top of page

క్షమాశీలత


'Kshamasilatha' New Telugu Story Written By Ch. Pratap

'క్షమాశీలత' తెలుగు కథ

రచన : Ch. ప్రతాప్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


రామాపురం శివార్లలో స్వర్ణముఖి నది ఒడ్డున విద్యానందుడు అనే గురువు ఒక గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేస్తున్నారు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు. వేద శాస్త్రాలను, పురాణాలను, ఉపనిషత్తులను ఔపోసన పట్టిన దిట్ట. ఆయన శిష్యరికంలో అనేకమంది సకల శాస్త్ర కోవిదులుగా తీర్చి దిద్దబడి దేశంలో వివిధ ప్రాంతాలలో మంచి కొలువులలో స్థిరపడ్డారు.


శిష్యులకు విద్యాబోధనే కాక తన వద్దకు వచ్చే ప్రజానీకానికి సందేహాలు తీర్చడంతో పాటు వారి సమస్యలకు పరిష్కారం సైతం ఇవ్వగలడంలో దిట్ట అనిపించుకున్నారు. వేద వేదాంగాలలో వున్న అనేక అంశాలను స్పృశించడమే కాక, ఆనాటి కాలంలో ప్రబలంగా వున్న జంతుబలి, బానిసత్వం వంటి అమానవీయ పద్ధతులను మార్చుకోవాలని సూచించేవారాయన. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజానీకం వచ్చి ఆయనను దర్శించుకొని తమ తమ సమస్యలకు పరిష్కార మార్గాలు పొందుతుండేవారు.


విద్యానంద గురువు కి వచ్చిన అపూర్వ ప్రజాదరణ చూసి ఓర్వలేక అప్పడు రాజ్యపాలన చేస్తున్న పర మతస్థుడైన రాజుకి కంటగింపు కలిగింది. పైగా అతని దర్బారులో వున్న అనేకమంది విద్యానందుల వలన తమ మతానికి ఎంతో చెడ్డ పేరు రావడంతో పాటు ఆదరణ కూడా తగ్గిపోతుందని రాజుకు లేనిపోనివి కల్పించి చెప్పారు. వీటి వలన ప్రభావితుడైన రాజు మొదట్లో తన సైన్యాన్ని పంపించి విద్యానందుల వారిని హతమార్చి, ఆశ్రమాన్ని ధ్వంసం చేయద్దామని పధక రచన చేసాడు.


అయితే గురువు కి వున్న జనాదరణ, ఆయన ఆశ్రమంపై విధ్వంసకాండ జరిపితే దానిని ఆయన భక్తులు మతం రంగు పులిమే ప్రమాదం వున్నందున ప్రత్యామ్నాయం కోసం తన సన్నిహితులతో సమాలోచనలు జరిపాడు. ఆ పధకం ప్రకారం కరటయ్య అనే వ్యక్తికి భారీగా సొమ్ము ఆశ జూపి విద్యానందుని ఆశ్రమానికి పంపించారు.


కరటయ్య విద్యానందుని పాదాలకు మోకరిల్లి ఆశ్రమంలో లో చిన్నాచితకా పనులు చేసుకునేందుకు అనుమతి నివ్వవలసిందిగా ప్రార్ధించాడు. ఆనాటి నుండి అందరికీ అన్ని పనులలో సహాయం చేస్తూ, అతి విధేయత ప్రదర్శిస్తూ అందరికి తలలో నాలుకలా మెదులుతూ అందరి నమ్మకం సంపాదించుకున్నాడు. మూడు నెలల సమయం తిరిగేసరికి కరటయ్య లేనిదే ఆశ్రమంలో ఏ పని జరగని పరిస్థితి నెలకొంది.


పధకం ప్రకారం రాజు ఇచ్చిన మందును నెమ్మదిగా గురువు ఆహారంలో కొంచెం కొంచెం కలపసాగాడు. మోతాదు తక్కువగా వుండడం వలన గురువు కి కూదా మొదట ఎలాంటి అనుమానం రాలేదు. అయితే రెండు నెలల సమయం తర్వాత శరీరంలో నరాల పటుత్వం తగ్గ సాగింది. కొద్దిరోజులలోనే ఆ సమస్య హఠాత్తుగా పెద్దదై విద్యానందుడు మంచాన పడ్డారు. రోజు వారీ కార్యక్రమాలకు కూడా స్వయంగా లేవలేని పరిస్థితులు వచ్చాయి.


పరిస్థితి దిగజారడం గమనించి శిష్యులు ఒక ప్రముఖ వైద్యుడిని రప్పించారు. ఆయన విద్యానందుడిని పరీక్షించి శరీరంలో విషప్రయోగం జరిగిన విషయం నిర్ధారించి, పరిస్థితి చేజారిపోయిందని, అయినా సడలని నమ్మకంతో విషానికి విరుగుడు మందు ఇచ్చి వెళ్ళిపోయారు. జరిగిన విషయాన్ని అర్ధం చేసుకున్న శిష్యగణం ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఆశ్రమంలోనే వుంటూ ఇంతటి నమ్మక ద్రోహానికి ఒడిగట్టినవారెవరా అని ఆలోచించసాగారు.


ఇంతలో విద్యానందుల నుండి కరటయ్యకు పిలుపు వచ్చింది. తన సంగతి ఆయనకు తెలిసిపోయిందేమోనన్న భయంతో గజ గజ వణికిపోతూ కరటయ్య గురువు వద్దకు వెళ్ళేడు. అక్కడ గురువు ఒక్కరే వున్నారు.


ఆయన ఆప్యాయంగా కరటయ్య చేతిని పట్టుకొని "నాయనా, తెలిసో, తెలియకో నువ్వు ఈ ఘాతుకానికి ఒడిగట్టావు. అయినా నాకేమీ బాధగా లేదు. భగవంతుడు ఈ విధంగా నా జీవితాన్ని ముగించాలని నిర్ణయించినప్పుడు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి నేనెవరిని ? అయితే నా బాధంతా నీ గురించే. హత్యాపాతకం తీవ్రమైనది. అది పన్నెండు జన్మల వరకు వెంటాడి వేధిస్తుంది.


తెలిసి పట్టుకున్నా, తెలియక పట్టుకున్నా అగ్ని కాల్చేసినట్లు, ఏ పరిస్థితుల్లో హత్యాపాతకానికి ఒడిగట్టినా అది వెంటాడి వేధించకతప్పదు. హత్య చేసినవారే కాక దానిని తలపెట్టిన వారు కూడా హంతకులే.


వైద్యుని చేతిలో మరణిస్తే అది హత్య కాదు. కుమారుణ్ణి, శిష్యుణ్ణి, భార్యను శిక్షించినప్పుడు మరణిస్తే అది పాపం కాదు. బ్రాహ్మణుడిని కాని గోవుని కాని హత్యా చేసి తర్వాత ఆత్మహత్య చేసుకుంటే ప్రాయశ్చిత్తం అవుతుంది. లేకపోతే 12 సంవత్సరాలు అడుక్కుంటూ ఇతరుల ముష్టిపై జీవిస్తే హత్యాపాతకం పోతుంది. తన సొంత లాభం కోసం హత్య చేస్తే 12 సంవత్సరాలు అలా కాకుండా హత్యచేస్తే 6 సంవత్సరాలు బిక్షాటన చాలు.


బ్రాహ్మణుడు, వైద్యుడిని చంపితే ఒకరకమైన శిక్ష, క్షత్రియుడు, శూద్రున్ని హత్యచేస్తే మరో శిక్ష, తల్లితో గాని, చెల్లితో గాని, గురుపత్నితో గాని శారీరక సంబంధం కలిగితే సలసల కాలే ఇనుప పాత్రలో పడి కాలిపోవాలి. అలాగే వివిధ పాపాలకు వివిధ రకాల ప్రాయశ్చిత్తాలు నిర్ణయించబడ్డాయి మన పురాణాలలో. మానవులకు వుండాల్సిన అత్యుత్తమ గుణం క్షమ. సర్వం ఈశ్వరమయం అని తెలుసుకొన్న మానవులు ఏది జరిగినా దానికి కారణం భగవంతుడని నమ్ముతారు.


ఒకవేళ చెడుఫలితాలు వస్తే అది పూర్వజన్మ పాపఫలితంగా కూడా భావిస్తుంటారు. ఆ చెడు ఫలితానికి కారకులు తెలుసుకొని వారిని శిక్షించకపోవడమనేది మాత్రం సజ్జనుల లక్షణం. చెడుఫలితాలకు కారకులైన వారిని క్షమించడమనేది మరింత మంచిలక్షణం. ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన మానవజన్మను సార్థకం చేసుకోవడానికి ఈ కక్షలు, కార్పణ్యాల జోలికి వెళ్లకూడదు. పాపమైనా పుణ్యమైనా అదంతా చేస్తున్నది భగవంతుడే తాను నిమిత్తమాత్రుడనని అనుకొని కేవలం పుణ్య కార్యాలు మాత్రమే చేసినట్లయతే జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. ఈ విషయాన్ని నీ మనస్సులో సంక్షిప్తం చేసుకో.


అదలావుంచితే ఈ విషప్రయోగానికి ఒడిగట్టిందెవరో తెలుసుకునేందుకు నా శిష్యప్రశిష్యులు ధృఢనిశ్చయంతో వున్నారు. త్వరలోనే అది చేసింది నువ్వేనని వారికి తెలిసిపోతుంది. అప్పుడు నిన్ను ప్రాణాలతో వదలరు. నేను కూడా వారిని నియంత్రించలేకపోవచ్చు. కాబట్టి నువ్వు ఈ ధనం తీసుకొని తక్షణం ఈ ప్రాంతం విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో.


నిన్ను పంపించిన ఆ రాజు దగ్గరకు కూడా వెళ్ళడం క్షేమకరం కాదు. ఎందుకంటే ఈ నిజం ఎప్పటికైనా నీ నుండి బయటపడుతుందన్న భయంతో అతను నిన్ను కూడా ప్రాణాలతో వదలకపోవచ్చు. ఎక్కడ వున్నా నువ్వు, నీ కుటుంబం చల్లగా, పదికాలాలపాటు, ఆయు: అష్టైశ్వార్యాలతో సుఖంగా వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను" అని దీవిస్తూ కరటయ్య చేతిలో ధనం వున్న ఒక సంచీని వుంచారు.


విద్యానందుల మాటలతో కరటయ్య కు జ్ఞానోదయమయ్యింది. గురువుగారి క్షమాగుణానికి అచ్చెరువొందాడు. తానెంత ఘాతుకానికి ఒడికట్టింది, అందుకు తనకెంత పాపం సంక్రమించబోతోందో అర్ధమయ్యాక శరీరం పశ్చాత్తాపంతో ఆపాదమస్తకం కంపించసాగింది. "నన్ను క్షమించండి గురువర్యా" అని పెద్దగా రోదిస్తూ విద్యానందుల పాదాలను పట్టుకొని తన కన్నీళ్ళతో అభిషేకించాడు.

ముగింపు:


ఆ రాత్రికే విద్యానందుల వారు శివైక్యం చెందారు. విషయం తెలిసిన కరటయ్యకు కాళ్లు చేతులు ఆడలేదు. అంతటి గొప్ప గురువును, జ్ఞాన వేత్తను నిలువునా బలిదీసుకున్న తన దుశ్చర్యకు పశ్చాత్తాపం చెందుతూ అందుకు పరిహారంగా విషం మింగి ప్రాణాలు తీసుకున్నాడు.

***


Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.




258 views0 comments
bottom of page