లిఫ్ట్ ప్లీజ్
- Malla Karunya Kumar 
- 3 days ago
- 9 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #LiftPlease, #ThrillerStoriesInTelugu

Lift Please - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 28/10/2025
లిఫ్ట్ ప్లీజ్ - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
"తస్మాత్ జాగ్రత్త!, మిమ్మల్ని తెలియని వాళ్ళు ఎవరైనా లిఫ్ట్ అడుగుతున్నారా?. మీరు జాలి పడి లిఫ్ట్ ఇవ్వడానికి సిద్దం అయ్యారా?. అక్కడే ఆగిపోండి. పొరపాటున లిఫ్ట్ ఇచ్చారో, మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి!. తర్వాత మీ దగ్గర వున్న డబ్బు, మీ బైక్ మాయం అవుతాయి!. "
ప్రతి న్యూస్ ఛానెల్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారి హల్‌చల్ చేస్తుంది. అవన్నీ దాదాపుగా నెల రోజుల నుండి చూసిన త్రివిక్రమ్ మస్తిష్కంలో కదలాడుతూ ఉన్నాయి!.
"ఎవరు ఆ కిల్లర్?. ఎందుకు ఈ దొంగతనాలు చేస్తున్నాడు?. దొంగతనం కోసమే ఇలా ప్రాణాలు తీస్తున్నాడా ?. లేక వేరే కారణం ఏదైనా ఉందా?. దీని అంతు చూసేది ఎలా?. " ఆలోచనలో వున్నాడు త్రివిక్రమ్.
సూర్యుడు తన కిరణాల ప్రభావాన్ని మెల్లమెల్లగా తీవ్రతరం చేస్తున్నాడు. ఎదురుగా జరుగుతున్న ఒక సంఘటన చూసి, ఆలోచనలు నుండి బయటకు వచ్చాడు త్రివిక్రమ్.
"మూగ జంతువులను ఆట పట్టించి ఆనందం పొందడం ఏమిటి రా!" తల పై మొట్టికాయ పెడుతూ, నాన్నమ్మ మందలించిన సంఘటన గుర్తుకు వస్తుంది తివిక్రమ్ కు.
చిన్నప్పుడు తమ ఇంటిలో పెంపకం కు తెచ్చిన కొత్త కుక్క కు అద్దం చూపిస్తూ, దాని ప్రతిబింబం చూపిస్తూ భయపెడుతూ ఆనందం పొందుతున్నాడు తివిక్రమ్. అది చూసి కోపగించి, మందలించింది నాన్నమ్మ చాముండేశ్వరి.
నాన్నమ్మ కొప్పడటం తో అలిగి ముఖం వేలాడేసుకుంటూ, గుమ్మంలో కూర్చున్నాడు త్రివిక్రమ్.
మనవడి పక్కకు చేరి, "విక్రమ్!, మనిషంటే నే ఉన్నతమైన జన్మ. మనిషికి అభరణాలు ఏమిటో తెలుసా?. జ్ఞానం, మానవత్వం!. ఇవి లేక పోతే మనిషికి, ఇతర జంతువులకు తేడా ఏమీ ఉండదు!. ఇన్ని ప్రత్యేకతలున్న మనిషి ఎలా నడుచుకోవాలి. ప్రత్యేకంగా నడుచుకోవాలి కదా, వీలైతే వాటికి సహాయం చేయాలి, లేకపోతే లేదు. అంతే కానీ వాటికి హాని చేయకూడదు. నీకు వినోదం కావాలంటే తెనాలి రామకృష్ణుడు కథలు చదువు, లేకపోతే ఇతర హాస్య కథలు చదువు. జ్ఞానం తో పాటు వివేకం కూడా పెరుగుతుంది. " దగ్గరకు తీసుకుంటూ చెప్పింది నాన్నమ్మ.
ప్రతి విషయంలో మంచేదో, చెడేదో తెలియజేస్తూ త్రివిక్రమ్ ను మంచి ఆఫీసర్ అయ్యెట్టుగా బాటలు వేసింది. ఆమె చెప్పిన ప్రతి మాట, ప్రతి కథ, ప్రతి వాక్యం త్రివిక్రమ్ కు ఏదోక సందర్భంలో గుర్తుకు వస్తుంటాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి తన వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు కూడా ఎదురుగా జరుగుతున్న సంఘటన చూసి త్రివిక్రమ్ కు కోపం కలిగింది. వెంటనే అక్కడకు చేరుకున్నాడు ఆవేశం తో,
"ఏ, ఏం చేస్తున్నావు? ఆ పెద్దాయన తో ఆటలాడుతున్నావు ఏమిటి?. " గంభీరమైన స్వరం తో అడిగాడు కర్లింగ్ హెయిర్, చెవికి పోగు, టార్న్ జీన్స్, టీ షర్ట్ ధరించి వున్న యువకుడిని.
"మీరెవరు నన్ను అడగడానికి.. " పొగరుగా అడిగాడు ఆ యువకుడు.
అతని మాట త్రివిక్రమ్ లో కోపాన్ని కలిగించింది. "నేనెవరా!. " అని రగిలిపోతూ ఆ యువకుడి చెంప చెళ్లుమనిపించాడు. ఇంతలో అక్కడకు ఇంకో యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, "సర్, సర్. మేము ప్రాంక్ వీడియో చేస్తుంటాం సర్, సరదాగా.. ఈ వీడియో కూడా అందులో భాగమే. " అతను చెప్పాడు.
కోపంగా అతని వైపు చూసి, "మీకు మరేం పనిలేదా! ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి. మళ్ళీ ఇలాంటివి చేయకూడదు. " వాళ్లను మందలించి పంపేశాడు.
బిక్కుబిక్కుమంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు వాళ్లిద్దరూ.
"సర్, సర్.. " అంటూ అక్కడకు చేరుకున్నాడు కానిస్టేబుల్.
అప్పటి వరకు కళ్ళప్పగించుకొని చూస్తున్న చుట్టూ పక్కల జనం, త్రివిక్రమ్ పోలీసు ఆఫీసర్ అని తెలియగానే వాళ్ల పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు.
"చెప్పు గిరి!. ఏమైంది?, ఎందుకు నీలో కంగారు!. " అడిగాడు త్రివిక్రమ్ గిరి కంగారుని చూసి.
"సర్, మీకు ఫోన్ సర్.. "
"ఓహ్, ఫోన్ వస్తె ఇంత కంగారు పడాలా!. ఇలా ఇవ్వు. " అని తన ఫోన్ అందుకుంటూ, ఫోన్ లిఫ్ట్ చేశాడు.
"ఏమిటి మీరు చెప్పేది!. నేను క్షణాల్లో అక్కడుంటాను. " అని ఆశ్చర్యం తో అంటూ, "గిరి!, పదా స్టేషన్ కు. " అని త్రివిక్రమ్ చెప్పడం తో, గిరి వేగంగా వెళ్లి కారు స్టార్ట్ చేసాడు.
కారు ముందుకు కదిలింది. చెప్పినట్టు గానే క్షణాల్లో స్టేషన్ ముందు వాలిపోయాడు.. వేగంగా డోర్ తెరుస్తూ, కారు దిగి స్టేషన్ లోపలికి చేరుకున్నాడు.
త్రివిక్రమ్ రాకతో స్టేషన్ లో వున్న ఎస్సై మధు తో పాటు మిగతా సిబ్బంది అలెర్ట్ అయ్యి, లేచి సెల్యూట్ చేశారు.
వేగంగా వెళ్లి ఎదురుగా వున్న సీట్లో కూర్చుంటూ, " మధు!, మీరు చెప్పింది నిజమేనా!" అడిగాడు త్రివిక్రమ్.
"నిజం సార్, మీరు చెప్పినట్టుగా నేను పదిహేను టీం లను ఏర్పాటు చేశాను. చాలా ప్రయాస పడి ఒక టీం ఆ కిల్లర్ ను పట్టుకున్నారు. అయితే ఆ టీం లో ఒకరు గాయపడ్డారు. కానీ, ఆ కిల్లర్ ను పట్టుకోగలిగారు. "
"గుడ్!, అయితే మన వ్యూహం ఫలించిందన్నమాట!. అయితే ఆ కిల్లర్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు?. "
"మనవాళ్ళు వెళ్ళారు సర్, బందోబస్తుకు కొంతమందిని పంపించాను. కిల్లర్ తప్పించుకోవడానికి వీలు లేదు. కాసేపట్లో ఇక్కడకు చేరుకుంటారు!. "
"మొత్తానికి ఆ కిల్లర్ దొరికాడు!. ఇలాంటి నేరాలు అరికట్టవచ్చు. "
"కానీ, సర్.. ఆ కిల్లర్ ఒక స్త్రీ!"
ఆశ్చర్యపోతూ మధు వైపుకు చూసాడు త్రివిక్రమ్.
"ఒక స్త్రీ!, ఇంత నేర్పుగా బైక్ దొంగతనాలు చేస్తుందా? పైగా దొరికిన వాళ్లను దొరికినట్టు చంపేస్తుంది? ఆమె ఇలా ఎందుకు చేస్తుంది!. ఆమె ఇలా చేయడం వెనుక మోటో ఏమిటి?. " ఆశ్చర్యంతో అంటూ మధు వైపుకు చూశాడు.
ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నాడు మధు. తనకు కూడా ఏమి తెలియక పోయే సరికి.
కొంత సమయం తర్వాత, "మధు!, ఆమె గురించి వివరాలు సేకరించారా?. ఆమె ఫోటో ఆధారంగా ఇంతకు ముందు ఆమె మీద ఏమైనా నేరాలున్నాయా అన్నది చెక్ చేశారా?. " అడిగాడు త్రివిక్రమ్.
"ఆమె ఆచూకీ దొరకడం తో, ఆమె ఫోటో నాకు మన వాళ్ళు సెండ్ చేశారు సర్. ఆ క్షణమే నేను మొత్తం వివరాలు కోసం జల్లెడ పట్టాను. కానీ, ఆమె మీద ఇంతకు ముందు ఏ నేరాలు ఫైల్ చేసి లేవు సర్!. " సమాధానం ఇచ్చాడు మధు.
"అలాగా!. ఒకే లీవ్ ఇట్!. దాదాపు నెల రోజులుగా మన ప్రయత్నం కు ఈరోజు ఫలితం దక్కింది. ఆ కిల్లర్ ను పట్టుకోవడం తో కాస్త టెన్షన్ తగ్గింది. ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరిగితే ఎన్ని కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతాయో. అసలు ప్రాణం విలువ ఇలాంటి వాళ్లకు తెలిస్తే కదా!. ప్రాణం విలువ బంధం విలువ తెలిసిన వాళ్ళు ఇలా చేయరు. " నిట్టూర్చాడు త్రివిక్రమ్.
ఇంతలో ఆ కిల్లర్ ను తీసుకొని వచ్చారు. సెల్ లో వేసి లాక్ చేశారు.
వెంటనే మధు తో కలిసి సెల్ లోపలికి వెళ్ళాడు త్రివిక్రమ్. కిల్లర్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని కిల్లర్ చర్యలు కారణంగా అంచనా వేసిన త్రివిక్రమ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఆమె ఎదురుగా కూర్చొని, "ఎవరు నువ్వు? మీది ఏ వూరు? ఇలా నువ్వు చేయడానికి కారణం ఏమిటి?. “ సాధారణంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు.
తాను ధరించిన ముసుగుతో ముఖం సగం వరకు కప్పి వుంది. ఆమె తల కిందకు దించుకొని అలానే వుంది. కానీ, ఆమె నుండి ఎటువంటి సమాధానం లేదు!.
మళ్ళీ అదే ప్రశ్న సంధించాడు త్రివిక్రమ్.
ఎప్పటివలె ఆమె నుండి ఏ సమాధానం లేదు!. మౌనం రాజ్యమేలుతుంది. అందరూ నిశబ్దం వహించి చూస్తున్నారు, ఆమె ఏమి చెప్తుందా అని!.
"అడుగుతుంటే మాట్లాడవేం?. " గంభీరమైన తన స్వరాన్ని పెంచి, గద్దిస్తూ అడిగాడు.
తుళ్లిపడుతూ త్రివిక్రమ్ వైపు చూసింది. ఆమె ముఖం నల్లగా మారి వుంది. ఆమె కళ్ళు లోపలికి పోయి కళా విహీనంగా ఉన్నాయి.
ఆమె కళ్లలో ఏదో తెలియని బెరుకు సుస్పష్టంగా త్రివిక్రమ్ కు కనిపిస్తుంది!. ఆమెను చూస్తూ అలానే వుండి పోయాడు త్రివిక్రమ్ ఆశ్చర్యంతో!.
'ఈ ముఖం ను ఎక్కడో చూసినట్టు వుంది!. ఈమె నాకు పరిచయం ఉన్న స్త్రీ లా అనిపిస్తుంది. ఎవరు ఈమె?. " ఆలోచనల్లో పడ్డాడు.
త్రివిక్రమ్ నుండి ఎటువంటి మాటలు లేవు నిశబ్ధంగా ఆలోచిస్తూ వున్నాడు. త్రివిక్రమ్ వైపు చూస్తూ అప్పటి వరకు నిశబ్ధంగా, బెరుకుగా వున్న ఆమె ఒక్కసారిగా నవ్వుతూ ఏదో అంటుంది. ఆమె మాటలకు తుళ్ళి పడి ఆలోచనల్లో నుండి బయటకు వచ్చాడు. ఆమె మాట్లాడుతున్న భాష స్పష్టంగా విన్నాడు.
'ఇది బీహారీ భాష కదా!. ఈమె?' తన మేధస్సు కు పదును పెట్టాడు.
ఏదో చిన్న క్లూ తన మేధస్సు లో మెదులుతూ వుంది. వెంటనే అక్కడ నుండి లేచి నిలబడ్డాడు.
"సర్, చూస్తుంటే తప్పించుకోవడానికి వేరే బాషా మాట్లాడుతుంది!. మన భాషలో నిజం చెప్పించ మంటారా?. " చేతిలో లాఠీ నలుపుతూ అన్నాడు మధు.
"నో మధు గారు, లేదు ఎటువంటి డిగ్రీ ఉపయోగించకండి!. "
"కానీ, సర్ ఈమె మీద నాకు అనుమానం కలుగుతుంది. ఈమెకు తప్పకుండా తెలుగు వచ్చివుంటుంది. లేకపోతే ఇన్ని రోజులు ఇక్కడ సర్వైవ్ ఎలా అవ్వగలదు?. నాకు తెలిసి ఈమె వాహనాలు, బంగారం దొంగతనం చేసి, వేరే దగ్గరకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంటుందని అనిపిస్తుంది. ఈమె వెనుక పెద్ద ముఠా వుంటుందని అనిపిస్తుంది. "
"మధు!, కాసేపు శాంతం వహించండి. నేను మళ్ళీ వస్తాను. " అని చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్ళాడు త్రివిక్రమ్.
మళ్ళీ త్రివిక్రమ్ లోపలికి వచ్చే సరికి, ఆమె అక్కడ వున్న వారి మీద దాడి చేసి, పారిపోవడానికి సిద్దం గా వుంది. ముందుగానే అలెర్ట్ గా వున్న సిబ్బంది, ఆమె వైపు గన్స్ ఎక్కు పెట్టి వున్నారు.
అదంతా చూసి అలెర్ట్ అయి, తన గన్ తీసి సిద్ధంగా పెట్టుకొని, "బినోదా! పారిపోవాలని చూడకు.. లొంగి పో. " గట్టిగా అరిచాడు త్రివిక్రమ్ బీహార్ భాషలో.
త్రివిక్రమ్ అరుపుతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యంతో త్రివిక్రమ్ వైపు చూశారు, బినోద తో సహా..
"మధు, ఆమెను బంధించండి. " అని కేక వేయడం తో, మధు ఆశ్చర్యం నుండి తేరుకుని ఆమెను బంధించి సెల్ లోపల వేశారు.
"సమయానికి మీరు వచ్చి ఆమెను ఏమార్చారు.. లేకుంటే ఆమె ను పట్టుకోవడం కష్టమయ్యేది సర్. ఆమె తో మీరు మాట్లాడిన భాష ఏమిటి?. మీరు పిలిచింది ఆమె పేరా?. ఆమె మీకు తెలుసా?. " ఆశ్చర్యంతో ప్రశ్నలు కురిపిస్తున్నాడు మధు.
“తెలుసు మధు. "
ఆశ్చర్యంతో చూస్తున్నాడు మధు..
"కానీ ఇక్కడ కాదు. నేను మొదటగా నా ట్రైనింగ్ పూర్తి చేసుకొని బీహార్ కేడర్ లో డీఎస్పీ హోదాలో బాధ్యతలు స్వీకరించాను. ఆ సమయంలో డిపార్ట్‌మెంట్ కు ఒక కేసు వచ్చింది. దాన్ని పరిష్కరించే సమయంలో పరిచయం అయిన స్త్రీ బినోద. "
"అంటే అక్కడ కూడా ఆమె నేరస్తురాలా?. "
"కాదు, ఓ బాధితురాలు?. "
"అర్దం కాలేదు సర్. " ఆశ్చర్యంతో అన్నాడు మధు.
"ఆ రోజు ఏడుస్తూ పోలీసు స్టేషన్ గుమ్మం మెట్లు ఎక్కరు ఇద్దరు దంపతులు. ఆ సంఘటన జరిగి మూడు రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చారు. బినోద ఆమె భర్త విష్ణు..
వాళ్ల పదేళ్ల కూతురు చనిపోయిందని, అది కూడా సాధారణ మరణం కాదు.. శవమై కాలువ లో తేలుతూ. "
కళ్ళు అప్పగించుకుంటూ వింటున్నాడు మధు. మిగిలిన వాళ్ళు.
"విష్ణు ఒక మెకానిక్, అతనికి ఒక షెడ్ కూడా ఉండేది. వినోద అంటే అతనికి చాలా ప్రాణం. ఆమె ఇష్టపడిందని షెడ్ కు వచ్చే కొత్త మోడల్ బండిని ఆమె కు ఇచ్చి డ్రైవింగ్ నేర్పించే వాడు. అలా బినోద కు డ్రైవింగ్ వచ్చింది. "
"అది బాగానే వుంది. కానీ, ఆ అమ్మాయిని చంపింది ఎవరు సర్, " అడిగాడు మధు.
"మధు! నువ్వే కనిపెట్టు. "
కాసేపు ఆలోచించి, "బినోద, విష్ణు శత్రువులు ఎవరైనా ఈ పని చేసి ఉంటారు సర్. "
"యు టోటల్లి రాంగ్ మధు. "
"మరి ఎవరు సర్, డ్రగ్ మాఫియా!, ఉమెన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళు అయివుంటారా?. "
"కాదు, బినోద కు వరసకు చెల్లెలు, ఐ మీన్ పిన్ని కూతురు ఒకతను తో ఎఫైర్ పెట్టుకుంది. అది బినోద కూతురుకు తెలిసిపోయింది. " త్రివిక్రమ్ ముగించక మునుపే,
"ఆగండి సర్, నేను పూర్తి చేస్తాను. బినోద చెల్లి ఈ హత్య చేసింది. ఈ విషయం బినోద కు తెలిసిపోతుంది అని. "
"ఎగ్జాట్లీ అదే, కానీ కథ వేరే వుంది!. "
ఆశ్చర్యంతో చూస్తూ వున్నాడు మధు.
"బినోద చెల్లెలు వెనుక మరో నేర హస్తం కూడా వుంది. అతను ఎవరో కాదు మధు, విష్ణు!. " తేట తెల్లం చేశాడు త్రివిక్రమ్.
షాక్ అవుతూ, "ఏమిటి సర్ మీరు చెప్తున్నది!. తండ్రి సొంత కూతుర్ని చంపేశాడా?. ఎంత క్రూరత్వం!. కానీ ఈ విషయం ఎలా కనిపెట్టారు సర్. " ఆశ్చర్యంతో అడిగాడు మధు.
"మనం చేస్తున్న పని ఎప్పుడూ మూడో కన్ను ఒకటి గమనిస్తూనే ఉంటుంది మధు. ఆ మూడో కన్ను సహాయం తో అతనే దోషి అని నిర్ధారణకు వచ్చాం. బినోద పోలీసు స్టేషన్ కు రావడం విష్ణు కు ఇష్టం లేదు. ఆమెను వారించాడు. కానీ ఆమె ఒప్పుకోక పోవడం తో తప్పలేదు. "
"అంతా కన్ఫ్యూషన్ గా వుంది సార్. ”
"ఏదైనా కేస్ వచ్చింది అంటే 360 డిగ్రీలో చూడటం నాకు అలవాటు. బినోద, ఆమె భర్త, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళ మీద నేను నిఘా పెట్టాను. ఇప్పుడు నీకు ఇచ్చిన ఐడియా, నేను అప్పట్లో అమలు చేసి విజయం సాధించిందే. "
"అంటే ఈ టీం గా ఫామ్ అయ్యి వెతకడం అప్పుడు అమలు చేసిందా?. "
"అవును మధు. విష్ణు, బినోద చెల్లెలు అక్రమ సంబంధం పెట్టుకొని, అది ఎవరికైనా తెలిసిపోతుంది అని భయంతో ఈ నేరం చేశారు. ఇలాంటి వారు ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా తప్పు చేస్తారు.. అలాంటి తప్పే ఈ కేసు క్లోజ్ చేయడానికి పనికి వచ్చింది. "
"ఎలా సర్, ఆ తప్పు ఏమిటి?. "
" వీళ్ళ సంగతి చనిపోయిన బినోద కూతురుకి మాత్రమే కాదు. ఇంకో వ్యక్తి కి కూడా తెలుసు. అతను కూడా వీళ్ళ చేతిలో చావాల్సి ఉండేది. కానీ అతను చాకచక్యంగా వీళ్ళ నుండి తప్పించుకున్నాడు. కానీ, ఈ హత్య జరిగిన తర్వాత మళ్ళీ విష్ణు దగ్గరకు వచ్చాడు. విష్ణు ను బెదిరించాడు.
అతనికి భయ పడి విష్ణు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాడు. అదంతా నా టీం గమనించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. చివరికి తీగ లాగడం తో డొంక మొత్తం కదిలింది. వివరాలు సేకరించి కోర్టులో ప్రవేశ పెట్టాం. నేరస్తులుగా విష్ణుకి, అతని మరదలు కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇది అసలైన స్టోరీ. "
"ఛీ, ఏమిటి సర్ ఈ మనుషులు ఇలా తయారు అవుతున్నారు?. కామ వాంఛకు లోనై కన్న ప్రేగును, అయిన వాళ్లను అందరినీ కడతేరుస్తున్నారు. " అసహనంతో అన్నాడు మధు.
"కూల్ డౌన్ మధు. మానవ జన్మ ఎత్తగానే మానవులు అయిపోరు. ఈ జన్మ పరిపూర్ణత కావాలంటే ఎంతో నిబద్ధత, నిజాయితీ, అరిషడ్వర్గాలు మీద అదుపు అవసరం. " అన్నాడు త్రివిక్రమ్.
కొంత సమయం ఆగి, "కానీ సర్, ఈ బినోద ఇలా ఎందుకు మారింది. అందరినీ చంపడానికి కారణం ఏమిటి?. "
"నాకు కూడా అదే తెలియాల్సి మధు. అందుకే మన డిపార్ట్‌మెంట్ కు సన్నిహితుడైన డాక్టర్ వీర భద్ర ను పిలిపించాను. అతను ఐతే ఇలాంటి వారిని బాగా డీల్ చేస్తాడు.
"కానీ సర్ అతనికి ఆమె భాష వచ్చా?"
"వచ్చు మధు. " అని త్రివిక్రమ్ చెప్పే లోపలే, అక్కడకు చేరుకున్నాడు వీర భద్ర.
"హొ! డాక్టర్ వచ్చేశారా, మీ కోసమే ఎదురు చూస్తున్నాను. అదుగో కిల్లర్ అక్కడ వుంది. " బినోద ను చూపిస్తూ అన్నాడు త్రివిక్రమ్.
"ఓకే, ముందు ఆమెను బంధించండి. ముందు జాగ్రత్త అవసరం కదా. "
"మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్టర్. అన్ని ఏర్పాట్లు చేస్తాము. మీకు ఎటువంటి హాని కలగదు. " అని భరోసా ఇచ్చాడు త్రివిక్రమ్.
"సరే, నేను ఒక్కడినే వెళ్లి ఆమె తో మాట్లాడుతాను. కావాలంటే మీరు వీడియో రికార్డు చేయండి. " అని అన్నాడు వీర భద్ర.
"అలాగే డాక్టర్, మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. మీరు ప్రొసీడ్ అవ్వండి. " అని అన్నాడు త్రివిక్రమ్.
"సర్, కొన్ని విషయాలు ముందుగా నేను తెలుసుకోవాలి. " అని అన్నాడు వీర భద్ర త్రివిక్రమ్ ను చూస్తూ, వెళుతూ ఆగి.
"తప్పకుండా నాతో పాటు రండి. " అని పక్కకు వెళ్లి వీర భద్ర అడిగినా వివరాలు చెప్పాడు.
"ఓకే, నేను చూసుకుంటాను. " అని బినోద దగ్గరకు వెళ్ళాడు వీర భద్ర.
ఆమె రెండు చేతులు ఎదురుగా వున్న సిమెంట్ బల్లకు లాక్ చేసి ఉన్నాయి. ఆమె ఆ బల్లకు ఆనించి తల కిందకు వేలాడేసుకొని వుంది.
"హాయి బినోద!. " అంటూ ఆమె ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.
ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి, వీర భద్ర వైపు చూసింది. ఆమె కళ్లలో ఏదో తెలియని కోపం, తన పేరు పెట్టి పిలిచారని ఆశ్చర్యం కనిపిస్తూ వున్నాయి.
ఎలాంటి కరుడు కట్టిన సైకో తో ఐనా మాటలు కలిపి, వాళ్ల నుండి సమాచారం రాబట్టగల నేర్పు వీర భద్రది.
తన మొదటి యుక్తి ప్రయోగిస్తూ, "నితీషా ఎలా వుంది?. " ఆమె భాషలోనే అడిగాడు.
కోపంతో రగిలిపోతూ, "ఆమె లేదు, లేదు. " అరుస్తూ తన భాషలోనే చెప్పింది.
"నువ్వే కదా ఆమెను చంపేసావు?. కసాయి తల్లివి నువ్వు. "
"నేను కాదు. విష్ణు.. వాడే, వాడొక కసాయి తండ్రి, నా బంగారాన్ని చంపేశాడు.
పాపాత్ముడు. " బోరున ఏడుస్తూ, "వాడిని నా చేతులతో చంపేయాలి. " నవ్వుతూ అంది.
ఆమె మాటల్లో, ఆమె నవ్వులో ఆమె స్థితి ఏమిటో వీర భద్ర కు తెలిసి పోయింది.
"అందరినీ చంపి నువ్వు పెద్ద నేరస్థురాలివి అయ్యావు. ఎంత మందిని చంపావు నువ్వు?.
ఎంతమంది అమ్మలకు బిడ్డలు లేని వాళ్లుగా చేసావు, ఎన్ని కుటుంబాల ఉసురు పోసుకున్నావు. నీ లాంటి దాన్ని ఏమి చేయాలి. "
"పోని ఎవరికీ నష్టం, వాళ్ళే కదా నన్ను ఇలా మార్చింది. " అప్పటి వరకు అరిచిన ఆమె స్వరం నెమ్మదించింది.
"వాళ్ళు నిన్ను ఏమి చేశారు?. ఎవరో చేసిన తప్పుకు నువ్వు అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు. "
"ఎవరు అమాయకులు, ఈ జనాలా. " ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించింది.
"ఎందుకు వాళ్లను చంపావు?. ఎందుకు ఈ దొంగతనాలు చేస్తున్నావు చెప్పు, చెప్పు?. " గట్టిగా అడిగాడు వీర భద్ర.
ఒక్కసారిగా తన నవ్వు ఆపి, మౌనం వహించింది. వీర భద్ర చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మౌనం మాత్రం వీడలేదు.
నలభై నిమిషాలు ప్రయత్నం చేసిన తర్వాత, వీర భద్ర అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. “సర్, మొత్తం చూసి, వినే ఉంటారు కదా. ఆమె అక్కడితో నోరు మెదపడం లేదు. మళ్ళీ తర్వాత ప్రయత్నం చేస్తే ఫలితం వుంటుందేమో. నాకు అర్జంట్ పని వుంది. అవసరం అయితే నాకు కాల్ చేయండి. " అని చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు వీర భద్ర.
అప్పుడే త్రివిక్రమ్ ఫోన్ మ్రోగింది, లిఫ్ట్ చేశాడు త్రివిక్రమ్. సరిగ్గా గంట సేపు మాట్లాడిన తర్వాత, త్రివిక్రమ్ కాల్ కట్ చేసి ఫోన్ టేబుల్ మీద పెట్టాడు.
"సార్, ఈమె నుండి విషయం ఎలా రాబట్టాలి?. " అడిగాడు మధు.
"మొత్తం తెలిసింది మధు. "
"ఏమిటి సర్ మీరు అంటున్నది?. "
"అవును ఇప్పుడే బీహార్ నుండి బినోద ఉంటున్న ప్రాంతం ఎస్సై తో మాట్లాడాను. అతను వివరాలన్ని సేకరించి నాకు కాల్ చేసాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత బినోద ఒంటరి అయ్యింది. ఆమె చుట్టు పక్కల వున్న వాళ్ళు కొందరు ఆమె దెప్పిపొడవడం మొదలు పెట్టారు. కూతురు పోయిందన్న బాధ, సొంత వాళ్ళు చేసిన నమ్మక ద్రోహం, ఒంటరి తనం కారణంగా సగం కృంగిపోయిన, ఆమెకు చుట్టుపక్కల వాళ్ల మాటలు ఇంకా కృంగదీయ సాగాయి.
అలాగే కొందరు కామాంధులు ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేసి, ఆమెను ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ ఆమెను మనిషిలా బ్రతక నివ్వలేదు. తర్వాత ఆమె ఆ ఊరిలో కనపడలేదు. " చెప్పాడు త్రివిక్రమ్.
"అంటే ఆ బాధలు, వేధింపులు, అల్లర్లు తట్టుకోలేక, బినోద మానసికంగా కృంగిపోయి, దొరికిన వారి మీద దాడి చేసి. వాళ్లను చంపి మృగంలా, సైకో లా మారిందన్న మాట. ఆమె భర్త ఆమెకు నేర్పిన డ్రైవింగ్ ఆమెకు ఇలా ఉపయోగపడిందన్న మాట. "
"అవును మధు నువ్వు అన్నది నిజమే. ఇలాంటి కేస్ లు పునరావృతం కాకూడదు అంటే సమాజానికి సందేశం ఇవ్వడం ముఖ్యం!. "
"ఏమని సర్?. "
"వీలు ఐతే సహాయం చేయాలి. లేకపోతే లేదు. అంతే గానీ ఇతరులని సూటిపోటి మాటలతో దెప్పి పొడవడం. అల్లరి చేయడం, కామించడం చేయకూడదు. ఇలాంటి చేష్టలు ఎక్కడికి దారితీస్తాయన్నది చెప్పడం కష్టం. "
"అవును సర్ మీరు చెప్పింది నిజమే. "
"మధు, ఫైల్ రెడీ చేయండి. మొత్తం ఆమె గురించి. ఇంకా ఆమె ఏ నేరాలు చేసిందో తెలుసుకోండి. " అని చెప్తూ అక్కడ నుండి కదిలాడు త్రివిక్రమ్.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.



Comments