top of page

కృష్ణా.. నీ కోసం

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #కృష్ణానీకోసం, #ముందుకుసాగవే

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 35

Krishna Nee Kosam - Gayathri Gari Kavithalu Part 35 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 18/08/2025

కృష్ణా.. నీ కోసం - గాయత్రి గారి కవితలు పార్ట్ 35 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


కృష్ణా.. నీ కోసం.

(కవిత)

**********************************

నీ శిరిమున పింఛమునై విజయినిగా నిలవాలనుకొంటున్నా!

నీ ఫాలమున కుంకుమనై ముచ్చటగా మెరవాలనుకొంటున్నా!


నీ కనులలో కాంతినై జగత్తులను చూడాలను కొంటున్నా!

నీ నాసికలో శ్వాసరూప హంసనై విహరించాలను కొంటున్నా!


నీ మోవిలో వేణువునై రాగాలను పలికించాలను కొంటున్నా!

నీ కంఠంలో మణిమయ హారమునై శోభించాలనుకొంటున్నా!


నీ హృదయంలో భావమునై నిరంతరం శోచించాలనుకొంటున్నా!

నీ బాహువుల్లో శక్తినై ఈ నవయుగాన్ని శాసించాలనుకొంటున్నా!


నీ కరములో లేఖినినై విలువైన గ్రంథాలను వ్రాయాలనుకొంటున్నా!

నీ కాలికి అందె నగుచు నీ స్పర్శతోనే పరవశించాలనుకొంటున్నా!


నీ పాదాల చెంతనే విరిబాలనై పులకించాలనుకొంటున్నా!

నీ గుడిలో దీపాన్నై పదికాలాల పాటు వెలగాలనుకొంటున్నా!


నీ సన్నిధిలో జేగంటనై గణగణమంటూ మ్రోగాలనుకొంటున్నా!

నీకోసం నా ఆత్మనే నైవేద్యంగా సమర్పించాలనుకొంటున్నా!


నీ నామాన్నే పలుకుతూ హాయిగా మరణించాలనుకొంటున్నా!

ఓ పరంధామా! నీ లోకంలో నీతోనే నివసించాలనుకొంటున్నా!//

************************************

ree








ముందుకు సాగవే!

(వచనకవిత)

************************************

ఊగిసలాడకే మనసా! నీవుస్సురని కుమలకే మనసా!

మూగుతున్న ఊహలలో నీవు మునకలేయకే మనసా!.


ఒంటరిగా మిగిలానని నీ కున్నదేదో పోయిందని దిగులుతో

జంట లేదనుకుంటూ యీ జగతినే మరువకే మనసా!.


అనుబంధాల మాయలలో ఆనందపు టాన్వేషణలో నీవు

అనుక్షణము పరుగెత్తి యలసి పోయావులే మనసా!.


పరికించి చూస్తే కొద్దిగా ప్రపంచమేమిటో తెలుస్తుంది.

చరిత్రను తవ్వితే చాలు చాలా విషయాలు చెబుతుంది.


ప్రత్యేకత నీకుందని నీ నవ్వే బహు మూల్యమని పొగిడితే

సత్యకాలపు పెద్దమ్మగ చటుక్కున నమ్మకే మనసా!.


మోసకారి మాటలలో మోహమేదో దాగుందని తెలుసుకో!

కాసేపు తెలివితో నీవు కనులు తెరిచి చూడవే మనసా!.


నీ దుఃఖపు కన్నీళ్లను గాంచుతూ నిన్ను వెక్కిరిస్తూ లోకం

వదరుతూ ఉంటుందని నీవు వణికిపోకుమా వెఱ్ఱి మనసా!.


బేలతనము నీకెందుకు? బెంగలన్ని నీ కెందుకు?యీ కాలంలో

జాలిలేని లోకంలో నీకు సానుభూతి సాయమెందుకే మనసా!.


బాధలను మరచిపో! భయాలను వదులుకో! నిశ్చలంగా

సాధనలను సల్పుతూ నీవు దివ్యమౌ జ్ఞానాన్ని పొందవే మనసా!.


నిన్ను నీవు తెలుసుకో! గమ్యమేమిటో నీవు వెదకుచూ నిత్యము

చెన్నుగా దివ్యమౌ పథములో చింత వీడి ముందుకే సాగిపోవే మనసా!.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




留言


bottom of page