కృష్ణానుగ్రహం
- Sudha Vishwam Akondi

- Jul 22
- 3 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguInspirationalStories, #Krishnanugraham, #కృష్ణానుగ్రహం

Krishnanugraham - New Telugu Story Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 22/07/2025
కృష్ణానుగ్రహం - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
నిజానికి ఇది కథ కాదు రెండు, మూడు దశాబ్దాల క్రితం నిజంగా జరిగిందని పెద్దలు చెప్పగా విన్నాను.
ఈశ్వరానుగ్రహం ఎప్పుడు మనపైన ప్రసరిస్తుంది? అందుకు ఏమి చేయాలి? భగవంతుని పట్ల ఎంత భక్తి కలిగి ఉండాలి? అంటే అది ఇదమిద్దంగా చెప్పడానికి ముందు భగవంతుని గురించి తెలియాలి కానీ తెలుసుకోవడం మహామహులకే సాధ్యం కానిది అంటారు ఇక అల్పులమైన మనమెంత? అందుకే మహాభక్తుల కథలు, వారు భగవంతుని నిర్హేతుక కృపను ఎలా పొందారు అనేది తెలుసు కోవడం, చదవడం ద్వారా మనకూ అలాంటి మానసిక అనుభవం కలుగుతుంది.
భగవంతుని తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, స్నేహితుడిగా, బంధువుగా, గురువుగా ఇలా ఎన్నో రకాలుగా సర్వస్వం గా భావించి ఆయనను చేరుకోవచ్చు అని మన వేదం వాగ్మయం చెబుతుంది. ఒక్కో భక్తుడు ఒక్కొక్క విధంగా భగవంతుని భావించి తరించారు.
అలాంటి భక్తులలో ఒకరు ఎలా కృష్ణుని అనుగ్రహం పొందిన సంఘటన రెండు, మూడు దశాబ్దాల క్రితం నిజంగా జరిగిందట
***
ఒక ఊరిలో రంగాచార్యులు అనే మహానుభావుడు ఆ వూరి వేణుగోపాలుని ఆలయంలో అర్చకత్వం చేస్తూ భార్యాపిల్లలతో జీవించేవారు. ఆ వేణుగోపాలుని తమ ఇంటి సభ్యునిగానే భావించేవారు. స్వామి కి ఎంతో భక్తితో కైంకర్యాలు నిర్వహించేవారు. ఆ దంపతులకు ఒక్కతే కూతురు. ఆ దంపతులు ఉన్నదాంట్లో తృప్తి పడుతూ జీవనం సాగించేవారు. ఆయన సాయంకాలం ఆ ఊరి జనులను కూర్చోబెట్టుకుని తనకు తెలిసిన స్వామి లీలలు వర్ణించి చెప్పేవారు. అది విన్న జనం ఆనందానుభూతులు పొందేవారు. ఇలా ఉండగా కాలక్రమంలో వారి కూతురు యుక్తవయస్సుకు వచ్చింది.
"ఎవరినైనా అడిగి ధనం సమకూర్చుకుని, మనకు తగిన పెళ్లి సంబంధాలు చూడండి" అంటూ భార్య చెబుతూ ఉండేది కానీ అలాగే అంటూ ఆయన ఏ ప్రయత్నాలు చేయలేదు. అంటే స్వామి సేవలో నిమగ్నమై మర్చిపోయేవాడు.
అలా ఉండగా ఈయన భక్తిప్రపత్తులు విన్న వేరే ఊళ్ళో ఉన్న రామాచార్యులు 'ఇటువంటి కుటుంబం తో వియ్యమందితే చాలా బావుంటుంది. ఆ ఇంటి అమ్మాయి మా ఇంటి కోడలు అయితే మా కుటుంబం తరిస్తుంది' అనుకుని తన భార్యతో సంప్రదించాడు. ఆవిడ కూడా అంగీకరించింది.
'అంతటి భక్తుడి దగ్గర ఏమి అడక్కూడదు. ఆయన లేమి ని ఎత్తిచూపినట్టు అవుతుంది, కోడలు వస్తుంది అదే చాలు' అనుకున్నారు ఆ భార్యాభర్తలు.
ఒక మధ్యవర్తి ద్వారా కబురు పంపారు రంగాచార్యుల వారికి. ఆ విషయం విని రంగాచార్యుల దంపతులు ఎంతో సంతోషించారు.
"చూశావా! స్వామి చూస్కుంటాడని చెప్పాను కదా! అనవసరంగా కంగారు పడ్డావు" అన్నాడు భార్యతో. ఆమె నిజమేనంది.
రామాచార్యులవారు మళ్ళీ కబురు పంపారు దాని సారాంశం " మీరు మాకు కానీ కట్నం ఇవ్వక్కర్లేదు మీతో వియ్యమందడమే మాకు చాలు. ఇక ఏకంగా పెళ్లి ముహూర్తం పెట్టించి కబురు పెడితే వచ్చేస్తాం. "
అది విన్న రంగాచార్యుల భార్య, ఆయన సన్నిహితులు ఎంతో సంతోషించారు కానీ ఆయన మాత్రం సంతోషించలేదు సరి కదా వాళ్ళను ఒకసారి కలిసి వస్తానని భార్యకు చెప్పి వాళ్ళింటికి వెళ్లారు.
"అలా సంప్రదాయం ప్రకారం మీకేమి కావాలో చెప్పండి అన్ని ఇస్తాను" అనగానే వాళ్ళు ఆశ్ఛర్యపోయి ఏదో మొహమాటం కొద్దీ అంటున్నారనుకుని "అబ్బే! ఏమీ వద్దండి" అన్నారు.
కానీ ఈయన వినకుండా చెప్పాల్సిందేనని పట్టుపట్టారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఇక రామాచార్యులకు ఒళ్ళుమండి చాలా పెద్ద లిస్ట్ చెప్పి, "అవన్నీ మేము బయలుదేరడానికి ఒకరోజు ముందు పంపిస్తేనే మేము వస్తాము" అని చెప్పారు.
వాళ్ళు చెప్పింది అంతా పేపర్ పైన లిస్ట్ రాసుకుని అలాగే అని చెప్పి వెళ్తున్న ఆయన్ని ఆశ్ఛర్యo గా చూస్తూ నిలబడ్డారు.
రంగాచార్యులు ఇంటికి వచ్చి విషయం భార్యతో చెప్పారు. అది విన్న ఆవిడ తలకొట్టుకుంది. "మీరు సంబంధం చూడకపోగా వచ్చిన సంబంధం చెడగొట్టేటట్టు వున్నారు. పెళ్లి చేయడానికే ధనం ఎలా అని అనుకుంటుంటే ఇప్పుడు ఇలా చేశారు. మనకేముందని ఇవన్నీ ఇస్తానని చెప్పి వచ్చారు. ఇప్పుడు ఎక్కడినుంచి తెస్తారు?" అని అడిగింది బాధగా.
వెంటనే ఆయన "వేణుగోపాలుడు వున్నాడు కదే! ఎందుకు బెంగ?" అంటూ గుళ్లోకి వెళ్ళిపోయి ఆ లిస్ట్ స్వామి ముందు పెట్టి "ఇదిగో వేణుగోపాలా! వాళ్ళను సామాను ఏమేమి కావాలో అడిగి లిస్ట్ రాసుకొచ్చాను. ఇవన్నీ ఒకరోజు ముందుగా కావాలట వాళ్ళకి. ఇక చూసుకో" అని ఇలా కాసేపు మాట్లాడి ఇంటికొచ్చి హాయిగా నిద్రపోయాడు.
పెళ్లి సమయం దగ్గరికొచ్చింది. భార్య ఆందోళన పడసాగింది. ఊళ్ళో వాళ్ళందరూ ఈయనో పిచ్చివాడు అనుకుంటున్నారు
*** **
అక్కడ రామాచార్యుల ఇంట్లో
"అనవసరంగా అంత లిస్ట్ చెప్పామేమో.. పాపం ఆయన ఎక్కడినుంచి తెస్తాడు?" అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఇంతలో ఎడ్లబండ్లు వరసగా వచ్చి నిలబడ్డాయి. అందులోనుంచి సామాను కిందకు దింపి బండి వాడు వచ్చి "అయ్యా! రంగాచార్యుల వారు పంపించారు. మీరు చెప్పిన సామాను సరిగ్గా ఉంది లేనిది చూసుకుని చెబితే మేము బయలుదేరుతాము" అన్నాడు.
చూస్తే అన్నీ ఉన్నాయి. 'రంగాచార్యుల వారే పంపి వుంటారు ఎవరి వద్దనో అప్పు చేసి' అనుకుని వాళ్ళని పంపించి వేశారు. పెళ్లికి బయలుదేరి వెళ్లారు. వీళ్ళు చెప్పిన విషయం విన్న అందరూ ఆశ్చర్య చకితులు అయ్యారు. ఆయన అసలు పంపలేదు అని ఊరివారు చెప్పారు. అది విని పెళ్ళివారు ఆశ్చర్య పోయారు. వారి భక్తి కి, స్వామి కరుణించిన తీరుకి నిజంగా మనం ధన్యులం అయ్యామని పెళ్ళివారు అనుకున్నారు. కూతురిని అత్తవారింటికి పంపి ఆ దంపతులు ఆ వేణుగోపాలస్వామి సేవలో తరించారు.
మహాత్ముల కథలు విని మనం ఆనందించాలి కానీ మనం అనుకరించడానికి వీలు కాదు. ఆయనలా నడిస్తే "గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం" అన్న సామెత మన పట్ల వర్తిస్తుంది.
మానసికంగా అలా పూర్తిగా భగవంతుని వైపు తిరిగిపోవడం వేరు, బాధ్యతలు తప్పించుకోడానికి అలా చేయడం వేరు. ఏది ఏమైనా మనం సామాన్యులం కనుక మన పనులు మనం సక్రమంగా చేసుకుంటూ, అసాధ్యమైనవి ఆయనకు అప్పజెప్పుతూ జీవించాలి. కానీ వాళ్ళలా చేయాలని అనుకరిస్తే అది యాక్షన్ లా ఉంటుంది తప్ప మానసిక సమర్పణ లేకుండా నటిస్తే భగవంతుడు హర్షించడు.
కృష్ణార్పణమస్తు

-సుధావిశ్వం



Comments