top of page

మా అమ్మ నేర్పింది'Maa Amma Nerpindi' New Telugu Story


Written By Ch. C. S. Sarma


మా అమ్మ నేర్పింది తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

‘అమ్మ.. నాన్నా.. దేవుడు.. ’ పదాలు మనకు నేర్పేది మన మాతృమూర్తి. మన అభివృద్ధి.. ఉన్నతి.. ఆ తల్లి పలికే ప్రతి మాట అంతరార్ధం. ఆ తల్లి తన జీవితాంతం మన మేలు కోరుకొంటుంది. తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించడం మానవత్వం.


“శివా.. ” ధర్మా పిలుపు విని వెనక్కు తిరిగి చూచాడు శివ. వారివురి పూర్తి పేరులు శివకుమార్, ధర్మారావు. ఇరువురు బంధువులు. వీరు చిన్నతనం నుండి ఒకే ప్రైమరీ, హైస్కూల్లో చదువుకున్నారు. ప్రస్తుతం వారు ప్లస్ టూ, సెకండ్ ఇయర్లలో వున్నారు. వీరిరువురికీ ఇంటా బయటా మరో పేరు వుంది కృష్ణా ర్జునులని. శివ క్రీడాభిమాని, ధర్మా సాహిత్యాభి మాని. కాబట్టి స్కూల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు వుంది.


“ఈ వారం సారస్వత సంఘ ఉపన్యాసానికి టాపిక్ (విషయం) ఏమిటో తెలుసా శివా”.. అడిగాడు ధర్మ.


“తెలుసు.. ” ప్రతాప్ చెప్పాడు. “ఈ దేశం కోరే భావి భారత పౌరులు”.


విరక్తిగా నవ్వాడు శివ.


“ఎందుకురా.. అంత విరక్తిగా నవ్వుతావ్!.. ” ఆశ్చర్యంగా శివ ముఖంలోకి చూస్తూ అడిగాడు ధర్మ.

“పరీక్షలు పదిరోజుల్లో వున్నాయ్. బాగా చదివి గట్టు దాటాలి. మన అమ్మా నాన్నలు మనమీద ఎన్నో ఆసలు పెట్టుకొని వున్నారు. బాగా వ్రాసి పాసై వారిని సంతోషపెట్టాలి. మన భవిష్యత్ ఎలావుందో!.. ” సీరియస్ గా చెప్పాడు శివా.


“డోంట్ వర్రీ డియర్.. నీకు తోడుగా నీ ఈ ధర్మా ఉన్నాడుగా.. ” చిరునవ్వుతో అనునయంగా చెప్పాడు ధర్మా.


శివా చేతిని తన చేతిలోనికి తీసుకొని “శివా.. నీవూ మాట్లాడి తీరాలి.. ”

శివా ధర్మా ముఖంలోకి చూచి తల ఆడించాడు. ఇరువురూ మౌనంగా క్లాస్ రూమ్ లోకి ప్రవేశించారు.

*****

ఆ మరుదినం సాయంత్రం గంట నాలుగున్నర సమయం. స్కూలు మధ్యన వున్న స్టేజి పై హెడ్మాస్టర్ వరదరాజులు గారు, తెలుగు పండిట్ విద్వాన్ నారాయణ గారు, ఇంగ్లీష్, సైన్సు మాస్టర్ సీతాపతి గారు సుఖాసీనులై వున్నారు. స్కూలు పిల్లలంతా వేదిక ముందు శ్రద్దగా కూర్చొని వున్నారు.


పేర్లు ఇచ్చిన విద్యార్ధులు ఒకొక్కరుగా వచ్చి మాట్లాడి వెళుతున్నారు. సైన్సు మాస్టార్ ధర్మ పేరును మైక్ లో చెప్పారు. ధర్మ స్టేజి పైకి వచ్చాడు.


“పూజ్యులు, గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారికి, తెలుగు మాస్టారు గారికి, సైన్సు మాస్టారు గారికి సవినయంగా నా వంద నాలు సమర్పిస్తున్నాను. ” వినయంగా చేతులు జోడించాడు. విద్యార్ధుల వైపుకు తిరిగి “మీకందరకీ నా శుభాశీస్సులు. ఈనాటి చర్చనీయాంశం ‘ఈ దేశం కోరే భావి భారత పౌరులు’.


పదమూడు అక్షరాల కలయిక ఈ పదం. చాలా భారమైనది. మన గురుత్రయం ఈ సంవత్సరంలో జరిగే.. జరుగుతున్న ఈ చివరి సమావేశానికి ఈ టాపిక్ ను ఎందుకు ఎంపిక చేసారు.. అన్న ప్రశ్నకు మన అందరి అభిప్రాయం ఒకటిగా ఉందా?.. శేష ప్రశ్న. నెల రోజుల్లో పరీక్షలు ముగుస్తాయి. ఇంతకాలం కలిసివున్న మనమంతా విడి పోతాం. కానీ.. ఈనాడు జరుగుతున్న ఈ చివరి సారస్వత సంఘ సమావేశాన్ని మనం ఎన్నటికీ మరిచిపోలేము.


నాకంటే ముందుగా మాట్లాడిన అన్నపూర్ణ, .. శకుంతల.. ప్రతాప్.. బషీర్.. రమణ.. అజీజ్.. శివ.. చాలా బాగా మాట్లాడారు.


తల్లిదండ్రి, గురువుల మాటలను అర్ధం చేసుకొని ఆదరించి అందులోని సత్యాన్ని గ్రహించి మనమందరం.. అంటే భావి భారత పౌరులం నిర్దిష్టమైన అభిప్రాయాలను ఎన్నుకొని ఆచరించవలసి వుంది. ఏమిటా నిర్దిష్టమైన అభిప్రాయాలు.. ఆ ఎనిమిది వివరిస్తాను.


మొదటిది : మీ సాటి ప్రతి వ్యక్తిని మీతో సమానంగా చూచుకోవాలి.

రెండవది: పెద్దలను, గురువులను గౌరవించాలి. పిన్నలను, పీడిత జనాన్ని ఆదరించాలి. కట్నాల వ్యవస్థను ఖండించాలి.


మూడవది: కులం, మతం ప్రస్తుత సమాజంలో అప్రస్తుత అంశంగా భావించాలి.


నాల్గవది: న్యాయబద్ధమైన ఆర్జన కలిగిన దానితో సంతృప్తి పడటం.. శాంతి.. సహనం పాటించడం.


ఐదవది: స్వార్ధాన్ని చంపాలి.. పరమార్ధాన్ని పెంచాలి.

ఆరవది: ఉన్నంతలో దానం, .. సాటి మానవాళికి ప్రేమా భిమానం.. సౌభ్రాతత్వం పంచడం.


ఏడవది: దేశ రక్షణగా.. సంఘ సంక్షేమం.. పోలీస్ వ్యవస్థతో స్నేహ సంభంధం కలిగివుండాలి.


ఎనిమిదవది: రాత్రి పడుకొన్న తర్వాత దినచర్యను ఒక్కసారి సింహావలోకనం చేసుకోవడం.


ఈ ఎనిమిది సుఖ జీవనానికి అష్టదిక్కులు. సంఘంలో సమాజంలో.. పేరు ప్రతిష్టలకు సోపానాలు. ఈ ఎనిమిది తత్వాలను ఆచరించి జీవితాన్ని ముందుకు సాగించినవారు అందరికి ఆదర్శ మూర్తులు, మార్గదర్శకులూ అవుతారు. “ ఎంతో ఆవేశంగా మాట్లాడుతున్న ధర్మ చెప్పడం ఆపి తలను క్రిందికి దించుకొని నిట్టూర్చాడు.

ఆ అవరణం అంతా నిశ్శబ్దం.. అందరి చెవుల్లో ధర్మా చెప్పిన మాటలు మారుమ్రోగుతున్నై. అలా కొద్ది క్షణాలు జరిగి పోయాయి.


ముగ్గురు గురువులు ఒకరి ముఖాలను ఒకరు చూచు కొన్నారు. వారి వదనాల్లో దరహాసం.. చేతులు జోడించి చప్పట్లు చరిచారు. క్రిందవున్న పిల్లలందరూ వారితో వంత పాడారు.


తొట్రుపాటుతో ధర్మా తల ఎత్తి గురువులను.. పిల్లలను చూశాడు.


“ప్రొసీడ్ మై బోయ్.. ప్రొసీడ్.. ” నవ్వుతూ పలికాడు హేడ్మాస్టార్. ధర్మా చేతులు జోడించి అందరికీ నమస్కారం చేశాడు నవ్వుతూ.


“సోదరీమణులారా!.. ఇప్పుడు నేను ఆ అష్ట విధానాలను గురించి కాస్త వివరంగా మాట్లాడుతాను.


మొదటిది: నీ సాటి ప్రతి వ్యక్తిని నీతో సమానంగా చూచు కోవాలి. మనమంతా పంచభూత వలయంలో ఉన్నాము. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం, ఇవి పంచభూతాలు.. కాదు కాదు.. ఆ సర్వేశ్వర నిర్దేశితమైన జగత్ మాతృకలు. ఇవి లేనిదే మనం లేము. ఉండము. మనమే కాదు.. ఏ ప్రాణి వుండదు.

అయితే.. నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం.. వీటిది ఏ

కులం.. ఏ మతం?.. హైందవ గీతాల్లో గాని.. మహమ్మదీయ ఖురాన్ లో గాని.. క్రైస్తవ బైబిల్లో కానీ.. ఇవి ఫలానా కుల మతాలకు చెందినవని వ్రాసి ఉందా? ఈ ఐదింటి ఆధారం లేనిదే ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవించ లేదు. మనం సుఖంగా జీవించే దానికి ఆ సృష్టికర్త సర్వేశ్వర నిర్మాణాత్మకమైన ఈ అనంత శక్తులకు లేని కులమత భేదాభిప్రాయాలు మనకు అవసరమా?.. వాదోపవాదాలు ప్రస్తు తమా ?.. కూడదు.. తగదు..


కనుక మనమందరం ఒక్కటే.. మనది మానవజాతి..

మంచిని తలచి.. మంచిని పంచేదే మన అందరి కులం. సాటి మనిషిని మనిషిగా ఎంచి వానితో స్నేహ సౌభ్రాతత్వాలతో సహజీవనం చేయడమే మన మతం.

రెండవది: పెద్దలను, గురువులను గౌరవించాలి. పిన్నలను

పీడిత జనాన్ని ఆదరించాలి. కట్నాల వ్యవస్థను ఖండించాలి.


తల్లి, తండ్రి గురువు దైవం.. ఇది మన హైందవ వేద వ్యాక్యం.


అంటే.. తల్లి తండ్రి గురువు.. ఈ ముగ్గురు దైవ సమానం. తల్లి మనకు జన్మనిచ్చింది. తల్లిదండ్రి కలసి మనలను పెంచి పెద్ద చేస్తారు. మనం కోరినవి వారికి ఉన్నంతలో కొనిస్తారు. మన కోర్కెలను తీరుస్తారు. ఇక.. గురువులు మనకు జ్ఞానాన్ని, ధర్మాన్ని బోధిస్తారు. మనలను విద్యావంతులుగా, పదవీ యోగ్యులుగా చేస్తారు. వీరు మన నుంచి ఆశించేది.. మనం సంఘంలో గౌరవ ప్రతిష్టలతో బ్రతకాలని.. వారికంటే గొప్పవారిగా కావాలని.. మన జీవతాంతం వారిని అభి మానించడం.. గౌరవించడం మన ధర్మం.


మనకంటే చిన్నవారు మనల్ని చూసి అన్ని నేర్చు కుంటారు. మనం మంచి దారిన నడిస్తే వారు ఆ మంచి దారినే నడుస్తారు. అంటే మనం పిల్లలకు ఆదర్శప్రాయులం కావలి. సమా జాన్ని పీడించే కట్నవ్యవస్థను మనం వ్యతిరేకించాలి.. ఎదిరించాలి. తిరస్కరించాలి. ఈ దేశంలో మనం ఇరుగు పోరుగున సరైన కూటికి, గుడ్డకు నోచుకోని అభాగ్యులు కొంత మంది ఈ రోజుకూ ఉన్నారు. మన ఆడంబరాలను తగ్గించు కొని వారి సరైన జీవనానికి మనం చేయదగిన సహాయం చేయడం మన కర్తవ్యం.


మూడవది: కులం.. మతం.. ప్రస్తుతం సమాజంలో అప్రస్తుత అంశంగా భావించాలి. మన పూర్వీకుల్లో లేని ఐకమత్యం.. అంతులేని స్వార్ధం.. కారణం ముస్లిములు.. తెల్లదొరలు దేశంలో ప్రవేశించారు. వారి శక్తిసామార్ధ్యాలతో మనవారిని వారు బానిసలుగా చేసుకొన్నారు. అంతః కలహాలు సృష్టించారు. రాజ్యాలు గెలుచు కొన్నారు. రాజులు.. నాయకులు.. పాలకులుగా మారిపోయారు. వందల సంవత్సరాలు పరిపాలనలో మనవారు ఉండిపోయారు.


దేశపిత గాంధీజీ, వారి అనుచరులు సాగించిన పోరాటంతో 1947 ఆగస్టు 15 అర్దరాత్రి సమయంలో మనకు స్వాతంత్రం సిద్ధించింది. మూడు ముక్కలుగా చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనదీ అని పిలుచుకొనే మన భారతదేశంలో ఉన్న వారంతా మన వారే. మన భారతీయులు. కులమతాలకు అతీతమైన భారత్ ఇది. ఈ సత్యాన్నిమనమంతా నమ్మాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిం చాలి. ఈనాటి మన ఈ యువతే రేపటి భారత రాజ్యాంగ నిర్దే శకులు. సమతను పెంచి ఐక్యతను సాధించాలి. ఇదే మన అందరి ఆశయం కావాలి.


నాల్గవది: న్యాయబద్ధమైన ఆర్జన.. కలిగిన దానితో సంతృప్తి పడటం.. శాంతి సహనాలను పాటించటం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం. పాపపుణ్యాలను తలచేవాళ్ళం. ప్రజానీకాన్ని పీడిస్తున్న లంచాల వ్యవస్థను మనం నిర్మూలించాలి. మనం రేపు ఉద్యోగస్తుల మైనప్పుడు ఈ స్ఫూర్తిని మనసులో నికోవాలి. మన ఆదాయానికి తగినట్లుగా మన జీవన శైలిని మలచుకోవాలి. అక్రమ సంపాదన విష తుల్యంగా భావించాలి. ఎపుడు మనం క్రింది సమాజాన్ని.. జనాన్ని చూడాలి. పై అంతస్తులోని వారిని చూస్తే మనలో శాంతి నశిస్తుంది. సహనం మాయమవుతుంది. తప్పులు చేయవలసి వస్తుంది. ఒక్కసారి తప్పు చేస్తే.. మనలోని శాంతి, సహనం సమా ధిగా మారిపోతాయి. మనం భావి భారత పౌరులం. మన ఆశయాలు ఆచరణలు మనకు అందరికి ఆనందాన్ని పంచేలా ఉండాలి. మనం దోషులం కాకూడదు. ఆదర్శవంతులుగా నిలవాలి.


ఐదవది: స్వార్ధాన్ని చంపాలి.. పరమార్ధాన్ని పెంచాలి. సృష్టిలో పుట్టిన ప్రతి వ్యక్తి.. జీవి ఒకనాడు గిట్టవలసిందే.. అందుకే అన్నారు పెద్దలు.. ‘పుట్టుట గిట్టుట కొరకె’. మనం వచ్చేటపుడు ఏమి తేలేదు. పొబోయేటపుడు తీసుకొని పోయేదంటేమి ఉండదు. బ్రతికి నన్నాళ్ళు స్వార్ధంతో పరుగెత్తి సంపాదిస్తాం. ఆ స్వార్ధం హద్దుల్లో వుండాలి. మన సామర్ధ్యంతో.. మన శ్రమతో మన ఆర్జన జరగాలి. అలాంటి ఆర్జన మనకు, మన పరివారానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మన అడుగు జాడల్లోనే మన వారసులు నడుస్తారు. అంతులేని స్వార్ధంతో ఎదుటి వారిని పీడించి కోట్లు గడిస్తే శరీరానికి మాయ రోగాలు సోకుతాయి. ఎంత సొమ్ము డాక్టర్లకు ఇస్తారో వారికె లెఖ తెలియదు. కడుపునిండా కావాల్సినిది తినలేరు. అలాంటివారి వారసులూ ఇదే మార్గంలో నడుస్తారు. ‘పాపి సొమ్ము పరుల పాలు’ అనే నానుడి వారి జీవితాలకు ప్రత్యక్ష సాక్ష్యం.


ఆరవది: ఉన్నంతలో దానం.. సాటి మానవాళికి ప్రేమాభిమానం.. సౌభ్రాతత్వాలను పంచడం.

ఉన్నంతలో పదిమందికీ దానం చేయాలి. గ్రహీత చేయి క్రింద, దాత చేయి పైన ఉన్నపుడు.. గ్రహీత కళ్ళల్లోని భావాలను చూడాలి. ఆ కళ్ళు దాతను ఆశీర్వదిస్తూ ఉంటాయి. గ్రహీత ఆశీస్సులు దాతకు, వారి సంతతికి శ్రీరామ రక్ష. మన సాటి సమాజ సభ్యుల పట్ల మనం ప్రేమాభిమానాలు.. ఆదర.. సౌభ్రాత్రాలను కలిగి ఉండాలి. వ్యతిరేక భావం కలవారు కూడా మన ఈతత్వాని చూచి మారాలి. సభ్య సమా జం వృద్ది చెందాలి. వెలుగు.. ఒక దీపం నుంచి మరో దివ్వేకు వ్యాపించ గలదు కదా!.. ఈ సాధన మన కర్తవ్యం.


ఏడవది: దేశ రక్షణ.. సంఘ సంక్షేమం.. పోలీస్ వ్యవస్తతతో స్నేహ సంభంధాలు కలిగి వుండాలి.

‘జననీ జన్మభూమి’ మన భారత దేశం మనలను కన్న తల్లితో సమానం. మనం మన తల్లిని ఎంతగా గౌరవించి అభిమానిస్తామో.. అదే భావన మన దేశం పట్ల మనకు ఉండాలి. దేశ రక్షణ కోసం సరి హద్దుల్లో ఉన్న వీరజవాన్ల పట్ల.. గౌరవ మర్యాదలను కలిగి ఉండాలి. అదే రీతిగా నగర.. పట్టణ రక్షక పోలీస్ సిబ్బందితో స్నేహభావం కలిగి, వారు సూచించే రహదారి నియ మాలను పాటించాలి. వారి ఆదేశాలను ఆదరించాలి. ఏ విషయాన్ని గురించైనా వారు మనలను అడిగితే.. మనకు తెలిసిన నిజాన్ని వారికి తెలియజేయడం ఈ దేశ పౌరులుగా మన ధర్మం. వృత్తి ధర్మాన్ని కచ్చితంగా పాటించే మహానీయులు ఎందోరో ఉన్నారు ఆ వ్యవస్థలో. వారిని సంఘ శ్రేయోభిలాషులుగా గౌరవించాలి.


ఎనిమిదవది: రాత్రి పడుకొన్న తర్వాత దినచర్యను ఒకసారి సింహావలోకనం చేసుకోవడం. రాత్రి శయనించిన తర్వాత దిన చర్యను, తప్పు ఒప్పులను గురించి ఒకసారి యోచించి తప్పు జరిగి ఉంటే అది మరల మనవలన జరగకుండా చూసుకునేటందుకు సముచిత నిర్ణయం తీసుకొని ఆ సర్వేశ్వరుని ధ్యానించి నిద్రించాలి. రాత్రి శయన సమయంలో సర్వేశ్వరుని నామ జపం.. ఉదయం లేచే టపుడు శ్రీహరి విష్ణుమూర్తి నామజపం.. మిక్కిలి ఆనంద దాయకం. ఇవన్నీ నాకు మా అమ్మ నేర్పింది. నేను పాటిస్తున్నాను. మిమ్మల్ని పాటించాల్సిందిగా కోరుచున్నాను. తప్పులను మన్నించండి. ఒప్పు లను ఆదరించండి.. ఆచరించండి..

నాకు ఈ అవకాశం కల్పించిన మీకందరకీ నా కృతజ్ఞతలు. నమస్తే!.. భావి భారత పౌరులు ఆదర్శ వంతులై వర్ధిల్లాలి.. జైహింద్”అంటూ ధర్మ సెల్యూట్ చేశాడు. విద్యార్ధుల, అధ్యాపకుల కరతాళధ్వనులతో ఆ భవంతి మారుమ్రోగింది. అందరూ ఏక కంఠంతో పలికారు.. “జైహింద్.. జైహింద్.. ”.


//సమాప్తి//

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.

79 views0 comments
bottom of page