'Life Is Love - Episode 9' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 29/02/2024
'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.
తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.
ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.
యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.
దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని.
యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.
చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ ని కలుస్తారు నాయుడుగారు. కొడుకు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు వరదరాజులు నాయుడు గారు.
ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు. నాయుడుగారి చిన్నకూతురు అమృత తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడుతుంది. ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది.
ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 9 చదవండి.
ఆ సాయంత్రం అనురాధ మాసశివరాత్రి అయిన కారణంగా శివాలయానికి వెళ్ళింది. శివ తల్లి కౌసల్య, అనురాధ ఆలయంలో కలుసుకొన్నారు. వరుసకు వారు వదినా మరదళ్ళు. కౌసల్య అమృత విషయంలో తాను విన్న విషయాన్ని గురించి అనురాధకు చెప్పింది. ఆమె ఆశ్చర్యపోయింది.
ఆ రాత్రి భోజనానంతరం నాయుడుగారు అనురాధ తమ పడక గదిలో ప్రవేశించారు. నాయుడుగారు మంచంపై వాలిపోయారు. అనురాధ వారి పాదాలవైపు కూర్చుని వారి ముఖంలోకి చూచింది. ఆమె ముఖంలో దిగులు... మనస్సులో వేదన.
"అనూ! ఏంటలా చూస్తున్నావ్?" ఆప్యాయంగా అడిగారు నాయుడుగారు.
"మన మధ్యన దాపరికాలేమన్నా వున్నాయాండీ" దీనంగా అడిగింది అనురాధ.
నాయుడుగారు లేచి కూర్చున్నారు.
"అనూ! ఏమిటీ నీ ప్రశ్న?"
"ప్రశ్నకు.... ప్రశ్న జవాబు కాదు కదండీ!"
నాయుడుగారు తప్పుచేసిన వానిలా తలదించుకొన్నారు.
అమృత విషయం అనూకు తెలిసినట్టుంది. నేను యదార్థాన్ని చెప్పని కారణంగా తాను నన్ను అలా ప్రశ్నించింది. చెప్పాలా... వద్దా!! సమస్యాత్మక ప్రశ్నలు... ఆలోచన... కళ్ళనుండి కన్నీరు, మనస్సున వేదన, తాను ఇంతవరకూ ఏ విషయాన్ని తన మనస్సున దాచుకోలేదు కానీ అమృత విషయం?!
అనురాధ నాయుడుగారి దగ్గరకు జరిగి తన రెండు చేతులతో వారి ముఖాన్ని పైకెత్తి....
"నాకు విషయం తెలిసిందండీ! అ విషయాన్ని నాతో చెప్పాలా.... వద్దా ఎలా చెప్పాలా అని మీరు బాధపడుతున్నారుగా! చూడండి. పిల్లలు మధ్యలో వస్తారు. రెక్కలు వచ్చాక పక్షిపిల్లలు నలుదిశలకు ఎగిరిపోతాయ్. గూటిని తల్లిదండ్రులను మరిచిపోతాయి. కొందరు పిల్లలు కూడా అంతే. కానీ... జీవితాంతం.... నాకు మీరూ... మీకు నేను.... తోడుగా వుంటాము కదండీ!" నాయుడిగారి కన్నీళ్లను తన పమిటతో తుడిచి "మీకు నేను వున్నాను మీదానిగా" ఏడుస్తూ చెప్పింది.
పరవశంతో నాయుడుగారు అనురాధను తన హృదయానికి హత్తుకున్నాడు.
నవీన్, దుర్గమ్మలు యాభై లక్షలను ఫణి ఎకౌంటులో ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ పని వాణికి నచ్చలేదు.
నవీన్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఫణి ఆఫీసులో నవీన్ క్యాబిన్ సుందరంగా తయారైంది. మంచిరోజు, మంచి సమయం చూచుకొని తల్లి దుర్గమ్మ దీవెనలతో నవీన్ తన క్రొత్త ఆఫీస్ గదిలో ప్రవేశించాడు. మనస్సు నిండా ఎన్నో ఊహలు.... వింత వింత ఆలోచనలు.... ఫణి నవీన్ గదిలో ప్రవేశించాడు. అతని వెనకాల ఓ అందాల తార.... మోడరన్ డ్రస్, జీన్స్ ప్యాంట్, పైన ఎర్రరంగు టీషర్టు, శరీర ఒంపుసొంపులు కొట్టవచ్చినట్టు కనబడుతున్నాయి. మంచి చూపరి.
"నవీన్ గుడ్‍మార్నింగ్!"
"గుడ్ మార్నింగ్ ఫణి"
జవాబు ఫణికి చెప్పాడే కాని... చూపులు ఫణి వెనకాల వచ్చిన ఆ అందాల భామ వైపున ఉన్నాయి.
ఫణి ఇరువురి ముఖాల్లో క్షణం సేపు చూచి నవ్వుతూ "మన ఆఫీస్ ఎలా వుంది?" అడిగాడు.
"సూపర్" ఆ వచ్చిన యువతిని చూస్తూనే చెప్పాడు నవీన్.
ఆమె కళ్ళు పెద్దవిగా చేసి నవీన్ ముఖంలోనికి చిరునవ్వుతో చూసింది.
ఆమె చూపులు నవీన్‍కు స్వాగతం పలికినట్టు అనిపించాయి. హృదయంలో కలవరం.....
"ఆ... నవీన్. ఈమె పేరు రోజ్‍మన్... ఆంగ్లో ఇండియన్. ఈ క్షణం నుంచి ఈ రోజ్ నీ పర్సనల్ సెక్రటరీ. ఆఫీసుకు సంబంధించిన అన్ని విషయాలలోనూ రోజ్ నీకు సహాయకారిగా ఉంటుంది. హ్యావింగ్ గుడ్ ఎక్స్ పీరియన్స్" నవ్వాడు ఫణి.
ఆ నవ్వులో పరమార్థం ఫణికి మాత్రమే తెలుసు.
"ఓ అలాగా!" అన్నాడు నవీన్.
"అవును... నవీన్"
"థాంక్యూ"
"మన మధ్యన ఇకపై అలాంటి పదాలకు తావు లేదు. వుయ్ వుయ్ ఆర్ పార్టనర్స్"
"ఎస్...." ఆనందంగా చెప్పాడు నవీన్.
"రోజ్! నీవు నవీన్‍ను మెప్పించాలి. ఈ సంవత్సరం నీ అప్రైజల్ వ్రాయబోయేది అతనే టేక్ కేర్" జాలీగా నవ్వాడు ఫణి.
రోజ్ చిరునవ్వుతో "ఓకే సార్" అంది.
"ఆ... నవీన్! నేను దగ్గరలో ఉన్న సైట్ విజిట్‍కు వెళుతున్నాను. మనం సాయంకాలం కలుద్దాం" అని రోజ్ వైపు తిరిగి "రోజీ! డూ యువర్ డ్యూటీ వెల్. స్టాఫ్ అందరికీ నవీన్‍కు పరిచయం చెయ్యి" చెప్పాడు ఫణి.
"ఎస్... సార్" నవ్వుతూ చెప్పింది రోజ్.
ఫణి వెళ్ళిపోయాడు.
నిలబడి ఉన్న రోజ్‍ను క్రిందనుంచి పైదాకా పరిశీలనగా చూచాడు నవీన్. ’గొప్ప అందగత్తె’ అనుకున్నాడు.
"కూర్చోండి."
రోజ్ అతని ఎదురుగా టేబుల్ ముందున్న ఓ ఛైర్‍లో కూర్చుంది.
"సార్! యు ఆర్ ఫ్రమ్ పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్. ఈ. ఎన్. టి.టి"
"ఎస్. రోజ్ గారూ"
"నో..... గారూ సర్. జస్ట్ రోజీ" అంది నవ్వుతూ.
"మీకు తెలుగు రాదా!"
"వచ్చు"
"అయితే నాతో తెలుగులోనే మాట్లాడండి"
"ఓకే" తలాడిస్తూ అందంగా నవ్వింది రోజ్.
యదార్థంగా రోజ్ నవ్వితే చాలా అందంగా కనిపిస్తుంది.
ఆ కళ్ళల్లో ఎంతో ఆకర్షణ... ఆ నవ్వులో ఎంతో స్వఛ్ఛత... ఆ రెండూ కొందరికి దేవుడు ఇచ్చిన వరాలు.
రోజ్‍మన్‍కు వివాహం అయింది. వివాహం అయిన ఆరునెలలకే యాక్సిడెంట్‍లో ఆమె భర్త యాసెఫ్ చనిపోయాడు. ఈ లోకంలో లేడు. ఆమెకు ఒక ఐదేళ్ళ కొడుకు పాల్. వాడే ఆమె ప్రపంచం. బాగా చదివించి వాణ్ణి గొప్పవాడుగా చేసి చూడాలనేదే ఆమె లక్ష్యం. అందుకుగాను ఆమె ఏమైనా చేసేదానికి సంసిద్ధం.
"స్టాఫ్‍ను పరిచయం చేస్తారా?"
"అలాగే సార్ రండి"
నవీన్ కుర్చీలోంచి లేచాడు. ద్వారాన్ని సమీపించాడు.
హైహీల్స్ వేసుకొన్న రోజ్ వెనుతిరిగింది. తన కాలు నవీన్ కాలుకు తగిలింది. పడబోయింది. నవీన్ తన ఎడమ చేతిని ఆమె నడుము క్రింద ఉంచాడు. రోజ్ ఆ చేతిపై వాలిపోయింది.
నవీన్ చేతిని పైకెత్తాడు. రోజ్ నిలబడింది.
ఊహారహితంగా జరిగిన ఆ సంఘటన... రోజ్ స్పర్శ, నవీన్‍కు ఆనందాన్ని కలిగించాయి. నవ్వుతూ రోజ్ వెనుక ముందుకు నడిచాడు నవీన్.
రోజ్ వున్న పాతికమంది స్టాఫ్ పేర్లు చెప్పి నవీన్‍కు పరిచయం చేస్తూ.... నవీన్‍ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా అందరికీ పరిచయం చేసింది.
అందరితో నవీన్ కరచాలనం చేశాడు. తిరిగి వచ్చి తన క్యాబిన్‍లో కూర్చున్నాడు.
రోజ్ రూపం.... అతని కళ్ళముందు నిలిచింది.
మనస్సులో ఏదో మత్తైన మధుర భావన!
రోజ్... డౌన్‍లోడ్ చేసిన కొత్త టెండర్స్ ను నవీన్‍కు చూపించింది. ప్రస్తుతంలో నడుస్తున్న వర్క్స్, వాటి వాల్యూ, ఎంత పర్సెంట్ పని అయ్యిందీ, బ్యాలెన్స్ వర్క్ వివరాలు స్టేట్‍మెంట్, కలెక్షన్స్.... కలెక్షన్స్ పెండింగ్ వివరాలను స్టేట్‍మెంట్లను నవీన్‍కు అందించింది.
"అవసరమైతే పిలవండి సార్" అంది రోజ్.
"అలాగే!"
రోజ్ గదినుండి వెళ్ళిపోయి తన స్థానంలో కూర్చుంది.
నవీన్ తన ముందు టేబుల్‍పై వున్న ఫోల్డర్స్ ను, స్టేట్‍మెంట్స్ ను ఒకదాని తర్వాత ఒకటి చూడసాగాడు. రెండు గంటల తర్వాత....
ఫణి కాల్....
సెల్‍ను చేతిలోనికి తీసుకున్నాడు నవీన్.
"నవీన్! ఉదయం చెప్పడం మరిచిపోయాను. ఈ రోజు నా పుట్టినరోజు. మనం సాయంత్రం పార్టీ చేసుకుందాం. రోజ్‍తో కలిసి తాజ్ హోటల్‍కి రా. షార్ప్ సిక్స్ థర్టీకి. నేను నేరుగా అక్కడికి వస్తాను ఓకేనా?" అడిగాడు ఫణి.
"ఓకే ఫణి" చెప్పాడు నవీన్.
ఫణి సెల్ కట్ చేశాడు.
అదే సమయానికి రోజ్ తలుపు తట్టింది.
"ప్లీజ్ కమిన్!"
రోజ్ తలుపు తెరుచుకొని గదిలోనికి వచ్చింది నవ్వుతూ....
ఆ నవ్వును చూచి నవీన్ మనస్సున కలవరం...
"సార్... ఎండీ గారు ఫోన్ చేశారా?"
ఆమెను తదేకంగా చూస్తూ చిరునవ్వుతో అవునన్నట్లు తలాడించాడు నవీన్.
"ఈరోజు వారి బర్తడే. పార్టీ వుంది" చెప్పింది రోజ్.
"ఫణి చెప్పాడు. మీతో కలిసి రమ్మన్నాడు" ప్రశ్నార్థకంగా రోజ్ ముఖంలోకి చూచాడు నవీన్.
"ఓకే సార్"
"దేనికి?"
"మీతో వచ్చేదానికి" చిరునవ్వుతో చెప్పింది రోజ్.
"మీరు మాట్లాడే తెలుగు పదాలు చాలా స్వచ్ఛంగా వున్నాయి" చిరునవ్వుతో చెప్పాడు నవీన్.
"నేను శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలను వింటుంటాను. వారి తర్క వితర్క భాషణ నాకు ఎంతో ఇష్టం. నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్టు చెపుతారు. ఆస్థికత అర్థాన్ని గొప్పగా వివరిస్తారు" నవ్వుతూ చెప్పింది రోజ్.
నవీన్ సెల్ మ్రోగింది.
"హలో"
"నేనండీ. ఇంటికి ఎప్పుడు వస్తారు?" అడిగింది వాణి.
"ఆఫీసులో పని ఉంది. ఆలస్యం అవుతుంది... నీవు... అమ్మా భోజనం చేసేయండి."
"చాలా ఆలస్యం అవుతుందా?"
"చెప్పానుగా పని వుందని ఆలస్యం కావచ్చు."
నవీన్ సెల్ కట్ చేశాడు.
"సార్.... ఫోన్?
"మై వైఫ్"
"ఓ... అందంగా ఉంటారా!!"
"మీ అంత కాదులే" ఓరకంట రోజ్‍ను చూస్తూ నవ్వాడు నవీన్.
"థాంక్యూ.... థాంక్యూ"
"మనం బయలుదేరుదామా."
"ఓకే సార్"
"పదండి"
"పదండి... కాదు... పద" చిలిపిగా నవ్వింది రోజ్.
ఆ నవ్వు నవీన్‍ను పరవశపరిచింది.
రియల్లీ గ్రేట్ పర్సనాలిటీ అనుకున్నాడు నవీన్.
ఇరువురూ ఆఫీస్ కార్ పోర్టికోలోకి వచ్చారు. కార్లో కూర్చున్నారు.
"హోటల్ తాజ్‍కి పోనీ!" డ్రైవర్‍తో చెప్పాడు నవీన్.
ఫణి చెప్పిన ప్రకారంగా ఆరున్నరకల్లా నవీన్ రోజ్‍మన్‍లు తాజ్ హోటల్‍కు చేరారు.
వారికి ఫణి ఎదురైనాడు. అతని ప్రక్కన మోడరన్ డ్రస్‍తో ఓ దేవకన్య...
"నవీన్! మీట్ మై న్యూ సెక్రటరీ... గులాబీ"
గులాబీ నవ్వుతూ చేయి సాచింది.
నవీన్ కరచాలనం చేశాడు పరమానందంగా…
"నవీన్... నా పార్టనర్ గులాబి" చెప్పాడు ఫణి.
"ఓ నైస్ టు మీట్ యూ సార్" అంది ఓరకంట నవీన్‍ను చూస్తూ..."
"రోజ్.... హౌ వాజ్ ద డే విత్ నవీన్" అడిగాడు ఫణి.
"వెరీ నైస్ సర్! ఐ ఫీల్ వెరీ హ్యాపీ" చిరునవ్వుతో చెప్పింది రోజ్.
"ఫణీ! రోజ్ నాకు అన్ని ఫైల్స్ స్టేటుమెంట్సు చూపించింది"
"నవీన్! ఇటీజ్ నాట్ ఆఫీస్. ఆఫీసు వ్యవహారాలు రేపు ఆఫీసులో మాట్లాడుకుందాం. నవ్! ఉయ్ హ్యావ్ టు ఎంజాయ్ ది ఈవెనింగ్!! కమ్ లెటజ్ గో ఇన్‍సైడ్" నవ్వుతూ చెప్పాడు ఫణి.
నలుగురూ లోనికి నడిచారు.
రిజర్వుడ్ అనే సైన్ వున్న ఓ టేబుల్‍ను సమీపించారు. బేరర్ వారిని సమీపించాడు.
"సార్.... మీరు..."
"ఫణీంద్ర"
"ఓ గుడ్ ఈవెనింగ్ సార్. ఈ టేబుల్ మీ కోసమే కూర్చోండి."
ఫణి, అతని ప్రక్కన గులాబీ, నవీన్, అతని ప్రక్కన రోజ్ కూర్చున్నారు.
"ఆర్డర్ ప్లీజ్" అడిగాడు బేరర్.
ఫణి డ్రింక్స్ ఆఫర్ చేశాడు.
"ప్రతి వ్యక్తి పురోభివృద్ధి వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుందంటారు. నవీన్! ఆ మాటను విన్నావా!" నవ్వుతూ అడిగాడు ఫణి.
"విన్నాను" చిరునవ్వుతో చెప్పాడు నవీన్.
"ఫర్ మి గులాబీ ఫర్ యూ రోజ్ ఆ హస్తాలు" గలగలా నవ్వాడు ఫణి ముగ్గురి ముఖాల్లోకి చూస్తూ...
ఇరువురు వనితలు ఆనందంగా నవ్వారు. వారి ముగ్గురినీ చూచి నవీన్ కూడా ఎన్నో ఊహలతో నవ్వాడు.
బేరర్ ఫణి చెప్పిన ఆర్డర్స్ ప్రకారం అన్నీ తెచ్చి టేబుల్‍పై వుంచాడు.
నాలుగు గ్లాసులు వారి ముందుంచాడు. వ్యాట్ 62 విస్కీని గ్లాసుల్లో పోశాడు. ఐసు ముక్కలు వేశాడు. బాదమ్ కాజు ప్లేట్లను మధ్యన వుంచాడు. నలుగురు ముందు నాలుగు ప్లేట్లను వుంచి సర్వ్ చేశాడు.
నలుగురూ గ్లాసులను చేతిలోకి తీసుకున్నారు. ఛీయర్స్ చెప్పుకొని విస్కీని సిప్ చేశారు.
చికెన్ ఫ్రైని ఆర్డర్ చేశాడు ఫణి.
నలుగురూ ఆనందంగా సరస సంభాషణ సాగించారు.
వారి సంభాషణ ఇప్పుడు వస్తున్న సినిమాలు గురించి... నాయకా, నాయికలను గురించి వారి... వారి అభిప్రాయాలను వారు చెప్పారు. తర్కం... వితర్కం.... జరిగింది. అంతా సరదాగానే.
బేరర్ చికెన్ ఫ్రై రెండు ప్లేట్లలో తెచ్చి టేబుల్‍పై వుంచి సర్వ్ చేశాడు. ఆనందంగా నలుగురు ఐదు రౌండ్స్ ముగించారు. కడుపునిండా తిన్నారు.
శరీరాలు వేడెక్కాయి. మనస్సు మధురభావాలు, శరీరాల్లో ఊపు, కార్డు ద్వారా బిల్లు పేచేసి నలుగురూ లిఫ్ట్ లో మూడవ అంతస్థుకు చేరారు.
"నవీన్! లైఫ్ చాలా చిన్నది. వున్నంతవరకు బాగా సంపాదించాలి. ఆనందాన్ని అనుభవించాలి. దిసీజ్ మై పాలసీ నీవేమంటావ్."
"నీమాటే నామాట"
"ఓకే లెటజ్ ఎంజాయ్. దిసీజ్ యువర్ రూమ్. దటీజ్ మై రూమ్. ఆల్‍రెడీ బుక్‍డ్ ప్లీజ్ యు గో ఇన్‍సైడ్ అండ్ ఎంజాయ్ రోజ్! నవీన్‍ను జాగ్రత్తగా చూచుకో."
"ఓకే బాస్"
తలుపు తెరిచింది రోజ్. నవీన్ చేతిని తన చేతిలోనికి తీసుకొంది. అతని భుజంపై చేయివేసింది. ఇరువురూ గదిలోనికి ప్రవేశించారు. రోజ్ తలుపు మూసి గడియ బిగించింది.
ఫణి గులాబీలు ప్రక్క గదిలో దూరారు. తలుపును గులాబీ మూసింది.
రెండు జోడీలు డన్‍లప్ స్ప్రింగ్ శయ్యలపై వాలిపోయారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentários