top of page

జ్ఞానోదయం


'Jnanodayam' New Telugu Story Written By Savithri Kovur

'జ్ఞానోదయం' తెలుగు కథ

రచన : సావిత్రి కోవూరువేగంగా వెళుతున్న రైలులో, కిటికీ పక్కన కూర్చుని ఆలోచిస్తోంది స్వప్న. బాబు హాయిగా నిద్ర పోతున్నాడు. రైలు కుదుపులు గాని, స్టేషన్స్ లో రైలు ఆగటం, మళ్ళీ కదలటం, ఇవేమీ గమనించకుండా తల్లిదండ్రులు తనను మరీ మరీ ఎందుకు రమ్మని అంటున్నారో అని ఆలోచిస్తుంది. ఆమెకు ఎంతకూ అర్థం కాలేదు.


స్వప్న వాళ్ళ తల్లిదండ్రులకి స్వప్న, వాళ్ళ అన్నయ్య కార్తీక్ ఇద్దరే సంతానం. స్వప్నకు రెండేళ్ల క్రితమే వరంగల్ లో ఇంజనీర్ గా ఉద్యోగం చేసే సుధీర్ తో పెళ్లి జరిగింది. స్వప్న కూడా అక్కడే కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగంలో చేరింది. ఈ రెండేళ్లలో ఎప్పుడు వచ్చినా నాలుగైదు రోజుల కంటే ఎక్కువ రోజులు తల్లిదండ్రుల దగ్గర గడప లేదు స్వప్న. ఇప్పుడు కూడ తనకు కాలేజీ సెలవులు వున్నా, భర్త ఆఫీస్ కి వెళ్ళాలి కనుక, హైదరాబాద్ ప్రయాణం పెట్టుకోలేదు. కానీ తల్లి తండ్రి మళ్ళీ మళ్ళీ రమ్మని కాల్ చేయడంతో, భర్త సుధీర్ కి సెలవు లేదని చెప్పడంతో, బాబుతో ఒక్కతే బయలుదేరింది.


స్వప్న వాళ్ళ అన్నయ్య కార్తీక్ కూడా రెండేళ్ల క్రితమే హైదరాబాదు లోని బీ.హెచ్.ఈ.ఎల్.లో ఇంజనీర్ గా చేరాడు. కానీ స్వప్న అతన్ని చూసి చాలా కాలం అయింది. క్రిందటిసారి తను హైదరాబాద్ వచ్చినప్పుడు కార్తీక్ ఫ్యాక్టరీ పనిపై హరిద్వార్ వెళ్ళాడు.


స్టేషన్లోని రణగొణ ధ్వనికి బాబు లేవడంతో ఈ లోకంలోకి వచ్చింది స్వప్న. "అబ్బ అప్పుడే కాచిగూడ వచ్చేసిందా" అనుకొని బ్రీఫ్కేస్ ఒక చేతితో పట్టుకుని బాబును భుజాన వేసుకుని రైలు దిగి స్టేషన్ బయటకు వచ్చి ఆటోలో నల్లకుంట బయలుదేరింది.


ఆటో శబ్దానికి తల్లి, తండ్రి, అన్నయ్య బయటకు వచ్చారు. కార్తీక్ బాబుని తీసుకుని లోపలకు వెళ్ళాడు.


"అన్నయ్య చాల సన్నం అయ్యాడు" అనుకుంది స్వప్న.


"రామ్మా రా. ప్రయాణం బాగా జరిగిందా?" అంటూ తల్లి పలకరించింది.


"ఆ బాగానే జరిగిందమ్మా" కాళ్ళు కడుక్కుంటూ జవాబు చెప్పింది స్వప్న.


"అల్లుడు గారు రాలేదా?" ఆటోను పంపించి లోపలికొస్తూ అడిగాడు తండ్రి.


"లేదు నాన్న సెలవుల్లేవని నన్ను వెళ్ళమన్నారు" అంది స్వప్న.


"నేను అలా వెళ్లి కూరలు తీసుకొస్తాను" అంటూ రాఘవరావు గారు బయటకు వెళ్ళిపోయారు.


సావిత్రమ్మ వంటింట్లో పీట వాల్చి కూతుర్ని కూర్చోమని, టీ పెట్టి తెచ్చింది. టీ తాగుతూ "అన్నయ్యేంటి అంతగా చిక్కిపోయాడు" అంది స్వప్న. ఆ మాటలు విన్నట్లే బాబుతో పైకి వెళ్ళిపోయాడు కార్తీక్.


"ఇది చెప్పడానికేనమ్మా నిన్ను మరీ మరీ రమ్మని చెప్పింది. నాలుగేళ్ళనుండి వాడలా మారిపోయాడు. మునుపున్న హుషారే లేదు. తిండి సరిగ్గా తినడు. ఫ్యాక్టరీకి మాత్రం వెళ్ళి వస్తాడు. స్నేహాలన్నీ మానేశాడు. ఒక్కడే గదిలో గంటలు గంటలు కూర్చుని ఏదో ఆలోచిస్తాడు. ఏంటంటే చెప్పడు.


"మొన్ననే ఓ సంబంధం వచ్చింది. పిల్లని చూడడానికి వెళ్దామంటే ఉలకడు పలకడు. గట్టిగా అడిగితే నేను పెళ్లి చేసుకోను. నన్నెప్పుడూ ఆ విషయం గురించి అడగకండి అంటాడు. వాడికంటే చిన్నదానివి నీవు హాయిగా పెళ్లి చేసుకుని, చక్కగా కాపురం చేసుకుంటున్నావు. అలాగే మాకు కాళ్ళు చేతులు ఆడినప్పుడే వాడి పెళ్లి కూడా చేసి, వాడు సుఖంగా ఉంటే చూడాలనుకోవడం మా తప్పా చెప్పమ్మా? చాలా రోజుల నుండి ఇంట్లో ఇదే సమస్య. దూరంగా ఉన్నావు. వచ్చిన నాలుగు రోజులు ఈ సమస్యతో నిన్ను చికాకు పరచటం ఎందుకని అనుకున్నాం. కానీ ఇది మావల్ల అయ్యేలా లేదు. ఇక నీ ఇష్టం. మీ అన్నయ్యనెలా ఒప్పిస్తావో. ఒప్పుకుంటే సరే, లేకపోతే రోజూ వాణ్ణిలా చూస్తూ గడిపే కంటే, మేము ఇద్దరం ఊరు వెళ్లి అక్కడే ఉంటాం. వాడి ఇష్టం ఏమైనా చెయ్యనీ" అని స్వప్నను రమ్మన్న కారణం కాస్తా చెప్పేసింది తల్లి.


స్వప్న, కార్తీక్ ఇద్దరు అన్నాచెల్లెళ్లలా కాకుండా స్నేహితుల్లా ఉంటారు కనుక, తమ మాట వినకపోయినా చెల్లితో మనసులోని మాట చెప్తాడేమోనని తల్లి ఆశ.


"నీవేమీ బెంగపడకమ్మా. అన్నయ్యను పెళ్ళికి ఒప్పించే పూచి నాది" అంది స్వప్న.


"ఇంకా వంట మొదలు పెట్ట లేదా" అంటూ వచ్చారు రాఘవరావుగారు.


"ఇదిగో ఐదునిమిషాల్లో పూర్తి చేస్తాను" అంటూ కూరల సంచి తీసుకొని వంటకుపక్రమించింది సావిత్రమ్మ. స్వప్న, రాఘవరావు కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నారు.


భోజనాలు అయిన తర్వాత స్వప్న కూడా మేడపైకి వెళ్ళి, ఆరుబయట అన్న పక్కన మంచం వేసుకుని కూర్చుంది. బాబు అన్నం తిని, ఆడి ఆడి కార్తీక్ మంచంపైన అలాగే పడుకున్నాడు. కార్తీక్ ఏదో పుస్తకం చూస్తూ మంచం పైన పడుకున్నాడు. సావిత్రమ్మ పక్క గదిలో పడుకుంది. అన్నయ్య తో సంభాషణ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తుంది స్వప్న.


"బాబుని తీసుకెళ్తావా" అని పలకరించాడు కార్తీక్.


"ఇక్కడే ఉండనీ. లేచినప్పుడు తీసుకెళ్తాను గాని, ఆ పుస్తకం కాస్త పక్కన పెట్టు కాసేపు" అన్నది అతనికెదురుగా తన మంచం పై కూర్చుంటూ స్వప్న.


"ఏంటి విశేషాలు చెప్పు" సరిగ్గా కూర్చుంటూ అన్నాడు కార్తీక్.


"అన్నయ్యా! నేను అడిగిన దానికి సూటిగా జవాబు చెప్తావా" అంది స్వప్న.


"పెళ్లి విషయం తప్ప ఇంకేమైనా అడుగు చెప్తాను" అన్నాడు కార్తీక్ .


"అలా తప్పించుకుంటే లాభం లేదు. నీవు అసలు విషయం చెప్పకపోతే ఊరుకోను. అసలు నీకు పెళ్లి ఎందుకు ఇష్టం లేదు. రామకృష్ణ పరమహంస లా సంఘసేవ చేస్తావా" అన్నది స్వప్న.


"అంత గొప్పవారితో పోల్చకు మీ అన్నయ్యను. నేను చేసిన పాపానికి ఫలితం అనుభవించాలి అంతే" అన్నాడు.


"పాపమా? అదేంటి? పెళ్ళికి దానికి సంబంధం ఏంటి అసలు" అన్నది స్వప్న.


"నీకు తెలియదు స్వప్న ఈ అన్నయ్య ఎంత పాపాత్ముడో, అందుకే భగవంతుడు నా నొసట పెళ్లి రాసిపెట్టలేదు నేను బాధ పడటమే కాకుండా అమ్మానాన్నలను కూడా బాధ పెడుతున్నాను" అన్నాడు కార్తీక్ .


ఏదో కారణం లేకపోతే ఇలా మాట్లాడడని స్వప్న "అసలు కారణం ఏంటి చెప్పు. అది సరైనదే అయితే అమ్మానాన్నలు ఇంక నిన్ను విసిగించకుండా నేను చూసుకుంటాను" అంది స్వప్న.


"అయితే చెప్పక తప్పదా?" అని కొంచెం సేపు ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు. తర్వాత ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.


"నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నేను, మనోహర్, మురళి చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం నీకు తెలుసు కదా! ముగ్గురం కలిసి ఎవరింట్లోనో ఒకరింట్లో కలిసి చదువుకునే వాళ్ళం తీరిక సమయాల్లో కబుర్లు చెప్పుకునే వాళ్ళం ఎక్కువగా ఆడపిల్లల గురించి మాట్లాడుకోవడం, సినిమాలు కూడా ఎక్కువగా చూసే వాళ్ళం. రోడ్డు మీద ఎవరైనా ఆడపిల్ల కనిపిస్తే చాలు వెంబడించి చేతనైనంత వరకు సతాయించే వాళ్ళం. మేము ఎప్పుడూ ఒంటరిగా ఉన్న వాళ్ళని ఏవో చిలిపి మాటలు అనడం, మారు పేరు పెట్టి పిలవడం ఈవిధంగా ఉండేది మా అల్లరి. ఒక అమ్మాయి బీ.హెచ్.ఈ.ఎల్ నుండి ఫ్యాక్టరీ బస్సులో కాలేజీకి వచ్చేది. కాలేజ్ నాలిగింటికి ఐపోతే బస్సు ఐదున్నరకు ఉండేది. ఆ అమ్మాయి కాలేజీలో ఒంటరిగా ఉండలేక బస్టాప్ లో కూర్చునేది. ఆ విషయం గమనించి మేము అక్కడ హాజరయ్యే వాళ్ళం. అమ్మాయిని మా అల్లరి పాటలతో విసిగించే వాళ్ళం. అక్కడ రోడ్డు కూడా అంత రద్దిగా ఉండేది కాదు.


"ఇలా ఉండగా ఒక రోజు సినిమా చూసి, ముగ్గురం నడుచుకుంటూ వస్తున్నాము. ఒక అమ్మాయి ఒంటరిగా కనిపించింది .అంతే! మేము దగ్గరికి వెళ్ళాము. మమ్మల్ని చూసి ఆ అమ్మాయి వేగంగా ముందుకు వెళ్ళింది. మేము కూడా వెంబడించాము. నాలుగడుగులు వేసామోలేదో మా మెడల మీద మెరుపులు మెరిసినట్లై ముందుకు తూలాము. మేము వెనుకకు తిరిగే లోపే ఎన్నో కరాటే దెబ్బలు పడ్డాయి. మాలో ఎవరికీ కరాటే రాదు. అలా దెబ్బలు తింటూ పడిపోయిన మేము తిరిగి హాస్పిటల్ లోనే కళ్ళు తెరిచాము. ఒళ్ళంతా బ్యాండేజీలు, నడుము దగ్గర విపరీతమైన నొప్పి. డాక్టర్ ని అడిగితే రాత్రి ఎవరో నలుగురు అమ్మాయిలు హాస్పటల్లో చేర్చి వెళ్ళారని, కొంచెం దెబ్బలు ఎక్కువగా తగిలాయని, ఏవో మందులు రాసిచ్చారు.


రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్ 'మీకు ప్రాణాపాయం ఏం లేదు కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి' అన్నారు.


ఏమిటని అడిగితే 'మీకు వెన్నెముక పైన దెబ్బలు బాగా తగిలాయి, కనుక మీరు పెళ్లికి పనికిరారు' అని చెప్పారు. అప్పుడు మా పరిస్థితి చెప్పటానికి మాటలు రావు. మేము ఏడిపించిన ఆడపిల్లల శాపమే మమ్మల్ని ఇలా చేసిందని ముగ్గురమూ ఎంతో ఏడ్చాము. అప్పటి నుండి అల్లర్లన్నీ మానేసి మాలో మేమే కుమిలిపోతున్నాము. అందుకే మేము పెళ్లి చేసుకొని వేరొక అమ్మాయి జీవితం బలి పెట్టటం ఎందుకని ఇక జన్మలో పెళ్ళి మాట తలపెట్ట వద్దని నిర్ణయించుకున్నాం. మా మనుసులను చదువుపై లగ్నం చేసాం . ఇప్పుడు చెప్పు. ఇదంతా విన్నాక కూడా పెళ్లి చేసుకోమంటావా?" అన్నాడు కార్తీక్.


ఎంతో శ్రద్ధగా విన్న స్వప్న "ఎప్పుడు జరిగింది.. 2009 లో నేనా" అడిగింది స్వప్న.


"అవును 2009లోనే. అప్పుడే కదా నేను డిగ్రీ థర్డ్ ఇయర్ . నీకు ఎలా తెలుసు" అన్నాడు కార్తీక్.


"నువ్వు రోజు ఏడిపించిన అమ్మాయి బేగంపేట కాలేజీ దగ్గరే కదా వుండేది?" అన్న స్వప్నతో కార్తీక్ "అవును" అన్నాడు.


"అయితే నీవు అన్నీ మర్చిపోయి నిక్షేపంగా పెళ్లి చేసుకోవచ్చు. నీకు ఏం కాలేదు" అన్నది స్వప్న.


"ఏంటి నువ్వు మాట్లాడేది? సరిగ్గా చెప్పు" అన్నాడు కార్తీక్.


"అయితే విను మేము ఇంటర్ చదివే రోజుల్లో మా కాలేజీకి శిరీష అనే అమ్మాయి బి.హెచ్.ఇ.ఎల్. నుండి వచ్చేది. మొదట్లో చాలా చలాకిగా ఉండేది. కానీ రానురాను ఏమైందో కాలేజీకి సరిగ్గా రాకపోవడం, వచ్చినా భయం భయంగా ఉండడం చేస్తూ, రోజు సాయంత్రం వెళ్ళేటప్పుడు ‘గంటన్నర వెయిట్ చేయాలి, ఎవరైనా తోడు రమ్మ’ని అడిగేది. మేమంతా ఆ అమ్మాయిని ‘బుజ్జి పాపాయి’ అని ఆట పట్టించేవాళ్ళం. కానీ ఎవరూ అంత సేపు తనతో ఉంటే ఇంటికి వెళ్ళడానికి ఆలస్యమవుతుందని వెళ్ళేవాళ్ళం కాదు. నేను ఒక రోజు నా ఫోటోలు అన్నీ ఫ్రెండ్స్ కి చూపడానికి కాలేజీ కి తీసుకెళ్ళాను.


దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్న ఫోటో చూస్తూ నిన్ను చూసి శిరీష "ఈ అబ్బాయి మీ అన్నయ్యనా?" అని అడిగింది. నేను నీ గురించి గొప్పగా చెప్పడం మొదలు పెట్టాను.అంతే!


"అతను నీవు అనుకున్నంత మంచి వాడేం కాదు. అతని గురించి చెబితే నువ్వు సిగ్గు పడతావు" అని నువ్వూ, నీ ఫ్రెండ్స్ కలిసి తనను ఏడిపించడం, అందుకే తాను పూర్తిగా క్లాసెస్ కాకముందే వెళ్ళిపోవడం, లేకపోతే కాలేజీకి సరిగ్గా రాకపోవడం చేస్తున్నాననీ, మీ భయానికే మమ్మల్ని రోజూ తోడు రమ్మని పిలుస్తున్నానని చెప్పింది. మొదట నేను నమ్మలేదు కానీ, తర్వాత ఒకరోజు దానితో వెళ్లి చాటుగా నిలబడి ప్రత్యక్షంగా నిన్ను చూశాను.


"ఆ మరుసటి రోజు నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు మీరు సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నది నేను తెలుసుకొని, మా ఫ్రెండ్స్ కి తెలియజేశాను. తర్వాత రోజు హాల్లోంచి వచ్చిన మీకు చేసిన సత్కారం గురించి అంతా చెప్పారు. రెడ్డి కాలేజ్ ఎదురుగా సందులో మా క్లాస్మేట్ మాధవి వాళ్ళు ఉంటారు. వాళ్ళ నాన్న డాక్టర్. ఆయనను బ్రతిమిలాడి మీరు వివాహానికి అనర్హులని చెప్పించాము. కానీ మీరు దానిని ఇంత సీరియస్ గా తీసుకుంటారనుకోలేదు.


"ఆ తర్వాత చదువుల్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. మళ్ళీ ఇన్ని రోజులకు నీవు చెప్తే నాకు జ్ఞాపకమొచ్చింది." అంది స్వప్న.


కార్తీక్ మంచం మీద నుంచి లేచి "నీవనేది నిజమా?" అన్నాడు. ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో.


"అవును అన్నయ్యా! నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి చెప్పు" అంది స్వప్న .


కార్తీక్ నమ్మలేనట్టు గా చూస్తూ ఉంటే “ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నావా అన్నయ్యా? కావాలంటే ఆ డాక్టర్ గారిని అడుగు రేపు. ఆయన ఎంతకూ అలా చెప్పడానికి ఒప్పుకోకపోతే మేమే మీ అల్లరి భరించలేక ఎంతో మంది ఆడపిల్లలు బాధపడుతున్నారని, మీకు బుధ్ధి వచ్చిన తర్వాత మేము మీకు నిజం చెప్పేస్తామని, చెప్పి ఆయన్ని ఒప్పించాము. ఆ బ్యాండేజీలు అవ్వన్నీ ఉత్తుత్తివే . నడుందగ్గర మాత్రం మీకు అనుమానం రాకుండా కాస్త గట్టిగా వడ్డించారు మా ఫ్రెండ్స్" అంది స్వప్న.


ఆ మాటలు విన్న కార్తీక్ ముఖం ఎన్నో విజయాలు సాధించినట్లయి సంతోషం పట్టలేక స్వప్న రెండు చేతులూ పట్టుకుని ఉద్వేగంతో ఏడవటం మొదలుపెట్టాడు, ఆమె వద్దని వారిస్తున్నా.

ఆ సంతోషంలో "స్వప్నా! ఇంత మంచి వార్త చెప్పి నా జీవితాన్ని నిలబెట్టిన నీకేం కావాలో కోరుకో" అన్నాడు.


"నేను అడిగిన తర్వాత కాదనకూడదు మరి" అంది స్వప్న.


“కాదనటమా? అసలు నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. నా సంతోషం నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది... ఈ నాలుగు సంవత్సరాల నుండి నేను అనుభవించిన నరకం పగవాడికి కూడా వద్దు. నేను అందరిలా లేననే బాధొకటి, అమ్మానాన్నలను కూడ బాధ పెడుతున్నాను. అని బాధతో ఇంతకాలం ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలుసు.


అది సరే గానీ ఇంత సంతోషాన్ని కలిగించిన నీకు ఏమిమ్మంటావు నా ప్రాణాలు నీకు ఇమ్మన్నా, నేను రెడీ” అని ఉద్వేగంగా పలికాడు కార్తీక్. అతని కళ్ళు కొత్త కాంతితో వెలుగుతున్నాయి.


స్వప్న "నీ ప్రాణాలు నాకెందుకు అన్నయ్యా! నా దగ్గర నాది కాకుండా రెండు ప్రాణాలు ఉన్నాయి. నీ ప్రాణాలు శిరీష కి ఇవ్వు చాలు" అంది.


"శిరీషకా?" అన్నాడు కార్తీక్ .


"అవును నీవు ఏడిపించిన శిరీషకు .వాళ్ళ నాన్నగారు రిటైరయ్యారు. దాని పెళ్లి చేయడానికి వాళ్లకు ఇబ్బందిగా ఉందని ఒకసారి వాళ్ళ నాన్న మాటల మధ్య చెప్పారు. కనుక ఆ అమ్మాయిని నీవు చేసుకుంటే వాళ్ళ నాన్న చాలా సంతోషిస్తారు. నీవు సరేనంటే నేను వాళ్లతో మాట్లాడుతాను" అంది స్వప్న.


కార్తీక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ళ అమ్మానాన్న సంతోషానికి అంతే లేకుండా పోయింది.

మర్నాడు స్వప్న, తల్లిదండ్రులతో కలిసి శిరీష వాళ్ళ ఇంటికి వెళ్లి అడగడంతో కార్తీక్ తో పెళ్లికి మొదట సంశయించిన శిరీష,ఈ నాలుగేళ్లలో కార్తీక్ అనుభవించిన బాధ, పశ్చతాపం గురించి స్వప్న చెప్పడంతో అంతా విన్న శిరీష పెళ్లి కి ఒప్పుకోవడంతో శిరీష ,కార్తీక్ ల కళ్యాణం ఆర్భాటంగా జరిగిపోయింది.


***


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

కథ రచయత్రి శ్రీమతి సావిత్రి కోవూరు (M.A. [తెలుగు]) హైదరాబాద్ లో 27 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినారు.


47 views0 comments

Yorumlar


bottom of page