కనిపించే దేవుడు
- Dr. C S G Krishnamacharyulu
- Jul 31
- 6 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #కనిపించేదేవుడు, #KanipincheDevudu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kanipinche Devudu - New Telugu Story Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 31/07/2025
కనిపించే దేవుడు - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సాయంత్రం ఆరుగంటల సమయమైంది. సభ్యుల విభిన్న కార్యకలాపాలతో ఆఫీసర్స్ క్లబ్ సందడిగా వుంది. ఒక ప్రక్క ఆటలాడే వారు, మరొక ప్రక్క మాగజైన్లు తిరగేస్తూ కబుర్లు చెప్పుకునే వారు, ఇంకొక ప్రక్క ఏకాంతంగా ఆలోచనల్లో మునిగి తేలేవారు, అలా అందరూ తమకు నచ్చిన రీతిలో బిజీగా వున్నారు.
అక్కడ యేకాంతంగా కూర్చున్న వారిలో గోపి ఒకడు. అతడొక రచయిత. అతడు ఒక చెట్టు క్రింద చిన్నిదీపాల మసక కాంతుల్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతడిని వెదుక్కుంటూ వచ్చిన శర్మ, అతని కెదురుగా కూర్చుని, " కథా, నవలా!" అని అడిగాడు.
"ఏదీ కాదు. ఈ రోజు ఆంతా శూన్యంగా వుంది. నీ టెన్నిస్ ఆట అయిపోయిందా?"
"ఇంకా లేదు. ఇంకో అరగంట ఆగి వెడతాను. నీకొక కథాంశం చెప్పనా?" అని వుత్సాహంగా అడిగాడు శర్మ.
"వై నాట్! చెప్పు" ఆసక్తిని ప్రదర్శిస్తూ బదులిచ్చాడు గోపి.
"సరిగ్గా నలభై యేళ్ళ క్రితం, మనం ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్లో వున్నప్పటి విషయం.
మన క్లాస్ మేట్ లక్ష్మీనారాయణ పెళ్ళికి భీమవరం దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాము. అది గుర్తుందా? ఆ అనుభవంతో మనకి, కనిపించే దేవుడు అన్న భావనకు, అర్ధం తెలిసింది. అవునా?” ఎంతో వుత్సాహంగా అడిగాడు శర్మ.
"బాగా గుర్తుంది. నీకది ఇంత అకస్మాత్తుగా యెందుకు గుర్తొచ్చింది?"
గోపి కుతూహలం గమనించిన శర్మ వుత్తేజితుడై యిలా చెప్పాడు.
"నిన్న రాత్రి పదకొండు గంటలకు నాకూతురు, డాక్టర్ సుమతి, ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తూండగా ఆమె కారు ఒక చోట మొరాయించింది. అక్కడ వున్న చెట్టు దగ్గర చీకటి వెలుగుల్లో, నలుగురు వెధవలు మందు త్రాగుతూ వున్నారు. కారు కిటికీలు వేసి వున్నా, పరిస్థితి అంత క్షేమకరం కాదని భయపడుతూ పోలీసులకి ఫోన్ చేద్దామనుకుంది. ఇంతలో ఆమె ప్రొఫెసర్ కారులో వచ్చాడు. ఆయన నా కూతురికి తన కారు యిచ్చి ఇంటికి పంపాడు. నా కూతురి కారు రిపేరు బాధ్యత ఆయన తీసుకున్నాడు. నా కూతురు ఈ విషయం చెప్పి, కనిపించే దేవుడు మా ప్రొఫెసర్ అంది. అప్పుడు, ఆనాటి మన కథ గుర్తుకు వచ్చింది. ”
“నిజమే. ఆపద తొలగించే వ్యక్తిని, కనిపించే దేవుడనడం అసమంజసం కాదు. "
ఆ మాట అంటున్నప్పుడు గోపి మనసు నలభై యేళ్ళక్రితం జరిగిన సంఘటనను, వివరంగా గుర్తు తెచ్చుకునే పనిలో పడింది. స్నేహితుడు జ్ణాపకాల దారుల్లో పయనించడం గమనించిన శర్మ, మరో రౌండు ఆటకి వెళ్ళిపోయాడు.
@@@
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ హాస్టలులో, ఇంజినీరింగ్ విద్యార్ధులకు కేటాయించగా మిగిలిన గదులను ఆర్ట్స్ కాలేజ్ విద్యార్ధులకు ఇచ్చేవారు. ఆ విధానంలో అక్కడ గదులు పొందిన అర్ట్స్ విద్యార్ధులలో గోపి, శర్మ, లక్ష్మీనారాయణ మంచి స్నేహితులయ్యారు. వ్యాయామానికి, మెస్సుకి, తరగతులకు, ఆటలకు, సినిమాలకు, కలిసే వెళ్ళేవారు. ఏడాది తిరిగేటప్పటికి వారి స్నేహం ప్రగాఢమైంది.
రెండేళ్ళ ఎంబియే, ఇంకో ఆరు నెలల్లో ముగుస్తుందనగా లక్ష్మీనారాయణ, ఒక ఆశ్చర్యపోయే వార్త చెప్పాడు.
" మా వాళ్ళు నా పెళ్ళి నిశ్చయం చేసారు. అమ్మాయి బి యే చేసింది. వాళ్ళకు ఆస్తులు వ్యాపారాలు వున్నాయి. ఒక్కటే కూతురు కావడాన అన్నీ అమ్మాయికే ఇస్తామన్నారు!"
శర్మ లక్ష్మీనారాయణ భుజం మీద చరిచి, " లక్కీ ఫెలో. పెళ్ళితో నీ లైఫ్ సెటిలయిపోతోంది. " అన్నాడు.
"ఇంతకీ పెళ్ళెప్పుడు? ఎక్కడ చేస్తారు?" అని ప్రశ్నించాడు గోపి.
" అక్టోబర్ 26. అమ్మాయి స్వగ్రామంలో. అదొక చిన్న పల్లెటూరు. భీమవరం దగ్గర శృంగ వృక్షం అనే పల్లెటూరు. దాని దగ్గర తోలేరని ఒక చిన్న గ్రామం. బస్సు సౌకర్యం లేదు. రిక్షాలు దొరుకుతాయి. మీకు అన్ని వసతులు యేర్పాటు చేస్తారు. ఎగ్గొట్టారంటే చంపేస్తాను. " అని వుత్సాహంగా చెప్పాడు లక్ష్మీనారాయణ.
"మంచి వానాకాలం. గ్రామంలో పెళ్ళి. పొలాల గట్లమ్మట పడి రావడం నా వల్ల కాదు. ఇక్కడ, మేమే పార్టీ ఇస్తాము " అన్నాడు గోపి.
"అరే! మన ఫ్రెండ్ పెళ్ళికి రానంటే యెలా? పల్లెటూరు పెళ్ళి అంటేనే ఎంతో ఎక్సైటింగ్ గా వుంది. " అని శర్మ గోపితో అని "మేం వస్తాం లే, " అని లక్ష్మీనారాయణ కి భరోసా యిచ్చాడు.
అక్టోబర్ 26 వ తారీకున వుదయం మూడు గంటలకు వివాహ ముహుర్తం కావడంతో శర్మ, గోపి కలిసి 25 వ తారీకు సాయంత్రం ఆరుగంటలకు భీమవరం చేరారు. అక్కడ బస్సెక్కి శృంగవృక్షం చేరేటప్పటికి ఆరున్నర దాటింది. సన్నని వాన జల్లుల వల్ల వాతావరణం చల్ల బడింది. చల్లదనంతో పాటు చీకటి నెమ్మదిగా చుట్టూ వ్యాపిస్తోంది. వీధి దీపాల కాంతులలో పరిసరాలు మసక మసకగా కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితిని చూసి, గోపి విసుగ్గాముఖం పెట్టి, " చూడు. వాన, చీకటి. ఇక్కడ నుంచి సరైన రోడ్డులేని తోలేరుకి యెలా వెడతాం? వద్దురా బాబూ అంటే, స్నేహం అని లాక్కొచ్చావు" అని శర్మ మీద విరుచుకుపడ్డాడు.
"శాంతం మహాప్రభో! శాంతం. ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లే. అదిగో ! అక్కడ ఒక పెద్ద మనిషి వున్నాడు. కనుక్కుందాం. " అంటూ శర్మ తోలేరు రోడ్డు వైపు వెడుతున్న ఒకాయనను పలకరించాడు.
"సర్! తోలేరుకి ఎంత దూరం? రిక్షాలు పోతాయా ?"
"ఇలా నేరుగా నాలుగు కిలోమీటర్లు వెడితే తోలేరు. పొలాల మధ్య మట్టి రోడ్డు. రిక్షాలు పోతాయి గాని, బురదవల్ల కాస్త కష్టం కావచ్చు. నడిచిపోవడం మేలు. నేను ఆ వూరే వెడుతున్నా. నాతో వచ్చెయ్యండి" అని మృదువుగా చెప్పాడతను.
" దూరం అంటున్నారు. మంచి రోడ్లపై నడవడానికి బద్ధకించే మేము, బురద రోడ్డులో, ఎక్కడ నడుస్తాం? మీకంటే అలవాటు. ఏదైన రిక్షా చూసుకుంటాం? ఎంత తీసుకుంటాడు?"
"పదో పదిహేనో అంటాడు. వాన పెద్దది కావచ్చు. అదుగో ఒక రిక్షావాడిటే వస్తున్నాడు. బేరం కుదుర్చుకుని త్వరగా వెళ్ళండి" అని చెప్పి ఆయన నడక సాగించాడు.
ఇంతలో గంట కొట్టుకంటూ ఒక రిక్షావాలా వారి ముందు ఆగాడు.
“బాబూ ఎక్కడికి పోవాలి? మున్నేరా, తోలేరా? అని వినయంగా ప్రశ్నించాడు.
"తోలేరు. ఎంత తీసుకుంటావు?" అని శర్మ అతడిని పరీక్షగా చూస్తూ అడిగాడు. వాడు త్రాగి వుంటే వద్దని చెప్పాలనుకున్నాడు. కానీ ఆ వాసనలేవీ రాలేదు. ఇంతలో " నా కష్టం చూసి మీరే పదో పదిహేనో ఇవ్వండి సర్!" అని రిక్షావాలా అనడంతో శర్మ సంతృప్తి చెందాడు.
ఇద్దరూ రిక్షా ఎక్కారు. రిక్షా ప్రయాణం మొదలైంది. ప్రయాణం నరకసదృశంగా వుంది.
“బురదతో, గతుకులతో నిండిన రహదారి. ఈ కష్టం చాలదన్నట్లు, ప్రమాద సూచనలిస్తూ ఇస్తూ ఇరు వైపులా పారే పంట కాలువలు, పైనుంచి జల్లులుగా పడే వాన, వెలుగుని మ్రింగిన చీకటిలో ఆగి ఆగి మెరిసే మెరుపులు. గుండె ఝల్లుమనిపించే వురుములు, శర్మా! ఇది మన ఖర్మ!" అని గోపిలోని రచయిత స్నేహితుడిని నిందించాడు.
"ఖర్మ కాదు. అడ్వెంచర్! చిన్ని చిన్ని సాహసాలు చేయకుంటే, జీవితం బోరైపోదా?"
ఇంత కష్టంలో కూడా శర్మ అత్మ విశ్వాసం చెదరలేదు. స్నేహితుడి పెళ్ళికి హాజరవ్వాలన్న బలమైన కాంక్ష అతడిలో సహన శక్తిని పెంచింది.
అలా ఒక అరగంట సేపు ప్రయాణించాక, రిక్షా ఆపి, రిక్షా అతను శర్మతో, " ఇక్కడ దిగిపోండి బాబూ. నాకింక ఓపిక లేదు. చూడండి, కుడి వైపు వెడితే మున్నేరు. మా ఊరు. ఈ ఎడమ దారిలోఒక్క కిలో మీటరే తోలేరు. మీకు తోచినది ఇవ్వండి. " అన్నాడు.
స్నేహితులిద్దరూ రిక్షా దిగారు. శర్మ రిక్షా వానికి పది హేను రూపాయలు ఇచ్చాడు. అతడు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. వాన సన్నగా పడుతుండడంతో ఇద్దరూ రెయిన్ కోట్లు ధరించారు. ఇంకా ఒక్క కిలోమీటర్ వెళ్ళాలి. కుడి వైపు కాల్వ స్థానంలో బారుగా చెట్ల తోటలున్నాయి. అందులోని పెద్ద చెట్ల శాఖోప శాఖలు, దెయ్యాల్లా భయపెడుతుండగా, దూరంగా వున్న పల్లెల్లోని దీప కాంతులు ధైర్యం చెబుతున్నాయి. రిక్షా దూరమయ్యాక తెలిసింది, దోవ చూపేందుకు దీపం లేదని. శర్మ దగ్గర అగ్గిపెట్టె వుంది. కానీ అది ఎంత వరకు వారికి మార్గదర్శి కాగలదు?
అంతలో దూరంగా పిడుగు పడిన శబ్దం. ఇద్దరి కీ గుండె ఝల్లుమంది. సన్నగా వణికించే చల్లని గాలి. ఈ చీకటిలో, ముందుకు సాగేదెలా? అన్న ప్రశ్న వారిని వేధించసాగింది. ఇద్దరూ అక్కడే వున్న కల్వర్ట్ గోడ మీద కూర్చున్నారు.
శర్మ మీద కోపంగా వున్నా గోపి, మౌనం వహించాడు. ఎవరైనా అటుగా పోయే వాళ్ళు వస్తే బాగుండునని వుంది ఇద్దరికీ. సరిగా, అప్పుడే టార్చ్ కాంతి సహాయంతో వారి వైపు వస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఇద్దరిలో ఆశ చిగురించింది. రెండు నిమిషాల అనంతరం అతను వచ్చాడు. అతనే, నడిచిపోదాం అన్న వ్యక్తి.
వారిని చూస్తూనే, " ఇక్కడ ఆగిపొయారేం? రండి ఇంకో కిలోమీటరు వెడితే, వూరు వచ్చేస్తుంది. నా టార్చ్ వెలుగులో నడవండి. " అంటూ అతను వారికి వెలుగు చూపిస్తూ ముందుకు సాగాడు.
బ్రతుకు జీవుడా అనుకుంటూ వారు అతడిని అనుసరించారు.
దోవ లో అతను ఎవరింటికి వెళ్ళాలి అన్న ఒక్క ప్రశ్న మినహాయించి వేరే ఏమీ అడగలేదు. “ముందు గుంట వుంది ఇలా రండి, అక్కడ బురద వుంది, మెల్లగా నడవండి” అని అవసరమైన జాగ్రత్తలు తప్ప వేరే మాటలేవీ అతని నోట రాలేదు. సోది కబుర్లు లేవు. చిన్న బుచ్చే మాటలు లేవు. దాదాపు మౌనంగా వూరు చేరారు. వారిని పెళ్ళివారికి అప్పగించి అతను వెళ్ళిపోయాడు.
@@@
ఆట ఆడిన అలసటతో, కొద్దిగా రొప్పుతూ వచ్చి కూర్చున్నాడు శర్మ. వస్తూనే, " కనిపించే దేవుడు గుర్తుకి వచ్చాడా?" అని అడిగాడు.
"ఆహా? మాటలతో విసిగించకుండా, ఎంతో జాగ్రత్తగా మనల్ని నడిపించి, గమ్యం చేర్చిన ఆ మహానుభావుడిని మర్చిపోగలమా! ఇప్పటికి, అతని స్వభావం, సంస్కారం, నిత్యనూతనంగా మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి. నిజంగా అతను ఆ నాడు మనకి కనిపించిన దేవుడు. "
గోపి సమాధానంతో యేకీభవిస్తూ, అతని రూపాన్ని స్మరిస్తూ, శర్మ ఒక ఆనందానుభూతికి లోనయ్యాడు.
@@@@@
శ్రీ కృష్ణ ప్రస్తుతి

Sri Krishna Prasthuthi - New Telugu Poem Written By - Dr. C. S. G. Krishnamacharyulu Published in manatelugukathalu.com on 31/07/2025
శ్రీ కృష్ణ ప్రస్తుతి - తెలుగు పద్యాలు
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
ఆ.వె.
ధరణి నేత, అకట చెరసాల జన్మించె
చక్ర ధారి, గాని శాంతి కోరె
బ్రహ్మ చారి యంట భామల గూడిన
వేణు గాన ప్రియుని వింతలెన్నొ!
తే.గీ/
తల్లి దేవకి చెరసాల తల్లడిల్లె
గారముగ పెంచిన యశోద దూరమయ్యె
తరుణి రాధిక శోకించె విరహ బాధ
గీత చెప్పె వేదాంతియై కృష్ణ మూర్తి.
తే.గీ/
విశ్వ మానవ కల్యాణ వేడ్క తోడ
భువిని జన్మించి కష్టాలు పొందినావు
నీకు తెలియని బాధలా నీరజాక్ష!
కరుణ కురిపించి కాపాడు కమల నయన.
సీ.
శ్రీ కృష్ణ! అచ్యుతా ! శ్రీనాధ! శ్రీ హరీ!
గోవర్ధనోద్ధార! గోప బాల !
దేవకీ నందనా ! దివ్య తేజో రూప!
కాళీయ మర్దనా! కలివినాశ!
గోవింద! మాధవా! గోపీ మనోహర!
విశ్వ మోహనరూప! వెన్న దొంగ!
ద్వారకా నగర విహార! విశ్వేశ్వరా!
భక్త హృదయ వాసి! పరమ పురుష!
తే.గీ/
కంస రాక్షసు చంపిన కదన శూర
ధరణి రక్షక! కేశవా! దైత్య హారి !
శిష్ట జనపాల! మ్రొక్కెద చేతులెత్తి
శరణు శరణని నీదివ్య చరణములకు.
@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
అవసరానికి తోడై, చీకటిలో వెలుగుని, మనసులో ధైర్యాన్ని యిచ్చే తోటి మానవుడే కనిపించే దేవుడని చక్కటి కధ రచించిన మీకు నా అభినందనలు.👏