top of page
Writer's pictureNeeraja Prabhala

మాలక్ష్మి రంగి


'Malakshmi Rangi' New Telugu Story

Written By Neeraja Hari Prabhala

'మాలక్ష్మి రంగి' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఉదయాన్నే లేచి తన కాలకృత్యాలను తీర్చుకుని, కట్టెలపొయ్యి వెలిగించి, కూసింత గంజికాచి తన భర్త సూర్యం చేతికిచ్చింది గంగ. తర్వాత ఒక గ్లాసులో కాస్త గంజిపోసి, రాత్రంతా మూలుగుతూ పడుకుని ఉన్న అత్త రంగమ్మను తట్టిలేవదీసి, ఆమె చేతికిచ్చింది. ఆమె దాన్నందుకుని త్రాగగా మరలా ఆమెను జాగ్రత్తగా పడుకోబెట్టి వెనుతిరగబోయింది గంగ. "ఏమే గంగా! ఈ మాయదారి రోగం నన్ను తీసికెళ్లేలా ఉంది. " అంది బాధగా రంగమ్మ. "అలాంటి మాటలొద్దు. ఏంకాదులే అత్తా! ధైర్యంగా ఉండు. మొన్న మనూళ్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపిస్తే డాక్టరు గారు అన్ని పరీక్షలు చేసి మందులిచ్చి వాడమన్నారు కదా! తగ్గిపోతుందని ధైర్యం కూడా చెప్పారు. కాసేపాగి నీకు వేడి అన్నం పెట్టి మందులిస్తాను. ఈలోగా ఎలాంటి దిగులు పెట్టుకోకుండా కళ్లు మూసుకుని పడుకో. " అన్న గంగ మాటలకు మనసు కాస్త ఊరడిల్లింది రంగమ్మకు. "సూర్యం దుకాణానికి వెళ్లాడా? ఉంటే వాడినోమారు పిలు". అన్న రంగమ్మకు " ఈఏళ ఇంకా వెళ్లలేదు. పిలుస్తాలే!" అని బైటకి వచ్చి భర్తను పిలిచి ఆవిడ వద్దకు పంపింది గంగ. సూర్యం లోపలికి వచ్చి "అమ్మా!" అని పిలవగానే గాజుకళ్లలాంటి రంగమ్మ కళ్లల్లో మెరుపు కనిపించింది. ప్రేమగా దగ్గరికి రమ్మన్నట్టు సైగచేయగానే సూర్యం ఆమె దగ్గరగా వెళ్లి చేయిపట్టుకొని "ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా?" అని అడిగాడు. "ఏం సెప్పనురా? కంటికి కునుకు లేకుండా రాత్రంతా ఒకటే దగ్గు. ఈ మాయదారి రోగం పోయేలా లేదు. " అంది నీరసంగా రంగమ్మ. "డాక్టరు ఇచ్చిన మందులు వాడుతున్నాం కదా ! నెమ్మదిగా నయమవుతుందిలే. కాసేపు పడుకో! నేను దుకాణానికి వెళ్లొస్తాను. " అని చెప్పి గదినుంచి బయటకు నడిచాడు సూర్యం. కొడుకు వెళ్లినవైపే చూస్తూ ఉన్న రంగమ్మ మనసు గత స్మృతులలోకి వెళ్లింది. భర్త యాదయ్య తనను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తను, యాదయ్య కష్టపడి కూలిపనిచేస్తూ ఉన్నంతలో హాయిగా సంతోషంగా గడిపేవాళ్లం. తన పెళ్లైన క్రొత్తలో నెలనెలా దగ్గరున్న గ్రామంలో జరిగే సంతకు తీసికెళ్లేవాడు. ఆరోజు తనకు బాగా గుర్తుంది. యాదయ్య తనను సంతకు తీసికెళ్లి "ఒసేయ్ రంగీ! నీక్కావల్సిన క్రొత్త కోక‌, రైక, పూలగాజులు తీసుకోవే" అన్నాడు. "నాకెందుకు మావా! రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మనవి. కష్టపడి సంపాదించిన కూలీడబ్బులను ఇట్టా ఖర్చెట్టుకుంటే రేపు మనకు పిల్లలు పుడితే వాళ్లపోషణెలా? వాళ్లకోసం ఏం దాస్తాం?" అన్న రంగమ్మ మాటలకు అడ్డొస్తూ "అలా అనద్దే రంగీ! నీకు నచ్చిన క్రొత్తకోక, పువ్వులు గాజులు కొనుక్కో. నీ పుట్టినరోజు వస్తోంది కదా! చక్కగా అది కట్టుకుని, గాజులేసుకుని, నుదుటిన పెద్ద బొట్టెట్టుకుంటే మాలక్ష్మి లాగా ఉంటావు" అన్నాడు యాదయ్య. "సరే! " అని తనకు నచ్చిన కోక, పూలగాజులు తీసుకుని సంబరంగా భర్తతో ఇంటికి తిరిగివచ్చింది రంగమ్మ. తన పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజున రంగమ్మ చక్కగా తలంటుకుని, క్రొత్త కోక కట్టుకుని, పూల గాజులేసుకుని భర్త వద్దకు రాగానే "మాలక్ష్మిలాగా కళకళలాడుతున్నావే రంగీ!" అని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు యాదయ్య. నవ్వుతూ భర్త కౌగిలిలో ఒదిగిపోయింది రంగమ్మ. కాలం హాయిగా గడుస్తోంది. యాదయ్య, రంగమ్మలు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. రెండు సం..తర్వాత వాళ్లకి సూర్యం పుట్టాడు. కొడుకు పుట్టిన సంబరంలో యాదయ్య తన తోటి కూలీలకు స్వీట్లను పంచి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కొడుకుకోసం మరింతగా కష్టపడి పనిచేస్తూ ఉన్నంతలో ఏలోటూ లేకుండా సూర్యాన్ని పెంచుతున్నారు రంగమ్మ దంపతులు. కొంత కాలానికి సూర్యాన్ని సర్కారు బడిలో చేర్చారు యాదయ్య వాళ్లు. మొదట్లో సూర్యం చక్కగా చదివినా ఆ తర్వాత క్రమేపీ చదువుమీద ఆసక్తి చూపలేదు. బడిలో మాస్టారి చేత కూడా అనునయంగా సలహా ఇప్పించినా సూర్యం తనకు చదువు ఎంత మాత్రం ఇష్టం లేదని తెగేసిచెప్పి ఎలాగోలా అత్తెసరు మార్కులతో పదవతరగతి పాసయ్యాడు. ఇంక చేసేది లేక యాదయ్య ఆ ఊరిలో ఒక భూస్వామికి తన కొడుకు గురించి చెప్పి వాడికేదైనా దారి చూపమన్నాడు. మంచితనంతో ఆయన డబ్బు సాయం చేసి సూర్యం చేత మాంసం దుకాణం తెరిపించాడు. సూర్యం చక్కగా మాంసం వ్యాపారం చేసుకుంటూ అంతో ఇంతో సంపాదిస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. కొంత కాలానికి తనబంధువులపిల్ల గంగతో సూర్యం పెళ్లి జరిపించారు రంగమ్మ దంపతులు. స్వతహాగా మంచి పిల్లయిన గంగ కాపురానికి వచ్చిన అతి కొద్ది రోజులలోనే ఆ ఇంట్లో అందరితో కలిసిపోయింది. గంగ, సూర్యం అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. కాలం ఎప్పటిలా సాగదు కదా! కొంతకాలానికి యాదయ్యకు హఠాత్తుగా గుండె జబ్బు వచ్చి నిద్రలోనే కన్నుమూశాడు. జరిగిన దారుణానికి రంగమ్మ గుండెలవిసేలా ఏడ్చింది. సూర్యం, గంగ ఆబాధను మనసులోనే దిగమింగుకుని ఆమెను ఓదార్చి జరగవలసిన కార్యక్రమాలను యధావిధిగా జరిపించారు. సూర్యం, గంగల ప్రేమాప్యాయతలతో నెమ్మదిగా రంగమ్మ మామూలు మనిషయింది. రోజులు సాఫీగా సాగుతున్నాయి. నెలక్రితం రంగమ్మకు గుండె జబ్బు రాగా ఆఊరిలోని గవర్నమెంట్ ఆస్పత్రికి ఆమెని తీసుకెళ్లి దగ్గరుండి అన్నిపరీక్షలు చేయించి మందులు వాడుతున్నారు. ఏదో అలికడైతే తృళ్లిపడి గతం నుంచి తేరుకుని చూసింది రంగమ్మ. ఎదురుగా చేతిలో భోజనం పళ్లెంతో గంగ లోపలికి వస్తోంది. రంగమ్మను లేపి ఆమెకు భోజనం పెట్టి మందులిచ్చి పడుకోబెట్టింది గంగ. తను కూడా భోజనంచేసి వంటగదిని సర్దుతుండగా రంగమ్మ మూలుగు పెద్దగా వినిపిస్తోంది. చేతిలో పనిని వదిలేసి హడావుడిగా వెళ్లి ఆవిడను చూడగా ఆయాసపడుతూ కన్పించిన రంగమ్మకు దగ్గరున్న మందులిచ్చినా ఆవిడకు తగ్గలేదు. ఇంక వెంటనే ప్రక్కింటి అబ్బాయి చేత ఆ ఊరి డాక్టరుకు, సూర్యానికి కబురుచేసింది. విషయం తెలిసిన డాక్టరు పరుగున వచ్చి వైద్యం చేస్తున్నాడు. కబురందిన సూర్యం హతాశుడయ్యి ఇంటికి పరుగున వెళ్లి తల్లిని చూసి ఆమెకు సరైన వైద్యం చేయించాలని కంగారుపడుతుండగా ఆ ఊరికే చెందిన పొట్టెయ్య దారినపోతూ సూర్యాన్ని పలకరించాడు. "పొద్దుకాడ నుండి సూత్తన్నా ఒక్క బేరమైనా రాలేదురా పొట్టెయ్యా! ఇంటికాడ ఎదురుసూత్తన్న ఆ గండం తల్సుకుంటే బైమైతాంది. ఎట్టా గట్టెక్కాల్నో తెలవటం నేదు.. !" అని జరిగిందంతా పూసగుచ్చినట్టు అతనితో చెప్పి బావురుమన్నాడు సూర్యం. అంతావిన్న పొట్టెయ్య సూర్యాన్ని ఓదార్చి అతనికి ధైర్యం చెప్పి "నేను సాయంత్రం వరకూ షాపువద్దే ఉండి బేరాలు చూస్తాను. వెంటనే నీవు ఇంటికి వెళ్లి అమ్మను తీసుకుని ఆసుపత్రికి తీసికెళ్లి వైద్యం చేయించు" అని తన జేబులోంచి కొంత డబ్బుని తీసి అతనికిచ్చి సూర్యాన్ని ఇంటికి పంపాడు పొట్టెయ్య. సూర్యం హడావుడిగా ఇంటికి రాగానే డాక్టరు లోపలినుంచి వస్తూ కనిపించాడు. "సకాలంలో మీ అమ్మకు వైద్యం చేసి మందులిచ్చాను. ఇప్పుడామె బావుంది. కాసేపు విశ్రాంతిగా పడుకోనీ. " అన్న ఆయనకు తన జేబులోంచి కొంత డబ్బిచ్చి పంపాడు. "హమ్మయ్య! గండం గడిచింది" అని అనుకొని నెమ్మదిగా తల్లి గదిలోకి వెళ్లి ప్రశాంతంగా పడుకుని నిద్ర పోతున్న తల్లిని చూసి బయటకు వచ్చి మనసులోనే ఆ భగవంతుడికి నమస్కరించాడు సూర్యం. .. సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


51 views0 comments

コメント


bottom of page