


మైత్రి ముఖ కవళికలను చాల క్షుణ్ణంగా పరీశీలించింది సిరి. ప్రతీ మాటలోని సూక్ష్మాన్నీ గ్రహించింది. ఆమె మనసులోని బాధను చదవసాగింది. జరిగిన దానికై స్వీయనిందతో కుమిలిపోతోంది మైత్రి అని మరొక్కసారి నిర్ధారణ చేసుకుంది. 




“పెళ్లైన కొత్తలోఆ ఇంట్లో అందరికీ నా మీద ఎంతో ప్రేమ ఉన్నందుకు సంతోషపడ్డాను. కొన్నాళ్ల కాపురం సాఫీగానే సాగింది. మెల్లిమెల్లిగా వ్యాపార విషయాల్లోనూ, అనేక లావాదేవీల్లోనూ ఎన్నో అబద్దాలమాటలు వినిపించసాగాయి. దర్పాలు, ఢాంబికాలూ వద్దు, ఉన్నంతలో బతుకుదామని చెప్పి చూసాను. ఎన్నో మోసాలను గురించి తెలిసినా కడుపులో దాచుకున్నాను. ఎంతో భరించాను. పరిస్థితులు మెల్లిగా మారతాయని ఆశించాను. 


సూటీపోటీ మాటలు మొదలైయ్యాయి. మంచి ఎంతగా చెప్పినా ఏమి ప్రయోజనం లేకపోయింది. నేను కట్టుబట్టలతో వచ్చినా, తరువాతైనా మా పుట్టింటి నుంచి సారెలేమీ రాలేదన్నది దెప్పసాగారు. అన్ని ఆశలున్నవారు లక్షణంగా ఇంటికెళ్ళి సంప్రదాయబద్దంగా పిల్లనడగాలి కానీ, ఇలా చెయ్యకూడదు కదా. నేను దక్కితే చాలని అప్పుడన్నారు. ఇప్పుడు నా వెనుకనున్న వాటికోసం ఆశ పడడం ఏమి న్యాయం, సిరి?” సమాధానం లేదని తెలిసినా ఆక్రోశం ప్రశ్నగా వెలువడింది. 



“నేను మా పుట్టింటిని కాదనుకుని వచ్చాను. వాళ్ళ వద్దనుంచి చిల్లిపైసా కూడా ఆశించనని నిక్ఖచ్చిగా చెప్పేసాకా, ముందు చూపినప్రేమ మెల్లిగా సన్నగిల్లుతూ మాయమవ్వసాగింది” మైత్రి కళ్ళల్లో మోసపోయానన్న ఆక్రోశం కనిపించింది. 




“ఇక్కడికి వచ్చాకా, మేము నిలదొక్కుకోవడానికి అమ్మానాన్న ఎంతగానో సహకరిస్తూ ఉన్నా సరే, తలపెట్టిన ప్రతి పనిలోనూ ఎదో ఒక వక్ర మార్గాన్నే ఎంచుకోవడం అతనికి అలవాటైపోయింది. మోసంతోనే బతకాలనుకుంటున్నవాడు ఇలా కష్టపడే మార్గంలో ఎందుకుంటాడు. ట్రావెల్స్ లో రేపు పెట్టుబడి పెట్టి పైకి తీసుకురావాలని వాళ్లనుకుంటుంటే, ఆ ఏజెన్సీ కారును కూడా ఎదో ముప్పులో పెట్టినట్టున్నాడు. 


వారం రోజులుగా ఫోన్లో ఏవో వ్యవహారాలు మాట్లాడు తున్నాడు. నాకదేదో తప్పుడుపనిగానే అనిపిస్తోంది. ఏ రోజు ఎక్కడుంటాడో? ఏపనుల్లో తిరుగుతుంటాడో? ఏమీ చెప్పడు. మునపట్లగా ఇప్పుడు ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదు” వాపోయింది. 



“అమ్మ వాళ్ళతో చెప్పలేక, మింగాలేక కక్కాలేక, బావని దిద్దుకోలేక సతమతమవుతున్నాను సిరి. ఇంక అతను మారుతాడన్న ఆశ నాకులేదు. ఇంక అతనిని నమ్ముకుని ప్రయోజనమూ లేదు. పిల్లాడికి నాలుగో నెల వచ్చింది కాబట్టి, నీకు తెలిసిన చోట నాకేదైన ఉద్యోగం ఇప్పించగలవా సిరి?. ఇంట్లో పెద్దమ్మ నీడన బాబుని వదిలి ముందు నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఈ మాట అమ్మతో అనడానికి కూడా నాకు మొహం చెల్లట్లేదు. నేను ఆమెను పెట్టిన బాధే ఈనాడు నన్ను వెంటాడుతోంది. ఉద్యోగం మానకమ్మా అని బ్రతిమాలింది అమ్మ. విన్నాను కాదు” పశ్చాత్తాపంతో ధారాపాతమైయ్యాయి మైత్రి కళ్ళు. 



“నడి వీధికొచ్చిన నా జీవితం నన్ను వెక్కిరిస్తున్నట్టుగా వుంది. ఐనవాళ్లందరినీ, మంచి కోరిన నీలాంటి వాళ్ళని తూలనాడి ఈనాడు ఇలా ఉన్నాను. నన్ను క్షమించగలవా? అసలు నన్ను మనిషిగా చూడగలవా?” దీనంగా చూస్తూ బావురు మంది. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================


వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.

41 views0 comments

コメント


bottom of page