top of page

క్షీరసాగర మథనము - 21

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 21 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 09/04/2025

క్షీరసాగర మథనము - 21 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 21 చదవండి..


 110.

వచనము.

ఇవ్విధంబుగ నసుర సేనాధిపతులు వేడగా వారిని క్రీగంట చూచి మోహిని యిట్లు వచియించె.//

తాత్పర్యము.

ఈ విధంగా రాక్షసుల సేనాధిపతులు వేడుకోగా వారిని ఓరకంటతో చూచి మోహిని ఇలా చెప్పింది.//

111.

తేటగీతి.

"కశ్యపాత్మజుల్ మీరలు కాంత నేను 

విబుధవరులెల్ల స్త్రీలను విశ్వశింప

లేరయా!మీకు కల్గును లేమి యనుచు 

ధర్మకోవిదుల్ తెల్పిరి తగున మీకు?"//


తాత్పర్యము :

మీరు కశ్యపప్రజాపతి కుమారులు. పండితులైన వాళ్ళు స్త్రీలను నమ్మకూడదని, అలా నమ్మితే దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రము తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు.మీరు నాతో ఇలా మాట్లాడటం మంచిదా? కాదు కదా!"//

112.

తేటగీతి.

కపట బుద్ధితో మోహిని కలకల నగి 

పలుకు చుండగన్ దైత్యులు పడతిని గని 

ప్రేమ నిండగాన్ మదిలోన విశ్వశించి 

యమృత కలశంబునుంచిరా యతివ చెంత.//


తాత్పర్యము.

మోసం చేసే బుద్ధితో మోహిని ఇలా పలికి కిలకిలా నవ్వుతూ ఉంటే రాక్షసులు ఆమెను చూచి ప్రేమతో, విశ్వాసంతో ఆ మోహిని దగ్గర అమృత కలశాన్ని పెట్టారు.//

113.

తేటగీతి.

అమృత కలశమున్ గైకొని యతివ పలికె 

"కార్యమేదియైనను మీరు కలహము విడి 

నాదు చేష్టలన్ మదిలోన నమ్మవలయు 

నుచిత రీతిలో పంచెద నొప్పుదలగ!"//


తాత్పర్యము.

ఆ మోహిని  ఆ అమృత కలశాన్ని తీసికొని"మీ పని ఏదైనా కానివ్వండి!మీరు తగవును వీడి నేను చేసే పనులను నమ్మండి!మీకు చక్కగా అమృతాన్ని నేను పంచుతాను!"అని చెప్పింది.//

114.

వచనము.

మోహిని పల్కులు విని దైత్యులు"వల్లె"యనిరి.//

తాత్పర్యము.

మోహిని మాటలు విని రాక్షసులు"సరే"అని అన్నారు.//


(సశేషం )


క్షీరసాగర మథనము - 22 త్వరలో


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page