'సుధ' ధారావాహిక ప్రారంభం
'Sudha - Episode 1' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala
'సుధ - ఎపిసోడ్ 1' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఫోన్ రింగవుతుంటే గాఢనిద్రలో ఉన్న సుధ తృళ్లిపడి లిఫ్ట్ చేసింది.
"హలో! సుధా!" అన్న విజయ్ గొంతు విని హుషారుగా లేచి "హాయ్! విజయ్!" అంది.
"సుధా! ఈరోజు కాలేజీ అవగానే సినిమాకి వెళదామా?" అడిగాడు విజయ్.
"సరే!" అంది సుధ. ఫోన్ పెట్టేశాడు విజయ్.
సుధ వెంటనే లేచి తన కాలకృత్యాలను తీర్చుకుని కాలేజీకి తయారవబోతుండగా "సుధా! త్వరగా రా! టిఫెన్ రెడీ!" అన్న తల్లి కాంతమ్మ కేక వినిపించింది.
"వచ్చేస్తున్నా!" అంటూ హాలులోకి వచ్చింది సుధ.
అంతకు ముందే డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచిన టిఫెన్ ని ప్లేటులో పెట్టి కూతురి ముందు ఉంచింది కాంతమ్మ. దాన్నందుకుని తిని సాయంత్రం కాలేజీనుంచి ఆలశ్యంగా ఇంటికి వస్తానని తల్లికి చెప్పి హడావిడిగా కాలేజీకి వెళ్లింది సుధ.
సుధ వెళ్లినవైపే చూస్తూ ఉన్న కాంతమ్మ మనసు గత స్మృతులలోకి వెళ్లింది.
సుధ తండ్రి రమణయ్య పెద్దలిచ్చిన ఇంట్లో ఉంటూ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఏకైక కూతురు సుధ అంటే ఆయనకి పంచప్రాణాలు. సుధ పుట్టిన రెండవ రోజున తనకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని "మహలక్ష్మి మా ఇంటికి వచ్చింది" అని ఆఫీసులో అందరికి స్వీట్లను పంచి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
సుధ తన ముద్దుమచ్చట్లు, ఆటపాటలతో అందరినీ అలరిస్తూ అల్లారుముద్దుగా పెరుగుతోంది. తమకు ఉన్నంతలో ఏలోటూ లేకుండా సుధని ప్రేమగా చూసుకుంటూ మంచి స్కూలులో చేర్చారు రమణయ్య దంపతులు.
సుధ కూడా చక్కగా చదువుతూ మంచి మార్కులతో పదవతరగతి పాసయింది. సుధని ఆ ఊరిలోని కాలేజీలో ఇంటరులో చేర్చాడు రమణయ్య. సుధ కష్టపడి చదువుతూ ఇంటరు పూర్తిచేసి డిగ్రీలో చేరింది. కూతురిని చూసి మురిసిపోయేవాడు రమణయ్య. సుధ డిగ్రీ ఫైనలియర్లో ఉండగా ఒక దారుణం జరిగింది.
హాయిగా, సంతోషంగా సాగుతున్న వాళ్ల జీవితాలను చూసి 'విధికి కన్నుకుట్టిందా?' అన్నట్లుగా రమణయ్య ఒక రోజు ఆఫీసునుంచి వస్తూండగా యాక్సిడెంట్ అయింది. ఆయనకి బాగా దెబ్బలు తగిలాయి. చుట్టుప్రక్కల వాళ్లు చేరి అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేశారు.
అంబులెన్స్ రాగానే వాళ్లే రమణయ్యని తీసికెళ్లి అక్కడికి దగ్గరలోని హాస్పిటల్లో చేర్చారు. ఈలోగా పోలీసులు కూడా అక్కడికి చేరుకుని రమణయ్య జేబులో ఉన్న ఫోన్లోని నెంబర్ల ఆధారంగా కాంతమ్మా వాళ్లకి విషయాన్ని తెలిపి హాస్పిటల్ అడ్రసుని ఇచ్చారు.
ఆ సమయంలో సుధ కూడా ఇంట్లో ఉంది. జరిగింది విని హడావుడిగా తల్లిని తీసుకుని హాస్పిటల్ కు వచ్చింది సుధ. డాక్టర్లు రమణయ్యని బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కక ఆయన శాశ్వతంగా ఈలోకాన్ని విడిచి వెళ్లాడు. జరిగిన దారుణానికి కాంతమ్మ, సుధలు భోరున విలపించారు. పోలీసులు వాళ్లని అనునయించి, ధైర్యం చెప్పి తమ పనిని తాము నిర్వర్తించి రమణయ్య పార్ధివ దేహాన్ని ఆయన ఇంటికి చేర్చారు.
సుధ తనని తాను నిబ్బరించుకుని తల్లిని ఓదార్చింది. రమణయ్య పనిచేసే ఆఫీసు వాళ్లకి, దగ్గరి బంధువులకు విషయాన్ని తెలిపింది. వాళ్లొచ్చి రమణయ్యను ఆఖరి చూపు చూసి ఆ తల్లీకూతుర్లను ఓదార్చి జరగవలసిన కర్మకాండలన్నీ సుధ చేత యధావిధిగా జరిపించారు.
అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయాక ఆ రాత్రి సుధే తల్లిని చూసుకుంటూ ఆవిడని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పది రోజులు కాలేజీకి శెలవుపెట్టి తల్లిని ఒంటరిగా ఉండనీయకుండా ఆవిడతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ కంటికి రెప్పలా చూసుకుంది సుధ.
కాలం ఎంతటిగాయాన్నైనా మాన్పుతుంది. సుధ పరిచర్యలతో, ఓదార్పు మాటలతో కాంతమ్మ ఆ బాధనుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. సుధ మరలా కాలేజీకి వెళ్లి చక్కగా చదువుకుంటోంది.
రమణయ్య పనిచేసే ఆఫీసు వాళ్లు ఆయనకి రావలసిన డబ్బుని కాంతమ్మా వాళ్లకు ఇవ్వగా సుధ దాన్ని కొంత డిపాజిట్ వేసి మిగిలిన దాన్ని జాగ్రత్తగా వాడుతూ ఇంటిని నడుపుతోంది. ఏదో చప్పుడైతే కాంతమ్మ తృళ్లిపడి గతస్మృతులనుంచి తేరుకుని వంటగదిలోకి వెళ్లింది.
కాలేజి అయిపోగానే విజయ్, సుధలు సినిమాకు వెళ్లారు. ఆ తర్వాత సుధని ఇంటివద్ద దింపి తనింటికి వెళ్లాడు విజయ్. ఆ రాత్రి సుధకు విజయ్ ని గురించిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు.
========================================================================
ఇంకా ఉంది...
========================================================================
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comentarios