'Katha Kani Katha' New Telugu Story Written By Pandranki Subramani
'కథ కాని కథ' తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
కథ కాని కథ! కరోనాపై ఓ కొంటె కథ!
వేంకట చలపతికి వాడుకలో ఉన్న నిక్- నేమ్ వీరేంద్ర కుమార్. ఇతడు చేపట్టని పుక్కిటబట్టని సాంస్కృతిక సాహిత్య వ్యాసంగం లేదు. కథలు, మినీకథలు, పొట్టి కవితలు, నానీలు, వ్యంజకాలు- యిలా యెన్నో సాహితీ ప్రక్రియలు అతడి ఒరవడిలో యిమిడి ఉంటాయి. అతడు అంతటితో ఆగాడా! లేదు. అప్పుడప్పుడు కార్టూన్లు సహితం గీచి దానికి స్వంత జోకులు జోడించి దిన పత్రికలకు వార పత్రికలకు యేకబిన పంపిస్తుంటాడు.
ఇంతకూ యెందులో యెంత వరకు చలపతి సాఫల్యత సాధించాడన్నది యిప్పటికిప్పుడు చెప్పడం యెవరి తరమూ కాదు. కారణం- ఆ విషయం అతడి అవలోకనలోనే లేదు. లెక్కించి గుర్తు పెట్టుకోవడానికి ఒకటా రెండా—బోలెడన్ని ప్రక్రియలు. ఫలితం కోసం ఆరాటం చెందకుండా నిరాశా నిస్పృహల పాలవకుండా అనవరతం సాహితీ సేద్యం చేపట్తూనే ఉంటాడు. దీనికంతటికీ ముఖ్యకారణం ఉంది. నిలువెళ్ళా ప్రజ్వరిల్లే భావావేశం. ఉవ్వెత్తున యెగిసి పడే ఆక్రోశం. చాలావరకు చాలా సమయాలలో వీరేంద్ర కుమార్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.
కాని—అకటా! యువకుడైన వీరేంద్రకుమార్ అదుపు తప్పిపోతుంటాడు. తత్ఫలితంగా నిలువెళ్లా ఉష్ణం తెచ్చుకుంటాడు. అటువంటి సమయంలో తనను తను స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి యెలార్టు గా కవితా కన్య పంచన చేరిపోతుంటాడు. నిర్నిబంధంగా లొంగిపోతుంటాడు-
“కవితా! ఓ కవితా! నాతో యింతటి పంతమేల! ” అంటూ-- అటువంటి మానసిక పరిస్థితే మరొక రూపంలో యిప్పుడత నికి యెదురైంది; దేశం నలుమూలలా విలయతాండవం చేస్తూన్న మహమ్మారి కరోనా విపరీత ప్రభావం వల్ల. దానితో ప్రభావితుడై, క్రోధ పీడుతుడై, పులి పంజా దెబ్బకు గిలగిలా తన్నుకునే నాలుగు కాళ్ళ ప్రాణుల్లా నేల రాలుతూన్న యిరుగు పొరుగు వాళ్ళ ధైన్య స్థితి చూసి- రక్త దాహంతో అలమటించే కాటేరిలా దాడిచేస్తూన్న కరోనా కమ్ కోవిడ్- 19 క్రిమి స్త్వైర్య విహారాన్ని భరించ లేకపోయాడు.
దానికి దేశమంతటా అంతటి ప్రాముఖ్యత యివ్వడం అంతకంటే భరించలేక పోయాడు. ఆగ్రహోదగ్రుడై కంపించి పో యాడు. ఎంతైనా చలపతిది క్యార్ ఆఫ్ వీరేంద్రకుమార్ ది యువ రక్తం కదూ! ఆవిధంగా నషాలానికి తాకుతూన్న వేగిరపాటుని తట్టుకోలేక పరిస్థితిని మూస పధ్ధతిలో కాకుండా దానికి వ్యతిరేకంగా దిగ్భ్రాంతికరంగా స్పందించాలని తీర్మానించాడు. అనుకున్నదే తడవుగా వాయువేగంతో యింటికెదురుగా ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకు వెళ్ళి తిన్నగా తుమ్మ చెట్టు శిఖరాగ్రానికి యెక్కేసాడు. కవితాత్మక భావావేశం తో అతడెన్నడూ యెక్కడా చూసెరగని కరోనా మహమ్మారికి పిలుపునిచ్చాడు-
“ఓ నాఅందమైన కమనీయ రమణీయ కరోనా! అతిలోక సుందరి మోహనా! అందరూ పనిపాటా లేని వెంగళప్పలందరూ ఉత్తరకుమారులందరూ ఒక్కటై నిన్ను అదే పనిగా ఆడిపోసుకుంటున్నారు. ద్వేషిస్తున్నారు. నాకు తెలుసు నీవు క్లియోపాత్రావంటి విశ్వసుందరివని- రసిక జనాన్ని అణువణువున రంజింప చేసే మోహనాంగివని. అటువంటి పోచికోళ్ళ కబుర్లు మనసులో పెట్టుకోకు. అలుక పూనకు. ఇదిగో! నేనిప్పుడు వచ్చేసాను. చేతులు చాచి హృదయద్వారాలు తెరచి ఆహ్వానిస్తున్నాను. రా! వెంటనే రా! వచ్చి నన్ను నీ బిగి కౌగలిలో బంధించు. అమర ప్రేమను కురిపించు. తనువెళ్ళా మైమరపించు“
ఆశ్చర్యకరం! అటెటో రెక్కలు విదిలిస్తూ భూలోకంలో చేయవలసిన కార్యం ధీటుగా చేసి ముగించి భూమండలాన- గగన మార్గాన- జలతలాల పైభాగాన తాకుతూ తేలిపోతూ వెళ్తున్న కరోనా వీరేంద్ర కుమార్ హృదయ నాదం విని ఆగింది. విస్మయాత్మకంగా కనురెప్పలు విప్పార్చి చూసింది. లోకమంతా తనను ఆడిపోసుకుంటున్నప్పుడు ఈ యువ కవి ఒక్కడూ తనను అంత హృద్యంగా ఆరాధించడం యేమిటి? అమితానందంతో నీలాల నింగిలో లోలోన పొంగిపోయింది.
బహుశ: దానికి తెలుగు బాగానే తెలుసులా ఉంది. అటు యెటో సాగిపోతూన్న కరోనా యిటు తిరిగి వేగం తగ్గించి దారి మళ్ళించి వీరేంద్ర కుమార్ వేపు వెకిలిగా కూతలు వేస్తూ రాసాగింది.
అప్పుడతడు చూసాడు- దాని అసలు రూపు. వికృతంగా కరాళ కాలరాత్రిని గుర్తు చేస్తూ రెక్కల చేతుల్ని చాచుతూ రాసాగింది. ఆ భయానక రూపాన్ని చూడలేక ఒక్క ఉదుటుని చెట్టుపైనుండి క్రిందకు దూకి దగ్గరలో ఉన్న శివాలయం వేపు పరుగెత్తాడు- వెనక్కి తిరిగి చూస్తూ--
అదిప్పుడు ఆమడ దూరానికి వచ్చింది. ఇక తనకు ప్రాణ గండం తప్పదేమో అనుకుంటూ తిన్నగా వెళ్ళి –“హర హర శంకరా! ”అంటూ ప్రహ్లాదున్ని తలపోస్తూ శివలింగాన్ని వాటేసుకున్నాడు. అప్పుడక్కడకు వచ్చిన కరోనా ఆగిపోయింది. రుద్రుడి ఉగ్ర రూపం గుచించి- ఆయన చేతిలోని పదునైన త్రిశూలం గురించి కరోనాకు ముందే తెలుసేమో! వెనక్కి దిశ మార్చి గజగజ వణుకుతూ వూహాన్ (చైనా) వేపు యెగిరిపోయింది, లోలోపల గొణుక్కుంటూ తిట్టుకుంటూ-
“ఏం మనిషితడు?నన్ను దగ్గరకు రారా రమ్మని నా అందాన్ని అంతెత్తున పొగుడుతూ ప్రేమపూ ర్వకంగా పిలిచింది ఇతనేగా! ఇప్పుడు చూడు యెలా ముడుచుకు పోతూ శివుడి శివలింగం పంచన చేరాడో! మనిషికి మరో పేరు నిలకడలేని పెళుసైన మనసేగా! తన రూపలావణ్యాల గురించి అవగాహనే లేని ఈ అరసిక మానవ జాతితో తనకేమి పని—అదిగో! అక్కడ అమెరికా ఆఫ్రికా దేశాలు తన రాక కోసం చేతులు చాచి పరితపిస్తూనే ఉన్నాయిగా! ”
***
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments