top of page

కోరికలే గుర్రాలైతే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Korikale Gurralaithe' New Telugu Story Written By Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ


ఇంటి ఇల్లాలి మితీమీరిన ధన వ్యామోహం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది.

కానీ భర్త సంయమనం తో వ్యవహరించడంతో ఆ కుటుంబం గట్టెక్కింది.

ప్రముఖ రచయిత్రి బి లక్ష్మి శర్మ గారి 'కోరికలే గుర్రాలైతే' కథలో ఆ వివరాలు తెలుసుకుందాం.


“అబ్బబ్బా… ఏమిటి పద్మా ఇది? ఎప్పుడు చూసినా డబ్బుపిచ్చి తప్ప నీకింకో ఆలోచన రాదా? నేను బాగానే సంపాదిస్తున్నాను కదా! నువ్వు హాయిగా ఉంటూ పిల్లలను చూసుకో చాలు” అంటూ విసుక్కున్నాడు రఘుపతి, భార్య మీద.

“అయ్యో రామ! ఇప్పుడు పిల్లలకు, మీకు ఏం తక్కువ చేస్తున్నాను? ఏదో ఊరికే తిని కూర్చోవడం ఎందుకని.. నాకంటూ ఒక వ్యాపకం ఉండాలి కదా! ‘వేన్నీళ్ళకు

చన్నీళ్ళు తోడ’న్నట్టు నా చీరల ఖర్చులు, పిల్లల చిన్నచిన్న సరదాలు వెళ్ళిపోతాయి కదాని ఆలోచిస్తున్నా” అంది పద్మ.

“నువ్వు కష్టపడడం ఎందుకని అలా అన్నాను. సరే కానీ! ఇంతకూ ఏం ఆలోచించావు పద్మా” భార్య ముఖం చిన్నబుచ్చుకోవడం చూసి అనునయిస్తూ అడిగాడు.

“ ఏమండీ… మా ఫ్రెండ్ చెప్పిందండీ, చిట్టీల వ్యాపారం అయితే బాగుంటుందని. పైగా మనం బయటకు వెళ్ళేపనే ఉండదు కాబట్టి హాయిగా ఉంటుందని చెప్పింది.

ఎప్పుడు చూసిన చేతినిండా డబ్బులు కనబడతాయి మనకే లోటూ ఉండదు. ఏమంటారు?” నవ్వుతూ అడిగింది పద్మ

ఒక్కసారిగా అదిరిపడ్డాడు రఘుపతి. “ ఏమిటి నువ్వంటున్నది! చిట్టీల వ్యాపారమా! అస్సలు వద్దు పద్మా! అమ్మో … ఇంకా నయం ముందుగా నాతో చెప్పావు కాబట్టి

సరిపోయింది. మీ ఫ్రెండ్ కు బొత్తిగా ఆలోచన లేనట్టుంది. నేను ఎంతమందిని చూడలేదు చిట్టీలవల్ల మోసపోయిన వాళ్ళను? సమయానికి డబ్బులు ఇవ్వకుండా కొంతమంది

ముందుగానే చిట్టీ డబ్బులు తీసుకుని ముంచినవాళ్ళు, డబ్బులు అందరికీ కట్టలేక దివాళ తీసినవాళ్ళను చాలా మందిని చూసాను. అమ్మో… ఇందులో చాలా లొసుగులు

ఉంటాయి. ఇవన్నీ మన వల్ల కాదు పద్మా! నీకు అంతగా డబ్బు సంపాదించాలని ఉంటే గనుక… మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్‌లో ఉద్యోగం చేసుకో. డబ్బుకు డబ్బూ వస్తుంది. పిల్లలతో కాలక్షేపం అవుతుంది” చెప్పాడు రఘుపతి.

“ అబ్బా… నాకు చదువంటే పరమబోరండీ! అయినా… పెద్దగా కష్టపడకుండానే డబ్బులు ఇంటికి వచ్చి చేరుతుంటే మీరెందుకు వద్దంటున్నారో నాకర్థం

కావడంలేదు.మీరెన్నన్నా చెప్పండి. నేను మాత్రం ఇదే చేస్తాను” అంది ఖరాఖండిగా.

పట్టినపట్టు వదలదని భార్య గురించి తెలుసు కాబట్టి. “ నీ ఇష్టం! మంచీ చెడు.. అన్నీ నువ్వే చూసుకో” అంటూ అక్కడనుండి లేచి వెళ్ళిపోయాడు.


పద్మ వెంటనే సంతోషంగా తన స్నేహితురాలైన ఉషకు ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. అనుకున్నట్టు చిట్టీల వ్యాపారం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్ అందరినీ తన మాటలతో ఆకట్టుకుంది.

“హలో స్వాతి బాగున్నావా… ఇదిగో నేనిప్పుడు చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాను. నువ్వు కూడా నా దగ్గర చిట్టి వెయ్యవే. నువ్వెప్పుడు డబ్బులు అడిగితే అప్పుడే

ఇస్తాను. నీకూ చేతిలో డబ్బుంటుంది. ఏమంటావు? అయ్యో … నువ్వేమంటావే నా పిచ్చి కాకపోతే! నువ్వు చిట్టీ వేస్తున్నావు. అంతే.” అంది పద్మ.

“అదికాదే పద్మా!… నేను మావారిని అడిగాక చెబుతాను. ఆయనకు ఇలాంటివి పెద్దగా ఇష్టం ఉండవు” అంది స్వాతి.

“ఓసి పిచ్చి మొఖమా! మన ఆడవాళ్ళం కొంత డబ్బు వెనకేసుకోవాలి. లేకపోతే ప్రతి చిన్నదానికీ చేతులు చాపాలి. నువ్వింకేమీ ఆలోచించకు. సరేనా?” అంటూ

ఫోన్ పెట్టేసి, వేరొక ఫోన్ కలిపింది.

“ హయ్.. హలో రాధా! బాగున్నావా… నీతో చిన్నపడింది, చేస్తావా? ఆహా! ఏంలేదు. నువ్వు చేస్తావు. నాకు తెలుసు.. నా దగ్గర చిట్టీ వేసుకోవే. నాకు సహాయం చేసినట్టుంటుంది. నీకూ ఉపయోగం ఉంటుంది. ఏమంటావు?” అడిగింది పద్మ.

“ ఏయ్ పద్మా! ఎంత మంచివార్త చెప్పావే.. నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఇలాంటి అవకాశం కోసం. ఎవరైనా తెలిసినవాళ్ళ దగ్గర అయితే బాగుంటుందని

అనుకుంటున్నా. సరే కానీ! ఇంతకూ ఎన్ని నెలలు? నెలనెలా ఎంతకట్టాలి.. వివరాలన్నీ చెప్పవే”, అడిగింది రాధ ఆత్రంగా.

“ అబ్బా… ఆగవే! అన్నీ చెబుతా. ఏదో చిన్నగా మొదలుపెట్టాను. లక్ష రూపాయల చిట్టీ.

నెలకు ఐదువేల రూపాయలు కట్టావంటే సరిపోతుంది. ఇరవై నెలలు”

“ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది పద్మా. నాపేరు రాసుకో. నేను ఇంకా కొంతమందిని జాయిన్ చేస్తా. నువ్వేమీ కంగారుపడకు. హాయిగా ముందుకు వెళ్ళిపో” అంది రాధ కొండంత ఉత్సాహాన్నిస్తూ. సంతోషంతో పొంగిపోయింది పద్మ.


అలా మొదలైన తన వ్యాపారం కోట్లలోకి మారిపోయింది. పద్మ దగ్గర చిట్టీలు వేస్తే మోసం ఉండదు. మన డబ్బులకు ఎలాంటి ఢోకా లేదనేంతవరకు వచ్చింది. రఘుపతి కూడా భార్యకు చేదోడు వాదోడుగా ఉంటూ నడిపిస్తున్నారు. ఉన్నంతలో తృప్తిపడే రకం కాదు పద్మ మనస్తత్వం. చేతినిండా డబ్బులు కనిపించేసరికి కోరికలకు రెక్కలు వస్తున్నాయి. పెద్ద బంగళా తీసుకోవాలని, జమిందారీ హోదా నడిపించుకోవాలని ఆశ మొదలైంది.


పిల్లలను డాక్టర్ చేయించాలని, కార్లలో తిరగాలని, ఒంటినిండా నగలు వేసుకుని పదిమందిలో గొప్పగా కనిపించాలని ఉవ్విళ్ళూరుతోంది పద్మ మనసు. అదే

విషయం భర్తతో చెప్పింది.

“ పద్మా… నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, ఇది మంచిపద్దతి కాదు. ఆశలకు అంతు అంటూ ఉండాలి కానీ ఆకాశంలో విహరించకూడదు. మనం ఎక్కడో బొర్లాపడిపోతాము. శక్తికి మించిన ఆలోచనలు మానుకో. అప్పుల పాలయ్యామంటే మనను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇంతవరకు నువ్వు చేస్తున్నపని చాలు… ఇలానే నడిపించుకో. ఎక్కువగా ఆశపడకు. మనశ్శాంతిని కోల్పోతాము,” గట్టిగా మందలించాడు.

“ అబ్బ.. మీకన్నీ భయాలే! ఏదో సామెతచెప్పినట్టు.. ‘అవ్వపెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుంది మీ ముచ్చట. చూడండి… ఇప్పుడు మనకు

కావలసినంత డబ్బుంది. మీరేం దిగులుపడకండి. మీరు చేయవలసిందల్లా మంచి బంగళా చూడటం, మంచికారు కొనడం. అంతే! డబ్బుల గురించి మీరు అనవసరంగా ఆలోచించకండి. ఎన్నాళ్ళు ఈ కిరాయి కొంపలో ఉంటాము?” అంది పద్మ నవ్వుతూ.

“ ఏమో పద్మా.. నీ ఇష్టం! నాకు మాత్రం మిమ్మల్ని సుఖపెట్టాలని ఉండదా చెప్పు? మనసు వెళ్ళినట్టల్లా మనము వెళ్ళలేము కదా! కోరికలను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం కాదా చెప్పు” అడిగాడు రఘుపతి.

“ ఏమో బాబు… నాకవన్నీ తెలియవు. నాకు నలుగురిలో మనం ఆనందంగా గడపాలని, మనం గొప్ప శ్రీమంతులం కావాలని కోరిక. అంతే!” అంది పద్మ.

తన ఊహలకు తగ్గట్టుగానే పెద్ద బంగళా తీసుకుంది. కోరుకున్న కారు కొనుక్కుంది. పిల్లలను కార్పోరేట్ స్కూల్ లో వేసింది. తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవడం లేదని, బయటవాళ్ళు తన దగ్గర వేసిన చిట్టీ డబ్బులన్నీ వాడుకుంది. అడిగిన వాళ్ళకు కొంతమందికి చిట్టీ డబ్బులు ఇచ్చింది. ముందుగానే గొడవ చేయ్యకుండా చూసుకుంది. అలా నెమ్మదిగా అందరి డబ్బులు వాడుకుంది. తను పెద్ద బంగళా తీసుకున్నట్టు గానీ, తను ఇక్కడినుండి వేరే చోటుకువెళుతున్నట్టుగానీ, ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది.


తన స్నేహితులకు, ఇరుగుపొరుగు వారికి కూడా తెలియనివ్వలేదు. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేయించింది. రఘుపతి నోరెత్తలేకపోయాడు. పద్మదే పైచెయ్యి అయిపోయింది. నోరెక్కువయింది. గయ్యాళితనం నేర్చుకుంది. మనసంతా గందరగోళంగా ఉంది .


అందరూ వచ్చి ఎంత గొడవ చేస్తారో! పోలీసులు వచ్చారంటే, ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఏమిటో ఈ మనిషి! నామాట వినకుండా తనిష్టం వచ్చినట్టు చేస్తుంది.

ఏమన్నా అన్నానంటే ‘నీకేం తెలియదు. అన్నీ నేను చూసుకుంటా’నంటూ నోరెత్తనీయడంలేదు.


ఇంతకాలం మర్యాదగా మంచిపేరు సంపాదించుకున్నా. ఇప్పుడు నా ఉద్యోగానికి ఎసరుపడింది. కొంతకాలం మెడికల్ లీవు పెట్టించింది. తరువాత నా ఉద్యోగం నా చేతికి వస్తుందో లేదో.. ఆడపెత్తనం వద్దంటే నన్నో చేతగాని వాడి క్రింద జమకట్టింది.


‘దేవుడా … ఏందయ్యా ఈ పరిస్థితి! నాకేం తోచడంలేదు. నాకు నువ్వే దిక్కు’ అంటూ మనసులో పదే పదే దేవుడికి దండంపెట్టుకోసాడు.


పద్మకు మాత్రం స్వర్గంలో విహరిస్తున్నట్టుగా ఉంది. ఏ కోశాన భయంగానీ బాధగానీ కనిపించడంలేదు. రేపటి గురించిన ఆలోచన ఆమెకు ఏమాత్రంలేదు. తనిప్పుడొక హోదా గల పెద్దమనిషి. చేతినిండా డబ్బు, ఒంటినిండా నగలు చూసుకొని మురిసిపోతోంది.

“పద్మా… పద్మా!” రఘుపతి రెండుసార్లు పిలిచినా కూడా తన్మయత్వంలో వినిపించుకోలేదు. దగ్గరగా గట్టిగా ఊపాడు.

“ ఏమైందండీ… ఏం కావాలి మీకు? మీ ముఖమేంటి అలా నీరసపడిపోయి ఎన్నోరోజులుగా లంకణాలు చేసిన వాడిలాగా అయిపోంది? ఏమైంది ఒంట్లో బాగాలేదా..

ఏదీ చూడనివ్వండి.. జ్వరం ఏమైనా ఉందేమో,” అంటూ భర్త చేతిని పట్టుకుని చూసింది.

“బాగానే ఉందికదా! ఎందుకలా ఉన్నారు మరీ,” అడిగింది తనే.

“ పద్మా! నాకు ఒంట్లో బాగానే ఉంది. బాగా లేనిదల్లా ఇంట్లోనే. నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నావల్ల కావడంలేదు. ఎటు చూసినా నీదగ్గర డబ్బు

జమచేసుకున్న వాళ్ళ ఆక్రందనలే వినిపిస్తున్నాయి. వాళ్ళ కష్టాన్ని మనం దోచుకొని తింటుంటే, నాకు విషం మింగినట్టుగా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమిలేదు. మానాన్నకు చెప్పి ఊరిలో ఉన్న పొలం అమ్మి ఎవరి డబ్బులు వాళ్ళకు ఇచ్చేద్దాం. నామాట విని నేను చెప్పినట్టు చెయ్యి పద్మా” అంటూ కంటతడి పెడుతూ పద్మ రెండు చేతులుపట్టుకుని బ్రతిమాలాడు.

“ అబ్బబ్బా! ఇందుకేనా ఏదో కొంపలంటుకుపోయినట్టు ముఖంపెట్టారు?చూడండీ.. మీకు సుఖపడడం చాతకానప్పుడు నన్ను, నాపిల్లలనైనా సుఖపడ నివ్వండి. మీరేం ఉచితసలహాలు ఇవ్వకండి. నాకు అన్నీ తెలుసు. మాతోపాటుగా మీరూ హాయిగా ఉండండి. కొన్నాళ్ళు పోతే అంతా సద్దుమణుగుతుంది. అప్పుడిక మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరంలేదు” అంటూ అక్కడనుండి విసవిసా వెళ్ళిపోయింది.

చేసేదేంలేక అలానే కూర్చుండిపోయాడు. తమ గురించి ఏ వార్త చుడాల్సి వస్తుందోనని, టీవి పెట్టాలన్నా భయంగా ఉంది రఘుపతికి.


పిల్లలు వచ్చి లైట్ వేసి టీవి పెట్టడమే ఆలస్యం.

అందులో వస్తున్న వార్తను చూసి ఆందోళన పడ్డాడు.

“ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త…

చిట్టీల పేరుతో పేద ప్రజలను మోసంచేసిన భార్యాభర్తలు

గత కొన్నాళ్ళుగా కనపడడంలేదని బాధితులు ఇంటితాళం పగులగొట్టి చూసారు. ఇల్లంతా ఖాళీగా వుంది. ఇంటివాళ్ళకు ఇంటిఅద్దె గత కొంతకాలంగా ఇవ్వడంలేదని వాళ్ళు, మా భర్తలకు తెలియకుండా చాటుమాటుగా పోగేసుకున్న డబ్బులన్నీ పోయాయని కొందరు, మా రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న డబ్బు మాయం చేసిందని.. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిడుతూ శాపనార్ధాలు పెడుతున్నారు. చూస్తూంటే పై ప్రాణాలు పైనే పోయినట్టనిపించింది రఘుపతికి.

“ పద్మా , కొంపలంటుకుపోయాయి. ఇక్కడ చూడు”అంటూ పిచ్చి పిచ్చిగా అరవసాగాడు.

నాన్నకు ఏమైందోనని పిల్లలు గాబరా పడసాగారు. హడావుడిగా పద్మ పరుగెత్తుకొచ్చింది భర్తకు ఏమైందోనని.

“ ఏమిటండీ ఆ అరుపులు.. ఏం కొంపలంటుకు పోయాయని” గయ్యిమని లేచింది టీవి చూస్తున్న భర్తమీదకు.

“ ఏం కావాలా… అటుచూడు నీకే తెలుస్తుంది. వద్దో మొర్రో అంటే వినిపించుకున్నావా! ఇప్పుడు చూడు. పోలీసులు రంగంలోకి దిగారు. మన ఫోటోలతో పాటు మన పేర్లు

కూడా చెబుతున్నారు. ఇంకా .ఏంకావాలి. అని అడుగుతున్నావా? అయిపోయింది.. అంతా అయిపోయింది. పరువుపోయింది” అంటూ లబోదిబో మొత్తుకుంటూ చెప్పాడు.

పద్మకు పరిస్థితి అర్ధమయ్యేసరికి కళ్లుతిరిగి తూలి పడిపోయింది. అమాంతంగా వచ్చి భార్యను పట్టుకుని సోఫామీద పడుకోబెట్టి నీళ్ళు చల్లాడు. పద్మ లేచి ఏడుపు లంకించుకుంది. ఏం చెయ్యాలో తోచడంలేదు.

“ ఏమండీ! ఇప్పుడెలాగా? ఇలా జరుగుతుందనుకోలేదు. కొన్నాళ్ళయితే అంతా సద్దుమణుగు తుందనుకున్నాను. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థంకావడం లేదు.

మనల్ని పోలీసులు పట్టుకపోతే మన పిల్లలను ఎవరు చూస్తారు” అంటూ పెద్ద పెద్దగా ఏడవసాగింది. పిల్లలకు ఏమీ అర్థంకాక బిక్కమొహం పెట్టి చూడసాగారు.

“ చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడతున్నావా? చాలు చాలు నువ్వు ఆడిన నాటకం. పిల్లలను మీ అమ్మ వాళ్ళింటికి పంపించు. నేనెంత అరిచి గీపెట్టినా నువ్వు వినిపించు కోలేదు. నామాట పెడచెవిన పెట్టావు. నన్నో చేతకాని దద్దమ్మలా చూసావు,


నువ్వు చేసిన దుర్మార్గపు పని వల్ల నేను తలెత్తుకోలేక పోతున్నా. అందుకే నేను నాదారి నేను చూసుకుంటున్నా. పోలీసులు వచ్చి మనల్ని తీసుకెళ్ళే లోపు నేనంటూ లేకుండా పోతాను. తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అన్నాడు, బాధగా పిల్లలను దగ్గరకు తీసుకుంటూ.

“ ఓరి దేవుడోయ్! ఇదంతా నాకోసమే చేసినట్టు నా మీద అభాండాలు వేస్తున్నాడు. మనకోసమే కదా ఇదంతా చేసింది! ఏమండీ! మీరు మమ్మల్ని వదిలిపోతే

సమస్య పరిష్కారం అవుతుందా? ఏం చేద్దామో చెప్పండి. నాకు భయంగా ఉందండీ!” అంటూ భర్త రెండు చేతులు పట్టుకుని బ్రతిమాల సాగింది.

“ పద్మా… చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టుంది నీ వ్యవహారం. చెయ్యవలసినదంతా చేసి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అంటున్నావు. నేను మొదటినుండి చెబుతూనే వున్నాను. కోరికలకు కళ్ళెం వెయ్యకపోతే అవి

గుర్రాల్లాగా పరుగెడుతూనే ఉంటాయని చెప్పాను. విన్నావా? ఇప్పుడిక ఒకటే పరిష్కారం. మనంత మనమే వెళ్ళి పోలీసులకు లొంగిపోయి ఎవరి డబ్బులు వాళ్ళకు ఇస్తామని చెప్పడము తప్ప అంతకంటే ఏమీ చెయ్యలేము. పద.. వాళ్ళు మన ఇంటిమీదకు

రాకముందే మనమే వెళదాము” అన్నాడు రఘుపతి.

“ ఏమండీ! అంత డబ్బు ఎలా కడదామండీ? ఉన్న పళంగా ఎవరిస్తారు మనకు? కనీసం అప్పుగా నైనా తెచ్చిద్దామన్నా మనకు అంతడబ్బు ఇచ్చేవాళ్ళే లేరాయే” అడిగింది కొంచెం మనసు కుదటపడగా.

“ చాలు , చాలు.. నువ్వు చేసిన నిర్వాకం. ఇంకా వెధవాలోచనలు మాను. ఇప్పటికైనా నీ బుద్ధి మారకపోతే ఎలా? ఉన్న ఇల్లు అమ్మి అయినా డబ్బు కట్టాలి. లేదా మా నాన్నను అడిగి పొలం అమ్మి అయినా అప్పులు తీర్చాలి. అవన్నీ తరువాత.. ముందు నడు పోలీసు స్టేషన్ కు. నువ్వు చేసిన తప్పు ఒప్పుకుందువుగానీ. మీ తమ్ముడిని వచ్చి పిల్లలను తీసుకవెళ్ళమని ఫోన్ చేసి చెప్పు” అంటూ లేచాడు వెళ్ళడానికని.

“ ఏమండీ! ఈ ఇల్లు అమ్మే బదులు మీ నాన్నను అడిగి ఊరిలో ఉన్న పొలం అమ్మేయమని చెప్పండి. కావాలంటే వాళ్ళను మనతోపాటుగా ఉండమని చెప్పండి” అంది మెల్లగా ఎక్కడ తిడతాడోనని భయపడుతూ.

చప్పట్లు కొడుతూ “బాగుంది పద్మా నీ వరస! ‘అందితే జుట్టు అందకపోతే కాళ్ళు’ అన్నట్టుంది. ఏనాడైనా మా అమ్మ నాన్నలను పిలిచి పట్టెడన్నం పెట్టిన పాపాన పోలేదు. వాళ్ళ ఉనికే నీకు నచ్చలేదు. అందుకే అంటారు, అవసరం ఎంతకైనా దిగజారుస్తుంది అని. ఏ ముఖం పెట్టుకుని అడగమంటావు పద్మా వాళ్ళని?” అంటూ దెప్పిపొడిచాడు.

“ ఏమండీ! ఎందుకండీ ఇంకా చచ్చినా పామును చంపుతారు.. నన్ను క్షమించండి! ఇక నుండి నేను దేని జోలికీ పోను. నన్ను నమ్మండి” అంటూ భర్త కాళ్ళు పట్టుకుంది పద్మ.

రఘుపతి మనసులో బాధనిపించింది. పద్మ అలా బేలగా కాళ్లుపట్టుకుని ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెను లేవనెత్తుతూ “ పద్మా … ఊరుకో! నేనేదో ఒకటి చేస్తాను. నువ్వేం కంగారుపడకు” అంటూ అనునయించాడు.


అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి పోలీసుస్టేషన్ కు వెళ్ళి జరిగింది చెప్పి, రెండునెలల గడువుకోరి వచ్చారు. రఘుపతి తండ్రి దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి అంతా చెప్పి పొలం అమ్మకానికి పెట్టి, తనతో పాటుగా తల్లితండ్రులను తీసుకవచ్చాడు. ఉన్న ఇల్లు అమ్మేసాడు.

అప్పులన్నీ తీర్చి, తమ తాహతుకు తగ్గట్టుగా ఇల్లు తీసుకున్నాడు. ఇవన్నీ చూస్తూ పద్మ

నోరేత్తకుండా చూస్తూ ఉండిపోయింది. కుటుంబం ముక్కలవకుండా కాపాడినందుకు భర్తను మనసారా కౌగిలించుకుంది. ఆనందంతో రఘుపతి భార్యను అక్కున చేర్చుకున్నాడు.

॥॥ శుభం॥॥

అనుకుంటూ మనసు దిటవు చేసుకున్నాడు సత్యమూర్తి.


॥॥ శుభం ॥॥

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ (త్రిగుళ్ళ)

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్91 views3 comments

3 comentarios


Kalyanakrishna Vasu • 2 days ago

👌👌👌👌👍👍👍💐💐👍

Me gusta

ramya sree • 1 day ago

Chala bagundi Amma

Me gusta

Kp J • 22 hours ago

story very intresting

Me gusta
bottom of page