'Kalathala Keratalu' New Telugu Story
Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
హఠాత్తుగా ఉరుములేని పిడుగులా వస్తూనే “ అత్తా అంటూ" తనని హత్తుకుపోయిన వీణాధరిని చూస్తూనే ఆశ్చర్యపోయింది నీలవేణి.
“ఏమిటీ.. డాక్టర్ వీణాధరే.. ఇలా చెప్పా పెట్టకుండా ఈ అత్తను చూడాలని వచ్చింది?” బుగ్గల మీద చేయి వేసుకుంటూ, ఆశ్చర్యంగా చూస్తూ “ ఏడీ డాక్టర్ వంశీకృష్ణ” అంటూ వీణాధరి వెనుకనే ఉన్నాడేమోననుకుంటూ వెతకసాగింది నీలవేణి.
“లేదు అత్తా, నేను ఒక్కర్తినే వచ్చాను. ఏం.. వంశీ రాకపోతే నన్ను లోపలికి రానీయవా, వెళ్లిపోనా అయితే?” అంటూ వెనుతిరగబోయింది అత్తను ఏడిపించాలని.
'పిచ్చి పిల్లా' అంటూ వీణాధరి ని ఆప్యాయంగా హత్తుకుని సూట్ కేస్ అందుకోబోయింది.
మేనత్త ఆప్యాయతకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. సూట్ కేస్ తో అత్త వెనుకే లోపలకి నడిచింది..
పూజగదిలోనుండి వినిపిస్తున్న ఎమ్.. ఎస్.. సుబ్బలక్ష్మి విష్ణుసహస్రనామాలు మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి. అత్త ఇంటికి వస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుందెప్పుడూ. కానీ ఈ మధ్య అత్త ఇంటికి వచ్చి చాలా రోజులే అయింది.
ఈ లోపుల మామయ్య లోపలనుండి వస్తూనే " ఏమ్మా వీణా ఎలా ఉన్నావు? వంశీ రాలేదా?” అని అడిగాడు.
“రాలేదు మామయ్యా” అంటూ బాత్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చింది. అత్త వంటింట్లో హడావుడిగా వంట చేస్తూనే, మేనకోడలికు వేడి వేడి కాఫీ కప్పులో పోసి అందించింది..
వీణ అత్తను పరికించి చూసింది.. చామనచాయరంగులో, ఒకమోస్తరు ఎత్తులో, నిరంతరం పెదవులమీద నర్తించే అందమైన చిరునవ్వు తో ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉండడమే కాదు, ఎటువంటి సమస్యనైనా అవలీలగా ఎదురుకొనే ఆత్మస్తైర్యం తో అందరినీ ఆకట్టుకుంటుంది..
ఎమ్.. ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి పెళ్లికి ముందు కొద్దికాలం లెక్చరర్ గా పనిచేసింది.. అనర్గళన ఇంగ్లీషు మాట్లాడడమే కాదు, సొసైటీ లో స్త్రీలు ఎదుర్కొనే అనేక సమస్యలు గురించి, ఉద్యోగినులు ఆఫీసులలో ఫేస్ చేసే చెప్పుకోలేని పరిస్తితులను చక్కటి ఆర్టికల్స్ గా వ్రాసి రీడర్స్ డైజస్ట్, ఉమెన్ మేగజైన్స్ లాంటి వాటికి పంపిస్తూ ఉంటుంది. పైకి సాదాసీదాగా కనిపించే అత్త ఇంత చేస్తున్నా తన గరించి గొప్పగా ఎవరికీ చెప్పుకోదు. అందుకే అత్త అంటే తనకు ఆరాధన, గౌరవం.
పెళ్లితరువాత ఉమ్మడి కుటుంబం బాధ్యతలు, ఆ తరువాత తన పిల్లల బాధ్యతలను నిర్వర్తించడంలో తన ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తిగా కుటుంబ బాధ్యతలలో మునిగిపోయి తన కూతుళ్లిద్దరనూ బాగా చదివించి చక్కని సంబంధాలు తెచ్చి పెళ్లిచేసింది..
నీలత్త గురించి ఆలోచిస్తూనే అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గరనున్న కుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేయసాగింది..
నా అనుకునే ఒక మనిషి సమక్షం ఎంతో సెక్యూరిటీని ఇస్తున్నట్లుగా భావన కలుగుతోంది.. వీణాధరి కి గత కొద్దినెలలుగా తన వైవాహిక జీవితంలో చోటుచేసుకుంటున్న కలతలు గుర్తొచ్చి మనసు భారమైపోయింది..
ఇంతసేపైనా తన రాకకి కారణాన్ని ఆరాతీయని నీలత్త వ్యక్తిత్వం ఎంతగొప్పది..
" ఏమిటే వీణా ఆ మూగనోము? నేను మాట్లాడుతున్నా పరాకుగా ఉన్నావు?”
“నీ గురించే ఆలోచిస్తున్నాను. మా నీలత్త అలాగే ఉంది, ఏ మార్పూ లేదని.. అవునూ, ఎప్పుడూ అలా నవ్వుతూ ఎలా ఉంటావు అత్తా?”
“నేను నవ్వుతూ ఉండడం కాదే వీణా. నా ముఖాన్ని దేవుడు నేను పుడుతూనే అలా పెదాలను సాగతీసి మరీ తయారుచేసాడు. కొందరిని చూడు, పెదాలు బిగతీసుకుని ఉంటారు. వాళ్లు కోపంగా ఉంటారని కాదు. భగవంతుని చేతిలో వాళ్లు అలా మలచబడ్డారు. నాకూ చాలా కోపం వస్తుంది అప్పుడప్పుడు మీ మామయ్య మాటలకు. కానీ నా ముఖం చూస్తే, నాకేమీ కోపంలేదనుకుంటారు. నాకు పెదాలు బిగపెట్టుకుని అలుకబూనాలని అనుకున్నా నాకా యోగం లే”దంటూ ఫక్కున నవ్వేసింది.
" అబ్బ, నీ సెన్సాఫ్ హ్యూమర్ కి జోహార్లు అత్తా!”
“చాల్లే.. నీవు నన్ను మెచ్చుకోనిదెప్పుడు? మునగ చెట్టు ఎక్కించేస్తావు కదా! ఆ.. ఇంతకీ మీ ఇద్దరి ప్రాక్టీస్ ఎలా ఉంది వీణా?”
“ఇంకా సంవత్సరమేగాఅయింది.. ప్రాక్టీసు మొదలుపెట్టి.నాలుగు సంవత్సరాలు కార్పొరేట్ హాస్పటల్ లో పనిచేసాం.. బయటకు వచ్చి సొంతంగా ప్రాక్టీసు పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాం. దానివల్ల కష్టాలు ఉన్నాయి, సుఖాలూ ఉన్నాయి.. దేనికైనా కష్టపడాలి అత్తా.. పేషెంట్స్ కి మా మీద విశ్వాసం కలిగేవరకూ ఓపికగా పనిచేయాలి. సొంతంగా ఒక హాస్పటల్ కట్టుకోవాలన్న ఆలోచనైతే ఉందిగానీ, ఎప్పటికి తీరేనో ఆ కోరిక.”
“అవునూ.. వంశీ ఏదో స్పెషలైజేషన్ కోర్సు చేసే నిమిత్తం యూకె వెడతాడని చెప్పావు ఆ మధ్య ఫోన్ లో..”
వీణ ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనం వహించింది..
వంశీ గుర్తొచ్చేసరికి మనసు భారంగా అయిపోయింది..
-----
ఎంతో ఆనందంగా సాగుతున్న సంసారం.. బరువులూ బాధ్యతలూ లేవు.. ఒకే మెడికల్ కాలేజ్ లో చదివిన వంశీ తానూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయి అయిదారు సంవత్సరాలు కావస్తున్నా, ఏ పొరపొచ్చాలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కానీ కొద్దినెలలుగా వంశీ ప్రవర్తనలో ఏదో మార్పు ద్యోకతమవుతోంది.. తనకు తెలిసిన వంశీ కాదనేలా. అతన్ని అర్ధం చేసుకోడానికి ఎంత ప్రయత్నించినా తనవల్ల కావడంలేదు..
నాలుగు నెలల క్రితం వంశీ మేనమామ కూతురు స్మిత హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చిందని, ‘వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో ఎకామ్ డేషన్ దొరికే వరకూ మీ దగ్గరే ఉంటుంది వంశీ’ అంటూ ఆయన ముంబాయి నుండి ఫోన్ చేసి చెప్పేసరికి సరేనంటూ స్మితని తమింట్లో పెట్టుకున్నారు..
ముంబైలో పుట్టి పెరిగిన స్మిత చాలా ఫాస్ట్. గలా మాట్లాడుతూ ఊపిరి సలుపుకోనివ్వదు.. ఆ అమ్మాయి డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్ ప్రవోకింగ్ గా అనిపిస్తాయి.. ఆ హెయిర్ స్టైల్ కూడా తమాషాగా ఉంటుంది.. కళ్లమీద పడుతున్న జుట్టుని కొనవేళ్లతో సుతారంగా వెనక్కితోసుకుంటూ.. మోడలింగ్ చేయాలనుకునే తనకోరిక తన తండ్రి కాదన్నాడని ఇష్టంలేకపోయినా కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ తీసుకోవలసి వచ్చిందని చెపుతుంది..
వంశీ తో ఆమె అతిచనువు తనకు చిరాకు పుట్టిస్తోంది.. వంశీ మీద దాదాపు పడిపోతూ మాట్లాడడం, సోఫాలో బావని అంటిపెట్టుకుంటూ భుజాలమీద వాలిపోతూ కూర్చోడం లాంటి చర్యలు చాలా ఎబ్బెట్టుగా అనిపించినా మేనమామ కూతురు కదా అని తను అంతగా పట్టించుకునేది కాదు.
సాయంత్రం ఆఫీసు కాగానే వంశీ కు ఫోన్ చేసి తనను పిక్ అప్ చేసుకోడానికి రమ్మనమనేది. వంశీ రాలేనని చెప్పేవాడు కాదు. ప్రాక్టీసు సమయం, పేషంట్స్ వస్తారన్న ఆలోచన కూడా లేకుండా వెంటనే వచ్చేస్తానంటూ కారుతీసుకుని వెళ్లిపోయేవాడు. రాత్రి ఏ ఎనిమిదో తొమ్మిదికో ఇద్దరూ ఒకరిచేతిలో మరొకరు చేయి కలుపుకుంటూ నవ్వుకుంటూ వచ్చేవారు. అతని దగ్గరకు వచ్చే పేషంట్స్ ను కూడా తానే అటెండ్ అవవలసిన పరిస్తితి వచ్చేది. వంశీ ను ఇది పధ్దతికాదంటూ ప్రాక్టీసు వేళల్లో తనకు చాలా కష్టం అయిపోతోందనేసరికి తనమీద విరుచుకు పడ్డాడు..
అప్పటినుండీ తనతో మౌనవ్రతం.. స్మితతో సినిమాలు, షికార్లు ఎక్కువైనాయి.. క్లినిక్ కు రావడం తగ్గిపోయింది.. ఏదైనా ప్రశ్నిస్తే గట్టిగా అరవడం, ప్రతీ దానికీ విసుక్కోవడం మొదలు పెట్టాడు.. ఇద్దరిమధ్యా దూరం పెరగడమే కాదు, అనురాగం హరించుకుపోయినట్లు అతనిపట్ల క్రమేపీ అయిష్టత చోటుచేసుకుంటోంది..
ఒకప్పుడు ఇతన్నేనా నేను అంతగా ఆరాధించాననుకునేది.. పెళ్లై అయిదు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదన్న బాధను అంతకముందు తామిద్దరూ పంచుకునేవారు.. తను మౌనంగా ఉంటే ఎందుకలా ఉన్నావు 'ధరీ'అంటూ ఆత్రంగా తన చుట్టూ తిరిగే వంశీ ఈమధ్య తనను అసలు పలకరించడమే మానేసాడు..
ఒంటరిగా అయిపోయినట్లు, తనకు ఎవరూ లేరన్న డిప్రెషన్ కు లోనౌతోంది.. ఏదో మార్పుకావాలని అనిపిస్తోంది.. స్మిత ను హాస్టల్ చూసి పంపించేయమని అడిగినందుకు కొట్టినంత పనిచేసాడు.. మామయ్య ఏమనుకుంటాడు, స్మిత మనలని ఎంత నీచంగా ఊహిస్తుందని తనమీద ఎగిరాడు..
అయినా తనలో కూడా అదివరకటి ఓపిక నశించింది.. అదివరకు వంశీ వచ్చేవరకు భోజనం చేసేది కాదు.. దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి తినిపించేది.. అతనిరాకకోసం ఎంతసేపైనా ఎదురు చూసేది.. ఇప్పుడు అతను కాఫీ కావాలని అడిగినా తనకు సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తోంది..
స్మిత తండ్రి అర్జంట్ గా కూతురిని రమ్మనమని పిలిచేసరికి తను ముంబై వెళ్లింది..
తను వెళ్లాక కూడా తామిద్దరే ఇంట్లో ఉన్నాకూడా ఇద్దరి మధ్యా మౌనం రాజ్యమేలుతోంది.. తను అతన్ని చేరువ అవడానికి ప్రయత్నం చేయడంలేదు.. రెండురోజుల క్రితం రాత్రి పదకొండుగంటలకు ఇంటికొచ్చాడు.. కోపం అణచుకుని భోజనం వడ్డించబోతే స్నేహితులతో పార్టీ అయింది, తినేశానంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు..
ఎడతెగని దుఃఖాశృవులు దిండులోకి ఇంకిపోతుంటే తెల్లవారింది.. అప్పటికే లేచి తయారయి ఒక్కమాటకూడా మాట్లాడకుండా క్లినిక్ కు తయారౌతున్న అతనితో 'ఇలా ఇద్దరం ఒకరికొకరికి ఏమీ సంబంధం లేనట్లు ఉండడంలో అర్ధం లేదనిపిస్తోంది. నేను కొన్నాళ్లు మా నీలత్త దగ్గరకు చెన్నై వెడతా’నని చెప్పేసరికి సాయంత్రం వస్తూనే మర్నాటికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసానని, మెయిల్ చెక్ చేసుకోమ్మని చెప్పాడు..
ఏడుపు వచ్చింది.. వెడతాననగానే ఎందుకనకుండా వెళ్లమన్నందుకు.. మళ్లీ ఎప్పుడు వస్తావన్న ప్రశ్న లేదు.. ఒకలాంటి అభిమానం, రోషం చోటుచేసుకున్నాయి.. చిన్నప్పటినుండీ నీలత్త దగ్గర తనకు చనువెక్కువ.. తన కూతుళ్లతో సమానంగా చూసేది.. అమ్మ ఆరోగ్యం సరిగా లేదని అత్త తనను తన దగ్గరే ఉంచుకుని చదివించింది.. అమ్మ చనిపోతే తను ఏడుస్తుంటే తనని గుండెల్లో పెట్టుకుంటూ, ‘నేను నీకు లేనా వీణమ్మా, నేనే నీకు అమ్మ’నంటూ తనను ఎంతగానో ఓదార్చింది..
అటువంటి అత్తకు తన సమస్యను చెప్పుకుని సలహా అడగాలనుకుంటూ వచ్చింది..
తను ఆలోచనలో ఉండగా అత్త వంట అయిందని భోజనానికి రమ్మనమని పిలిచింది..
తనకూ నాకూ వడ్డించింది.. ‘మామయ్య తినరా’ అని అడిగేసరికి ‘ఆయన ఎప్పుడూ అంతే కదా వీణా, మరచిపోయావా’ అంటూ నవ్వింది.
మామయ్య భోజనం చేసాకనే ఆడవాళ్లు తినాలంటారు.. పొద్దుటే స్నానం చేసి ఆయన పూజ చేసుకోడానికి పూజ గదిలో అన్నీ సిధ్దం చేయాలి. భోజనం విషయంలో అసలు కాంప్రొమైజ్ అవడు. దగ్గరుండి వడ్డించాలి. భోజనం దగ్గర పొరపాటున మంచినీళ్ల గ్లాస్ పెట్టడం మరచిపోతే ఆడది ఎంత బాగా సంసారం చేస్తోందో ఈ ఒక్క విషయాన్ని చూసి అంచనా వేయచ్చంటాడు. వంట సరిగా లేకపోతే ఇదేమి వంటా, నీ ముఖంలా ఉందంటూ ఠపీమవి అనేస్తాడు, నలుగురి ముందూ కూడా. అయినా అత్త చిరునవ్వుతో సహనం వహిస్తూ,
‘సారీ, వంకాయ కూర లో కూరకారం సరిపోలేదనుకుంటా’ననో, ‘ఇంకాస్త వేగీ ఉండాల్సిం’దనో, లేకపోతే ‘తోటకూర పులుసులో ఆవ పెడ్దామనుకుంటూ బధ్దకించా’ననో, ‘ఈ సారి బాగా చేసిపెడ్తాను, సరేనా’ అంటు నచ్చ చెప్పే తీరుకి, నీలత్త ఎందుకు తనలో తప్పులేకపోయినా మామయ్యకు అలా నచ్చచెపుతూ అన్నీ భరిస్తుందని ఆశ్చర్య పోతూ ఉంటుంది తాను..
వంశీకి పొద్దుటే కాఫీ వేడిగా స్ట్రాంగ్ గా ఉండాలి. కాస్త వేడి తక్కువగా ఉంటే కాస్త వేడి చేసి ఇవ్వవూ అని అడిగితే అబ్బ మళ్లీనా, నీవే చేసుకో ఆపనంటూ పట్టించుకోదు.
“అత్తా, మామయ్య అలా నిన్ను అంటూంటే ఎందుకు భరిస్తా”వని అడిగితే, “సంసారంలో ఆ మాత్రం సరిగమలు లేకపోతే ధ్రిల్ ఏముంటుందే వీణా” అంటుంది. “మామయ్య అలా అనకపోతే నాకే తోచ”దంటూ నవ్వుతుంది. “ఏ భర్తైనా తన భార్య కాస్త తగ్గి ఉండాలని, తనకి గౌరవం ఇవ్వాలని మనసులో కోరుకుంటాడే వీణా, అది వాళ్ల సైకాలజీ” అంటుంది.
ఆరోజు రాత్రి అత్తా తనూ పక్క పక్కనే పడుకున్నారు.. వీణాధరికి వంశీ ప్రవర్తన గుర్తొచ్చి అత్త గుండెల్లోకి దూరి వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది.
ఆవిడ ప్రేమగా వీణ వెన్నుమీద రాస్తూ " మీ ఇద్దరి మధ్యా ఏదో జరిగి ఉండచ్చని ఊహించానే తల్లీ.. వచ్చినప్పటినుండి చూస్తున్నాను.. అదివరకటి వీణ లా లేవు.. నీవే చెపుతావని ఊరుకున్నాను.. ఏమైందిరా? నీ సమస్యేమిటో చెపితే పరిష్కరించగలనేమో, చెప్పు వీణా?” అంది
దుంఖంతో వివశరాలౌతూ తనకూ వంశీకు మధ్యా ఏర్పడిన దూరాన్ని తాను అనుభవిస్తున్న మానసిక క్షోభనూ చెప్పింది..
పెళ్లికాని పిల్ల తో అలా చనువుగా తిరగడం బాగుండదని, నలుగురూ నాలుగువిధాలు అనుకుంటే నీకేమీ కాకపోయినా రేపు స్మిత కే ఇబ్బంది కలగచ్చంటే అంత చదువుకున్న ‘నీలో సంస్కారం ఇదేనా? మామయ్య కూతురని చనువుగా ఉంటే విపరీర్ధాలు తీస్తావా’ అంటూ నా మీద ఎగిరిపడ్డాడు..
ప్రాక్టీసు మీద శ్రధ్ద పెట్టడంలేదు స్మిత వచ్చినప్పటినుండీ. యూ. కె వెళ్లాలంటే ఎంట్రన్స్ టెస్ట్ కి ప్రిపేర్ అవ్వాలి. మేమిద్దరం కాలేజ్ లో ప్రేమించుకుంటున్న రోజుల్లో ఏ ఆదివారమైనా పిక్చర్ కి వెడదామా వంశీ అని అడిగితే, టైమ్ వేస్ట్, చదవాలసినది బోల్డంత ఉంది, రాననేవాడు.
అదే విషయాన్ని గుర్తు చేస్తే ‘ప్రతీదీ భూతద్దంలోనుండి చూస్తావేమిటీ, మీన్ మెంటాల్టీ కాకపోతే’ అంటూ నన్ను చిన్నబుచ్చడం బాగుందా నీలత్తా?”
“అటువంటప్పుడే అతని భార్యగా నీలోనూ సహనం ఉండాలంటాను.. నీవేదేదో ఊహించేసుకుంటూ ఆ ఆవేశంలో అతన్ని నిలదీసి ఎక్స్ ప్లెనేషన్ అడిగితే అహంతో అతను చెలరేగిపోయి నీమీద విరుచుకు పడ్తాడు.. నీకు దూరంగా తను ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు.. అతని ప్రవర్తనను చేష్టలనూ పట్టించుకోకుండా అతని మనస్తత్వానికి తగ్గట్లుగా హోమ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ అసలేమీ జరగనట్లు సరదాగా జోక్స్ చెపుతూ ఎంటర్ టైన్ చేయి.. స్మిత ప్రవర్తనను నువ్వు పట్టించుకోనట్లుగా మామూలుగా ఉండు. ఆమేదో క్షమించరాని నేరం చేస్తోందని ఆమెను దూరంగా పెట్టేస్తుండడంతో ఆమెతో మాట్లాడేవాళ్లు లేరని వంశీ తో మరింత క్లోజ్ గా ఉంటుంది. ‘అతను ప్రవర్తించినట్లు నేనూ ప్రవర్తిస్తే’ అన్నావు చూడు, అటువంటి ఆలోచనా సరళి మంచిది కాదు. జెండర్ ని డిస్క్రిమినేట్ చేస్తున్నావు.. వారిద్దరి మధ్య ఉన్నచనువుకి నీవే నీరుపోస్తూ మరింత ఏపుగా పెరిగేలే చూడకు వీణా. అతన్ని ఎలా టాకిల్ చేయగలనా అని ఇంటలెక్ట్యువల్ గా ఆలోచించు.. సమస్యను పెద్దది చేసుకుంటూ పచ్చని నీ సంసారంలో సుఖశాంతులను దూరం చేసుకోకు..
ఏం నా మాటలు బాగాలేవా ? ఏమిటీ అత్త నన్నే అంటోంది, వంశీ ని ఏమీ అనకుండా నాదే తప్పు అనేట్లుగా మాట్లాడుతోంది అని అనుకుంటున్నావా?”
వీణాధరి నుండి ఏ సమాధానం లేదు..
"పోనీ వంశీ నుండి విడిపోయి ఇండిపెండెంట్ గా బ్రతకగలవా” ఏ సమాధానం చెప్తుందా అన్న ఉత్సుకతో ప్రశ్నించింది..
“వంశీ ప్రవర్తన భరించడానికి ఎంత బాధాకరంగా ఉన్నా అతన్నించి విడిపోవాలని అనుకోవడంలేదు అత్తా”
"గుడ్! చూసావా.. అతనిపట్ల నీకు ప్రేమ ఉంది. అతనితో గడిపిన వైవాహిక జీవితంలోని ఎన్నో మధురానుభూతులు నీ మనసుని అంటి పెట్టుకుని ఉన్నాయి.. అటువంటప్పుడు మానసికంగా అతనికి చేరువ అవడానికి ప్రయత్నించు.. అతనిమీద కన్ సర్న్ చూపించు.. నీమీదే ఆధారపడ్డట్లు చేసుకో.. భార్యాభర్తల మధ్య కలహాలు నీటిలో కెరటాలాంటివి. అవి అలా వచ్చి ఇలా పోతుంటాయి.
చాలా ప్రొద్దుపోయింది.. ఇంక పడుకో. రేపు మాట్లాడుకుందాం” అంటూ తన మాటలను ఆపేసింది, వీణకు ఆలోచించుకునే వ్యవధి ఇవ్వాలని..
పక్షుల కిల కిల రావాలతో తెల్లవారింది.. వీణ మనస్సు ఎందుకో తేలికగా హుషారుగా ఉంది.. నీలత్త మాటలు ఆమె మీద ఎంతో ప్రభావాన్ని చూపాయి..
అత్త అందించిన వేడి వేడి కాఫీ త్రాగుతుండగా మొబైల్ రింగైంది.. తను చెన్నై చేరాక వంశీ కి కనీసం ఫోన్ కూడా చేయలేదు.. అతని నుండే ఫోన్..
"ఏమిటీ డాక్టర్ వీణాధ..రి ఇక్కడ హాస్పటల్ ని, పేషంట్స్ ని మరచిపోయి అక్కడే అతుక్కుపోయింది? ఈ పేషెంట్ కూడా నీరాక కోసం ఎదురుచూస్తున్నాడు తెలుసా?
నిజం ధరీ, నాకు చాలా బోర్ గా ఉంది. నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేననిపిస్తోంది”.
"అన్నీ అబధ్దాలే, అయినా నీకు బోరేమిటి? స్మిత లాంటి అమ్మాయి పక్కనుండగా!”
“యూ సిల్లీ, నన్ను ఇంక టార్గెట్ చేయకు తల్లీ, ఏదో ఇన్ ఫేట్యుయేషన్ అనుకో. దానికీ నాకు పదేళ్ల వయస్సు తేడా. చిన్నప్పుడు దాన్ని ఎత్తుకుని తిరిగాను కూడా.
నాకే చాలా గిల్టీగా ఉంది.. ఐయామ్ సారీ ధరీ, నిన్ను నా ప్రవర్తనతో బాధపెట్టాను కదూ?”
“కాదా మరి ? నిజంగా బాధపెట్టావు.. అత్త నన్ను ఇక్కడే హాస్పటల్ లో జాబ్ చూసుకోమంది.. నిన్ననే ఆన్ లైన్ లో అప్లైచేసాను.. రెండురోజుల్లో ఇంటర్వ్యూ కూడా..”
"ఏయ్ రాక్షసీ! ఆపని చేయకు. స్మిత కు అమెరికా సంబంధం వచ్చిందిట.. వచ్చేనెలలో దాని పెళ్లని, అది ఇంక హైద్రాబాద్ రాదని మామయ్య ఫోన్ చేసాడు.. మనిద్దరినీ పెళ్లికి వారంరోజులముందే ముంబై వచ్చేయమన్నాడు..
నీకు సాయంత్రం ఫ్లైట్ కి బుక్ చేసాను.. ఎయిర్ పోర్ట్ కి వస్తాను. బై ధరీ” అంటూ ఫోన్ పెట్టేసాడు.
వీణాధరి మనసు గాలికంటే వేగంగా అతన్ని చేరుకోవాలని ఆత్రుత పడుతోంది..
అత్తతో చెప్పింది. అత్త ముఖంలో దరహాసరేఖలు.
వీణను దగ్గరకు తీసుకుంటూ నుదుటిమీద ముద్దు పెట్టుకుంది.. “నీ పురుడు పోయడానికి త్వరలో నన్ను పిలిపించుకోవే తల్లీ” అంటూ సాగనంపింది..
ఆరు నెలల తరువాత ఫోను లో విషయం విన్న నీలవేణి సంతోషంతో మురిసిపోతోంది.
“అత్తా, నీవు నానమ్మవి అవబోతున్నావు. నా డెలివరీ కి తప్పకుండా రావాలి. ఎప్పుడు రావాలో చెపుతాను. అన్నట్లు నా డెలివరీ అయ్యాక వంశీ పై చదువులకోసం యూ. కె. వెళ్లబోతున్నాడు. ఇదంతా నీ చలవే నీలత్తా!”
'నీ ముఖం, నా చలవేమిటి? తెలివిగా సంసారాన్ని చక్క దిద్దుకున్నావు. ఆరోగ్యం జాగ్రత్త.. అయినా డాక్టరమ్మకి నేను చెప్పాలా?”
“నిజానికి అసలు సిసలైన డాక్టరువి నీవే నీలత్తా. మనుషుల బలహీన మనసులకు శస్త్రచికిత్స చేసి వారి మనసులను దృఢంగా నిబ్బరంగా ఉంచుతావు.. హేట్సాఫ్ టూయూ!”
" అబ్బ.. మరీ అంతగా మునగ చెట్టు ఎక్కించేయకు. ఇక్కడ మీ మామయ్య కంది పచ్చడి లో మరింత జీలకర్ర పడాలంటూ విసుక్కుంటున్నారు. ఈసారి చేసేటప్పుడు అలాగే వేస్తానని నచ్చచెపితే మొత్తానికి తిన్నాననిపించారు.”
"నీవు అంతే నీలత్తా, మామయ్యని సంతోష పెట్టాలనే చూస్తావుగానీ, 'నో' అని చెప్పవు. నీవే మాలాంటి వారికి స్పూర్తి” అంటూ 'బై' చెపుతూ ఫోన్ పెట్టేసింది.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments