వాయువేగా పేకర్స్ అండ్ మూవర్స్
- Veereswara Rao Moola

- Oct 28
- 4 min read
#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #VayuvegaPackersAndMovers, #వాయువేగాపేకర్స్అండ్మూవర్స్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Vayuvega Packers And Movers - New Telugu Story Written By Veereswara Rao Moola Published In manatelugukathalu.com On 28/10/2025
వాయువేగా పేకర్స్ అండ్ మూవర్స్ - తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
నేను నిర్మాణ రంగం లో పనిచేసేటప్పుడు ప్రతీ రెండేళ్ళ కి బదిలీ అవుతుండేది. బదిలీ ఐనప్పుడల్లా కొత్త ప్రదేశానికి సామాన్లు పంపించడం పెద్ద యజ్ఞం లా ఉండేది.
సామాన్లు కొత్త ప్రదేశానికి వచ్చాక ఏదో ఒకటి కనిపించకుండా పోయేది. మళ్ళీ ఆ వస్తువును కొనుక్కోవడం ఇది ఒక తల నొప్పిగా తయారయ్యింది. ఈ సారి కొన్ని సామానులు సగం ధరకి అమ్మి (ఫ్రిడ్జ్ లాంటివి) అమ్మి మిగిలిన సామానులు పేకర్స్ మూవర్స్ కి ఇద్దామని నిశ్చయించుకున్నా.
ఇందులో మా బామ్మ పుట్టింటినుండి తెచ్చుకున్న రుబ్బురోలు భద్రం గా నేను ఎక్కడికి వెడితే అక్కడికి తీసుకు వెళ్ళాలి. బామ్మ నాతో పాటు తిరిగి యూపి వెడితే యూపి, ఎంపి వెడితే ఎంపి వచ్చేది. చుట్టుపక్కల పుణ్య క్షేత్రాలు చూసేది. నాకు చెన్నయ్ నుండి యూపి బదిలీ అయ్యాక సామానులు పంపడానికి వాయువేగా పేకర్స్ అండ్ మూవర్స్ ని సంప్రదించాను.
*******
"భద్రత, నాణ్యత, వేగం" అనే మూడు సూత్రాల మీద పని చేసే వాయువేగా ని సంస్థ ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. నేను మీకు ఏ విధం గా సహాయ పడగలను?" అన్నాడు సేల్స్ మేన్ వామనరావు.
నా సామానుల లిస్ట్ ఇచ్చాను. నాకు ఏలా కావాలో చెప్పాను. బిందెలు చిన్న సొట్ట పడకూడదని, రుబ్బు రోలు మరీ మరీ జాగ్రత్త అని చెప్పాను.
"రమణగారూ, మీరు మీ ఇంటి సామాను మాకు ఇచ్చి మర్చిపోండి. " అన్నాడు వామన రావు ఉత్సాహంగా.
"యూపి చేరవా? "
"భలే వారే మీరు ఎన్నుకున్నది ఎవరిని? భద్రత, నాణ్యత, వేగం గల వాయువేగా ని. మీ సామానులు మీకన్నా ముందుగా విమానం కంటే వేగంగా మీ ఇంటి కి చేరతాయి."
"దీన్నే అంటారు షార్ట్ ఫిలిం కి పాన్ ఇండియా లెవల్ లో హైప్ అని"
"మీరే చూస్తారు గా మా పనితనం గురించి"
***********
తరువాత వామన రావు తన స్టాఫ్ తో వచ్చాడు. ముగ్గురు వచ్చారు. మూటలు కట్టారు. ముగ్గురు లో ఒక కుర్ర వెధవ ఉన్నాడు. గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ ప్యాకింగ్ లేకుండా చిన్న సామానులు తాడు తో తోసేస్తున్నాడు. ప్యాకింగ్ పర్యవేక్షణ తో తలనొప్పి వచ్చింది. గంట తర్వాత బామ్మ రుబ్బురోలు తో సహ సామానుల బండీ కదిలింది. కొంత డబ్బు బాకీ పెట్టాను.
నా భార్య సామానులు వచ్చాక వస్తానని పుట్టింటికి వెళ్ళిపోయింది. చేతిలో క్రెడిట్ కార్డు ఉందిగా. "గీకు" రాణి లా షాపింగ్ చేస్తోంది. బామ్మ కాశీ లో ఉంది.
నేను యూపి చేరి రెండు నెలలయినా సామానులు నన్ను చేరలేదు. వామన రావుని కలవడానికి ప్రయత్నిస్తే స్విచ్చాఫ్ వచ్చింది.
*********
వారం తర్వాత :
వామనరావు నుండి ఫోన్ వచ్చింది.
"భద్రత, వేగం, నాణ్యత గల వాయువేగా ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. నేను మీకు ఏ విధం గా సహాయపడగలను?"
"బాబూ వామనా? సామాన్లు ఎక్కడ?"
"పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి"
ఆ జవాబు వినగానే అదిరి పోయాను.
"అవేం పాపం చేసాయి?"
"పాపం ఒంగోలు దగ్గర డ్రైవర్ చేసాడు. మందు తాగి( రాయల్ స్టాగ్ వాడి బ్రాండ్) వేగం గా బండి నడిపి వేరే బండిని గుద్దాడు. కేసయ్యింది. కేసు తేలే వరకూ సామానులు పోలీస్ స్టేషన్ లోనే "
"ఇదేనా బాబూ భద్రత, నాణ్యత, వేగం అని తమరేగా చెప్పింది"
"అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలోనే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. "
"సరే త్వరగా ఏడు. కేసు సంగతి తేల్చి సామానులు ఇంట్లో తగలెయ్యి. "
"వాయువేగా ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు "
మొబైల్ కట్ చేసి చూస్తే, పక్క మొబైల్ నుండి
"ఏ నిమిషానికి ఏమి జరుగునో " అని వేరే రింగ్ టోన్ వస్తోంది.
. 'టైమింగ్' అనుకున్నా.
********
రాత్రి భార్య ఫోన్ చేసింది..
"సామానులు వచ్చాయా? " అడిగింది.
జరిగింది చెప్పాను.
"నా సామానులు అన్ని రావాలి. మీ కధలు, కవితల పుస్తకాలు రాక పోయినా ఫర్వాలేదు "
"అంటే? నీ పాత సామాను కున్న విలువ లేదా నా కధలకి"
"చిత్తు కాగితాల వాడు కూడా కెజి కి రెండు రూపాయలు ఇస్తానంటున్నాడు. "
"హతవిధీ! తెలుగు సాహిత్య రంగాన ఒక రచయిత స్థితి ఇదేనా?"
********
వామనరావు ఫోన్ చేసి రెండు వేలు పంపమన్నాడు.
ఎందుకు అన్నాను. లాయర్ ఫీజు అన్నాడు.
'నేనెందుకు కట్టాలని. మీరు కట్టుకోండి" అన్నా కోపంగా.
"సామానులు ఎవరివి?"
"నావి?"
"అందుకే కట్టుమరి"
నోరు మూసుకుని కట్డాను. రెండు నెలలు గడిచాయి. మధ్యలో వాన వచ్చి వెళ్ళింది. సామానులు రాలేదు.
"నా ముద్రితాలు, అముద్రితాలు అన్నీ ఎండ కి
ఎండి, వానకి తడిసి పోవలిసిందేనా " అని బెంగ పెట్టుకున్నాను. బామ్మ కాశీ నుండి తిరిగి వచ్చింది.
రుబ్బురోలు లో కొబ్బరి కాయ పచ్చడి చేయాలని సంబర పడుతోంది.
ఇంకా సామానులు రాలేదు.
*******'
మరుసటి నెల రాహుకాలం ఉండగా సామానులు బండి వచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. సామానుల ప్యాకింగ్ లు విప్పాక వాటి అసలు రంగు బయటపడింది.
పెడస్టల్ ఫ్యాన్ వంకరయ్యింది. బిందెలు సొట్టలు పోయాయి.
అన్నింటికీ కన్నా ముఖ్యం గా బామ్మ రుబ్బు రోలు మిస్ ఐంది.
ఏమిట్రా అని అడిగితే
"హమ్ కో మాలూమ్ నహి. హెడ్ ఆఫీస్ మే పతాకర్ లో"
(మాకు తెలియదు. హెడ్ ఆఫీస్ లో కనుక్కోండి)
అని చెప్పి చాయ్ పైసా రెండొందలు అడిగి పట్టుకు పోయాడు.
తరువాత చూసుకుంటే ఐరన్ బీరువా కనబడలేదు.
ఏమిటిది వామనా అంటే “వేరే బండిలో కలిసిపోయి ఉంటుంది కనుక్కుని పంపిస్తాం” అన్నాడు.
" ఓరే మా పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి రా ఆ రుబ్బు రోలు..
పొగొట్టేసాడా? వాడి చేతులు విరిగి పోను. కాలు బోద కాలయిపోను" అని మా బామ్మ సణుగుతోంది.
"ఉండవే బామ్మ, కొత్తది కొంటాలే ఉజ్జయిని వెళ్ళినప్పుడు"
అని బామ్మకు సముదాయించాను.
******
తరువాత ఇన్సూరెన్స్ కి అప్లై చేసాను. ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాబూరావు వచ్చాడు. సొట్ట బిందెలకి ఫోటోలు తీసుకున్నాడు. ఆరు నెలల తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అక్షరాల ఆరు వందల యా భై రూపాయిల చెక్కు వచ్చింది.
భార్య తిరిగి వచ్చి కొన్ని సామానులు కొత్తవి కొని కాపురం ప్రారంభం చేసింది.
**********
వారం తర్వాత :
"మూడు సూత్రాల వాయువేగా పేకర్స్ కి స్వాగతం. భద్రత.. " అంటూ వామనరావు మొదలు పెట్టాడు.
"ఆపరా నాయనా.. భద్రత, నాణ్యత, వేగం కాదు. నీ మాసికం, సాంవత్సరీకం, తద్దినం. నీకు మెటీరియల్ ఇవ్వడం అంటే
కొరివి తో తల గోక్కోవడమే!"
"అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీరు ఏ రేటింగ్ ఇస్తారు? "
అడిగాడు వామనరావు.
"నిన్ను చింత బరిక తో బాదాలి రా. పైగా చేసిన పని కి రేటింగ్ కావాలా? కనబడితే గన్ తో కాల్చి పారేస్తా " అని ఆవేశం గా అరిచాను.
"మా సేవలు నచ్చితే వేరొకరికి చెప్పండి. వాయువేగా అభివృద్ది కి తోడ్పండి"
"మీరు మారరు రా " లైన్ కట్ చేసాను.
ఆ తరువాత ఆంధ్రా బదిలీ ఐనప్పుడు పాత సామాను మొత్తం అమ్మేసి, ఆంధ్రా లోమళ్లీ కొనుక్కున్నా ఏ వామనరావు వల లో పడకుండా!
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.




Comments