కోలాటం
- Mukkamala Janakiram

- Oct 5
- 3 min read
#MukkamalaJanakiram, #ముక్కామలజానకిరామ్, #Kolatam, #కోలాటం, #TeluguStories, #తెలుగుకథలు

Kolatam - New Telugu Story Written By Mukkamala Janakiram
Published In manatelugukathalu.com On 05/10/2025
కోలాటం - తెలుగు కథ
రచన: ముక్కామల జానకిరామ్
"కోలాటాలకు ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది" అని చర్చించుకోసాగారు పిల్లలు. ‘
"ఎవరెవరు గుంపుగా ఉండాలి" అని మాట్లాడుకుంటున్నారు.
బడి వదిలి పెట్టాక చెలకలకు వెళ్లాలి. అక్కడ ఉన్న తుమ్మ చెట్టు కొమ్మలను కొట్టాలి. వాటితో కోలాలను చేసుకోవాలి అని ఆలోచనలో మునిగిపోయారు.
అప్పటికే మధ్యాహ్నం మూడో గంట మోగింది. పిల్లలంతా వరుసగా పాఠశాల గ్రౌండ్లో నిలుచున్నారు. చేతిలో బెత్తాన్ని పట్టుకున్న రామచంద్రయ్య సార్ "అరేయ్ జానిగా, ఈరోజు అందరూ 12 ఎక్కాలు చెప్పాలి. లేకపోతే ఒక్కొక్కనికి కోతి పిర్రలు అయితాయి. అందరూ గట్టిగా చదవాలి. నువ్వు ఎక్కాలని వాళ్లకు చెప్పురా!" అని జాను కి అప్పజెప్పాడు.
ఎక్కాలను జాను చెబుతుంటే మిగతావాళ్లంతా గట్టిగా వాటిని వల్లె వేయసాగారు. బడి పక్కనే ఉన్న జొన్నచేను మీద వాలిన పక్షులు, పిల్లల అరుపులకు రెక్క బలం చూపాయి.
కాసేపటికే ఇంటిగంట మోగింది. అందరూ గేటు బయట కలుసుకున్నారు. సంచులు ఇంటి దగ్గర పెట్టి వీరస్వామి ఇంటికి వద్దామని అనుకున్నారు. పరుగు పరుగున వెళ్లి సంచులను ఇంట్లో పడేశారు.
బయటికి పరుగున వస్తున్న పున్నీ ని చూసి "ఎక్కడికి రా!" అని ఇంట్లో ఉన్న తల్లి మల్లమ్మ కేకేసింది."హే..ఆగు ఇప్పుడే వస్తా" అనుకుంటూ బయటికి పరిగెత్తుకెళ్ళాడు. అప్పటికే అక్కడ వీరు, జాను, రవి,కృష్ణ ఉన్నారు.
వీరు ఇంట్లో ఉన్న రెండు కొడవళ్ళను తీశాడు. వాటిని తీసుకుని బయటికి వచ్చారు. బండమీద కూర్చొని ఎక్కడికి వెళ్లాలో మాట్లాడుకోసాగారు. "పెసల్ల బండ దగ్గర సర్కారు చెట్లు ఉన్నాయి" అని పున్ని చెప్పాడు.
"అక్కడ కాదు. కొండం కట్ట దగ్గర తుమ్మ చెట్లు ఉన్నాయి. తుమ్మకోలాలు అయితే ఎక్కువ చప్పుడు వస్తాయి" అని రవి చెప్పాడు. అందరూ సరేనన్నారు.
కొడవళ్ళు పట్టుకొని కొండంకట్ట దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఉన్న తుమ్మ చెట్లను చూశారు. ఒక తుమ్మ దగ్గరికి చేరుకున్నారు. ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంది.
"ఎవరు ఎక్కుతారు" అని మాట్లాడుకోసాగారు.
చివరకు వీరు ఆ చెట్టునెక్కి తుమ్మ కొమ్మలను కొట్టాడు. కింద ఉన్న మిగతా పిల్లలు ముల్లులు చెరిగారు. చెట్టుకు ఉన్న తుమ్మ బంకను కాగితంలో భద్రపరుచుకున్నారు.కోలాలను తయారు చేశారు.
ఆ కోలాలకు పైపొట్టు తీశారు. ఇంటిపైన పెంకుల మీద ఎండకు ఎండబెట్టారు. తెచ్చుకున్న తుమ్మ బంకను, కొన్ని నీళ్లు పోసి నానబెట్టారు.
మరుసటి రోజు స్నేహితులు కలుసుకున్నారు. చినిగిపోయిన పుస్తకాలను తుమ్మబంకతో అతికించుకున్నారు. కోలాలు గట్టిగా ఎండాయి.ఆ కోలాల పైన పులిశేరు కాయతో డిజైన్లు వేసుకున్నారు. తమ పేర్లను రాసుకున్నారు.
కాముని పున్నమి రానే వచ్చింది. పాఠశాలకు వెళ్లిన పిల్లలు"ఇంటి గంట ఎప్పుడు మోగుతుందా?" అని ఎదురు చూశారు. గంట మోగింది. ఇంటికి పరుగందుకున్నారు.
అప్పుడే సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళాడు. ఖాళీ సంచులను ఇద్దరు భుజాలకు తగిలించుకున్నారు.
"ఈరోజు ఎటువైపు నుండి మొదలు పెడదాం" అని మాట్లాడుకోసాగారు.
"వడ్లోల్ల ఇంటికాడ నుంచి" అని రవి అన్నాడు.
"సరే"అని కోలాలను కొడుతూ
"ఓయ్..ఓయ్.. రామిరెడ్డి.. పదహారెడ్ల బండి కట్టి..
బండి పోయి ఎట్ల చిక్కే..
ఎళ్లి రారా.. బల్లికోడే..." అనుకుంటూ పాట అందుకున్నారు.
ఇంట్లో ఉన్న ముసలావిడ దోసిట్లో వడ్లను తీసుకొచ్చి, సంచిలో పోసింది. అలా రాత్రి 9 గంటల వరకు ఊర్లో ఉన్న కొన్ని బజార్లను తిరిగారు పిల్లలు.
మరుసటి రోజు పక్కనే ఉన్న దోనాల గూడెం వెళ్దామని అనుకున్నారు. కొండ కిందిగూడెం నుండి రెండు కిలోమీటర్లు డొంక దారి గుండా వెళ్లాలి. అలా చుట్టూ తిరిగితే దూరమని పొలాల గట్లపై నడుచుకుంటూ గూడేనికి చేరుకున్నారు.
ఒక ఇంటి ముందు చేరి "రింగు రింగు బిల్లా..
రూపాయి దండా..
దండకాదురా దామెర మొగ్గ..
మొగ్గ కాదురా.. మోదుగు నీడ" అనుకుంటూ కోలాలను కొట్టసాగారు.
పక్క సందులో అమ్మాయిల చప్పట్లు వినపడుతున్నాయి.
"కంకామయ్యో... కాముడొచ్చిండు.." అనుకుంటూ పాటలు పాడుతున్నారు. అవి విన్న పిల్లలు, కోలాల వేగాన్ని, పాట శబ్దాన్ని పెంచారు.
మరో ఇంటి ముందుకు చేరుకున్నారు.అరుగు మీద నుండి కిందపడి రక్తం కారుతున్న ముసలమ్మను చూశారు. ఆమె స్పృహ కోల్పోయి ఉంది. వెంటనే ముఖంపై నీళ్లను చల్లి లేపారు. తలకు కట్టు కట్టారు.
అప్పుడే అక్కడికి వచ్చిన ముసలమ్మ కొడుకు, విషయం తెలుసుకుని "పిల్లలూ.. మీరు సమయానికి వచ్చి, మా అమ్మ ప్రాణాలు కాపాడారు" అని వాళ్లను మెచ్చుకున్నాడు. ఐదు రూపాయలు ఇచ్చాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి "పిల్లలు మంచి పని చేశారు" అని మెచ్చుకుంటుంటే.. సంబర పడుతూ ఇంటి దారి పట్టారు పిల్లలు.
***
ముక్కామల జానకిరామ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: ముక్కామల జానకిరామ్ M. A., B. Ed., D. Ed
స్కూల్ అసిస్టెంట్- తెలుగు
నల్గొండ జిల్లా
తెలంగాణా




Comments