top of page

జీవితం చిగురేసింది!


Jeevitham Chiguresindi written by Rayapureddy Sathyanarayana

రచన : రాయపురెడ్డి సత్యనారాయణ


చీకటి పడుతూండగా ఇంటిముందు ఆటోరిక్షా ఆగింది!

చేతిలో సూట్ కేస్, భుజంమీద నిద్రిస్తోన్న పసిపాపతో ఆటోదిగి మౌనంగా ఇంట్లోకి నడిచింది వినీల! వరండాలో వాలు కుర్చీలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతోన్న రాఘవయ్య గారికి కూతురు రాక ఆశ్చర్యాన్ని తప్ప ఆనందాన్ని కలిగించలేక పోయింది!!

“అక్కయ్యొచ్చిందోచ్!” అంటూ ఆనందంతో గంతులేశారు ఆమె చెల్లెళ్ళిద్దరూ!

“అదేమిటే వినూ! నువ్వొస్తున్నట్లు ఒక్క ఫోన్ చేస్తే నాన్నగారు స్టేషనుకొచ్చేవారు కదా!!” కూతురు భుజమ్మీద నిద్రిస్తోన్న మనవరాల్ని ఆప్యాయంగా ఎత్తుకుంటూ ముద్దాడింది వర్ధనమ్మ! తల్లి మాటలకు మౌనమే వినీల సమాధానమయ్యింది!

అమ్మ చేతి ‘ఫిల్టరు’ కాఫీ త్రాగి అలసిసొలసిన మనసుతో నిద్రలోకి జారుకొందామె! అభం శుభం తెలియని చిన్నారి ముద్దులొలికే మాటలూ, ముచ్చటైన అడుగులతో ఆ ఇల్లంతా ఒక్కసారిగా సందడితో నిండిపోయింది!

“ఈసారెంత కావాలట?” రాత్రి భోజనాలయ్యాక పెరట్లో మంచం మీద మేనువాలుస్తూ భార్యనడిగారు రాఘవయ్య గారు!

వర్ధనమ్మ మాట్లాడలేదు!

“నిన్నే!” రెట్టించి అడిగారాయన.

“పదివేలు!” వంచిన తెల ఎత్తకుండా జవాబిచ్చిందా తల్లి మనసు!

“ఎక్కణ్ణుంచి తెమ్మంటావే వచ్చినప్పుడల్లా పదేసివేలు? డబ్బు అవసరమైనప్పుడల్లా భార్యను పుట్టింటికి పంపడం అతగాడికో అలవాటై పోయింది! మనమ్మాయికి మాత్రం బుద్ధుండఖ్ఖర్లా? అతగాడు వెళ్ళమన్నప్పుడల్లా సూట్ కేస్ సర్దుకొని బండెక్కెయ్యడమే?? భర్తకు నచ్చచెప్పుకోవొద్దూ???” ఆవేశం కట్టలు త్రెంచుకొంది రాఘవయ్య గారిలో!!

“పాపం అదిమాత్రం ఏంచేస్తుంది చెప్పండి? ఆ ఇంగితం అల్లుడికుండాలి! అటు భర్తకూ సర్ది చెప్పుకోలేక, ఇటు మనతోనూ మనసువిప్పి మాట్లాడలేక లోలోన అదెంత కుమిలిపోతోందో మీకేంతెలుసు?” కొంగు నోట్లో కుక్కుకొంది వర్దనమ్మ !!

“దాని పెళ్ళికి చేసిన అప్పు అసలూ, వడ్డీతో సహా వేలకు వేలై కూర్చొంది! పెళ్లీడుకొచ్చిన పిల్లలింకా ఇద్దరున్నారీ ఇంట్లో అన్న ఆలోచన వాళ్ళకుందా అసలు?? “ బాధ్యత గుర్తొచ్చి భారంగా నిట్టూర్చిందాయన తండ్రి మనసు!!

“పోనీ ఓ పని చెయ్యరాదూ?”

రాఘవయ్య గారు మాట్లాడలేదు!

“వినీలను వెంటబెట్టుకొని రేపోసారి ఊరెళ్ళి అల్లుడికి నచ్చజెప్పి రాకూడదూ!” మిణుకుమిణుకుమంటూ ఆ తల్లి మనసులో ఏదో తెలియని ఆశ, ఆరాటమూనూ !

“కట్టుకున్నదానికంటే కాసుల్నే అమితంగా ప్రేమించేవాడు, నేను చెబితే మాత్రం వింటాడంటావా వర్ధనీ??“ అనుభవం ఆయనచేత అలా పలికించింది! నువ్వింతగా చెబుతున్నావుగాబట్టి రేపోసారెళ్ళి అతగాడికి నచ్చజెప్పివస్తాన్లే ! పడుకో!.. పొద్దుపోయింది!!” మళ్ళీ ఆయనే అన్నారు.

లోపల గదిలో.. నిద్రపట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ ఆలోచిస్తున్న వినీల చెవుల్ని సన్న సన్నగా తాకుతోంది తల్లిదండ్రుల సంభాషణ! ఆలోచనల అలల తాకిడికి పోటెత్తిన సముద్రంలా మారిన ఆమె మనసు, ఓ రెండు గంటల కాలాన్ని అతి భారంగా గడిపింది!

అర్ధరాత్రి.....!

ఇంట్లో అందరూ ఆదమరచి నిదరిస్తోన్నవేళ......

అలికిడిలేకుండా గేటు తెరచుకొని నిశ్శబ్దనిశీధిలోకి అడుగుపెట్టింది వినీల పసిబిడ్డతో సహా!

* * *

అర్థరాత్రి దాటాక.....

ఊరికి దూరంగా, నిర్మానుష్యంగా ఉన్న రైల్వే ప్లాట్ ఫామ్ మీద.....

ఒడిలో నిదరిస్తోన్న పసిపాపతో......

ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది వినీల!

కట్టుకున్న భార్య కంటే కాసుల రాసులనే ఎక్కువగా ప్రేమిస్తూ, చీటికీ మాటికీ పుట్టింటి తరిమే ‘భర్త’ ఓ వైపు! కన్నకూతురు సంసారాన్ని చూసి గుండెపగిలి లోలోన కుమిలిపోతోన్న ‘తల్లిదండ్రులు’ మరొక వైపు!! నడుమ నిస్సహాయంగా నిలబడి తాను! ఎన్నాళ్ళిలా ..? ఎన్నేళ్ళిలా..??

ఆమె మనసులోని నిశ్శబ్ద యుద్ధాన్ని భగ్నంచేస్తూ..

దూరంగా.. రైలొస్తోన్న ‘కేక’!

గుండెరాయి చేసుకొని.....పసికందునక్కడే వొదిలి......కదిలొచ్చే రైలుకు ఎదురేళ్లబోయింది వినీల! రైలు ‘కూత’ విని జడుసుకొందో ఏమో, ఒక్కసారిగా ‘పసిబిడ్డ ’ గుక్కపెట్టి ఏడ్చేసరికి అడుగు ముందుకు వేయలేక అక్కడే ఆగిపోయిందామె తల్లి మనసు! ఏడుస్తోన్న బిడ్డను సముదాయించి చూసేసరికి, ప్లాట్ ఫామ్ వొదిలి వెళ్లిపోతూ కనిపించింది ‘రైలు’!

హతాశురాలై.. పసిబిడ్డతో సహా ఉన్నచోటునే కూర్చుండి పోయింది వినీల!

ముసురుకునే ఈగల్లా ఆమెను మళ్ళీ చుట్టుముట్టాయి ఎడతెగని ఆలోచనలు!! ఆలోచనల్లో మునిగిపోయి, ఎముకలు కోరికే చలిలో ఎంతసేపలా చీకట్లో కూర్చుండిపోయిందో తెలియదు!

“ఎవరమ్మా నువ్వు? ఏ ఊరెళ్ళాలి??” అన్న పిలుపుతో మళ్ళీ ఈలోకంలోకొచ్చి పడింది! క్రమశిక్షణకూ, కర్తవ్య దీక్షకూ ప్రతీకలైన మల్లెపువ్వులాంటి తెల్లని యూనిఫామ్ లో ఎదురుగా నిలబడి ఉన్నాడు ‘స్టేషన్ మాస్టర్’! చేతిలో జెండాలున్నాయి.

ఆయన ప్రశ్నకు వినీల దగ్గర సమాధానం లేదు!

“ఆఖరు రైలు కూడా వెళ్ళిపోయింది! రేపు ఉదయం వరకూ మరో బండి లేదు! గొప్పింటి బిడ్డలాగున్నావ్! ఇంత రాత్రిపూట ఒంటరిగా నువ్వు బయటకు వెళ్ళడం కూడా శ్రేయస్కరం కాదు! ఆరుబయట ఎముకలు కోరికే చలిలో చంటి బిడ్డతో ఏం ఇబ్బంది పడతావ్ గానీ, వెయిటింగ్ రూమ్ తాళం తీయిస్తాను, రేపు ఉదయం రైలొచ్చేవరకూ విశ్రాంతి తీసుకోమ్మా!” అంటూ వినీల సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయాడాయన!

లైసెన్సు పోర్టరొచ్చి వెయిటింగ్ రూమ్ తాళం తీసి వినీలనూ బిడ్డనూ లోపల కూర్చోబెట్టాడు!

నాలుగయిదు గంటలు భారంగా గడిచాయి! తెలతెల్లవారుతూండగా వేడి వేడి 'టీ' తెచ్చిచ్చాడు పోర్టరు! బయటున్న చలి వాతావరణానికి లోపల వేడి వేడి ‘టీ’ గొంతులో పడే సరికి ప్రాణంలేచొచ్చినట్లయింది వినీలకు!

"ఏమ్మా,ఏంచేస్తున్నావ్?” చేతిలో 'టీ' కప్పుతో వెయిటింగ్ రూమ్ లో అడుగుపెట్టారు స్టేషన్ మాస్టారు! ఆయన్ను చూసి మర్యాదపూర్వకంగా లేచి నిలబడింది వినీల!

"కూర్చోమ్మా! నీ తండ్రిలాంటి వాణ్ణి! నిన్ను చూస్తూంటే చనిపోయిన నా చిన్న కూతురు గుర్తుకొస్తోంది!"

అర్ధంకానట్లు చూసిందాయన వైపు!

"ఆరేళ్ళ క్రిందట కాలేజీకెళ్ళొస్తూ ‘యాక్సిడెంట్లో’......!" కళ్ళు తుడుచుకొన్నారాయన!

“నీ పేరేమిటమ్మా?” కొంత నిశ్శబ్దం తరువాత మళ్ళీ ఆయనే అడిగారు! వినీల మాట్లాడలేదు! ‘ఇష్టం లేకపోతే చెప్పొద్దులేమ్మా!’అన్నారు! ఆయన మాటల్లోని ఆప్యాయత, ఆ మాటలవెనుక దాగి ఉన్న ఆర్ధ్రత వినీల మనసును నిలువునా కట్టిపడేశాయి!

క్షణాల్లో ఆమె రెండు కళ్ళూ కన్నీటి సముద్రాలయ్యాయి! తండ్రిలాంటి ఆయన ఆత్మీయతకు మంచులా కరిగి కన్నీరై తన దీన గాథ వినిపించింది! కథ విన్నాక భారంగా నిట్టూర్చుతూ అన్నారాయన.

"చీకట్లో ప్లాట్ ఫామ్ మీద చంటి బిడ్డను విడిచి, కదిలొస్తోన్న 'రైలు' కు ఎదురెళ్ళాలని రాత్రి నువ్వు ప్రయత్నించినప్పుడే నాకనుమానమొచ్చింది! ఆ భగవంతుడి దయవలన నీ ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది!

తప్పు చేసినట్లు తలవంచుకొంది వినీల!

"జీవితం ఎంత చిన్నదో, అంత గొప్పది! సృష్టిలో ప్రతి మానవుడి పుట్టుక వెనుకా ఒక పరమార్ధం దాగి వుంటుంది! దానిని గ్రహించలేని అయోమయంలో, మహోత్కృష్టమైన మానవజన్మను పరిస్థితులకు తలవంచి మధ్యలోనే అంతమొందించు కోవాలనుకోవటం పిరికివాళ్ళ చర్య!"

ఆయన మాటల్ని మౌనంగానే వింటోంది వినీల!

"పిరికితనంతో నువ్వు చనిపోవాలనుకున్నావు! నిన్ను నమ్ముకొని భూమ్మీద పడ్డ ఈ ‘పసిగుడ్డు’నేం చేద్దామనుకున్నావ్?........ చూడమ్మా!చావుపుట్టుకల నడుమ సాగే ఈ 'జీవన్నాటకం'లో..... మనతో కలిసి సాగే పాత్రలు అనేకం. వాటి వ్యక్తిత్వాలూ, మనస్తత్వాలూ వేర్వేరుగా ఉండొచ్చు!...కన్నవాళ్ళైనా, కట్టుకున్నవాడైనా.... మనస్తత్వాలు మనతో సరిపడనప్పుడు.... మనల్ని నమ్ముకున్న మనవాళ్ళకోసం, మనకోసం మనం బ్రతకటం నేర్చుకోవాలి! అప్పుడే ఇలాంటి అనర్ధాలకు మనం అడ్డుకట్ట వేయగలిగేది!" ఇంతకన్నా తాను చెప్పగలిగేదేమీ లేదన్నట్లు అక్కణ్ణుండి నిష్క్రమించారాయన!

వినీల మనసు మళ్ళీ ఆలోచించటం మొదలు పెట్దింది!

'నిన్ను నమ్ముకొని భూమ్మీద పడ్డ ఈ పసిగుడ్డునేం చేద్దామనుకున్నావ్?' మాస్టారి మాటలు ఎక్కుపెట్టిన తూటాలై పదే పదే గుండెను గుచ్చుతున్నాయి!

ఉదయపు వెలుగుల్ని మోసుకొంటూ రైలొచ్చి స్టేషన్లో ఆగింది!

మాస్టారి మాటల్లోని అంతరార్ధం అంతరాత్మ ప్రబోధమై నిలువగా, విప్పారిన మనోనేత్రంతో , ‘పసిబిడ్డ’ను గుండెలకు హత్తుకొని, క్షణం ఆలస్యం చేయకుండా టిక్కెట్టు కొని రైలెక్కి కూర్చొంది వినీల!

వేకువ తీరాల్ని వెదుక్కొంటూ సాగే 'బ్రతుకు బండి'కి సిగ్నలిచ్చి, తృప్తిగా పచ్చ జెండా ఊపారు స్టేషన్ మాస్టారు!

******


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
36 views0 comments

Comentários


bottom of page