కొంపముంచిన అపనమ్మకం
- Srinivasarao Jeedigunta

- Oct 30
- 6 min read
#KompamunchinaApanammakam, #కొంపముంచినఅపనమ్మకం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Kompamunchina Apanammakam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 30/10/2025
కొంపముంచిన అపనమ్మకం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“ఏమిటో నండి... ఇల్లు వదిలి అమెరికాలో అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అంటే బెంగగా ఉంది. రానంటే దానికి కోపం, వెళ్దాం అంటే ఇక్కడ బాధ్యతలు... అన్నీ అయోమయంగా ఉన్నాయి,” అంది హైమావతి భర్త రామేశంతో.
“నాకు అదే బెంగ, మొన్ననే పెరటిలో వంగ మొక్కలు, టొమోటో మొక్కలు పూత రావడం చూసాను, యింకో పదిహేను రోజులలో కాయలు వస్తాయి, యిప్పుడే పంతం పట్టినట్టు అరటి చెట్టు గెల దిగింది, పునాసా మామిడి చెట్టు పిందెలు మీద వుంది. మనం ఆరు నెలలు యిల్లు వదిలి వెళ్తే ఈ కాయలు అన్నీ ఎవ్వరు కోసుకుంటారు, చచ్చిచెడి మొక్కలు పెంచడం మన వంతు కాయలు తినడం యితరుల వంతు అయ్యిపోయింది” అన్నాడు రామేశం.
“పోనీ ఒకసారి అమ్మాయితో మాట్లాడండి యింకో ఆరునెలలు తరువాత వస్తాము అని” అంది.
“సరే రేపు అడుగుతాను, కానీ దాని విషయం తెలుసుగా పట్టినపట్టు వదలదు, అయినా మనం కూడా ఈ వయసులో ఈ మొక్కలు పెంచడం లాంటి బాధ్యతలు వదిలేసి ఎవ్వరు ఎప్పుడు రమ్మంటే అటు దొర్లుకుంటో వెళ్లిపోవడానికి రెడీగా ఉండటం మంచిది. పిల్లలు అంత ప్రేమగా రమ్మంటో వుంటే యింకా ఏం కావాలి” అన్నాడు.
“అలాగే అంటారు, మళ్ళీ నర్సరీ కి వెళ్లి మొక్కలు తెస్తారు, పెంచడమే కాని ఆవి కాసే కాయలు పావుకిలో కూడా వుండవు, ఖర్చు వేల రూపాయలు పెడుతున్నారు, బజార్లో ఈ డబ్బుతో మూడు నెలలకి సరిపోయే కూరలు వస్తాయి, ఎవ్వరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు గా మీకు చెప్పడం గోడకి చెప్పడం ఒక్కటే” అంది హైమావతి.
“సరే నీ గొడవతోనే ఆవి కాయలు కాయడం లేదు, పడుకో నిద్ర చెడగొట్టకు” అన్నాడు విసుగ్గా. కాని ఉదయం సాయంత్రం మొక్కలకి నీళ్లు పట్టేది హైమావతే, అప్పుడప్పుడు తోటలోకి వెళ్లి చూడటం తప్పా వాటికి సరైన పోషణ చూడాలి అంటే రామేశం కి బద్ధకం. పువ్వులు కోసమైనా భార్య తోటలోకి వెళ్లి నీళ్లు పోసి వస్తుంది అని తెలుసు రామేశంకి.
కూతురు కి ఉదయం ఫోన్ చేసి “నడుం నొప్పిగా వుందే, యిప్పుడు విమానం లో గంటల కొద్ది ప్రయాణం అవసరమా మాకు, మీరే రావచ్చుగా” అన్నాడు.
“అమ్మ చెప్పింది వాకింగ్ అంటూ పార్కులో రెండు గంటలు నడిచారుట, నడుం నొప్పిగా వుంటే ఎలా నడిచారో చెప్పండి, రావడం యిష్టం లేకపోతే రాకండి. మీకు పిల్లలు కంటే మొక్కల మీద ప్రేమ ఎక్కువ అయ్యింది, ఆలా అయితే మేము రాము, ఎక్కడవాళ్లు అక్కడే ఉందాం” అంది కూతురు ప్రణతి.
“వుండండి మీ అల్లుడు మాట్లాడుతారుట, ఆయనకి చెప్పుకోండి” అంది భర్తకి ఫోన్ యిస్తో.
“మామయ్యగారు.. యిప్పుడు రాలేకపోతే నిజంగానే ఓపిక తగ్గినప్పుడు అసలు రాలేరు, చలి ముదిరే లోపు వెళ్ళిపోదురుగాని, మీకు కంపోర్ట్ గా వుండే విధంగా టికెట్స్ బుక్ చేస్తాను” అన్నాడు అల్లుడు.
“సరే అలాగే కానివ్వండి, మీరు అన్నట్టుగా వయసు పెరిగిన కొద్ది అసలు రాలేము” అన్నాడు రామేశం.
ఎందుకైనా మంచిది అని ముప్పై వేలు తో ఆరు నెలలు సరిపోయేలా మందులు కొనుకున్నాడు, గుండె పరీక్ష కూడా చేయించుకుని పర్వాలేదు అని డాక్టర్ గారు చెప్పిన తరువాత సామాను కోసం పెద్ద పెట్టెలు కొని బట్టలు సద్దుకుని ప్రయాణం కి సిద్ధం అయ్యారు దంపతులు.
“ఎందుకురా అమెరికా ప్రయాణం ఈ వయసులో, ఏదైనా ముంచుకొస్తే అక్కడ వైద్యం చాలా ఖర్చు తో పని” అన్నాడు పెద్ద అన్నగారు రామేశం తో.
దానితో గోండెల్లో రాయి పడినట్టు అయ్యింది రామేశంకి. నిజమే అక్కడ ఏదైనా అయితే యిప్పుడు రమ్మని గొడవ పెడుతున్న పిల్లలు అంత ఖర్చు భరించగలిగే శక్తి ఉండదు. వాళ్ళు అప్పులు చేద్దాం అంటే ఇండియా కాదు అప్పు యివ్వడానికి. అక్కడ ఎవ్వరి బాధ వాళ్ళు పడాలిసిందే అనుకుని వెంకటేశ్వర స్వామి కి ముడుపు కట్టి మమ్మల్ని ఆరోగ్యం తో వెనక్కి వచ్చేడట్లు చూడు స్వామి అని మొక్కుకున్నాడు.
ప్రయాణం కి వారం రోజులు ముందు పనిమనిషి కి మేడ మీద వున్న మొక్కలు చూపించి “వీటికి రెండు రోజులకి ఒకసారి నీళ్లు పొయ్యాలి, కాయలు కాస్తే నువ్వు కోసుకో, నీళ్లు పొయ్యడం మర్చిపోవద్దు. నీకు యిచ్చే జీతం తగ్గించకుండా అలాగే యిస్తాను, మెయిన్ డోర్ తాళం చెవ్వి యిస్తాను. జాగ్రత్తగా లోపలికి వచ్చి మేడ మీదకి వెళ్ళు. మళ్ళీ డోర్ లాక్ చేసి నీ దగ్గర పెట్టుకో” అని చెప్పింది హైమవతి.
“అలాగే అమ్మా, మీరు కంగారు పడకండి, మా యిల్లు లా చూసుకుంటాను జాగ్రత్తగా” అంది వెంకమ్మ.
“వద్దు, మా యిల్లు లా చూడు చాలు” అన్నాడు నవ్వుతూ రామేశం.
“ఏమండీ. అన్ని బెడ్ రూమ్స్ కి తాళం వేసాను, హాలులో చాలా సామాను వుంది. అది అంతా ఎక్కడ పెడ్తాము, ఏది పోయిందో కూడా తెలియదు” అంది కంగారుగా.
“ప్రయాణం అనుకున్న దగ్గర నుండి నీ అనుమానంతో చంపేస్తున్నావు, ఎలాగో సామాన్లు ఎక్కువగా వున్నాయి అని అన్నావుగా, కొన్ని పోతే యిల్లు కొంత ఖాళీ అవుతుంది” అన్నాడు చిరాకుగా.
“వంటిల్లుకి తాళం ఎందుకే చాదస్తం కాకపోతే” అన్నాడు రామేశం.
“భలే వారే. కొత్తగా పెట్టిన ఊరగాయలు అన్ని యిక్కడే వున్నాయి. రోజుకి యింత తీసుకుని వెళ్ళిపోతే మనం వచ్చేసరికి జాడీలు ఖాళీ. అందుకే తాళం వేసాను. తాళం చెవ్వి ఎక్కడైనా గుర్తుగా పని అమ్మాయికి కనిపించకుండా పెట్టండి అంది.
మెల్లగా లేచి తాళం చెవిని క్యాలెండరు క్రింద తగిలించి పైన క్యాలండర్ పెట్టాడు. అక్కడ అయితే ఎవ్వరూ చూడరు అని.
ప్రయాణం రోజు రానే వచ్చింది. అర్ధరాత్రి ప్రయాణం. ఎయిర్పోర్ట్ నుంచి.. అందరూ మాలాగే ఓపికలేకపోయినా బయలుదేరినట్టున్నారు, ఒక్కడి మొఖం లో నవ్వు లేదు. యిరుకు సీట్స్ లో యిరుక్కుని కూర్చున్నాము. విమానం బయలుదేరిన తరువాత గంటకు అంటే మన టైములో తెల్లవారి నాలుగు గంటలకు ఎయిరహోస్టస్ ట్రోలీ లాక్కుంటో వచ్చి అందరికి తలో ప్యాకెట్ యిచ్చింది.
“మాకు వెజిటేరియన్ ప్యాకెట్ కావాలి” అన్నాడు రామేశం.
“మీకు యిచ్చింది అదే” అని వెళ్ళిపోయింది.
“ఏమిటో తెల్లారి నాలుగింటికి ఏమి తింటాము వద్దని చెప్పాలిసింది” అంది హైమావతి.
“నిద్రలో వున్నాను ఏం అడుగుతాను. సరే మన పక్కన కూర్చొని వున్న ఆయన అప్పుడే సగం తినేసాడు” అన్నాడు రామేశం.
ఏ ప్యాకెట్ చూసినా లోపలవున్నది వెజిటేరియన్ లాగా లేకపోవడంతో ఒక్కరోజు తినకపోతే ఏమి కాదులే అనుకుని యింటి నుంచి తెచ్చుకున్న బిస్కట్స్ తిని గడిపేసారు.
అమెరికా ఎయిర్పోర్ట్ లో దిగగానే ఇంమైగ్రేషన్ వాళ్ళు “ఎందుకు వచ్చారు” అని అడిగారు,
మనసులో అది తెలియక అనుకుని, “మా అమ్మాయి వాళ్ళతో ఒక మూడు నెలలు వుండి వెళదాం అని వచ్చాము” అని చెప్పి బయటకు రాగానే కూతురు అల్లుడు మనవడు ని చూసి ఆనందంగా కారులో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు.
స్నానం చేసి వచ్చిన తరువాత కూతురు వడ్డీంచిన టమోటో పప్పు, వంకాయ కూర చూసి ప్రాణం లేచివచ్చినట్టు అనిపించింది రామేశం కి. మొత్తానికి ఆడుతో పాడుతూ మూడు నెలలు గడిపి ఇండియాకి బయలుదేరారు రామేశం దంపతులు. కూతురు మనవడు కళ్ళ నీళ్లు పెట్టుకుని ఫ్లైట్ ఎక్కించారు.
24 గంటల తరువాత హైదరాబాద్ లో ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి లోపలికి అడుగు పెట్టిన తరువాత అమ్మయ్య ఇంటికి వచ్చి పడ్డాము అనుకుని సోఫాలో కూర్చుంటున్నా భర్త తో “ముందు వంటగది తలుపు తాళం తియ్యండి, ఈ లోపున పక్క వాళ్ళని అడిగి గ్లాస్ పాలు తీసుకుని వస్తాను. కాఫీ పెట్టుకుందాం” అని వెళ్ళింది హైమావతి.
“ఏమిటి యింకా తాళం తియ్యలేదు, ఏ పని చెప్పినా పట్టించుకోరు” అంది పాలగ్లాస్ తో లోపలికి వస్తో.
“ తాళం కీస్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను నీకు గుర్తుకు వుందా” అన్నాడు భార్యతో రామేశం.
“మీరేగా ఎక్కడో జాగ్రత్తగా పెడ్తాను అన్నారు, యిప్పుడు తాళం కీస్ కనిపించడం లేదు అంటే ఎలా? అసలే వంటింటివి” అంది.
“అలా అరిచే బదులు నువ్వు కూడా వెతుకు, పనిమనిషి కి కనిపించకుండా దాయాలని ఎక్కడో జాగ్రత్తగా పెట్టాను, హాలు అంతా వెతికినా కనిపించడం లేదు, అసలు నీది తప్పు. వంటింటికి తాళం ఎందుకు చెప్పు, వెధవ ఆవకాయ కోసం యింత పెద్ద తాళం వేసావు” అన్నాడు విసుగ్గా.
“బాగానే వుంది వరస, మీరు ఎక్కడ పెట్టారో మర్చిపోయి నన్ను తిడ్తారే, మిగిలిన గదుల తాళం కీస్ నేను ఎంత జాగ్రత్తగా దాచానో, తగుదునమ్మా అంటూ మీరు తీసుకుని ఎక్కడ దాచారో” అంది.
“సరే ఒకపని చెయ్యి, మీ తమ్ముడికి ఫోన్ చేసి రమ్మను, తాళం తీయ్యడం లో బాగా నేర్పరి కదా” అన్నాడు.
“అంటే మా తమ్ముడు తాళాలు పగలుకొట్టే దొంగ అంటారా, మీరే మీ చుట్టాలలో ఎవ్వరైనా వుంటే పిలవండి” అంది కోపంగా హైమావతి.
“చూడు, టెన్షన్ లో ఏవి కనఁబడవు, ఈ రోజుకి హోటల్ నుంచి తెప్పించుకుందాం, మెల్లగా అలోచించి ఎక్కడ పెట్టానో గుర్తుకు తెచ్చుకుంటాను” అన్నాడు.
“ఏమిటో బయలుదేరిన వేళా విశేషం, క్యాబ్ దొరకడం దగ్గర నుంచి అన్ని యిబ్బందిలే” అంది హైమావతి.
“ఆ గుర్తుకు వచ్చింది నువ్వు వేళా విశేషం అనగానే, నేను ఆరోజు తాళం వేసి కీస్ క్యాలెండరు క్రింద పెట్టాను” అంటూ పరుగున వెళ్లి క్యాలెండరు క్రింద చూసాడు,
“అరే యిక్కడ లేదే” అన్నాడు. “ఆ శ్రీదేవి క్యాలెండరు క్రింద చూడండి, ఆ క్యాలెండరు అంటే మీకు బాగా యిష్టం కదా” అంది నవ్వుతూ.
“అక్కడా లేదు, నాకు బాగా గుర్తు క్యాలెండరు క్రింద దాచాను, కొంపదీసి పనిమనిషి వెంకమ్మ తీసిందేమో” అన్నాడు.
“దానికి అంత ఆలోచన వుంటే బాగానే ఉండేది. ఎంతవరకు నేలచూపులు తప్పా కిటికిలు తుడవమంటే తుడిచేది కాదు. సరే కారులో వెళ్లి హోటల్ లో భోజనం చేసి వద్దాం ముందు స్నానం చేసి రండి” అంది.
“కారు కీస్ కూడా వంటగదిలో పోపుల డబ్బాలో పెట్టాను ఎందుకైనా మంచిది అని” అన్నాడు రామేశం నసుగుతో.
ఇంతలో పనిమనిషి వెంకమ్మ వచ్చింది. “నిన్ననే వస్తాను అన్నారు కదా అని రెండుసారులు వచ్చాను. యిలా ఒక్కొక్క ఇంటికి రెండుసారులు తిరగడం కష్టం అమ్మా, సరే వంటగది తాళం తీస్తే స్టవ్ తుడుస్తాను” అంది.
“తాళం ఎక్కడ పెట్టామో గుర్తుకు రావడంలేదు వెంకమ్మా’, అంది హైమావతి.
“ఏమిటోనమ్మా వంటగదికి తాళం వేసుకుని వెళ్ళటం నేను ఎప్పుడు చూడలేదు. అంత పనిమనిషి మీద నమ్మకం లేకపోతే అసలు మాకు మెయిన్ డోర్ తాళం కూడా ఇవ్వకుండా ఉండాలిసింది, మీరు ఊరినుంచి వచ్చిన తరువాత వచ్చేదానిని” అంది వెంకమ్మ నిష్టురంగా.
మొత్తానికి బజార్ వెళ్లి తాళాలు బాగుచేసే వాడిని పట్టుకుని వచ్చాడు రామేశం.
వాడు “తాళం పగలుకొట్టాలి, మీ ఆధార్ కార్డు కాపీ యిస్తే ఈ యిల్లు మీదే అని రుజువు చేసుకుని తాళం పగలుకొడతాను. అయిదు వందలు అవుతుంది” అన్నాడు.
“అంత ఎందుకు అవుతుంది? దానిబదులు కొత్త తాళం కొనుకోవచ్చు కదా” అన్నాడు రామేశం.
“అయితే కొనుకోండి” అంటూ వెళ్ళబోతున్న తాళాలు బాగుచేసే వాడిని ఆపి, “బాబూ అలాగే యిస్తాము కాని ముందు తాళం పగలు కొట్టు నాయనా, యిల్లు మాదే. కావాలి అంటే యిదిగో మా పనిమనిషిని అడుగు” అంది హైమావతి.
మొత్తానికి రెండు దెబ్బలు వేసి తాళం పగలు కొట్టి అయిదు వందలు తీసుకుని వెళ్ళిపోయాడు.
‘అమ్మయ్య గండం గడిచింది’ అంటూ వంటగదిలోకి దూకింది హైమావతి. ఎంతేయినా ఆడవాళ్ళకి వంటగదే వాళ్ళ సామ్రాజ్యం అనుకున్నాడు రామేశం.
ఒక నాలుగు రోజుల తరువాత వెంకమ్మ అంటే పడని పక్కింటి పనిమనిషి సుబ్బమ్మ చెప్పింది హైమావతితో, “నన్ను పనిలో పెట్టుకోమంటే పెట్టుకోలేదు మీరు, మీ వెంకమ్మ కి అవమానం వేసిందిట వంటగదికి తాళం వేసుకుని వెళ్లడం. అదే తాళం చెవ్వి తీసుకొని దాచేసివుంటుంది. అయినా మీరిచ్చే జీతం తో ఎలా బతుకుతాము అమ్మా!
అప్పుడప్పుడు మీరు కూడా చూసి చూడనట్టు యిల్లు వదిలేయ్యాలి” అంది.
విషయం హైమావతి ద్వారా విని “చివరికి నీ ఆపనమ్మకం మన కొంప ముంచింది, యిద్దరం విడాకులు తీసుకునే వరకు తిట్టుకున్నాము” అన్నాడు రామేశం.
“అమ్మాయివి నాలుగు పట్టుచీరలు తెచ్చాను అమెరికా నుంచి పోనిలే వెంకమ్మ చాలా రోజుల నుంచి పనిచేస్తోంది కదా యిద్దాం అని, యింక యిచ్చేది లేదు” అంది హైమావతి.
అతి జాగ్రత్త, అనవసర అనుమానం, నమ్మకం లేమి — ఇవి మనసుల మధ్య తాళాలు వేస్తాయి.
తాళం తెరవడం కంటే, నమ్మకం కాపాడుకోవడం కష్టం.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





@saipraveenajeedigunta8361
•3 days ago
Good one
@saranyachennubhotla9825
• 25 minutes ago
super