లాయర్ బాబు
- Mohana Krishna Tata

- Oct 27
- 3 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #LawyerBabu, #లాయర్ #బాబు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Lawyer Babu - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 27/10/2025
లాయర్ బాబు - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏంటి బేబీ.. అమ్మ అన్నం తినలేదంటా? ఒంట్లో బాగోలేదా?" కూతురిని అడిగాడు పవన్.
"ఏంటి నాన్న.. ! ఆ మాత్రం తెలియదా నీకు?"
"ఏంటో నీకు తెలిసినది బేబీ.. కాస్త చెప్పు"
"కిందటి వారం నుంచి టీవీ లో రియాలిటీ షో స్టార్ట్ అయింది.. అందులో అమ్మ ఫేవరెట్ సీరియల్ హీరో లాయర్ బాబు ఉన్నాడు. ఆయన అక్కడ అన్నం తినలేదట.. అందుకే అమ్మ తినలేదు"
"సీరియల్ లోంచి ఇప్పుడు రియల్ షోలోకి వచ్చాడా? ఈ రియల్ షో అంటే ఏమిటి బేబీ?"
"అయ్యో నాన్నా.. ! రియల్ కాదు, అది రియాలిటీ షో. లోకంలో అంతా ఈ షో కోసం రోజూ ఎదురుచూస్తుంటే, నీకు దాని గురించి తెలియదా?"
"రోజూ మీ అమ్మతో గొడవల షోలే సరిపోతాయి.. వీటికి ఎక్కడ టైం నాకు? దాని గురించి కొంచం చెప్పవా? "
"అయితే వినండి.. మీకు అర్ధమయ్యేలాగ చెబుతాను"
--------
"కొంతమందిని సెలెక్ట్ చేసి, అందరినీ ఒక పెద్ద ఇంటిలో పెట్టి, తాళం వేసేస్తారు.. ఒక వంద రోజులు"
"అయ్యో.. పాపం"
"పాపం ఎందుకు.. ? రోజుకి బోలెడు డబ్బులిస్తారు తెలుసా? తిండి, నిద్ర, ఆటా, పాటా అన్నీ అక్కడే"
"ఒక హాలిడే ట్రిప్ లాగ ఉంటుంది అయితే"
"చూడడానికి అలానే ఉంటుంది. కానీ అవసరమైతే.. గొడవపడాలి, గట్టిగా అరవాలి, తిట్టుకోవాలి.. టాస్క్ లో కుస్తీ కూడా పడాలి. ఏడుస్తూ.. అందరి మనసులు గెలుచుకోవాలి"
"అవన్నీ నావల్ల కాదు.. ఆఫీస్ లో ఫ్యాన్ కింద కూర్చుంటే.. ఆ హాయే వేరు. కష్టపెట్టినా.. మంచి ఫుడ్ పెడతారు కదా?"
"అదేమీ లేదు.. పెద్దమాస్టారు ఇచ్చే సరుకులు వారమంతా సర్దుకోవాలి.. మనకి ఇష్టమైన ఫుడ్ ఏమీ పెట్టారు.. ఏనుగు లాగ లోపలికి వెళ్ళినవారు పీనుగులై తిరిగి వస్తారు తెలుసా?"
"తిండి సరిగ్గా ఉండదా.. ? అయ్యో కష్టమే.. సీరియల్ లాగ షో రోజూ ఉంటుందా?"
"రోజూ ఉంటుంది.. ఇది రియల్ గా జరుగుతుంది.. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడొచ్చు కూడా"
"అయితే మీ అమ్మని పంపిద్దాము.. ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే వుంటుంది. తిండి తగ్గితే, సన్నగా కూడా అవుతుంది. పైగా బోలెడు డబ్బులొస్తాయి"
"అయ్యో నాన్న! అమ్మ ఆల్రెడీ అప్లై చేసింది.. రిజెక్ట్ కూడా అయింది"
"ఎందుకో?"
"మీ నోరు చాలా పెద్దది. మీ అరుపులు మీ ఆయన అయితే పడతారేమో గానీ, ఇక్కడ షో లో కష్టం అన్నారుట"
"అయ్యో.. ! ఏదో ఇక్కడ నా మీద అరిచే ఆ అరుపులు అక్కడ అరిస్తే, నాలుగు డబ్బులు వస్తాయని అనుకున్నానే.. కొన్ని రోజులు మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నానే"
"మీ అంత ఓర్పు ఎవరికీ ఉండదు నాన్నా"
"అవును మరి.. నాలాంటి చాలామందికి భార్యల తిట్లే వేద మంత్రాలు మరి.. భక్తితో వింటాం"
"నాన్నా.. ! అమ్మ వస్తోంది.. బీ అలర్ట్"
(దేవుడా.. ! ఇక నన్ను నువ్వే కాపాడాలి - పవన్ మైండ్ వాయిస్)
--------
"ఏమండీ.. ! నాకు ఒక వెయ్యి ఇవ్వండి?"
"వెయ్యే.. ! ఎందుకో?"
"షో లో లాయర్ బాబు కోసం"
"బాబుకి ఏమైంది పాపం?"
"ఆయన షోలో చాలా డల్ గా ఉన్నాడు.. అందరి దిష్టి తలిగిలిందేమో.. పూజ చేయించాలి"
"ఏదో మీ ఆయనకి అన్నట్టుగా చెప్పావు. వాడికి ఎవడికో పూజలు ఏమిటో.. ఎప్పుడైనా నాకు అలా చేయించావా? "
"మీకెందుకండీ.. డబ్బులు దండగ. కానీ అతనికి ఏమైనా అయితే.. నడుస్తున్న సీరియల్ ఆగిపోతుంది.. మహిళాలోకం క్షోభిస్తుంది"
"నిజమా.. ! సీరియల్స్ చూసినప్పుడేమో కన్నీరు కార్చడం.. ఇప్పుడైతే వారి కోసం ఫీల్ అవడం, నోములు, వ్రతాలు, పూజలు.. ఇంట్లో ఉన్న మొగుడికి మాత్రం ఒక యాపిల్ పండు కూడా పెట్టారు"
"ఇది రియాలిటీ కదండీ అంతే మరి.. మా టైం పాస్ అదే మరి. లాయర్ బాబు సీరియల్ వల్ల.. నా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు బాగా టైం పాస్ అవుతోంది. నేను పోయే వరకూ ఆ సీరియల్ క్షేమంగా నడవాలి. అందుకే లాయర్ బాబు హ్యాపీగా ఉండాలి అని మొక్కుకున్నాను"
"పంకజం.. వాళ్ళకి రోజుకి బోలెడు డబ్బులు ఇస్తారే. చూస్తున్న మనకి, ఒక్క రూపాయి రాదు, కరెంటు ఖర్చు, నీ ఎక్స్‌ట్రా ఖర్చు దండగ అంతే.. "
"అయినా సరే.. నాకు డబ్బులు ఇవ్వాలి.. లేకపోతే నేను ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్ కి మా పుట్టింటికి వెళ్ళను"
"అంత పని చెయ్యకు పంకజం.. ఇస్తాను"
(నువ్వులేని ఆ సమ్మర్ కోసమే నా ఎదురుచూపు.. చెప్పాలంటే అందరి భర్తల ఎదురుచూపు - పవన్ మైండ్ వాయిస్)
"ఇంకో విషయం.. లాయర్ బాబు షోలో గెలవాలని నోము నోస్తున్నాను.. ఒక పది వేలు కావాలి.. "
"కష్టమే.. "
"ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే, ఇంట్లో ఉన్న సామానులు అమ్మేస్తాను.. మళ్ళీ మీరే కొనాలి"
"ఇస్తాలే.. తప్పుతుందా.. ! నాకోసం ఎప్పుడైనా ఒక నోము నోచావే?"
"మీకోసం ఎందుకు చెప్పండి.. డబ్బులు దండగ"
"ఎందుకే లాయర్ బాబు అంటే అంత పిచ్చి?"
"చిన్నప్పటినుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసిన టాప్ ఫ్యాన్ నేను.. తెలుసా? నేను టీవీ చూసిన దాటికి ఎప్పుడూ టీవీలు పేలిపోయేవి.. మా నాన్న ఎప్పుడూ కొత్తది కొనేవారు.. అంత పిచ్చి"
"పెళ్ళిచూపులలో మీ నాన్న మా అమ్మాయి టీవీ బాగా చూస్తుంది అంటే, ఏమిటో అనుకున్నా.. ఇదా" అంటూ వుండగా టీవీలోంచి పొగలు వచ్చి.. పెద్ద శబ్దంతో టీవీ పేలింది.
"నాకు పదివేలతోపాటు.. వెంటనే కొత్త టీవీ కొనండి" అంటూ ఆర్డర్ వేసింది పంకజం.
****************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments