top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 6'Life Is Love - Episode 6'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 13/02/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మజరిగిన కథ: 


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని.


యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.


చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ ని కలుస్తారు నాయుడుగారు.


కొడుకు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు వరదరాజులు నాయుడు గారు.


ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 6 చదవండి.


మరుదినం ఆదివారం. నాయుడుగారు, జగన్నాథ్‍లు ముకుందరావు ఇంటికి తొమ్మిదిన్నర కల్లా చేరారు. కారు దిగి వీధి గేటు ముందు నిలబడ్డారు. వాచ్‍మెన్ వీరిని చూచి,

"ఎవరి కోసం వచ్చారు సార్?" అడిగాడు.


"ముకుందరావు గారు వున్నారా?" నాయుడుగారి ప్రశ్న.


"వున్నారు సార్!"


"నెల్లూరు నుంచి వరదరాజులు నాయుడు వచ్చారని వారికి చెప్పండి" తన వివరాలు చెప్పారు నాయుడుగారు.


వాచ్‍మెన్ ఇంటి ముఖద్వారం వైపునకు నడిచాడు.

వీధి గేటుకు ఇంటి ముందర కారు పోర్టికోకి దాదాపు నూరు అడుగుల దూరం. గేటు ముందు నుంచి పోర్టికో వరకూ నాలుగు మీటర్ల వెడల్పున సిమెంట్ రోడ్డు. ఇరువైపులా రంగురంగుల రకరకాల పూలమొక్కలు. పోర్టికో నుంచి మూడు అంతస్థుల భవంతి చుట్టూ సిమెంట్ పేవ్‍మెంట్... కాంపౌండ్ వాల్‍కు పేవ్‍మెంట్ మధ్యన నలభై అడుగుల వెడల్పు వున్న స్థలంలో రకరకాల చెట్లు, ఏపుగా ఎదిగి నేత్రానందంగా ఉన్నాయి. ఆ ఇంటిని పరిసరాలను చూడగానే అనిపిస్తుంది ఎవరికైనా అది ఓ కోటీశ్వరుని కోట అని.


సింహద్వారాన్ని దాటి అప్పుడే ముందరి వరండాలోనికి వచ్చిన ముకుందరావును వాచ్‍మెన్ సమీపించి విష్ చేసి నాయుడుగారు పేరును వారికి చెప్పాడు.


ముకుందరావు వీధిగేటు ముందు నిలబడివున్న ఆ ఇరువురు వ్యక్తులను చూచాడు.


"లోనికి పంపు" అన్నాడు ముకుందరావు.


వాచ్‍మెన్ గేటు సమీపించి తెరిచి....

"అయ్యగారు మిమ్మల్ని లోనికి రమ్మన్నారు" వినయంగా చెప్పి గేటు తెరిచాడు.


నాయుడుగారు, జగన్నాథ్‍లు లోనికి ప్రవేశించి కొద్దిక్షణాల్లో వరండాను సమీపించారు.


వారిని పరిశీలనగా చూచిన ముకుందరావు "వెల్‍కమ్ మిస్టర్ నాయుడూ.... దారి తప్పివచ్చినట్టున్నారు" వ్యంగ్యంగా నవ్వుతూ అడిగారు.


"దారి తెలుసుకొని వచ్చాము ముకుందరావ్, గుడ్ మార్నింగ్" చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు. 


క్షణం తర్వాత "వీరు నా సోదరులు డాక్టర్ జగన్నాథ్. ఎస్.ఆర్.సి.ఎస్. ముఫ్ఫై సంవత్సరాలు అమెరికాలో ఉండి ఆరునెలలల్ క్రితమే స్వదేశానికి వచ్చారు."


"గుడ్ మార్నింగ్ మిస్టర్ ముకుందరావు గారు" కుడిచేతిని ముందుకు సాచాడు జగన్నాథ్.


ముకుందరావు చేతిని కలపలేదు.

"వచ్చిన పని ఏమిటి నాయుడూ?"


ముకుందరావు కనీస మర్యాదతో వారిని కూర్చోమని చెప్పకుండానే తనలోని అహంకారాన్ని వ్యక్తపరిచాడు.

జగన్నాథ్, నాయుడు ముఖంలోనికి చూచాడు. 

నాయుడుగారు నిట్టూర్చారు. ’వీడి అహంకారం అంబర వీధిలో విహరిస్తూ ఉంది’ అనుకొన్నాడు.


"మీతో ఓ విషయాన్ని గురించి మాట్లాడాలని వచ్చాము"


"ఏమిటో ఆ విషయం."


"మీ అమ్మాయికి, మా అబ్బాయి దీపక్‍కు సంబంధించిన విషయం"


"అంటే?" రోషంతో అన్నాడు ముకుందరావు.


"వారిరువురూ ప్రేమించుకున్నారు."


"అని మా అమ్మాయి మీతో చెప్పిందా."


"మా అబ్బాయి చెప్పాడు."


"విషయాన్ని స్థిమితంగా కూర్చొని మాట్లాడుకుందాం మిస్టర్ ముకుందరావ్" చిరునవ్వుతో చెప్పాడు జగన్నాథ్.


"ఎవరిని కూర్చోబెట్టాలో, ఎవరిని నిలబెట్టాలో ఆ విషయం నాకు బాగా తెలుసు. మీరు నాకు అపరిచితులు. మీరు మౌనంగా ఉంటే మీకు మర్యాద" అని నాయుడు గారి వైపు తిరిగి "ఆ.... మీ అబ్బాయి మీతో... వాడు.... నా కూతురు.... వాణ్ణి.... ప్రేమించిందని చెప్పాడా!" వికటంగా నవ్వి  "ఆనాడు నేను మీ ఇంటికి వచ్చి అడిగిననాడు మీరు మాకు ఇచ్చిన మర్యాద, గౌరవం నేను మరువలేదు.... మరువలేను.... ఆఫ్ట్రాల్ నీవు బడిపంతులవు. నీ కొడుకు ఒక జూనియర్ ఇంజనీరు. నేను కోటీశ్వరుణ్ణి. నా అర్ధాంగి మాటలు విని నేను నీ ఇంటికి వచ్చి తప్పు చేశాను. అది ముమ్మాటికీ తప్పు అని నీవు నాపట్ల వ్యవహరించిన తీరును బట్టి నాకు అర్థం అయ్యింది. నక్కకు నాగలోకానికి మధ్యన ఎంత దూరమో... నీకు నాకూ మధ్యన అంతేదూరం. పిచ్చిపిచ్చిగా వాగకుండా వెళ్ళిపొండి. మా అమ్మాయి విషయంలో మీవాడు తప్పుచేస్తే నేను వాణ్ణి చంపేస్తాను గెటవుట్!" అహంకారంతో, ఆవేశంతో అన్నాడు ముకుందరావు.


నాయుడుగారు, జగన్నాథ్‍లు నిర్ఘాంతపోయారు.

కొన్నిక్షణాల తర్వాత "నాయుడూ! పదరా... పోదాం" నాయుడు చేతిని తన చేతిలోనికి తీసుకొని చెప్పాడు జగన్నాథ్.


ఇరువురూ వరండా మెట్లు దిగి వీధిగేటు వైపునకు మౌనంగా నడిచారు.


"పిచ్చికుక్కలు" వారిని గురించి అలా అనుకొంటూ ఇంట్లోకి ప్రవేశించాడు ముకుందరావు.


ద్వారం పక్కన నిలబడి వారి సంభాషణను విన్న వసంతను చూచాడు ముకుందరావు.


"వసూ! పైవారం మనం అమెరికా వెళుతున్నాము. మన అమ్మాయి వివాహం. అక్కడే నా మిత్రుడు రామారావు కొడుకు త్రివిక్రమ్‍తోనే జరుగుతుంది. ఈ... నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు" వేగంగా వసంత జవాబుకు ఎదురుచూడకుండా తన గదికి వెళ్ళిపోయాడు ముకుందరావు.

మిత్రులు ఇరువురూ జగన్నాథ్ ఇంటికి చేరారు. ఎంతో ఆత్రంగా వారికి ఎదురైన పార్వతికి విషయాన్ని వివరించాడు జగన్నాథ్.

అంతా విన్న పార్వతి....

"పరమ అహంకారిలా ఉన్నాడు ఆ ముకుందరావు" అంది జగుప్సతో. 


"అవును. పారూ! సాటి మనిషికి ఇవ్వవలసిన కనీసపు మర్యాద విషయం కూడా తెలియని అహంకారి!" నిరసనగా అన్నాడు జగన్నాథ్.


ముగ్గురూ కూర్చున్నారు.

మౌనంగా ఆలోచనాసాగరంలో మునిగివున్న నాయుడుగారి ముఖంలోకి చూచింది పార్వతి.

"నాయుడూ"


"చెప్పండి వదినా"


"బాధపడుతున్నావా!"


"ఏమిటీ పారూ ఏమిటా ప్రశ్న? కొడుకు ఆనందం కోసం, నాయుడుగారు తన నిర్ణయాన్ని మార్చుకొన్నారు. ప్రేమ మైకంలో వున్నవాడు తన నిర్ణయాన్ని మార్చుకోలేక పోయాడు. కాని వీడు... తన కొడుకు ఆనందం కోసం చేయాల్సిన ప్రయత్నం చేశాడు. ఫలించలేదు. ఇప్పుడు దీపక్ ఆనందం కోసం తానేమి చేయాలనేదే వాడి ఆలోచన... అదే తనయులకు అర్థం కాని తండ్రి ప్రేమ."


నాయుడుగారి సెల్ మ్రోగింది.

చెవి దగ్గరికి చేర్చి "హలో" అన్నారు.


"నాన్నా!" వాణి పిలుపు.


"ఆ... చెప్పమ్మా"


"మీరు అడిగినట్టుగానే చేశాను. పత్రాలు సిద్ధంగా వున్నాయి. మీరు ఎప్పుడు వస్తారు?" అడిగింది వాణి.


"క్షణం ఆగమ్మా" జగన్నాథ్ వైపు తిరిగి....

"అన్నా! వాణి పత్రాలు రెడీ చేసిందట"


"సరే! మనం నాలుగు గంటలకు వారి ఇంటికి వస్తామని చెప్పు" అన్నారు జగన్నాథ్.


ఆ విషయాన్ని నాయుడుగారు వాణికి చెప్పారు.

"సరే నాన్నా" అని చెప్పి వాణి సెల్ కట్ చేసింది. 


"సరే పదండి భోజనం చేద్దాం" అంది పార్వతి.


"నాయుడూ! పిచ్చిగా అతిగా ఆలోచించకు. కాలం చాలా పవర్‍ఫుల్. అన్ని సమస్యలను అదే పరిష్కరిస్తుంది. లే... పద" అన్నాడు జగన్నాథ్.


ముగ్గురూ లేచి డైనింగ్ హాల్ వైపునకు నడిచారు. భోజనానంతరం రెండు గంటలు విశ్రాంతి తీసుకుని నాలుగు గంటలకు వాణి ఇంటికి చేరారు నాయుడుగారు, జగన్నాథ్‍లు.


వారి రాక కోసమే ఎదురు చూస్తున్న వాణి వారికి చిరునవ్వుతో ఎదురై ఆహ్వానించింది. ముగ్గురూ హాల్లో ప్రవేశించారు.


వాణి అత్తగారు దుర్గాదేవి సోఫాలో కూర్చొని టీవీ సీరియల్ చూస్తుంది. 


"అక్కయ్య నమస్కారం!" వినయంతో చేతులు జోడించారు నాయుడుగారు.


"బాగున్నారా!" అడిగారు.


"ఆ... ఏం బాగో ఏదో ఇలా వున్నా" విరక్తిని ప్రదర్శిస్తూ జవాబు చెప్పింది దుర్గమ్మ.


"పెదనాన్న.... నాన్న రండి కూర్చోండీ" అంది వాణి.


వారితో ఆమాట చెప్పాలనే ఇంగిత జ్ఞానం లేని మొహమండీ ఈ ఇల్లాలు దుర్గమ్మ.

నాయుడుగారు, జగన్నాథ్ సోఫాలో కూర్చున్నారు.

పై అంతస్థు నుంచి వాణి భర్త నవీన్ క్రిందకు వచ్చాడు. మామగారికి నమస్కరించాడు. జగన్నాథ్ వైపు చూచాడు.


"వీరి పేరు జగన్నాథ్. డాక్టర్. నా ప్రాణమిత్రుడు. మేము పుట్టి పెరిగింది ఒకే ఊళ్ళో" చెప్పారు నాయుడు గారు.


"నమస్కారం సార్" యాంత్రికంగా అన్నాడు నవీన్.


’ఆయనగారు వీరితో ఎందుకు వేంచేసినట్టు?’ అనుకున్నాడు మనస్సున.


"పెదనాన్న కాఫీ ఇవ్వనా" ప్రితిగా అడిగింది వాణి.


"వద్దమ్మా. ఇప్పుడే కాఫీ త్రాగే బయలుదేరాం."


వాణి ప్రక్కగదిలోనికి వెళ్ళి ఆస్తి ట్రాన్స్ ఫర్ పత్రాలు వున్న కవరును చేతికి తీసుకొని నాయుడుగారిని సమీపించి...

"నాన్నా! పెదనాన్నగారు చెప్పిన రీతిగా వ్రాసి... సంతకాలు చేసిన పత్రాలు" అంటూ నాయుడుగారికి అందించింది.


చేతికి తీసుకొని నాయుడు దాన్ని జగన్నాథ్‍కు అందించాడు.

కవర్‍ అందుకొని అందులోని పత్రాలను బయటికి తీసి పరీక్షగా చూచి, జగన్నాథ్ వాటిని మరల కవరులో వుంచాడు.

జేబులోనుంచి యాభైలక్షలు చెక్కును తీసి వాణికి అందించాడు.

అప్పుడు అర్థమయింది నవీన్‍కు జగన్నాథ్ ఎంత గొప్పవాడనే విషయం.


వాణి ఆ చెక్కును నవీన్‍కి అందించింది. అందులోని అంకెను, సున్నాలను చూచిన అతని కళ్ళకు బైర్లు కమ్మాయి. ముఖంలో ఆశ్చర్యం, ఆనందం, మాటలు కరువయ్యాయి.

"పెదనాన్నా! మీకు చాలా థాంక్స్" అంది పరమానందంతో వాణి.


"అమ్మా వాణీ! ఇది అభినందించవలసిన విషయం కాదు. ఇది వ్యాపారం. నీవు నాకు నీ ఆస్థిని యిచ్చావు. నేను నీకు డబ్బు ఇచ్చాను. ఇందులో సహాయం, అతిశయోక్తి ఏమీ లేదు" చిరునవ్వుతో చెప్పాడు జగన్నాథ్.


"అమ్మా సంతోషమా" అడిగారు నాయుడుగారు.


"చాలా... చాలా.. సంతోషం నాన్నా!" ఆనందంగా చెప్పింది వాణి.


"అమ్మా వాణీ! ఇక మేము బయలుదేరుతాం" సోఫాలోంచి లేచాడు జగన్నాథ్. నాయుడుగారు లేచారు.


"అక్కయ్యా వెళ్ళి వస్తాం" దుర్గమ్మను సమీపించి చెప్పారు నాయుడుగారు.


"ఆ....ఆ...ఆ... మంచిది" ముక్తసరిగా చెప్పింది దుర్గ.


"అల్లుడుగారూ! వెళ్ళొస్తాను" నవీన్‍ను సమీపించి చెప్పారు నాయుడుగారు. 


"మంచిది మామయ్యా!" యాంత్రికంగా చెప్పాడు నవీన్ అతని ఆలోచనా స్రవంతి నుండి.


నాయుడుగారు, జగన్నాథ్ హాల్లో నుంచి వరండాలోనికి వచ్చారు. వారి వెనకాలే నవీన్, వాణిలు.

"నవీన్!" పిలిచింది దుర్గ.


నవీన్ వెనుతిరిగి చూచాడు.

"ఇలారా!" హెచ్చు స్థాయిలో అంది దుర్గ.


నవీన్ వెనుతిరిగి హాల్లో వెళ్ళాడు.

దుర్గ పిలుపుతో నవీన్ చర్య నాయుడు, జగన్నాథ్, వాణి ఆశ్చర్యపోయారు.


"దుర్గమ్మకు తన కొడుకు మా వెనుకాల రావడం ఇష్టం లేదు."


ముగ్గురూ ఆ మాటలనే అనుకొన్నారు మనస్సులో.

నాయుడుగారు వెనుతిరిగి చూచారు.... వాణీని చూచి 

"తల్లీ! జాగ్రత్త వెళ్ళొస్తాను" ప్రీతిగా చెప్పాడు నాయుడు.


"వాణీ! నీవు అప్పుడప్పుడు మన ఇంటికి రావాలి. నీకు ఏది అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి సరేనా!" 

అభిమానపూర్వకంగా చెప్పాడు జగన్నాథ్.


"అలాగే పెదనాన్నా!" నవ్వుతూ చెప్పింది వాణి.


ఇరువురు మిత్రులు వీధి గేటును దాటి కాంపౌండ్ వాల్ ప్రక్కన వున్న కార్లో కూర్చున్నారు.

వాణి వారికి వీడ్కోలు చెప్పింది.

కారు కదిలి వెళ్ళిపోయింది.


నవీన్ వేగంగా వీధిగేటు వద్దకు వచ్చాడు.

"మామయ్యవాళ్ళు..."


"వెళ్ళిపోయారు" నవీన్ పూర్తిచేయకముందే చెప్పింది.


నవీన్ వాణి ముఖంలోనికి చూచాడు. వాణి తలపక్కకు తిప్పుకొని ఇంటివైపుకు నడిచింది.

కారును డ్రైవర్ మస్తాన్ నడుపుతున్నాడు. వెనుక సీట్లో నాయుడుగారు, జగన్నాథ్‍లు కూర్చుని వున్నారు.


"అన్నా! నీ దయ వలన ఒక జటిల సమస్య పరిష్కారం అయ్యింది. నీకు నా హృదయపూర్వక ధన్యవాదములు" కృతజ్ఞతాభావంతో చెప్పాడు నాయుడుగారు.


"నాయుడూ! నీవు నాకు అతి ముఖ్య హితుడవు. నా సోదరుడవు. సాయం చేయగలిగిన వసతిని ఆ దేవుడు నాకిచ్చాడు. చేశాను. చేసిన దానికి నాకు ప్రతిఫలం ముట్టిందిగా! ఆ నీ భూమిపై నేను... అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు ’ఆనంద నిలయం’ అనే పేర ఒక ఆశ్రమాన్ని, హాస్పిటల్‍ని నిర్మిస్తాను. శేష జీవితం సాటి మానవులకు మనం చేయగలిగిన మంచిని చేయాలనేది నా సంకల్పం. పుట్టి... పెరిగి... పెద్దవారమైన భూమి ఇది. ఇక్కడ అందరూ మనవారే కదా" చిరునవ్వుతో చెప్పాడు జగన్నాథ్.


"జగ్గన్నా! నీ నిర్ణయం చాలా మంచిది. తప్పక జరుగుతుంది" ఆనందంగా నవ్వుతూ చెప్పారు నాయుడు.


"దాని అజమాయిషీ, బాధ్యత అంతా నీదే నాయుడు"


"చాలా సంతోషం అన్నా"


"ఆ... ఇక దీపక్ విషయం గురించి ఏం నిర్ణయానికి వచ్చావు?"


"వాడు ఒక తండ్రిగా నా మాటను, నీ మాటను గౌరవించకపోయినా, వాడి శ్రేయస్సు కోరే తండ్రిగా నేను వాడి కోర్కె తీర్చాలనుకుంటున్నాను అన్నా"


"ముకుందరావు కాదన్నాడుగా! ఆ పిల్లతో మనవాడి పెళ్ళి ఎలా జరిపిస్తావురా!!" ఆశ్చర్యంతో అడిగాడు జగన్నాథ్.


"నీవు వాడికి ఫోను చేసి మన ఇంటికి రమ్మని చెప్పన్నా"

సెల్‍లో దీపక్ నెంబర్ నొక్కి సెల్‍ను జగన్నాథ్‍కు అందించాడు నాయుడుగారు.


"హలో" దీపక్ స్వరం.

"దీపక్! నేను మీ పెదనాన్నను. నువ్వు వెంటనే మన ఇంటికి రా బాబూ! నాన్నా ఈ రాత్రికి వూరు వెళ్ళిపోతారంట. నీతో మేము మాట్లాడాలి" చెప్పాడు జగన్నాథ్.


’నాన్న ఫోన్ చేయకుండా జగన్నాథ్ పెదనాన్నతో ఫోన్ చేయడంలో వారి అభిప్రాయం ఏమిటో!’ అనుకొన్నాడు దీపక్.


"సరే పెదనాన్న ఒక గంటలో వస్తాను" అన్నాడు దీపక్.


"గంటలోనా"


"అవును"


జగన్నాథ్ సెల్ కట్ చేశాడు.

"విన్నావుగా గంటలోపల వస్తాడట."


కారును మస్తాన్ పోర్టికోలో ఆపాడు.

నాయుడుగారు జగన్నాథ్ దిగారు. లోనికి నడిచారు. అతృతతో ఎదురైన పార్వతికి జగన్నాథ్ విషయాన్ని వివరించారు. ఆమె ముకుందరావు అహంకారానికి ఆశ్చర్యపోయింది.

దీపక్ వచ్చేసరికి సాయంత్రం ఏడుగంటలు. జగన్నాథ్, పార్వతి, నాయుడు హాల్లో కూర్చుని ఉన్నారు. భయంతో దీపక్ మెల్లగా హాల్లోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే "రా బాబూ రా... కూర్చో" అన్నాడు జగన్నాథ్.

దీపక్ తండ్రి ముఖంలోకి క్షణం సేపు చూచి తలదించుకొని జగన్నాథ్ ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు.

"చిన్నా" అని పిలిచాడు నాయుడు.


దీపక్ తలెత్తి తండ్రి ముఖంలోనికి చూచాడు.

"నీవు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయిని నీతో తీసుకొని నీవు మన ఊరికి రావాలి. మీ ఇరువురి వివాహం నేను, అమ్మా, పెదనాన్నా, పెద్దమ్మ కలిసి మన వూర్లో జరిపిస్తాము. నీకు సంతోషమేగా దీపక్" ప్రశ్నార్థకంగా అతని ముఖంలోనికి చూచాడు నాయుడుగారు. 


అంతవరకూ అతని ముఖంలో వున్న కారుచీకటి స్థానంలో పున్నమి వెన్నెల విరిసింది. 


వెంటనే లేచి నాయుడుగారి ముందు మోకాళ్ళపై కూర్చొని వారి చేతులను తన చేతుల్లోనికి తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ "థాంక్యూ నాన్నా థాంక్యూ" అంటూ ఆనంద పరవశంతో చెప్పాడు దీపక్.


పుత్రవాత్సల్యంతో ఆనందంగా నవ్వుతూ... తన కుడిచేయి దీపక్ తలపై వుంచి....

"ఇష్టకామ్యాది సిద్ధిరస్తు!" అంటూ దీవించాడు నాయుడుగారు.

దీపక్ లేచి జగన్నాథ్ చేతులు పట్టుకొని...

"పెదనాన్నా! మీరు చేసిన మేలు నా జీవితాంతం మరిచిపోలేను" పరవశంతో చెప్పాడు.


"ఒరేయ్ చిన్నా! ఇందులో నేను చేసింది ఏమీ లేదు. అంతా మీ నాన్నే. పంతానికి వస్తే చిన్నప్పటి నుంచి వాడు దేన్నీ ఎవరినీ లెక్కచేయడు. మేము వెళ్ళి తన కూతుర్ని నీకు ఇచ్చి పెండ్లి చేయమని అడిగితే ముకుందరావు మమ్మల్ని అవమానించాడు. గెటవుట్ అన్నాడు. అహంకారి. దాని ప్రభావమే నా సోదరుడు తీసుకున్న ఈ నిర్ణయం" నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్.


"పెద్దమ్మా! నన్ను ఆశీర్వదించు" పార్వతి పాదాలు తాకాడు దీపక్.


మెట్లపైనుంచి కిందికి వస్తున్న దీపిక తుమ్మింది.

అందరి చూపులు ఆమెవైపు తిరిగాయి. నవ్వుతూ దీపిక వారిని సమీపించింది.


"నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు తండ్రి" అంది పార్వతి. 


"అన్నయ్యా! హౌ ఆర్ యు?" అడిగింది దీపిక.


"దీపూ! ఐయాం వెరీ హ్యాపీ" నవ్వుతూ చెప్పాడు దీపక్.


తర్వాత వారి మధ్యన దీపక్, యామినీల వివాహం ఎలా జరిపించాలనే చర్చ జరిగింది. భోజనాలు ముగిశాయి. నాయుడుగారు నెల్లూరు బస్సులో బయలుదేరారు. తండ్రిని బస్సు ఎక్కించి దీపక్ తన గదికి వెళ్ళిపోయాడు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

26 views0 comments
bottom of page