top of page

కపికిశోరుడు హనుమ

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #Hanuman, #కపికిశోరుడుహనుమ, #వేకువలోరేపల్లె, #ఇష్టపది

గాయత్రి గారి కవితలు పార్ట్ 25

Kapi Kisorudu Hanuma - Gayathri Gari Kavithalu Part 25 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 03/06/2025

కపికిశోరుడు హనుమ - గాయత్రి గారి కవితలు పార్ట్ 25 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


కపికిశోరుడు హనుమ

(ఇష్టపది )

**********************************

సంజీవనీ దివ్య శైలమ్ము గొనితెచ్చి 

ఆంజనేయుండు మహి కారాధ్యుడైనాడు 


సౌమిత్రి ప్రాణములు చల్లగా కాపాడి 

శ్రీమంతుడా రామ సేవలో తరియించె 


కదళీవనంబులో కఠినమౌ దీక్షతో

మదిలోని రామునిని మనసార ధ్యానించు


భావి తరముకు హనుమ బ్రహ్మగా విలసిల్లి

జీవరక్షణ జేసి చిరయశము సాధించు


భక్తజనపాళికకు బాసటగ నిలుచుండి

ముక్తిమార్గము జూపు పుణ్యడీ వరదుండు


సిందూరమును బూసి చిరువడలు ప్రీతిగా

నందించ కపివీరు డానందమున గాంచు


నిరతమీ మారుతిని నిష్ఠగా పూజింప

దరిచేర్చి చిరకర్మ తాపములు మడియించు


కారుణ్యమూర్తియగు కపికిశోరుని కొల్వ

కోరికలు తీరు మన గోత్రములు వర్తిల్లు.//


************************************

వేకువలో రేపల్లె

(కవిత)














పులుగుతతి కిలకిలా కూయగా

కులుకుతూ నదీనదాలు పారగా

జిలుగుతో భూమాత కనువిందుగా

వెలుగుతో వాకిళ్ళు తెరుచుకోగా


ఏపుగా పెరిగిన వృక్ష జాతులు

రేపల్లెలో గోవుల క్షీరధారలు

ఆ పల్లె పడుచులాడించు కవ్వాలు

గోపురంలో గంటల గణగణలు


వేణుగోపాలుని దర్శింప చెలులు

గానము చేయుచున్న గొల్లభామలు

వేనవేల ప్రణతుల వేడికోలు

దీనబాంధవునికై పడిగాపులు


జీవకోటికి తానాధారభూతుడు

భావగమ్యుడు బృందావనవాసుడు

దీవెన లీయగ పంకజనాభుడు

ఆ వేకువలో నిదుర మేల్కొన్నాడు.


అనుక్షణం జనులను కాచువాడు

మనసులు గెలిచిన మాధవుడు

వెనువెంటనే కనులను విప్పాడు

తన సఖులను  గాంచుచు నవ్వాడు.//

*******************************

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comentários


bottom of page