కొసమెరుపు
- Pulletikurthi Krishna Mohan
- Sep 26
- 6 min read
#KrishnaMohanPulletikurthi, #పుల్లేటికుర్తికృష్ణమోహన్, #కొసమెరుపు, #Kosamerupu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kosamerupu - New Telugu Story Written By - Krishna Mohan Pulletikurthi
Published In manatelugukathalu.com On 26/09/2025
కొసమెరుపు - తెలుగు కథ
రచన: కృష్ణమోహన్ పుల్లేటికుర్తి
చిమ్మ చీకటి, పగలు ఎంతో అందంగా ఉండే ఆ ప్రాంతం రాత్రి విశ్వరూపం చూపించ సాగింది. కీచురాళ్ళ శబ్దం తప్పా ఇంకేం వినిపించడం లేదు.
“కనీసం టార్చ్ లైట్ కూడా తీసుకురాకపోవడం నాదే తప్పు ” తనను తానే తిట్టుకుంటుంటామె.
తెలిసిన దారే కాబట్టి మెల్లగా నడుచుకుంటూ మొబైలు వెలుగులో వెళ్ళసాగింది. సరిగ్గా గెడ్డ దగ్గరకు వచ్చిన తరువాత సంశయించిందామె, ఆమెకు అది కొత్త కాదు కానీ, చీకట్లో ఈ గెడ్డపై వెళ్ళడం చాలా కష్టం ఆలోచిస్తున్న సమయంలో దూరంగా ఏదో వెహికల్ లైట్ వెలిగింది.
“ఎవరో తన కోసమే వేసినట్టున్నారు. ఇప్పుడు స్పష్టంగా దారి కన్పిస్తుంది’ ఆమె మెల్లగా వెళ్ళసాగింది, హటాత్తుగా వెలుగు ఆగిపోయింది.. ఆమె అడుగు తడబడింది. అంతే.. గెడ్డలో పడి నిండుగా ప్రవహిస్తున్న నీటిలో ఎక్కడికో కొట్టుకు పోయింది.
*
రామ రాజు మాష్టారు.
ట్రాన్స్ఫర్ మీద తూర్పుగోదావరి, గొల్లప్రోలు ప్రభుత్వ ఉన్నత పాటశాలకు వచ్చారు. అడ్రసు కనుక్కొని అక్కడకు వెళ్తే, దూరంగా స్కూల్ కనిపించసాగింది దగ్గరకు వెళ్లాలంటే మాత్రం చిన్న గెడ్డ దాటుకొని ఆవలి ఒడ్డుకు వెళ్ళాలి. సుమారు పదిహేను అడుగుల పొడవు ఉంటుంది, గెడ్డ నిండుగా పారుతుంది. దానిమీద నిలువుగా ఒక తాటి దుంగ అమర్చి ఉంది, అలవాటు ఉంటే తప్పా నడవడం కష్టం, మెల్లగా ఆవలి వడ్డుకు చేరారు.
స్కూల్ లో అడుగు పెట్టిన మాష్టారికి యాబై మంది స్టూడెంట్స్ మాత్రమే దర్శనమిచ్చారు. హెడ్ మాష్టార్ గదికి వెళ్తే. హెడ్ మాష్టర్ గురుమూర్తి, మరియు స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నారు. బ్రేక్ టైమ్ అవ్వడం వలన అందరూ అక్కడే కూర్చున్నారు. తాను వచ్చిన విషయం అంతా చెప్పారు రామరాజు.
హెడ్ మాస్టర్ రామరాజుని అందరికీ పరిచయం చేశారు. పరిచయ కార్యక్రమ అయిన తరువాత, తను తెచ్చిన కాకినాడ కాజాలు అందరికీ పంచారు రామరాజు.
“మాస్టారు.. మీరు వచ్చినప్పుడు చూశారు కదా, ఇక్కడకు రావడానికి సరైన మార్గం లేక చాలా మంది స్టూడెంట్స్ మానేశారు. ఇప్పుడు క్లాస్ కు ఐదుగురు చెప్పున ఉన్నారు” చెప్పారు హెడ్ మాస్టర్.
“సార్! అలా అయితే మన స్కూల్ ని త్వరలో ఇంకో స్కూల్ లో మెర్జ్ చేసే అవకాశం ఉంది ”
“అదే భయంగా ఉంది. ఈ స్కూల్ కి ఒకప్పుడు మంచి పేరు ఉంది, ఎంతో మంది ఇక్కడ చదివి విదేశాలలో సెటిల్ అయ్యారు. కానీ ప్రైవేటు స్కూల్ ప్రభంజనం, సరైన దారి లేక పోవడం వలన మన స్కూల్ వెనుక బడింది ” అన్నారు హెడ్మాష్టర్.
రామరాజు మాస్టర్ ఆలోచనలో పడ్డారు. ఇక్కడ అన్ని సబ్జక్ట్స్ కి స్టాఫ్ ఉన్నారు. స్కూల్ కి మంచి చరిత్ర ఉంది. ఊరికి దగ్గరలో స్కూల్ ఉంది. కాకపోతే సరైన దారి లేదు.
హెడ్మాస్టర్ దూరంగా చూస్తూ “చూడండి మాష్టర్ అక్కడ ఏం జరుగుతుందో ” అన్నారు.
దూరంగా ఒక కుర్రవాడు ఇద్దరూ పిల్లలను చితకొడుతున్నాడు.
“చూశారా మాస్టారు.. ఆ పొడుగ్గా ఉన్నాడే వాడు ప్రెసిడెంట్ గారి అబ్బాయి. ఆయన తలచుకుంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయవచ్చు కానీ, ఇక్కడ వాడి ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే అక్కడకు వెళ్ళడు. ఇక్కడ చదవడు.”
“సార్, మరి ఇక్కడ బ్రిడ్జ్ గురించి ప్రెసిడెంట్ ని ఆడగలేదా ”
“అడిగాం కానీ పంచాయితీ ఫండ్స్ లేవు అని అన్నారు ”
బెల్ మోగింది, అందరూ క్లాస్ లకు వెళ్లారు.
*
రామ రాజు మాస్టర్ అంటే అందరూ గౌరవంగా, అభిమానంగా చూడడం ప్రారంభించారు. కారణం, అతనికి అన్ని విషయాలమీద అవగాహన ఉండడం. సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచన ఉండడం.
“సార్, మీకు అభ్యంతరం లేక పోతే మనందరం మరొక్కసారి ప్రెసిడెంట్ గారి దగ్గరకు వెళ్ళి సమస్య వివరిద్దాము ” అన్నారు మాస్టారు.
అతని ముఖం అందరూ తేరిపారా చూశారు. అతని వయసు సుమారు ముప్పై ఉంటుంది. తమతో పోల్చితే చాలా చిన్న వయసు, కానీ ఎవరి వలన ఏ పని అవుతుందో అనుకున్నారు.
“సరే మాస్టారు రేపు ఆదివారం కదా అందరం వెళ్దాం ” హెడ్మాస్టర్ అన్నారు.
*
ప్రెసిడెంట్ ఇల్లు చిన్న సైజు రాజకోటలా ఉంది. కానీ పాతది, అతనికి ప్రెసిడెంట్ గిరి తో పాటు. అనేక వ్యాపారాలు ఉన్నాయి. గేటు తీసుకొని లోనకి వెళ్ళిన తరువాత, పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు వాళ్ళ స్టూడెంట్ పవన్గాడు.
“నమస్కారం సార్ లోపలికి రండి ” అంటూ లోనకి వెళ్ళిపోయాడు.
అందరూ కూర్చున్న తరువాత ప్రెసిడెంట్ వచ్చాడు. వయసు యాబై అయిదు ఉంటుంది. చూడ్డానికి బలంగా ఎత్తుగా ఉన్నాడు. డబ్బున్న గర్వం అతనిలో ఏమాత్రం లేదు.
“నమస్కారం మాస్టారు. ఏమిటి అందరూ ఒక్కసారిగా వచ్చారు ”
హెడ్ మాస్టారు అతనికి అంతా వివరించి చెప్పారు.
“చూడండి మాస్టారు.. ఇంతకు ముందు చెప్పాను. పంచాయితీ పరంగా చూస్తే, అక్కడ బ్రిడ్జ్ వేయాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా కావాలంటే ఏర్పాటు చేయగలను ” అన్నాడు.
హెడ్మాస్టర్ చెప్పడం ప్రారంభించారు “నిజమే సార్. కానీ ఈసారి మేము ఒక ప్రణాళికతో వచ్చాము”
“చెప్పండి నేను మీకు ఎప్పుడూ సహాయంగానే ఉంటాను. ”
“సార్. ఆ గెడ్డ మీద పదిహేను అడుగుల దారి మేమే చందాలు పోగు చేసి కట్టిద్దామను కుంటున్నాము ” రామరాజు ప్లాన్ అతనికి చెప్పారు.
“దానికి సుమారు ఏడు లక్షలు అవుతుంది, నేను లక్ష సర్దినా, మిగతాది మీరు సేకరించడం చాల కష్టం ” జరిగే పని కాదన్నట్టు అన్నాడు.
“సార్ మాదగ్గర ఒక ఐడియా ఉంది. రానున్న దసరాకి ఏదో ఒక నాటకం ప్రదర్శించి వచ్చిన డబ్బుతో.. ”
ప్రెసిడెంట్ పడి పడి నవ్వసాగాడు. ”మాస్టారు. ఇంత చెత్త ఐడియా మీకు ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు, మొబైలు దెబ్బకి సినిమాలే ఆడటంలేదు ఇక.. ”
“మన జిల్లాలో ఇంకా ఆదరణ ఉంది కదా సార్, అంతే కాదు చుట్టుప్రక్క ఊరిలో కూడా మన స్కూల్ గురించి ప్రచారం బాగా చేద్దాం, అదే సమయంలో ప్రజలకు మన స్కూల్ గొప్పదనం చెపుదాం ”. కొంచెం సేపు ఆగి “ఎలాగూ వచ్చే సంవత్సరం పంచాయితీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి మీకు కూడా పేరు వస్తుంది. ”
ప్రెసిడెంట్ ఆఖరి మాటకు లొంగాడు.
“సరే మాస్టారు, మీరు ఇంత ఇదిగా చెప్పారు కాబట్టి అలాగే కానివ్వండి ”
అందరూ బయలు దేరారు.
“సార్, నాటకంలో నాకు కూడా ఒక పాత్ర ఇవ్వడం మరచిపోకండి ” మురిసిపోతూ అన్నాడు.
“తప్పకుండా సార్” అన్నారంతా.
***
“మాస్టారూ, అతను నాటకాలకు లొంగుతాడని మీకెలాతెలుసు” స్టాఫ్ అంతా అడిగారు.
“సార్. పూర్వాశ్రమంలో అతను ఒక రంగస్థల నటుడు. అతనికి నాటకాలంటే పిచ్చి. నిన్న వాళ్ళబ్బాయి ద్వారా తెలిసింది.”
*
దసరాకి ఇంకా పది రోజులూ సమయం ఉంది. ఈలోగా స్టేజ్ ఎక్కడ, ఏ నాటకం వేయాలి, ప్రచారం ఎలా చేయాలి అన్ని విషయాలు మాట్లాడు కోడానికి స్కూల్ అయిన తర్వాత, గంట సమయం కేటాయించాలని తీర్మానం చేశారు హెచ్. ఎం.
కానీ తెలుగు టీచర్ కాత్యాయిని, ఇంగ్లీష్ టీచర్ సావిత్రి మేడమ్లు, “ఏదైనా స్కూల్ టైమ్లోనే, ఆలస్యం అయితే బస్ మిస్ అవుతుంది” అని తప్పించుకున్నారు.
హిందీ మాస్టర్ పరమశివం మాత్రం “సార్. మా ఇల్లు ఇక్కడకు దగ్గరే కాబట్టి నేను ఎప్పుడైనా రెడీ” అన్నాడు.
ఆరోజు మీటింగ్ లో పి. ఈ. టి మాస్టర్ అందర్నీ ఉత్సాహ పరచడానికి వేడి వేడి పకోడీలు, టీ తీసుకొచ్చారు. రామరాజు మాస్టర్కి చాలా ఆనందంగా ఉంది మంచి స్టాఫ్ దొరికినందుకు.
“సార్, సమస్య అందరిదీ అయినప్పుడు, పరిష్కారంలో అందరూ చేయి కలపాలి.”
చర్చ అనంతరం, స్టూడెంట్స్ సహాయం కూడ తీసుకుందామని నిర్ణయానికి వచ్చారు.
*
ఊరి మధ్యలో స్టేజ్ వేశారు, అడుగడుగునా, ఎల్ఈడి బల్బులతో ఊరంతా క్రొత్త అందాన్ని సంతరించుకుంది. దసరా అంతా అక్కడే ఉన్నట్టుండి, చాలా రోజులకు ప్రెసిడెంట్ నటిస్తున్నాడంటే, మూడు ఊర్లు ఏకమై వచ్చారు.
ఎవరికీ నాటకానుభవం లేదు కాబట్టి ప్రెసిడెంట్ తన పాత బృందాన్ని తీసుకొచ్చాడు, అందరూ పాత వారే గనుక “ద్రౌపదీ మాన సంరక్షణం” అనే నాటకం ఎంచుకున్నాడు ప్రెసిడెంట్.
ముందుగా రామ రాజు మాస్టర్ స్కూల్ గొప్పదనం గురించి, ఈసారి పదవ తరగతి లో నూటికి నూరు శాతం ఎలాగైనా సాధిస్తామని నమ్మకంగా చెప్పారు. పిల్లల్ని పంపించ వలసిందిగా కోరాడు.
స్టూడెంట్స్ తెర పైకి లేపారు.
దుర్యోధనుడు(ప్రెసిడెంట్) దర్పంగా నడుచుకుంటూ వేదిక మీదకు ప్రవేశించాడు.
మయసభలో దుర్యోధనుడి నటన అద్భుతంగా ఉంది. ప్రజల చప్పట్లతో మారు మ్రోగిపోయింది. (రాత్రి 12 గంటల వరకూ నాటకం వేసారు, కొంత ఉందనగా దుర్యోధనుడికి మూర్ఛ వచ్చి కిందకు పడిపోయాడు, నాటకం ఆగింది. )
ప్రెసిడెంట్ని పలకరించడానికి స్టాఫ్ అంతా వెళ్లారు.
“మాస్టారూ. మళ్ళీ పది సంవత్సరాల తరువాత నా చేత నాటకం వేయించారు, న్యాయం చేయలేక పోయాను. ” విచారంగా అన్నాడు ప్రెసిడెంట్.
“మీరు వేయడం వలన నాటకానికే అందం వచ్చింది ” అన్నారు హెడ్ మాస్టర్.
ఇంతలో అతని భార్య కోపంగా వచ్చి,
“ఆయన అనారోగ్యం వలన ఎప్పుడో మానేశారు, కానీ మీకోసం మళ్ళీ వేశారు.. కొంచంలో గండం గట్టెక్కింది, రామరాజు మాస్టర్ వల్లనే ఇదంతా జరిగింది. అంత అవసరం అయితే అతనినే ఆ డబ్బంతా పెట్టుకోమనండీ. వస్తున్నాయిగా.. లక్షల జీతం”
నాటకంలో ద్రౌపది వేషం వేసిన సరోజ మీద ఉన్న కోపం వీళ్ళ మీద చూపించింది. కోపంగా ఇంకా ఏవో మాట్లాడబోతోంది..
ఇంతలో ప్రక్క గది తలుపులు తోసుకుంటూ బయటకు వచ్చింది, ప్రెసిడెంట్ కూతురు “చిత్ర”. అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు. ఈ కథలో ఆమె ఉన్నట్టే ఎవరికీ తెలియదు.
“మాస్టర్ గురించి మీకేం తెలుసు..”
అంతా నిశ్శబ్దం..
“పది సంవత్సరాల క్రితం అదే స్కూల్లో పనిచేస్తూ గెడ్డ దాటుతుండగా మరణించిన ‘అన్నపూర్ణ’ టీచర్ గారి కొడుకు రామరాజు మాస్టర్. మరణానంతరం తన దేహాన్ని సైతం కాకినాడ మెడికల్ కాలేజ్కి దానం చేసిన త్యాగమూర్తి ఆమె.”
అందరూ భావోద్వేగానికి గురయ్యారు.
‘ఓహో.. అందుకన్నమాట స్కూల్లో అడుగు పెట్టిన దగ్గరనుండి బ్రిడ్జ్ వేయించడమే పనిగా పెట్టుకున్నాడు..’
ప్రెసిడెంట్ భార్య చిన్నబోయింది, ప్రెసిడెంట్ కళ్ళు చెమ్మగిల్లాయి.
“ఆబ్రిడ్జ్ కట్టించడం సమస్య కాదు, సమస్య అందరిదీ అయినప్పుడు, పరిష్కారంలో అందరూ చేయి కలపాలని ఆయన ఉద్దేశం”
*
రాజు మాస్టర్ స్టేజ్ మీద స్కూల్ గురించి చెప్పిన తరువాత, సోషల్ మీడియా లో చూసి ఊర్లో వాళ్లే కాకుండా విదేశాలలో స్థిరపడిన విద్యార్ధులు కూడా, ఫండ్స్ రూపంలో స్కూల్ ఎకౌంట్ లో విపరీతంగా డబ్బులు వేశారు. ఎక్స్ట్రా వచ్చిన డబ్బుతో వంట గది కట్టించడానికి తీర్మానించారు.
*
కొసమెరుపు..
పది సంవత్సరాల క్రితం ఒక రోజు రాత్రి చిమ్మ చీకటి.
పగలు ఎంతో అందంగా ఉండే ఆ ప్రాంతం రాత్రి తన విశ్వరూపం చూపించ సాగింది.. ప్రెసిడెంట్ ప్రక్క ఊరిలో “ద్రౌపదీ మాన సంరక్షణం” నాటకం వేసి రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో బుల్లెట్ పై తిరిగి వస్తుండగా గెడ్డ ఆవలి ఒడ్డున ఎవరో వస్తున్నట్టు చూసి లైటింగ్ అటువైపు వేశాడు..
చీకట్లో మెల్లగా నడుచుకుంటూ హెడ్మాస్టర్ అన్నపూర్ణ గారు, కనిపించారు. హెచ్. ఎమ్ అవ్వడం వలన ప్రతీరోజూ ఆమెకి ఆలస్యం అవుతుంది. కానీ ఈరోజు ఏం పని ఉందో ఏమో వస్తే అడగవచ్చు..
ఆమె లైటింగ్ వెళుతురులో నడవసాగింది.. అతనికి మైకం ఆవహించింది. నోటిలో నురగలు.. బుల్లెట్ పై నుండి మూర్ఛతో పడిపోయాడు. ప్రెసిడెంట్ వెనుక ఉన్న సరోజ కూడ పడిపోయి పారిపోయింది. ఎవరో అటువైపు వచ్చి, దుర్యోధనుడు వేషంలో ఉన్న ప్రెసిడెంట్ని ఇంటికి చేర్చారు.
మర్నాడు తెలిసింది హెచ్. ఎమ్ గారు ప్రక్క ఊరిలో శవమై తేలారాని, దుఃఖించాడు ప్రెసిడెంట్. తన వల్లే ఇలా జరిగిందని అపరాధ భావంతో, భార్యకి చెప్పి చాలా కాలం బాధపడ్డాడు. ఇన్నాళ్ళకు తన పాపానికి నిష్కృతి లభించిందని తన కూతుర్ని రామ రాజు మాస్టర్ తో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు ప్రెసిడెంట్ రామ గోపాల వర్మ.
రామరాజు, చిత్ర అవనిగడ్డ టీచర్ ట్రైనింగ్ లో బ్యాచ్మీట్స్ అన్న సంగతి ఎప్పటికీ తెలియలేదు.
శుభం
******
కృష్ణమోహన్ పుల్లేటికుర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పుల్లేటికుర్తి కృష్ణ మోహన్,M.A.PGDCA., జర్నలిస్ట్ మరియు రచయిత, శ్రీకాకుళం
Comments