జ్ఞాపకాలు
- T. V. L. Gayathri

- 2 days ago
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #జ్ఞాపకాలు, #మంచి మాట

గాయత్రి గారి కవితలు పార్ట్ 53
Jnapakalu - Gayathri Gari Kavithalu Part 53 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 29/12/2025
జ్ఞాపకాలు - గాయత్రి గారి కవితలు పార్ట్ 53 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
జ్ఞాపకాలు
(వచన కవిత)
**********************************
జ్ఞాపకములే నిలుచును శాశ్వతముగా.
జ్ఞాపకములే గాయములై బాధించుగా.
జ్ఞాపకములే విషమయి వేధించుగా.
జ్ఞాపకములే చేదుగా వెంటచరించుగా.
జ్ఞాపకాలను తలచినచో దుఃఖమేగా.
జ్ఞాపకాలతో ముందుకు సాగలేవా?
గతమునందు సంతోష ప్రభలులేవా?
గతమును బరువుగ మోసిన ఫలితమా?
ఓటమి మనకు బోధించు నొక పాఠము.
ఓటమి విజయము నందించు సాధనము.
సంతసముగా శోచింప సగము బలము.
చింతలో మునిగిన చీకటగుట సత్యము.
కష్ట సుఖముల నెంచి కుమిలిన దుఃఖము.
నష్టమును తలచుటే తెలివితక్కువతనము.
చేదు జ్ఞాపకాలనక్కడే వదలితే ప్రమోదము.
నాది నాదను తలపును వీడితే నీకు శుభము.
పదుగురికి తోడుగా చరించితే విజయము.
మదిలోని బాధంతా క్షణంలో మాయము.//
************************************

మంచి మాట
(తేటగీతి మాలిక)
************************************
మాట కత్తి విధము పరిమార్ఛ గలదు.
చింత లోన జీవితములు ఛిద్రమగును.
మాట ములుకు చందంబుగ మదిని గ్రుచ్చు.
తేనె వంటి మాటల మాయ తెలియ దకట!
గోముఖవ్యాఘ్రము లగచు కూళలెపుడు
తీయ తీయగ విషయాలు తెలుపుచుండి
మాయ లోబడవేయుచు మాట కలిపి
తీయు చుందురు ప్రాణముల్ తెలివి తోడ.
జాగు రూకత తోమెల్గి జనులు సతము
దుష్ట తతిని వీడిన చాలు! తొలగు బాధ!
బంధు మిత్రుల వక్రమౌ భాషణముల
వినుట మానుము! మానవా! విబుధ గతిని
సాధు మార్గమందున నీవు సాగిపొమ్ము!
భావమున్ వ్యక్త పరచు సంభాషణ యన
దైవ మా మాటలో నిల్చి ధరను నడుపు!
మంచి పల్కులన్ బల్కుచు మాట నిలిపి
సత్య వంతుడవై నీవు చనుము నరుడ!
జ్ఞాన సముపార్జనన్ జేసి జయము పొందు!
పొదుపుగా మాట లాడిన పొలయు సుఖము.
మౌనమున్ శక్తిగా తల్చి మానితముగ
కలత విడనాడి విజయుడా! కదలి పొమ్ము! //
**********************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments