top of page

మా దొడ్డ ఇల్లాలు సీతమ్మ




'Ma Dodda Illalu Seethamma' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 20/12/2023

'మా దొడ్డ ఇల్లాలు సీతమ్మ' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“సీతత్తా! నాకు స్కూలుకు టైమవుతోంది. స్కూలు డ్రస్ ఎక్కడ పెట్టావు?” కంగారు పడుతూ అడిగింది జయ. 


“అదిగో ఆ భోషాణం మీద మడతపెట్టి పెట్టాను. తీసుకో!” అంది సీతమ్మ. 


“అత్తా! నాకు క్యారేజి రెడీ చేశావా?” పెద్దగా అరుస్తోంది కల్యాణి. 


“ఇదిగో. రెడీ. !” అంటూ వాళ్లిద్దరికీ క్యారేజీలను తెచ్చిచ్చింది ఆవిడ. 


వాటినందుకుని స్కూలుకు వెళ్లారు కల్యాణి, జయలు. 


వాళ్లెళ్లాక మిగిలిన పనిని పూర్తి చేసింది సీతమ్మ. ఆవిడకి గతమంతా కనులముందు కదలాడింది. ఎనిమిదవయేటనే వెంకటాద్రితో సీతమ్మకి వివాహం చేశారు ఆమె తల్లి తండ్రులు. ఐదు రోజుల పెళ్లి. పల్లకీలో ఊరంతా ఊరేగింపుగా చాలా ఘనంగా తన పెళ్లి జరిగిందని తల్లిదండ్రులు చెప్పగా విన్నది. తనకేమాత్రం ఆ సన్నివేశాలు, వేడుకలు ఏమీ తెలీవు. ఆ పసి వయసులో ఏం గుర్తుంటాయి? తరువాత రెండు సంవత్సరాలకి తనని అత్తారింటికి కాపురానికి పంపించారు తన తల్లిదండ్రులు. 


వ్యవసాయదారుడైన వెంకటాద్రి తన కంటే పది సంవత్సరములు పెద్ద. ప్రక్క ఊరివాడే, ఐదెకరాల పొలం ఉందని సీతమ్మనిచ్చి పెళ్లిచేశారు. పెళ్లికావలసిన ముగ్గురు ఆడపడుచులు, అత్తా, మామగారు అదీ సీతమ్మ కుటుంబం. తనకి పనిపాటలు అన్నీ దగ్గరుండి నేర్పేది తన అత్తగారు వరమ్మ. చిన్నపిల్లని జాలి కూడా లేకుండా కోడలిమీదే పని మోపేది. “తన తర్వాత ఆ ఇంటిని నీవే మోయాలి. బాధ్యతలు నేర్చుకోవాలి” అని నిత్యం ఆవిడ నోట రామనామం లాగా పలికేది. 


ఆ వయసునుంచే అందరికీ అణకువగా ఉంటూ బాధ్యతగా ఇంటెడు చాకిరీ చేసేది సీతమ్మ. పెళ్లయి రెండు సంవత్సరాలైనా సీతమ్మకు పిల్లలు కలగలేదని, గొడ్రాలని నిందలు మోపి సాధించేది వరమ్మ. నిత్యం వీటిని వింటూ బాధ కలిగి తన భర్తకు చెప్పింది సీతమ్మ. అతను తన తల్లినే సమర్ధించాడు. ఆ ఇంట వరమ్మ మాటకు తిరుగులేదు. పెత్తనమంతా ఆవిడదే. 


సీతమ్మ తన బాధని, ఆమె పెట్టే ఆరళ్లను తన తల్లితండ్రులకు చెప్పుకుంది. “అత్తారింట్లో ఏ కష్టం వచ్చినా నీవు భరించాలి. కడదాకా నీ ఇల్లు అదే” అని వాళ్లు హితబోధ చేశారు. ‘ఇహ ఇదే తన జీవితం, ఈ ఇల్లే తనది’ అని తన మనసుకు సర్దిచెప్పుకుంది సీతమ్మ. 


కాలం గడుస్తోంది. వరమ్మ తన ముగ్గురు కూతర్లకు నాలుగేళ్ల వ్యవధిలో పెళ్లిళ్లు చేసి వాళ్లని అత్తారింటికి పంపింది. వాళ్ల పెళ్లిళ్లకు గాను 3 ఎకరాల పొలం కరిగిపోయింది. మరో రెండు సంవత్సరాల తర్వాత వరమ్మ భర్త పక్షవాతాన పడ్డాడు. చికిత్స కోసం మరో ఎకరం పొలం అమ్మి ఖర్చుచేసినా ఆయన శాశ్వతంగా కన్నుమూశాడు. జరిగిన దానికి అందరూ బాధపడ్డారు. కార్యక్రమాలను సక్రమంగా నెరవేర్చాడు వెంకటాద్రి. 


భర్త దూరమైన మనోవ్యాధితో మంచానపట్టింది వరమ్మ. కోడలు ఎన్ని సపర్యలు చేసినా మనోవ్యాధికి మందులేదన్నట్లుగా వరమ్మ కూడా మరోలోకానికి వెళ్లిపోయింది. భర్తని ఓదార్చి అతనికి ధైర్యం చెప్పి వరమ్మ తాలూకు కార్యక్రమాలన్నీ సీతమ్మ యధావిధిగా జరిపించింది. 


ఈలోగా సీతమ్మ తమ్ముడు వసంత్ కు సుందరితో వివాహమైంది. సీతమ్మ ఆ పెళ్లిలో సంతోషంగా గడిపింది. వసంత్, సుందరి సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఏడాది తర్వాత సుందరి గర్భవతైంది. నెలలునిండి ప్రసవం కష్టమై జయ, కల్యాణి అనే కవల పిల్లలను కని సుందరి కన్నుమూసింది. భార్య వియోగం తట్టుకోలేక ఇల్లొదిలి వెళ్లిపోయాడు వసంత్. 


వార్ధక్యంలో ఆ పసిపిల్లలను సాకలేక ఆ బాధ్యతను సీతమ్మకు అప్పగించారు ఆమె తల్లితండ్రులు. తనకు పిల్లలు లేరన్న బాధతో ఉన్న వెంకటాద్రి కూడా జయ, కల్యాణిలను ప్రేమగా చూసుకోసాగాడు. సీతమ్మ వాళ్లను కంటికి రెప్పలాగా పెంచుతోంది. పిల్లలు చక్కగా పెరుగుతున్నారు. 


వార్ధక్యాన్ని ఎవరూ అధిగమించలేరు కదా! రెండేళ్ల వ్యవధిలో సీతమ్మ తల్లితండ్రులు తనువు చాలించారు. ఆ బాధ్యతలన్నీ తన భర్త చేత సక్రమంగా నిర్వర్తింపచేసింది సీతమ్మ. 

 

ఒకనాడు పొలంలో పాముకాటుకు గురై అపస్మారక స్ధితిలోకి పోయి ఆస్పత్రికి తీసికెళ్లేదారిలోనే మరణించాడు వెంకటాద్రి. 

 

సీతమ్మకి తన కాళ్లక్రింద భూమి కదలాడినట్లైంది. తన కళ్లముందు జయ, కల్యాణిల పెంపకం బాధ్యతలు గుర్తొచ్చింది. తనకి తనే ధైర్యం చెప్పుకుని ఆ చిన్నారులని ఓదార్చింది సీతమ్మ. తన భ‌ర్త కార్యక్రమాలన్ని సక్రమంగా నిర్వర్తించింది సీతమ్మ. 


 సీతమ్మకు ఆనాటి ఆచారాల ప్రకారం తెల్లచీర, తల గుండు చేసి ఉంచారు బంధువులు. అత్త ఉండగా ఆస్తి ఖర్చయిపోగా భర్త పోయాక సీతమ్మకి మిగిలింది ఎకరం పొలం. దాన్ని కౌలుకు ఇచ్చుకుని జయ, కల్యాణిలకు ఏలోటూ లేకుండా చూసుకుంటోంది. సీతమ్మకి వాళ్లే తన బిడ్డలు, తన ప్రపంచం అనుకుంది. 


కాలం సాగిపోతోంది. జయ, కల్యాణీలు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలను పొందారు. సీతమ్మ ఆనందానికి అవధులు లేవు. మరో రెండు సంవత్సరాలకి వాళ్లు తమకు నచ్చిన వాళ్లను వివాహం చేసుకుని వాళ్ల స్వార్థం వాళ్లు చూసుకున్నారు. పాపం సీతమ్మ ఒంటరిదయింది. 


కాలాన్ని ఎవరూ ఆపలేరు కదా! వార్ధక్యంతో సీతమ్మ మంచానపడింది. విషయం తెలిసి ఏదో మొక్కుబడిగా వచ్చి ఆవిడని చూసెళ్లారు జయ, కల్యాణిలు. ఆవిడ బాధ్యత తమ మీద ఎక్కడ పడుతుందో అన్నట్లుగా ఉన్న వాళ్ల ప్రవర్తన సీతమ్మ మనసుని బాధపెట్టింది. తన పిచ్చిగానీ కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులను చూడకుండా అనాధాశ్రమాలకి పంపించే రోజులివి. ఇంక వీళ్లు తనని చూస్తారు, సాకుతారనుకోవడం వట్టిభ్రమ. మనసులో అనుకుంది సీతమ్మ. 


 సీతమ్మ పొలం చేసే రైతు యాదయ్య దంపతులు ఆవిడకి సపర్యలు చేసి అన్నంం వండి పెట్టారు. తనకి ఇంతసేవలు చేస్తున్న ఆ దంపతుల పేరున ఆ ఎకరం పొలం వ్రాసి రిజిస్టర్ చేయించింది సీతమ్మ. ఒక రాత్రి నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూసింది సీతమ్మ. ఆవిడ పోయిందని కబురందినా కడసారి చూపుకు రాలేదు జయ, కల్యాణీలు. యాదయ్యే సీతమ్మకి తల కొరివి పెట్టి తదుపరి కార్యక్రమాలను యధావిధిగా జరిపించాడు. 


“విధాత లిఖితమంటే ఇదేనేమో ! పాపం మంచి మనసున్న దొడ్డ ఇల్లాలు సీతమ్మ బ్రతికున్నంతకాలం ఏం సుఖపడింది ? తన జీవితాన్నే ఫణంగా పెట్టి జీవితమంతా జయ, కల్యాణిల కోసమే తాపత్రయపడింది. చివరకు ఆ మహాతల్లికి తనే తలకొరివి పెట్టాల్సొచ్చింది. ఆ అదృష్టం తనకి దక్కింది. ఎక్కడున్నా ఆ తల్లి ఆత్మ శాంతించాలి” అని సీతమ్మని తలుచుకుని రెండు చేతులు. జోడించి భక్తిగా నమస్కరించాడు యాదయ్య. భర్తని అనుసరించి తనూ నమస్కరించి యాదయ్య భార్య. 


.. సమాప్తం. 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏





51 views0 comments
bottom of page