'Love Never Dies' New Telugu Story
Written By Chandana Sanju
'లవ్ నెవర్ డైస్' తెలుగు కథ
రచన : చందన సంజు
రామనవమి రోజు భక్తులు అంతా రాముడి ఆలయానికి వెళ్తారు. అక్కడ వున్న రాముడిని ఎన్నో కోరికలు కోరుతూ వుంటారు.
అలానే అక్కడికి సంతోష్ అతని కుటుంబం తో రాముడి ఆలయానికి వస్తాడు. అందరి లాగానే ఆ దేవుడిని కోరుకుంటాడు. అతని కుటుంబం కూడా ఆ దేవుడిని మొక్కుకుంటారు. అలా వాళ్ళు మొక్కుక్కొని కొంచెం దూరం లో కూర్చుంటారు. ఇంకా అక్కడికి విజయ తన తండ్రి తో వస్తుంది.
విజయ ని చూసి సంతోష్ తల్లి చాలా సంతోషిస్తుంది. సంతోష్ తో, “రేయ్! అక్కడ చూడరా.. విజయ వచ్చింది” అంటుంది.
సంతోష్ చిరాకు పడుతూ, “అమ్మా! కనీసం ఇక్కడ కూడా నా పెళ్లి గురించి మాట్లాడకుండా వుండలేవా..” అంటాడు.
సంతోష్ తల్లి దిగులుగా, ' రేయ్, విజయ మంచి అమ్మాయి, నిన్ను బాగా చూసుకుంటుంది.” అంటుంది.
అప్పుడు సంతోష్ అతని మనసులో, 'అమ్మా! నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు. నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆ విషయం నీకు సమయం వచ్చినప్పుడు చెప్తాను..' అనుకుంటాడు.
సంతోష్ తల్లి “ఏంటి రా. ఏం ఆలోచిస్తున్నావు? విజయ వాళ్ళ నాన్నని మీ పెళ్లి గురించి అడుగుతాను రా” అంది.
సంతోష్ ఇంకా చాలా కోపం తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విజయ స్వామి వారిని దర్శించుకొని సంతోష్ తల్లి దగ్గరికి వస్తుంది. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
అప్పుడు, సంతోష్ చెల్లి సుజాత విజయ తో చాలా కోపంగా, “నువ్వు ఎప్పుడయితే మా అన్నయ్య లైఫ్ లోకి వచ్చావో అప్పటి నుంచి వాడికి ప్రశాంతత లేకుండా చేసావు.” అంది.
సంతోష్ తల్లి దేవి,”సుజాత.. ఏంటి ఈ మాటలు.. తాను ఏమైనా పరాయి అమ్మాయా? మనకి కావలసిన అమ్మాయి. సారీ చెప్పు” అంటుంది.
ఈ మాటలు విన్న సుజాత కోపం తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
విజయ స్మైల్ చేస్తూ, ' పర్లేదు ఆంటీ. తాను చిన్న పిల్ల. నేను ఏం అనుకోను. అయినా మీరు నా గురించి సంతోష్ కి చెప్పడం ఏంటి. నాకు అర్థం కాలేదు” అంది.
దేవి,”అదేంలేదు విజయా.. సమయం వచ్చినప్పుడు చెప్తాను” అంటుంది.
విజయ కి తన తండ్రి ఫోన్ చేస్తాడు.
దాంతో విజయ, “సరే ఆంటీ.. నేను వెళ్తాను. అక్కడ నాన్న నా కోసం వెయిట్ చేస్తున్నారు” అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది.
దేవి కూడా సంతోష్ తో కలిసి, తన ఇంటికి వెళ్తుంది. రెండు రోజుల తరువాత సంతోష్ తల్లిదండ్రులు విజయ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళు సంతోష్ -విజయ పెళ్లి గురించి మాట్లాడుతారు. ఈ మాటలు విన్న విజయ తల్లిదండ్రులు షాక్ అవుతారు.
అప్పుడు, విజయ తండ్రి, “మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే సంతోష్ మనసులో ఏం వుందో కుడా తెలియాలి కదా” అన్నాడు.
సంతోష్ తండ్రి మురళి, “మా మాట నా కొడుకు గౌరవిస్తాడు” అన్నాడు.
విజయ కుటుంబం చాలా ఆనందిస్తారు. సంతోష్ కుటుంబం కొద్ది సేపు అలాగే అక్కడ మాట్లాడి వెళ్ళిపోతారు.
తన తల్లిదండ్రులు, విజయ ఇంటికి వెళ్ళారు అని సంతోష్ కి తెలుస్తుంది.
సంతోష్ చాలా కోపం తో విజయ కి కాల్ చేస్తాడు. విజయ ఆఫీస్ పని లో వుండటం వల్ల కాల్ లిస్ట్ చేయదు.
సంతోష్ ఇంకా అలానే ఆరు సార్లు కాల్ చేస్తాడు. చివరిగా విజయ మొబైల్ చూస్తుంది. అప్పుడు విజయ సంతోష్ కి కాల్ బ్యాక్ చేస్తుంది.
సంతిష్ చాలా కోపంగా, “కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలని తెలీదా. ఓహో, చాలా సంతోషంగా వున్నావు అనుకుంటా.. అనుకోవడం ఏంటి సంతోషంగా ఉంటావు లే..” అన్నాడు.
విజయ కి ఏమి అర్థం కాదు.
విజయ అమాయకంగా, “అసలు ఏం అయిందని.. ఎందుకు అలా మాట్లాడుతున్నావు. ?” అంటుంది.
సంతోష్ వెటకారంగా, “అబ్బా! ఎంత బాగా నటిస్తునావు, ఏం తెలియదు అన్నట్లుగా..” అన్నాడు.
విజయ ఎంతో సహనంతో, “చూడు సంతోష్! అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?” అంటుంది.
సంతోష్, “నీకు నాతో పెళ్ళి చేయాలని డిసైడ్ అయ్యారు.” అని చెబుతాడు.
విజయ షాక్ అవుతుంది.
సంతోష్, ' చాలా సంతోషంగా వున్నావు కదా” అన్నాడు.
విజయ ' చూడు.. నాకూ ఈ విషయం గురించి అసలు తెలియదు” అంటుంది.
సంతోష్, “ఇది ఒక కొత్త నాటకం. నీకు తెలియకుండా ఇది అంతా జరిగింది అని నేనయితే అసలు నమ్మను. మీ పేరెంట్స్ నీ ఇష్టం గురించి తెలుసుకోకుండా మాట ఇస్తారా..” అన్నాడు.
విజయ, “అది కాదు సంతోష్.. నాకు నిజంగా తెలీదు” అంటుంది.
సంతోష్, “ఓహో, ఇప్పుడు తెలిసింది కదా.. మరి ఏం చేస్తావు చెప్పు.?” అన్నాడు.
“నాకు కొంచెం సమయం కావాలి.”
“ఇప్పుడు టైమ్ లేదు. మరో ఆరు రోజుల్లో నిశ్చితార్థం వుంది.”
విజయ షాక్ అయి, “ఏంటి నిశ్చితార్థమా” అంటుంది.
“అవును. నిశ్చితార్థమే. నాకయితే నీతో జీవితాంతం వుండాలని లేదు. ఒకవేళ వున్నా కూడా నువ్వు హ్యాపీ గా వుండవు”
“సరే! అయితే నువ్వే ఈ విషయం ఆంటీ వాళ్ళకి చెప్పు. బై, నీతో తర్వాత మాట్లాడుతాను”
విజయ కాల్ కట్ చేసి, ఆఫీస్ రూం లోకి వెళ్లి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. సంతోష్ ఏమో చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు.
అదే కోపంతో రూం లోకి వెళ్ళి తలుపు మూసుకొని కూర్చున్నాడు. సుజాత ఏమో విజయ కి కాల్ చేసి, తిడుతూ వుంది. కానీ విజయ ఈ విషయం ఎవరికి చెప్పదు.
మరో పక్క సంతోష్ ఇంట్లో నిశ్చితార్థానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ వాళ్ళ ఇంట్లో కూడా అందరు అదే పనిలో హడావుడిగా ఉన్నారు. సంతోష్ ఏమో తన ప్రేమ గురించి ఇంట్లో ఎవరికి చెప్పలేని స్థితిలో వున్నాడు. విజయ ఏమో ఎలాగైనా ఈ నిశ్చితార్థం జరగరదు అని అనుకుంటుంది. రెండు రోజుల తర్వాత, విజయ కాఫీ షాప్ లో ఒక అబ్బాయి తో చాలా క్లోజ్ గా వుంది. షాపింగ్ మాల్ నుంచి షాపింగ్ పూర్తి చేసుకొని, కాఫీ తాగడం కోసం విజయ వున్న కాఫీ షాప్ లో కి విజయ తల్లిదండ్రులు కూడా వస్తారు.
అప్పుడు వాళ్ళు విజయనీ, ఆ అబ్బాయి తో క్లోజ్ గా వుండటం చూస్తారు. అది చూసి విజయ తల్లిదండ్రులిద్దరూ తట్టుకోలేక పొయారు. వాళ్ళు కాఫీ తాగకుండనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. వాళ్ళు ఇంటి దగ్గర విజయ కోసం ఎదురుచూస్తున్నారు.
ఒక గంట తర్వాత, విజయ ఇంటికి వస్తుంది.
విజయని చూసిన తన తండ్రి, “ఆఫీస్ పని పూర్తి అయిందా విజయా?” అని అడుగుతాడు.
విజయ కంగారు పడుతూ, “ఇంకా పూర్తి కాలేదు నాన్న.. ఈరోజే స్టార్ట్ అయ్యింది” అంటుంది.
విజయ తల్లి, “మీరు ఆగండి, నేను అడుగుతాను” అంటుంది.
విజయ కోపంతో, “అమ్మ.. నాన్న.. మీరు ఏమి అడగాల్సిన అవసరం లేదు. నేనే చెప్తాను నాన్న.. నేను, ఆ అబ్బాయి 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఆ విషయం మీకు చెప్పేలోపు మీరు సంతోష్ తో నా నిశ్చితార్థం అని చెప్పరు. ఇప్పుడు నేను ఆ అబ్బాయిని తప్ప ఇంక ఎవరిని పెళ్లి చేసుకోను.” అంటుంది.
విజయ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్నారు. దేవి- మురళి వాళ్ళు నిశ్చితార్థం పనిలో బిజీగా ఉన్నారు. విజయ తల్లిదండ్రులు బాగా ఆలోచించి, మురళి కి ఫోన్ చేసి ఈ నిశ్చితార్థం జరుగదు అని చెప్తారు. దేవి - మురళి చాలా షాక్ అవుతారు.
ఈ విషయం తెలుసుకున్న సంతోషం చాలా సంతోషంగా వున్నాడు. అదే సరైన సమయం అని అనుకోని,
సంతోష్, “ఇప్పుడు చూశావా అమ్మ, ఆ అమ్మాయి ఏం చేసిందో.. చాలా మంచిది అని చెప్తావు కానీ.. తను ఒక అబ్బాయిని ప్రేమించానని ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు” అంటాడు
దేవి ఎం మాట్లాడాలో తెలియక బాధ పడుతోంది. సంతోష్ దేవి దగ్గరికి వెళ్లి, 'అమ్మా, ఇప్పుడు విజయ గురించి ఆలోచించాల్సిన సమయం కాదు. మరో రెండు రోజుల్లో నా నిశ్చితార్థం అని బంధువులు అందరికి చెప్పావు. ఇప్పుడు ఆ నిశ్చితార్థం రద్దు అంటే అందరు చాల రకాలుగా మాట్లాడతారు” అంటాడు.
సుజాత, దేవి దగ్గరికి వచ్చి, “అమ్మా, విజయ కంటె మంచి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు లక్ష్మి. అన్నయ్య అంటే తనకి చాలా ఇష్టం. అన్నయ్య-లక్ష్మి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు” అని చెబుతుంది.
సంతోష్ కూడా నిజం చెప్తాడు.. “అవునమ్మా! నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. తనకి కూడా నేనంటే ఇష్టం. మా ప్రేమ విషయం లక్ష్మి పేరెంట్స్ కి తెలుసు. వాళ్ళు మీ దగ్గరికి వద్దాం అనుకునేసరికి మీరు హఠాత్తుగా విజయ వాళ్ళ ఇంటికి వెళ్ళారు”
సుజాత, మురళి దగ్గరికి వెళ్లి, 'నాన్నా.. ప్లీజ్ నాన్నా, అన్నయ్య ప్రేమని అంగీకరిచండి. మీరు అనుకున్నట్లుగానే ఇదే ముహూర్తానికి అన్నయకి లక్ష్మికి నిశ్చితార్థం చేద్దాం” అంటుంది.
సుజాత - సంతోష్, దేవి-మురళిని బ్రతిమిలాడుతున్నారు. చివరిగా దేవి-మురళి చేసేది ఏమి లేక అంగీకరిస్తారు.
నిశ్చితార్థం సమయం వచ్చింది. బంధువులు అందరు వచ్చారు. సంతోష్-లక్ష్మి ల ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. సంతోష్ కుటుంబం కూడా సంతోషంగానే వున్నారు.
అలా రెండు రోజులు గడిచాయి. ఇంకా దేవి కూడా మామూలు గానే ఉంటుంది. విజయ తల్లిదండ్రులు మాత్రం ఇంకా బాధ పడుతున్నారు.
వాళ్ళని చూసి విజయ కూడా బాధ పడుతోంది కానీ ఆ విషయం ఎవరికీ చెప్పడం లేదు.
ఇంకా తాను ఆఫీసు పని మీద ఒక కాఫీ షాప్ కి వెళుతుంది. అక్కడ ఒక అబ్బాయి తో మాట్లాడుతుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు, నిశ్చితార్థానికి ముందు విజయ తో కాఫీ షాప్ లో వున్నా అబ్బాయే ఈ అబ్బాయి. అతని పేరు నాగేష్. విజయ-నగేష్ చాలా ముఖ్యమైన చర్చలో ఉన్నారు.
సంతోష్- లక్ష్మి బైక్ పైన తిరుగుతున్నారు, అలా వాళ్ళు కూడా విజయ వున్న కాఫీ షాప్ కి వస్తారు.
విజయ ని చూసిన సంతోష్ అక్కడ నుండి వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ లక్ష్మి కావాలని సంతోష్ ని వెనక్కి వెళ్ళకుండా ఆ కాఫీ షాప్ లో తీసుకోని వెళ్ళింది.
సంతోష్ విజయ ని చూస్తు వున్నాడు కాని విజయ మాత్రం సంతోష్ ని చూసి చూడనటుగా నాగేష్ కి ప్రాజెక్ట్ గురించి చెప్తుంది.
నాగేష్ కూడా విజయ చెప్తుంది వింటూ వున్నాడు. అలా అక్కడ విజయం ఒక 25 నిమిషాలు ఉంటుంది. ప్రాజెక్ట్ గురించి చెప్పిన తర్వాత విజయ అక్కడ నుండి వెళ్లిపోతుంది.
విజయ వెళ్లిపోవడం చూసిన లక్ష్మి, సంతోష్ తో, “సంతోష్, నేను రేపు కలుస్తాను. ఇప్పుడు అత్యవసరంగా ఒక వ్యక్తిని కలవడానికి వెళుతున్నాను. ఏం అనుకోకు” అని చెప్పి వెళ్ళిపోతుంది.
సంతోష్ ప్రశాంతంగా, “సరే లక్ష్మి,. బై” అంటాడు.
సంతోష్ అక్కడ ఒక 10 నిముషాలు అలా కూర్చోని వెళ్తూ వుండగా హఠాత్తుగా నగేష్ సంతోష్ వైపు చూస్తాడు.
దాంతో సంతోష్ నగేష్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు.
సంతోష్ ని చూసిన నాగేష్ స్మైల్ చేస్తూ “అభినందనలు సంతోష్” అంటాడు.
సంతోష్ చిరునవ్వు తో, “ధన్యవాదాలు, నీకు కూడా అభినందనలు. చివరికీ మీ ప్రేమ విషయం బయట పెట్టినందుకు” అంటాడు.
నాగేష్ చిరునవ్వుతో, “ధన్యవాదాలు అవసరం లేదు. అయినా మేము యే విషయం బయట పెట్టాం?” అంటాడు.
“మీ ప్రేమ విషయం. విజయ ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది అని నేను అసలు ఊహించలేదు. ఇంకా ఆ అబ్బాయి నువ్వే అని నాకు తర్వాత తెలిసింది”
నాగేష్ చిరునవ్వు తో, 'నీకు ఎవరు చెప్పారు విజయ నన్ను ప్రేమించిందని? అయిన తాను మరొకరిని ప్రేమిస్తుంది అని నువ్వు ఏలా అనుకుంటావు?” అంటాడు.
“యేంటి?.”
“నిజమే.. నాకు ఇప్పటికే పెళ్లయింది. విజయ నన్ను ప్రేమించడం లేదు”
“మరి, ఎందుకు అలా చెప్పింది”
“సంతోష్.. నీకు తన గురించి చెప్పినా కూడా అర్థం కాదు. వెళ్లి నీ పని చూసుకో పో..” అన్నాడు నాగేష్.
సంతోష్ కి అర్థం కాదు, “అసలు నిజం ఏంటి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు”
“సరే అయితే విను. లక్ష్మి.. నీతో నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి, ఎవరో కాదు. తాను - విజయ 1 ఇయర్ బ్యాక్ నా కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు. కానీ లక్ష్మి కి విజయ నచ్చకపోవటం వల్ల, లక్ష్మి ఎలాగైనా సరే విజయని జీవితంలో దెబ్బతీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే పంతంతో విజయ ప్రేమించిన అబ్బాయి.. అంటే నిన్ను లక్ష్మి సొంతం చేసుకుంది.
సంతోష్ ఇంకా వింతగా, “అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు.. లక్ష్మి ఏంటి.. విజయ లవ్ చేసిన అబ్బాయిని సొంతం చేసుకోవడం ఏంటి?” అన్నాడు.
“నిజమే, విజయ నిన్ను 6 సంవత్సరాలు నుండి ప్రేమిస్తోంది. కానీ ఆ విషయం నీకు చెప్పలేదు. అంతే కాదు.. తాను అంటే నీకు ఇష్టం లేదు అని విజయకి తెలుసు. లక్ష్మి కావాలని.. విజయ లైఫ్ లో నువ్వుండరాదని నీ లైఫ్ లోకి ఎంటర్ అయింది”
“అయినా విజయ నన్ను ప్రేమిస్తుంది అని ఏ రోజు కూడా చెప్పలేదు. మీరు కావలని అబద్ధం చెప్తున్నారు కదా”
నాగేష్ చిరునవ్వు తో, “సంతోష్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. విజయ నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు సంతోషంగా వుండాలని తాను ఈ ఎంగేజ్‌మెంట్ రద్దు చేయమని ప్లాన్ చేసి, కావాలని తన తల్లిదండ్రుల ముందు ఒక దోషిలా నిల్చుంది.
“మీరు చెప్పింది నిజం అనుకుంటాం. కానీ విజయ అంతా సులభం గా యేది కూడా వదులుకొదు. అందరి ముందు ఒక దోషి లా వుండదు”
“నిజమే, నాకు కూడా ఇదే సందేహం వచ్చింది. అప్పుడు నేను అడిగితే, తాను చెప్పిన సమాధానం విని నేనే షాక్ అయ్యాను.”
“అసలు ఏం చెప్పింది తాను?”
“ ప్రేమ అంటే ఇద్దరు జీవితంలో కలిసి వుండటం కాదు,. ఒకరు లేకపోయినా ఇంకొకరు వారి జ్ఞాపకాల తో వుండటం. అంతే కాదు.. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడ వున్నా కూడా సంతోషంగా వుండాలి. అలా చిరునవ్వు తో చెప్పి వెళ్ళిపోయింది” చెప్పాడు నాగేష్.
సంతోష్ షాక్ అయ్యి అలానే ఉన్నాడు.
“ఇప్పుడు నీ చేతిలో ఏమి లేదు. లక్ష్మి తో హ్యాపీ గా ఉండు. నువ్వు హ్యాపీ గా వుంటే విజయ కూడా హ్యాపీ గా ఉంటుంది”
అలా చెప్పి నాగేష్ వెళ్ళిపోతాడు.
సంతోష్ విజయకి కాల్ చేసి, 'సారీ.. అలానే థాంక్స్” చెప్పి తనతో స్నేహం చేస్తాడు.
***
చందన సంజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు చందన సంజు. నేను జహీరాబాద్ అనే టౌన్ లో వుంటాను. నాకూ కథలు రాయడం అంటే చాలా ఇష్టం. సమయం వున్నప్పుడు అలా ఏదో ఒక కథ రాస్తూనే వుంటాను.
నేను కథలు రాయడానికి ముఖ్య కారణం సంజు. అతనే నా ప్రపంచం. అలానే నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కథలు కూడా రాస్తూ వుంటాను.
Commenti