top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 7



'Life Is Love - Episode 7'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 18/02/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ: 


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని.


యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.


చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ ని కలుస్తారు నాయుడుగారు.


కొడుకు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు వరదరాజులు నాయుడు గారు.

ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు.

ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 7 చదవండి.


నాయుడుగారి చిన్నకూతురు అమృత ఎం.బి.బి.ఎస్, ఫైనల్ ఇయర్. తన సహా స్టూడెంట్ మహీధర్‍  మూడేళ్ళ క్రిందట ఆమెపై విసిరిన వలలో పడిపోయింది. జీవనయాత్ర సాగించటానికి రెండుమార్గాలు. ఒకటి పద్ధతిగా తరతరాల సాంప్రదాయాలను పాటిస్తూ బ్రతకడం, రెండవది ఎలాగైనా బ్రతకడం. రెండవవారికి బ్రతకడమే ముఖ్యం. తీరుతెన్ను ఏదైనా ఫర్వాలేదు. ఇది నేటి ఓ వర్గపు తీరు. మనది సువిశాలమైన సనాతన ధర్మ బద్ధమైన భారతదేశం. ఎంతో గొప్ప చరిత్రగల హైందవభూమి. 


అందరూ అద్వైత వాదులే. నమ్మకం... దైవం... విషయంలో ద్వైతం లేదు. రాముడు అన్నా.... కృష్ణుడు అన్నా... అల్లా అన్నా... ఏసు అన్నా అన్ని నామాల మూలం ఒక్కటే. ఆ మూలమే సర్వేశ్వరుడు. సృష్టికర్త, సృష్టి, స్థితి, లయకారుడు. వారికి శతకోటి నామాలు. ఏ పేరుతోనైనా పిలవవచ్చు. ఏ పేరుతోనైనా ఆరాధించవచ్చు. అంతా చెందేది ఆ పరమాత్మకే!! ఆశ్రిత రక్షణ స్వభావం మన హైందవ అద్వైతకు ఆయువుపట్టు..... దానికి సాటిలేదు. నభూతో... న భవిష్యతి!!


అమృత, మహీధర్‍ను ఎంతగానో ప్రేమించింది. ఆ ప్రేమ మైకంలో తన తల్లిదండ్రులు, వారికి తనపట్ల వున్న ఆశలు, ప్రేమాభిమానాలను మరచిపోయింది. ప్రతి తల్లిదండ్రులు తమ సంతతి తమకన్నా వున్నతంగా కీర్తి ప్రతిష్టలతో జీవనయాత్ర సాగించాలని కోరుకుంటారు. అది ఆ అనుబంధంలో వున్న మమత.... మహిమ... ఆ సర్వేశ్వర ప్రసాదం. 


కానీ సంతతి యుక్త వయస్కులు కాగానే తన ఈనాటి ఉన్నతికి కారకులు తన తల్లిదండ్రులే అన్న విషయాన్ని మరచి స్వనిర్ణయాలతో జన్మనిచ్చి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు తమ పట్ల ఆ వయస్సులో ఎలాంటి భావాలు, ఆశయాలు కలిగి వుంటారన్న విషయాన్ని మరచిపోతున్నారు.


 తమకు నచ్చిన తల్లిదండ్రుల సలహా లేకుండా జీవిత విధానాలను ఎన్నుకొంటున్నారు. అమృత చేసిందీ అదే. తన నిర్ణయం తప్పా, ఒప్పా అని ఆమె ఏనాడూ ఆలోచించలేదు. ఆ వయస్సుతో మనోవేగం ఉడుకురక్తం ప్రేమా అనే మైకం... విచక్షణా రహితంగా వుంటాయి.

మహీధర్, అమృతలు సెలవలు కారణంగా హంపీకి వెళ్ళారు.

నాయుడుగారి ప్రియ శిష్యుడు చిత్రకారుడు శివ వారిని హంపీలో చూచాడు. వారిరువురు చట్టాపట్టాలేసుకొని నడవటంతో శివకు అనుమానం కలిగింది. అమృత దగ్గరకు వెళ్ళి పలకరించడం అసభ్యతగా భావించాడు. శివ అక్కడ రెండు రోజులున్నాడు. ఆ రెండు రోజులూ అమృత, మహీధర్‍లను చూచాడు శివ. వారి వాలకం పెండ్లి అయ్యి హనీమూన్‍కి వచ్చిన జంటలా తోచింది శివకు.


ఊరికి తిరిగి వచ్చాడు శివ. అతని మనస్సులో కలవరం. తాను హంపీలో చూసిన అమృతను గురించి గురువుగారికి చెప్పాలా వద్దా అనే తర్కం. చివరికి విషయాన్ని తన తండ్రి నరసపనాయుడు ద్వారా తన గురువుగారు వరదరాజులు నాయుడిగారికి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు.

తను హంపీలో చూచిన అమృతను ఆమె ప్రక్కనే వున్న వ్యక్తి వారి ధోరణిని గురించి తండ్రికి చెప్పాడు.

అంతా విన్న నరసపనాయుడు.....

"శివా! ఈ విషయాన్ని నాయుడికి తెలియజేయాలిరా! అది మన ధర్మం!!" అన్నాడు. 


"అయితే నాన్నా.... మీరే వెళ్ళి చెప్పండి" అన్నాడు శివ.

నాయుడుగారు హైదరాబాదు నుంచి తిరిగి వచ్చి అక్కడ జరిగిన అన్ని విషయాలను పూస గ్రుచ్చినట్టు సతీమణి అనురాధకు వివరించాడు.


ఆశ్చర్యం, ఆనందం, అనుమానాలతో ఆమె బుర్రవేడెక్కింది.

"ఏమండీ!"

"దీపక్ ఆ పిల్లను తీసుకు వస్తాడంటారా?" సందేహంతో మెల్లగా అడిగింది.


"తప్పక వస్తాడు అనూ!"


వరండాలో కూర్చొని వున్న నాయుడుగారు, నరసపనాయుడుగారు లోనికి రావడం చూచారు.


నరసపనాయుడు, నాయుడు కన్నా రెండు సంవత్సరాల పెద్ద. వ్యవసాయదారుడు. నీతి నిజాయితీపరుడు. ఆ గ్రామ సర్పంచి.


"ఏం బావా! అంతా కులాసమేనా!?"


"ఆ... అంతా క్షేమమే!" నవ్వుతూ చెప్పాడు నరసపనాయుడు.


"రా... బావా... కూర్చో"


"అన్నయ్యగారూ... బావున్నారా..... మా వదిన... శివ ఎలా వున్నారు?" అప్యాయంగా అడిగింది అనురాధ.


"ఆ పరమేశ్వరుని దయ వలన అంతా క్షేమమే అమ్మా!"


చిరునవ్వుతో అనురాధ లోనికి వెళ్ళింది.

నరసపనాయుడు, నాయుడి గారి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు.


"వరదా! నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను..."


"ఏమిటి బావా! అది"


"అదీ....." సంశయించాడు నరసపనాయుడు.


"ఎందుకు సందేహం.... ఆ విషయం ఏమిటో చెప్పు!" 

అడిగాడు నాయుడుగారు.


"మన శివ హంపీ వెళ్ళి వచ్చాడు."


"ఓ..... వాడు ఆర్కెటెక్ట్ కదా శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించిన విజయనగర సామ్రాజ్య చిత్తరువులు హర్మ్యాలను కోటను చూచి వచ్చాడన్నమాట. బావా! ఒకనాటికి మనమందరం గర్వపడేలా గొప్ప ఆర్కెటెక్ట్ అవుతాడయ్యా" ప్రీతిగా చెప్పాడు నాయుడుగారు.


నాయుడుగారు చెప్పిన మాటల్లో శివపైన వారికి ఎంతటి అభిమానం వుందో నరసపనాయుడికి అర్థం అయ్యింది. తాను చెప్పబోయే విషయాన్ని విని ఎంతగా బాధపడతాడో అనే సంశయం ఎలా చెప్పాలా అసలు చెప్పాలా వద్దా అనే మీమాంసలో పడ్డాడు నరసపనాయుడు.


"హంపీ... త్రేతాయుగపు, శ్రీ సీతారాముల రామాయణ కధాకాలం నాటిది. ఆనాడు ఆ ప్రాంతానికి పేరు కిష్కంధ. హంపీ క్షేత్రం 13వ శతాబ్ది నుండి 15-16 శతాబ్దం వరకు విజయనగర సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందింది.

ఆ త్రేతాయుగంలో ఆ హంపీ క్షేత్ర ప్రాంతాన్నే వాలి సుగ్రీవుల రాజ్యము, శ్రీ హనుమాన్ జన్మస్థలము దాన్నే అంజనాద్రి పర్వతములు వున్న భారత భాగం అంటారు. వాలి మహారాజుగా పరిపాలించిన ప్రాంతం ఇదే కిష్కంధ.

ఒక సమయంలో దుంధుభి అనే రాక్షసుడు కిష్కంధపై యుద్ధానికి వచ్చాడు. మహా బలశాలి అయిన వాలి, ఆ రాక్షసునితో యుద్ధం చేస్తూ పక్కనే వున్న గుహలోనికి వెళ్ళవలసి వచ్చింది. తమ్ముడు సుగ్రీవున్ని గుహ బయట కాపలా వుండమని చెప్పి, వాలి గుహలోనికి దుంధుభితో యుద్దానికి వెళ్తాడు. ఆరునెలల పాటు యుద్ధం చేసి తుదకు ఆ రాక్షసుని అంతం చేశాడు.


గుహ లోపలి నుండి రాక్షసుని రక్తం కాలువగా ప్రవహించడం చూసిన సుగ్రీవుడు తన అన్న వాలియే సంహరింపబడినాడని భ్రమించి... వెంటనే గుహ ద్వారాన్ని పెద్దరాతి బండతో మూసివేసి.... రాజ్యానికి తిరిగి వెళ్ళాడు.


 గుహలో ఉన్న వాలి మహారాజు... రాక్షస వధ తర్వాత గుహ ద్వారం సమీపించి అడ్డముగా వున్న రాతి బండను తొలగించి... కిష్కింధకు వచ్చి.... తమ్ముడు సుగ్రీవునిపై ఆగ్రహావేశాలతో... అతన్ని కొట్టి రాజ్య బహిష్కారం చేశాడు. సుగ్రీవుడు అడవుల పాలయ్యాడు. 


వనవాస కాలంలో రావణుడు సీతామాతను అపహరించి లంకకు తీసుకొని వెళ్ళగా రామలక్ష్మణులు సీతామాత అన్వేషణలో కిష్కంధ అడవులకు చేరారు. వారికి శ్రీ హనుమ మూలంగా సుగ్రీవుడు పరిచయం అయ్యాడు. అతని విషాధకరమైన కధను విన్న శ్రీరాముడు వాలిని హతమార్చి కిష్కింధ సింహాసనంపై రాజుగా అధిష్టింప చేశాడు. 


శ్రీరామ సతి... సీతామాత జాడ తెలుసుకొనుటకు వానర యోధులను అష్టదిశలకు పంపారు. శ్రీరామభక్తుడు... శ్రీ వీర హనుమాన్ తూర్పు దిశగా సాగరం దాటి లంకకు చేరి.... అశోకవనమున సీతారాములను చూచి... శ్రీరాముడు ఇచ్చిన ఆనవాలును మాత కందించి... ఆ తల్లి ఇచ్చిన ఆనవాలును తీసుకొని త్వరలో శ్రీరామచంద్రమూర్తి లంకకు వచ్చి రావణుని వధించి మీకు, చెర విముక్తి కలిగించగలరు, 

ధైర్యంగా వుండవలసిందని సీతామాతకు చెప్పి లంకను కాల్చి కిష్కింధకు చేరి మాత ఆనవాలును శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చిన పరమ పవిత్ర స్థలం హంపి. 


క్రీ.శ 1296లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ యాదగిరి రాజ్యంలో ప్రవేశించిన కొద్ది కాలంలో... దక్షిణ భాగమంతా 

 అక్రమంగా ఆక్రమించుట మొదలు పెట్టారు. ఎక్కడ చూచినా హత్యలు, అరాచకాలతో ఆ ప్రాంతం విలవిల్లాడిపోయింది. భారతదేశంలో హిందూ ధర్మం నశించిపోయే కాలం ఆసన్నమైంది. మన ప్రాచీన సంస్కృతి మట్టిపాలు కాబోయిన కాలమిది. 


 ఆ సమయంలో దేశ వ్యవస్థ, సంస్కృతి పట్ల గౌరవాభిమానాలు ఉన్న కన్నడ రాష్ట్ర ప్రజలంతా ఒకటై.... బలమైన సైన్యంగా మారి... శత్రువులను తరిమి కొట్టి దురక్రమణలో వారు ఆక్రమించుకొన్న రాజ్య భాగాన్ని తాము వశపరచుకొన్నారు. వీరి ధైర్య సాహసాలకు సంతసించి, పరవశించి భారతదేశంలోని ఇతర ప్రాంతంవారు కూడా వీరితో చేయి కలిపి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. వారి నాయకుడు యాదవకుల ఉద్ధారకుడు, సంగముడు. 


శాలివాహన శకం 1258 ధాతునామ సంవత్సర వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం అనగా క్రీస్తు శకం 1836 ఏప్రిల్ 1వ తేదీన హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వారు సంగమ వంశానికి చెందినవారు.


వారి తర్వాత సాళువ వంశీయులు. వారి తదనాంతరం తుళువ వంశజుడు. శ్రీకృష్ణదేవరాయలు 1809 నుండి 1825 వరకు విజయనగర సామ్రాజ్యాధిపతిగా దక్షిణ భారతాన్ని పాలించారు. వారి పాలనలో ఆకాలం చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోయింది. కవి, గాయకుల మీదా శిల్ప కళాకారుల మీద వారికి ఎంతో గౌరవం, అభిమానం, వారి శిల్పకళా తృష్ణకు అసాధారణ ప్రత్యక్ష సాక్ష్యం హంపి. అది వారి రాజధాని. 


ఎందరో వ్యక్తులు జన్మిస్తుంటారు. కాలగతిలో కలిసిపోతుంటారు. కాలచక్ర భ్రమణం ఎవరికోసం ఆగదు. కొందరు మహనీయుల కథ. చెరగని మాయని చరిత్రగా మిగిలిపోతుంది. ఆ కోవలో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగామి. చరిత్ర నాయకులు. బహుముఖ ప్రజ్ఞావంతులు. చెరగని చరిత్రకు వారసులు. యుగాంతం వరకు వారి కీర్తి అజరామరం..."


నాయుడుగారు నరసపనాయుడి ముఖంలోకి పరీక్షగా చూచాడు.

"బావా! ఏమిటి మీ ఆలోచన?"


నరసనాయుడు "బావా!"


"చెప్పు బావా ఏమిటా సమస్య"


"పెద్ద సమస్యే!"


"ఏమిటది?"


’చల్లకొచ్చి ముంత దాచకూడదు కదా. విషయం నాయుడికి చెప్పాలి’ అని నిర్ణయించుకొన్నాడు నరసపనాయుడు.


"బావా! మన అమృతను శివ హంపీలో చూచాడుట."


"హంపీలోనా!" ఆశ్చర్యంతో అడిగారు నాయుడుగారు.

 

"అవును. ఆమెతో ఎవరో అబ్బాయి కూడా వున్నాడట" మెల్లగా చెప్పాడు నరసపనాయుడు. 


"అబ్బాయా??"


ఔనన్నట్టు తలాడించాడు నరసపనాయుడు.

నాయుడు కళ్ళు మూసుకొని ఆలోచన....

"వారిరువురూ చాలా సన్నిహితంగా వున్నారుట..."


నాయుడుగారు తొట్రుపాటుతో....

"ఓ.... అలాగా!"


"అవును బావా! ఈ విషయం చెప్పాలనే వచ్చాను. ఇకనే వెళతాను."


నరసపనాయుడు లేచి వెళ్ళిపోయాడు.

’బావ చెప్పిన మాటల ప్రకారం అమృత ఆ యువకుడిని ప్రేమించిందేమో...’ విచారంగా అనుకున్నారు నాయుడుగారు.


అనురాధను పిలిచి నరసపనాయుడు తనకు చెప్పిన విషయాన్ని ఆమెకు చెప్పాడు.


యదార్థానికి నాయుడుగారికి అనూరాధకు, అమృతను శివకు ఇచ్చి వివాహం చేయాలనే సంకల్పం. ఇప్పుడు నరసపనాయుడు చెప్పిన వార్త వారికి ఎంతో ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగించింది.


"అనూ!.... నేను ఒకసారి సూరత్‍కల్ వెళ్ళి అమృతను కలిసి మాట్లాడి వస్తాను. బాధపడకు" సాలోచనగా చెప్పారు నాయుడుగారు.


గంట తరువాత నాయుడుగారు సూరత్‍కల్ బయలుదేరారు.

నాయుడుగారు ఉదయం ఆరుగంటలకు మంగుళూరు చేరారు. సూరత్‍కల్ లోని కాలేజి క్యాంపస్‍కి ఏడున్నరకు వెళ్ళారు. లేడీస్ హాస్టల్‍ను సమీపించి వార్డెనర్‍ను కలిసికొన్నారు.


"నేను అమృత నాన్నను. మా అమ్మాయిని పిలవండి."


"ఆమె ప్రస్తుతం హాస్టల్‍లో లేదు."


"ఎక్కడికి వెళ్ళిందండీ?"


"స్నేహితులతో కలిసి పిక్నిక్‍ని వెళ్ళింది."


"ఎప్పుడు వస్తుందో తెలుసా?"


"ఈ రోజు ఆదివారం. రేపు క్లాసెస్ ఉంటాయి. ఈ రోజు రావాలి!" అంది ఆమె. క్షణం తర్వాత "సార్! మీపేరు?" అడిగింది వార్డెన్.


"వరదరాజుల నాయుడు" యాంత్రికంగా చెప్పారు.


"అమృత రాగానే చెబుతానండీ" ఎంతో వినయంగా చెప్పిందామె.


’నేను ఇప్పుడు ఏం చేయ్యాలి’ అనుకొన్నారు నాయుడుగారు.


"మీది ఏ ఊరు సార్?"


"నెల్లూరు"


"ఎప్పుడు వచ్చారు?"


"ఇదే రావడం"


"ఓ.... అమృత ఎప్పుడు వస్తుందో... నేను చెప్పలేను. మీరు హోటల్లో రూమ్ తీసుకొని విశ్రాంతి తీసుకోండి. నాలుగు ఐదు గంటల ప్రాంతంలో రండి. అప్పటికి అమృత వస్తుందేమో! చూద్దాం" వినయంగా చెప్పింది వార్డెనర్.


"అమృతను గురించి మీ అభిప్రాయం ఏమిటండీ?" ఆమెను గురించి తనకు నరసపనాయుడు చెప్పిన విషయం ఈమెకేమైనా తెలిసి ఉంటుందా అనే భావనతో అడిగారు నాయుడుగారు.


"వెరీ వెరీ గుడ్ గర్ల్ జీనియస్" చిరునవ్వుతో చెప్పింది ఆమె.


"థాంక్స్ అండీ ఐదుగంటలకు వస్తాను" అని చెప్పి నాయుడుగారు క్యాంపస్ ఆవరణం వదలి రోడ్ దగ్గరకు వచ్చారు. లాడ్జిని గురించి విచారించి వెళ్ళి రూమ్ తీసుకొని మంచంపై వాలారు. వారి మనస్సు నిండా అమృతను గురించిన ఆలోచనలే. ఎంతో మంచిపిల్ల అనుకున్న అమృత ఇలాంటి పనిచేసిందంటే నమ్మలేకపోతున్నారు. 


మనస్సులో అనుమానం, అలజడి, తనూ అనురాధ పిల్లలను ఎంతో పద్ధతిగా పెంచారు. వారివారికి అభిరుచి వున్న చదువులను చదివించారు. సభ్య సమాజంలో బంధువుల మధ్యన ఎంతో ఉన్నతిగా తమ ఎదుటన, తమ చేరువలో ఎంతో గౌరవంగా బతకాలని ఆశించారు. 


కానీ... పెద్దకొడుకు భాస్కర్ అమెరికా వెళ్ళాలని పట్టుబట్టాడు. తల్లీతండ్రి మాటలు అతనికి నచ్చలేదు. అభిప్రాయ భేదం ఏర్పడింది. చివరకు నాయుడుగారు, అనురాధలు మనసు మార్చుకొని భాస్కర్‍ను అమెరికాకు పంపించారు.


రెండవ సంతతి వాణి. బి.ఎ, బి.ఎల్. చదివింది. తమ అంతస్థుకు తగిన సంబంధం చూచి పెండ్లి చేశారు. ఆమెకు ఏర్పడిన సమస్యను దైవ కృప వలన తారసపడ్డ స్నేహితుడు జగన్నాథ్ సాయంతో పరిష్కరించగలిగారు. మూడవవాడు దీపక్. ప్రేమ పేరుతో పెద్ద సమస్యను సృష్టించాడు. వాడి ప్రేమ ఫలిస్తుందో.... ఫలించదో... తెలియని అయోమయ స్థితి.... నాల్గవ సంతతి అమృత.... తనతోటే వున్నవాడు ఎవరో, ఎలాంటి సమస్యను సృష్టించిందో వూహకు అందని విషయం.


పిల్లల మనస్తత్వాలు ఆ రీతిగా మారేదానికి పెంపక లోపమా! వారి ఆశలను తీర్చి వారు ఆనందంగా గౌరవ ప్రతిష్టలతో బ్రతకాలని ఆశించడం, వారికి ఆర్థిక వసతులు కల్పించడం నేరమా!? విపరీత విజ్ఞానఫలం విచక్షణా రహితమా!! ఇరవై సంవత్సరాలు కలిసి బ్రతికిన వారు వున్నత విద్య కోసం తల్లిదండ్రులను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళి, కొత్త వాతావరణం, క్రొత్త వ్యక్తుల పరిచయాలతో నిన్నటివరకు మా అమ్మ, నాన్న అన్నవారు ఆ తల్లిదండ్రులకన్నా క్రొత్త స్నేహాలు గొప్పవని ఎలా భావిస్తారు? 


వైవాహిక వయస్సు రాగానే తమ పిల్లలకు ఎలాంటి వధువు, వరుడూ కావాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులు ఆలోచించి చేయబోరనే భావన యువతరం మనస్సులో ఎలా... ఏ కారణంగా ఏర్పడుతోంది? వివాహం అనేది నూరేళ్ళ పంట. రెండు కులగోత్రాలతో ఏర్పడే బంధుత్వం... ఆ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్యాయం చేస్తారా! వున్నవాడు కానీ... లేనివాడు కానీ... వారి వారి అంతస్థుకు తగిన రీతిలో బంధుత్వాలను, బాంధవ్యాలను కల్పించుకోవడం సహజమే కదా! పెద్దల ఈ భావాన్ని పిల్లలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? 


రెక్కలొచ్చి... పక్షులు గూటిని.... తల్లిదండ్రిని మరిచి యిష్టం వచ్చిన దిశకు ఎగిరిపోయినట్టు నేటి యువతలో కొంతమందిలా ప్రవర్తిస్తూ.... తాము తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకు ఎంతటి బాధను కలిగిస్తుందో అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు?


వయస్సులో వున్న వేడి... మనో ఆవేశం... పరస్పర ఆకర్షణ.... విచక్షణ అనేది హృదయంలో లేకపోవటం అలాంటి చర్యలకు మూలం....


మంచంపై వాలి పైరీతిగా పరిపరివిధాల ఆలోచిస్తూ అచేతనంగా వుండిపోయారు నాయుడుగారు. వారి మనోవేదనను ఆలకించిన నిద్రామతల్లి వారిని తన ఒడిలోనికి చేర్చుకొని జోకొట్టింది. నాయుడుగారు నిద్రపోయారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

30 views0 comments
bottom of page