top of page

కొడవలి పట్టిన చేతులు

'Kodavali Pattina Chethulu' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'కొడవలి పట్టిన చేతులు' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“ఓ శాంతమ్మ, ఈ పండక్కైనా మీ బావ నీకు ఓ చీర కొంటాడా “ అడిగింది రంగమ్మ.


కొడవలితో వరి మొక్కలను కోస్తున్న శాంతి ఏం మాట్లాడలేదు. మళ్ళీ రంగమ్మే “ఏమే శాంతమ్మ మాట్లాడవేం?” అంది.


“నా పేరు శాంతమ్మ కాదు “శాంతి” అని నీకు చాలా సార్లు చెప్పాను. అందుకే నేను మాట్లాడలేదు”అంది శాంతి చిరు కోపంగా.


అది చూసి రంగమ్మ గట్ట్టిగా నవ్వింది.

“నీ కోపం మా మీదే. మీ బావ వస్తే కుక్క పిల్లలా ఆది ఎనకే తిరుగుతావు. ఇంతకీ చీర సంగతి చెప్పలేదు”అంది రంగమ్మ.


తలవంచుకుని పని చేసుకుంటూ “ఆ విషయం మా బావనే అడుగు” అంది శాంతి.

రంగమ్మ పక్కనే ఉన్న రమణమ్మ “ఏమిటో దీని అమాయకత్వం. ఇది రెక్కలు ముక్కలు చేసుకుని ఆడ్ని చదివిస్తన్నాది. వాడు చదువు అయ్యాకా దీన్ని పెళ్లి చేసుకుంటాడా? అని నా అనుమానం. పడవ దిగాకా పోరా బోడి మల్లన్నా అనే వాళ్ళు ఎక్కువ కదా “అని దీర్ఘం తీసింది.


“మా బావ అటువంటి వాడు కాదు. మా నాన్న చేతిలో చెయ్యేసి చెప్పాడు ‘నేను శాంతిని పెళ్లి చేసుకుంటానని” అంది సిగ్గుగా శాంతి.


“కబుర్లు తర్వాత. ముందు పని చూడండి” అంది మేస్త్రి నాగమ్మ.


ఆ మాటకి అందరూ గబా గబా పని చేయడం మొదలుపెట్టారు. సాయంత్రానికి రెడ్డి గారి పొలం మొత్తం కోసి పనలు కట్టి ఇళ్ళకు వెళ్ళారు.


శాంతికి మేనత్త కొడుకు మనోహర్. చిన్నప్పుడే తల్లి, తండ్రి చనిపోతే శాంతి తండ్రి నారాయణ శివపురం తీసుకువచ్చి పెంచి పెద్దచేసాడు. మనోహర్ డిగ్రీ చదువుతుండగా రోడ్ ఆక్సిడెంట్ లో నారాయణ చనిపోయాడు. శాంతి బాధ్యత తాను వహిస్తానని, పెళ్లి చేసుకుంటానని మేనమామ చనిపోయేముందు మనోహర్ వాగ్దానం చేసాడు.


తండ్రి చనిపోవడంతో కూలి పనికి వెళ్లి ఆ డబ్బులుతో జీవిస్తోంది శాంతి. మనోహర్ డిగ్రీ అయ్యాకా ఎం. ఎ. చదవాలని ఉంది అంటే, శాంతి తన బంగారం అమ్మేసి అతనికి ఫీజులు కట్టింది.


మనోహర్ కి డబ్బులు పంపడం కోసం ఉదయాన్నే పాల పేకెట్ లు వేసి ఆ డబ్బు అతనికి పంపేది. బావే సర్వస్వం గా బతుకుతోంది శాంతి.


శాంతి ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సంక్రాంతి పండుగకు మనోహర్ వచ్చాడు. కానీ ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి తన క్లాస్ మేట్ కల్పన అని శాంతి కి పరిచయం చేసాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాకా శాంతి వంటింట్లో ఉంది. మనోహర్, కల్పన హాలులో ఉన్నారు. శాంతికి తెలియకూడదని ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు.


‘ఏమిటి, నీ మరదలు అంత పల్లెటూరి బైతు లా ఉంది. ఏం చేస్తుంది?’ అడిగింది కల్పన.


‘ఆ. కూలిపనికి పోతుంది ఓ కొడవలి చేత్తో పట్టుకుని. వరి కోతలకు వెళ్ళడం, రోడ్ పక్కన కంపలు కొట్టడం, ఇటుకలు మొయ్యడం అన్నీ చేస్తుంది’ అన్నాడు మనోహర్ వెటకారంగా.


ఇద్దరూ శాంతి మీద జోకులు వేసుకుని నవ్వుకున్నారు. ఇక్కడ మనోహర్ కి తెలియని విషయం ఒకటుంది. పదవతరగతి తో చదువు ఆపేసిన శాంతిని, రామ్మూర్తి మాస్టారు ప్రైవేటు గా బి. ఎ. కట్టించారని. వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకున్న సంగతులు అన్నీ శాంతి కి పూర్తిగా అర్ధమయ్యాయి.

ఆమె మనసు నిండా అమావాస్య చీకట్లు ముసురు కున్నాయి. తనంటే ఎంతో ప్రేమగా ఉండే బావ ఇలా మాట్లాడతాడని ఆమె ఊహించలేదు. అందుకే సాయంత్రం నాలుగు గంటలకే మనోహర్ వెళ్లిపోతానంటే ‘అలాగే’ అంది. మనోహర్ ఎం. ఎ. ఇంగ్లీష్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.


*****

ఎం. ఎ. పరీక్షలు అయినా మనోహర్ శివపురం రాలేదు. సిటీలోనే ఉండి జాబ్ వెతుక్కుంటానని ఉత్తరం రాసాడు. మూడు నెలలు గడిచాయి. తాను ఎం. ఎ. పాస్ అయ్యానని, ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యానని వీలు చూసుకుని శివపురం వస్తానని రాసాడు. బావ ఎం. ఎ. పాస్ అయినందుకు చాలా సంతోషించింది శాంతి. అది తన తండ్రి కోరిక.


‘ఒరేయ్ అల్లుడూ, నువ్వు పెద్ద మాస్టర్ అయ్యి పెద్ద కాలేజీ లో ఉద్యోగం చెయ్యాలి’ అని తరుచూ అనేవాడు నారాయణ.


తండ్రి కోరిక, బావ ముచ్చట కోసం తన చదువు పక్కకు పెట్టి రాత్రి, పగలూ కష్టపడి బావని చదివించింది. గోడనున్న తండ్రి పటం దగ్గరికి వెళ్లి, ‘నాన్నా, బావ ఎం. ఎ. పూర్తి చేసాడు. నీ కోరిక తీర్చాను నాన్నా’ అంది ఆనందంగా శాంతి. మనోహర్ ఆరు నెలలు అయినా శివపురం రాలేదు.


ఒక రోజు రంగమ్మ గుండెలు బాదుకుంటూ’అమ్మా నీ బతుకు బండలు అయ్యిందే ‘ అంటూ శాంతి దగ్గరకు వచ్చింది.


‘ఏమయ్యింది పిన్నీ’ ఆందోళనగా అడిగింది శాంతి.


‘మీ బావ ఇంకో అమ్మాయిని రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నాడట. మా తమ్ముడు చెప్పాడు’ అంది బాధగా రంగమ్మ.


ఆమె మాటలు వినగానే కూలబడిపోయింది శాంతి. తను అనుమానిన్చిందే జరిగిందని ఆమెకి అర్ధమయ్యింది. బావ తన దారి తను చూసుకుని తనని నడిరోడ్డు మీద వదిలేసాడని. ఆమెకి ఏడుపు రాలేదు.


తండ్రి పటం కేసి చూసి ‘చూసావా నాన్నా.. నీ మేనల్లుడు చేసిన పని. మనిషి స్వార్ధజీవి అని నిరూపించాడు’ అని మనసులోనే గొణిగింది. ఇరుగు, పొరుగు వచ్చి శాంతి కి సానుభూతి తెలిపారు.


“శాంతి కి ద్రోహం చేసిన వాడు నాశనం అయిపోతా”డని శాపనార్ధాలు పెట్టారు.


శాంతి వారిని వారించింది. నా దురదృష్టానికి ఇంకొకరు బాధ్యులు కారు అని బాధపడింది.


మర్నాడు రామ్మూర్తి మాస్టారు వచ్చి శాంతిని తన ఇంటికి తీసుకువెళ్ళారు, వంటరిగా ఉంటె లేని పోనీ ఆలోచనలు వస్తాయని. ఆ రాత్రే చిన్న కొడుకుతో మాట్లాడారు శాంతి గురించి. ఆ మర్నాడు హాలులో ఉన్న శాంతి ఎదురుగా ఉన్న కుర్చీ లో కూర్చున్నారు మాస్టారు.


‘చూడమ్మా శాంతి. మనిషికి కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. మనల్ని దెబ్బ కొట్టిన వ్యక్తిని అలా వదిలెయ్య కూడదు. లేచి నిలబడి మన సత్తా చూపించాలి. అదీ ధీరుడి లక్షణం. చదువు మీద దృష్టి పెట్టు. నీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకో. దాన్ని సాధించడానికి పోరాడు. విజయం నీదే. మీ నాన్న నీకు పెట్టిన పేరు గుర్తు తెచ్చుకో. విజయం నీ పేరులోనే ఉంది.


మా అబ్బాయి వైజాగ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. నిన్ను తన దగ్గరకు పంపించమన్నాడు. నీ చదువుకి, నీ లక్ష్యానికి వాడు ఆలంబనగా ఉంటాడు. ఏమంటావు?’ అన్నారు మాస్టారు.


రెండు నిముషాలు ఆలోచించి ‘వైజాగ్ వెళ్తాను మాస్టారు. నన్ను దీవించండి’ అని ఆయనకి నమస్కరించింది.


‘విజయోస్తు ‘ అన్నారు మాస్టారు. మర్నాడే మాస్టారు శాంతి ని వైజాగ్ తీసుకువెళ్ళి కొడుకు ఇంట్లో దించి వచ్చారు.


అప్పుడప్పుడు వెళ్లి శాంతిని చూసి వస్తున్నారు. శాంతి పూర్తిగా చదువులో మునిగిపోయింది.

****

-4-

కాలచక్రంలో పదేళ్ళు గిర్రున తిరిగాయి. రాజమండ్రి లో విజయ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ముందు నిలబడి బాధపడుతోంది ఒక స్త్రీ.


“మేడం, మీరు దయ చూపాలి. నేనూ మా వారూ ఓ ప్రైవేటు కాలేజీ లో లెక్చరర్లు గా పనిచేసేవాళ్ళం. కరోనో వచ్చి కాలేజీ డైరెక్టర్ చనిపోయారు. కాలేజీ మూసేశారు. ఎన్ని చోట్ల తిరిగినా ఎవరూ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వేరేదారిలేక ట్యూషన్లు చెప్పాం. ఇప్పుడు అవీ తగ్గిపోయాయి. మాకు ఇద్దరు పిల్లలు. జీవించడం చాలా కష్టంగా ఉంటోంది.


మీ ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది. ఇవిగో నా సర్టిఫికెట్ లు, చూడండి. దయచేసి ‘నో ‘ అని చెప్పకండి” అంటూ వణుకుతున్న చేతులతో డైరెక్టర్ చేతికి ఇచ్చింది ఓ ఫైల్. సర్టిఫికేట్ మీద, కల్పన అన్న పేరు చూసి, డైరెక్టర్ ఆమెకేసి పరిశీలనగా చూసింది.


మనిషి బాగా చిక్కి పోయింది. మెడలో నగలు ఏమీ లేవు. ఒక నూలు తాడుకి మంగళసూత్రాలు ఉన్నాయి. కట్టుకున్న చీర కూడా నలిగిపోయి ఉంది.


“మీ రికార్డు బాగుంది. మీ పరిస్థితులు చూసి జాలిపడి ఉద్యోగం ఇస్తున్నాను. కానీ మీరు కొంచం ‘డీసెంట్’ గా తయారై ఇన్స్టిట్యూట్ కి రావాలి. నెలకి ఇరవైవేలు జీతం. అడ్వాన్సు ఐదువేలు ఇస్తారు. తీసుకుని మీకు కావాల్సినవి కొనుక్కోండి’ అని కూర్చోమని సైగ చేసింది.


ఆమెకి కాఫీ తెప్పించి ఇచ్చి, అప్పాయింట్మెంట్ ఆర్డర్ సంతకం చేసి ఇచ్చింది. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ లలో ఉన్న విజయ కోచింగ్ సెంటర్ లకు చాలా పేరుంది. ఎంతోమందిని సివిల్స్ పరీక్షలకు పంపిన ఘనత వారిది. మరో ఆరు నెలలు గడిచేసరికి ఇంకో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ ఖాళీ అయ్యింది. భర్తని తీసుకుని వచ్చింది కల్పన, ఆ పోస్ట్ భర్తకి ఇమ్మని.


మనోహర్ని పరీక్షగా చూసింది డైరెక్టర్. మనిషి సన్న బడ్డాడు. కళ్ళకింద నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. అతని స్టితికి ఆమెలో కొద్దిగా జాలి చోటుచేసుకుంది.. డైరెక్టర్ టేబుల్ మీదున్న ‘డాక్టర్. విజయ, ఎం. ఎ. పి. హెచ్. డి’అన్న నేమ్ ప్లేట్ చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్.

తల పైకెత్తి చూసాడు. నాజూకుగా ఉన్న మొహానికి తేనె రంగులో ఉన్న కళ్ళజోడు, మెళ్ళో వజ్రాల హారం, చేతులకి రవ్వల గాజులు, చాలా హుందాగా ఉంది డైరెక్టర్.


‘చూడండి మనోహర్! కల్పన చెప్పిందని ఈ ఉద్యోగం మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా పనిచేయండి. మీ టీచింగ్, ప్రవర్తన బాగుంటే కంటిన్యూ అవుతారు. లేదంటే మిమ్మల్ని తొలగించాల్సి వస్తుంది” అని అప్పాయింట్మెంట్ ఆర్డర్ సంతకం చేసి ఇచ్చింది విజయ శాంతి.


“లేదు మేడం. చాలా జాగ్రత్తగా ఉంటాను. కష్ట పడతాను. థాంక్స్ మేడం “లేచి నిలబడి నమస్కారం చేసాడు మనోహర్.


కొడవలి పట్టిన చేతులే తనకి ఆర్డర్ ఇస్తున్నాయని, తన కుటుంబాన్ని బ్రతికిస్తున్నాయని తెలియలేదు మనోహర్ కి.


ఎందుకంటే శాంతి కట్టు, బొట్టు, మాట అన్నీ మారిపోయాయి!

******

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.



45 views0 comments

Comments


bottom of page