ఖైదీ కాపురం - పార్ట్ 2
- Kasivarapu Venkatasubbaiah
- Sep 5
- 6 min read
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #ఖైదీకాపురం, #KhaidiKapuram

Khaidi Kapuram - Part 2/2 - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 05/09/2025
ఖైదీ కాపురం - పార్ట్ 2/2 - పెద్ద కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సంధ్య, రవిచంద్రల వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో పోలీసులు వచ్చి, ఒక హత్య కేసులో చెయ్యని నేరానికి రవిచంద్ర ఇరుక్కున్నట్లు చెబుతారు. అందరూ పెళ్లి రద్దు చేసుకుందామంటారు. కానీ సంధ్య, రవిచంద్రతో విడిపోవడానికి అంగీకరించదు. కేసు పదేళ్లు సాగుతుంది. ఇతర ముద్దాయిలతో పాటు రవిచంద్రకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.
ఇక ఖైదీ కాపురం పెద్దకథ చివరి భాగం చదవండి.
తన బంధువులైన ఖైదీలతో కలిసి కడప సెంట్రల్ జైలు చేరిన రవిచంద్ర అక్కడి ఖైదీలకు తనను తాను పరిచయం చేసుకొని వారి గురించి తెలుసుకున్నాడు.
మరునాటి ఉదయం పెరేడ్ గ్రౌండ్లో జైలర్ రామచంద్రరావు కొత్త ఖైదీలను పరిచయం అడుగగా రవిచంద్ర తన గురించి చెపుతూ తాను ప్రొద్దుటూరు దగ్గర పెన్నోలు గ్రామమని, B. A Bed చదువుకున్నాడని, చేయని నేరానికి శిక్ష పడిందని, ఖైదీల్లో ఎవరికైనా చదుకోవాలనే వారికి టెన్త్, ఇంటర్, డిగ్రీ తరుగుతులకు చదువు చెప్పుతానని, ఆసక్తి ఉన్న ఖైదీలకు కోలాటం, చెక్కభజన, జానపద పాటలు నేర్పుతాననీ, పోలీసు సిబ్బంది పిల్లలకు ఇంగ్లీషు లెసన్స్ టీచింగ్ చేస్తానని తెలిపాడు రవిచంద్ర.
దానితో అతనిపై పోలీసులకు ఖైదీలకు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. ఖైదీల్లో ఓ పదిహేను మంది వివిధ తరగతులు చదవడానికి తయారైనారు. ఓ ఇరవై మంది ఖైదీలు కోలాటం చెక్కభజన మొదలైనవి నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. జైలర్ రామచంద్రరావు గారి పిల్లలకు కూడా ఇంగ్లీషు ట్యూషన్ చెప్పడానికి రెడీ అయ్యాడు రవిచంద్ర.
అందరికీ అన్నీ వివిధ సమయాల్లో నేర్పుతూ వస్తున్నాడు రవిచంద్ర. తన పిల్లలకు ఇంగ్లీషు నేర్పేటప్పుడు రవిచంద్ర ఇంగ్లీష్ ఉచ్చారణకు జైలర్ రామచంద్రరావు ముచ్చట పడ్డాడు. రవిచంద్ర మీద అభిమానం పెంచుకున్నాడు. రామచంద్రరావు భార్య సర్వమంగళతో "మేడం! మార్కెట్టుకు గానీ, పచారకొట్టుకు గానీ, మాంస కటికకు గానీ పొయిరావాల్సి ఉంటే చెప్పండి పోయి వస్తాను" చెప్పాడు రవిచంద్ర.
"సరేలే రవిచంద్రా! మీ రైతులకు ఓపిక ఎక్కువ" నవ్వుతూ అన్నది సర్వమంగళ.
ఆదివారం సంధ్య, పిల్లలు, అమ్మానాన్న రవిచంద్రను చూడడానికి జైలుకు వచ్చారు. వారిని చూడగానే రవిచంద్రకు ప్రాణం లేచి వచ్చింది. వారందరినీ రామచంద్రరావు ఇంటికి తీసుకెళ్ళి వారి కుటుంబానికి పరిచయం చేశాడు. వారు అభిమానంగా పలకరించారు.
"మీ వాడి విషయంలో మీకేం భయం వద్దండీ. అంతా నేను చూసుకుంటాను". ధైర్యం చెప్పాడు రామచంద్రరావు.
ఒక రోజు ముందు రవిచంద్ర ఫోన్లో చెప్పడం వల్ల సంధ్య జాడినిండా ఊరగాయ తీసుకొచ్చి సర్వమంగళ మేడంకు ఇచ్చింది.
"రవిచంద్రా! మీ వాళ్ళు వచ్చినప్పుడు మన ఔట్ హౌస్ లో ఉండండి. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పక్కనే సినిమా హాల్ ఉంది. పోతారేమో పోండి. సిటీ తిరిగి వస్తారేమో తిరిగిరండి" రామచంద్రరావు చెప్పడంతో కృతజ్ఞతలు తెల్పి ఔట్ హౌస్ లోకి వెళ్లిపోయారు.
తల్లిదండ్రులు కొద్దిసేపు కొడుకుతో ముచ్చటించి సినిమా చూసి వస్తాం అంటూ పిల్లలను వెంటబెట్టుకుని పోయారు. భార్యాభర్తలు భూముల గురించి, సంసారం గురించి చెప్పుకొని సాయంత్రం వరకు ఖుషిగా గడిపారు. సాయంత్రం అందరూ ఊరికి వెళ్ళిపోయారు.
ఇదే టైంలో లాయర్ రంగనాథ్ రవిచంద్ర కేసును హైకోర్టులో అప్పీలు చేశాడు కానీ, దురదృష్టం కొద్దీ హైకోర్టు కూడా క్రింది కోర్టు తీర్పునే ఖాయం చేసిందని తెలిసి రవిచంద్ర నిరాశ పడ్డాడు.
సంక్రాంతి పండుగ రోజు రవిచంద్రను ఇంటికి పంపదలచి రామచంద్రరావు- కానిస్టేబుల్తో రవిచంద్రను పిల్లంపి " నీకు జ్వరం వచ్చినందువల్ల కానిస్టేబుల్ నిన్ను ఆసుపత్రికి తీసుకు పోయాడు అని రాసుకుంటారు, పండుగ పూట నువ్వు ఇంటికి పోయి భార్యాబిడ్డల్తో గడిపి, సాయంత్రం ఆరు గంటల లోపల రాపో రవిచంద్రా!" అని చెప్పి "కానిస్టేబుల్! రవిని బస్సు ఎక్కించి నువ్వు కూడా మీ ఇంట్లో సాయంత్రం దాకా గడిపి రవి బస్సు దిగగానే వెంటబెట్టుకొని రా" ఆర్డర్ వేశాడు రామచంద్రరావు.
సంతోషపడి రవిచంద్ర ఎనిమిది గంటల కల్లా ఉషారుగా ఇల్లు చేరాడు. వంటింట్లో ఉన్న సంధ్యను వెనుకమళ్ళుగా బోయి వాటేసుకున్నాడు రవిచంద్ర. ఉలిక్కిపడిన సంధ్య వేగంగా వెనక్కుతిరిగి భర్తను చూసి ఆశ్చర్యం ఆనందంలో మునిగి పోయింది సంధ్య.
"ఎలా వచ్చావు" సంబరంగా అడిగింది.
"మా సారుకు నా మీద ఉన్న అభిమానం వల్ల వచ్చాను" అన్నాడు రవిచంద్ర.
"ఎవరోని భయంతో చచ్చాను" సంధ్య అంటే "ఔనా.. అయితే నీ కరాటే కిక్కుకు వాడు చచ్చి ఉండేవాడే" అని రవిచంద్ర అనగానే ఆశ్చర్యపోయిన సంధ్య "నీకెలా తెలుసు నాకు కరాటే వస్తుందని" అనింది.
"నాగురించి నువ్వు తెలుసుకున్నాక, నీగురించి నేను తెలుసుకోలేనా!" అన్నాడు చిలిపిగా నవ్వుతూ రవిచంద్ర.
భర్తను ప్రేమతో బిగించార కౌగలించుకుంది సంధ్య.
సాయంత్రం ఐదు గంటల దాకా భార్యాబిడ్డలతోనూ అమ్మానాన్నలతోనూ ఆనందంగా గడిపి జైలు చేరుకున్నాడు రవిచంద్ర.
దాదాపు మూడేళ్లు గడిచాయి. రవిచంద్ర దగ్గర చదువుకుంటున్న ఖైదీలు అందరూ ప్రైవేటుగా రాసి పాసై తరువాత తరగతికి పోయ్యారు. కళలు సాధన చేస్తున్నవారు అందులో నిష్ణాతులై స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రదర్శించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.
అదే రోజు సంధ్య ఊరినుంచి తమ చేనిలో పండిన రెండు బస్తాలు వేరు శనక్కాయలు తీసుకొచ్చింది. ఒక మూట ఖైదీలకు, పోలీసు సిబ్బందికి పంచింది. మరో మూట జైలర్ రామచంద్రరావు ఇంట్లో ఇచ్చింది. వారందరూ చాల సంతోషించారు.
తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని సిటీ చూపించడానికి పోయారు. సంధ్య రవిచంద్ర ఔట్ హౌస్ లో ఖుషిగా కబుర్లు చెప్పుకుంటూ అందంగా గడిపారు.
ఆ సందర్భంగా రవిచంద్రతో "ఈయేడు సరీగ్గా వర్షాలు పడనందున పంటలు బాగా పండలేదు. ఇలాగే కొనసాగితే మనం కష్టపడాల్సి ఉంటుంది. " అంది సంధ్య.
"చూస్తాం భవిష్యత్తు ఎలా ఉంటుందో" సమాధానంగా చెప్పాడు రవిచంద్ర.
అటు కొన్నాళ్ళకు జైలర్ రామచంద్రరావు రవిచంద్ర వాళ్ళ బంధువు ఎవరో చనిపోయారన్న సాకుతో పదిరోజులు ఇంటికి పంపాడు. మరికొంత కాలానికి పెరోల్ పై ఆరు నెలలు ఇంటికి పంపాడు. రామచంద్రరావు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకొని రవిచంద్రను ఇంటికి పంపుతూ వచ్చాడు.
అతనిపై ఆయన పెంచుకొన్న అభిమానం అలాంటిది.
రవిచంద్ర పెరోల్ పై వచ్చిన ఏడాది కూడా వానలు సరీగ్గా పడక పంటలు పెద్దగా పండలేదు. రవిచంద్ర తెల్లవారుజామునే లేచి తమ ఊర్లోని పాలను సేకరించి, టౌన్లో టి షాపులకు పోసి, అలాగే ఒక ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెప్పేవాడు.
రవిచంద్ర తండ్రి రామసుబ్బయ్య చలికి పండే శనగ పంట పండించేవాడు. అలా ఆరు నెలలు ముగియడంతో రవిచంద్ర జైలుకు తిరిగి వెళ్లిపోయాడు.
రవిచంద్ర దగ్గర చదువుకున్న ఖైదీలు పట్టాలు అందుకున్నారు. కళలు అభ్యసించినవారు పరిపూర్ణులైనారు. పోలీసుల పిల్లలు కాలేజిలకు పోతున్నారు. రవిచంద్రకు ఐదేండ్ల శిక్షాకాలం పూర్తైంది.
ఓ ఆదివారం సంధ్య జైలుకు వచ్చి జైలర్ రామచంద్ర రావును కలిసి "మూడేండ్లగా సరీగ్గా వర్షాలు పడనందున వ్యవసాయంలో నష్టం వస్తుందని, కరువు అలుముకుందనీ, జీవితం గడవడం కష్టంగా ఉందని, మా భర్త ఉండివుంటే టౌన్లో ఏదోక వ్యాపారం చేసి సంసారాన్ని నడిపేవాడనీ, ఏదోకటి ఆలోచించి మా ఆయన ఈ గడ్డు పరిస్థితిలో మాకు అండగా ఉండేటట్లు చూడండి సార్" అని వేడుకుంది.
"ఏదోకటి ఆలోచిస్తాను, రేపాదివారం మీ అత్తామామలను పిలుచుకొని రా!" అని చెప్పి సంధ్యను పంపించాడు రామచంద్రరావు.
మరుసటి ఆదివారం జైలర్ చెప్పినట్లే అత్తామామల్ని పిలుచుకొని వచ్చింది సంధ్య.
"రామసుబ్బయ్యా! మీ కొడుకు ప్రవర్తన గురించి పై అధికారులకు మంచిగా రాశాను. అలాగే మీ కరువు సమస్య పైవారికి తెలిపి, రవిచంద్ర మీద నిర్ణయం తీసుకొనే అధికారం పొందాను. మీ వాడిని అనంతపురం సెంట్రల్ జైలుకు పంపుతాను. అక్కడ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఉదయం ఆరు గంటలకు బయటికి వదిలేసి సాయంత్రం ఆరు గంటలకు జైలుకు రప్పించే విధానం ఉంది.
మీ వాన్ని కూడా ఉదయం ఆరు గంటలకు బయటికి వచ్చే ఏర్పాటు చేస్తాను. అక్కడ ఏదోక వ్యాపారం చేసుకుని బతుకండి. నువ్వు పోయి జైలుకు దగ్గరగా ఇల్లు బాడుగకు తీసుకో! ఇంకా ఇతరత్రా పనులుంటే పూర్తి చేసుకొని రేపు ఆదివారాని ఇక్కడికి రాండి. అందరూ కలిసి పోలీసు జీపులో అనంతపురం పోవుదురు. మీ వాడిమీద అభిమానంతో నేను చేయగలిగిందంతా చేస్తున్నాను. " ఆత్మీయంగా చెప్పి పంపించాడు రామసుబ్బయ్యను.
రామసుబ్బయ్య అనంతపురం వెళ్ళి అన్నీ చక్కబెట్టుకొని వచ్చాడు. భూముల్ని కౌలుకు ఇచ్చి, ఇంటిని బాడుగకు ఇచ్చి, కౌలు, బాడుగ డబ్బుల్ని ఫోన్పె చేస్తుండమని చెప్పి, పాడి ఎనుముల్ని, కాడి ఎద్దుల్ని అమ్మేసి. వ్యవసాయ పనిముట్లను కల్లందొడ్డిలో భద్రపరిచి. ఇంటి సామాన్లను లారిలో ఎత్తుకొని పోయి అనంతపురం బాడిగింట్లో సర్ది ఆదివారానికల్లా కుటుంబ సభ్యులతో కలిసి కడప జైలుకు వచ్చాడు రాసుసుబ్బయ్య.
అప్పటికే రవిచంద్ర ఇద్దరు పోలీసులతో కలిసి రామచంద్రరావు ఇంట్లో ఉన్నాడు.
"రవిచంద్రా! నిన్ను పంపిస్తుంటే సొంత కొడుకు పోతున్నట్టు బాధగా ఉంది. అంతలా మా కుటుంబానికి దగ్గరయావు. గతంలో నేను ఏ ఖైదీపైనా ఇంతలా అనుబంధం పెంచుకో లేదు. శిక్షా కాలం పూర్తి అయ్యాక భార్యాభర్తలు తరుచుగా మనింటికి వస్తూ ఉండండి. అనంతపురం జైలర్ నా స్నేహితుడే. నీ గురించి చెప్పాను. అతడు నిన్ను మంచిగా చూసుకుంటాడు పోలీసులు నీ వెంట వచ్చి నిన్ను అంతఃపురం జైల్లో అడ్మిట్ చేసి వస్తారు. " జాగ్రత్తలు చెప్పి రామచంద్రరావు సర్వమంగళతో కలిసి రవిసంధ్యలకు కొత్త బట్టలు పెట్టారు.
ఆ దంపతుల కాళ్ళకు నమస్కరించి పోలీసు జీపులో బయలుదేరారు సంధ్యా రవిచంద్రలు కుటుంబంతో కలిసి.
అనంతపురం ఇంట్లో చేరిన కుటుంబం రవిచంద్ర కోసం ఎదురుచూస్తుంటే ఉదయం ఏడు గంటలకు జైలు నుంచి వచ్చాడు.
యోచన్ను ఇంటర్ కాలేజిలో, సృజన్ను హైస్కూల్లో చేర్పించి, నాన్నకు ఇంట్లోనే చిల్లర అంగడి పెట్టించి, అమ్మ సీతమ్మను ఇంట్లో పని చూసుకోమని చెప్పి సంధ్యా రవిచంద్రలు మార్కెట్లో పూలు పండ్లు తోపుడు బండిపై అమ్మడం మొదలు పెట్టారు. ఇదే వారికి నిత్యకృత్యమై సాగింది.. అలా జీవితం సాఫీగా జరిగి పోయింది.
మరో మూడేళ్ల గడిచాయి. వానలు మొదలైయాయి. ఏరు పారిందనీ, చెరువు నిండిందనీ ఊరి నుంచి వార్తలు వచ్చాయి. ఈ లోపల సత్ప్రవర్తనపై రవిచంద్ర విడుదలైయాడు. ఆనందం వెల్లివిరిసింది. సంతోషం పాలవెల్లిలా పొంగింది. ఊరి నుంచి అత్తామామలు, అక్కా బావలు బంధుమిత్రులు వచ్చి సంబరాల్లో పాలుపంచుకున్నారు.
రామసుబ్బయ్య ఊరికెళ్ళి ఇల్లు ఖాళీ చేయిచాడు. భూముల్ని కౌలు నుంచి విడిపించాడు. పాడి ఎనుముల్ని, కాడెద్దుల్ని మళ్లీ కొన్నాడు.
రవిచంద్ర అనంతపురం నుంచి సామాన్లు లారిలో తెచ్చి ఇంట్లో చేర్చాడు. పిల్లల్ని డిగ్రీలో ఒకర్ని, ఇంటర్లో ఒకర్ని చేర్చించాడు. నాన్నకు వ్యవసాయంలో సాయం అందిస్తునే రవిచంద్ర ప్రొద్దుటూరు ప్రైవేటు కాలేజీలో లెక్చరరుగా చేరాడు. సంధ్య ఊర్లోనే ప్రైవేటు హైస్కూల్లో టీచరుగా చేరింది.
ఆరాత్రి అందరూ ప్రశాంతంగా గాఢంగా నిద్రపోయారు. సంధ్య రవిచంద్ర రూంలో మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.
"ఏం బాబూ! నన్ను చేసుకోవడం వల్ల నీవేమి నష్టం పోయావు. మన పెళ్లైయి పద్దెనిమిది సంవత్సరాలు అయింది. ఖైదీగా ఉన్నా కలిసే ఉన్నాం. శారీరక సుఖం పొందాం. ఇద్దరి బిడ్డలకు జన్మనిచ్చాం. అందరికంటే మనం ఏం కోల్పోయాం. ఆరోజు విడిపోయింటే నీయంతా మంచి భర్త నాకు దొరికివుండేనా! నాలాంటి మంచి భార్య నీకు దక్కివుండేనా! చెప్పు!" భర్తను అడిగింది సంధ్య.
"సంధ్యా! నువ్వు మంచిదానివి. సమయ స్ఫూర్తిగా ఆలోచిస్తావు, సహనమూర్తివి. ఓర్పు నేర్పు కలదానివి. వివాహ పవిత్రత తెలిందానివి. ప్రేమ తెలిసిన దానివి కాబట్టి నాకు అంతా మంచే జరిగింది. ఇంకెవరైనా అయివుండింటే ఈ ఖైదీతో కాపురం చేసి ఉండేవారా! విఫలం కావాల్సిన నా జీవితాన్ని సఫలం చేశావు సంధ్యా! నీకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను" అంటూ భార్యను గుండెలకు హత్తుకున్నాడు.
భర్త గుండెలపై పరవశంతో హాయిగా నిద్రించింది సంధ్య.
మరుసటి రోజు ఉదయం సూర్యుడు కొంగ్రొత్త వెలుగులు విరజిమ్ముతూ ఉదయించాడు.
========================================================================
సమాప్తం
========================================================================
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను
Comments