top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 8
'Life Is Love - Episode 8'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 23/02/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ: 


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని.


యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.


చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ ని కలుస్తారు నాయుడుగారు.


కొడుకు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు వరదరాజులు నాయుడు గారు.


ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు. నాయుడుగారి చిన్నకూతురు అమృత తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడుతుంది.


ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 8 చదవండి. 


తొట్రుపాటుతో నాలుగున్నర గంటలకు నాయుడుగారు మేల్కొన్నారు. వాచీని చూచుకొని రెస్ట్ రూంకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు. గదిని వదిలి కాలేజి హాస్టల్ వైపుకు బయలుదేరారు. ఇరవై నిమిషాల్లో హాస్టల్‍ను సమీపించారు. వార్డెన్‍ను కలిశారు.


"అమ్మా! అమృత వచ్చిందా?" అడిగారు.


"గంట క్రితం వచ్చింది సార్! పిలవమంటారా"


"పిలవండి."


వార్డెన్ అమృత గదివైపు నడిచింది.


ఐదు నిమిషాల్లో ఆమె అమృత నాయుడు గారిని సమీపించారు.


అమృత నాయుడిగారి ముఖంలోనికి చూచి తలదించుకుంది. సహజంగా తప్పుచేసినవారు ఎదుటి ఆత్మీయులను చూచి లజ్జతో.... వారు ఏమి అడుగుతారో!... తాము ఏమి చెప్పాలో అనే సందేహంతో తల దించుకుంటారు. ప్రస్తుతం అమృత పరిస్థితి అదే....!


"అమ్మా.... బాగున్నావా! పరీక్షలు బాగా వ్రాశావా!" ప్రీతిగా అడిగారు నాయుడుగారు.


"నాన్నా! ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? అడిగింది అమృత.


ఆ జవాబులో నాయుడుగారికి ప్రస్తుతంలో ఆమె మనస్తత్వం ఎలా వుందో అర్థం అయింది.


"నీ గురించి వినకూడనిది విన్నాను చూచి మాట్లాడాలనిపించింది. వచ్చానమ్మా!!"


అమృత క్షణం సేఫు తండ్రి ముఖంలోనికి చూచి తలదించుకొంది.

’వీరికి విషయం తెలిసిపోయినట్టుంది’ అనుకొంది అమృత.


"నేను విన్నది నిజమేనా అమృతా" సూటిగా అడిగారు నాయుడుగారు.


"ఏం విన్నారు?" ఎదురు ప్రశ్న.


అమృత వేసిన ఆ ప్రశ్నకు నాయుడుగారు ఆశ్చర్యపోయారు. వెంటనే జవాబు చెప్పలేకపోయారు.

ఎలాంటి భయం... సంకోచం.... లేకుండా అడిగింది అమృత.

అందుకే నాయుడుగారికి అంత ఆశ్చర్యం.....

"ఆ... బెంచిమీద కూర్చుందాం రామ్మా" రోడ్ క్రాస్ చేసి సిమెంటు బెంచీని సమీపించారు నాయుడుగారు.


అమృత వారిని అనుసరించింది.

ఆ విషయాన్ని గురించి అడిగితే తన నిశ్చితాభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయాలని అనుకొంది అమృత.


నాయుడుగారు బెంచీపై కూర్చున్నారు. అమృత నిలబడి ఉంది. తదేకంగా క్షణంసేపు ఆమె ముఖంలోనికి చూచి "చిన్నీ! కూర్చో" అన్నారు ఆప్యాయంగా నాయుడుగారు.

తల్లీతండ్రీ అక్కా అమృతను ముద్దుగాను, ప్రేమతో ఆ పేరుతో పిలుస్తారు.


అమృత వారికి కొంతదూరంలో బెంచీపై కూర్చుంది.

క్యాంపస్ నిండా రకరకాల చెట్లు, చల్లని గాలి, ఎంతో ప్రశాంతమైన వాతావరణం....

కానీ... ఆ ఇరువురి మనస్సున ఆ క్షణాల్లో ప్రశాంతత కరువైంది.


"నరసపనాయుడు బావగారి కొడుకు శివ అతన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి చిన్నీ!" ఎంతో సౌమ్యంగా అడిగారు నాయుడుగారు. 


అమృత ఆశ్చర్యంతో క్షణంసేపే నాయుడుగారి ముఖంలోనికి చూచి తలను ప్రక్కకు త్రిప్పి...

"మన బంధువు... మంచివాడు" మెల్లగా చెప్పింది అమృత.


"అతనితో నీ వివాహం జరిపించాలని నాకు మీ అమ్మకు సంకల్పం."


అమృత ఉలిక్కిపడింది. మౌనంగా ఉండిపోయింది. ’అయితే ఈ విషయాన్ని గురించి మాట్లాడటానికే వీరు వచ్చారన్నమాట’ అనుకొంది అమృత.


"జవాబు చెప్పమ్మా" ప్రాథేయపూర్వకంగా అడిగారు నాయుడుగారు.


"అతనంటే నాకు ఇష్టం లేదు."


"అతనికి ఏం తక్కువ తల్లీ?"


"ఇష్టానికి ఎక్కువ తక్కువలతో పనిలేదు."


"అంటే.... నీవు... ఎవరినైనా ఇష్టపడ్డావా?"


"అవును..."


"అతను ఎవరు?"


"నా కాలేజి మేట్"


"కులం"


"దానితో నాకు పట్టింపులేదు"


ఆశ్చర్యంతో అమృత ముఖంలోనికి చూచారు నాయుడుగారు. 

"అంటే...!"


"మేము ప్రేమించుకున్నాము."


"మరి... అతని మతం"


"దానితో నాకు పట్టింపులేదు"


"ఏంటీ!!" ఆశ్చర్యంతో అడిగారు నాయుడుగారు.


వారు కూర్చొనివున్న బెంచీకి ఇరవై అడుగుల దూరంలో కాంపస్ చుట్టూ వుంది సిమెంట్ రోడ్డు. ఓ యువకుడు వారు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. వారిని పరీక్షగా చూచాడు. ఓ నూరు అడుగులు నడిచి.... ఆగి వారి వైపు చూస్తూ నిలబడ్డాడు. అతనే అమృత ప్రియుడు మహీధర్. 

దూరాన్నుంచి అతను తనను అమృతను చూస్తున్న విషయాన్ని నాయుడుగారు గమనించారు.


"అమృతా!!"


"చెప్పండి."


"నీ నిర్ణయం మారదా!"


"వివాహం అనేది నా స్వవిషయం. నాకు నచ్చిన వాణ్ణి నేను పెండ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతుంది?"


’ఇంతకు ముందు రోజుల్లో తన ఎదురుగా నిలబడి మాట్లాడే దానికి భయపడే అమృత ఈనాడు ఎలాంటి భయం, సంకోచం లేకుండా మాట్లాడుతుంది. దీనికి కారణం విచక్షణా జ్ఞానం లేని వయస్సు. పరస్పర ఆకర్షణ, వ్యామోహం. 


అమృత వ్యవహారం చేయి దాటి పోయింది. ఆమెకు ఇప్పుడు నామాటలు రుచించవు’ అనుకొన్నారు నాయుడుగారు. కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా జరిగిపోయాయి. కాలేజి మెయిన్ గేటు దాటి శివ లోనికి వచ్చాడు. 


మహీధర్ నిలబడి వున్న ప్రాంతాన్ని సమీపించాడు. సిమెంటు బెంచ్‍పై కూర్చున్న నాయుడుగారిని, అమృతను చూచాడు. మహీధర్‍కు వ్యతిరేకవైపున రోడ్డు ప్రక్కన నిలబడి అమృత, నాయుడుగారి వైపు చూచాడు.

నాయుడుగారు అమృతను, శివను చూచారు.


"చిన్నీ! అడుగో శివ! నీవు ప్రేమించినవాడు శివ కంటే గొప్పవాడా!" సౌమ్యంగానే అడిగాడు నాయుడుగారు.


ఎలాంటి తొట్రుపాటు లేకుండా "గొప్పవాడే" అంది అమృత.


"అమృతా! నీకు నేను ఏం తక్కువ చేశానని నాతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకొన్నావ్? ఈ విషయం మీ అమ్మ వింటే ఏమైపోతుందో ఆలోచించావా!!" 

ప్రాథేయపూర్వకంగా అడిగారు నాయుడుగారు.


"ఆలోచించలేదు.... ఆలోచించాలని అనిపించలేదు" 

నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది అమృత లేచి నిలబడింది. 


"మీరు మా వివాహాన్ని అంగీకరించరని నాకు తెలుసు. శివతో నా వివాహం జరిపించాలనే మీ నిర్ణయం కూడా నాకు తెలుసు. అందుకే నేను, అతను రెండు వారాల క్రితం వివాహం చేసుకున్నాము. పవిత్ర ప్రేమకు జాతి, కుల, మత బేధాలు వుండవని నా నమ్మకం. నెలరోజుల్లో ఫైనల్ ఇయర్ ముగుస్తుంది. అతను, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం. నన్ను నా యిష్ట ప్రకారం చదివించినందుకు థాంక్స్ వెళుతున్నాను" ఎలాంటి సంకోచం లేకుండా చెప్పింది అమృత.


మహీధర్ వచ్చి వారికి పది అడుగుల దూరంలో నిలబడ్డాడు.

"ఇటీజ్ లేట్?" అన్నాడు.


"సారీ... ఫర్ ద డిలే లెటజ్ గో" అంది అమృత.


ఇరువురూ రోడ్డుపైన క్యాంపస్ ముఖద్వారం వైపు నడవసాగారు.


నాయుడుగారు అచేతనంగా కూర్చుండిపోయారు.

శివ వారివైపు నడవసాగాడు.


అమృత, మహీధర్ అతన్ని సమీపించారు. 

అమృత ఆగింది.

"శివా...!"


శివా అమృత ముఖంలోనికి చూచాడు.


"థాంక్యూ వెరీమచ్. మా విషయాన్ని మా నాన్నగారికి చెప్పినందుకు. హంపీలో నేను నిన్ను చూచాను" వ్యంగ్యంగా నవ్వి మహీధర్‍తో కలిసి ముందుకు నడవసాగింది అమృత.


శివ నాయుడుగారిని సమీపించాడు. కళ్ళు మూసుకొనివున్న నాయుడుగారి కళ్ళనుంచి నీరు చెక్కిళ్ళపైకి దిగజారాయి. వంగి వారి ముఖంలోనికి చూచాడు శివ.


"సార్! లేవండి వెళదాము. ఇక్కడ ఇలా జరుగుతుందని తెలిసే నేను వచ్చాను. పదండి మన వూరికి వెళ్దాము" 

నాయుడుగారి ఎడమ చేతిని తన కుడిచేతిలోనికి తీసుకున్నాడు. నాయుడుగారు కన్నీటితో దీనంగా శివ ముఖంలోకి చూచాడు. 


"సార్! మీకు తెలియనిదంటూ లేదు. నేను మీకు చెప్పేటంతటివాడను కాను బాధపడకండి. అంతా దైవ నిర్ణయం. రండి" అనునయంగా చెప్పాడు శివ.


నాయుడుగారు శివ ముఖంలోకి చూచి విరక్తిగా నవ్వి... శివ చేతి ఆసరాతో ముందుకు నడిచారు.

గురుశిష్యులు ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ చేరారు. శివ టిక్కెట్లు కొన్నాడు. ఇరువురూ ప్లాట్‍ఫారం పైకి చేరారు. రైలు ప్లాట్ ఫారం మీదకు రాలేదు. సమయం రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతం. ఎంతో ఆవేదనలో ఉన్న నాయుడుగారు మధ్యాహ్నం భోజనం చేయలేదు.


నాయుడుగారు భోజనం చేసి ఉండరని ఊహించిన శివ.

"సార్! ప్రక్కనే రైల్వే క్యాంటిన్ ఉంది. రైలు వచ్చే లోపల ఏదైనా తిని వద్దాం పదండి సార్!" వినయంగా చెప్పాడు.


"శివా! నాకు ఏమీ తినాలని లేదయ్యా" నీరసంగా చెప్పారు నాయుడుగారు.


"సార్! మధ్యాహ్నం కూడా మీరు భోజనం చేసి ఉండరని నాకు తెలుసు. దయచేసి నామాట వినండి... రండి... సార్!" అభ్యర్థనగా చెప్పాడు శివ.


అతని ముఖంలోకి దీనంగా చూశారు నాయుడుగారు.

"సార్! మీ మనోవేదనను నేను ఊహించగలను. మీరే మావంటి విద్యార్థులకు చెపుతుంటారు కదా! ’కాలం అన్నివేళలా అనుకూలంగా ఉండదు అని’ అలాంటప్పుడు అయోమయ స్థితిలో అన్నపానీయాలను విసర్జించి ఆవేదనతో బాధపడుతూ ఉంటే శరీర దారుఢ్యం సన్నగిల్లి అశక్తులం అయిపోతాం. 


ఏ పని చేయాలన్నా... దేన్ని సాధించాలన్నా, శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండాలి, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలగమనంలో మార్పు తథ్యం. మనం ధైర్యంతో సహనంతో సమస్యను ఎదుర్కోవాలి’ అని చెప్పారు కదా. రండి సార్" నాయుడిగారి కుడిచేతిని తన ఎడమచేతిలోనికి తీసుకొన్నాడు శివ. చిరునవ్వుతో ప్రీతిగా వారి ముఖంలోనికి చూచాడు.


నాయుడుగారు తలాడించి శివ ప్రక్కన నడుచుకుంటూ క్యాంటిన్‍లోనికి ప్రవేశించారు.


నాయుడుగారు కుర్చీలో టేబుల్ ముందు కూర్చున్నారు. శివ టోకెన్ తీసుకొని నాలుగు ఇడ్లీలతో, రెండు ప్లేట్లను పట్టుకొని టేబుల్‍ను సమీపించి ఒక దాన్ని నాయుడుగారి ముందు ఉంచి మరోదాన్ని తన వైపు పెట్టుకున్నాడు. వాటర్ బాటిల్ కొని రెండు గ్లాసుల్లో నీరు నింపాడు. నాయుడు గారి ముఖంలోకి చూచాడు.


ఎప్పుడూ ఎంతో ఆనందంగా చిరునవ్వుతో కళకళలాడే గురువుగారి ముఖం కళావిహీనంగా కనిపించింది శివకు.

"సార్! తినండి ప్లీజ్" ప్రేమ భరిత అభ్యర్థన.

నాయుడుగారు తినడం ప్రారంభించారు.


"శివా! ప్రస్తుతంలో నన్ను వేధించే సమస్య ఏమిటో నీకు తెలుసా!" దీనంగా అడిగారు.


"తెలుసు సార్! అమ్మగారికి ఈ విషయం ఎలా చెప్పాలా అన్నది" నాయుడుగారి ముఖంలోనికి చూచాడు శివ.


"అవును" అన్నట్టు విచారంగా తలాడించారు నాయుడుగారు.


"సార్.... నాదొక సలహా"


"చెప్పు శివా"


"కొంతకాలం ఈ నిజాన్ని అమ్మగారికి చెప్పకండి" సౌమ్యంగా చెప్పాడు శివ.


నాయుడుగారు పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు కొన్ని క్షణాలు తదేకంగా చూచారు. "అవును... శివా... అదే చేయాలి" మెల్లగా చెప్పారు నాయుడుగారు.


టిఫిన్ చేయడం ముగించి కాఫీ త్రాగారు. రైలు రాకను గురించి సందేశం వినిపించింది.


ఇరువురూ ప్లాట్ ఫారం పైకి వచ్చారు. రైలు ఎక్కారు. 

అది కదిలింది.

"శివా!"


"సార్!!"


"ఈ రైలు నెల్లూరికి ఎప్పుడు చేరుతుంది?"


"పది... పదకొండు గంటల్లో."


నాయుడుగారి సెల్ మ్రోగింది.

"హలో!"


"హలో!!"


"అన్నా... మీరా!!"


అంతవరకు ముఖంలో వున్న ఆవేదన స్థానంలో ఆనందం. నేనూ, మీ వదినా రేపు నెల్లూరికి వస్తున్నాము. మనం కొన్ని స్థలాలను చూచి మనం చేయబోతున్నామనే విషయాన్ని గురించి నీతో మాట్లాడేందుకు" చెప్పాడు జగన్నాథ్.


"జగ్గన్నా! తప్పకరండి. మీతో మాట్లాడుతుంటే నాకు ఎంతో ఆనందంగా వుందన్నా!"


"నాకూ అంతేరా. వారంరోజులు నీతో కలిసి మన ఊర్లో గడపాలని వస్తున్నాను. ఊఁ.... మరో విషయం."


"ఏమిటన్నా.... అది?"


"మన దీపికకు మంచి సంబంధం చూడు. త్వరలో ఆమె వివాహం జరిపించాలి. పేదవాడైనా ఫర్వాలేదు. గుణగణాలు మంచివిగా సాంప్రదాయంగా వుండాలి" చెప్పాడు జగన్నాథ్.


"అలాగే అన్నా!"


జగన్నాథ్ బై చెప్పి సెల్ కట్ చేశాడు.


తననే చూస్తున్న శివ ముఖంలోకి చూచి "నా బాల్య ప్రాణ స్నేహితుడు జగన్నాథ్" చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు. శివ తలాడించాడు. తరువాత ఇరువురు విశ్రాంతి తీసుకున్నారు. 


నాయుడుగారి మనస్సున అమృతను గురించిన ఆలోచనలు. శివ మనస్సున గురువుగారు.... వరుసకు మేనమామ.... వారి అర్థాంగి అనురాధ, వరుసకు అత్తగారు వారిరువురిని గురించిన ఆలోచనలు.


మరుసటి దినం పదకొండు గంటలకు రైలు నెల్లూరు చేరింది. నాయుడుగారిని వారి ఇంటివరకూ వచ్చి దించి.... శివ తన ఇంటికి వెళ్ళాడు.


అనురాధ.... నాయుడిగారి రాకకోసం ఎదురుచూస్తూ.... వారిని గురించే ఆలోచిస్తూ వరండాలో కూర్చొని ఉంది. వీధి గేటు ముందు వారిని చూడగానే లేచి పరుగున వారిని సమీపించింది.


"చిన్నీ ఎలావుందండీ?" ఆతృతగా అడిగింది.


నాయుడుగారు ఆమె ముఖంలోనికి చూచారు. నిట్టూర్చారు.

"బాగుంది అనూ!" తలను ప్రక్కకు తిప్పుకొని చెప్పారు.


అమృతను గురించిన యదార్థాన్ని అనూకి చెబితే ఆమె గుండె ఆగిపోతుంది. బ్రతకలేదు. చచ్చిపోతుంది. నేను బ్రతికి వుండగా అలా జరుగకూడదు. నా జీవితాంతం నా అనుకు నేను తోడుగా ఉండాలి.


"మీతో రాలేదేం."


"మరో నెల ప్రాక్టికల్స్ ఉన్నాయిట"


ఇరువురూ వరండాలోకి ప్రవేశించారు. నాయుడుగారి చేతిలోని బ్యాగ్‍ను తన చేతిలోనికి తీసుకొంది అనురాధ. నాయుడుగారు పద్మాసనం వేసికొని క్రింద కూర్చున్నారు.

"ఈ ఆసనం ఆరోగ్యానికి మంచిది కదా అనూ"


"ప్రయాణంలో అలసిపోయినట్టున్నారు. కూర్చొని వుండండి కాఫీ తీసుకొని వస్తాను" అనురాధ లోనికి వెళ్ళిపోయింది.


’భగవాన్! నిజం నిప్పులాంటిది. నేను అనూకు చెప్పకపోయినా ఏదో ఒకనాడు ఆమెకు ఈ విషయం తెలుస్తుంది. తెలిసిన నాడు తాను నిబ్బరంతో, స్థ్రైర్యంతో నిలబడేలా చేయి తండ్రీ!’ తన ప్రియ గురుదేవులు... శ్రీ భగవాన్ రమణ మహర్షిగారిని ధ్యానిస్తూ వేడుకొన్నారు నాయుడుగారు. 


పదినిమిషాల్లో అనురాధ కాఫీ గ్లాసుతో వరండాలోనికి వచ్చింది. కళ్ళు మూసుకొని వున్న నాయుడు గారిని చూచింది.


"ఏమండీ!" మెల్లగా పిలిచింది.


తొట్రుపాటుతో నాయుడుగారు కళ్ళు తెరిచారు. అనూను చూచారు.


"కాఫీ" చిరునవ్వుతో చెప్పింది అనురాధ.


అందుకొని "ఇది కాఫీ కాదు నీ చేతి అమృతం" అన్నారు నాయుడుగారు.


అనురాధ ముఖంలో సిగ్గు... పెదవులపై చిరునవ్వు వెల్లివిరిశాయి. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

32 views0 comments

Comentários


bottom of page