top of page

కళ్యాణ యోగం


'Kalyana Yogam' - New Telugu Story Written By Padmavathi Divakarla

'కళ్యాణ యోగం' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఇంటి బయట నిలబడిన పరమేశ్వర శాస్త్రి చూస్తూనే, "రండి శాస్త్రులుగారూ! రండి, మీ కోసమే ఎదురు చూస్తున్నాను!" అన్నాడు ఇంటి వసారాలో నిలబడిన భూషణరావు తన కోరమీసాలు దువ్వుకుంటూ.


అతని వైపు చూసి మందహాసం చేసాడు పరమేశ్వర శాస్త్రి. ఆ ఊరేకాక, చుట్టుపక్కల ఉన్న ఓ పాతిక ఊళ్ళకి పరమేశ్వర శాస్త్రి ఒక్కడే పురోహితుడు. పెద్ద పండితుడు, ఘనాపాటి అయినా నిగర్వి, మంచివాడు అని పేరు పొందాడు. జ్యోతిషంలో అతని పాండిత్యం తిరుగు లేనిది. పెళ్ళిళ్ళకి, గృహప్రవేశంలాంటి శుభకార్యాలన్నిటికి అతను ముహూర్తం పెడితే ఇంక తిరుగు లేనట్లే! అతని వాక్కు అంటే చాలా గురి అక్కడివాళ్ళకి.


భూషణరావు వెనకే ఇంట్లోకి ప్రవేశించాడు పరమేశ్వర శాస్త్రి. సోఫాలో కూర్చొని నలువేపులా కలియ చూసాడు. చాలా విశాలమైన హాలు. ఖరీదైన తైలవర్ణ చిత్రాలు గోడని అలంకరించాయి. నీలం రంగు పలుచటి పరదాలు గుమ్మాలకి వేలాడుతున్నాయి. హాల్లో మెత్తని తివాసీ కాళ్ళకు తగులుతోంది. హాలంతా చాలా ఖరీదైన వస్తువులతో అలంకరించబడింది. అణువణువునా ఐశ్వైర్యం తొణికిసలాడుతోంది. కోట్లకి పడగలెత్తిన భూషణరావుకి ఎంత ఆస్తి ఉందో అతనికే తెలియదు. దగ్గర ఉన్న పట్టణంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్త కూడా. ఈ మధ్యే రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చురుగ్గా పావులు కదుపుతున్నాడు.


సోఫాలో కూర్చొని స్థిమితపడ్డాక, "చెప్పండి! నన్ను పిలిపించారు కదా, నా ద్వారా ఏమైనా కావలసిన కార్యం ఉందా? ఏదైనా కొత్త వ్యాపారంలోకి దిగబోతున్నారా, అందుకు ముహూర్తమేమైనా పెట్టాలా? రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముహూర్తం పెట్టాలా లేక, అబ్బాయి పెళ్ళి చూపులకేమైనా తిథి చూడాలా?" అని గుక్కు తిప్పుకోకుండా చెప్పి అక్కడ టీపాయి పైన తన కోసం ఉంచిన మంచి నీళ్ళు తాగి, ఊపిరి తీసుకోవడానికి ఆగాడు.


అతని మాటలు విని పగలబడి నవ్వాడు భూషణరావు. అతను నవ్వుతూంటే పెద్దపులి గర్జించినట్లనిపించింది పరమేశ్వర శాస్త్రికి. "శాస్త్రులుగారూ, చూస్తూంటే ఒకేసారి అన్ని శుభకార్యాలకి హోల్సేల్లో ముహూర్తాలు పెట్టేసాలాగున్నారే! మిమ్మల్ని పిలిచింది అందుకు కాదు, ఈ మధ్య మా అబ్బాయి అభిజిత్ ఓ అమ్మాయి వెనక తిరుగుతున్నాడు. అది తెలిసి నిలదీసేసరికి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకుంటాను అని కుండబద్దలు కొట్టినట్లు నా మొహం మీదే చెప్పాడు. అదీ సంగతి!..." అని కొద్దిసేపు ఆగి మీసాలు దువ్వుకున్నాడు భూషణరావు.


"ఓహో అలాగా! అయితే పెళ్ళి చూపులకు ఓ ముహూర్తం నిర్ణయించి, ఆనక పెళ్ళి ముహూర్తం కూడా పెట్టాలి అంతే కదా! అబ్బాయి, అమ్మాయి జాతకాలు ఇస్తే త్వరలో మంచి ముహూర్తం నిర్ణయించి ఇస్తాను." అన్నాడు పరమేశ్వర శాస్త్రి తనను పిలిపించిన విషయం గ్రహించినట్లు.


ఒక్కసారి భూషణరావు మొహం ఎర్రగా మారింది. "అది కాదు పంతులుగారూ!...ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు. మేనమామ ఇంట్లో ఉండి చదువుకొని ఉద్యోగం చేస్తోంది. మా వాడేమో అమెరికాలో ఎంబియే పూర్తి చేసి ఇప్పుడిప్పుడే నా కంపెనీల వ్యవహారాలు చూస్తున్నాడు. ఆ అమ్మాయి గతిలేక మా కంపెనీలోనే ఏదో చిన్న ఉద్యోగం చేస్తోంది. ఆమె మేనమామ కూడా పెద్ద కలిగిన వాడు కాదు, కట్నాలు కానుకలు కూడా ఇచ్చుకొనే స్థోమత లేదు సరికదా, మా స్థాయికి ఏ మాత్రం తగరు. పెళ్ళి ఖర్చులు కూడా పెట్టుకొనే స్థోమత ఉంటుందనుకోను.


మా వాడికి ఇప్పటికే నేను మా హోదాకి సరితూగే మంచి సంబంధం ఒకటి చూసి వాడితో మాటలు కదుపుతాననేసరికే ఈ బాంబు పేల్చాడు. అందుకే ఎలాగైనా వాడి మనసు మార్చాలి. జాతకాలు నప్పవని, ఇద్దరికి పెళ్ళి కుదురే ఘటన ఎట్టి పరిస్థితుల్లో లేదని మీ నోటంట చెప్పాలి. అలా కాదని పెళ్ళి చేసుకుంటే ఏవైనా విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అని నమ్మబలకాలి. నేను చెప్పిన మాటలు ఎలాగూ వినడు. బెదిరించినా లొంగడు. ఎంత అమెరికాలో చదివినా మా వాడికి జాతకాల పిచ్చి బాగా ఉందని మీకు కూడా తెలుసు. మీరంటే వాడికి మంచి గురి కూడా.


పైగా ఆ విషయం మీ నుండి తెలిస్తే మా వాడే కాక, ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ కూడా మరి పెళ్ళి ఊసు ఎత్తరని నా ఉద్దేశ్యం. జాతక రీత్యా దోషం ఉందని మీరు ఓ మాట చెప్తే చాలు! అదీ సంగతి! ఈ సాయం మీరు చేస్తే మీకు మంచి సంభావన కూడా ముడుతుంది." అన్నాడు భూషణరావు.


ఆ మాటలు వింటూ అతనికేసే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు పరమేశ్వర శాస్త్రి. ఒక్క క్షణం ఏం చేయాలో బోధపడలేదు. తన మాట వినకపోతే భూషణరావుకి కోపం వస్తుంది. ఎలాంటివారినైనా తన పద్ధతిలో లొంగదీసుకొనే భూషణరావు తలచుకుంటే ఏమైనా చెయ్యగలడు. ఇంకా నయం, కౄరమైన పద్ధతుల గురించి ఆలోచించకుండా సౌమ్యమైన ఉపాయమే ఎంచుకున్నాడు. అలాగని జాతకంలో లోపం లేకుండా తను అబద్ధం చెప్పలేడు. వృత్తిధర్మం పాటించకపోతే తన్ను తాను క్షమించుకోలేడు. అబద్ధం ఆడటానికి తన మనసాక్షి ఒప్పుకోదు. ఈ విషమ పరిస్థితిలో ఏం చేయాలా అని ఆలోచించసాగాడు.


భూషణరావు కొడుకు అభిజిత్ స్వభావరీత్యా తన తండ్రికి పూర్తిగా విరుద్ధం. మంచివాడు, అద్భుదయ భావాలు కలవాడు. విదేశాల్లో ఉండి కూడా ఏ దురలవాటూ అలవర్చుకోలేదు. అమెరికాలో చదువు పూర్తి చేసుకొని ఈ మధ్యే తిరిగి వచ్చాడు. బాధ్యతలు అందిపుచ్చుకొని ఈ మధ్యనే కంపెనీ వ్యవహారాలు చూడటం మొదలెట్టాడు. తమ పరిశ్రమల్లో పనిచేసే వారికోసం కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. వాళ్ళలో ఒకడిగా మారాడు. ఫలితంగా ఆ పరిశ్రమల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తులు పెరిగాయి.


కార్మికులకోసం ఎంత ఖర్చు పెట్టినా, బోనస్లు ఇచ్చినా కూడా కొడుకు కోసం భూషణరావు భరించాడు. ఎందుకంటే తన సంపద కూడా ఆ విధంగానే పెరుగుతోంది మరి. అయితే తమ వద్దే ఉద్యోగం చేస్తున్న అమృతని ప్రేమించడం, పెళ్ళి చేసుకోవాలనుకోవడం మాత్రం అసలు భరించలేక పోతున్నాడు. అందుకే పరమేశ్వర శాస్త్రిని పిలిపించి తను చెప్పవలసిందంతా చెప్పాడు. అది అభ్యర్థన కాదు ఆజ్ఞ అని పరమేశ్వర శాస్త్రికి తెలుసు, అందుకే అతని మనసు పరిపరివిధాల పోతోంది.


"ఏం శాస్త్రులుగారూ, మాట్లాడరు? రేపు ఆ అమ్మాయి అదే అమృత… మేనమామ, అత్త వస్తున్నారు. వాళ్ళ ఎదుట, మా అబ్బాయి ఎదుట జాతక రీత్యా ఈ సంబంధంలో దోషాలు ఉన్నాయి అని చెప్పాలి, సరేనా?" అని ఈసారి కాస్త గట్టిగానే అన్నాడు భూషణరావు.


సరేననక తప్పింది కాదు పరమేశ్వర శాస్త్రికి. తల ఆడించాడు ఆలోచనలతో సతమతమవుతూనే! ఎలా ఈ గండం నుండి బయటపడాలా అని ఆలోచిస్తూనే అక్కణ్ణుంచి కదిలాడు. ఆ మరుసటి రోజు చెప్పిన ప్రకారం భూషణరావు ఇంటికి వెళ్ళాడు పరమేశ్వర శాస్త్రి. ఒక సోఫాలో భూషణరావు కూర్చొని ఉంటే, మరో సోఫాలో ఓ దంపతులు కూర్చొని ఉండటం గమనించాడు అతను ఆ హాల్లోకి ప్రవేశించగానే. వాళ్ళు అమృత తరఫు పెళ్ళిపెద్దలని సులభంగానే అర్థమైందతనికి.


అక్కడే వాళ్ళకి దగ్గర ఇంకో కుర్చీలో కూర్చున్న భూషణరావు కొడుకు అభిజిత్ వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నవాడల్లా పరమేశ్వర శాస్త్రిని చూసి లేచి నిలబడ్డాడు. "రండి! కూర్చొండి, వీళ్ళే నేను పెళ్ళి చేసుకోవాలనుకున్న అమృత అత్తామామలు. నాన్నగారు మా పెళ్ళికి ముహూర్తం నిశ్చయించడానికి మిమ్మల్ని పిలిచారు." అని గౌరవంగా పరమేశ్వర శాస్త్రిని ఆహ్వానించి అతనికో కుర్చీ చూపించాడు.


పరమేశ్వర శాస్త్రి ఆ కుర్చీలో ఆసీనుడై అక్కడ ఉన్న అందరివైపూ ఓ సారి పరికించి చూసాడు. భూషణరావువైపు చూసేసరికి అతని కళ్ళల్లో క్రితం రోజు చేసిన హెచ్చరిక కనిపించింది.


భూషణరావు పక్కనే అతని భార్య భవానీదేవి కూర్చొని ఉంది. "శాస్త్రులు గారూ, మా వాడు మనసుపడిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఉంది. మాకు అమృత బాగా నచ్చింది. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది. ఆమె ఈ ఇంటి కోడలుగా వస్తే అంతా శుభమే జరుగుతుందని నా అభిప్రాయం. వాళ్ళిద్దరి జాతకాలూ పరిశీలించి మంచి ముహూర్తం నిర్ణయించండి." అంది భవానీదేవి ఇద్దరి జాతకాలు అందిస్తూ.


భూషణరావువైపు ఓ సారి చూసి, ఆ జాతకాలను అందుకున్నాడు పరమేశ్వర శాస్త్రి. ఆ తర్వాత, తను తెచ్చుకున్న సంచిలోంచి పంచాంగం బయటకు తీసి పరిశీలించడం మొదలుపెట్టాడు. వేళ్ళు ముడుస్తూ తెరుస్తూ లెక్కలు వేయసాగాడు. భూషణరావు చెప్పినట్లు జాతకాలు కుదరవని చెప్పేట్లైతే ఇంత తతంగం అనవసరమన్న భావన మనసులో మెదలగానే మనసులోనే నవ్వుకున్నాడు.


అయినా కుతూహలంకొద్దీ జాతకాలు గుణించడం మొదలుపెట్టాడు. సమయం గడిచిన కొద్దీ అతనిలో ఆందోళన పెరిగింది. భ్రుకుటి ముడిపడింది. అది చూసిన భూషణరావు మదిలో సంతోషం వెల్లువెత్తింది. అయినా, "ఏం శాస్త్రులు గారూ, జాతకాల్లో తిరకాసేమీ లేదు కదా! జాతకలు సరిగ్గా పడుతున్నాయి కదా?" అని అడిగాడు ఏమీ ఎరగనట్లు.


జాతకాలు చూడటంలో నిమగ్నమై ఉన్న పరమేశ్వర శాస్త్రి ఒకసారి తల్లెత్తి చూసి, "ఒక్క నిమిషం!" అని మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. తను చెప్పినట్లుగా జాతకాలు పడటం లేదు అని చెప్పడానికి ఇంత సమయం తీసుకోవడమెందుకో అని యోచిస్తూ అతనివైపు చూస్తూ ఉండిపోయాడు భూషణరావు. అలా అయిదు నిమిషాలు పరిశీలించిన అనంతరం పరమేశ్వర శాస్త్రికి తనపై పెద్ద భారం తొలగినట్లు అనిపించింది. నిజంగానే వధూవరులకు పెళ్ళి పీటలమీద పెళ్ళయ్యే యోగం లేదు.


వెంటనే తలెత్తి, "మీకు ఎలా చెప్పాలో తెలియడంలేదు, జాతకాలు కుదిరే మాట అటుంచి ఇద్దరికీ పెళ్ళి పీటలు ఎక్కే యోగం జాతకంలో ఎంత వెదికినా కనపడటం లేదు." అని తన జవాబు కోసం ఆత్రంగా చూస్తున్న అమృత మేనమామవైపు, అభిజిత్, అతని తల్లి వైపు చూసి చెప్పాడు. అతని మాటలు విన్న వాళ్ళందరిలో ఒక్కసారి నిరాశ అలుముకుంది.


భవానీదేవి ఇంకా ఆశ వదలక, "అయ్యో! సరిగ్గా చూసారా శాస్త్రులుగారూ, ఈ వివాహం కుదరదా లేక అసలు మా వాడికి వివాహ యోగమే లేదా?" అని అడిగింది.


"చెప్పాను కదమ్మా, వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళి పీటలు ఎక్కే యోగమే లేదు. నేను చెప్పిన జాతకం పొల్లుపోదు. నా జాతకం తప్పయితే నేను జాతకం చెప్పటమే మానుకుంటాను" అని లేచాడాయన. అందరూ నివ్వెరపోయి అతను వెళ్ళినవైపే చూడసాగారు.


***************

అసలు తన కొడుకు పెళ్ళి పీటలు ఎక్కే అస్కారమే లేదని, పరమేశ్వర శాస్త్రి నొక్కి వక్కాణించడంతో ఏం చేయాలో పాలుపోలేదు భూషణరావుకి. జాతకంలో దిట్ట అయిన అతని మాట అబద్ధం కావడానికి వీలు లేదు. అసలే నెల రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నప్పుడు వచ్చింది ఈ సమస్య. అయినా తన స్థాయికి తగ్గ సంబంధాలు చూడసాగాడు. నెల రోజులు గడిచేసరికి, బాగా ఆస్తిపరులైన రంగారావు కుమార్తె సంబంధం వచ్చింది.


ఇంకో రెండు రోజుల్లో అతను పెళ్ళి మాటలకి వస్తాడనగా, ఆ రోజు జరిగిందా సంఘటన. సాయంకాలం నాలుగు గంటలకి సోఫాలో కూచొని టీ తాగుతుండగా, మెళ్ళో పూల దండలతో ఇంట్లోకి ప్రవేశించాడు అభిజిత్. కొడుకుని, అతని పక్కనే తలవంచుకు నిలబడ్డ అమృతను చూసిన భూషణరావుకి నోటమాట రాలేదు. అప్పుడే హాల్లోకి వచ్చిన భవానీదేవి కూడా అంతులేని ఆశ్చర్యానికి గురైంది. వాళ్ళింకా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే వాళ్ళ పాదాలకు నమస్కరించారు నూతన వధూవరులు. అనాలోచితంగా వాళ్ళిద్దర్నీ ఆశీర్వదించాడు.


ముందు విపరీతమైన ఆగ్రహానికి గురైనా, తక్షణం తనని తాను సంభాళించుకున్నాడు భూషణరావు. సరిగ్గా నెల రోజుల్లో తను ఎలక్షన్లలో నిలబడుతున్నాడు. తన ఇంట్లో ఏమి జరిగినా వార్తల్లోకి ఎక్కితే తన పరువు పోవడంతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. అందుకే తన కోపాన్ని నిగ్రహించుకొని, "ఇద్దరికీ హారతిచ్చి, లోపలకి తీసుకెళ్ళు!" అని ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోని భార్యకి చెప్పాడు.


అయితే అసలు తన కొడుక్కి పెళ్ళి పీటలు ఎక్కే యోగమే లేదని అంత గట్టిగా చెప్పిన పరమేశ్వర శాస్త్రి జాతకం ఎలా తప్పిందా అనే సందేహం మాత్రం పీడించసాగింది. అయితే రెండు రోజుల తర్వాత అతని నుండి అతని మాటల ద్వారానే అసలు విషయం తెలిసి నివ్వెరపోయాడు భూషణరావు.


"మీ అబ్బాయికి, ఆ అమ్మాయికి అసలు పెళ్ళి పీటలు ఎక్కే యోగమే లేదని చెప్పాను గానీ, ఈ పెళ్ళి అసలు జరగదు, కళ్యాణ యోగం లేదని నేను చెప్పలేదు కదా! వాళ్ళు పెళ్ళి చేసుకుంది, దండలు మార్చుకున్నదీ రిజిస్ట్రార్ ఆఫీసులో మరి! జాతకం ప్రకారమే అంతా జరిగింది. నేను మీతో చెప్పినదానిలో అబద్ధమేమీ లేదు!" అన్న పరమేశ్వర శాస్త్రి మాటల్లోని అంతరార్థం గ్రహించడానికి రెండు నిమిషాలు పట్టింది భూషణరావుకి.


విషయం అర్ధమైన తర్వాత మిన్నకుండిపోయాడు. అయితే అతనికి తెలియని విషయమొకటి ఉంది. అభిజిత్కి తను చెప్పిన జాతకంలో మెలిక విప్పి రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళికి ప్రోత్సహించింది కూడా పరమేశ్వర శాస్త్రేనన్న విషయం పాపం భూషణరావుకి తెలియదు

………………….

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.64 views1 comment
bottom of page